మోళ్ల తొలగింపు ఇలా..! | the removal of trees molla | Sakshi
Sakshi News home page

మోళ్ల తొలగింపు ఇలా..!

Published Sun, Sep 28 2014 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM

మోళ్ల తొలగింపు ఇలా..!

మోళ్ల తొలగింపు ఇలా..!

చెట్ల మోళ్లను ఖర్చు, శ్రమ లేకుండా తొలగించుకోవచ్చు
మానులపై చేసిన రంధ్రాల్లో ఎప్సమ్‌సాల్ట్ నింపాలి
ఆ రంధ్రాల్లో ఈఎంఓలు లేదా లాక్టోబ్యారియా కలిపిన నీటిని పోస్తే మానులు కుళ్లిపోతా
యి

బంజరు నేలను సాగుకు అనుకూలంగా మార్చుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. నేలను చదును చేయడం ఒకెత్తయితే అంతకు ముందే పెరిగిన మాన్లు మాకులు నరికి వేసినప్పుడు వాటి మొట్లు, మొదళ్లు తీయడం చాలా పెద్ద పనవుతుంది. కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తరాల నాటి కొబ్బరి తోటలు దిగుబడులు ఇవ్వని పరిస్థితిలో చెట్లను నరికివేస్తున్నారు. కోసిన మాన్లను కొంతమంది వ్యాపారులు తృణమో ఫణమో ఇచ్చి తీసుకుపోతున్నా మిగిలిన మొదళ్లు తొలగించాలంటే యంత్రాలను ఉపయోగించాల్సిందే. ఇందుకు భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. సాధారణ రైతుకు ఇది వ్యయభారం. స్వయంగా ఈ పని చేసుకుందామనుకుంటే గొడ్డళ్లు, గడ్డపారల (గునపాల)తో రోజుల తరబడి శ్రమించాల్సి వస్తుంది. అదే సహజ విధానంలో మొదళ్లు తొలిగించే పద్ధతి అందుబాటులో ఉంటే? అంతకంటే అదృష్టమా? అనే మాట ప్రతి రైతు నోటి నుంచి వస్తుంది. నిజమే.. కొద్దిపాటి ప్రయత్నంతో మొట్లు తొలిగించుకోగలిగితే రైతుకు ఎంతో ఊరటగా ఉంటుంది.

ఇందుకు రెండు పద్ధతులున్నాయి. మొదటిది మొట్లు బాగా ఎండిన తరువాత చెత్తా చెదారం వేసి అగ్గిపెట్టడం. నిప్పు అడుగుకంటా కాలిపోతుంది. దీని వలన మొదలు కాలిపోవడంతోపాటు నేల గుల్ల బారుతుంది. బూడిద నేలలో కలిసిపోతుంది. దీని వలన నేల సారవంతమౌతుంది. జేసీబీ యంత్రాలకు చెల్లించాల్సిన వేలాది రూపా యలకు బదులు కేవలం స్వల్ప ఖర్చుతోనే పని పూర్తవుతుంది.
 
ఇక రెండో పద్ధతికి వస్తే.. నేలకు హాని కలిగించని రసాయనాలను ఉపయోగించి మొదళ్లను తీసివేయడం. ‘ఎప్సం సాల్ట్’ బాగా ఉపయోగపడుతుంది. దీని వలన నేలకు ఎలాంటి హానీ జరగగకపోగా మరింత సారవంతమౌతుంది.

ఎప్సమ్ సాల్ట్ ఎందుకు?
మెగ్నీషియం సల్ఫేట్‌నే ఎప్సమ్ సాల్ట్ అని పిలుస్తారు. దీనికి నీటిని గ్రహించే గుణం ఉంది.  చెట్లు నరికినా.. కొన్ని రకాల చెట్ల వేరు వ్యవస్థ సజీవంగానే ఉండి.. తిరిగి కొత్త చిగుళ్లు వస్తాయి.   వేరు వ్యవస్థ ఆహారం సేకరించి మానుకు అందించడం వలన తిరిగి చిగుళ్లు వస్తాయి. నీటి సరఫరా అవకుండా నిరోధించ గలిగితే పోషకాలు లభించడం స్తంభించిక నిర్జీవమై పోతుంది. నీటిని గ్రహించే గుణం ఉండడం వలన ఎప్సమ్ సాల్ట్ ఈ పనిని విజయవంతంగా చేయగలుగుతుంది. దీన్ని మానుపైన వేసినప్పుడు అందులో మిగిలి ఉన్న నీటిని పూర్తిగా పీల్చేస్తుంది. దీని వలన ఎండిపోయిన వేరు వ్యవస్థ చనిపోతుంది.
 
నీటిని గ్రహించే గుణం కలిగిన ఇతర రసాయనాలు అనేకం ఉన్నాయి.  రాక్ సాల్ట్, క్యాస్టిక్ సోడా, క్యాల్షియం క్లోరైడ్, జింక్ క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం హైడ్రా క్సైయిడ్ వంటి రసాయనాలు కూడా ఇందుకు ఉపయోగపడగలవు. అయితే ఈ రసాయ నాలను వాడడం వలన నేల ఉప్పుదేరి పోయే ప్రమాదం ఉంది.
    
మొద్దును తొలగించిన స్థలంలో నాటిన ఇతర మొక్కల ఎదుగుదలకు ఆటంకం కలుగుతుంది. మార్కెట్‌లో మాను మోడులను తొలగించేందుకు పొటాషియం నైట్రేట్‌తో తయారు చేసిన రసాయ నాలను వాడుతున్నారు. వీటిని వాడటం వలన మాను మొదలు కుళ్లిపోయి తొలగిం చడానికి అనువుగా మారుతుంది. అయితే ఇది వేరు వ్యవస్థ సజీవంగా ఉన్న చెట్ల మోడులను చంపలేదు. అదే ఎప్సమ్ సాల్ట్‌ను వాడడం వలన మాను చనిపోవడంతో పాటు నేలకు మెగ్నీషియం, గంధకం అందుతాయి. ఇవి మొక్కల్లో పత్రహరితం పెరగడానికి ఉపయోగ పడతాయనే సంగతి వ్యవసాయ రంగంలో అనుభవజ్ఞులందరికీ తెలిసిందే.
 
ఎప్సమ్ సాల్ట్‌ను వాడే విధానం
తొలగించదలచుకున్న మానులో అంగుళం మందంలో మూడు అంగుళాల లోతు వరకు రంధ్రాలు చేయాలి. మాను వైశాల్యాన్ని బట్టి  రంధ్రాల సంఖ్యను ఎంచుకోవాలి. మరీ పెద్ద మానయితే 8 అంగుళాల వరకు రంధ్రాలు వేసుకోవాలి. ఇందులో 100 శాతం స్వచ్ఛమైన ఎప్సమ్ సాల్ట్‌ను వేసి, దానిలో కొద్దిగా నీరు (పదార్థం తడిచేంత మేరకు మాత్రమే) పోయండి. ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ మాను కణజాలంలోకి చొచ్చుకు పోయి అందులోని తేమను పూర్తిగా లాగేస్తుంది.

దీంతో పోషకాల సరఫరా నిలిచిపోయి.. జీవశక్తి హరించు కుపోతుంది. ఆయా కాలాలను బట్టి.. భారీ మాను మొదళ్లు చనిపోవడానికి నెల నుంచి రెండు నెలల వరకు పడుతుంది. పని తొందరగా పూర్తవడానికి.. మూడు వారాలకు ఒకసారి ఎప్సమ్ సాల్ట్‌ను రంధ్రాల్లో వేసుకోవచ్చు. మాను మొదలు చనిపోయిన తరువాత.. తొందరగా తొలగించాలంటే   తగులబెట్టాలి. లేదా ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ (ఈఎంవోలు), లాక్టో బ్యాక్టీరి యాను కలిపిన నీటిని ఇవే రంధ్రాల్లో పోస్తే సూక్ష్మజీవులు కర్రను పూర్తిగా కుళ్లబెడతాయి. తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుంది.  పర్యావరణానికి హాని జరగదు.

- జిట్టా బాల్‌రెడ్డి, సాగుబడి డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement