- రూ. 1,200 కోట్లు పన్నుకింద లాక్కోవడంపై కన్నెర్ర
- తప్పు ఎక్కడ జరిగిందో తేల్చే ప్రక్రియలో సీఎస్
- ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్‌తో చర్చలు.. సరిగా స్పందించలేదని ఆగ్రహం
- టీఎస్‌బీసీఎల్ రద్దుకు యోచన?
సాక్షి, హైదరాబాద్: మద్యం వ్యాపారం నుంచి ఆదాయపన్ను బకాయి వసూలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ అకౌంట్ నుంచి ఏకంగా రూ. 1,274.21 కోట్లను ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ లాక్కోవడంపై రాష్ట్ర సర్కారు కన్నెర్ర చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ అసంతృప్తిని రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇంత పెద్ద మొత్తాన్ని కనీస సమాచారం ఇవ్వకుండా ఐటీ శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే అటాచ్ చేసుకోవడానికి గల కారణాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మద్యం వ్యాపారానికి ఏపీబీసీఎల్‌దే బాధ్యత అని, రాష్ట్రంలో కొత్తగా తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ జూన్ 2, 2014 నుంచే ఏర్పాటైందని న్యాయ స్థానాన్ని ఒప్పించినా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని సర్కార్ సీరియస్‌గా పరిగణిస్తోంది. రూ. 1,274.21 కోట్ల అటాచ్‌మెంట్... వీటన్నింటికి గల కారణాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాఖా పరమైన విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఐటీ శాఖ అటాచ్‌మెంట్ నోటీసులు జారీ చేసినట్లు చెపుతున్నా.. అవి ప్రభుత్వానికి చేరకపోవడానికి గల కారణాలను ఆరా తీస్తోంది. లోపం ఎక్కడ జరిగిందనే విషయంపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్‌తోప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశమయ్యారు. సరైన సమాచారం ఇవ్వలేదని కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే వివాదాల నేపథ్యంలో టీఎస్‌బీసీఎల్‌ను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
ఏపీకి లేనిది తెలంగాణకు ఎందుకు?
ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 2012-13, 2013-14 ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన మద్యం వ్యాపారానికి రూ. 2,939.53 కోట్లు ఆదాయపు పన్నుగా చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు గత ఫిబ్రవరి 28న ఏపీబీసీఎల్, టీఎస్‌బీసీఎల్‌లకు నోటీసులు జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ రెండు రాష్ట్రాల్లోని కొన్ని మద్యం డిపోలనుసీజ్ చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు జరిగిన మద్యం వ్యాపారం ఏపీబీసీఎల్ నేతృత్వంలోనే కాబట్టి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌కు సంబంధం లేదని ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. కోర్టు టీఎస్‌బీసీఎల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. కాగా, ఐటీ శాఖ పన్ను కింద సర్కారు సొమ్మును అటాచ్ చేసుకోవలసి వస్తే ముందు ఏపీ ప్రభుత్వం నుంచి రావలసిన వాటా రూ.1,665.34 కోట్లు తీసుకోవాలి. కానీ ఏపీబీసీఎల్ ద్వారా జరిగిన లావాదేవీలకు సంబంధించి గానీ, ఆ రాష్ట్రం నుంచి రావలసిన సొమ్ము గురించి కానీ ఆలోచించకుండా రాష్ట్ర సొమ్ములను అటాచ్ చేయడం ఏంటని ప్రభుత్వం మండిపడుతోంది. ఐటీ శాఖ తీసుకున్న అటాచ్‌మెంట్ నిర్ణయాన్ని సవాల్ చేసే ఆలోచనలో ఉంది. ఇదిలా ఉంటే 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రం తాజాగా పన్ను చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో జూన్ 2 , 2014 నుంచి టీఎస్‌బీసీఎల్ ద్వారానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 2014-15 ఆర్థిక సంవత్సరం కింద కనీసం రూ. 500 కోట్లు ఆదాయపు పన్నుగా ఉండొచ్చని అంచనా.