ఇంటర్మీడియెట్‌కూ నిమిషం నిబంధన
- మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు
- ఏర్పాట్లు పూర్తి చేసిన బోర్డు
- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- హాజరుకానున్న 9,76,631 మంది విద్యార్థులు
- ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను మార్చి 1 నుంచి 19 వరకు నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎంసెట్ తరహాలో ఈ పరీక్షల్లోనూ నిమిషం నిబంధనను అమలు చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. బోర్డు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యార్థులను పరీక్ష హాల్లోకి ఉదయం 8 గంటల నుంచే అనుమతిస్తామన్నారు. ప్రతి రోజు పరీక్ష 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,291 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 9,76,631 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు.
హాల్‌టికెట్లు ఇవ్వకపోతే చర్యలు...
ఫీజులు కట్టలేదనో మరే కారణంతోనైనా విద్యార్థులకు హాల్‌టికెట్లను ఇవ్వని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకొంటామని అశోక్ చెప్పారు. ఎస్‌ఎంఎస్ పంపించినా యాజమాన్యాలపై చర్యలు తీసుకొంటామన్నారు. అలాగే తమ వెబ్‌సైట్ నుంచి (bietelangana.cgg.gov.in, tsbie.cgg.gov. in) హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. వాటిపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదన్నారు. ఆదివారం నుంచే హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. హాల్ టికెట్లలో పొరపాట్లు ఉంటే ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి మార్పు చేయించుకోవాలని సూచించారు. జవాబుల బుక్‌లెట్‌లో 24 పేజీలు ఉన్నాయా.. లేదా చూసుకోవాలని, అడిషనల్ షీట్స్ ఇవ్వరని తెలిపారు. కొత్త సిలబస్, పాత సిలబస్‌ను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. మొదటిసారి హాజరయ్యేవారు న్యూ సిలబస్ ప్రశ్నాపత్రంతోనే పరీక్ష రాయాలన్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సు సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు.
సెల్‌ఫోన్లపై జీపీఎస్ నిఘా...
‘పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు కూడా సెల్ ఫోన్లు వినియోగించకూడదు. సెల్ వాడితే చర్యలు తప్పవు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. జీపీఎస్ సహాయంతో పోలీసులు సెల్ ఫోన్ల వినియోగంపై నిఘా పెడతారు. మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు 50 ఫ్లయింగ్, 200 సిట్టింగ్ స్క్వాడ్‌లను పోలీసు, రెవెన్యూ బృందాలతో ఏర్పాటు చేశాం. ఇన్విజిలేషన్ విధుల్లో 26,170 మంది పాల్గొంటారు’అని అశోక్ వెల్లడించారు.
సెంటర్ లొకేటర్ యాప్..
స్మార్ట్ ఫోన్ ద్వారా పరీక్షా కేంద్రాన్ని కనుక్కునేలా బోర్డు చర్యలు చేపట్టింది. విద్యార్థులు తమ మొబైల్‌లో సెంటర్ లొకేటర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేయగానే రూట్ మ్యాప్‌తోపాటు ఎంత సమయంలో అక్కడికి చేరుకోవచ్చన్నది అందులో చూపిస్తుంది. సెంటర్ లొకేటర్ యాప్‌ను సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియంశ్రీహరి ప్రారంభించునున్నారు.
9 నాటి పరీక్ష 19న...
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 9వ తేదీ పరీక్షను 19న నిర్వహిస్తున్నారు. 19న మ్యాథ్స్ పేపరు–2బీ, జువాలజీ పేపరు–2, హిస్టరీ పేపరు–2 పరీక్షలు ఉంటాయి.
ఏప్రిల్ 24న ఫలితాలు...
పరీక్షల మూల్యాకనం మార్చి 8న ప్రారంభం అవుతుంది. ఫలితాలను ఏప్రిల్ 24న విడుదల చేస్తారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వివరాలు...
మొత్తం విద్యార్థులు: 9,76,631
ప్రథమ సంవత్సరం: 4,75,832
ద్వితీయ సంవత్సరం: 5,00,799
24 గంటలు పని చేసే కంట్రోల్‌రూమ్ నెంబర్లు...
ఫోన్: 040–24601010/24732369, ఫ్యాక్స్: 040–24655027