grand alliance
-
బెంగాల్లో కాంగ్రెస్, సీపీఎంలది మరోదారి: మమత
కూచ్‌బెహార్: కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు తాను ప్రయత్నిస్తుండగా, తమ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, సీపీఎం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీల చర్యలు రాష్ట్రంలో బీజేపీకి లాభం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. కూచ్‌బెహార్‌లో సోమవారం జరిగిన పంచాయతీ ఎన్నికల ర్యాలీలో మమత మాట్లాడారు. ‘కేంద్రంలోని బీజేపీపై పోరాడేందుకు మేం మహా కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ, బెంగాల్‌ల్లో మాత్రం సీపీఎం, కాంగ్రెస్‌లు బీజేపీతో కలిసి పనిచేస్తున్నాయి. అటువంటి అపవిత్ర బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాం’అని పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ బెంగాల్ అధ్యక్షుడు ఆధిర్ రంజన్ ఛౌధురి స్పందించారు. బీజేపీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో టీఎంసీ విశ్వసనీయతపై ఎప్పటి నుంచో అనుమానాలున్నాయన్నారు. బీజేపీపై పోరాటం విషయంలో తమకు చెప్పే అర్హత మమతా బెనర్జీకి లేదని సీపీఎం ఎదురుదాడి చేసింది. ఈ నెల 23న బిహార్‌లోని పట్నాలో సీఎం నితీశ్ సారథ్యంలో 12కు పైగా రాజకీయ పార్టీల నేతలు సమావేశమై 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోరాడాలని వీరు నిర్ణయించారు. తాజాగా మమతా బెనర్జీ మరో బాంబు పేల్చడం గమనార్హం. -
నితీష్‌తో భేటీ.. ప్రతిపక్షాల ఐక్యతపై సీఎం మమతా కీలక వ్యాఖ్యలు
లక్నో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేపనిలో పడ్డారు బీహార్ సీఎం నితీష్ కుమార్. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా పోరాడటంపై నితీశ్ కీలక ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆయన నేడు(సోమవారం) పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ పశ్చిమబెంగాల్ సచివాలయానికి చేరుకున్న ఆయన.. దీదీతో ప్రతిపక్షాల ఐక్యతపై చర్చలు జరిపారు. ఈ భేటీ అనంతరం నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు విషయంలో తనకు ఎలాంటి ఇగో(అహం) లేదని స్పష్టం చేశారు. అందరం కలిసి సమష్టిగా ముందుకు వెళ్తామని తెలిపారు. అంతేగాక వచ్చే ఎన్నికలు ప్రజలు వర్సెస్ బీజేపీగా జరగనున్నాయని, ఈ పోరులో భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలు కలిసి రావడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని ఇంతకుముందు కూడా చెప్పినట్లు పేర్కొన్నారు. చదవండి: ‘ఒవైసీ అంటూ ఎంతకాలం ఏడుస్తారు?’ నితిష్ కుమార్‌ను తను ఒక్కటే అభ్యర్థించినట్లు పేర్కొన్నారు. జయప్రకాశ్ నారాయణ ఉద్యమం ప్రారంభించిన బిహార్‌లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే మన తదుపరి కార్యచారణ ఏంటో నిర్ణయించుకోవచ్చని సూచించినట్లు తెలిపారు. అయితే ముందుగా మనం ఐక్యంగా ఉన్నామనే సందేశం ప్రజలకు చేరాలని ఇందులో తనకేం అభ్యంతరం లేదని చెప్పారు. ‘బీజేపీని జీరో చేయడమే నాకు కావాలి. మీడియా సపోర్టు, అబద్ధాలతో వారు హీరోలయ్యారు’ అని మమతా పేర్కొన్నారు. అయితే ఇటీవల లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీ అనర్హత వేటు వేయడంతో ప్రతిపక్ష పార్టీల మధ్య అరుదైన ఐక్యత చోటు చేసుకుంది. అనంతరం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, నితీష్ కుమార్, తేజస్వి యాదవ్‌ల భేటీతో బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈక్రమంలోనే మహాకూటమి ఏర్పాటు కోసం ప్రతిపక్షాలను ఏకం చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగా దాదాపు అన్ని పార్టీల నాయకులతో సమావేశమవుతూ వస్తున్నారు నితీష్. బీజేపీని గద్దె దించేందుకు ఐక్యంగా ముందుకు సాగేందుకు విపక్షాలను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశయ్యారు. మమతాతో భేటీ అనంతరం సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ కుమార్‌తో కూడా చర్చలు జరపనున్నారు. చదవండి: యూపీలో దారుణం.. హోటల్ గదిలో విగతజీవిగా వైద్యాధికారి -
ఆర్జేడీకి 144, కాంగ్రెస్‌కు 70 సీట్లు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బహుళ పార్టీల మహాకూటమిలో సీట్ల పంపకం శనివారం దాదాపు పూర్తయ్యింది. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) చీఫ్ తేజస్వీ యాదవ్‌ను కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీట్ల పంపకంలోనూ ఆ పార్టీకే అగ్రస్థానం దక్కింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా, ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేయనుంది. కాంగ్రెస్‌కు 70 సీట్లు, సీపీఐ(ఎంఎల్)కు 19, సీపీఐకి 6, సీపీఎంకు 4 సీట్లు కేటాయించారు. వాల్మీకీ నగర్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 7న జరగనున్న ఉలప ఎన్నికలో మహా కూటమి తరపున కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలిపేలా ఒప్పందం కుదిరింది. తమ పార్టీకి దక్కిన 144 సీట్లలో కొన్ని స్థానాలను వికాశీల్ ఇన్సాస్ పార్టీకి(వీఐపీ), జేఎంఎంకు కేటాయిస్తామని ఆర్జేడీ ప్రకటించింది. సీట్ల పంపకంలో తీమకు అన్యాయం జరిగింది, ఇతర పార్టీల నేతలు వెన్నుపోటు పొడిచారని, మహా కూటమి నుంచి తాము తప్పుకుంటున్నట్లు వికాశీల్ ఇన్సాస్ పార్టీ అధినేత ముకేశ్ సాహ్నీ ప్రకటించారు. బిహార్ బీఎస్పీ చీఫ్ రాజీనామా బీఎస్పీ అధినేత మాయావతికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ బిహార్ శాఖ అధ్యక్షుడు భరత్ బింద్ శనివారం బీఎస్పీకి రాజీనామా చేసి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరారు. ఆర్జేడీ నేత తేజస్వీ ఆయనకు పార్టీ సభ్యత్వం అందజేశారు. సరికొత్త బిహార్ నిర్మాణానికి, యువజన వ్యతిరేకి అయిన ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి భరత్ తమ పార్టీలో చేరారని తేజస్వీ ట్వీట్‌చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ, జనతాంత్రిక్ పార్టీ(సోషలిస్టు) కలిసి మహాకూటమిగా ఏర్పడి బరిలో దిగడం తెల్సిందే. -
‘మహాకూటమి తలుపులెప్పుడు తెరిచే ఉంటాయి’
పట్నా : నూతనంగా ఏర్పాడిన కేంద్ర మంత్రి వర్గంలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే ఆయన ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ లీడర్ రబ్రీ దేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి తలుపులెప్పుడు తెరిచే ఉంటాయని.. నితీష్ కుమార్ ఎప్పుడైనా కూటమిలో చేరవచ్చని ఆమె ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నితీష్ కుమార్ మహాకూటమిలో చేరతానంటే మాకేం అభ్యంతరం లేదు. మేం ఆయనను స్వాగతిస్తున్నాం’ అన్నారు. ఆర్జేడీ నిర్ణయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకుడు రఘువంశ ప్రసాద్ సింగ్ స్వాగతించారు. అయితే నితీష్ ఎప్పుడు ఎవరి వైపు మారతాడో.. ఎవరికి మద్దతిస్తాడో ఊహించలేం అన్నాడు. గతంలో చాలా సార్లు అతను ఇలానే చేశాడని గుర్తు చేసుకున్నారు. అయితే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకునే వారికి తాను మద్దతిస్తానని తెలిపాడు. రెండు సంవత్సరాల క్రితం నితీష్ కుమార్ మహాకూటమి నుంచి బయటకు వచ్చి.. ఎన్డీఏతో చేరిన సంగతి తెలిసిందే. -
