‘టీ’కి బీజేపీ వ్యతిరేకమని బయటపడింది: కమల్‌నాథ్
న్యూఢిల్లీ: ‘‘ఇది చాలా దురదృష్టకరం. ఈ రోజు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత బీజేపీ నేతలు సాంకేతిక కారణాలు సాకుగా చూపి బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఇది బీజేపీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం. బీజేపీ తెలంగాణను వ్యతిరేకిస్తోందని ఇప్పుడు స్పష్టమైపోయింది. వారికి ఇష్టంలేకపోతే.. మేం తెలంగాణకు వ్యతిరేకమని ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాలి. కానీ తాము తెలంగాణకు మద్దతిస్తామని బయట చెప్తూ.. సభలోకి వచ్చేసరికి బిల్లును వ్యతిరేకిస్తూ తమ ద్వంద్వ వైఖరిని, కపట వైఖరిని బయటపెట్టుకున్నారు’’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ధ్వజమెత్తారు.
‘‘టీ-బిల్లు ఆమోదానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. లోక్‌సభలో పెప్పర్ స్ప్రే ప్రయోగించ టం.. సభ్యులను హత్యచేసేందుకు జరిగిన ప్రయత్నం. ఈ ఘటనలో ప్రమేయమున్న ఎంపీలపై కఠిన చర్యలు చేపట్టటం జరుగుతుంది. సభలో చోటుచేసుకున్న సంఘటనలు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ. పార్లమెంట రీ ప్రజాస్వామ్యం అభిప్రాయభేదానికి తావి స్తుంది కానీ.. ఈ రోజు సభలో కనిపించిన తరహా ఆటంకాలకు, హింసాప్రయోగానికి అనుమతించదు. ఇది మన ప్రజాస్వామ్య ప్రాథమికసూత్రాలకు, పునాదులకు విరుద్ధం. ఇలాంటి ఘటన చోటుచేసుకున్నందుకు సిగ్గుపడుతున్నా. ఇందు కు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని స్పీకర్‌ను కోరాలని చాలామంది పార్టీ నేతలు అడిగారు. ఈ ఘటన సభ ఆవరణలో జరిగినందున.. చర్యలపై నిర్ణయించగలిగేది స్పీకరే. ఎంపీలను తనిఖీ చేసేందుకు నిబంధనలు అంగీకరించవు. కాబట్టి ఎవరినీ తనిఖీ చేయలేదు. సభలో సిటింగ్ సభ్యులు ఇలా ప్రవర్తిస్తారని రాజ్యాంగ నిర్మాతలెన్నడూ ఊహించలేదు’’ అని అన్నారు.