న్యూఢిల్లీ : ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్కు చుక్కెదురు అయ్యింది. కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలని పాక్ చేసిన విజ్ఞప్తిని ఐరాస తిరస్కరించింది. కాశ్మీర్ అంశాన్ని చర్చల ద్వారా ఇరు దేశాలు పరిష్కరించుకోవాలని పాకిస్థాన్కు ఐక్యరాజ్య సమితి సూచించింది. కాగా కొద్దిరోజులుగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్థాన్... కాశ్మీర్ అంశంపైకి అంతర్జాతీయంగా దృష్టి మరల్చే యత్నాలను తీవ్రం చేసింది. కాశ్మీర్‌తో సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులపై జోక్యం చేసుకోవాలంటూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌కు లేఖ రాసింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేసింది.
పాకిస్థాన్ ప్రధాని భద్రత, విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ రాసిన ఈ లేఖను పాక్ విదేశాంగ కార్యాలయం ఆదివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. కొద్దివారాలుగా భారత్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, భారీగా కాల్పులకు తెగబడుతోందని ఆ లేఖలో ఆరోపించారు. భారత దళాలు జరిపిన కాల్పుల్లో తమ పౌరులు భారీ సంఖ్యలో మరణించారన్నారు.
అక్టోబర్ నెల మొదటి పదిరోజుల్లోనే అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి 22 సార్లు, నియంత్రణ రేఖ వెంబడి 20 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించారని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దుల వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని.. దీనిపై అత్యవసరంగా దృష్టి సారించాలని బాన్‌కీ మూన్‌ను అజీజ్ కోరారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సుదీర్ఘకాలంగా ఈ జమ్మూకాశ్మీర్ వివాదం ఎజెండాగా ఉందని.. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిపిస్తామనే తీర్మానాలు కూడా చేసినా, ఇంకా ఆ పని చేపట్టలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఐరాస జోక్యం చేసుకోమని స్పష్టం చేయటంతో పాకిస్థాన్కు మరోసారి భంగపాటు ఎదురైందనే చెప్పవచ్చు