కొత్త కలెక్టర్ శ్రీదేవి | The new collector Sridevi | Sakshi
Sakshi News home page

కొత్త కలెక్టర్ శ్రీదేవి

Published Tue, Jan 13 2015 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

కొత్త కలెక్టర్ శ్రీదేవి

కొత్త కలెక్టర్ శ్రీదేవి

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లా నూతన కలెక్టర్‌గా 2004 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి టీకే శ్రీదేవి నియమితులయ్యారు. ప్రస్తుత కలెక్టర్ జీడీ ప్రియదర్శిని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజీవ్ శర్మ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నూతన కలెక్టర్ సంక్రాంతి పండగ తర్వాత ఈ నెల 16న విధుల్లో చేరనున్నారు. ఉత్తర్వులు అందిన వెంటనే విధుల నుంచి వైదొలగేందుకు ప్రియదర్శిని సంసిద్ధులయ్యారు.

అయితే జాయింట్ కలెక్టర్ శర్మన్ ఈ నెల 15వరకు సెలవులో ఉండడంతో తాత్కాలికంగా ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే అంశంపై స్పష్టత కొరవడింది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌శర్మ సూచనల కోసం ప్రియదర్శిని ఎదురు చూస్తున్నారు. నూతన కలెక్టర్ టీకే శ్రీదేవి నీటిపారుదల శాఖ ఆర్ అండ్ ఆర్ విభాగంలో డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. గతంలో పశ్చిమ గోదావరి జాయింట్ కలెక్టర్‌గా, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ డైరక్టర్‌గా పనిచేశారు.

రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోనూ వివిధ హోదాల్లో గతంలో పనిచేశారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీదేవి అగ్రికల్చర్ డెవలప్‌మెంట్‌లో డాక్టరేట్ పొందారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా పలు అంశాలపై వ్యాసాలు కూడా రాశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ ఐఏఎస్ అధికారుల కేటాయింపు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో జరిగిన బదిలీల్లో టీకే శ్రీదేవి జిల్లాకు వస్తున్నారు.
 
ఆరు నెలల్లోపే ప్రియదర్శిని బదిలీ
తెలంగాణ రాష్ట్ర అవతరణ నేపథ్యంలో 2014 జూలై 30న 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జీడీ ప్రియదర్శిని జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. కేవలం ఐదు నెలల 12 రోజులు మాత్రమే జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. సమగ్ర కుటుంబ సర్వే, రుణమాఫీ, సామాజిక పింఛన్లు, రేషన్‌కార్డుల లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో కీలకంగా వ్యవహరించారు. అదే సమయంలో పని ఒత్తిడి విషయంలో కలెక్టర్‌కు సిబ్బందికి నడుమ విభేదాలు తలెత్తాయి.

అధికారులతో సమన్వయ లోపం కూడా ప్రియదర్శిని ఆకస్మిక బదిలీకి దారితీసింది. ప్రభుత్వ విభాగాల సమీక్ష సందర్భంగా అధికారులను పలుమార్లు మందలించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు కూడా తీవ్రమవడంతో ఇటీవలే ముఖ్య కార్యదర్శిని కలిసి బదిలీ కోసం విన్నవించుకున్నట్లు సమాచారం. కాగా జిల్లా జాయింట్ కలెక్టర్ శర్మన్ కూడా ఇటీవలే జిల్లాలో మూడేళ్ల కాల పరిమితిని పూర్తి చేసుకున్నారు. త్వరలో జరిగే బదిలీల్లో జాయింట్ కలెక్టర్ కూడా ఉండవచ్చని అధికారికవర్గాల సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement