నేనప్పుడే చెప్పా..!
తెలంగాణలో విద్యుత్తు కోతలపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్య
కొరతకు కారణం టీఆర్‌ఎస్ సర్కారు వైఫల్యమే
ఛత్తీస్‌గఢ్ నుంచి కొంటామన్నారుగా.. మరి ఏమైంది?
కేసీఆర్ మాటలతో ప్రజలను మభ్యపెట్టారు
మేం ముందుచూపుతో వ్యవహరించాం
కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం..అందుకే ఏపీలో కోతల్లేవు
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ కొరతకు కారణం ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విద్యుత్ అవసరాలను గుర్తించడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొంటామని చెప్పిన నేతలు ఇప్పుడా పని ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. తెలంగాణలో విద్యుత్ కోతలకు చంద్రబాబే కారణమని టీఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణలో విద్యుత్ సమస్య ఏర్పడుతుందని తాను ఇది వరకే చెప్పానని గుర్తు చేశారు. వినియోగం ఎక్కువ, ఉత్పత్తి తక్కువ కాబట్టే విద్యుత్ లోటు ఉందన్నారు. వాస్తవాలను వక్రీకరించి తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, నిజాలేమిటో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఏపీలో లక్ష్యాలు సాధిస్తే తెలంగాణకే మిగులు విద్యుత్ ఇవ్వాలన్నది తన అభిమతమని స్పష్టం చేశారు. పీపీఏలను విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించినంతవరకే విద్యుత్‌లో రెండు రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉంటుందన్నారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ పీపీఏలను ఈఆర్‌సీ ఆమోదించలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
3 నెలల్లోనే లోటు అధిగమించాం..
రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్‌కు ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని చంద్రబాబు చెప్పారు. విద్యుత్ సంస్కరణలకు తానే ఆద్యుడినని పునరుద్ఘాటించారు. తాను అధికారంలోకి వచ్చినప్పుడు 22 మిలియన్ యూనిట్ల లోటు ఉందని చెప్పారు. నిరంతర పర్యవేక్షణతో దీన్ని మూడు నెలల్లోనే అధిగమించామని తెలిపారు. ఇప్పటి వరకూ 570 మెగావాట్ల విద్యుత్‌ను తాము కేవలం యూనిట్ రూ.5.50కే కొనుగోలు చేశామని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూ. 9 వరకూ చెల్లించిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు ఇబ్బంది లేకుండా 400 మిలియన్ యూనిట్లను ఎక్స్ఛేంజీల ద్వారా కొనుగోలు చేశామని, ఇవన్నీ కలిపితే తక్కువ సమయంలోనే 700 మెగావాట్ల విద్యుత్‌ను కొన్నట్లు తెలిపారు. జజ్జర్ ప్లాంట్ నుంచి 200 ఎంయూ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. అలాగే, కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వాణిజ్య అవసరాలు తీర్చేందుకు కేంద్రం అక్టోబర్ నుంచి 50 మెగావాట్లు అందిస్తోందన్నారు. 2016 నాటికి రాష్ట్రంలో 2000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాలు జరిగాయన్నారు. విద్యుత్ కోసం తాను కేంద్రంపై ఒత్తిడి తేవడం వల్ల ఏపీలో మెరుగుపడిందని తెలిపారు.
జల విద్యుత్ కేంద్రాలపై నిర్లక్ష్యం...
తెలంగాణలో విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతున్నా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటిదాకా కేవలం 570 ఎంయూ కూడా పొందలేకపోవడం తెలంగాణ సర్కారు వైఫల్యంగా అభివర్ణించారు. జజ్జర్ నుంచి ఏపీ సర్కారు 200 ఎంయూ విద్యుత్తు తెచ్చుకుంటే తెలంగాణలో 100 ఎంయూలే తెచ్చుకోగలిగారని తెలిపారు. పవర్ ప్రాజెక్టులన్నీ నీళ్లలో మునిగిపోయినా తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళికలు లేవని ధ్వజమెత్తారు. థర్మల్ విద్యుత్ విషయంలోనూ ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రాజెక్టుల వాటా మొత్తం తెలంగాణ ప్రభుత్వమే వాడుకుంటోందన్నారు. ఇన్ని తప్పిదాలు చేసి తనను విమర్శించడం సరికాదని తెలంగాణ సర్కారుకు హితవు పలికారు.
పార్టీ కోసం లోకేష్ పనిచేస్తే తప్పేంటి?: చంద్రబాబు
తెలుగుదేశంపార్టీ కోసం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తన కుమారుడు లోకేష్ పనిచేస్తే తప్పేముందని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ప్రస్తుతం విమర్శలు చేస్తున్న వారు గతంలో తన వద్ద మంత్రులుగా పనిచేశారని, ఎన్‌టీఆర్ వద్ద కూడా పనిచేశారని గుర్తు చేశారు. గురువారం రాత్రి తన నివాసంలో సీఎం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంత పార్టీ నాయకత్వాన్ని లోకేష్ అప్పగించాలని చంద్రబాబు చూస్తున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విమర్శించిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా చంద్రబాబు స్పందించారు. లోకేష్ పనిచేస్తే తప్పేంటి? రెండు ప్రాంతాల్లో ఉన్న పార్టీ కార్యకర్తల కోసం లోకేష్ పనిచేస్తున్నారు, వారి పార్టీలో వారు పని చేయటం లేదా? అని ప్రశ్నించారు. లోకేష్‌ను సాకుగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.తాను ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల ఆ ప్రజల సమస్యలు, క ష్టాలు తీర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదే సమయంలో తెలంగాణలో టీడీపీ ప్రతిపక్షంగా ఉంది కాబట్టి స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడాల్సి ఉందన్నారు. ఆ పనిని స్థానిక పార్టీ నేతలు చేస్తారని, అవసరమైతే తాను భాగస్వామిని అవుతానని తెలిపారు. కాగా, ఏపీ రాజధాని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉంటుందని చంద్రబాబు చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు.