ఆత్మహత్యల్లోనూ మగవాళ్లదే పైచేయి | males dominating even in suicides, says study | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యల్లోనూ మగవాళ్లదే పైచేయి

Published Mon, Jun 22 2015 2:31 PM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

ఆత్మహత్యల్లోనూ మగవాళ్లదే పైచేయి - Sakshi

ఆత్మహత్యల్లోనూ మగవాళ్లదే పైచేయి

ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నా ఇప్పటికీ సమాజంలో పురుషాధిక్యతే కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆత్మహత్యల్లో కూడా పురుషుల ఆధిక్యతే కొనసాగుతోందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 8 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, వారిలో 5 లక్షల మందికిపైగా పురుషులే ఉంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఏటా సరాసరి 13 వేల మంది ఆత్మహత్యలకు పాల్పడుతుండగా అందులో 6 వేల మంది మహిళలు ఉంటున్నారు. భారత్‌ లాంటి దక్షిణాసియా దేశాల్లో మహిళల కన్నా రెట్టింపు సంఖ్యలో పురుషులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మానసిక దౌర్బల్యం, వివిధ రకాల ఒత్తిడులు, పేదరికం లాంటి సామాజిక సమస్యలు, కెరీర్‌లో వెనుకబడిపోతున్నామన్న ఆందోళన, ఇతర సామాజిక సమస్యలను పరిష్కరించుకోవడంలో విఫలమవడం, సెక్స్ హార్మోన్లు తక్కువగా ఉండడం వల్ల ఏర్పడుతున్న ఆత్మన్యూనతా భావం తదితర కారణాల వల్ల ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇప్పటివరకు సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తూ వచ్చారు. ఆడవాళ్ల కన్నా మగవాళ్లే ఎందుకు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే కోణం నుంచి ఏ శాస్త్రవేత్త పెద్దగా అధ్యయనం చేయలేదు. గత 20 ఏళ్లుగా ఆత్మహత్యలపై అధ్యయనం చేస్తున్న లండన్‌లోని 'ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ సూసైడ్ రీసెర్చ్' చేసిన తాజా అధ్యయనంలో 'సోషల్ పర్‌ఫెక్షనిజం' అనే కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

సమాజం దృష్టిలో తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలను నిర్వహిస్తున్నానా, లేదా అన్న కోణంలో ఎప్పుడూ ఆలోచించే ఓ వ్యక్తి, తాను నిజంగా ఆ బాధ్యతలు నిర్వర్తించడం లేదనే ఆత్మన్యూనతా భావానికి గురైనప్పుడు ఆత్మహత్యను ఆశ్రయిస్తాడని ఆ అకాడమీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ రోరీ కార్నర్ తెలిపారు. తనకు దగ్గరగా ఉండే బంధు మిత్రుల దృష్టిలో ఓ కుటుంబ పోషకుడిగా, ఓ అన్నగా, ఓ తండ్రిగా, ఓ ఉద్యోగిగా అంచనాల మేరకు సరైన బాధ్యత పోషించకపోతే పలు రకాల మానసిక ఒత్తిళ్లకు లోనై ఆత్మహత్య దిశగా ఎక్కువగా ఆలోచిస్తాడని ఆయన వివరించారు. కొంత మంది కెరీర్‌లో ఓటమిని జీర్ణించుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారని చెప్పారు. రోరీ కార్నర్ అధ్యయనాన్ని పరిగణనలోకి తీసుకున్న ఇతర సామాజిక సాస్త్రవేత్తలు ఆడవాళ్లలో 'సోషల్ పర్‌ఫెక్షనిజం' తక్కువగా ఉంటోందని అభిప్రాయపడ్డారు.

పురుషులతోపాటు మహిళలకు సమాన హక్కులు కల్సిస్తున్న పాశ్చాత్య దేశాల్లో కూడా మగవాడే కుటుంబ పెద్దగా ఆధిపత్యం చెలాయించేందుకు చూస్తున్నారని వారు అంటున్నారు. అంటే పురుషాధిక్య సమాజం మూలాలు అక్కడ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోలేదన్నమాట. ప్రపంచంలో ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటున్న దేశాల్లో దక్షిణ కొరియా ముందుండగా, బ్రిటన్ ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఒకప్పుడు మొదటి స్థానంలో ఉన్న చైనాలో ఇప్పుడు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అత్యధిక గంటలు పనిచేస్తున్న కార్మికులు, అవినీతి కేసుల్లో దొరికిపోయిన పారిశ్రామికవేత్తలే ఇప్పుడు చైనాలో ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారట. అవినేతి కేసుల్లో నేరం రుజువైతే ఆ దేశంలో మరణశిక్ష విధిస్తారు. ఆత్మహత్యకు పాల్పడితే కుటుంబ సభ్యులపై ఎలాంటి కేసు ఉండదు. తప్పించుకునేందుకు మరో మార్గం ఎటూ ఉండదు గనుక కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ఆత్మహత్య చేసుకోవడమే శ్రేయస్కరమని వారి భావిస్తున్నారని సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement