Devotion
-
శ్రీ సేవాలాల్ మహారాజ్ ఎవరు.. గిరిజనులకు ఆరాధ్యుడు ఎలా అయ్యారు?
ఆయన భారత గిరిజన ప్రజలకు ఆరాధ్య దైవం. లంబాడీలను అహింసావాదంవైపు నడిపించిన దార్శనికుడు. బ్రహ్మచర్య నిష్టను ఆచరించి ఎంతో మంది గిరిజనులను ఆకర్షించిన వ్యక్తి. ఆయనే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ (sant shri sevalal maharaj). 17వ శతాబ్దంలో అవతరించిన ఆయన, గిరిజనులకు ఆరాధ్య దైవమయ్యారు. నేడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను సేవాలాల్ బంజార సంఘం (Banjara Community) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు సెలవుదినంగా ప్రకటించాలని గిరిజనులు (Tribals) కోరుతున్నారు.గిరిజన రాజుగా..అసలు శ్రీ సేవాలాల్ మహారాజ్ ఎవరు..? ఆయనకు మూడు దశాబ్దాలుగా గిరిజనుల్లో ఇంత ఆదరణ ఎందుకు ఉంది? ఆయన రాజా? లేక దార్శనికుడా? లేక ఆధ్యాత్మిక గురువా? అనేది చాలా మందిని తొలుస్తున్న ప్రశ్న. తెలంగాణలో గిరిజనులు ఆరాధించే ఆధ్యాత్మిక గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న ఏపీలోని అనంతపురం జిల్లాలో గుత్తి సమీపంలోని ఓ మారుమూల తండాలో జన్మించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన అప్పట్లోనే దేశమంతటా తిరిగి లంబాడీ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అందుకే ఆయన వారికి ఆరాధ్య దేవుడయ్యాడు. రాజపుత్ర సంతతికి చెందిన గిరిజన జాతుల్లో లంబాడీ జాతికి చెందిన దంపతులకు జన్మించడం వల్ల ఆయనను సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్‌గా, గిరిజన రాజుగా, లంబాడీ గురువుగా కొలుస్తారు. అప్పట్లోనే నిజాం రాజులకు ఎదురొడ్డి నిలిచిన ఘనత సేవాలాల్ మహారాజ్ది. కఠోర నిష్ట సేవాలాల్ మహారాజ్ పూజా విధానం చాలా కఠినతరంగా ఉంటుంది. సేవాలాల్ గుడిని దర్శించిన భక్తులందరూ ఉదయం, సాయంత్రం కలుసుకోవాల్సి ఉంటుంది. బలన్బోగ్ మరియు బేలన్బోగ్ అనే ఆధ్యాత్మిక సాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ సమయంలో భగవంతునికి నివేదించి ధర్మబోధన చేస్తారు. ప్రతీ బంజార యువకుడు కనీసం జీవిత కాలంలో ఒక్క సారైనా బంజార సేవాలాల్ గుడిని దర్శించాలని విశ్వసిస్తుంటారు. చదవండి: కామాఖ్య దర్శనం.. చిరస్మరణీయంఅనంతపురం (Anantapur) గుత్తి సమీపంలోని ఓ గిరిజన తండాలో భీమానాయక్, ధర్మిణి దంపతులకు జన్మించిన రమావత్ సేవాలాల్ క్రమక్రమంగా దార్శనికుడిగా, అహింసావాదిగా పేరు సంపాదించారు. తర్వాత కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో ఆయనకు గిరిజనులు ఆలయాన్ని నిర్మించారు. సేవాలాల్ మహారాజ్ జన్మించిన ఊరును ప్రస్తుతం పురితండాగా పిలుస్తున్నారు.సంత్ శ్రీ సేవాలాల్ మార్గాన్ని ఆచరించాలి గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ చూపించిన మార్గాన్ని రాష్ట్రంలోనే కాకుండా, దేశంలోని ప్రతి గిరిజనుడు ఆచరించాల్సిన అవసరం ఉంది. ఆయన ఆదర్శాలను ప్రచారం చేస్తూ, జయంతి ఉత్సవాలకు రాష్ట్రంలోని ప్రతి గిరిజనుడు జరుపుకోవాలి. – రమావత్ చిరంజీవి, అంగడిపేట జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి గిరిజనులు ఎంతో భక్తితో జరుపుకునే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతోపాటు, జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. – రమావత్ శ్రీనునాయక్, సేవాలాల్ బంజార సంఘం నాయకుడు, గుడిపల్లి మండలం -
కూతురి పెళ్లి... పెరుమాళ్ కోసం...!
అది తమిళనాడు రాష్ట్రం, రామేశ్వరం దగ్గరున్న ఓ చిన్న పల్లెటూరు. అక్కడ పెయింటింగ్ ని జీవనోపాధిగా చేసుకుని జీవించే ఓ పెయింటర్ ఉండేవాడు. అతడికి పెళ్ళి కావాల్సిన కూతురు ఉండేది. బి.ఏ., డిగ్రీ మాత్రమే చదివిన ఆ అమ్మాయి అందం కూడా అంతంత మాత్రమే. అయినా పెద్ద మొత్తాల్లో జీతం తీస్తున్న ఇంజినీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పెళ్ళి చేసుకుంటామని ముందుకు వచ్చారు. పెళ్ళి కూతురు, ఆమె తల్లి వచ్చిన సంబంధాల పట్ల ఆసక్తి ప్రదర్శించినా పెయింటర్ ఒప్పుకోలేదు. ‘‘వయసైతోంది, మీరు బిడ్డకి పెళ్ళి చేయాలని ఉన్నారా, లేదా?’’ అని భర్తని గట్టిగా అడిగింది పెయింటర్ భార్య. అతడు నవ్వి ఊరకున్నాడు. వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి పంపించేస్తున్నాడన్న విషయం తెలిసి బంధువులు అతడిని తిట్టిపోశారు. అయినా అతడు పట్టించుకోలేదు. చివరికి మిత్రుల ద్వారా తిరుపతి నుంచి ఓ సంబంధం వచ్చింది. పెళ్ళికుమారుడు చిన్న వ్యాపారి. ఆదాయం అంతంత మాత్రమే. అయినా దానికి వెంటనే అంగీకరించాడు పెయింటర్. ఆశ్చర్యపోయారు పెయింటర్ కుటుంబ సభ్యులు.‘ఇక్కడ పెళ్ళికుమారులు దొరక్కనా, పది గంటలకు పైగా ప్రయాణ దూరమున్న తిరుపతి సంబంధం చేసుకుంటున్నాడు’ అని బంధువులు ముక్కు మీద వేలు వేసుకున్నారు. పెయింటర్ ఎవ్వరి మాటలకీ స్పందించ లేదు. పెళ్ళి పనుల్లో పడ్డాడు. పెళ్ళి కూడా తిరుపతిలోనే పెట్టుకున్నారు. పెళ్ళిరోజు రానే వచ్చింది. అమ్మగారి ఇంటినుంచి వెళ్ళిపోతున్నామనే బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ పెళ్ళికూతురు తండ్రిని ఇలా అడిగింది.‘‘నాన్నా... మన రామేశ్వరం పక్కనే ఎన్నో మంచిమంచి సంబంధాలు వచ్చాయి. వాటికి నువ్వు ఒప్పుకోలేదు. రాష్ట్రం కాని రాష్ట్రం. పరిచయం లేని ప్రాంతం, దూరాభారం. తెలియని భాష. అయినా ఈ కొత్త సంబంధానికి సుముఖత చూపావు, కారణమేమి?’’ అని. ఎదురుగా కనిపిస్తున్న శేషాచలం కొండల్ని చూపిస్తూ ఇలా చెప్పాడు అతడు– ‘‘ఏడాదికి ఒక్కసారైనా, పెరుమాళ్ ని చూడాలని ఉంటుంది నాకు. అయితే... నోట్లోకి నాలుగేళ్ళు పోయే సంపాదన నాది. ఆ సంపాన కోసమే నా సమయమంతా సరిపోయేది. ఉన్న ఊరు వదిలేదానికి కుదిరేది కాదు. స్వామి వారి దర్శనభాగ్యం వాయిదాలు పడేది. కూతురైన నువ్వు తిరుపతిలో ఉంటే నిన్ను చూడాలని అనిపించినప్పుడల్లా తిరుపతి వస్తాము. అలాగైనా అపుడప్పుడూ స్వామి దర్శన భాగ్యం చేసుకోవచ్చని నా ఆశ. అందుకే ఈ సంబంధం ఒప్పుకున్నాను’’అని. తండ్రికి స్వామివారి పట్ల ఉన్న భక్తికి ఆశ్చర్యపోయింది పెళ్ళికూతురు. అక్కడే ఉన్న బంధుమిత్రులందరూ శేషాచలం కొండల వైపు తిరిగి గోవిందలు పలికారు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
సీతారామచంద్ర స్వామికి కాసుల పంట
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామి వారికి కాసుల పంట పండింది. ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం దేవాదాయ శాఖ, దేవస్థాన అధికారుల సమక్షాన చిత్రకూట మండపంలో లెక్కించారు. ఈ సందర్భంగా 36 రోజులకు రూ.1,13,23,178 ఆదాయం నమోదైంది. ఇవికాక 0.109 గ్రాముల బంగారం (Gold), 0.895 గ్రాముల వెండితో పాటు యూఎస్, సింగపూర్, ఆస్ట్రేలియా, యూఏఈ దేశాల కరెన్సీ వచ్చిందని ఈవో రమాదేవి తెలిపారు. జనవరిలో స్వామి వారి అధ్యయనోత్సవాలు, ఉత్తర ద్వారదర్శనం, తెప్పోత్సవం, సంక్రాంతి (Sankranti) సెలవులు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు రావడం వల్ల కూడా ఆదాయం పెరిగిందని భావిస్తున్నారు. నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణంభద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.పూర్వగిరిలో బ్రహ్మోత్సవాలు నేటి నుంచియాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఆలయాన్ని రంగులతో తీర్చిదిద్దారు. శ్రీస్వామి వారు ఊరేగే వాహన సేవలను, ఆలయంలో యాగశాలను సైతం సిద్ధం చేశారు. ఈనెల 7వ తేదీ (శుక్రవారం) నుంచి.. ఈ నెల 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఏడు రోజులు మొక్కు పూజలు రద్దు చేస్తున్నట్లు ఈవో భాస్కర్‌రావు వెల్లడించారు. పూర్వగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు శుక్రవారం ముగిశాయి.కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో మహాకుంభాభిషేకం సంప్రోక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నా యి. ఈ మేరకు దేవస్థానంలో దేవాదా యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆలయం, గోపురాల పైకి ఎక్కి కలశాలకు సంప్రోక్షణ జరిపేందుకు పరంజాలతో మెట్ల మార్గం నిర్మించారు. ప్రధాన ఆలయంతోపాటు గోపురాలకు తుని తపోవనం పీఠా ధిపతి సచ్చిదానందసరస్వతితో కుంభాభిషేకం నిర్వహించనున్నారు. మూడు రోజు లు భక్తులకు ఉచిత ప్రసాదం, అన్నదానం నిర్వహిస్తారని ఈవో మహేశ్ తెలిపారు. చదవండి: పవిత్రం... ఫలప్రదం భీష్మ ఏకాదశి -
ఆత్మసాక్షాత్కారం అంటే..?
ఆత్మసాక్షాత్కారం మానవుని జన్మహక్కు అంటారు శ్రీ మాతాజీ. మనలోని కుండలినీ శక్తియే మన తల్లి. ఆమె మన అన్ని జన్మలలోను మనతోనే ఉంటూ, జాగృతి చెందే సదవకాశం కోసం ఎదురు చూస్తూ వస్తున్నది. స్త్రీలు, పురుషులు, పిల్లలు, అన్ని వర్ణాల, జాతుల వారు, ఎవరైనా సహజయోగ సాధన చేసుకోవచ్చును. ఆత్మసాక్షాత్కార అనుభూతి పొందవచ్చును. దీనికి కావలసింది ఆత్మసాక్షాత్కారం పొందాలనే శుద్ధమైన కోరిక మాత్రమే. అన్ని మతాలలోను, జ్ఞానమూర్తులు, అవతార పురుషులు సహజ యోగం గురించే బోధించారు. ఆత్మసాక్షాత్కారం ద్వారా పొందే ఆధ్యాత్మిక జీవనమే గొప్పదని చెప్పారు. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి?పూర్వంలోలా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి ఏ అడవులకో, హిమాలయాలకో వెళ్ళనవసరం లేకుండానే తమ, తమ సంసారిక బాధ్యతలు, సాంఘిక పరమైన విధులు నిర్వర్తిస్తూనే ఆత్మసాక్షాత్కారం పొందే ప్రక్రియను మాతాజీ కనుగొన్నారు.ఆత్మసాక్షాత్కారం పొందాలి అనే శుద్ధ ఇచ్ఛాశక్తి మనకు కలిగినప్పుడు నిద్రాణ స్థితిలో ఉన్న కుండలినీ శక్తి జాగృతమై కేంద్ర నాడీ వ్యవస్థ ద్వారా ఊర్ధ్వముఖంగా పయనించి, శిరస్సునందు గల సహస్రార చక్రాన్ని ఛేదించి, పరమ చైతన్య శక్తితో అనుసంధానం జరగటం వలన అనంతమైన దైవశక్తులన్నీ అనుభవంలోకి వచ్చి, తద్వారా మనకున్న అజ్ఞానం తొలగి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానిగా... బ్రహ్మజ్ఞానిగా మార టమే ఆత్మసాక్షాత్కార పరమార్ధం.ఆత్మసాక్షాత్కారం అనేది ఒక అంధ విశ్వాసం, మూఢ నమ్మకమూ కానే కాదు. అనుభవ స్థిరమైనది, స్వయం అనుభూతి కలిగినటువంటిది. మాతాజీ ఫోటో ముందు కూర్చుని, నిస్సంకోచంగా హృదయపూర్వకంగా శుద్ధ ఇచ్ఛాశక్తితో ధ్యానం చేసినా ఈ అనుభూతి సహస్రార చక్రంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు అప్రయత్నంగా ఆలోచనలు నిలిచి΄ోతాయి. ఈ స్థితిని ‘నిర్విచారస్థితి’ అంటారు. ఈ స్థితిలో మన అరచేతులలో గానీ, మాడు పైనగాని, చల్లని వాయుతరంగాల అనుభూతి కలుగుతుంది. ఇది మీలోనే సంభవించు ‘ఆత్మసాక్షాత్కార’ అనుభవం, అనుభూతి.శ్రీకృష్ణుడు, అర్జునునికి చేసిన గీతోపదేశంలో ‘యోగక్షేమం వహామ్యహం’ అన్నాడు. భగవంతుని యందు ఎల్లప్పుడూ ధ్యాన స్థితిలో నిమగ్నమై ఉన్న వారి యోగ క్షేమాలు తానే వహిస్తానని, యోగం ద్వారా భగవంతుని చేరినప్పుడే ఈ క్షేమం కలుగుతుందని బోధించిన విషయం మనందరికీ తెలిసినదే. ఇటువంటి యోగం అంటే ఆ సర్వవ్యాప్త భగవంతుని శక్తితో కలయిక ఈ సహజ యోగం ద్వారా సిద్ధిస్తుంది. శ్రీ లలితా సహస్రనామావళిలో పొందుపరచిన మంత్రాల సారాంశం కుండలిని జాగృతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందగోరటమే. సాధారణంగా మనం ఎల్లప్పుడూ గతానికి సబంధించిన లేక భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన విషయాలను ఆలోచిస్తూ ఉండటం వల్ల, శారీరకంగానూ, మానసికంగానూ సమతుల్యత లోపించటం వలన సదా మానసిక ఒత్తిడికి, శ్రమకు గురవుతూ ఉంటాం. అయితే సహజయోగలో కుండలినీ జాగృతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు మనల్ని ఎల్లప్పుడూ వర్తమానంలో ఉంచడం వల్ల మనం సమతుల్యతలో ఉండటం జరుగుతుంది. ఈ స్థితిని పొందటాన్ని ‘ఆధ్యాత్మిక పరివర్తన’ అని చెప్పవచ్చును.– డాక్టర్ పి. రాకేష్ (శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రసంగాల ఆధారంగా) (చదవండి: పవిత్రం... ఫలప్రదం భీష్మ ఏకాదశి..!) -
కోపాన్ని దిగమింగినవాడే సిసలైన శూరుడు
కోపం మానవుల ఆగర్భ శతృవు. అది అనేక అనర్ధాలకు హేతువు. కోపం అభివృధ్ధి నిరోధకం. కోపంలో మనిషి తనపై తాను అదుపును కోల్పోతాడు. కోపంలో మనిషి దుర్భాషలాడతాడు. కొట్లాటకు దిగుతాడు. భార్యా బిడ్డలపై చేయి చేసుకుంటాడు. అసభ్య పదజాలం ప్రయోగిస్తాడు. చిన్నాపెద్దా వయోభేదాన్ని కూడా పాటించడు. కోపంలో మనిషి ఎవరి మాటా వినే పరిస్థితిలో ఉండడు. హత్యలు చేయవచ్చు. ఆత్మహత్యకూ పాల్పడవచ్చు. కోపస్థితిలో సరైన నిర్ణయం తీసుకోలేడు. క్షణికావేశానికి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. రెప్పపాటులో చేసే ఆ చిన్న తప్పువల్ల జీవిత కాలానికి సరిపడా చేదు అనుభవాలు మిగిలినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.అసలు ఒకటనేమిటి? నేడు సమాజంలో జరుగుతున్న అనేక అనర్ధాలకు కోపమే కారణమంటే అతిశయోక్తికాదు. మరి ఈ కోపమనే శత్రువును పారద్రోలాలంటే ఏం చెయ్యాలి? దీనికి దైవప్రవక్త ముహమ్మద్ (స) ఒక ఉపాయం చెప్పారు. కోపం వచ్చినప్పుడు నియంత్రించుకోవాలంటే, మనిషి తాను ఉన్నచోటునుండి పక్కకు జరగాలి. అంటే ఆ చోటును వదిలేయాలి. నిలబడి ఉంటే కూర్చోవాలి. కూర్చొని ఉంటే పడుకోవాలి. ఇలా చేయడంవల్ల కోపం అదుపులోకొస్తుంది. అంతకూ ఇంకా కోపం తగ్గకపోతే, వజూ చేయాలి. అంటే నియమబద్ధంగా చేతులూ, ముఖమూ, కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే, ఆగ్రహం షైతాన్ ప్రేరణ వల్ల కలుగుతుంది. షైతాన్ సృజన అగ్నితో జరిగింది. అగ్ని నీటితో ఆరుతుంది. కనుక షైతాన్ ప్రేరణతో కలిగిన ఆగ్రహం చల్లారాలంటే నీటిని ఉపయోగించాలి. వజూచేయాలి. ఇలాచేస్తే తప్పకుండా కోపం మటుమాయమవుతుంది.వాస్తవానికి, కోపం రావడమన్నది మానవ సహజమే. మానవమాత్రులెవరూ దీనికి అతీతులు కాదు. కాని కోపంలో విచక్షణ కోల్పోకపోవడమే గొప్పతనం. కోపానికి లోనై జుట్టుపీక్కోవడం, చిర్రుబుర్రు లాడడం, అయిందానికీ, కానిదానికి ఎవరిపైబడితే వారిపై విరుచుకుపడడం, చేతిలో ఏముంటే అది విసిరి కొట్టడం, నోటికొచ్చినంత మాట్లాడడం, బూతులు లంకించుకోవడం ఇవన్నీ ఉన్మాదపు చేష్టలు. మానవ ఔన్యత్యానికి ఏ మాత్రం శోభించని లక్షణాలు. అసలు ఏకోశానా ఇది వీరత్వమూకాదు, ధీరత్వమూకాదు. మానవత్వమూ కాదు. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ (స)’కుస్తీలో ప్రత్యర్ధిని మట్టికరిపించే వాడు వీరుడు కాదు. తనకు కోపం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోకుండా నిగ్రహించుకున్నవాడే అసలైన వీరుడు, శూరుడు’.అన్నారు.ఇదీ చదవండి: Damerla Ramarao అద్వితీయ చిత్రకళా తపస్వికనుక, కోపం మానవ సహజమే అయినప్పటికీ, దానిపై అదుపుకలిగిఉండాలి. విచక్షణ కోల్పోయి ఉన్మాదిగా ప్రవర్తించకూడదు. తాను కోపగించుకొని, కస్సుబుస్సులాడి ఏం సాధించగలనని ఆలోచించ గలగాలి. అందరికంటే బలవంతుడు దైవం ఉన్నాడని, ఏదో ఒకరోజు ఆయన ముందు హాజరు కావలసిందేనని, ఆయన అందరి మనోస్థితులూ తెలిసిన సర్వజ్ఞాని అని తెలుసుకొని, విచక్షణాజ్ఞానంతో మసలుకుంటే ఎటువంటి అనర్ధాలూ ఉండవు. కోపానికి దూరంగా ఉంటే జీవితమంతా సంతోషమే. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
పవిత్రం... ఫలప్రదం భీష్మ ఏకాదశి..!
కురుక్షేత్ర యుద్ధ సమయంలో నిలువెల్లా గాయపడిన భీష్ముడు అంపశయ్య మీద ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన అనంతరం స్వచ్ఛంద మరణమనే వరం తో విష్ణుసాయుజ్యాన్ని పొందుతాడు భీష్ముడు. ఆయన భక్తికి మెచ్చిన కృష్ణపరమాత్మ అష్టమి మొదలుకొని ద్వాదశి వరకు గల ఐదు రోజులూ భీష్మపంచకంగా ప్రసిద్ధికెక్కుతాయనీ, ముఖ్యంగా భీష్ముని మరణానంతరం వచ్చిన ఏకాదశి భీష్మ ఏకాదశిగా... పరమ పవిత్రమైన రోజుగా ప్రసిద్ధికెక్కుతుందని వరమిచ్చాడు. ఈ భీష్మ ఏకాదశికే జయ ఏకాదశి అని కూడా పేరు. ఎందుకంటే ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. ఈరోజున శ్రీ మహావిష్ణువును భీష్ముడు బోధించిన విష్ణు సహస్ర నామాలతో పూజించిన పాండడవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి.. అటువంటి విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో విశిష్టమైంది. ఇక ఈ భీష్మ ఏకాదశినాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం.తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణ వదిలితే సంతాన్రపాప్తి కలుగుతుందని, సంతానం ఉన్న వారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయని విశ్వాసం. భీష్ముడు ప్రవచించిన ‘విష్ణుసహస్రనామస్తోత్రం’ ఇప్పటికీ జనుల నోట నర్తిస్తూనే వుంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే వుంది. విష్ణుసహస్రనామ పఠనం సర్వదుఃఖహరం, సకల శుభకరం. ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే. ప్రతినామమూ మహామంత్రమే. అది అజరామరం. భీష్మ ఏకాదశిన అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి కళ్యాణం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో, సింహాచలం నరసింహ స్వామి ఆలయంలో, యాదగిరి గుట్ట, భద్రాచాలం సీతారాముల వారి ఆలయంలో ప్రత్యేకపూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ రోజు చేసే ఉపవాసం అత్యంత ఫలదాయకమని, ఈ రోజున తలపెట్టిన కార్యక్రమాలు జయప్రదం అవుతాయనీ పెద్దలు చెబుతారు.ఈవేళ ఇవి నిషిద్ధం..మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ, కాయధాన్యాలు వంటి వాటికీ దూరంగా ఉండాలి.ఉపవాస దీక్ష చేపట్టాలి.ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి.ఏకాదశి రోజున.. ఇంటిని శుభ్రం చేసుకోకుడదు. ఎందుకంటే చీమలు, పురుగులు వంటివి చంపే అవకాశం ఉంటుంది.తెల్లవారు జామునే నిద్ర లేవాలి.. మధ్యాన్నం కునుకు తీయకూడదు.ఉపవాసం చేసిన వారు భగవంతుడి కీర్తనలు చేస్తూ.. రాత్రంతా జాగారం చేయాలి.జుట్టు కత్తిరించకూడదు.ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు.విష్ణు సహస్రనామాలు, భగవద్గీతను పఠించడం మంచిది.పేదవారికి, ఆకలి అన్నవారికి ఈ రోజు అన్నం పెట్టడం పుణ్యప్రదం. ఈవేళ ఇలా చేయాలిపూజకు విష్ణుమూర్తి పటాన్ని పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళాలు, జాజిమాలతో అలంకరించాలి. విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు లేదా విష్ణు పురాణం పఠించాలి. లేదంటే కనీసం’’ఓం నమోనారాయణాయ’’ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి. దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహ్మోత్సవ దర్శనం, లక్ష తులసిపూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు.భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజామందిరాన్ని, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలి. అభ్యంగ స్నానం చేసి.. పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి జాగారం చేయాలి. దీని నియమాలు దశమి సాయంత్రం నుంచి మొదలై ద్వాదశి వరకు అనుసరించ వలసి ఉంటుంది. --డి.వి.ఆర్(చదవండి: మానవ ఐవీఎఫ్ సాయంతో కంగారూ పిండాలు..!) -
సమస్య, పరిష్కారాలు : సంస్కారాలు
గతాన్ని విడిచిపెడుతూ, ఎప్పటికప్పుడు పునరుత్తేజాన్నిపొందుతూ శిశిర రుతువులో ఒక్క ఆకు కూడా లేనటువంటి చెట్లు వసంత రుతువులో ఆకుపచ్చని ఆకులతో నిండిఉంటాయి. ఎందుకు? ఎందుకంటే ప్రాణంలేని ఆకులన్నీ రాలి పోయి, తిరిగి ప్రాణశక్తిని పొంది కొత్త ఆకులతో చెట్లు నిగనిగ లాడతాయి.మన సంస్కారాలు కూడా మనల్ని గతంలోనికి తోసి వేస్తాయి లేక భవిష్యత్తు లోనికి లాక్కెళతాయి. పర్యవసానంగా మనం మన కళ్లెదుట ఉన్న వర్తమానాన్ని కోల్పోతున్నాం. మన చంచలమైన మనస్సును స్థిర పరచాలి. దీనిని లోపలికి మళ్ళించుట (అనగా అంతర్ముఖత్వం గావించుట)ను అభ్యసించాలి. గతంలో సంభవించిన వాటిని లేక భవిష్యత్తులో సంభవించనున్న వాటిని పట్టుకొని మనస్సు ఊగిసలాడకూడదు. జీవితం దాని మార్గంలో అది నడుస్తూ ఉంటుంది. వర్తమాన కాలంలో ఏం జరుగనున్నదో దానికి సాక్షీభూతుడుగా ఉండాలి. ఇదీ చదవండి: Damerla Ramarao అద్వితీయ చిత్రకళా తపస్విమనస్సు నుండి అనేక కోరికలు పుడతాయి. అటువంటి వానిలో కొన్ని మనం ఏ ప్రయత్నం చేయకుండానే పూర్తవుతాయి. అందువలన మనం సంతోషాన్ని పొందుతాం. మరికొన్ని కోరికలు మనం ఎంతగా ప్రయత్నం చేసినా పూర్తి కావు. కోరికలు ఫలించని పరిస్థితిలో... నా కోరికలు ఏ విధంగా నెరవేరతాయి? ఏ కోరికలు నెరవేరతాయో అటువంటి కోరికలనే నేను కోరుకోవాలా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే ఈ రెండింటికి సమాధానాలు మన దగ్గర లేవు.మనస్సు వస్తువులతో అంటిపెట్టుకొని ఉండటం వలన కోరికలు జనిస్తాయి. కోరికలు నెరవేరినా, నెరవేరకున్నా వాటిని గూర్చి మనస్సులో ఎక్కువ ఆలోచనలు కలుగుతాయి. ఎవరైతే ఇటువంటి పరిస్థితిలో చిక్కుకుంటారో అటువంటివారి విధిని ఊబిలో చిక్కిన మనిషితో పోల్చవచ్చు. ఈ విధంగా చిక్కుకున్నప్పుడు పరిష్కారం ఎక్కడ లభిస్తుంది?మనస్సును నెమ్మదిగా, క్రమంగా ఆలోచనారహిత స్థితికి తీసుకొని రావాలి. అందుకోసం సాధకుడు తన సాధనల ద్వారా ఆలోచనల వలన కలిగే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ఆధ్యాత్మిక లక్ష్యంపైననే మనస్సును కేంద్రీకరింప చేయాలి. దేవుని (గురువు) అనుగ్రహం వలన సాధకుడు కాస్త ముందుగానో లేక ఆలస్యంగానో తన సాధన ఫలితాలను పొందగలడు. -
పని చెయ్యడమే!
సూఫీ సాధువులలో అత్యంత ప్రముఖులు ఇబ్రహీం. ఆయన జీవనశైలి నిరాడంబరమైనది. ఇబ్రహీం నిశ్చలమైన ధ్యానం ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు. ఆయన కుటుంబం అరబ్ మూలాలతో కూడినది. ఇప్పటి అఫ్గానిస్తాన్‌లోని బాల్ఖ్‌లో జన్మించారు. కొంతమంది చరిత్రకారుల ప్రకారం, ఆయన 2వ రషీద్ ఖలీఫా ఉమర్ మాతృ వంశానికి చెందినవారు. సన్యాసిగా మారడానికి సింహాసనాన్ని విడిచి పెట్టారు. తన జీవితంలో పాక్షికంగాసంచార జీవనం గడిపారు. ఆయన భిక్షా టనను అసహ్యించుకున్నారు. జీవనో పాధి కోసం అవిశ్రాంతంగా పని చేశారు. ఒకానొకమారు ఇబ్రహీం ఓ ధనవంతుడిని కలుసు కున్నారు. అతడు ఆయన జ్ఞాని అని తెలియక తోటమాలిగా నియమించాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ ధనవంతుడి ఇంటికి కొందరు స్నేహితులు వచ్చారు. అందరూ కలిసి తోటలోకి ప్రవేశించారు. ఇబ్రహీంను చూసి తమకు తినడానికి మంచి మామిడిపళ్ళు కావాలని అడిగారు. సరే నని ఇబ్రహీం పండ్లు కోసిచ్చారు. వాటిని తిన్న మిత్రులు పుల్లగా ఉన్నాయని ధనవంతుడితో అన్నారు. అప్పుడు ధనవంతుడు ఇబ్రహీంను పిలిచి ‘ఏమిటీ పళ్ళన్నీ పుల్లగా ఉన్నాయంటున్నారు... చాలా కాలంగా తోటలో పని చేస్తు న్నావు. ఏ పండ్లు పుల్లటివో, ఏవి తియ్యటివో తెలియవా’ అని కసురుకున్నాడు. అందుకు ఇబ్రహీం చాలా నిదానంగా, ప్రశాంతంగా ఇలా జవాబిచ్చారు: ‘మీరు నాకు తోటమాలి పని అప్పజెప్పారు తప్ప పండ్లు తినమని చెప్ప లేదు. తింటే కదా వాటి రుచి తెలిసేది?’ ఈ సంఘటన తర్వాతే ఆ ధనవంతుడికి తన ఎదుట ఉన్న వ్యక్తి సామాన్యుడు కాదని, గొప్ప జ్ఞాని అని తెలుసుకున్నారు. కొన్ని నిముషాల ముందు కసురుకున్నందుకు తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు ధనవంతుడు.సాధువుగా ఉండాలనుకుంటే, ఈ లోకంలోని లేదా పరలోకంలోని వస్తువులను కోరుకోవద్దని ఇబ్రహీం చెప్పేవారు. దృష్టంతా ఆ దేవునిమీదే కేంద్రీకరించినప్పుడే మిమ్మల్ని తన సాధువుగా చేసుకుంటా డనే వారు. ‘ముసుగులు తొలగించినప్పుడే ఆనందం తలుపు తెరవ బడు తుంద’న్నది ఆయన సూక్తి. – యామిజాల జగదీశ్పని చెయ్యడమే! -
ఈశ్వరాజ్ఞ
రజతాచలం పైని వనాంతర సీమలలో వసంతం నిండుగా కమ్ముకుని ఉంది. ఆ ప్రకృతి రామణీయకతలో ఒకచోట దాగి ఏకాంత క్షణాలను గడుపుతూ, ఆనందిస్తున్నారు శివపార్వతులు. వారి ఏకాంతాన్ని ఎవరూ భంగపరచకుండా నంది కాపు కాస్తున్నాడు. అలాఉండగా, అది రజతాచలమని, అక్కడ మదనారియైన శివుడు వసిస్తూ ఉంటాడనే ఆలోచన మరచి, ఆవసంత శోభను తాము కూడా ఆనందించి తరించాలనే ఉద్దేశంతో గంధర్వ గణాలు ఒక్కసారిగా వచ్చి గిరిపై పడ్డాయి. తమ అరుపులతో, కేరింతలతో ఆ వన ప్రాంతంలో అట్టహాసం చేయసాగాయి. ఆ శబ్దానికి ఉలిక్కిపడిన నంది, కోపగించి, వారిపై మాటల దూషణలతో విరుచుకుపడ్డాడు. ’అంధులా మీరు? లోకేశ్వరుడైన ఈశ్వరుడు, ఈశ్వరితో ఏకాంతంలో ఉండగా, ఇలా వచ్చి గోల చేయడం తగిన పనికాదు. ఆలస్యం చేయక, ఇక్కడి నుండి వెంటనే దూరంగా వెళ్ళిపొండి!’ అని మందలించాడు. నంది మాటలను వారు లెక్క చేసే స్థితిలో లేరు. గంధర్వ గణాల ఆ స్థితిని ఆత్మలో ఎరిగిన శంకరుడు, ఉగ్రుడై చెంతనే పడివున్న గడ్డిపోచలను పిడికిట పట్టి ‘పిశా చాలుగా మారండని’ శపించి వారిపై విసిరాడు. కనువిందు చేసే అంద మైన రూపాలు కాస్తా అంతలోనే అంతరించిపోయి, రూపురేఖలు తప్పి వికటాంగులయ్యారు గంధర్వులు. ఆ సందర్భాన్ని తెనాలి రామకృష్ణకవి ఇలా వర్ణించాడు ఉద్భటారాధ్య చరిత్రలో. కం. కొఱకును బోవం బడిక /ల్లుఱక పయింబడిన కరణి నొకపనికై రా నుఱుమని పిడుగై వారికి /గఱకంఠుని చేత నీచగతి వాటిల్లెన్.పక్షులు ఎఱను ఏరి తినడానికని వెళ్ళగా, ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియని పడికల్లు – తుపాకి గుండు – వేగంగా వచ్చి వెంటాడి మీద పడినట్లుగా, రజతాచలంపైని వసంత శోభను ఆనందించాలనే ఒక పని మీద రాగా, ఉరుము లేకుండానే మీద పడిన పిడుగు చందంగా,శంకరుడి శాపం తగిలి నీచ గతి ప్రాప్తించింది కదా అని గంధర్వ గణాలు బాధపడడం పై పద్యం భావం. ఏదైనా తప్పుతుందేమో కాని ఈశ్వరాజ్ఞ తప్పదు కదా!– భట్టు వెంకటరావుఈశ్వరాజ్ఞ -
దురలవాట్లను దూరం చేసే కొల్లూరు మూకాంబికాలయం
కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో... దట్టమైన అడవుల మధ్యన నెలకొని ఉంది మూకాంబికాలయం. ఆ రాష్ట్రంలోని ఏడు మోక్షపురాల్లో కొల్లూరు మూకాంబిక గుడి ఒకటి. ఆలయం ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో అయినా, ఆమెను ఎక్కువగా సందర్శించుకునేది కేరళీయులే కావడం విశేషం. క్షేత్రపురాణం: జగద్గురు ఆదిశంకరులు కుడజాద్రి పర్వతంపై ఉండి అమ్మవారి కోసం తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చి, అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆమెను తనతోబాటు తన జన్మస్థలమైన కేరళకు రావలసిందిగా శంకరులు చేసిన ప్రార్థనకు అంగీకరించిన దేవి, అందుకు ఒక షరతు విధిస్తుంది. అదేమంటే, తాను వచ్చేటప్పుడు శంకరులు వెనక్కు తిరిగి చూడకూడదని, ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే అక్కడే తాను శిలలా మారిపోతానంటుంది. అందుకు అంగీకరిస్తాడు శంకరులు. ముందుగా శంకరులు, వెనుక అమ్మవారు వెళ్తూ ఉంటారు. కొల్లూరు ప్రాంతానికి రాగానే అమ్మవారి కాలి అందెల రవళి వినిపించకపోవడంతో, వెనక్కు తిరిగి చూస్తాడు శంకరులు. ఇచ్చిన మాట తప్పి వెనక్కు తిరిగి చూడడంతో అమ్మవారు అక్కడే శిలలా మారిపోతుంది. తన తప్పిదాన్ని మన్నించమని ప్రార్థించిన శంకరులతో తనను అక్కడే ప్రతిష్ఠించమని చెబుతుంది. దీంతో ఆదిశంకరులు శ్రీ చక్రంతోపాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. శంకరుల వెంట వచ్చేటప్పుడు అమ్మవారు మాట్లాడనందువల్ల ఆమెకు మూకాంబిక అనే పేరు వచ్చింది. నాటినుంచి అమ్మవారికి ఆదిశంకరులు సూచించిన విధానంలోనే పూజాదికాలు జరుగుతున్నాయి. మూకాంబిక ఆలయాన్ని సందర్శించుకున్నవారు ఒక్కసారైనా హారతి సమయంలో అమ్మవారి దివ్యమంగళరూపాన్ని సందర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. అమ్మవారికి ప్రదోష కాలంలో ఇచ్చే హారతి ప్రత్యేకమైనది.సౌపర్ణికానది: ఆలయానికి సమీపంలో సౌపర్ణికా నది ప్రవహిస్తుంటుంది. ఈ నది లోతు తక్కువ. కుటజాద్రి పర్వతం నుంచి ఉద్భవించే ఈ నదిలో ఇతర నదీపాయలు కూడా కలుస్తాయి. ఈ నది ఒడ్డున సుపర్ణుడు అంటే గరుత్మంతుడు తన తల్లి దుఃఖాన్ని పోగొట్టమని కోరుతూ అమ్మవారిని గురించి ఘోర తపస్సు చేసి వరం పొందాడట. ఆ నాటినుంచి ఈ నదికి సౌపర్ణికానది అని పేరు వచ్చింది. ఈ నదిలో అనేక వనమూలికలు ఉంటాయని, అందువల్ల ఈ నదిలో స్నానం చేస్తే చర్మరోగాలు నయం అవుతాయని చెబుతారు. ఇతర సందర్శనీయ స్థలాలు ఆలయ బయటి ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కుమారస్వామి తదితర దేవతల సన్నిధులున్నాయి. కొల్లూరు చుట్టుపక్కల మంగుళూరు మంగళాదేవి, ఉడిపి కృష్ణుడు, కుందాపూర్, భత్కల్, షిమోగా, ధర్మస్థల, శృంగేరీ శారదాపీఠాలు సందర్శనీయ స్థలాలు. ఇక్కడ గల కుటజాద్రి పర్వత శ్రేణి అందమైన అటవీ సంపదతో ఆకట్టుకుంటుంది. ఈ పర్వతశ్రేణి ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఎలా వెళ్లాలి? మంగుళూరు నుంచి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు కొల్లూరుకు వెళుతుంటుంది. ప్రైవేటు వాహనాలు కూడా ఉన్నాయి. మంగుళూరుకు నేరుగా అన్ని ప్రధాన నగరాలనుంచి బస్సులు, రైళ్లు ఉన్నాయి. మంగుళూరులో విమానాశ్రయం కూడా ఉంది. (చదవండి: లోకహితం కోసం ప్రాణాలర్పించిన అసురుడు..!) -
భోగభాగ్యాల భోగి పండగ దేనికి సంకేతమంటే.?
'భగ' అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని శాస్త్ర వచనం. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం. మరోక అర్థంలో భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం ఈరోజున శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా 'భోగి పండగ' ఆచరణలోకి వచ్చిందని పురాణ గాథ. అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా. అలాంటి ఈ పండుగను అనాథిగా ఆచారిస్తూ రావడానికి గల కారణం, ఆరోగ్య రహాస్యలు గురించి సవివరంగా చూద్దామా..!భోగినాడు సూర్యుడు ఉత్తర ఆయనం వైపు పయనం ప్రారంభిస్తారు. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్పుచుని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. సూర్యుడు ప్రయాణించే దిక్కుని బట్టి…దక్షిణం వైపు పయనిస్తే దక్షిణాయానం.. ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయణం అంటారు. మకర రాశిలోకి ప్రారంభ దశలో ఆ సూర్యని కాంతి సకల జీవరాశుల మీద పడడంతో మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. సూర్యుడే ఆరోగ్యకారుడు ఆ ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకునే పండుగ ఈ మకర సంక్రాంతి.. ఇక భోగ భాగ్యాలను అందించే పండుగ భోగి అని పెద్దలు చెబుతున్నారు.ఆరోగ్య రహస్యం..ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. అందువల్లే భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వచ్చింది. భోగి మంటలు ఎందుకంటే..చాలా మందికి భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలియదు. పురాణాల ప్రకారం, దీనికి వెనుక ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో రురువు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు. అందుకు బ్రహ్మదేవుడు అంగీకరించలేదు. అప్పుడు రురువు ఎవరైనా సరే 30 రోజుల పాటు గొబ్బెమ్మలు ఇంటిముందు పెట్టి, అవి ఎండిపోయిన తర్వాత మంటల్లో వేసి ఆ మంటల్లో నన్ను తోస్తేనే మరణించేలా వరమివ్వమని బ్రహ్మదేవుడిని కోరాడు. అనంతరం రురువు వర గర్వంతో దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలందరూ ఈ ధనుర్మాసంలో 30 రోజులపాటు ఇంటిముందు గొబ్బెమ్మలు పెట్టి.. ఆ తర్వాత వాటిని మంటల్లో పెట్టి రాక్షసుడిని అందులో తోస్తారు. అలా రాక్షసుడు చనిపోవడానికి సంకేతంగా భోగి రోజు భోగి మంటలు వేసుకోవడం ఆచారంగా వస్తోంది.ఈ పండగ సందేశం, అంతరార్థం..చలికాలంలో సూక్ష్మక్రిముల బెడద ఎక్కువగా ఉంటుంది. వాటిని తొలగిపోవడానికి మన పెద్దలు ఇలా భోగి మంటలు వేసి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేవారని చెబుతుంటారు. ఇక ఈ పండుగ మనకు ఇచ్చే సందేశం ఏంటంటే..చెడు అలవాట్లను, అసూయా, ఈర్ఘ, దుర్భద్ధిని ఈ మంటల రూపంలో దగ్ధం చేసుకుని మంచి మనుసుతో జీవితాన్ని ప్రారంభించి సానుకూలా ఆలోచనలతో మంచి విజయాలను అందుకోవాలనే చక్కటి సందేశాన్ని ఇస్తోంది. మనం అగ్ని ఆరాధకులం. కనుక మాకు అసలైన భోగాన్ని కలిగించమనీ, అమంగళాలను తొలగించమని ప్రార్థిస్తూ అగ్నిహోత్రాన్ని రగులుస్తాము. గతించిన కాలంలోని అమంగళాలను, చేదు అనుభవాలు, అలాగే మనసులోని చెడు గుణాలను, అజ్ఞానాన్ని అన్నింటినీ అత్యంత పవిత్రమైన అగ్నిలో వేసి దగ్ధం చేసుకోవటమే భోగి. ఇలా మంగళాలను, జ్ఞానాన్ని పొందాలనే కోరికతో అగ్నిహోత్రుడిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించటమే భోగి మంటల వెనక ఉన్న అంతరార్థం.(చదవండి: సంక్రాంతి అంటే పతంగుల పండుగ కూడా..!) -
అనంతపద్మనాభ స్వామి ఆలయం..! కొండనే ఆలయాలుగా..
ఒకే కొండను నాలుగంతస్తుల గుహాలయాలుగా, విశాలమైన విహారాలుగా మందిరాలుగా, అందమైన స్తంభాలుగా, బౌద్ధ, శైవ, వైష్ణవ దేవతామూర్తులుగా వివిధ ఆకృతులలో మలచిన ఆనాటి శిల్పుల అనన్య శిల్పనైపుణ్యానికి, అనల్పశిల్ప కళా ప్రావీణ్యానికి శిరసువంచి వందనాలు సమర్పించాల్సిందే. శ్రీ అనంతపద్మ నాభుని 20 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని చూడగానే ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో అవాక్కయి నిలబడి పోవాలసిందే! గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి అతి ప్రాచీనమైన, చరిత్ర ప్రసిద్ధి చెందిన గ్రామం. విజయవాడ ప్రకాశం బ్యారేజి దాటి మంగళగిరి రహదారి పై కొద్దిగా ముందుకు వెళితే .... ఉండవల్లి సెంటరు వస్తుంది. కుడివైపుకు తిరిగి అమరావతి రోడ్డులో 5 కి.మీ ప్రయాణం చేస్తే మనం ఈ గుహాలయాలను చేరుకుంటాము. వీటిని ఉండవల్లి గుహలు అని పిలుస్తున్నారు. ఈ గుహాలయాలు క్రీ.శ 420 –620 ప్రాంతంలో ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల కాలం నాటి నిర్మాణాలుగా చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. . మొదటి అంతస్తు: కింద భాగం మొదటి అంతస్తులో గుప్తుల,చాళుక్యుల కాలపు శిల్పనిర్మాణం కనిపిస్తుంది. ఇవి అసంపూర్తి గానే ఉన్నాయి. బౌద్ధ సన్యాసుల విహారాలుగా ఉండేటట్లు వీటి నిర్మాణం ప్రారంభమైంది. వీనిలో ఒకదానిలోనుండి మరొక దాని లోనికి మార్గం, విశాలమైన తిన్నెల నిర్మాణం ఉంది. రెండవ అంతస్తు: రెండవ అంతస్తు లోనికి మెట్లమార్గం ఉంది. దీనిలో త్రిమూర్తుల మందిరాలున్నట్టుగా చెపుతున్నారుగాని ఇప్పుడు అవశేషాలు మాత్రమే మిగిలున్నాయి. గదులుగా . మందిరాలుగా ఉన్న వానికి సన్నని తీగలున్న తలుపులను బిగించారు. అక్కడక్కడా ఏవో ఉన్నట్లు గా భ్రాంతిగా కన్పిస్తున్నాయి కాక ఎక్కడా స్పష్టత లేదు. వేసిన తలుపుల వెనుక చీకట్లో ఏవేవో దేవతామూర్తులను పెకలించిన గుర్తులు స్పష్టాస్పష్టంగా కన్పిస్తాయి. మూడవ అంతస్తులోకి మెట్లమార్గం...చారిత్రక నేపథ్యం – ఈ గుహాలయాలు నాలుగు అంతస్తులు కూడ రాయిను తొలిచి చేసిన నిర్మాణాలే కాని, పెట్టినవి, ప్రతిష్ఠించినవి లేవు. మూడవ అంతస్తు పూర్తిగా విష్ణు బంధమైన గుహాలయం. సాధారణం గా బౌద్ధ, జైన గుహాలయాలు ఉంటాయి కాని వైష్ణవ గుహాలయం ఉండటం ఇక్కడొక ప్రత్యేకతగా చెప్పవచ్చు. కొండవీడు రెడ్డి రాజులకు రాజ్యాధికారిగా పనిచేసిన మాధవరెడ్డి ఈ అనంత పద్మనాభుని గుహాలయాన్ని నిర్మింపజేసినట్లుగా చరిత్ర చెబుతోంది. ఇక్కడ నుంచి 9 కి.మీ దూరం సొరంగమార్గం మంగళగిరి నరసింహస్వామి కొండపైకి ఉందని, ఆరోజుల్లో సాధువులు, మునులు కృష్ణానదిలో స్నానానికి, పానకాల నరసింహుని దర్శనానికి రాకపోకలు సాగించే వారని నానుడి. ప్రస్తుతం ఈ సొరంగ మార్గాన్ని మూసివేశారు. ఎడమవైపుకు తిరిగితే వరుసగా కొండను తొలిచి తీర్చిదిద్దిన శిల్పాలు కనువిందు చేస్తాయి. వాటిలో ముందుగా మనల్ని ఆకర్షించేది గణనాయకుడైన వినాయకుని రమణీయ శిల్పం. మహా గణపతి...లంబోదరుని సహస్ర రూ΄ాలను దర్శించిన సందర్శకునికైనా ఈ వినాయకుని దర్శనం అపరిమితానందాన్ని ఇస్తుంది. ఎందుకంటే గజాననుని ముఖం మీద తొండం మీద కన్పించే ఆ విధమైన గజచర్మపు ముడతలను శిల్పంలో దర్శింపజేయడం అనన్య సామాన్యం. ఉగ్రనరసింహుడు: ఈ రూపం ఈమండపంలోనే మూడు ప్రదేశాల్లో మనకు కన్పిస్తుంది. రెండు ఒకే పోలికతో ఉన్నాయి. ఇవి కుడ్యచిత్రాలు. వీనిలో శంకరునితోపాటు వివిధ దేవతల శిల్పాలు కూడ ఉన్నాయి. శ్రీ లక్ష్మీదేవితో ఆదివరాహస్వామి...స్థంభాలపై కన్పించే వాటిలో మొదటిది చాల అరుదుగా కన్పించే ఆదివరాహస్వామి. లక్ష్మీ సమేతుడైన ఈ స్వామి కడు రమణీయంగా దర్శనమిస్తాడు. ఆకాశంలో విహరిస్తున్నట్లున్న గరుత్మంతుడు... నాగబంథం: మూడవ అంతస్థులో మండపానికి వెలుపల నాగబంథమున్నదని, దానివలన ఈ పరిసరాల్లో ఎక్కడో విలువైన సంపద కాని, విలువైన గ్రంథ సముదాయం కాని ఉండవచ్చని కూడ ప్రచారం జరిగింది.నారద తుంబురులా ? ఈ మూడవ అంతస్థులో వెలుపల భాగాన నాలుగు విగ్రహాలు, సింహం బొమ్మలు కన్పిస్తున్నాయి. వీటిని నారద, తుంబురులు అని వ్రాస్తున్నారు. నారద తుంబురులయితే ఇద్దరే ఉండాలి కదా! కాని ఎందుకో ఆ నలుగురు వేద పురుషులకు ప్రతీకలనే భావన కలుగుతుంది. వాటిని కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే మొదటి పురుషుని కుడి చేతిలోజపమాల, రెండవ చేతిలో తాళపత్రాలు కన్పిస్తున్నాయి. ఋగ్వేదానికి ప్రతీక ఏమో? అలాగే నాల్గవ పురుషుని చేతిలో తంత్రీ వాద్య విశేషం ఉంది. ఇది సామవేదానికి ప్రతీక కావచ్చు. కాబట్టి పండితులు, మేథావులు, చరిత్ర పరిశోథకులు మరొక్కసారి ఈ విగ్రహాలను పరిశీలిస్తే విశేషం వెలుగు చూడవచ్చు? రవాణాసౌకర్యాలు...విజయవాడకు దేశంలోని అన్ని ్ర΄ాంతాలనుండి బస్సు, రైలు, విమాన సౌకర్యాలు వున్నాయి. విజయవాడనుండి ప్రకాశం బ్యారేజి మీద బస్సులు వెళ్లవు కాబట్టి ఆటో చేసుకొని వెళ్లవచ్చు. లేదా మంగళగిరి నుండి ఉండవల్లి సెంటరుకు బస్సులో వచ్చి అక్కడ నుండి ఆటోలో వెళ్లవచ్చు. రోడ్డు మార్గం... ఉండవల్లి గుహలకు చేరుకునే మార్గాలు ఆలయానికి మంచి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. గుంటూరు నుండి ఉండవల్లి గుహలకు 31 కిలోమీటర్ దూరంలో ఉంది. మంగళగిరి నుండి ఉండవల్లి గుహలకు 7 దూరంలో ఉంది. గుంటూరు నుండి ఉండవల్లి గుహలకు 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ గుహలను సందర్శించడానికి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది. అదేవిధంగా గుంటూరులో రైల్వే జంక్షన్, విజయవాడలో రైల్వే జంక్షన్ ఉంది. గుంటూరు నుంచి ఆలయానికి 30 కిలోమీటర్లు, విజయవాడ నుంచి ఉండవల్లి గుహలకు 10 కిలోమీటర్లు ఉంది. రైలు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మంగళగిరిలో రైలు జంక్షన్ కూడా ఉంది. అక్కడ నుంచి కూడా ఉండవల్లి గుహకు వెళ్లడానికి సదుపాయాలు ఉన్నాయి.(చదవండి: దేవతలు నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయం) -
తనకు గాయం చేసిన భక్తుడి పేరునే తన క్షేత్రానికి పెట్టుకొన్న శివుడు!
సాక్షి, పెద్దపల్లి: ‘గజ్జల లాగులను ధరించిన ఓదెల మల్లన్న దండాలో.. మమ్మేలు మా స్వామి దండాలో.. ఆలుమిలా తారడో బోలుమియా గారడో..’ అంటూ గంతులు వేస్తూ తమ ఇలవేల్పును దర్శించేందుకు భక్తులు ఆ ఆలయానికి భారీగా తరలివస్తుంటారు. తనకు గాయం చేసిన భక్తుడి పేరునే తన క్షేత్రానికి పెట్టుకొన్న శివుడు.. మల్లన్నగా.. ఓదెల మల్లన్నగా పూజలందుకుంటున్నాడు. తెలంగాణ శ్రీశైలంగా ప్రసిద్ధి చెందాడు. అదే పెద్దపల్లి జిల్లా (Peddapalli District) ఓదెల మల్లికార్జునస్వామి ఆలయం. ఆ ఆలయ చరిత్ర తెలుసుకుందాం.నాగలి చేసిన గాయంతో..పూర్వం ఈ ప్రాంతం దండకారణ్యంగా (Deep Forest) ఉండేది. ఆ రోజుల్లో స్వయంభూలింగంగా వెలసిన మహాశివుడిని పంకజ మహామునీశ్వరుడు నిత్యం కొలుస్తూ తపస్సు చేసేవాడని ప్రతీతి. దీనికి నిదర్శనంగా ఆలయ స్తంభంపై మునీశ్వరుల బొమ్మలు, నామం చెక్కి కనిపిస్తాయి. ఆయన తర్వాత పూజ చేసేవారు లేక శివలింగంపై పెద్దఎత్తున పుట్ట పెరిగింది. అయితే, చింతకుంట ఓదెలు అనే రైతు వ్యవసాయం చేస్తుండగా.. నాగలి కర్ర పుట్టలోని శివలింగానికి తగిలింది. జరిగిన పొరపాటును ఓదెలు తెలుసుకొని, స్వామివారిని మన్నించమని వేడుకున్నాడు. దీంతో ఓదెలుకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా, అతడి పేరుతోనే భక్తులకు దర్శనం ఇస్తానని స్వామివారు చెప్పినట్లు భక్తులు విశ్వసిస్తారు. ఇప్పటికీ శివలింగానికి నాగలి కర్ర చేసిన గాయాన్ని పోలిన మచ్చ ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణ క్రమం, స్తంభ వర్ణ శిలలు, శిల్పాల ఆధారంగా సుమారు 1300 మధ్య కాకతీయుల కాలంలో ఆలయాన్ని పునర్నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయని చెబుతున్నారు. ఆ సమయంలో దక్షిణ దిశగా శ్రీభ్రమరాంబ అమ్మవారిని, ఉత్తర దిశగా శ్రీవీరభద్రస్వామిని, క్షేత్రపాలకుడిగా శ్రీభైరవస్వామిని ప్రతిష్టించారు.మల్లన్న ఆలయానికి సమాంతరంగా సీతారామ చంద్రస్వామి విగ్రహాలుశ్రీసీతారాములు వనవాసం చేసే సమయంలో రామగిరిఖిల్లా నుంచి ఇల్లంతకుంటకు వెళ్లే దారిలో ఓదెల శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకున్నారని ప్రతీతి. దానికి ప్రతీకగా మల్లన్నస్వామి ఆలయానికి సమాంతరంగా శ్రీసీతారామచంద్రస్వామి వారి విగ్రహాలను ప్రతిష్టించారని స్థానికులు చెబుతుంటారు.సంతానం కోసం టెంకాయ బంధనం‘గండాలు తీరితే గండదీపం పెడతాం.. కోరికలు తీరితే.. కోడెలు కడతాం.. పంటలు పండితే.. పట్నాలు వేస్తాం.. పిల్లాజెల్ల సల్లంగా ఉంటే.. సేవలు చేస్తాం’ అని స్వామివారికి భక్తులు మొక్కుకుంటారు. వచ్చే భక్తుల్లో చాలామంది సంతానం కోసం ‘టెంకాయ బంధనం’ కట్టి వారికి సంతానం కలిగిన తర్వాత స్వామివారికి మొక్కుబడి చెల్లిస్తారు. మల్లన్నను దర్శించుకున్న తర్వాతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.ఒగ్గుపూజారుల పట్నాలతో..ఓదెల మల్లన్న సన్నిధిలో భక్తులు (Devotees) స్వామివారి పేరిట పట్నం వేస్తారు. ఒగ్గుపూజారుల చేతిలో ఢమరుకాన్ని మోగిస్తూ శ్రుతిని తలుస్తుండగా స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. మండపంలో ఒగ్గు పూజారులు గజ్జెలతో కుట్టిన లాగుల (నిక్కర్లు)తో పూసలు కట్టిన అంగీలు (చొక్కాలు), పూసల కుల్లాయి (టోపీ) సన్నని జాలిచెద్దరు, చేతిలో త్రిశూలం, దానికి చిరుగంటలు, మరోచేతిలో కొరడా (వీరకొల) వంటివి ధరించి భక్తి తన్మయత్వంతో పూనకాలతో ఊగుతూ, గంతులు వేస్తూ.. శివతాండవం చేస్తూ దేవున్ని ప్రత్యేకంగా కొలవడం విశేషం.పలు రాష్ట్రాల నుంచి భక్తుల రాకఏటా సుమారు రూ.2 కోట్లకుపైగా ఆదాయం సమకూరే ఓదెల శ్రీమల్లికార్జునస్వామి దేవాలయానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.భక్తుడి పేరుతో దర్శనం చింతకుంట ఓదెలు అనే భక్తుడి పేరు మీద మల్లన్న క్షేత్రం విరాజిల్లు తోంది. శ్రీరాముడు కూడా మల్లన్నను దర్శించుకొని పూజలు చేశాడని ప్రతీతి. శ్రీశైలం, ఓదెల ఆలయం రెండు ఒకే సమయంలో నిర్మించడంతో తెలంగాణ శ్రీశైలం అని ఈ ఆలయానికి పేరు వచ్చింది. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు.– పంచాక్షరి, ఆలయ అర్చకులుబుధ, ఆదివారాల్లో రద్దీ ఉగాది పర్వదినం రోజున ఎడ్లబండ్లతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత జాతర ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పెద్దపట్నాలు, అగ్నిగుండాలు దాటడంతో ఏటా జాతర సాగుతుంది. ఆలయంలో పలు అభివృద్ధి పనులు, నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వాటి నిర్మాణాలకు సహకరించిన దాతలకు జాతర సమయంలో ప్రత్యేక గుర్తింపు కల్పిస్తాం.– బి.సదయ్య, ఈవో(403) -
మౌనం ఒక వరం...!
