భర్త డ్రైవర్.. ఆమెకు లగ్జరీ కార్లు, భవంతి
జోధ్పూర్: ఆమె చూడటానికి సాధారణ గృహిణిలా కనిపిస్తుంది. విలాసవంతమైన భవంతిలో ఉంటూ.. లగ్జరీ కార్లలో తిరుగుతుంటుంది. ఆమె లేదా ఆమె భర్త సంపన్నులేమీ కాదు. భర్త కారు డ్రైవర్ కాగా, ఆమె రాజస్థాన్లో అతిపెద్ద నల్లమందు రాకెట్ నడుపుతోంది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశాక విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. సునీతగా పరిచయమైన సుమితా బిష్ణోయ్ (31) నేరగాథ ఇది.
రాజస్థాన్ పోలీసులు రెండు రోజులు క్రితం నల్లమందు స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించగా, సునీత వ్యవహారం వెలుగుచూసింది. సునీత ఆదేశాల మేరకు తాము నల్లమందును స్మగ్లింగ్ చేస్తుంటామని నిందితులు విచారణలో చెప్పారు. పోలీసులు జోధ్పూర్లో సునీతకు చెందిన విలాసవంతమైన నాలుగు అంతస్తుల భవంతిపై దాడి చేశారు. ఆమె ఇంట్లో నుంచి 76 గ్రాముల నల్లమందును స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు పలు లగ్జరీ కార్లు ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు ఆమెతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసి ఇంటిని సీజ్ చేశారు.
ఆరేళ్ల క్రితం ఆమె భర్తతో కలసి జోధ్పూర్కు వచ్చినట్టు పోలీసులు చెప్పారు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన సునీత ఉపాధి కోసం కర్ణాటకకు వెళ్లగా, ఆమెకు లిక్కర్, డ్రగ్ స్మగ్లర్ రాజూరామ్ ఇక్రమ్తో పరిచయమైంది. రాజూరామ్ ఆమెను స్మగ్లింగ్ ప్రపంచంలోకి పరిచయం చేశాడు. ఏడాది క్రితం రాజూరామ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయ్యాక సునీత నాయకత్వ బాధ్యతలు చేపట్టింది. ఆమె ఇంటి నుంచే పర్యవేక్షిస్తూ అనుచరులతో స్మగ్లింగ్ చేయించేది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించేది. ఇందులో కుటుంబ సభ్యులను కూడా భాగస్వాములను చేసింది. చివరకు కటకటాలపాలైంది.