నేడే ఆఖరు
- పుష్కరుడికి నేడు ఘనంగా ముగింపు హారతి
- 11వ రోజూ కొనసాగిన భక్తుల తాకిడి
- 20 లక్షల మందికిపైగా పుష్కర స్నానాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గోదావరి మహా పుష్కరాల ఆఖరి ఘడియలు దగ్గర పడుతున్న కొద్దీ భక్తుల తాకిడి పెరుగుతోంది. పన్నెండు రోజుల పండుగకు శనివారం ఆఖరు కావడంతో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశాలున్నాయి. సుమారు 30 లక్షల మందికిపైగా వస్తారనే అంచనాతో అధికారులు, పోలీస్ యంత్రాంగం తగిన చర్యలు చేపట్టింది. దైవ దర్శనాలు తొందరగా అయ్యేందుకు ధర్మపురి, కాళేశ్వరం ఆలయాల్లో వీఐపీ దర్శనాలను రద్దు చేశారు.
పుష్కరాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ధర్మపురిలోని వీఐపీ పుష్కర ఘాట్ వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు గంగాహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, జెడ్పీ ఛైర్‌పర్సన్ తుల ఉమతోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాళేశ్వరంలో ఇద్దరు ఎంపీలు కవిత, బాల్క సుమన్ పాల్గొనను న్నారు. పుష్కరాల 11వ రోజైన శుక్రవారం జిల్లావ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు చేశారు. శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, ప్రభుత్వ విప్ గొంగడి సునీత, ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తదితరులు పుష్కర స్నానమాచరించారు.
ధర్మపురిలో ప్రత్యేక చర్యలు
శుక్రవారం ధర్మపురి పుణ్యక్షేత్రానికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. కలెక్టర్ నీతూప్రసాద్, ఎస్పీ జోయల్ డేవిస్ చివరి రోజు పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తగిన చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. శుక్రవారం ఉదయం కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. కోటిలింగాలలోను ఉదయం సమయంలో 5 కిలోమీటర్ల మేరకు వాహనాలు స్తంభించిపోయాయి.
కాళేశ్వరంలో ఉధృతంగా గోదావరి
కాళేశ్వరంలో శుక్రవారం ఉదయం భక్తుల రద్దీ కాస్త పలుచగా కనిపించినప్పటికీ మధ్యాహ్నం వరకు పుంజుకొని కిక్కిరిసిపోయింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి తోడు ఎగువ ప్రాంతంలో నీరు విడుదల చేయడంతో కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. వీఐపీ, ప్రధాన ఘాట్‌ల వద్ద ఆరు మీటర్ల మేర నీటి ప్రవాహం పెరిగింది. గోదావరిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దుస్తులు మార్చుకునే షెడ్లు, టెంట్లు మునిగిపోయాయి.
నదిలో నీటిప్రవాహం పెరగడంతో భక్తులు లోపలికి వెళ్లకుండా జేసీ పౌసమిబసు, ఓఎస్డీ సుబ్బారాయుడు ఇనుపకంచెలను ఏర్పాటు చేసి స్నానఘట్టాలు, షవర్ల కింద భక్తులకు స్నానానికి అవకాశం కల్పించారు. పిండప్రదానాలు, పితృతర్పణాలు స్నానఘాట్టాలపైనే జరిగాయి. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కాళేశ్వరంలో పుష్కరస్నానం చేశారు. మంథనిలో 2లక్షలకు పై చిలుకు భక్తులు పుష్కర స్నానం ఆచరించారు. మంథని, గోదావరిఖని పుష్కర ఘాట్ల వద్ద శుక్రవారం వేలాది మంది పుణ్యస్నానాలు చేశారు. శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముం దని అధికారులు భావిస్తున్నారు.