ఆదిలాబాద్:
వేసవి అంటేనే బెంబేలెత్తిపోతున్న ప్రజలు..
ఏటా తప్పని కన్నీటి తిప్పలు..
అప్పుడే షురువైన సమస్య..
అడుగంటిన భూగర్భ జలాలు..
నీరివ్వని చేతిపంపులు..
ఏజెన్సీల్లో పరిస్థితి మరింత దారుణం..
చెలిమెల నీరే శరణ్యం..
ముందస్తు చర్యలు ఎంతైనా అవసరం..!
వామ్మో.. వేసవి కాలం... రానే వస్తోంది. ఈ కాలం వచ్చిందంటే జిల్లా వాసులు బెంబేలెత్తిపోతుంటారు. ఎందుకంటారా.. ఏటా వారిని పట్టిపీడిస్తున్న నీటి సమస్యే. ఇంకా వేసవి ప్రారంభం కానే లేదు.. ఫిబ్రవరి నెల అయిపోనే లేదు.. కానీ అప్పుడే భూగర్భ జలాలు అడుగంటాయి. నీళ్ల కోసం మైళ్ల దూరం నడక తప్పడం లేదు. తాగునీటి పథకాలు పనిచేయక.. బావుల్లో నీరు లేక.. ఆయా చోట్ల చెలిమెలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడే ఈ దుస్థితి ఇలా ఉందంటే మున్ముందు ఇంకా ఎలా ఉంటుందోనని భయపడి పోతున్నారు. పాలకులు ముందస్తుగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుకుంటున్నారు.