మోడల్ సాహసం చూస్తే కళ్లు తిరగాల్సిందే
మోడల్ సాహసం చూస్తే కళ్లు తిరగాల్సిందే
Published Fri, Feb 17 2017 2:00 PM | Last Updated on Sat, Sep 29 2018 5:41 PM
ప్రపంచంలోనే ఎత్తయిన భవనం ఏదంటే వెంటనే బుర్జ్ దుబాయ్ అని చెబుతాం. దుబాయ్‌లో ఇంత కాకపోయినా ఇలాంటి భవనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. సరిగ్గా అలాంటి ఓ ఎత్తయిన భవనం వద్ద రష్యన్ మోడల్ చేసిన సాహసం కళ్లు తిరిగేలా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఫేమస్ అయిన వికీ ఓడింట్కోవా అనే ఈ మోడల్.. దుబాయ్‌లోని ఓ ఆకాశహర్మ్యం ఎక్కింది. అక్కడ పై అంతస్తు వద్ద ఓ వ్యక్తిని ఇవతల నిలబెట్టి, కేవలం అతడి చెయ్యి మాత్రమే పట్టుకుని గాల్లో వేలాడింది. ఏమాత్రం పట్టు తప్పినా వెయ్యి అడుగుల కిందకు పడి తల వంద ముక్కలు కావాల్సిందే. 70 అంతస్థులకు పైగా ఉన్న అలాంటి భవనం ఎక్కి మామూలుగా కిటికీలోంచి కిందకు చూస్తేనే మనకు కళ్లు తిరుగుతాయి.
అలాంటిది ఈ మోడల్ ఏకంగా కిటికీలోంచి బయట గాల్లోకి వేలాడిందంటే.. చెప్పాలా! ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో కూడా తీసి దాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమెకు అక్కడ 32 లక్షల మంది ఫాలోవర్లున్నారు. ఈ వీడియోకు ఇప్పటికి 99 వేలకు పైగా లైకులు వచ్చాయి. అయితే, ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి సాహసం చేస్తావా అని కొంతమంది తిట్టి పోసినా, ఆమె మాత్రం ఇలాంటివి చేస్తూనే ఉంటానంటోంది. ఆమె చేతిని అంత గట్టిగా పట్టుకున్న మొనగాడు ఎవరా అని చూస్తున్నారా.. అది దర్శకుడు అలెగ్జాండర్ టిఖొమిరోవ్. ఆయన కిటికీ మీద నిలబడి, అమ్మడి చేతిని చాలా జాగ్రత్తగా పట్టుకున్నారు. ఒక్క చేత్తోనే ఆమె బరువును మోసి, తర్వాత మళ్లీ పైకి లాగేశారు. ఈ వీడియోను ఇప్పటికి 4.2 లక్షల మంది చూశారు. ఇంతకుముందు కూడా ఒడింట్కోవా తాను చేసిన సినిమాలకు సంబంధించిన బిహైండ్ ద సీన్స్ వీడియోలు షేర్ చేసింది.
Advertisement
Advertisement