హెచ్‌డీఎఫ్‌సీ, ఐఐఎఫ్‌సీఎల్ సహా...
రేటు కోత బాటలో మరిన్ని బ్యాంకులు
న్యూఢిల్లీ: కనీస (బేస్) రుణ రేటు తగ్గింపు బాటలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్‌ఫ్రా ఫైనాన్స్ కంపెనీ ఐఐఎఫ్‌సీఎల్‌సహా మరికొన్ని బ్యాంకులు నిలిచాయి. సోమవారం ఆయా నిర్ణయాలను ఒక్కసారి చూస్తే...
హెచ్‌డీఎఫ్‌సీ: పావు శాతం రేటు తగ్గించింది. దీనితో ఈ రేటు 9.65 శాతానికి చేరింది. గృహ రుణ రేటు కొత్త కస్టమర్లకు 9.65 శాతంగా ఉంటుంది. అయితే మహిళల విషయంలో ఈ రేటు 9.60 శాతంగానే ఉంటుంది. ప్రస్తుతం ఈ రేట్లు 9.9 శాతం, 9.85 శాతంగా ఉన్నాయి. మంగళవారం నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయి.
కెనరాబ్యాంక్: పావుశాతం రేటు తగ్గించింది. దీనితో ఈ రేటు 9.65 శాతానికి తగ్గింది. 7వ తేదీ నుంచీ తాజా రేటు అమలవుతుంది.
స్టాన్‌చార్ట్: పావుశాతం రేటు తగ్గింది. దీనితో ఈ రేటు 9.5 శాతానికి తగ్గింది. తక్షణం ఈ రేటు అమల్లోకి వచ్చింది.
కార్పొరేషన్ బ్యాంక్: 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 9.7 శాతానికి తగ్గింది. 8వ తేదీ నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుంది.
ఐఐఎఫ్‌సీఎల్: 20 బేసిస్ పాయింట్లు తగ్గింది. దీనితో ఈ రేటు 9.7 శాతానికి దిగింది. తక్షణం ఈ రేటు అమలవుతుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్: రేటు 10 శాతం నుంచి 9.9 శాతానికి తగ్గింది. సెప్టెంబర్ 21 నుంచీ అమలయ్యే విధంగా నిర్ణయం తీసుకుంది. కాగా బీపీసీఎల్ మాత్రం 15 శాతం స్థాయిలోనే కొనసాగనుంది.
ఇప్పటికే పలు బ్యాంకులు...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గత వారం బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను అరశాతం తగ్గించిన నేపథ్యంలో (2015లో మొత్తంగా 1.25 శాతం రెపోరేటు కోత- ప్రస్తుతం 6.75 శాతం) ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించే పనిలో బ్యాంకులు నిమగ్నమయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌సహా పలు బ్యాంకింగ్ దిగ్గజాలు ఇప్పటికే ఈ దిశలో నిర్ణయం తీసుకున్నాయి. కనీస రుణ రేటు తగ్గింపు వల్ల దీనికి అనుసంధానమయ్యే గృహ, వాహన, విద్యా రుణ రేట్ల భారం తగ్గుతుంది.