టూరు పోదామా గురూ..! | Holidays Tour Planning Take care | Sakshi
Sakshi News home page

టూరు పోదామా గురూ..!

Published Sun, Mar 29 2015 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

టూరు పోదామా గురూ..!

టూరు పోదామా గురూ..!

పరీక్షలు అయిపోతున్నాయి. సెలవులు వచ్చేస్తున్నాయి. మరో విద్యా సంవత్సరం మొదలయ్యేలోపు అలా ఓ టూరుకు వెళ్లొచ్చేస్తే పోలా!! ఇదే ఇపుడు చాలామంది ఆలోచన. నిజమే! వేసవికాలం కనుక చల్లటి ప్రదేశాలో, సముద్ర తీర ప్రాంతాలో అయితే బెటర్. అయితే ఒక్క మాట. దేశంలో చల్లటి ప్రాంతాలంటే దక్షిణాదిన ఊటీ, మున్నార్, కూర్గ్, కొడెకైనాల్, మైసూర్ వంటివి ఎంచుకోవచ్చు. ఇక హిమాలయ ప్రాంతాలైతే కశ్మీర్ నుంచి సిమ్లా, మనాలి, డార్జిలింగ్, నైనిటాల్, షిల్లాంగ్ వరకూ చాలా ప్రాంతాలున్నాయి.
 
  కాకపోతే ఒక్క మాట. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈ ప్రదేశాలకు వెళ్లే ఖర్చుతో విదేశాలను కూడా చుట్టేసి రావొచ్చు. అందుబాటులోకి వచ్చిన లోకాస్ట్ విమాన సేవలు, హోటళ్లు, ట్రావెల్ కంపెనీల మధ్య పోటీ కారణంగా మధ్య తరగతి బడ్జెట్‌లోనే విదేశీయాత్ర చేసే అవకాశం లభిస్తోందిప్పుడు. మరి ఆ ప్లానింగ్ ఎలా చేయాలి? ఖర్చు తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలేంటి. టూర్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వీటన్నిటి సమాహారమే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం...
 
 ఎంచుకోవటం ఎలా?
 మొట్టమొదటి అంశం ఎక్కడికెళ్లాలి? అనేదే. దీనికి ప్రధానంగా చూడాల్సిందల్లా మనం ఏ సమయంలో వెళుతున్నాం? మన బడ్జెట్ ఎంత? మనకు అందుబాటులో ఉండే సమయమెంత? ఈ మూడింటి ఆధారంగా ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నవారు ‘ట్రిప్ అడ్వయిజర్’ వంటి వెబ్‌సైట్లలో వెదకొచ్చు. ఇంటర్నెట్ అందుబాటులో లేకున్నా... సెర్చ్ చేసే పరిజ్ఞానం లేకున్నా అలాంటి వారికోసం ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థలైన ‘మేక్ మైట్రిప్’ వంటివి ఆఫ్‌లైన్ ఆఫీసుల్ని కూడా నిర్వహిస్తున్నాయి. వారి దగ్గరికెళ్లి మన బడ్జెట్, సమయం తదితర వివరాలన్నీ చెబితే వారే తగు సూచనలిస్తారు. ఇక ట్రిప్ అడ్వయిజర్ వంటి సైట్లలో ఏ టూర్‌కు వెళ్లాలనేది చూసుకున్నాక... ఆ టూర్‌పై, అక్కడుండే సౌకర్యాలపై అప్పటిదాకా అక్కడికి వెళ్లి వచ్చినవారు చేసే వ్యాఖ్యలు (కామెంట్స్) చూస్తే తేలిగ్గా టూర్‌పై ఒక నిర్ణయం తీసుకోగలుగుతాం.
 
 విమానం టికెట్లు, హోటల్స్...
 ఎక్కడికి వెళ్లాలనేది ఎంచుకున్నాక మొదట చూడాల్సింది విమానం టికెట్లనే. నిజానికి విమానం టికెట్లు చాలా సందర్భాల్లో ఆఫర్లలో అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఆఫర్లు లేనప్పుడైతే ఎంత ముందుగా బుక్ చేసుకుంటే అంత తక్కువ ధరకు లభిస్తాయన్నది కాదనలేని నిజం. అందుకని టూర్‌ను ప్లాన్ చేసుకునేటపుడు ఎంత ముందుగా చేసుకుంటే అంత పొదుపు చేసుకోవచ్చని చెప్పాలి. విమాన టికెట్ల కోసం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసేటపుడు గూగుల్ ఫ్లైట్స్‌తో పాటు ఇక్సిగో, గో ఐబిబో, మేక్ మైట్రిప్, యాత్రా, క్లియర్ ట్రిప్, ట్రావెల్‌గురు వంటి పలు వెబ్‌సైట్లున్నాయి. వీటిద్వారా సెర్చ్ చేసేటపుడు అక్కడుండే ఆప్షన్ల ఆధారంగా అతితక్కువ ధరలు ఉండే రోజుల్లో టికెట్లు కొనుక్కునే వెసులుబాటు కూడా ఉంటుంది. వీటిల్లో విమాన టికెట్లతో పాటు హోటల్ గదులూ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
 
 ఇవి విడివిడిగా బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే విమాన టికెట్లు, హోటల్ గదులు రెండూ కలిపి ఆఫర్లలో లభిస్తాయి. ఈ రెండూ కాదనుకుంటే ఏకంగా ట్రావెల్ ప్యాకేజీల గురించి కూడా ఈ వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. మొత్తమ్మీద మూడింటి గురించీ తెలుసుకుని ఏది మనకు అందుబాటులో ఉందో, ఏదైతే తక్కువ ధరకు లభిస్తోందో, ఏదైతే మనకు అవసరమనిపిస్తుందో అదే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. హోటల్ గదుల్ని బుక్ చేసేటపుడు సదరు హోటల్ గురించి, అక్కడి సిబ్బంది సర్వీసు గురించి, అది ఉండే ప్రాంతం మిగతా ప్రాంతాలకు దగ్గరగా ఉంటుందో... దూరంగా ఉంటుందో... ఇవన్నీ తెలుసుకోవటానికి ఆయా హోటల్స్‌కు సంబంధించి ట్రిప్ అడ్వయిజర్ వంటి వెబ్‌సైట్లలో వినియోగదారులు రాసే కామెంట్లు, సమీక్షలు ఎంతో ఉపకరిస్తాయి. అవన్నీ తెలుసుకున్నాకే బుక్ చేసుకోవటం చాలా మంచిది.
 
 ప్యాకేజీల విషయంలో జాగ్రత్త!
 ఒకవేళ ఏకంగా ప్యాకేజీలనే తీసుకుంటే... మనం చెల్లించే డబ్బుల్లో ఆ ప్యాకేజీలో ఏమేం వస్తాయి? ఏమేం విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది? అనే విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా ప్యాకేజీల్లో అక్కడి టూర్ ప్రాంతాలు కొన్నే కలిపి ఉంటాయి. మిగిలిన ప్రాంతాలు సందర్శించాలంటే వేరే చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు హోటళ్లలో భోజనం వంటి సౌకర్యాలు కూడా ప్యాకేజీలో కలిపి ఉన్నాయో, లేదో చూసుకోవాలి. కేవలం విమాన టికెట్లు, హోటల్ గదులు, ఒకటి రెండ్రోజుల లోకల్ సైట్ సీయింగ్‌ను ప్యాకేజీల్లో పెట్టి అతితక్కువకు విక్రయించే సంస్థలు లేకపోలేదు. అలాంటి ప్యాకేజీల్ని ఎంచుకునేటపుడు మనం అదనంగా ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుందనేదీ ముందే అంచనా వేసుకోవాలి. ఇక విమాన ప్రయాణం చేసేటపుడు ఎంత బ్యాగేజీకి అనుమతిస్తున్నారు? అనేది ముందే తెలుసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. తిరిగి వచ్చేటపుడు అక్కడి షాపింగ్ సామగ్రినీ కలుపుకుని మొత్తం బ్యాగేజీ అంచనా వేసుకోవాలి.
 
 బీమా తప్పనిసరి...
 విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రయాణ బీమా తీసుకోవడం మర్చిపోవద్దు. ఎయిర్ టికెట్లు కొన్నప్పుడు ఇచ్చే ఇన్సూరెన్స్ చాలా మటుకు ఆ విమాన ప్రయాణానికి మాత్రమే పరిమితమవుతుంది. అలా కాకుండా విదేశానికి వెళ్ళి తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చే వరకు వైద్య బీమాతో పాటు ఇతర అన్ని అంశాలకు రక్షణ కల్పించే విధంగా తప్పనిసరిగా బీమా పాలసీ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఎంచుకున్న టూర్ ప్యాకేజీ ఆధారంగా విమానయాన సంస్థ పూర్తి బీమా రక్షణ కల్పిస్తే ఓకే. లేకపోతే తీసుకోవడం మర్చిపోవద్దు. వాతావరణం మారినప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తడం అత్యంత సహజం. విదేశాల్లో అనారోగ్యానికి గురైతే.. అయ్యే వైద్య చికిత్సా వ్యయం సామాన్యులకు అందుబాటులో ఉండదు. అలాగే ఏదైనా దొంగతనం జరిగి నగదు, పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే ఈ బీమా అక్కరకు వస్తుంది. ఈ ట్రావెల్ బీమా ప్రీమియంలు చాలా స్వల్పంగా ఉంటాయి. ప్రీమియం అనేది మీరు పర్యటించే రోజులను బట్టి ఉంటుంది. సాధారణంగా ట్రావెల్ బీమా ప్రీమియంలు రూ. 300 నుంచి ఆరంభమవుతున్నాయి. ఇదీ... అంతర్జాతీయ ప్రయాణాల కథ.
 
