మైక్రోసాఫ్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా తాజాగా మహిళల భద్రత కోసం ఉపయోగపడేలా గార్డియన్ పేరిట స్మార్ట్‌ఫోన్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇది విండోస్ ఫోన్‌లపై పనిచేస్తుందని గురువారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో కంపెనీ ఎండీ (ఐటీ విభాగం) రాజ్ బియానీ తెలిపారు. ఎప్పుడైనా మహిళలు క్లిష్టమైన పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు ఈ యాప్ ద్వారా తమ సన్నిహితుల ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్‌కి సమాచారం చేరవేసి, సహాయం అందుకోవచ్చని వివరించారు.
ఇందులోని ఎస్‌వోఎస్ అలర్ట్ బటన్‌ను నొక్కితే యూజర్ ఉన్న ప్రదేశం గురించి సమీపంలోని పోలీస్‌స్టేషన్లు, ఆస్పత్రులకు కూడా యాప్ ద్వారా సమాచారం చేరుతుంది. ఇది ఆన్‌లైన్లోనే కాకుండా ఎస్‌ఎంఎస్‌ల రూపంలో ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుందని బియానీ తెలిపారు. నిర్భయ ఉదంతం అనంతరం తమ సంస్థ ఉద్యోగుల బృందం ఆరు నెలల పాటు శ్రమించి దీన్ని రూపొందించారని, ఈ యాప్‌కి మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసుల తోడ్పాటు ఉంటుందని వివరించారు.