మౌనంగా ఉండటం చాలా మందికి తెలీదు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. కొందరు పూజలు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది మత గ్రంథాలు చదువుతూ ఒక పక్క మాట్లాడుతూ మరోప్రక్క అనవసర విషయాలలో జోక్యం చేసుకుంటారు. ఏదో ఉదయమే చదివితే చాలు అనే ధ్యాసలో ఉంటారు. మరి కొంతమంది ఎటువంటి పూజలు కాని మత గ్రంథాలు చదవటం కాని చేయరు. అనునిత్యం పైకి అనకుండా మనసులోనే తమ దైవాన్ని స్మరించుకుంటారు. వారు ఎక్కువ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. చిరునవ్వుతోనే సమాధానం ఇస్తూ ఉంటారు. ఇటువంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. ముఖ్యంగా ఎవరు ఏమైనా అంటే దానికి సమాధానం ఇవ్వకుండా ఉంటే మేలు. లేకపోతే మాటకు మాట పెరిగి వాగ్వివాదం పెరిగి చూసేవారికి అసహనం కలుగుతుంది. సమాధానం ఇవ్వకుండా ఉంటే మౌనంగా ఉండొచ్చు కదా అని చాలా మంది అనుకుంటారు. వృద్ధాప్యం ఉన్న వాళ్ళు ఎక్కువగా మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. కొందరికి అన్ని కావాలి. ఎవరు, ఏమిటీ అని ఆరా తీస్తారు. అది వారి పెద్దరికానికి తగదు. పూజలు చేస్తేనే పుణ్యం అనే భ్రమలోనుంచి వారు బయటకు రావాలి. చేత కానప్పుడు మదిలోనే భగవంతుని స్మరించవచ్చు. అంతేకాని వితండవాదం చేయకూడదు. మన మాట పిల్లలు విననప్పుడు మనం మారు మాటాడకూడదు. వారు ఏదయినా అడిగితేనే మనం సలహా ఇవ్వాలి. అయినా ఈ రోజులలో పెద్దల మాట ఎవరూ పట్టించుకోరు. మనం సాధ్యమైనంత వరకు మనసులోనే మౌనంగా మన ఇష్టదైవాన్ని తలచుకుంటే అదే పదివేలు. మౌనమే మనం అలవర్చుకోవాలి. మౌనాన్ని మించిన విద్య లేదు. మౌనం అన్నిటికి పరిష్కారం.– కనుమ ఎల్లారెడ్డి, విశ్రాంత పౌరశాస్త్ర అధ్యాపకులు (చదవండి: దేవతలు నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయం) -
దేవతలు నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయం
పూర్వం పాపాత్ములందరూ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి తమ తమ పాపాలను పోగొట్టుకునే వాళ్ళు. గంగానది, పాపం, వీళ్ళందరి పాపలతో అపవిత్రమై, నల్లని రూపాన్ని సంతరించుకుంది. ఆ పాపలనుంచి విముక్తికై ఆమె మహావిష్ణువుని ప్రార్ధించింది. అప్పడాయన, పాపత్ముల పాపల మూలంగా నువ్వు నల్లగా మారిపోయావు, అందుకని నువ్వు నల్లని కాకి రూపంలో వివిధ తీర్థాలలో స్నానం చేస్తూ వుండు. ఏ తీర్థంలో స్నానం చేసినప్పుడు నీ మాలిన్యం వదలి హంసలా స్వచ్ఛంగా మారుతావో, అది దివ్య పుణ్య క్షేత్రం అని చెప్పాడు. గంగ కాకి రూపంలో వివిధ తీర్ధాలలో స్నానం చేస్తూ, కృష్ణవేణి సాగర సంగమ ప్రదేశంలో కూడా చేసింది. వెంటనే ఆవిడకి కాకి రూపం నశించి హంస రూపం వచ్చింది. అందుకని ఈ ప్రాంతాన్ని హంసలదీవి అన్నారని ఒక కథ.పులిగడ్డ దగ్గర కృష్ణానది చీలి దక్షిణ కాశియని పేరు పొందిన కళ్ళేపల్లి (నాగేశ్వర స్వామి) మీదుగా హంసలదీవికి వచ్చినౖ వెనం గురించి ఒక కథ వుంది. ఇది బ్రహ్మాండ పురాణంలో వున్నది. పూర్వం దేవతలు సముద్ర తీరంలో ఒక విష్ణ్వాలయం నిర్మించి అక్కడ వారు పూజాదికాలు నిర్వర్తించాలనుకున్నారు. మరి దేవతలు వచ్చి పూజలు చెయ్యాలంటే వారికి ఏ ఆటంకం లేని ప్రదేశం కావాలి కదా. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిర్మానుష్యంగా వుండేది. అందుకని దేవతలు ఇక్కడ వేణు గోపాల స్వామి ఆలయం నిర్మించాలనుకున్నారు. అందుకోసం వాళ్ళు ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారుట. కోడి కూసే సమయానికి రాజగోపురం సగమే పూర్తయింది. దాంతో వారు గోపురాన్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత చోళ, మౌర్య రాజుల కాలంలో ఆలయ పునరుధ్ధరణ జరిగినా, అసంపూర్తిగా వున్న గాలి గోపురాన్ని అలాగే వదిలేశారు. ఇటీవల విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్ధానం వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని నూతన గాలి గోపురాన్ని నిర్మించారు. పురాతన గాలి గోపుర శిధిలాలు కొన్ని ఇప్పటికీ ఆలయ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి.స్వామి ఆవిర్భావం గురించి.... పురాతన కాలంలో ఈ ప్రాంతంలో ఆవులు ఎక్కువగా ఉండేవి. అందులో కొన్ని ఆవులు ఇంటి దగ్గర పాలు సరిగ్గా ఇవ్వక పోవటంతో వాటిని జాగ్రత్తగా కాపలా కాశారు. అవి వెళ్ళి ఒక పుట్ట దగ్గర పాలు వర్షించటం చూసి గోపాలురు కోపంతో అక్కడున్న చెత్తా చెదారం పోగుచేసి ఆ పుట్టమీద వేసి తగులబెట్టారు. పుట్టంతా కాలిపోయి అందులో స్వామి శరీరం తునాతునకలయింది. స్వామిని చూసిన గోవుల కాపరి వెంటనే మంట ఆపివేశాడు. అందరూ వచ్చి పుట్ట తవ్వి చూడగా ముఖం తప్ప మిగతా శరీరమంతా ఛిన్నా భిన్నమయిన స్వామి దర్శనమిచ్చారు.. అదిచూసి వారంతా సతమతమవుతున్న సమయంలో స్వామి ఒకరికి కలలో కనిపించి పశ్చిమ గోదావరి జిల్లాలో కాకరపర్తి అనే గ్రామంలో భూస్వామి ఇంటి ఈశాన్య మూలగల కాకర చెట్టుకింద వున్న నన్ను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించమని ఆనతినిచ్చారు. ఆ విగ్రహమే ఇది. నల్లశానపు రాతిలో చెక్కిన విగ్రహంలాగా కాక నీలమేఘ ఛాయతో విలసిల్లుతోంది.దేవాలయంపై పెద్ద రాతి దూలాలు అమర్చబడివున్నాయి. ఈ ప్రాంతంలో కొండ గుట్టలు కానీ, పర్వతాలుగానీ లేవు. ఆ రాతి దూలాలను ఇప్పుడు తీసుకు రావాలన్నా చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. మరి ఎటువంటి సౌకర్యాలూ లేని ఆ కాలంలో వాటిని ఎక్కడనుంచి తెచ్చారో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆలయ కుడ్యాలపై గరుత్మంతుడు, లక్ష్మీ నారాయణులు, నరసింహుడు, ఆంజనేయ స్వామి మొదలగు విగ్రహాలున్నాయి.ఉత్సవాలు...ప్రతి సంవత్సరం మాఘ శుధ్ధ నవమి నుండి మాఘ బహుళడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.సరదాలు... కృష్ణా నది సముద్రంలో కలిసే అందమైన ప్రదేశంలో సత్యభామ, రుక్మిణీ సమేత శ్రీ వేణు గో΄ాల స్వామి ఆలయం ఉంది. దీన్ని దేవతలు నిర్మించారని చరిత్ర చెబుతోంది. అంతే కాదు మహర్షులు, దేవతలకు మధ్య అనేక విషయాలు జరిగిన ప్రదేశం కూడా ఇది. దీన్ని చూడటానికి పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఇక్కడి దైవాన్ని దేవతలు ప్రతిష్టించారు అని ,సముద్ర తీరంలో చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం లో సేద తీరడానికి అందరూ వయసుతో సంబంధం లేకుండా ఇష్టపడతారు.ఎలా వెళ్లాలి?విజయవాడకు 110 కి.మీ., అవనిగడ్డకు 25 కి.మీ. దూరంలో ఉంది హంసలదీవి. విజయవాడ నుంచి పామర్రు, కూచివూడి, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు. అలాగే మచిలీ పట్నం నుంచి కూడా. అయితే ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం కొంచెం తక్కువ. అవనిగడ్డనుంచి హంసలదీవి దాకా బస్సులున్నాయి.దారి బాగుంటుంది. సొంత వాహనాల్లో వెళ్తే కృష్ణానదీ, సాగర సంగమాల దాకా కూడా వెళ్ళిరావచ్చు. అయితే మనకి కావలసిన ఆహారం, మంచినీరు వగైరాలన్నీ తీసుకు వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఇంకా అన్ని సౌకర్యాలూ లేవు. వెలుతురు ఉన్న సమయంలో వెళ్తే ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. – స్వాతీ భాస్కర్(చదవండి: జీవితాల్ని మార్చే జీవన'గీత'!) -
మౌనం.. శక్తికి ఆధారం
భారతదేశం ఎన్నో దివ్య క్షేత్రాలకు, ఎన్నెన్నో దివ్య ధామాలకు నిలయం. ఆ సేతు శీతాచలం అసంఖ్యాకమైన పవిత్ర ఆలయాలు ఈ నేలపై కొలువై ఉన్నాయి. యుగాలు మారినా, తరాలు గడిచినా ఆ ఆలయాల శక్తి ఏ మాత్రం తరగలేదు. ఈ రోజుల్లో ఆలయాలకు వెళ్ళినప్పుడు భగవంతుడిని మొక్కుబడిగా చూసి, కోరికల చిట్టా విప్పడం అనవాయితీగా మారిపోయింది. గుడికి వెళ్లి కూడా అనేకమైన సమస్యల గురించిన చింతను వదలకుండా అదే పనిగా తలుచుకోవడం సామాన్యంగా మారింది. ఆలయాలు మహా శక్తి క్షేత్రాలు. ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు శక్తిని గ్రహించాలి.దేవుడిని దర్శించడంతో పాటు పరమాత్మ తత్వంతో ఏకీకృతం అయ్యే ప్రయత్నం చేయాలి. భగవద్ తత్వంతో లయం కావాలంటే మొదట మౌన స్థితికి చేరాలి. ఎందుకంటే భౌతిక జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుండి స్వాంతనను ఇవ్వగలిగే శక్తిని మీరు మౌనం ద్వారా పొందగలరు. మౌనం మీకు సత్య దర్శనాన్ని కలిగిస్తుంది. దివ్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనసును ప్రయత్న పూర్వకంగా స్థిమిత పరిచి శక్తిని ప్రోది చేసుకోవాలి. తక్షణమే మీ చింతలు తగ్గి, మనసు మీ అదుపులోకి వస్తుంది. ఎన్ని పనులున్నా కోవెలకు వెళ్ళినప్పుడు మాత్రం అన్నీ వదిలిపెట్టాలి. ఫోన్ కాల్స్ కానీ, మెసేజీలు కానీ, ఆఫీస్ విషయాలు కానీ, ఇంటి పనులు, ఇతరితర విషయాలన్నీ పక్కన పెట్టి భగవద్ చైతన్యంతో మమేకం కావాలి. మహిమాన్విత ఆలయాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు, అక్కడికి చేరడంతోనే మీరు ఎంతో కొంత శక్తిని స్వీకరిస్తారు. అదే గనుక మౌన స్థితిలో ఉండగలిగితే మరింత అద్భుత శక్తిని పొందుతారు. ఆలయాలలో అనేక మాధ్యమాల ద్వారా ప్రసరించే దివ్యశక్తి మీ శక్తి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. శక్తి శరీరాన్ని కాంతి శరీరం అని కూడా అంటారు. శక్తి శరీరానికి దివ్య శక్తే ఆధారం. మీరు మౌన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే దివ్యశక్తి మీలోనికి అధికంగా ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఋషులు, దేవతలు ప్రతిష్ఠించిన పురాతన ఆలయాల్లో దేవతా శక్తి, ఋషుల తపొశక్తులు రెండూ కలగలిసి ఉంటాయి. ఎన్నియుగాలు గడిచినా ఇటువంటి ఆలయాలలోని శక్తి సంపద చెక్కుచెదరదు. అందుకే వందల సంవత్సరాలుగా భక్తకోటి తరలి వస్తున్నా ఇంకా అదే శక్తి ప్రకంపనలతో ఈ ఆలయాలు అలరారుతున్నాయి. ఈ కారణంగా ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, భక్తి ప్రపత్తులతో మౌన స్థితో ఉండటం ఉత్తమం. అవకాశం కుదిరితే కాసేపు ఆ ప్రదేశాల్లో ధ్యానసాధన కూడా చేయండి. భగవంతుడి వద్దకు వెళ్లిన ప్రతిసారీ మీ సమస్యలను గురించో, లేక΄ోతే మీరు పొందాలనుకుంటున్న కోరికల గురించో విన్నవించుకునే బదులుగా, మీకు భగవంతుడు ప్రసాదించిన ఎన్నో వరాలకు భక్తితో కృతజ్ఞతలు తెలిపి, మౌనస్థితికి వెళ్ళండి. మీరు అనుభవిస్తున్న బాధలు, సమస్యలు అన్నీ పరమాత్మకు తెలుసు. అలాగే మీరు ఏమి కోరుకుంటున్నారో కూడా ఆయనకు తెలుసు. భగవంతుడు సర్వాంతర్యామి. మీరు చేయవలసింది భగవంతునికి మీ భక్తిని సమర్పించడం. స్వచ్ఛమైన మనసుతో, మౌనస్థితిలో భగవంతుడి చైతన్యంలో లయమవ్వడం. ఇలా చేస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలను క్రమక్రమంగా ఓర్పు నేర్పులతో పరిష్కరించుకోగల శక్తి మీకే లభిస్తుంది. దివ్యశక్తి మీతో కలిసి మీ ప్రగతికై పని చేస్తుంది. – మాతా ఆత్మానందమయి, ఆధ్యాత్మిక గురువు -
తప్పుని ఎత్తిచూపడం కంటే.. చక్కదిద్దడమే ఉత్తమం
ఎవరైనా తప్పు చేసినప్పుడు లేదా ఆకస్మికంగా తప్పుదారిలో నడిచినప్పుడు వారిని తిరస్కార భావంతో చూసి ఎగతాళి చేసే వారే కానీ చెడుదారిన వెళ్లేవారి తప్పును సున్నితంగా ఎత్తి చూపించి, ప్రేమతో దిద్ది, ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసానికీ, ఆత్మాభిమానానికీ దెబ్బ తగలకుండా అతడిని చక్కదిద్దే నేర్పరితనం మనలో ఎంతమందిలో ఉంటుంది? తప్పు చేసినప్పుడు సహనం కోల్పోయి తీవ్రంగా దండించి ‘అలా చేయకూడదు, ఇలా చేయకూడదు..’ అంటూ చెప్పినంత మాత్రాన పెద్దల కర్తవ్యం ముగిసిందా? ఒకడు కాలుజారి కిందపడుతున్నప్పుడు వాడిని లేవదీయకుండా వ్యంగ్యంగా విమర్శిస్తూ ‘అయ్యో పాపం!’ అని జాలి ప్రదర్శించే మాటలు కురిపించే వారే చాలామంది! అటువంటి వారిపై దోషారోపణ చేసినంత మాత్రాన మనకొచ్చే ఫలితం ఏమీ ఉండదు. తాము విద్యార్థులుగా ఉన్నప్పుడు తమ ఉపాధ్యాయులు తమకు విధించిన శిక్షలు (కొట్టడం వంటివి) తమకు నచ్చకపోయినా, తాము ఉపాధ్యాయులు అయిన తర్వాత ఆ పద్ధతినే అనుసరిస్తూ వస్తారు. సహనం, ప్రేమ ఆచరణ యోగ్యం కావనీ, ఉపన్యాసాలకూ, రాతలకూ మాత్రమే పనికి వస్తాయనీ భావిస్తారు. బానిసత్వంలో పెరిగిన వర్గాల ప్రజల్లో కనిపించే ఒక అలవాటు ఇది. తమకంటే పై మెట్టులో ఉన్నవారి ఎదుట దైన్యంగా ఉండటం, తమకంటే కిందిస్థాయిలో ఉన్న వారి పట్ల దర్పం చూపడం గమనిస్తూనే ఉన్నాం. సామాజిక విప్లవం, కుల నిర్మూలన వంటి విషయాలను గురించి భావోద్వేగంతో ప్రసంగించే ఒక కార్యాలయాధికారిని ‘మీరెప్పుడైనా మీ విభాగంలోని సిబ్బందినంతా సమీకరించి దానిలో అందరూ పాల్గొనేటటువంటి ఒక ఒక సభను నిర్వహించారా?’ అని అడిగితే, ‘లేదు’ అన్నాడా అధికారి. ఒకే ప్రభుత్వ శాఖలో, ఒకే కార్యాలయంలో కొన్ని ఏళ్లపాటు కొద్ది వేతన వ్యత్యాసాలతో పనిచేసే వారిలో అధికారికీ, ఉద్యోగులకూ సామరస్యం లేదని తెలిసింది. కేవలం యాంత్రికంగా వారి ఉద్యోగం నిర్వహిస్తూ వచ్చారు. అంతేకాని, పరస్పర ప్రేమ, విశ్వాసం, సహకార భావం వంటివి వారిలో మచ్చుకైనా కనిపించలేదు. బుద్ధిమంతులు, సంస్కారవంతులూ అయినవారంతా అణగదొక్కబడిన వారిపట్ల ప్రేమ, ఆదరాభిమానాలు చూపాలి. అంతేకాని, క్షణికమైన ఉద్రేకంతో నేను పరోపకారిని అని ప్రకటించుకుని ప్రయోజనం లేదు. నిష్కల్మషమైన ప్రేమ ఒక్కటే ప్రగతిశీలమైన రాచబాట అనే వాస్తవాన్ని మరువకూడదు. పైస్థాయిలో ఉన్న వారు ఈ విషయాన్ని గ్రహించి, కింది వారిపట్ల శ్రద్ధాసక్తులు చూపాలి. అప్పుడే సమన్యాయం సాధ్యం అవుతుంది. – స్వామి జగదాత్మానంద (చదవండి: సంపదలు సత్కార్యాలకు ద్వారాలు) -
ధర్మసూక్ష్మం ఇలా ఉంటుందా..? ఆత్వస్తుతి అంత పాపమా..?
కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. ఒకనాడు కర్ణుడితో యుద్ధం చేస్తూ ధర్మరాజు అతడి శరాఘాతాలకు గురై గాయాల పాలయ్యాడు. కర్ణుడి సూటిపోటి మాటలతోనైతే మృత్యు సమాన స్థితినే పొందాడు. అవమాన భారం తట్టుకోలేక దూరంగా పారిపోయి వెళ్ళి దాక్కున్నాడు. మరోపక్క అశ్వత్థామను తీవ్ర గాయాలపాలు చేసి అర్జునుడు విజయగర్వంతో ధర్మరాజు కోసం చూశాడు. ఎక్కడా కనిపించపోయేసరికి కృష్ణుడితో కలిసి ధర్మరాజు కోసం వెతుకుతూ వెళ్ళాడు. ఒకచోట ధర్మరాజును కలుసుకున్నాడు. తనను సమీపించిన కృష్ణార్జునుల ముఖంలో సంతోషం చూసి కర్ణుణ్ని వధించి ఉంటారని అనుకున్నాడు ధర్మరాజు. అతణ్ని ఎలా వధించారో చెప్పమన్నాడు. కర్ణుణ్ని ఇంకా చంపలేదని అర్జునుడు సమాధానమిచ్చాడు.అవమానభారంతో కోపంగా ఉన్న ధర్మజుడు అర్జునుణ్ని అనేక విధాలుగా నిందించాడు. ఎంతో గొప్పదైన గాండీవం ఉండి కూడా ఉపయోగించుకోలేకపోతున్నావు కాబట్టి దాన్ని ఎవరికైనా ఇచ్చేయమన్నాడు. ఆ మాట వినడంతోనే అర్జునుడు ధర్మరాజును చంపడానికి కత్తి ఎత్తాడు. పక్కనే ఉన్న కృష్ణుడు అర్జునుణ్ని ఆపి అతడి కోపానికి కారణాన్ని ప్రశ్నించాడు. తన ఎదురుగా ఎవరైనా గాండీవాన్ని అవమానించి దాన్ని విడిచి పెట్టమని అంటే వాళ్లను ఆ క్షణంలోనే చంపుతానని ప్రతిజ్ఞ చేసినట్లు అర్జునుడు చెప్పాడు. అదొక విషమ సందర్భం. ఆ సమయం లో వారిద్దరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత కృష్ణుడిపై పడింది. అప్పుడు కృష్ణుడు ముందు ధర్మరాజును రక్షించాలనే ఉద్దేశంతో అర్జునుడికి ధర్మం స్వరూప స్వభావాలను తెలియజేశాడు. జీవహింస మహాపాపంమంటుంది ధర్మం. కానీ బలాకుడు అనే బోయవాడు భార్యాపుత్రులు, వృద్ధులైన తల్లిదండ్రుల ఆకలి తీర్చడం కోసం క్రూర జంతువును చంపి స్వర్గానికి వెళ్ళిన వృత్తాంతాన్ని వివరించాడు. అలాగే సత్యాన్ని మాత్రమే మాట్లాడమంటుంది వేదం. ఒక్కోసారి అది తప్పంటుంది ధర్మసూక్ష్మం. ఒకరోజు కొందరు వ్యక్తులు తమను దొంగలు వెంటపడుతుంటే ప్రాణభయంతో పారిపోయి కౌశికుడనే తపస్వి ముందు నుంచే అరణ్యంలోకి వెళ్ళారు. కొంతసేపటికి దొంగలు అటుగా వచ్చి వారి గురించి కౌశికుణ్ని ప్రశ్నించగా వారు ఎటు పారిపోయిందీ వివరించాడు. దొంగలు వెళ్ళి వారిని సంహరించి ధనాన్ని దోచుకుపోయారు. వారి మరణానికి పరోక్ష కారణమైన కౌశికుడు తాను చేసిన పనిమూలంగా పాపభారాన్ని మోయాల్సి వచ్చింది. కృష్ణుడి మాటలు విని అర్జునుడు ధర్మస్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అన్నను చంపబోయానని చింతించాడు. ప్రతిజ్ఞాభంగం కలగకుండా ధర్మరాజును, తనను కాపాడమని వేడుకొన్నాడు. అప్పుడు అర్జునుడికి కృష్ణుడు పెద్దలను, గురువులను ఏకవచనంతో సంబోధిస్తే వారిని చంపినట్లే కాగలదన్నాడు. వెంటనే అర్జునుడు అలాగే చేశాడు. ధర్మరాజును అవమానించిన బాధతో కొంతసేపటికి అర్జునుడు నేనింకా బతికుండటం వృథా అంటూ మరణానికి సిద్ధమయ్యాడు. వెంటనే శ్రీ కృష్ణుడు అతణ్ని ఆపి ఆత్మస్తుతి చేసుకోవడం ఆత్మహత్యా సదృశమని చెప్పాడు. వెంటనే ధర్మరాజు ఎదుట అర్జునుడు తనను తాను అనేక రకాలుగా ప్రశంసించుకొని తాను చేసిన పాపం బారినుంచి విముక్తుడయ్యాడు. ఈ విధంగా ధర్మం అనేక ధర్మసూక్ష్మాలతో మిళితమై ఉంటుంది.(చదవండి: -
శివపరివారం కొలువుదీరిన మహాపుణ్య క్షేత్రం ఉజ్జయిని
పరమేశ్వరుడు కొలువై ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి ఉజ్జయిని. ఇక్కడ ఉన్నది మహాకాళేశ్వరుడు. మహాకాలుడు అంటే చాలా నల్లనివాడు అని ఒక అర్థం. అలాగే మృత్యువుకే మృత్యువు, కాలానికే కాలం.. అంటే కాలాన్నే శాసించేవాడు అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి విశిష్టత ఏమిటంటే.. తెల్లవారుఝామున జరిగే అభిషేకం. అది భస్మాభిషేకం. ఆ భస్మం చితాభస్మం. అంటే మహాకాలేశ్వరుడి రూపంలో ఉన్న శివుడికి అప్పుడే కాలిన శవభస్మంతో చేసే అభిషేకం అత్యంత ప్రీతిపాత్రం. దీనికే భస్మహారతి అని పేరు. తెల్లవారుఝామున 3.30 గంటలకు మాత్రమే జరిగే ఈ భస్మహారతిలో పాల్గొనేందుకు పురుషులు మాత్రమే అర్హులు. అదీ ప్రత్యేక వస్త్రధారణతో మాత్రమే. సాధారణంగా జాతకంలో అపమృత్యు దోషాలు ఉన్నవారు, దీర్ఘరోగాలతో బాధపడేవారు, అంతుచిక్కని సమస్యలతో మానసిక వేదన పడుతున్నవారు ఈ భస్మహారతిలో పాల్గొని, ఉపశమనం పొందుతుంటారు.నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిని పూర్వం అవంతీ నగరమనేవారు. సప్తమహానగరాలలో అవంతీనగరం కూడా ఒకటి. ఈ ఉజ్జయిని నగరం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మూలంగా ఎంత ప్రసిద్ధి పొందిందో, మహాకాళికాదేవి వల్ల కూడా అంత ప్రసిద్ధి పొందింది కాబట్టి ఉజ్జయినీ నగరానికి వెళితే ఇటు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరుని, అటు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మహాకాళిని కూడా సందర్శించి నేత్రపర్వాన్ని పొందవచ్చు.స్థలపురాణంఉజ్జయినీ నగరంలో వేదప్రియుడు అనే శివభక్తుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నలుగురు కొడుకులూ తండ్రికి తగ్గ పుత్రులు. ఆ నగరానికి సమీపంలోని పర్వతం మీద దూషణుడనే రాక్షసుడుండేవాడు. వాడు ఋషి పుంగవుల జపతపాలకు, వైదిక ధర్మానుష్టానానికి ఆటంకం కలిగిస్తూ ఉండేవాడు. దూషణుడు ఉజ్జయినీ పురప్రజలను కూడా అలాగే భయభ్రాంతులకు గురిచేయసాగాడు. అయితే వేదప్రియుడు మాత్రం ఇవేమీ పట్టకుండా ఒక పార్థివ లింగాన్ని తయారు చేసుకుని, శివదీక్షలో తదేక ధ్యానంలో గడపసాగాడు.దూషణుడు ఒకనాడు వేదప్రియుణ్ణి సంహరించేందుకు ప్రయత్నించగా ఆ లింగం నుంచి మహాశివుడు మహాకాళేశ్వరుడిగా ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని భస్మం చేశాడు. వేదప్రియుడి భక్తితత్పరతలకు సంతోషించిన మహేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అసహాయులైన, దీనులైన తనవంటి భక్తులను అకాల మృత్యుభయం నుంచి కాపాడేందుకు ఇక్కడే ఉండవలసిందిగా నీలకంఠుడిని వేడుకున్నాడు వేదప్రియుడు. ఆ కోరికను మన్నించిన స్వామి ఆనాటి నుంచి మహాకాళేశ్వరుడనే పేరుతో జ్యోతిర్లింగస్వరూపుడిగా ఉజ్జయినీ క్షేత్రంలో కొలువుదీరాడు.మరో గాథఉజ్జయినీ రాజ్యాధిపతి చంద్రసేనుడు ఒకరోజు శివపూజ చేస్తుండగా శ్రీకరుడనే గోపాలుడు అక్కడికి వచ్చాడు. చంద్రసేనుడి శివార్చనా విధానాన్ని గమనించి తానూ అలాగే స్వామికి పూజ చేయాలని భావించిన శ్రీకరుడు, దారిలో ఒక రాతిముక్కను తీసుకుని దాన్నే శివలింగంగా భావించి ఇంటికి తీసుకెళ్లి పూజించసాగాడు. ఆ బాలుడు పూజలో నిమగ్నమై ఒక్కోసారి బాహ్యస్మృతిని కూడా కోల్పోయేవాడు. తల్లి ఎంత పిలిచినా పలికేవాడు కాదు. ఒకరోజు పూజలో లీనమై బాహ్యస్మృతి మరిచిన శ్రీకరుని దగ్గర నుంచి అతను శివలింగంగా భావిస్తున్న రాతిముక్కను అతని తల్లి తీసిపారేసింది. స్మృతిలోకి వచ్చిన బాలుడు తల్లి చేసిన పనికి చింతస్తూ శివుణ్టి వేడుకుంటూ ధ్యానం చేశాడు. అప్పుడు శివుడు అతన్ని కరుణించి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు.భస్మాభిషేకంఉజ్జయినీ మహాకాళేశ్వరుడికి సాధారణ అభిషేకానంతరం చితాభస్మంతో అభిషేకం చేయడం ఇక్కడి విశిష్టత. చితాభస్మం సాధారణంగా అమంగళకరమైనా, స్వామిని తాకడం వల్ల అతి మంగళప్రదమైనదిగా మారుతోంది. భస్మ హారతితోబాటు మరోవిధమైన అర్చన కూడా కాలేశ్వరుడికి జరుగుతుంది. ఇది భస్మాభిషేకం. ఆవుపేడను కాల్చి బూడిద చేసి, మూటగట్టి, దానిని శివలింగం పై భాగాన వేలాడదీసి, అటువంటి మరో మూటతో మెల్లగా కొడుతుంటారు.అప్పుడు భస్మం మహాకాలుడి మీదనేగాక, మొత్తం ఆలయమంతా పరుచుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో నాగసాధువులు రుద్రనమకం చెబుతూ ఢమరుకం, మృదంగం, భేరీలు మోగిస్తూ, శంఖనాదాలు చేస్తారు. ఆ సమయంలో ఆలయంలో ఉన్నవారికి సాక్షాత్తూ కైలాసంలోనే ఉన్నామేమో అనుకునేంతటి అలౌకికానుభూతి కలుగుతుంది.ఇతర విశేషాలుమహాకాళేశ్వరాలయం నేటి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో క్షి్ర΄ా(శి్ర΄ా)నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో ఏడు సాగర తీర్థాలు, 28 సాధారణ తీర్థాలు, 84 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండాలు ఉన్నాయి. ఉజ్జయినిలో శివలింగాలు మూడు అంతస్థులుగా ఉంటాయి. అన్నింటికన్నా కింద ఉండేది మహాకాలేశ్వర లింగం. ఇది దక్షిణాభిముఖంగా ఉంటుంది. మహాకాలేశ్వరుడి విగ్రహం పైన ఓంకారేశ్వర లింగం ఉంటుంది. ఆ పైన ఉండేది నాగచంద్రేశ్వర లింగం. ఆలయంలో గణపతి, ΄ార్వతి, కార్తికేయుల చిత్రాలు పశ్చిమ, ఉత్తర, తూర్పుగోడలపై ఉంటాయి. దక్షిణభాగంలో మహాదేవుని వాహనమైన నంది విగ్రహం ఉంటుంది. మహాకాలేశ్వరలింగం స్వయంభూలింగం. ఇది అత్యంత ్ర΄ాచీనమైనది. సృష్టి ్ర΄ారంభంలో బ్రహ్మ శివుడిని ఇక్కడ మహాకాలునిగా కొలువు తీరి ఉండమని ్ర΄ార్థించాడట. బ్రహ్మ అభీష్టం మేరకు శివుడు ఇక్కడ కొలువై ఈ మందిరానికి ప్రత్యేక శోభను ఇస్తున్నాడని పురాణగాథలు ఉన్నాయి. వేల సంవత్సరాలుగా ఉన్న ఉజ్జయిని మహాకాలుడి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండదీ΄ాలని పిలుస్తారు.కాలభైరవాలయంఉజ్జయిని వెళ్లినవారు ముందుగా క్షేత్రపాలకుడైన కాలభైరవుని సందర్శించుకుని, అటు పిమ్మట మహాకాళికా లేదా మహాకాళేశ్వరుని దర్శనం చేసుకోవడం ఆచారం. కాగా కాలభైరవుడి విగ్రహానికి మద్యంతో అభిషేకం చేయడం, మామూలుగా గుడికి కొబ్బరికాయ తీసుకు వెళ్లినట్లుగా కాలభైరవుడి ఆలయానికి వెళ్లే భక్తులు మద్యం, కల్లు సీసాలను తీసుకువెళ్లి సమర్పించడం ఆచారం. కాలభైరవార్చన విశిష్ట ఫలప్రదమైనదిగా పేరు పొందింది.ఎలా వెళ్లాలంటే..? హైదరాబాద్‌నుంచి ఉజ్జయినికి నేరుగా రైళ్లున్నాయి. లేదంటే పూణే వెళ్తే అక్కడినుంచి కూడా ఉజ్జయినికి రైళ్లుంటాయి. హైదరాబాద్‌నుంచి జైపూర్ఎక్స్ప్రెస్ ట్రెయిన్ ఎక్కితే సుమారు 19 గంటల్లో ఉజ్జయినిలో దిగవచ్చు. చవకగా, తొందరగా వెళ్లగలిగే మార్గాలలో అది ఒకటి. ఇంకా యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా వెళ్లవచ్చు. విమానంలో అయితే హైదరాబాద్‌నుంచి పూణే లేదా ఇండోర్ వెళ్తే అక్కడినుంచి ఉజ్జయినికి రైలు లేదా బస్సులో వెళ్లవచ్చు.– డి. పూర్ణిమాభాస్కర్ (చదవండి: దక్షిణ భారతాన అతి పెద్ద ఆలయం ఇదే..!) -
మనుషుల మదులను ఉత్తేజితం చేసి మైమరపించే నెలరేడు!
ప్రకృతి తీరుతెన్నులను చురుకుగా పరిశీలించే స్వభావం కలవారికి ఎవరికయినా, కలువపూలు వెన్నెలలో వికసిస్తాయనీ, మనిషి మనసుకూ చందమామకూ సంబంధం ఉంటుందనీ మరొకరు చెప్పవలసిన పని ఉండదు. పున్నమి చంద్రుడిని చూస్తే... సముద్రమే పట్టరాని ఆవేశంతో పొంగిపోతుంది. మనిషి మనసూ అంతే. ‘రసమయ జగతిని ఉసిగొలిపే తన మిసమిస’తో నెలరేడు మనుషుల మదులను ఉత్తేజితం చేసి మైమరపిస్తాడు. మనసు పని తీరును తీవ్రతరం చేస్తాడు. కోరిన దిశలో మరింత వేగంగా నడిపిస్తాడు. భోగులను భోగంవైపూ, యోగులను యోగంవైపూ, భావుకులను భావ తీవ్రతవైపూ, ప్రేమికులను ప్రేమ జ్వరం దిశగానూ, భక్తులను అనన్య భక్తి మార్గంలోనూ నడుపుతాడు. ‘చంద్రమా మనసో జాతంః’ చంద్రుడు విరాట్ పురుషుని మనసు నుండి సృష్టి అయినవాడు అని వేదం. అందుకే కాబోలు మనసుకు పున్నమి చంద్రుడంటే అంత వెర్రి ఆకర్షణ.అందునా, కార్తీక పూర్ణిమ మరీ అందమైంది. అసలే శరదృతువు. ఆపైన రాతిరి. ఆ పైన పున్నమి. పున్నమి అంటే మామూలు పున్నమి కాదు. పుచ్చ పూవు వెన్నెలల పున్నమి. మనసు చురుకుగా చిందులు వేస్తూ పరవశంతో, రెట్టింపు ఉత్సాహంతో విజృంభించి విహరించే సమయం.అయితే చిత్త నది ‘ఉభయతో వాహిని’ అన్నారు. అది ‘కల్యాణం’ (శుభం) దిశగానూ ప్రవహించగలదు. వినాశం దిశగానూ ప్రవహించ గలదు. మనస్సు యజమానిగా ఉండి, ఇంద్రియాలను నియంత్రిస్తే, చిత్త నది సరయిన దిశలో ప్రవహించేందుకు అవి సాయపడతాయి. ఇంద్రి యాలు లాక్కెళ్ళినట్టు, మనసు వెళితే ప్రవాహం వినాశం దిశ పడుతుంది.చదవండి: కార్తీక పూర్ణమి విశిష్టత.. త్రిపుర పూర్ణిమ అని ఎందుకు అంటారు?చిత్త నదిని ‘కల్యాణం’ దిశగా మళ్ళించే ప్రయత్నాలకు పున్నమి దినాలు అనువైనవనీ, పున్నములలో కార్తీక పూర్ణిమ ఉత్తమోత్తమమనీ భారతీయ సంప్రదాయం. ఈ పుణ్య దినాన చేసిన నదీస్నానాలకూ, తులసి పూజలకూ, జపతప దాన యజ్ఞ హోమాది కర్మలకూ ఫలితాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయని నమ్మిక. ప్రాకృతిక కారణాలవల్ల ఈ పర్వదినాన, మనసు మరింత శ్రద్ధా, శుద్ధీ నిలుపుకొనేందుకు సన్నద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈనాడు చేసే ఉపవాసాలూ, శివారాధనలూ, ప్రత్యేక దీపారాధనలూ, దీపదానాలూ, ఆలయాలలో ఆకాశ దీప నమస్కారాలూ, జ్వాలా తోరణ దర్శనాలూ వంటి పర్వదిన విధులు, సత్ఫలాలు కాంక్షించే సజ్జనులకు పెద్దలు చూపిన మార్గం.కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు!!– ఎం. మారుతి శాస్త్రి -
Karthika Pournima: కార్తీక పౌర్ణమి విశిష్టత..! త్రిపుర పూర్ణిమ అని ఎందుకు పిలుస్తారు?
కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. శివుడు , శ్రీమహా విష్ణువులని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, వారి అనుగ్రహం పొందేందుకు ఈ కార్తీక మాసం కన్నా పవిత్రమైనది మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కార్తీక మాసంలో కానీ ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున కానీ శివాలయాలు, విష్ణువు నెలవైన పుణ్యక్షేత్రాల్లో భగవంతుడిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇదే కార్తీక మాసాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. వారాణాసి లాంటి ఉత్తర భారతదేశంలోఇదే రోజుని దేవ దీపావళి, దేవ దివాళి అని పిలుస్తుంటారు. అలాగే అలాగే దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల దీన్ని త్రిపుర పూర్ణిమ అని పిలుస్తారు. అంత పరమ పవిత్రమైన ఈ కార్తీక పూర్ణిమ వెనుకున్న నేపథ్యం, ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా..!ఏం చేస్తారంటే..కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి ఆ పరమ శివుడిని పూజించి రోజంతా ఉపవాసం ఉండటం భక్తులకి ఆనవాయితీ. కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే , శరీరానికి ఎన్నో శక్తులు చేకూరుతాయని... అందులోనూ పవిత్రమైన నదుల్లో ఈ నదీ స్నానం మరింత పవిత్రతని , పుణ్యంని చేకూరుస్తుందనేది భక్తుల బలమైన విశ్వాసం. అందువల్లే కార్తీక పౌర్ణమి రోజున ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వారణాసి భక్తుల రాకతో కిటకిటలాడుతుంటుంది.ఇంట్లో తులసి మొక్కకు కానీ లేదా దేవాలయాల్లో కానీ ఇవాళ దీపారాధన చేస్తే మరింత పుణ్యం , పూజా ఫలం దక్కుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. కొంతమంది కార్తిక పౌర్ణమి రోజున 365 దీపాలు వెలిగిస్తుంటారు. దీనికి అర్థం.. సంవత్సరంలో ఒక్కో రోజుకి ఒక్కో దీపం చొప్పున అన్ని దీపాలు ఈ పరమ పవిత్రమైన రోజే వెలిగించి మీ అనుగ్రహం కోరుకుంటున్నాను దేవా అని.సత్యనారాయణ వ్రతం :సత్యనారాయణ వ్రతం జరుపుకోవడానికి కార్తీక పౌర్ణమి కన్నా అతి పవిత్రమైన రోజు మరొకటి లేదు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకు కారణం ఆ శ్రీ మహా విష్ణువుకి ఈ కార్తీక పౌర్ణమి అతి ప్రీతి పాత్రమైనది కావడమే. అందుకే మిగతా రోజుల్లో సత్యనారాయణ వ్రతం చేయడం కన్నా కార్తీక పౌర్ణమి రోజున చేసే వ్రతానికే పూజా ఫలం అధికం అని అంటుంటారు పెద్దలు.ఏకాదశి రుద్రాభిషేకం :ఈరోజు శివనామస్మరణతో మోగిపోయే ఆలయాలన్నింటిలో సర్వ సాధారణంగా కనిపించేది ఏకాదశి రుద్రాభిషేకం. పదకొండుసార్లు రుద్ర చమకం లేదా శివ నామస్మరణతో శివుడిని అభిషేకించడమే ఈ ఏకాదశి రుద్ర అభిషేకం ప్రత్యేకత. జ్వాలాతోరణం...ఈ రోజు సంధ్యాసమయంలో శివాలయంలో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఎండుగడ్డితో తాడును తయారు చేసి ఆలయం ముంగిట తోరణంగా అమర్చి దానిని ఆవునేతి దీపంతో వెలిగిస్తారు. పార్వతీపరమేశ్వరులను పల్లకిలో ఉంచి ఈ తోరణం నుంచి మూడుసార్లు ఊరేగిస్తారు. ఆ పల్లకిని అనుసరించి శివనామ జపం చేస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక జన్మల నుంచి చేసిన పాపాలన్నీ పటాపంచలై సుఖ సంతోషాలతో వర్థిల్లుతారని శాస్త్రవచనం.ఈ పూర్ణిమకు మరొక పేరు..కార్తీక పూర్ణిమ నాడు శంకరుడు త్రిపురాసురుణ్ణి వధించిన రోజు. అందువలన ఈరోజును త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తీకపురాణం ప్రకారం ఈరోజు దీపదానం, సాలగ్రామ దానం చేయాలి. దానధర్మాలు చేయాలి. ఇవి కోటిరెట్లు ఫలితాన్నిస్తాయని భక్తుల నమ్మకం. ఈ పౌర్ణమి రోజు అరుణాచల క్షేత్రంలో అఖండ జ్యోతి వెలిగిస్తారు. ప్రాముఖ్యత గలిగిన ఈ జ్యోతి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. పౌర్ణమినాడు శ్రీ కృష్ణుని రాసలీలకు పెట్టినది పేరు. అందువలన ఈ రోజు శ్రీ కృష్ణ స్మరణ కూడా అత్యంత ఫలవంతమైనది. మరోవేపు సిక్కులు , జైనులు కూడా..సిక్కులు , జైన మతస్తులు కూడా ఈ కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటుంటారు. సిక్కులు దైవంగా భావించే శ్రీ గురు నానక్ పుట్టింది కార్తీక పౌర్ణమి రోజే కావడంతో సిక్కులు ఈ రోజుని పవిత్రమైనదిగా భావిస్తారు. జైన్లు కూడా ఈ కార్తీక పౌర్ణమిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం విశేషం.(చదవండి: 365 వత్తులు..కార్తీక పురాణం ఏం చెబుతోంది?) -
డియోర్ బ్యాగ్‌పై క్లారిటీ.. ఎవరీ జయ కిషోరి
ఢిల్లీ: ఆధ్యాత్మిక వక్త జయ కిషోరి సుమారు రూ.2 లక్షల విలువైన డియోర్ బ్యాగ్‌తో ఇటీవల ఎయిర్‌పోర్టులో కనిపించారు. దీంతో నిరాడంబర జీవితం గడపాలని బోధనలు చేసే.. ఆమె ఇలా ఖరీదైన బ్యాగ్‌తో కనిపించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమె ఖరీదై బ్యాగ్ వాడటంపై ఫాలోవర్లు, నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై 29 ఏళ్ల జయ కిషోరీ తాజాగా స్పందించారు.‘‘నేను కూడా సాధారణ అమ్మాయినే. సాధారణమైన ఇంట్లోనే ఉంటున్నా. కుటుంబంతో కలిసి జీవిస్తున్నా. యువత కష్టపడాలి. కష్టపడి డబ్బులు సంపాదించాలి. మంచి జీవితం కోసం ఖర్చు పెట్టుకోవాలి. కుటుంబానికి ఇవ్వాలి. మీ కలలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పాను. ఈ బ్యాగ్ కస్టమైజ్డ్. అందులో లెదర్ ఉపయోగించలేదు. కస్టమైజ్డ్ అంటే మన ఇష్ట ప్రకారం తయారు చేసుకోవచ్చు. దానిపై నా పేరు కూడా రాసి ఉంది. ...నేనెప్పుడూ లెదర్ వాడలేదు, వాడను కూడా. నేను దేనినీ వదులుకోలేదు. కాబట్టి నేను అలా చేయమని మీకు ఎలా చెప్పగలను?. నేను సన్యాసిని, సాధువు లేదా సాధ్విని కాదని మొదటి రోజు నుంచే స్పష్టంగా చెబుతున్నా’’ అని ఆమె వివరించారు. జయ కిషోరికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 12.3 మిలియన్లకు ఫాలో అవుతున్నారు.Jaya Kishori ji Said I'm not BABa or SANT, I'm just ordinary girl !!Waah kya Acting hai phle Dharm k naam pr paisa chapo or fir ye gyaan do . waah DIDI waah 🫡 pic.twitter.com/bCQjD4zedE— Yogesh (@yogesh_xrma) October 29, 2024ఎవరీ జయ కిషోరి..యువ ఆధ్యాత్మిక వక్తగా జయ కిషోరి తన ప్రేరణాత్మక సందేశాల ద్వారా వార్తల్లో నిలిచారు. ఆమె ఆధ్యాత్మిక కథలు చెప్పటంతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆమె వక్తనే కాకుండా సంగీత కళాకారిణీ, కథకురాలు కూడా. జయ కిషోరి 13 జూలై, 1996న కోల్‌కతాలో జన్మించారు. కోల్‌కతాలోని మహాదేవి బిర్లా వరల్డ్ అకాడమీ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఓపెన్ స్కూల్ ద్వారా బి.కామ్ పూర్తి చేశారు. ఆమె ఫాలోవర్స్ ద్వారా 'ది మీరా ఆఫ్ మోడర్న్ వరల్డ్', 'కిషోరి జీ'గా ప్రసిద్ధి చెందారు. జయ కేవలం ఏడేళ్ల వయస్సులోనే బహిరంగంగా ఉపన్యాసం ఇవ్వటం ప్రారంభించారు. ఆమె తన 7 రోజుల నిడివి గల మానసిక కథ 'శ్రీమద్ భగవత్ గీత', 3 రోజుల నిడివి గల 'కథా నాని బాయి రో మేరో'తో గుర్తింపు పొందారు. మరోవైపు.. ఆమె శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఆమె భజనలు యూట్యూబ్‌లో కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ఆమె జూలై 24, 2021న ‘జయ కిషోరి ప్రేరణ’ అనే కొత్త యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. ఆమె ఛానెల్‌కు దాదాపు 9 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ప్రసిద్ధ పాటల్లో ‘శివ్ స్తోత్ర’, ‘మేరే కన్హా’, ‘సాజన్ మేరో గిర్ధారి’ వంటివి ఉన్నాయి.చదవండి: టికెట్ నిరాకరణ, సిట్టింగ్ ఎమ్మెల్యే అదృశ్యం.. ‘తగిన శాస్తి జరిగిందంటూ’... -
ఊరకరారు మహాత్ములు...
గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహా యజ్ఞాలలో ఐదవది – ‘....నృయజ్ఞోతిథిపూజనమ్’. అతిథిని పూజించేవాడు ఒక్క గృహస్థు మాత్రమే. నేను ఆహ్వానిస్తే నా ఇంటికి వచ్చినవాడు అతిథి. నేను ఆహ్వానించకుండా వచ్చినవాడు– అభ్యాగతుడు. అతిథి పూజనమ్...పూజించడం అంటే గౌరవించడం. ఇంటికి వచ్చినవారిపట్ల మర్యాదగా మెలుగుతూ గౌరవించి పంపడం నేర్చుకో... తన ఇంటికి వచ్చినవాడు గొప్పవాడా, నిరక్షరాస్యుడా, సామాన్యుడా అన్న వివక్ష గృహస్థుకు ఉండదు. భోజనం వేళకు వచ్చాడు. భోజనం పెట్టు. లేదా ఏ పండో కాయో లేదా కాసిని మంచినీళ్లయినా ఇవ్వు.. అన్ని వేళలా అన్ని పెట్టాలనేం లేదు. వచ్చిన వారిని ప్రేమగా పలకరించు. నీకూ పరిమితులు ఉండవచ్చు. వాటికి లోబడే ఎంత సమయాన్ని కేటాయించగలవో అంతే కేటాయించు. కానీ ఒట్టి చేతులతో పంపకు. పండో ఫలమో ఇవ్వు. లేదా కనీసం గుక్కెడు చల్లటి నీళ్ళయినా ఇవ్వు. నీకు సమయం లేక΄ోతే ఆ బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించు. అతిథి సేవతో గృహస్థు పాపాలు దహించుకు ΄ోతున్నాయి. కారణం – ఆయన ఏది పెడుతున్నాడో దానిని ‘నేను పెడుతున్నాను’ అన్న భావనతో పెట్టడు. వచ్చిన అతిథి నీ దగ్గరకు వచ్చి గుక్కెడు నీళ్ళు తాగాడు, ఫలహారం చేసాడు, భోజనం చేసాడు...అంటే అవి అతనికి లేక దొరకక రాలేదు నీదగ్గరికి. ఆయన హాయిగా అవన్నీ అనుభవిస్తున్న స్తోమత ఉన్నవాడే. కానీ ఆయన ఏదో కార్యం మీద వచ్చాడు. భగవంతుడు శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకుని రాడు నీ ఇంటికి. అతిథి రూపంలో వస్తాడు. ఆ సమయంలో నీవిచ్చిన నీళ్ళు తాగవచ్చు, పట్టెడన్నం తినవచ్చు, బట్టలు కూడా పుచ్చుకోవచ్చు. కానీ ఆయన పుచ్చుకున్న వాడిగా ఉంటాడు. అలా ఉండి నీ ఉద్ధరణకు కారణమవుతాడు. అందునా నీవు పిలవకుండానే వచ్చాడు. అభ్యాగతీ స్వయం విష్ణుః– విష్ణుమూర్తే నీ ఇంటికి వచ్చాడని గుర్తించు. మహితాత్ములైనవారు, భాగవతోత్తములు, భగవద్భక్తి కలవారు నీ ఇంటికి వస్తే.. గృహదేవతలు కూడా సంతోషిస్తారు.అంటే దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సులువైన మార్గం అతిథి పూజనమే. అతిథికి నీవు పెట్టలేదు. భగవంతుడే అతిథి రూపంలోవచ్చి నీదగ్గర తీసుకున్నాడు. అతిథిని మీరు విష్ణు స్వరూపంగా భావించి పెట్టినప్పుడు మీ అభ్యున్నతికి కారణమవుతుంది. మహాత్ములయినవారు మనింటికి వస్తూండడమే దానికి సంకేతం. శ్రీ కృష్ణుడి క్షేమ సమాచారం తెలుసుకురమ్మని వసుదేవుడు పంపిన పురోహితుడితో నందుడు ‘‘ఊరకరారు మహాత్ములు/ వారథముల యిండ్ల కడకు వచ్చుట లెల్లం/గారణము మంగళములకు/ నీ రాక శుభంబు మాకు, నిజము మహాత్మా !’’ అంటాడు. అతిథి ఇంట అడుగు పెట్టడం అంత గొప్పగా భావిస్తుంది మన సమాజం.రామకార్యంమీద పోతున్న హనుమకు మైనాకుడు ఆతిథ్యం స్వీకరించమని అర్ధిస్తాడు. ఇప్పుడు వీలుపడదంటే...కనీసం ఒక్క పండయినా తిని కాసేపు విశ్రాంతయినా తీసుకువెళ్ళమంటాడు. ఇంటి ముందు నిలిచిన బ్రహ్మచారి ‘భవతీ భిక్షాందేహి’ అంటే... ఇంట్లో ఏవీ లేవంటూ ఇల్లంతా వెతికి ఒక ఎండి΄ోయిన ఉసిరికాయ తెచ్చి శంకరుడి భిక్షా΄ాత్రలో వేస్తుంది ఒక పేదరాలు. ఆ మాత్రం అతిథి పూజకే ఆమె ఇంట బంగారు ఉసిరికకాయలు వర్షంలా కురిసాయి. -
సప్త మోక్షపురి..మాంగళ్య గౌరికాలయం..
మాంగల్య గౌరీ/మంగళ గౌరీ/సప్త మోక్షపురి/ పంచ గయా క్షేత్రం బీహార్‌లోని గయలో మంగళగౌరి కొండలు, ఫల్గుణీ నది ఒడ్డున ఉన్న 51 శక్తి పీఠాలలో ఒకటి. 15వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ ఆదిశక్తి దేవి పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. మంగళ గౌరీ ఆలయం గురించిన ప్రస్తావన పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, ఇతర గ్రంథాలు, తాంత్రిక రచనలలో తప్పక కనిపిస్తుంది. మంగళగౌరిని ఉపకార దేవతగా పూజిస్తారు. ఈ ఆలయం ఉప–శక్తి పీఠాన్ని కలిగి ఉంది. శ్రీ సతీదేవి శరీరభాగాలు భూమిపై పడిన 108 ప్రదేశాలను శక్తి పీఠాలుగా కొలుస్తారు. వాటిలోని కీలకమైన వాటిని 51 శక్తిపీఠాలుగా, తిరిగి వాటిలోని అత్యంత కీలకమైన వాటిని అష్టాదశ శక్తిపీఠాలుగా పూజిస్తారు. వాటిలో అమ్మవారి ఎడమ స్తనం పడిన ప్రదేశమే గయలోని మాంగళ్య గౌరికా ఆలయం. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి, శ్రీ సతీదేవి రొమ్ము భాగం భూమిపై పడిన ప్రదేశం శ్రీ మాంగల్య గౌరీ మందిరం. ఈ మందిరంలో రెండు గుండ్రని రాళ్లు ఉన్నాయి, ఇవి సతీదేవి స్తనాలను సూచిస్తాయి. ఇక్కడ శక్తి రొమ్ము రూపంలో పూజించ బడుతుంది, ఇది పోషణకు చిహ్నం. ఎవరైతే కోరికలు, ప్రార్థనలతో అమ్మ దగ్గరకు వస్తారో, వారు అన్ని కోరికలు తీరి విజయవంతంగా తిరిగి వస్తారని నమ్ముతారు. సతీదేవి మృతదేహంతో శివుడు కైలాసానికి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ప్రదేశం గుండా వెళ్ళాడు అంటారు. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం మంగళగౌరి కొండపై నిర్మితమైంది. గుడికి చేరుకోవాలంటే ఆ చిన్న కొండ ఎక్కాలి. మెట్ల మార్గం స్థానిక ప్రజల నివాసాల మధ్య ఉంటుంది. మెట్ల మార్గం ప్రారంభంలో, భీముని ఆలయం ఉంది. అతని మోకాలి ముద్రను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ భీముడు శ్రాద్ధకర్మ చేసాడు, అందుకే దీనిని భీమవేది గయ అని పిలుస్తారు.కొండపై కూర్చున్న అమ్మవారిని దయగల దేవతగా భావిస్తారు. వర్షాకాలంలో ప్రతి మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్త్రీలు తమ కుటుంబాలు అభివృద్ధి చెందాలని, వారి భర్తలు విజయం, కీర్తిని పొందాలని ఉపవాసం ఉంటారు. ఈ పూజలో మంగళ గౌరీ దేవికి 16 రకాల కంకణాలు, 7 రకాల పండ్లు, 5 రకాల మిఠాయిలు నైవేద్యంగా పెట్టడం మొదటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. మంగళ గౌరీ ఆలయంలో శివుడు, దుర్గ, దక్షిణ–కాళి, మహిషాసుర మర్దిని, సతీదేవి వివిధ రూపాలను చూడవచ్చు. ఈ ఆలయ వివరణ పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, శ్రీ దేవి భాగవత పురాణం, మార్కండేయ పురాణాలలో కూడా ఉంది. ఈ ఆలయ సముదాయంలో కాళి, గణపతి, శివుడు, హనుమంతుని ఆలయాలు కూడా ఉన్నాయి. ఆశ్వీయుజ మాసంలో జరిగే లక్షలాది మంది భక్తులు ఉత్సవాలలో పాల్గొనేందుకు ఆలయానికి వస్తుంటారు.ఈ క్షేత్రంలోని ప్రసిద్ధ పండుగ ’నవరాత్రి’, ఇది అక్టోబర్‌లో జరుగుతుంది. ఈ మందిరం ‘మరణానంతర క్రతువులకు’ (శ్రాద్ధము) ప్రసిద్ధి చెందింది. ‘మహా–అష్టమి’ (ఎనిమిదవ రోజు), భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతారు. ఈ ఆలయంలో జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ మంగళ గౌరీ వ్రతం (వ్రతం), దీనిని మహిళలు తమ కోరికల సాఫల్యం కోసం చేస్తారు. మంగళవారాలలో ఉపవాసం ఉండి, స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితం, సంతానం, కుటుంబ శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. కొత్తగా పెళ్లయిన స్త్రీలు ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు, ఇతర వివాహిత స్త్రీలందరూ శ్రావణ మాసంలో మాత్రమే వ్రతం చేస్తారు. ఇవే కాకుండా, ఈ ఆలయంలో దీపావళి, హోలీ, జన్మాష్టమి వంటి ఇతర ప్రధాన పండుగలను కూడా బాగా జరుపుకుంటారు. ఆలయం ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు తెరిచి ఉంటుంది. ఎలా వెళ్లాలి?గచ రైల్వే జంక్షన్ ఆలయానికి 4 కిమీ దూరం, బస్ స్టాండ్ ఆలయం నుండి 4.7 కిమీ దూరంలో ఉంది. -
Ananda Nilayam: ఒకేచోట.. ఈ అష్టాదశ శక్తిపీఠాలు!
పురాణాల ప్రకారం, అమ్మవారిని ఆరాధించే దేవాలయాలలో ప్రశస్తమైనవి అష్టాదశ శక్తిపీఠాలు. శివుడి అర్ధాంగి సతీదేవి శరీరం 18 ముక్కలై, 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ శక్తిపీఠాలను దర్శించుకుని, అమ్మవార్ల అనుగ్రహం పొందాలని భక్తులు భావిçస్తుంటారు. రకరకాల కారణాల వల్ల కొంతమందికి శక్తిపీఠాల దర్శనభాగ్యం కరవవుతోంది. అలాంటివారికి అన్ని శక్తిపీఠాలను ఒకేచోట దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తూ అష్టాదశ శ«క్తిపీఠాలన్నిటినీ ఒకే దగ్గర నిర్మించారు.అది ఎక్కడో కాదు తెలంగాణ, సిద్దిపేట జిల్లా, కొండపాక గ్రామ శివారులోని ఆనంద నిలయంలో! గత ఏడాది నవంబరులో.. ఇక్కడి అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో 18 శక్తిపీఠాలతో పాటు లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివపార్వతులనూ ప్రతిష్ఠించారు.గట్టు రాంరాజేశం గుప్త సంకల్పంతో..సిద్దిపేటకు చెందిన గట్టు రాంరాజేశం గుప్త అమ్మవారికి అపర భక్తుడు. అష్టాదశ శక్తి పీఠాలన్నిటినీ ఒకే దగ్గర నిర్మించాలని ఆయన చిరకాల కోరిక. ఒకసారి, తన మనసులో మాటను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆనంద నిలయ వ్యూహకర్త కేవీ రమణాచారి ముందుంచారు. ఆయన ట్రస్ట్ సభ్యులతో చర్చించి, ఆనంద నిలయంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా రాంరాజేశం రూ. 1.5 కోట్లను అందజేశారు. ఆనంద నిలయం వృద్ధాశ్రమ ట్రస్ట్ సభ్యులు, ఇతర దాతల సహకారంతో మొత్తం రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాలను నిర్మించారు. అమ్మవార్ల రాతి విగ్రహాలను తమిళనాడులో తయారుచేయించారు. వీటిని పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి, శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రతిష్ఠించారు.22 దేవాలయాలు..పద్దెనిమిది శక్తిపీఠాల్లో పదిహేడు మనదేశంలో ఉండగా, శాంకరీదేవి శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. మన దేశంలో ఉన్న కామాక్షీదేవి (కంచి, తమిళనాడు), శృంఖలాదేవి (కోల్‌కతా, పశ్చిమబెంగాల్), చాముండేశ్వరీదేవి (మైసూరు, కర్ణాటక), జోగులాంబ (ఆలంపూర్, తెలంగాణ), భ్రమరాంబికాదేవి (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్), మహాలక్ష్మీదేవి (కొల్హాపూర్, మహారాష్ట్ర), ఏకవీరాదేవి (మాహుర్, మహారాష్ట్ర), మహాకాళీదేవి (ఉజ్జయిని, మధ్యప్రదేశ్), పురుహూతికాదేవి (పిఠాపురం, ఆంధ్రప్రదేశ్), గిరిజాదేవి (జాజ్‌పూర్, ఒడిశా), మాణిక్యాంబాదేవి (ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్), కామాఖ్యాదేవి ( గౌహతి, అస్సాం), మాధవేశ్వరీదేవి (ప్రయాగ, ఉత్తరప్రదేశ్), వైష్ణవీదేవి (జమ్మూ, జమ్మూ– కశ్మీర్ రాష్ట్రం), మంగళగౌరీదేవి (గయ, బిహార్), విశాలాక్షీ (కాశి), సరస్వతీదేవి (శ్రీనగర్) రూపాలను కొండపాక శివారులోని ఆనంద నిలయంలో దర్శించుకోవచ్చు. ఇదే ప్రాంగణంలో లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మరకత లింగం, శివపార్వతులతో కూడిన 22 దేవాలయాలను నిర్మించడం విశేషం. ఆయా శక్తిపీఠాల్లో జరిగినట్లుగానే ఇక్కడా పూజాకార్యక్రమాలుంటాయి. ప్రతి పౌర్ణమికి హోమం, ప్రతి శుక్రవారం అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేస్తారు. దర్శనానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు.సామాజిక సేవ.. ఆధ్యాత్మిక శోభ!ఆనంద నిలయంలో సామాజిక సేవతోపాటు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. సుమారు వంద ఎకరాల్లోని ఈ ట్రస్ట్‌లో ఒకవైపు వృద్ధాశ్రమం, మరోవైపు అనాథాశ్రమం, ఇంకోవైపు సత్యసాయి పిల్లల హృద్రోగ ఆసుపత్రి, జూనియర్ కళాశాల ఉన్నాయి. భక్తులు, సామాజిక సేవకుల సందర్శనతో ఈ ప్రాంగణమంతా సందడిగా ఉంటుంది. ఇది హైదరాబాద్‌కు 73 కిలోమీటర్లు, సిద్దిపేటకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట, ఫొటోలు: కె సతీష్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్శక్తిపీఠాల్లో జరిగినట్టుగానే..ఇక్కడ పూజాకార్యక్రమాలన్నిటినీ శక్తిపీఠాల్లో మాదిరే జరుపుతాం. భక్తులు అమ్మవార్లకు ఒడి బియ్యం పోస్తారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక అలంకరణ ఉంటుంది. ప్రతిరోజు శివుడికి, మరకత లింగానికి రుద్రాభిషేకం చేస్తాం. – పురుషోత్తమ రామానుజ, అర్చకుడుఅందరికీ దర్శనభాగ్యం కలగాలని.. అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకోవటం కొందరికి సాధ్యపడకపోవచ్చు. అలాంటివారికి శక్తిపీఠాల దర్శనభాగ్యం అందాలనేది నాన్నగారి కోరిక. కేవీ రమణాచారి, ఇంకెంతో మంది దాతల సహకారంతో నేడు అది నెరవేరింది. – గట్టు అమర్నాథ్, రవి, శ్రీనివాస్అమ్మవారి అనుగ్రహం..కొండపాకలో అష్టాదశ శక్తిపీఠాల నిర్మాణం అమ్మవారి దయ. అమ్మవారి అనుగ్రహం, అందరి సహకారంతో దేవాలయ నిర్మాణాలు సాధ్యమయ్యాయి. – డాక్టర్ కేవీ రమణాచారి, ఆనంద నిలయ వ్యూహకర్తఇవి చదవండి: అవును..! వారిది గుర్తింపు కోసం ఆరాటమే..