     ఢిల్లీకన్నా తక్కువకే కౌలాలంపూర్..
 కేరళలో ఎనిమిది రోజులు కనీసం రూ.16వేలు అవుతుంది. కాస్త లగ్జరీగా గడపాలనుకుంటే రూ.30,000 కావాలి. అదే.. ఊటీ, కొడెకైనాల్, నీలగిరి హిల్స్ ప్రాంతాలను ఆరు రోజుల్లో చుట్టి రావాలంటే రూ.20,000 పైనే అవుతోంది. కానీ ఇంచుమించు ఇంతే ఖర్చుతో లేదా అంతకంటే తక్కువ వ్యయంతోనే మలేసియా, మారిషస్, మాల్దీవులు, సింగపూర్, దుబాయ్, శ్రీలంక వంటి దేశాలు చుట్టేయొచ్చు. ఉదాహరణకు మారిషస్ దేశంలో ఏడు రోజులుండటానికి కనీసం రూ.21,000 అవుతోందంటే  పరిస్థితి తెలియకమానదు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమాన చార్జీలు ఎంత ముందుగా బుక్ చేసుకున్నా.. కనీసం రూ. 4,000-5,000 ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఇంతకంటే తక్కువ ధరలోనే కౌలాలంపూర్‌కు వెళ్లే అవకాశముంది. నేరుగా నలుగురైదుగురు కలిసి ప్లాన్ చేసుకుంటే ట్రావెల్ ఏజెన్సీ ధరకంటే చాల తక్కువ ధరలో ప్రయాణాన్ని ముగించుకొని రావచ్చు.
 
 ఇంటర్నేషనల్ రోమింగ్ లేదా లోకల్ సిమ్..!
 విదేశాలకు వెళ్లాక స్వదేశంలోని బంధుమిత్రులతో ఎలా కమ్యూనికేట్ చేయాలన్నది మరో కీలకమైన అంశం. ఇక్కడ వాడుతున్న సిమ్‌కే ఇంటర్నేషనల్ రోమింగ్ తీసుకోవడమా? లేక అక్కడ స్థానిక సిమ్ తీసుకోవడం ఉత్తమమా? అన్న ప్రశ్నకి సమాధానం మీ పర్యటన రోజులపై ఆధారపడి ఉంటుంది. తరచూ మీరు వ్యాపార, ఉద్యోగ అవకాశాలపై విదేశీ పర్యటనలు చేసేవారు అయితే ఇంటర్నేషనల్ రోమింగ్ తీసుకోవచ్చు. అలా కాకుండా కేవలం విహారం కోసం స్పల్పకాలానికి వెళ్ళేవారికి రోమింగ్ చాలా వ్యయంతో కూడుకున్నది. అలాంటి వారికి కాలింగ్ కార్డ్స్ అందుబాటులోకి వచ్చాయి. దాదాపు అన్ని ప్రముఖ సెల్యులర్ కంపెనీలతో పాటు వీటికోసమే ప్రత్యేకంగా ఏర్పడిన కంపెనీలు సైతం వీటిని అందిస్తున్నాయి. విదేశాలకు వెళ్లాక ఈ కాలింగ్ కార్డ్స్‌ను వినియోగించుకోవడం ద్వారా స్వదేశంలోని వారితో మాట్లాడొచ్చు. వీటి ధరలు రకరకాలుగా ఉంటాయి.
 
 వీటన్నిటితో పోలిస్తే వారం, పది రోజుల పాటు మాత్రమే ఉండేవారికి స్థానికంగా అక్కడి సిమ్ కార్డు తీసుకోవటమనేది చాలా మంచిదని నిపుణుల సూచన. కాలింగ్ కార్డు, ఇంటర్నేషనల్ రోమింగ్ చార్జీలతో పోల్చినపుడు లోకల్ సిమ్ ఛార్జీలే బెటరన్నది వీరి భావన. అయితే పెరిగిన టెక్నాలజీ కారణంగా ఇపుడు వైబర్ వంటి అప్లికేషన్లతో ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. వాట్స్ యాప్‌లో ఉచితంగా ఫొటోలు, ఆడియో-వీడియో ఫైల్స్ కూడా పంపించుకోవచ్చు. మరీ తక్కువ రోజులు టూర్‌కు వెళ్లేవారు కాస్త మంచి హోటళ్లలో దిగితే అక్కడ ఎలాగూ వైఫై ఉచితంగా లభిస్తుంది కనక ఈ కార్డులేవీ కొనకుండానే మేనేజ్ చేసే అవకాశం కూడా ఉంది. మాట్రిక్స్ సెల్యూటర్, క్లే టెలికం వంటి సంస్థలు ఇంటర్నేషనల్ సిమ్ కార్డులను అందిస్తుండగా... విదేశాల్లో కాఫీ షాప్‌లు, హోటళ్లు వంటి పలు ప్రాంతాల్లో ఉచిత ఇంటర్నెట్ లభించే అవకాశం ఉంది.
 
