అమ్రపాలి వివాదాస్పద వ్యాఖ్యలు
జాబ్ మేళా సందర్భంగా నిరుద్యోగులకు వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి చేసిన సూచన వివాదాస్పదంగా మారింది. జిల్లాలోని ములుగు వద్ద బుధవారం జాబ్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన అమ్రపాలి.. ఉద్యోగం రావాలంటే కొన్ని అబద్దాలు ఆడాల్సివుంటుందని అయితే వాటిని సర్వీసులోకి వచ్చిన తర్వాత నిజం చేయాలని ఉద్యోగార్థులకు సూచించారు.
అమ్రపాలి వ్యాఖ్యలతో జాబ్ మేళాకు హాజరైన మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డిలు కంగుతిన్నారు. వెంటనే స్పందించిన విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కలెక్టర్ వ్యాఖ్యలను ఖండించారు. ఉద్యోగాలకు నిర్వహించే ఇంటర్వూల్లో అబద్దాలు ఆడితే వెంటనే దొరికిపోతారని అన్నారు.
తెలివైన వారు ఎంపిక బోర్డులో ఉంటే వచ్చే ఉద్యోగం కూడా చేజార్చుకోవాల్సి వస్తుందని హితవు పలికారు. కేసీఆర్ సర్కార్ ఉన్నంత వరకు ఎవరూ అబద్ధాలాడి ఉద్యోగం తెచ్చుకోవాల్సి అవసరం ఉండదన్నారు. అయితే కలెక్టర్ స్థాయి ఉద్యోగి అబద్ధాలాడమని చెప్పడం సంచలనంగా మారింది.