రాజీనామాలకు సోషల్ మీడియా కరెక్టేనా..?
అధికారిక ప్రకటనల దగ్గర్నుంచి.. రాజీనామాలకు వరకు ఏ సమాచారం అందించాలన్న ప్రస్తుతం వేదిక ఒక్కటే.. అది సోషల్ మీడియా. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కంపెనీ అధినేతలు, రాజకీయ నాయకులు వారి రాజీనామాలను ప్రకటిస్తున్నారు. మాజీ టాప్ గేర్ హోస్ట్ క్రిస్ ఎవాన్స్ నుంచి సాప్ట్ బ్యాంకు కార్పొరేషన్ ప్రెసిడెంట్ నికేష్ అరోరా, జస్టిన్ బైబర్, తాజాగా గుజరాత్ సీఎం ఆనందీ బెన్ పటేల్ వారి రాజీనామాలను ఈ మీడియా ద్వారానే ప్రజలకు తెలియజేశారు. అయితే రాజీనామాలను సోషల్ మీడియా ఏ మాత్రం సబబు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇది అనైతిక చర్య అని అభిప్రాయపడుతున్నారు. రాజీనామాకు నిర్ణీతమైన ప్రోటోకాల్ ఉంటుందని, దాని ప్రకారం రాజీనామా చేయాలని మల్టీ నేషనల్ ప్రొఫిషినల్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ పార్టనర్, లీడర్ రాజీవ్ క్రిష్ణన్ అభిప్రాయపడ్డారు. ఎంప్లాయిర్, ఎంప్లాయికి మధ్య ఓ సంబంధం ఉంటుందని, ఆర్గనైజేషన్లో ఎవరికి తెలియజేయకుండా ముందస్తుగా వారి రాజీనామాను సోషల్ మీడియాలో పెట్టడం మోసపూరిత చర్య అని పేర్కొన్నారు. ఈ చర్య సంస్థలో ఇతర ఉద్యోగులను నిరుత్సాహపరుస్తుందని.. నెగిటివ్ అభిప్రాయం పడే అవకాశముంటుందని తెలిపారు.
అయితే వ్యక్తులు తమ అభిప్రాయాలను నిర్భయంగా తెలియజేయడానికి సోషల్ మీడియానే సరియైన ప్లాట్ ఫామ్ అని, వారి ఫీలింగ్స్ ను తెలియజేయడానికి ఇదే సౌకర్యవంతమైనదని డెలాయిట్ ఇండియా సీనియర్ డైరెక్టర్, చీఫ్ టాలెంట్ ఆఫీసర్ ఎస్.వీ నాథన్ తెలిపారు. వారు చెప్పాలనుకున్న విషయం ఎగ్జాట్గా ప్రజలకు చేరవేయడంలో సోషల్ మీడియా ప్రముఖ పాత్ర వహిస్తుందని హెచ్ఆర్ నిపుణులు వెల్లడిస్తున్నారు.