హనీమూన్ ఫోటోలను తొలగించండి!
లండన్:వివాహ వ్యవస్థకు సంబంధించిన హనీమూన్ ఫోటోలను ఫేస్ బుక్ నుంచి వెంటనే తొలగించాలని ఓ భార్యకు ఇటాలియన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన అనుమతి లేకుండా ఫేస్ బుక్ లో భార్య పోస్ట్ చేసిన ఫోటోలను తొలగించాలంటూ భర్త కోర్టును ఆశ్రయించాడు. దీంతో విచారణకు స్వీకరించిన కోర్టు ఆ ఫోటోలను వెంటనే తీసివేయాలంటూ ఆమెకు సూచించింది. ఆ ఫోటోలను నిశితంగా పరిశీలించిన కోర్టు.. ఆమె ఆర్టికల్ 10 సెక్షన్ తో పాటు భర్త యొక్క ప్రాధమిక హక్కులను ఉల్లంఘించారని స్పష్టం చేసింది.
దీనిపై వాదించిన భార్య తరపు న్యాయవాది.. అతివేగంతో దూసుకుపోతున్ననేటి సోషల్ మీడియాలో ప్రైవేటు ఆల్బమ్ లను పోస్ట్ చేయడానికి ఫేస్ బుక్ ఒక వారధి లాంటిదని వాదించాడు. కాగా, ఈ వాదనతో ఏకీభవించని కోర్టు ఆ ఫోటోలను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును భర్త తరపు న్యాయవాది స్వాగతించాడు. ఈ రకంగా ఆమె భర్తకు కల్గించిన నష్టానికి భార్య తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపాడు. ఫేస్ బుక్ లో ఇష్టానుసారం పోస్ట్ చేసే వారికి ఇదొక హెచ్చరికలాంటిదని అభిప్రాయపడ్డాడు.