అధికారపక్షాన్ని ఎదుర్కొనేదెలా?
అసెంబ్లీలో వ్యూహంపై టీటీడీపీలో అంతర్మథనం
కరెంటు సమస్య, రైతుల ఆత్మహత్యలే పార్టీ ఎజెండా
సాక్షి, హైదరాబాద్: కీలకమైన బడ్జెట్ సమావేశాల ను ఎదుర్కొనే అంశంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం మొదలైంది. 119 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో టీడీపీ ప్రస్తుత బలం 12 మంది మాత్రమే. గెలిచిన 15 మందిలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోగా, మిగిలిన వారిలో కూడా మరికొందరు అదే బాట పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సభలో అధికార పార్టీని ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే విషయంలో పార్టీ ఎమ్మెల్యేల్లో స్పష్టత లే దు. రైతుల ఆత్మహత్యలు, కరెంటు సమస్య, మెట్రో రైలు వివాదం వంటి వాటిని అసెంబ్లీ వేదికగా ఎత్తిచూపాలని పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో సోమవారం రాత్రి జరిగిన టీడీఎల్‌పీ సమావేశంలో తీర్మానించారు. అయితే అధికార టీఆర్‌ఎస్ ఇప్పటికే ఎదురుదాడి ప్రారంభించింది. తెలంగాణలో నెలకొన్న కరెంటు సమస్యకు, రైతుల ఆత్మహత్యలకు తెలుగుదేశం పార్టీనే కారణమని, చంద్రబాబు వల్లే రాష్ట్రానికి కరెంట్ రాక రైతులు నష్టపోతున్నారని గణాంకాలతో చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగానే తెలంగాణకు విద్యుత్ ఇవ్వకుండా అడ్డుకుంటోందన్న విషయాన్ని ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం అడ్డుపడుతోందని గ్రామగ్రామాన ప్రచారం చేస్తోంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనూ అధికారపక్షం ఇదే వాదనను బలంగా వినిపించనుంది. ఈ నేపథ్యంలో పార్టీకున్న కొద్దిపాటి ఎమ్మెల్యేలతో అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ఎలాగో తెలుగుదేశం ఎమ్మెల్యేలకు అంతుపట్టడం లేదు.
గొంతు విప్పేదెవరు?
టీడీపీకి ఉన్న 12 మంది ఎమ్మెల్యేల్లో అసెంబ్లీలో పార్టీ తరఫున సమర్థంగా గొంతు వినిపించే నేతలు ఎవరనేది కూడా చర్చనీయాంశమైంది. టీడీఎల్‌పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉప నాయకుడు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జి. సాయన్న, ప్రకాశ్ గౌడ్ మాత్రమే సీనియర్లు. వీరిలో ముగ్గురు మాత్రమే అసెంబ్లీలో గొంతు విప్పే నేతలు. హైదరాబాద్ సమస్యలపై ఉన్న అవగాహనతో సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ గతంలో వాదన వినిపించేవారు. కానీ ఆయన ఇప్పుడు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మిగతా వారంతా కొత్తగా ఎన్నికైనవారే. ఇక టీటీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్. కృష్ణయ్య కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థినైన తనకు గెలిచిన తర్వాత టీడీఎల్‌పీ లీడర్‌గా అవకాశం కల్పించకపోవడంతో ఆయన కినుక వహించారు. ఎప్పుడైనా చంద్రబాబుతో జరిగే సమావేశాలకు తప్ప.. ఇతర కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. టీడీపీ ఎమ్మెల్యే అనిపించుకోవడం కన్నా తనకు గుర్తింపు తెచ్చిన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉండేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకు కృష్ణయ్య హాజరవుతారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఉద్యమ నాయకుడిగా ఆయనకు రాష్ట్రంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో సభకు దూరంగానే ఉండొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.