విలపిస్తున్న కశ్మీర్ మహిళలు
పొరుగు దేశం కాల్పుల్లో మరొకరి మృతి, ఐదుగురికి గాయాలు
జమ్మూ: సరిహద్దులో పాకిస్తాన్ ఆగడాలు శ్రుతిమించాయి. పాక్ సైన్యం ఆదివారం వరుసగా ఎనిమిదో రోజూ జమ్మూకశ్మీర్ సరిహద్దులోని పల్లెలు, ఆర్మీ పోస్టులపై భారీ కాల్పులకు, మోర్టారు బాంబు దాడులకు పాల్పడింది. పూంచ్ జిల్లాలోని పూంచ్, రాజౌరీ, బాలాకోట్, హమీర్పూర్, మండీ సెక్టార్లలో విచక్షణ రహితంగా దాడులు చేసింది. బాలాకోట్ సెక్టార్‌లోని బెహ్రోత్ గ్రామంపై జరిగిన మోర్టారు బాంబుల దాడిలో నసరత్ బేగం(35) అనే మహిళ మృతిచెందగా, ఇద్దరు గాయపడ్డారు. రాజౌరీలోని మంజకోట్‌లో మరో ముగ్గురు గాయపడ్డారు.
దీంతో.. శని, ఆదివారాల్లో పాక్ కాల్పుల్లో మృతిచెందిన భారత పౌరుల సంఖ్య ఆరుకు, క్షతగాత్రుల సంఖ్య 10కి చేరింది. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. పాక్ జవాన్లు ఆర్మీ పోస్టులపై, పల్లెలపై భారీ కాల్పులు, మోర్టారు దాడులకు పాల్పడ్డార ని, వాటిని తమ సైన్యం దీటుగా తిప్పికొట్టిందని రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మనీశ్ మెహతా చెప్పారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించారు. పాక్ కాల్పులకు సైన్యం రెండుమూడు రెట్లు దీటుగా జవాబిస్తోందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు.
శాంతికి భంగం కలిగించొద్దు..
కాల్పుల విరమణ ఉల్లంఘనపై భారత్ మండిపడింది. విదేశాంగ శాఖ కార్యదర్శి(తూర్పు) అనిల్ వాధ్వా.. ఆదివారం ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను పిలిపించుకుని తీవ్ర ఆగ్రహం, నిరసన వ్యక్తం చేశారు. సరిహద్దులో పాక్ సైన్యం శాంతికి తూట్లు పొడవకుండా ఆ దేశ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాల్పులు జరగవని పాక్ చెప్పిన హామీలు అమలు కావడం లేదని ఆక్షేపించారు.
ప్రధాని మోదీ వెంట యూఏఈలో పర్యటిస్తున్న విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ ఈ వివరాలు తెలిపారు. అయితే భారతే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోందని, గత నెల నుంచి ఇప్పటి వరకు 70 సార్లు కాల్పులు జరిపిందని బాసిత్ అన్నారు. ముందస్తు కాల్పులకు ఎవరు పాల్పడుతున్నారో తేల్చడానికి శక్తిమంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
ఖండించిన పార్టీలు.. పాక్ కాల్పులను పలు పార్టీలు ఖండించాయి. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితిపై జమ్మూకశ్మీర్ గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో చర్చించారు. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం ఇస్లామికేతర చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. పాక్ కాల్పులపై ప్రధాని మోదీ పెదవి విప్పాలని, పాక్‌కు గట్టి సందేశాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.