నోట్ల మార్పిడికి బ్యాంకులు రెడీ
న్యూఢిల్లీ/ముంబై: కరెన్సీ నోట్ల మార్పిడి బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. భద్రతా ప్రమాణాలను పెంచేందుకు... నకిలీ కరెన్సీ, నల్లధనానికి అడ్డుకట్టవేయడంలో భాగంగా 2005కు ముందునాటి నోట్లను వ్యవస్థ నుంచి ఉపసంహరించాలని ఆర్‌బీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పాత నోట్లను(రూ.500, 1,000 నోట్లు సహా) బ్యాంకుల్లో ఇచ్చి 2005 తర్వాత ముద్రించిన నోట్లను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి మార్చుకోవాలని ఆర్‌బీఐ తొలుత పేర్కొంది. అయితే, ఇప్పటినుంచే ఈ మార్పిడి చేసుకోవచ్చంటూ తదుపరి మరో ప్రకటన చేసింది.
నోట్లను మార్చుకునేందుకు బ్యాంక్ ఖాతాదారుల నుంచి కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉందని, అయినప్పటికీ తాము దీనికి సర్వసన్నద్ధంగా ఉన్నట్లు బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) డిప్యూటీ ఎండీ పి.కె.మల్హోత్రా చెప్పారు. ‘మావద్ద సుమారు 1,000 నగదు డిపాజిట్ యంత్రాలు ఉన్నాయి. ఖాతాదారుల డిమాండ్‌ను తట్టుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. నకిలీ కరెన్సీ చలామణికి అడ్డుకట్టవేసేందుకు ఆర్‌బీఐ చర్యలు దోహద పడతాయి. 2005 తర్వాత ముద్రించిన నోట్లలో భద్రతకు సంబంధించి మరిన్ని అంశాలు జోడించారు’ అని ఆయన పేర్కొన్నారు.
నోట్ల మార్పిడి విషయంలో ఆర్‌బీఐ ఆదేశాలను పాటిస్తామని ఓరియంటల్ బ్యాంక్(ఓబీసీ) సీఎండీ ఎస్‌ఎల్ బన్సల్ తెలిపారు. అయితే, ఇప్పటికే చాలావరకూ పాత కరెన్సీ వ్యవస్థ నుంచి తొలగి ఉండొచ్చని.. అందువల్ల ప్రజలు మరీ అంతలా క్యూలు కట్టే అవకాశాల్లేవనేది ఆయన అభిప్రాయం. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) సీనియర్ అధికారి కూడా తమ బ్యాంక్ బ్రాంచీలన్నీ నోట్ల మార్పిడి రద్దీని తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కాగా, ఈ ఏడాది జూలై 1 వరకూ మాత్రమే ఏ బ్యాంక్‌లోనైనా కస్టమర్లు నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆతర్వాత ఖాతా ఎక్కడైతే ఉందో ఆ బ్యాంక్ శాఖలో మాత్రమే మార్చుకోవాలని ఆర్‌బీఐ పేర్కొంది.