నగరమే చిక్కుముడి: సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు
ఏఐసీసీ కార్యదర్శి తిరునావుక్కరసుకు నేతల నివేదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో హైదరాబాదే పెద్దచిక్కుముడి అని, దానికి సరైన పరిష్కారం చూపితే ఇపుడున్న ఆందోళనలు చాలావరకు తగ్గుముఖం పడతాయని పలువురు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్రవ్యవహారాల సహాయ ఇన్‌చార్జి తిరునావుక్కరసుకు సూచించారు. విభజనతో సీమాంధ్రలో తలెత్తిన ఆందోళనలపై రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఉండి పార్టీనేతల నుంచి అభిప్రాయాలు సేకరించిన తిరునావుక్కరసు బుధవారం ఢిల్లీకి వెళ్లారు. తన నివేదికను అధిష్టానానికి అందించనున్నారు. తిరునావుక్కరసును కలిసిన నేతల్లో ఎక్కువమంది ఒకవైపు సమైక్యాంధ్ర వాదాన్ని వివరిస్తూనే విభజన విషయంలో హైదరాబాద్ అంశంపై తలెత్తే అభ్యంతరాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇక్కడి ప్రజల్లో నెలకొన్న భయాలు పోగొట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తిచేశారు.
యూటీ చేస్తే నగర ప్రజలకు నష్టం: జాఫ్రీ
హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేయడంవల్ల ఏ ప్రాంత ప్రజలకూ ఫలితం ఉండదని, ఇలాంటి ప్రతిపాదన సరికాదని ఎంఐఎం నేతలు అభిప్రాయపడుతున్నారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ, విప్ రుద్రరాజు పద్మరాజు, ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీ ఒకరికొకరు ఎదురుపడి దీనిపై మాట్లాడుకున్నారు. హైదరాబాద్‌పై సీమాంధ్ర నేతలు లేవనెత్తుతున్న అభ్యంతరాలు సరైనవి కావని జాఫ్రీ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే అక్కడ సమకూరే ఆదాయం మొత్తం కేంద్రానికే దక్కుతుందని, తద్వారా ఇరుప్రాంతాలూ నష్టపోతాయని చెప్పారు. యూటీగా మారిస్తే ప్రజల సమస్యలు తీర్చేవారు కానీ, వారి హక్కులు పరిరక్షించే వారు కానీ కనిపించరని చెప్పారు. సమైక్యంగా ఉన్న ప్రస్తుత తరుణంలోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో స్థానిక సీమాంధ్రులకు టికెట్లు ఇచ్చేందుకు పార్టీలు వెనుకాడుతున్నాయని పద్మరాజు పేర్కొన్నారు. విభజన జరిగితే సీమాంధ్రులు పోటీచేస్తామన్నా టికెట్లు ఇచ్చేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రాదని, సీమాంధ్ర ప్రజలకు ఇక్కడి చట్టసభల్లో అవకాశం దొరుకుతుందనుకోవడం అత్యాశే అవుతుందని చెప్పారు.