భారీ భవనాన్ని చీల్చుకుంటూ మెట్రో పరుగు
చిన్నపాటి రోడ్డు వేయాలంటేనే వేలాది చెట్లు, వందలాది భవనాలు, వాణిజ్య సముదాయాలను నేలమట్టం చేసేస్తారు. మరి రైల్వే లైన్ వేయాలంటే... ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే ఈ పరిస్థితి కనిపించేది మన భారతదేశంలో. కానీ అద్భుతాలకు అడ్డాగా చెప్పుకునే చైనాలో . ఎందుకంటారా..? చదవండి..
భారీ నిర్మాణాలు, టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణల గురించి మాట్లాడుకుంటూ చైనా పేరు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే.. ఆ దేశం సృష్టిస్తున్న అద్భుతాలు అటువంటివి. మన హైదరాబాద్‌లో మెట్రోరైల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డుమీదే పిల్లర్స్ వేసి, వాటిపై ఓ వంతెన నిర్మించి, దానిపై రైలు పట్టాలు వేస్తారు. నగరంలోని ప్రధాన వీధుల గుండా మెట్రోరైలు ప్రయాణించేందుకు ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ వంతెన నిర్మాణం కోసం హైదరాబాద్‌లో ఎన్నో భవనాలను నేలమట్టం చేస్తున్నారు. కానీ చైనా మాత్రం ఓ మెట్రోరైలు ప్రాజెక్టును కనీసం ఒక్క భవనాన్ని కూడా కూల్చకుండా చాకచక్యంగా నిర్మాణాన్ని పూర్తి చేసింది. వివరాల్లోకెళ్తే...
దక్షిణ చైనాలోని చాంగ్‌క్వింగ్ నగరంలో జనసాంద్రత చాలా ఎక్కువ. కేవలం 31,000 చదరపు మైళ్ల విస్తీర్ణం ఉండే ఈ నగరంలో 49 మిలియన్ల మంది నివసిస్తున్నారు. ఇందుకోసం ఈ నగరంలో భారీ బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. ప్రజా రవాణా కష్టంగా మారడంతో ఇటీవలే మెట్రోరైలు పనుల్ని ప్రారంభించారు. అయితే ఒకచోట రైలు మార్గానికి 19 అంతస్తుల పే....ద్ద భవనం అడ్డొచ్చింది. సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎంతపెద్ద భవనమైనా నేలకూలుస్తారు. కానీ చాంగ్‌క్వింగ్ నగరంలో అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ భవనంలో ఉండే ఐదారువందల కుటుంబాలకు మరోచోట నివాస సదుపాయం కల్పించడం కష్టం. అందుకే భవనం మధ్యలో నుంచే రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు.
కేవలం రెండు అంతస్తులే..
మొత్తం 19 అంతస్తుల్లో కేవలం రెండు అంతస్తుల్లోని నిర్మాణాలను పూర్తిగా తొలగించి మిగతా భవనాన్ని యథావిధిగా ఉంచేశారు. ఆ రెండు అంతస్తులగుండా రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు. మరి రైలు వెళ్లేటప్పుడు ఆ శబ్ధాన్ని భవనంలో ఉంటున్నవారు ఎలా భరిస్తున్నారు? అనే ప్రశ్నకూ సమాధానం చెబుతున్నారు. అంతపెద్ద రైలు భవనంలో నుంచి వెళ్లినా చిన్నాపటి చప్పుడు కూడా రాదట. మహాఅయితే గిన్నెలు తోమేటప్పుడు డిష్‌వాష్ మెషీన్ చేసేంత శబ్దం మాత్రమే వస్తుందట. సదరు భవనంలోనే స్టేషన్‌ను కూడా నిర్మించడం విశేషం.
–సాక్షి, స్కూల్ ఎడిషన్