 కరెన్సీకి ఫారెక్స్ కార్డులూ ఉన్నాయ్..
 విదేశీ పర్యటనకు టికెట్లు బుక్ చేసుకున్నాక ఆ దేశానికి నగదును ఎంత తీసుకెళ్లాలి? ఏ రూపంలో తీసుకెళ్లాలి? అనేది ప్రధానమైన సమస్య. విదేశాలకు ప్రధానంగా ఐదు రూపాల్లో అంటే పూర్తిగా నగదుగా, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు రూపాల్లో... ట్రావెలర్స్ చెక్ రూపంలో లేదా ఫారెక్స్ కార్డు రూపంలో కరెన్సీ తీసుకెళ్లొచ్చు. ఈ ఐదింట్లోనూ కొన్ని లాభాలు, కొన్ని భయాలు ఉన్నాయి. వెళుతున్న దేశానికి సంబంధించిన కరెన్సీలోకి మార్చుకెళ్లడం సులువుగానే ఉంటుంది కానీ.. ఇంత మొత్తం నగదు రూపంలో తీసుకెళ్లటమనేది కొంత భయంతో కూడుకున్నదే. ఎందుకంటే అసలే అది మనకు తెలియని వాతావరణం.
 
 ఒకవేళ అనుకోని సంఘటన జరిగి నగదు పోగొట్టుకుంటే అంతే సంగతులు. అందుకని కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎప్పుడూ నగదును పరిమితంగానే తీసుకెళ్లాలి. ఒకవేళ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు , ఫారెక్స్ కార్డు రూపంలో తీసుకెళితే విమానం దిగినప్పటి నుంచి చిన్న మంచినీళ్ళ బాటిల్ తీసుకోవాలన్నా కార్డుపైనే చెల్లిస్తామంటే కష్టమవుతుంది. పెపైచ్చు విదేశాల్లో కొన్ని చోట్ల రోడ్‌సైడ్ మార్కెట్లుంటాయి. వాటిలో గనక ఏమైనా కొంటే కార్డుపై చెల్లించటం కష్టమవుతుంది. అందుకే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులను నమ్మకమైన ప్రదేశాల్లో తప్ప విచ్చలవిడిగా విదేశాల్లో వినియోగించడం శ్రేయస్కరం కాదనేది నిపుణుల సూచన. ట్రావెలర్స్ చెక్కులు కూడా ఈ కార్డుల మాదిరిగానే కొన్ని చోట్ల పనికిరావు. పెపైచ్చు ప్రతిచోటా చిల్లర సమస్య ఉంటుంది.
 
 అందుకని విదేశాలకు వెళ్ళేటప్పుడు కొంత మొత్తం నగదును అమెరికన్ డాలర్ల రూపంలో తీసుకెళ్ళి మిగిలిన మొత్తాన్ని ఫారెక్స్ కార్డు రూపంలో తీసుకెళ్లటం మంచిది. ఎందుకంటే వెళ్లేది ఏ దేశమైనా అమెరికన్ డాలర్లు ఇచ్చి అక్కడి లోకల్ కరెన్సీని తీసుకోవటం చాలా తేలిక. పెపైచ్చు అంతర్జాతీయంగా చాలా దుకాణాల్లో అమెరికన్ డాలర్లు చెల్లించే అవకాశం ఉంటుంది. ఇక ఫారెక్స్ కార్డుల వల్ల బ్రోకరేజీ చాలా తక్కువ పడుతుంది. పెపైచ్చు మనం వినియోగించకుండా మిగిలిపోయిన సొమ్మును తిరిగి స్వదేశానికి రాగానే మన మామూలు ఖాతాలోకి మళ్లించేసుకోవచ్చు. ఒకవేళ క్రెడిట్, డెబిట్ కార్డులు వాడితే ఆయా దేశాల కరెన్సీలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది కనక మన బ్యాంకులు (కార్డు ఇచ్చినవి) కరెన్సీ కన్వర్షన్ చార్జీల్ని వసూలు చేస్తాయి. ఫారెక్స్ కార్డుల్లో లోడ్ చేయించటానికి వసూలు చేసే బ్రోకరేజీ చార్జీల కంటే ఈ కన్వర్షన్ ఛార్జీలు చాలా ఎక్కువన్న సంగతి గుర్తుంచుకోవాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement