బడ్జెట్ కేటాయింపులు కోరతాం: టీజేఏసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో వివిధ అంశాలకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వెల్లడించారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం ముఖ్యనేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, దేవీప్రసాద్, సి.విఠల్, వి.మమత, ఎం.కృష్ణ యాదవ్ తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా జేఏసీ నేతల దృష్టికి వచ్చిన, జేఏసీలో కీలకంగా వ్యవహరించిన వివిధ సంఘాలకు అవగాహన ఉన్న సమస్యలపై ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తామన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాఖలవారీగా ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్సు కమిటీలకు నివేదికలను అందిస్తామని కోదండరాం వివరించారు.
1న అమెరికాకు కోదండరాం
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అక్టోబరు 1న అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు. అమెరికాలో ఉన్న కుటుంబసభ్యులను కలుసుకోవడంతోపాటు, వ్యక్తిగత పనులమీదే అమెరికా వెళుతున్నట్టు కోదండరాం వెల్లడించారు.