గోవాలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్ | Goa: Congress MLA Vishwajit Rane quits party | Sakshi
Sakshi News home page

గోవాలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్

Published Mon, Mar 13 2017 3:49 PM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

గోవాలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్

గోవాలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్

పణాజి: గోవాలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. గోవా ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలం కాగా.. తాజాగా మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ రాణె కొడుకు, ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి తన బాటలో నడుస్తారని చెప్పారు. తాజా ఎన్నికల్లో వాల్పోయి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విశ్వజిత్ గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుల వైఖరి వల్లే తాను పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు.


గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలిచినా సీనియర్ నాయకుల అసమర్థత వల్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల తర్వాత సీనియర్ నాయకులు అనుసరించిన వైఖరి సిగ్గుచేటని, తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని రాణె విమర్శించారు. ఇందుకు కాంగ్రెస్ మూల్యం చెల్లించకతప్పదని, తన నియోజకవర్గ ప్రజలు మరోసారి ఆ పార్టీని గెలిపించరని అన్నారు. గోవా ఫార్వార్డ్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సరైన నిర్ణయం తీసుకోలేకపోయారని, వారి అసమర్థతకు సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. జీఎఫ్‌పీ మద్దతు తీసుకోవాలని బీజేపీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిర్ణయించారని, కాంగ్రెస్ నాయకులు ఆ పని చేయలేకపోయారని నిందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ అక్రమాలకు పాల్పడిందని రాణె ఆరోపించారు. కాగా కాంగ్రెస్ పార్టీని ఎవరూ వీడరని, తాను రాణెతో మాట్లాడుతానని ఆ పార్టీ ప్రతినిధి కేసీ వేణుగోపాల్ చెప్పారు.

40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రోహన్ కాంటె కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. గోవాలో అధికార బీజేపీ 13 సీట్లకే పరిమితం కాగా ఇతరులు 10 సీట్లు గెల్చుకున్నారు. కాగా బీజేపీకి చిన్నాచితక పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీకి ఎమ్మెల్యేల బలం 22కు పెరిగింది. మనోహర్ పారికర్ గోవా సీఎంగా మంగళవారం ప్రమాణం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement