బ్యాంకులకు కొత్త 500 నోట్లు వచ్చేశాయి!
-
ఏపీలో కొనసాగిన నోట్ల కష్టాలు..
అమరావతి: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్లుగా నగదు సరఫరా లేకపోవడంతో బుధవారం కూడా ప్రజలు ఇబ్బందులు కొనసాగాయి. పరిమితులకు లోబడి ఖాతాదారులు అడిగిన సొమ్మును సైతం బ్యాంకులు ఇవ్వలేకపోతున్నాయి. అడిగిన దాంట్లో మూడోవంతు మాత్రమే సర్దుతున్నాయి. రూ. పదివేలు అడిగితే మూడువేలకు మించి ఇవ్వలేని పరిస్థితి. కొన్ని బ్యాంకుల్లో అయితే ముందుగా టోకెన్లు మంజూరు చేస్తున్నారు. ఇప్పుడు టోకెన్లు తీసుకొని రెండు రోజుల తర్వాత నగదు తీసుకోవడానికి రమ్మంటుండటంతో ఖాతాదారుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి.
అయితే, కొత్త నోట్లకు అనుగుణంగా 50 శాతానికిపైగా ఏటీఎంలను మార్పుచేసి.. అందుబాటులోకి తీసుకోవడంతో అక్కడ రద్దీ కొంతతగ్గింది. చాలా ఏటీఎంల నుంచి కేవలం రెండు వేల నోట్లు వస్తుండటంతో వాటిని తీసుకోవడానికి జనం ఆసక్తి చూపడం లేదు. దీంతో ఏటీఎంల వద్ద రద్దీ కనిపించడం లేదని చెప్తున్నారు.
ఆర్బీఐ నుంచి అదనపు నిధులు
ఆర్‌బీఐ నుంచి అదనపు నిధులు వచ్చాయని, వాటిని బుధవారం బ్యాంకులకు సరఫరా చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్‌లోని ఆంధ్రాబ్యాంక్‌కు రూ. 60 కోట్లతోపాటు, రూ. 20 కోట్ల విలువైన 500 నోట్లు వచ్చాయి. బ్యాంకుకు కోటి రూపాయల చొప్పున రూ.500 నోట్లు పంపిణీ చేసినట్లు ఆంధ్రాబ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. నగదు చేరడంతో గురువారం నుంచి నగదు కొరత కొంతమేర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.