ఉద్యోగార్థులపై దాడి శోచనీయం: వైఎస్ జగన్
హైదరాబాద్: ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాసేందుకుగానూ కర్ణాటక వెళ్లిన తెలుగు ఉద్యోగార్థులపై కన్నడ సంఘాలు దాడి శోచనీయమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. తెలుగు విద్యార్థుల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆకాంక్షించిన జగన్.. అన్ని రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి ముందుకుసాగాలని కోరారు. ‘యువజనులు, విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇంత పెద్ద సంఖ్యలో వెళుతున్న తీరు ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది’ అని వైఎస్ జగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
కర్ణాటక రీజనల్ లోని తమ ఉద్యోగాలను తెలుగు విద్యార్థులు కొల్లగొడుతున్నారని ఆరోపిస్తూ శనివారం కన్నడ సంఘాలు బెంగళూరు, హుబ్లీ తదితర ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ల వద్ద ఆందోళనలు చేపట్టాయి. పరీక్షలు రాయడానికి వెళ్లిన తెలుగువారిపై దాడి చేసి, హాల్ టికెట్లను చించేసి వీరంగం సృష్టించాయి. ఆందోళనల నేపథ్యంలో అధికారులు పరీక్షను రద్దు చేశారు.