సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులు 673గా వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. కానీ అందులో వ్యవసాయ సమస్యల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడినది 305 మందేనని పేర్కొంటోంది. మిగతావారు ఇతర సమస్యలతో బలవన్మరణాలకు పాల్పడినట్లు చెబుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొనగా కరువు మండలాల సంఖ్య 57 మాత్రమేనని రెవెన్యూ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఈ మేరకు వ్యవసాయ, రెవెన్యూ శాఖలు వేర్వేరుగా నివేదికలు రూపొందించాయి.
రాష్ట్రం ఏర్పాటైన నాటి (గతేడాది జూన్ 2వ తేదీ) నుంచి ఈ నెల 22 వరకు 673 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వ్యవసాయశాఖ నిర్ధారించింది. వీటిలో 583 ఆత్మహత్యలపై జిల్లాల్లోని ముగ్గురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ విచారణ నివేదిక మేరకు.. 305 మంది రైతులు మాత్రమే వ్యవసాయ సంబంధిత సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని, వీటిలో 295 కుటుంబాలకు పరిహారం ప్రకటించిందని వెల్లడించింది.
ఇక పంటలు ఎండిపోవడం వల్ల కాకుండా ఆర్థిక పరిస్థితి లేదా ఇతర సమస్యల కారణంగా అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారని వ్యవసాయశాఖ నివేదికలో పేర్కొంది. అయితే మీడియాలో వచ్చిన వార్తలు, రైతు సంఘాల లెక్కల ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,138 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
అవన్నీ సరిపోతేనే: రైతు పంట నష్టం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడా, ఇతరత్రా కారణంతో అందుకు పాల్పడ్డాడా అన్నది తేల్చడానికి 13 రకాల ధ్రువీకరణ పత్రాలు సరిపోవాలి. అప్పుడే పరిహారం వస్తుంది. ఎఫ్‌ఐఆర్, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా పోలీసులు ఇచ్చే తుది రిపోర్టులు ఉండాలి. ప్రైవేటు రుణాలు, బ్యాంకు రుణాల రిపోర్టులు, పాస్‌బుక్, ఆధారపడిన వారి వివరాలు, రేషన్‌కార్డు, మూడేళ్ల పహాణీ, ఎమ్మార్వో, ఎస్సై, ఏవో ఇచ్చే మండల స్థాయి నివేదిక, ఆర్డీవో, డీఎస్పీ ఇచ్చే డివిజనల్ రిపోర్టులు ఉండాలి. ఇవన్నీ సంతృప్తికరంగా ఉంటేనే రైతు వ్యవసాయ సంబంధిత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించి బాధిత కుటుంబానికి పరిహారం అందిస్తారు.
కరువు కానరాదా?: రాష్ట్రవ్యాప్తంగా 226 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని అర్థగణాంక శాఖ లెక్కలే చెబుతుండగా.. కరువు మండలాలు 57 మాత్రమేనని రెవెన్యూ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 29 కరువు మండలాలను గుర్తించగా ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కరువు లేదని అంచనా వేశారు. వర్షపాతం, వర్షానికి వర్షానికి మధ్య రోజుల్లో తేడా(డ్రైస్పెల్), తగ్గిన పంటల విస్తీర్ణం ఆధారంగా ఈ లెక్కలు వేసినట్లు అధికారులు చెబుతున్నారు.
వర్షపాతం, డ్రైస్పెల్ పరంగా చూస్తే కరువు మండలాలు 226 కంటే ఎక్కువే ఉంటాయి. జూన్‌లో వర్షాలు బాగానే కురవడంతో భారీగా పంటల సాగు చేపట్టారు. తర్వాత వర్షాల్లేక చాలావరకు ఎండిపోయాయి. కానీ ఎండిపోయాక ఎంత విస్తీర్ణం ఖాళీగా ఉందో అంచనా వేయలేదని, దాంతో కరువు మండలాల అంచనా తక్కువగా ఉందని తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో తుది నివేదిక తయారుచేస్తారని చెబుతున్నారు.
తక్కువ చూపుతున్నారు
‘‘ప్రభుత్వం ఆత్మహత్యలు, కరువు మండలాల సంఖ్యను తక్కువగా చూపుతోంది. ఇప్పటివరకు 1,138 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కానీ బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా సర్కారు పన్నాగం పన్నుతోంది. రాష్ట్రంలో 236 మండలాలు కరువులో ఉన్నాయి. వాటినీ తక్కువ చేసి చూపుతోంది..’’
- సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం నేత
రైతుల ఆత్మహత్యలు 673
Published Thu, Sep 24 2015 3:46 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement
Advertisement