కేసీఆర్‌కు ఓయూ గౌరవ డాక్టరేట్..?
హైదరాబాద్: త్వరలోనే శతాబ్ధి ఉత్సవాలు జరుపుకోనున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు వర్సిటీ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. యూనివర్సిటీ ఏర్పడి 100 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు అది కొద్ది మందికి మాత్రమే (20లోపే) గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేశారు. భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ లు ఈ పురస్కారాన్ని పొందినవారిలో ఉన్నారు. చివరిగా 2001లో అమెరికన్ లాబరేటరీ నిర్వహకుడు అరుణ్ నేత్రవళికి ఉస్మానియా డాక్టరేట్ దక్కింది. గత 15 ఏళ్లుగా ఏ ఒక్కరికీ ఆ విశిష్ట పురస్కారం లభించలేదు.
వచ్చే ఏడు జరిగే ఓయూ శతాబ్ది ఉత్సవాల నిర్వహణలో భాగంగా ప్రత్యేక స్నాతకోత్సవాన్ని నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ రధసారధి, తొలి సీఎం కేసీఆర్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందించాలని ఓయూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేసీఆర్ కూడా ఇదే యూనివర్సిటీ విద్యార్థి కావడం విశేషం. ఆర్ట్స్ కాలేజీలోనే ఆయన ఎంఏ(లిటరేచర్) పూర్తిచేశారు. తెలంగాణ కోసం 60 సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమంలో కీలకమైన చివరి 10 సంవత్సరాల్లో ప్రత్యేక రాష్ట్ర భావజాలన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, శాంతియుత విధానంలో ప్రజాస్వామ్యయుతంగా స్వరాష్ట్రాన్ని సాధించినందుకుగానూ కేసీఆర్ కు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సిఉంది.