ఉగ్రవాదులు అనుకొని 33 మందిని చంపారు!
బీరుట్: సిరియాలో మరోసారి అమాయకులు బలయ్యారు. ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో భాగంగా సిరియా బలగాలతో కలసి పాల్గొంటున్న అమెరికా సైనిక విమానం జరిపిన బాంబు దాడిలో 33 మంది అమాయక పౌరులు ప్రాణాలుకోల్పోయారు. ఉగ్రవాదులు అని భ్రమపడి ఓ మూతబడిన పాఠశాలపై అమెరికా యుద్ధ విమానం బాంబు వేయడంతో ఈ దారుణం జరిగింది. వీరంతా బాంబు దాడుల కారణంగా తమ తమ సొంత ప్రదేశాలను విడిచిపెట్టి వచ్చినవారే.
సిరియా పౌర హక్కుల సంస్థ ఈ విషయం తెలిపింది. రఖ్ఖా ప్రావిన్సులో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఇదిలా ఉంటే ఆఫ్రికా దేశం నైజీరియాలో దారుణం చోటు చేసుకుంది. శరణార్థుల క్యాంపులపై ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఉగ్రవాదుల తాకిడిని తట్టుకోలేక నైజీరియాకు ఈశాన్య దిక్కున ఉన్న మైదుగురి ప్రాంతంలోకి వలస వెళ్లి గుడారాల్లో తలదాచుకుంటున్నవారిపై ఆత్మాహుతి దాడి జరిగింది. బుధవారం వేకువ జామున వరుసగా నాలుగు ఆత్మాహుతి దాడులు సంభవించాయి.