13.88 లక్షల మంది గల్లంతు | 13.88 lakhs people missing | Sakshi
Sakshi News home page

13.88 లక్షల మంది గల్లంతు

Published Thu, Jul 23 2015 1:17 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM

13.88 లక్షల మంది గల్లంతు - Sakshi

13.88 లక్షల మంది గల్లంతు

నగరంలో ఎన్నికల అధికారుల నిర్వాకం
ఆర్నెల్లుగా పత్తాలేరంటూ నోటీసులు
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కూ నోటీసులు!
ఏపీ ఆర్‌అండ్‌బీ స్పెషల్ సెక్రటరీ ఇంటికీ తాళమే
అపార్ట్‌మెంట్లలోని వందలాది కుటుంబాలూ మాయం
ఇళ్లు మారిన, ఇతర చోట్లకు వెళ్లినవారు 22.57 లక్షలు
ఇష్టారాజ్యంగా బూత్ లెవల్ అధికారుల ‘ఇంటింటి సర్వే’
ఆధార్ అనుసంధానంతో మరింత అస్తవ్యస్తం
జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి..
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓటర్లు

 
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 13.88 లక్షల మంది గల్లంతయ్యారు.. అపార్ట్‌మెంట్లలో ఉన్న వందలాది కుటుంబాలూ ‘మాయం’ అయ్యాయి.. ఈ ఇళ్లలోని వారంతా ఆరు నెలలుగా పత్తాలేరు..!! ఏమిటిదంతా అనుకుంటున్నారా..? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎన్నికల అధికారులు ఇంటింటి సర్వేలో తేల్చిన చిత్రమైన లెక్కలివి. అంతేకాదు ‘మీ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తా’మంటూ వారందరికీ (13.88 లక్షల మందికి) నోటీసులు కూడా జారీచేశారు. దీనిపై ఓటర్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూతూమంత్రంగా సర్వే చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడుతున్నారు. ఈ నోటీసులు అందుకున్నవారిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్, ఏపీ రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్యాంబాబ్ కూడా ఉన్నట్లు తెలిసింది. దీంతో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సైతం ఈ ‘సర్వే’ తీరు చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

నిర్లక్ష్యం వల్లే.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముంగిట ఓటర్ల సవరణ, ఆధార్ అనుసంధాన ప్రక్రియను చేపట్టాల్సిన జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కమిషన్ ఏటా ఓటర్ల సవరణ ప్రక్రియకు జీహెచ్‌ఎంసీకి దాదాపు రూ.9 కోట్లు కేటాయిస్తోంది. వీటిని బూత్ స్థాయి అధికారుల(బీఎల్‌వో)కు గౌరవ వేతనంగా చెల్లిస్తున్నారు. కానీ ఇంటింటికీ వెళ్లి ఓటర్లున్నారా, లేదా పరిశీలించి ఆధార్ నంబర్లను నమోదు చేసుకోవాల్సిన బీఎల్‌వోలు తూతూమంత్రంగా పరిశీలన జరుపుతూ చేతులు దులుపుకొంటున్నారు. క్షేత్ర స్థాయికి వెళ్లకుండానే, బినామీలను పెట్టుకుని ఓటర్ల జాబితాలను దిద్దేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం వల్లే ఏళ్లకేళ్లుగా స్థిర నివాసం ఉంటున్న ఓటర్లకు సైతం నోటీసులు జారీ అయ్యాయి. లేని ఓటర్లు ఉన్నట్లుగా, ఉన్న ఓటర్లు లేనట్లుగా తయారై గందరగోళంగా మారింది. కొన్నిచోట్ల అపార్టుమెంట్లలో ఉన్న వందలాది కుటుంబాలకు గంపగుత్తగా నోటీసులిచ్చారు. జీహెచ్‌ఎంసీ పర్యవేక్షణ లోపించడంతో పాటు తగినంత ప్రచారం లేకపోవటంతో ఈ ఆధార్ సీడింగ్ ప్రక్రియ ఓటర్లను అయోమయానికి గురిచేసింది.

ఆర్నెల్లుగా గల్లంతు?
‘మీ ఎపిక్ (ఓటరు) కార్డులో ఉన్న చిరునామాలో ఆరు నెలలకుపైగా మీరు అందుబాటులో లేరు. మీ ఇంటికి తాళం వేసి ఉంది. అందుకే  మిమ్మల్ని తాత్కాలిక నివాసులుగా పరిగణించాల్సి వస్తుంది. మీరు స్వయంగా హాజరుకాకుంటే.. ఓటర్ల జాబితా నుంచి మీ పేరును తొలగిస్తాం..’ అంటూ ఇటీవల హైదరాబాద్‌లో కూకట్‌పల్లి ప్రాంతంలోని వేలాది మందికి నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మేమున్నా లేనట్లుగా ఎందుకు నోటీసులు వస్తున్నాయి, ఓటర్ల జాబితాలో నుంచి మా పేర్లు తొలగించడమేమిటి..?’ అంటూ వారు బిత్తరపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓట్లను తొలగించేందుకు ఎన్నికల అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఈ నోటీసులు ఇస్తున్నారని,  క్షేత్రస్థాయిలో ఇంటింటికి వచ్చి పరిశీలించకుండానే ఓట్లు తొలగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఇంటింటి సర్వే సందర్భంగా ఓటర్లు ఆయా చిరునామాల్లో లేరని గుర్తిస్తే ఎన్నికల అధికారులు ఓటర్లకు నోటీసులు జారీ చేస్తారు. తగిన ఆధారాలు చూపించాలని, లేకుంటే జాబితా నుంచి పేరును తొలగించాల్సి వస్తుందని పేర్కొంటారు. కానీ ఇలా లక్షలాది ఇళ్లకు తాళాలున్నాయని, లక్షలాది మంది ఇళ్లు వదిలి వేరే చోటికి వెళ్లిపోయారని పేర్కొంటూ కాకిలెక్కలు రాసిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

సర్వేలో తేల్చిన అంశాలివీ..

మొత్తం ఓటర్లు: 84.01 లక్షలు
బీఎల్‌వోలు పరిశీలించినవి: 82.04 లక్షలు
ఈఆర్‌వోలు పరిశీలించినవి: 41.12 లక్షలు
ఆధార్‌తో అనుసంధానం: 29.52 లక్షలు (35%)
బీఎల్‌వోల వద్ద పెండింగ్‌లో ఉన్నవి: 2.19 శాతం
ఈఆర్‌వోల వద్ద పెండింగ్‌లో ఉన్నవి: 45.76 శాతం
ఆధార్ ఎన్‌రోల్ చేసుకోనివారు: 13.33 లక్షలు
ఇళ్లు మార్చిన, ఇతర చోట్లకు వెళ్లిపోయినవారు: 22.57 లక్షలు
ఇంటికి తాళం వేసి ఉన్నవారు: 13.88 లక్షలు
మరణించినవారు: 0.81 లక్షలు
డూప్లికేట్ ఓట్లున్న వారు: 1.58 లక్షలు
అనర్హులు: 0.35 లక్షలు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement