టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభించిన ఐటీ
వారణాశి: త్వరలో జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పరిమితికి మించి ఖర్చు చేసే అభ్యర్థుల గురించి ఫిర్యాదు చేయడానికి ప్రజల కోసం ఆదాయ పన్ను శాఖ టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రారంభించింది. ఎన్నికల సంఘం విధించిన పరిమితి 28 లక్షల రూపాయలకు మించి ఏ అభ్యర్థి అయినా ఖర్చు చేస్తే 1800-1806555 నెంబర్‌కు ఫోన్ చేసి తమకు సమాచారం అందించాలని, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఐటీ శాఖ అదనపు డైరెక్టర్ అభయ్ ఠాకూర్ చెప్పారు. యూపీ ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చుపై నిఘా ఉంచడంతో పాటు అవినీతిని అరికట్టడంలో భాగంగా ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
లక్నోలోని ఐటీ శాఖ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని అభ్యర్థులందరి ఎన్నికల ఖర్చు వివరాలను పర్యవేక్షిస్తారు. ఎన్నికలప్పుడు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేవారిపై నిఘా ఉంచనున్నారు. దీంతో పాటు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. వారణాశి, గోరఖ్‌పూర్, అలహాబాద్ విమానాశ్రయాల్లో నిఘా కోసం ప్రత్యేకంగా ఎయిర్ ఇంటలిజెన్స్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. రైల్వే శాఖ, కస్టమ్స్, రవాణ శాఖల సాయం తీసుకోనున్నారు.