నేతల అవినీతికి కారణం.. సెక్స్ హార్మోనే!
బెర్న్: పురుషుల్లో సెక్స్ వాంఛను ప్రేరేపించే ‘టెస్టోస్టెరాన్’ హార్మోన్ ఎక్కువగా ఉన్న రాజకీయ నేతల్లో అవినీతి ఎక్కువగా ఉంటుందట. ఈ విషయం స్విడ్జర్లాండ్‌లోని లాసన్నే విశ్వవిద్యాలయం నిపుణులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. మానవుల్లో వృషణాలు టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయనే విషయం తెల్సిందే. ‘అధికారం అవినీతికి దారి తీస్తుంది. తిరుగులేని అధికారం అంతులేని అవినీతికి ఆస్కారమిస్తుంది’ అని చెప్పిన ఇంగ్లీష్ క్యాథలిక్ హిస్టారియన్, బ్రిటన్ పార్లమెంట్‌లో లేబర్ పార్టీ ఎంపీగా పని చేసిన రాజకీయవేత్త, రచయిత సర్ జాన్ డాల్‌బెర్గ్-యాక్షన్.... కొటేషన్‌లో వాస్తవాలను తెలుసుకునేందుకు లాసెన్నే విశ్వ విద్యాలయానికి చెందిన ప్రోఫెసర్ జాన్ ఆంటోనకిస్ నాయకత్వంలోని నిపుణుల బృందం జరిపిన తాజా అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
వ్యవస్థీకృత మానవ ప్రవర్తనపై ఇప్పటికే పలు అధ్యయనాలు జరిపిన జాన్ ఆంటోనకిస్ తన తాజా అధ్యయనం కోసం 718 మంది బిజినస్ విద్యార్థులను ఎంపిక చేసుకున్నారు. వారిపై ‘ది డిక్టేటర్ గేమ్’గా పిలిచే సామాజిక ప్రయోగాన్ని నిర్వహించారు. ముందుగా 718 విద్యార్థులపై ప్రవర్తన, వారికి సామాజిక విలువల పట్ల ఉన్న విశ్వాసానికి సంబంధించిన పర్సనాలిటీ పరీక్షలను నిర్వహించడంతోపాటు వారిలోని ‘టెస్టోస్టెరాన్’ హార్మోన్ స్థాయిని రికార్డు చేశారు. ఆ తార్వత వారిని రెండు గ్రూపులుగా విభజించి రెండు రకాల ‘డిక్టేటర్ గేమ్’ను ఆడించారు. విద్యార్థుల్లో ఉన్న నాయకత్వ లక్షణాలను బట్టి వారిలో కొందరిని నాయకులుగా, మరి కొందరిని వారి అనుచరులుగా విభజించారు. నాయకులుగా ఎంపిక చేసిన వారికి కొంత సొమ్మును అప్పగించి తమ ఇష్టానుసారం తమ గ్రూపు సభ్యులకు పంచాల్సిందిగా నిపుణుల బృందం ఆదేశించింది. ఆశ్యర్యకరంగా.. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నవారు తాము ఎక్కువ సొమ్మును తమ వద్దే ఉంచుకొని, మిగతా సొమ్మును ఇతరులకు పంచారు. ఇక్కడే మరో ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. టెస్టోస్టెరాన్ స్థాయి ఎక్కువగా ఉన్న నాయకులు ఎక్కువ సొమ్మును తమ వద్ద ఉంచుకున్నారు.
గేమ్ ఫలితాలను లోతుగా అధ్యయనం చేసిన ప్రొఫెసర్ జాన్ బృందం సెక్స్ హార్మోన్ ఎక్కువగా ఉన్న నాయకులు అవినీతికి ఎక్కువ పాల్పడతారని తేల్చింది. నీతి నిజాయితీలకు కట్టుబడిన ప్రవర్తన కలిగిన విద్యార్థి నాయకులు కూడా అవినీతిని ఆశ్రయించారని ఈ అధ్యయనంలో తేలింది. అలాగే నాయకత్వ లక్షణాలు తక్కువగా ఉండి, అధికారంపై మక్కువ లేనివారిలో ఎక్కువ మంది తాము నమ్ముకున్న సామాజిక విలువలకే కట్టుబడి ఉన్నారని కూడా ఈ అధ్యయనం తేల్చింది. ‘అధికారంలో ఉన్నవారు అవినీతిని ఆశ్రయించడానికి ఎంత ఆస్కారముందో, ఆవినీతిపరులు అధికారాన్ని ఆశించేందుకు అంతే ఆస్కారం ఉంది. పిశాచులకు రక్తం ఎంత ప్రీతిపాత్రమో నాయకులకు అధికారం అంత ప్రీతిపాత్రమైనది’ అని అధ్యయన వివరాలు వెల్లడించిన ప్రొఫెసర్ జాన్ ఆంటోనకిస్ వ్యాఖ్యానించారు.