టార్గెట్ ఇండియా.. చైనా మిలిటరీ ఆపరేషన్!
యుద్ధోన్మాద చైనా అధికారిక పత్రిక 'గ్లోబల్ టైమ్స్' మరోసారి డోక్లామ్ వివాదంపై చెలరేగిపోయింది. డోక్లామ్‌లో మోహరించిన భారతీయ సైన్యాన్ని తరిమికొట్టేందుకు చిన్నస్థాయి మిలటరీ ఆపరేషన్‌ను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) ఈ వారాంతంలో చేపట్టనుందని 'నిపుణుల'ను ఉటంకిస్తూ ఆ పత్రిక చెప్పుకొచ్చింది.
' చైనా భూభాగంలోకి భారత సైనికుల చొరబాటును ఎక్కువకాలం చైనా సహించలేదనే విషయాన్ని గడిచిన 24 గంటల్లో చైనా వైపు నుంచి వెలువడిన వ్యాఖ్యలు.. భారత్‌కు తెలిపాయి. అయినా, భారత్ వెనుకకు తగ్గడానికి నిరాకరిస్తే.. రెండువారాల్లోపు చైనా చిన్నస్థాయి మిలిటరీ ఆపరేషన్‌ను చేపట్టవచ్చు' అని 'గ్లోబల్ టైమ్స్' పత్రిక హు ఝియాంగ్‌ను ఉటంకిస్తూ పేర్కొంది. దాదాపు రెండునెలలుగా వివాదాస్పద డోక్లామ్ ప్రాంతంలో భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌ను చొరబాటుదారుగా అభివర్ణిస్తూ చైనా 15 పేజీల వివరణాత్మక పత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. డోక్లామ్ నుంచి భారత సైనికులు స్వచ్ఛందంగా, బేషరతుగా వెంటనే తప్పుకోవాలని డిమాండ్ చేసింది.
డోక్లామ్ ప్రతిష్టంభన నెలకొని 50 రోజులైంది. నిజానికది భూటాన్ భూభాగం. అక్కడ చైనా రోడ్డు నిర్మించే ప్రయత్నం చేయగా... అది తమ ప్రయోజనాలకు భంగకరమని భారత్ అడ్డుపడింది. కానీ చైనా మాత్రం వివాదాన్ని పెద్దది చేయడం ద్వారా తాము అనుకున్నది సాధించింది. అక్కడేదో వివాదాస్పద అంశం ఉందనే అభిప్రాయాన్ని అంతర్జాతీయంగా కలిగించడంలో విజయవంతమైంది. చైనా తమ భూభాగాన్ని విస్తరించే క్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. తొలుత సైనిక బలంతో ఇతర దేశాల భూభాగాన్ని దురాక్రమణ చేయడం, తర్వాత అది తమ అంతర్భాగమని అన్ని అంతర్జాతీయ వేదికలపై నొక్కి చెప్పడం. సాధ్యమైనంత ఎక్కువగా అంతర్జాతీయ వేదికలపై దీని ప్రస్తావన తెస్తుంది. ఫలితంగా సదరు చైనా ఆక్రమిత భూభాగం కాస్తా... వివాదాస్పద భూభాగంగా మారిపోతుంది. మరో విధానాన్ని కూడా డ్రాగన్ అనుసరిస్తోంది. చిలకొట్టుడుతో ప్రారంభించి మెల్లిగా దురాక్రమణను విస్తరిస్తుంది. దక్షిణ చైనా సముద్రంలో పారాసెల్స్, స్ప్రాట్లీ దీవుల సముదాయాలు పూర్తిగా తమవేనని చెప్పడం, కృతిమ దీవులను నిర్మించి ఆర్మీబేస్ కింద మార్చేందుకు మౌలికసదుపాయాలను అభివృద్ధి చేయడం... ఇలాంటిదే. డోక్లామ్ కవ్వింపును కూడా చైనా విస్తరణ కాంక్షలో భాగంగానే ప్రపంచ దేశాలు చూడాల్సిన అవసరం ఉంది. 1949లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) అధికారాన్ని హస్తగతం చేసుకున్నపటి నుంచీ చైనా దురాక్రమణల ద్వారా తమ భూభాగాన్ని విస్తరిస్తూనే ఉంది.
పూర్తి కథనం: కబలిం‘చైనా’
చదవండి: మావో వల్లే 1959 సరిహద్దు వివాదం