ఒక జంట.. నాలుగు పెళ్లిళ్లు!
నాలుగుసార్లు పెళ్లి చేసుకున్న ప్రేమికులు
న్యూఢిల్లీ: ‘ప్రతీ మతంలోనూ ప్రేమ ఉంది. కానీ ప్రేమకు ఏ మతం లేదు’ ఈ సూత్రాన్ని నమ్మిన హర్యానాలోని హిస్సార్‌కు చెందిన ఫైజ్ రెహమాన్, అంకిత అగర్వాల్‌లు కాలేజీలో తొలిచూపులోనే ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులకు చెందిన వీరిద్దరు పెళ్లి చేసుకోవడాన్ని కుటుంబ పెద్దలు అంగీకరించలేదు. విడిపోదామని నిర్ణయించుకున్నారు. విడిచి ఒకరునొకరు దూరంగా ఉండలేకపోయారు. కలిసే జీవితాన్ని సాగిద్దామనుకున్నారు. అందుకు పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. రెండేళ్ల ప్రేమాయణం అనంతరం ఒక పెళ్లికే అంగీకరించని తల్లిదండ్రులను ఒప్పించి ఏకంగా నాలుగుసార్లు పెళ్లిళ్లు చేసుకున్నారు.
అంకిత అగర్వాల్ తల్లిదండ్రులకు పట్టింపులు ఎక్కువ. ముస్లిం యువకులు నాలుగుసార్లు పెళ్లి చేసుకునేందుకు వారి మతం అంగీకరిస్తుంది కనుక రెహమాన్ ఎక్కువకాలం తమ కూతురుతో కాపురం చేయకపోవచ్చని, కూతురిని వదిలిపెట్టి లేదా పక్కన పెట్టి మరిన్ని పెళ్లిళ్లు చేసుకోవచ్చని అంకిత తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తమ కూతురిని ముస్లిం మతంలోకి మారుస్తారని కూడా కలవరపడ్డారు. వారి ఆందోళనను అర్థం చేసుకున్న ఫైజ్ రెహమాన్, మరో స్త్రీని పెళ్లి చేసుకోకుండా ఉండేందుకు అంకితనే నాలుగుసార్లు పెళ్లి చేసుకున్నారు.
ప్రేమికులు మొదటిసారి గత ఫిబ్రవరి 17వ తేదీన స్థానిక మహాలక్ష్మీ ఆలయంలోని రామమందిరంలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. ఎందుకైనా మంచిదని ముస్లిం యువకులు నాలుగుసార్లు పెళ్లి చేసుకోవడాన్ని అనుమతించని ప్రత్యేక వివాహ చట్టం కింద రెండోసారి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం మూడోసారి పెళ్లి చేసుకున్నారు. నాలుగోసారి బంధు మిత్రులతోని కలసి గోవా వెళ్లి అక్కడ ముస్లిం మతసంప్రదాయం ప్రకారం నిఖా చేసుకున్నారు.
ప్రస్తుతానికి దంపతులిద్దరు తమ కుటుంబ పెద్దలతో కలసి చల్లగా కాపురం చేసుకుంటున్నారు. ముస్లిం పండుగలకు అంకిత దంపతులు అత్తింట్లో గడిపితే హిందూ పండుగలకు పుట్టింట్లో చేసుకుంటున్నారు. అంకిత మాంసం తినదు. మతం కూడా మారలేదు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె గుళ్లూ గోపురాలకు వెళుతోంది. ఫైజ్ మసీదుకెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు.