ఐఏఓసీ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
టెనెస్సీ: భారతీయ సాంప్రదాయాల గొప్పదనమే వేరంటోంది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కూకెవిల్లే(ఐఏఓసీ). గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. అక్టోబర్ 29న టెనెస్సీ టెక్నలాజికల్ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, కమ్యునిటీ సభ్యులు దివాళీ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.
కేవలం భారతీయులే కాకుండా వివిధ దేశాలకు చెందిన వారు పాల్గొన్న ఈ ఉత్సవాలను భారతీయ సాంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టెక్ యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ భరత్ సోని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఐఏఓసీ ఫ్యాకల్టీ అడ్వైజర్ వాణి గడ్డం మాట్లాడుతూ.. భారతీయులు తమ సంస్కృతి, సాంప్రదాయాలను స్థానిక కమ్యునిటీ సభ్యులతో పంచుకోవడానకి దివాళీ ఉత్సవాలు తోడ్పడతాయన్నారు.