సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘వలసవాద ఆధిపత్యం కింద పాలమూరు జిల్లా నలిగిపోయింది. ఉపాధి లేకపోవడంతో వలసల జిల్లాగా పేరొందింది. పాలమూరుకు జరిగిన అన్యాయాలను సరిదిద్దేందుకు మండలిలో ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తా.. గతంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమించాం.
భవిష్యత్‌లో అన్నివర్గాల సమస్యలపై మండలిలో గొంతువిప్పుతా..’’అని ఉద్యోగ సంఘం నేత దేవీప్రసాద్‌రావు అన్నారు. మండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. వలసవాద ఆధిపత్యం కింద పాలమూరు జిల్లా నలిగిపోయింది. దేశంలో అత్యధికంగా వలసకార్మికులు ఇక్కడినుంచే ఉన్నారు.
జిల్లాలో ఉపాధి అవకాశాలు లేకపోవడం, నీటిపారుదల సౌకర్యాలపై పాలకులు శ్రద్ధచూపకపోవడమే ప్రధాన కారణం. వలసల నివారణకు రాజకీయ పార్టీలు గతంలో సరైన కార్యాచరణ రూపొందించలేదు. టీడీపీ జిల్లాను దత్తత తీసుకున్నప్పటికీ సవతి తల్లి ప్రేమను కనబరిచింది. ఉపాధికి సంబంధించి ఇప్పటివరకు భారీపరిశ్రమలు రాలేదు. ఆర్డీఎస్‌కు నీటికేటాయింపులు ఉన్నా పావువంతు ఆయకట్టుకు కూడా నీరందని పరిస్థితి నెలకొంది. పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టాలనే డిమాండ్ ఉన్నా గత పాలకులు పట్టించుకోలేదు. సర్వేకోసం జీఓ జారీచేసినా నిధులు ఇవ్వలేదు. సాగునీటిరంగంలో గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్దేందుకు పాలమూరు ఎత్తిపోతల వంటి పథకాలను ప్రభుత్వం చేపడుతోంది.
కేంద్రనాన్చివేత వైఖరే కారణం
వివిధవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టింది. అయితే ప్రభుత్వపరంగా ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి.
ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఆలస్యానికి కారణం ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాకపోవడమే.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నాన్చివేతధోరణి మూలంగా విభజనకు సంబంధించిన మార్గదర్శకాలు ఇవ్వడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఐఏఎస్‌ల విభజన మొదలుకుని రాష్ట్ర విభజన బిల్లులో లోపాల సవరణ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అడుగడుగునా కొన్నిశక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. అవే శక్తులు తిరిగి మండలి ఎన్నికల్లో ఓట్లు అడగడం దురదృష్టకరం.
మండలిలో గొంతు విప్పుతా..
త్వరలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు, ప్రైవేట్‌రంగంలో ఉద్యోగావకాశాల కల్పన, ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. గతంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమించాం. భవిష్యత్‌లో వివిధరంగాలు, వర్గాల సమస్యలపై మండలిలో గొంతు విప్పుతా. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారిధిలా పనిచేస్తా.