నేడు ఏపీ బంద్
ప్రత్యేక హోదా డిమాండ్‌పై వైఎస్సార్‌సీపీ పిలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన గాయం మానకముందే... ప్రత్యేక ప్యాకేజీ పేరుతో మభ్యపెట్టాలని చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ... ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని నినదిస్తూ... నేడు రాష్ట్రం స్తంభించనుంది. ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపునకు సర్వత్రా ఆమోదం లభిస్తోంది. వామపక్ష పార్టీలు, వివిధ విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు ఈ బంద్‌నకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరులపై ప్రజల్లోనూ తీవ్ర అసంతృప్తి, నిరాశ నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగ యువకుల్లో రోజురోజుకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. భవిష్యత్‌పై ఆశలు కానరాకపోవడంతో ఇప్పటికే ఒకరు గుండె పగిలి మరణించగా, ముగ్గురు బలిదానం చేశారు. మరో ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన రాష్ట్రబంద్ పిలుపునకు భారీ మద్దతు లభిస్తోంది.
ప్రత్యేక హోదా కోసం బలిదానాలు వద్దు, పోరాటమే ముద్దంటూ... బంద్‌ను విజయవంతం చేయడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. విభజన చేసిన గాయం ప్రత్యేక హోదాతో మానుతుందని ఆంధ్రులు భావించారు. ప్రత్యేక హోదా ఇస్తే భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆశించారు. కానీ 15 నెలలుగా వివిధ ప్రకటనలతో మభ్యపెట్టిన కేంద్ర ప్రభుత్వం చివరకు ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్రకటించడం, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయలేక ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలంటూ అంగీకరించడం ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని గాయపరిచాయి.
ప్రత్యేకహోదా రాకుంటే ఉద్యోగావకాశాలు రావన్న ఆందోళనతో నిరుద్యోగ యువత.. తల్లితండ్రులు ఆందోళనతో రగిలిపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గు చూపడంపై పారిశ్రామికవేత్తలు పెద విరుస్తున్నారు. పారిశ్రామికవేత్తలను కీలుబొమ్మలుగా చేసి ఆడిస్తూ.. భారీ ఎత్తున ముడుపులు దండుకోవాలన్న ఎత్తుగడతోనే ప్రత్యేక ప్యాకేజీకి సీఎం చంద్రబాబు మొగ్గు చూపారని ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తుండటం గమనార్హం. ఇది ఆంధ్రులను మరింత క్షోభకు గురి చేస్తోంది.
సొంత లాభం కోసం.. ఐదు కోట్ల మంది భవితను పణంగా పెట్టడంపై ఆంధ్రులు మండిపడుతున్నారు. అందుకే శనివారం రాష్ర్టబంద్‌ను విజయవంతం చేసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తమ ఆకాంక్షను బలంగా వినిపించాలని ఉద్యమిస్తున్నారు.
బంద్‌ను జయప్రదం చేయండి
* పార్టీ శ్రేణులకు, ప్రజలకు వామపక్షాల పిలుపు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. బంద్‌ను జయప్రదం చేసి రాష్ట్ర ప్రజలు తమ ఆకాంక్షను వ్యక్తీకరించాలని విజ్ఞప్తి చేశాయి. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బంద్‌కు సహకరించాలని కోరాయి. బంద్ విజయవంతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రయోజనాన్ని ఆకాంక్షించి జరిగే ఈ బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు పాలకపక్షం యత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీపీఐ, సీపీఎం, ఆర్‌ఎస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్ శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో హెచ్చరించాయి.
వైఎస్సార్‌సీపీ బంద్ సక్సెస్ కాకూడదు
* పోలీసులకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన, ఇతర పక్షాలు మద్దతు పలికిన శనివారం నాటి బంద్ విజయవంతం కాకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం వ్యూహరచన చేసింది. దీని కోసం వీలున్నంత వరకూ పోలీసులను రంగంలోకి దింపుతోంది.
బంద్ విఫలమయ్యేలా అన్ని కోణాల్లోనూ ప్రయత్నాలు చేయాల్సిందిగా పోలీసు విభాగానికి మౌఖికాదేశాలు జారీ చేసింది. జిల్లా ఎస్పీలతో పాటు కమిషనర్లకూ ఆ మేరకు సూచనలు అందాయని తెలిసింది. ఎక్కడైనా ఈ బంద్ విజయవంతమైతే స్థానిక అధికారులతో పాటు ఉన్నతాధికారుల్నీ బాధ్యులుగా చేస్తామంటూ ప్రభుత్వం హెచ్చరించినట్లు సమాచారం.