న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నూతన భూ సేకరణ చట్టం కొత్త ఏడాది తొలి రోజు నుంచి అమల్లోకి వచ్చింది. 1894 నాటి చట్టం స్థానంలో తీసుకువచ్చిన ఈ సరికొత్త భూసేకరణ చట్టంతో భూములు కోల్పోయే రైతులు, గిరిజనులు సహా భూములు కోల్పోయే వారికి పూర్తిస్థాయిలో పరిహారం, పునరావాసం అందుతాయని, ఆయా విషయాల్లో ప్రభుత్వాలు పూర్తిస్థాయి పారదర్శకతను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ బుధవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు.
దేశంలోని పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు తమకు అవసరమైన భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసుకోవడంలో ఈ చట్టం అడ్డంకి కాబోదని జైరాం వెల్లడించారు. ఈ చట్టం ప్రకారం ప్రైవేటు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాలు భూసేకరణ చేపట్టవని, ప్రజావసరాల కోసం నిర్మించే ప్రైవేట్ ప్రాజెక్టులకు జరిపే భూసేకరణకు 80 శాతం, పీపీపీ పద్ధతిలోని వాటికి 70 శాతం ప్రజామోదం తప్పనిసరన్నారు.