'ఈ సాఫ్ట్వేర్.. ప్రపంచ హార్డ్వేర్ను కదిలిస్తుంది'
బెంగళూరు: ప్రపంచం అనే హార్డ్ వేర్ ను కదిలించగలిగిన సత్తా డిజిటల్ ఇండియా అనే సాఫ్ట్ వేర్ కు ఉందంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన మానసపుత్రికను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంగళవారం బెంగళూరులో జరిగిన ఇండో- జర్మన్ సదస్సులో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ తో కలిసి పాల్గొన్న ఆయన.. డిజిటల్ ఇండియా పథకం తీరుతెన్నులను ఐటీ దిగ్గజాలకు వివరించారు. నాస్కామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో భారత్, జర్మనీకి చెందిన పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు కూడా పల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ గడిచిన 15 నెలల కాలంలో.. వ్యాపారాపానికి అనువైన పరిస్థితుల కల్పన, సులువుగా అనుమతుల మంజూరు తదితర అంశాల్లో మార్పులు తెచ్చామని, భారత్ లోకి పెట్టుబడుల రాకను సులభతరం చేశామన్నారు. మిగతా ప్రపంచంలో విదేశీపెట్టుబడులు క్షీణదశలో ఉండగా భారత్ లో మాత్రం అవి జోరందుకుంటుండటం ఈ దేశంపై, ఇక్కడి ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని తెలియజేస్తున్నదన్నారు. అనంతరం జర్మన్ ఛాన్సలర్ మోర్కెల్ మాట్లాడుతూ జర్మన్ ఇంజనీర్లు, భారత్ ఐటీ నిపుణులు బెంగళూరులో కలిసిపోయిన దృశ్యం అద్భుతమన్నారు. అంతకుముందు మోదీ, మోర్కెల్ లు జర్మన్ ఆటోమోటివ్ సంస్థ బోష్ బెంగళూరు ప్లాంట్ ను సందర్శించారు.