‘నితీష్జీ కూటమిలో చేరండి’
పట్నా : కేంద్ర మంత్రివర్గంలో బెర్తులపై బీజేపీ పట్ల కినుక వహించిన బిహార్ సీఎం నితీష్ కుమార్‌ను తిరిగి మహాకూటమిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. నితీష్ కుమార్ మహాకూటమి గూటికి చేరాలని లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఆహ్వానించింది. నితీష్ కుమార్‌ను బీజేపీ అవమానిస్తున్న క్రమంలో బీజేపీయేతర శక్తుల పునరేకీకరణకు ఇదే సరైన సమయమని ఆర్జేడీ ఉపాధ్యక్షుడు రఘ్‌వంశ్ ప్రసాద్ సింగ్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం నేపథ్యంలో భాగస్వామ్య పక్షాల నుంచి పార్టీకి ఒకరి చొప్పున మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న కాషాయ పార్టీ నిర్ణయంతో నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరబోదని నితీష్ స్పష్టం చేశారు. బీజేపీతో కలిసి బిహార్‌లో 17 స్ధానాల్లో పోటీ చేసిన జేడీ(యూ) 16 స్ధానాల్లో గెలుపొందడంతో కేంద్ర క్యాబినెట్లో ఎక్కువ మందికి చోటు దక్కుతుందని ఆ పార్టీ వర్గాలు ఆశించినా ఆ మేరకు ప్రాధాన్యం దక్కకపోవడంతో నితీష్ కంగుతున్నారు. ఎన్డీయేలో అంతా బాగానే ఉందని వ్యాఖ్యానించిన నితీష్ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాగైనా జరగవచ్చని పేర్కొనడం గమనార్హం. -
‘మహా కూటమి’ ఏర్పడితే ఏమయ్యేది ?!
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీకి ప్రత్యామ్నాయంగా పటిష్టమైన మహా కూటమిని కూడగట్టడంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విఫలమవడం వల్లనే మరోమారు నరేంద్ర మోదీ ప్రధాన మంత్రయ్యారంటూ రాహుల్‌పై విమర్శలు వెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ కూటమితో జతకట్టి ఉన్నట్లయితే, మహారాష్ట్రలో వంచిత్ బహుజన్ అఘాదితో విభేదాలు పరిష్కరించుకున్నట్లయితే, ఢిల్లీలో ఆప్‌తో జతకట్టి ఉన్నట్లయితే ఫలితాలు వేరుగా ఉండేవని కొన్ని రాజకీయ పక్షాలు వాదిస్తున్నాయి. వారి వాదనలో నిజమెంత? వారన్నట్లుగా ఇవన్నీ పక్షాలు కలిసి మహా కూటమిగా పోటీ చేసి ఉన్నట్లయితే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండేవి ? ఏడాది క్రితం కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలు ఏకమైనప్పుడు దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్ని ఏకమవుతాయన్న ఆశలు చిగురించాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇది కుదిరి, కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాల మధ్య ఐక్యత కుదరకపోవడం వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చాయి. తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ జత కట్టడం వల్ల 38 సీట్లకుగాను 37 సీట్లను ప్రతిపక్షాలు గెలుచుకోగలిగాయి. బీహార్‌లో ఒక్క రాష్ట్రీయ జనతాదళ్‌తోనే కాకుండా అన్ని ప్రతిపక్షాలతో కలిసి మహా కూటమిగా పోటీ చేసినా 40 సీట్లకుగాను ఒక్క సీటు మాత్రమే దక్కింది. బీజేపీ ప్రభంజనాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమైనా దాన్ని అడ్డుకునేవి కావు. ఎందుకంటే 13 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బీజేపీకి 50 శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో 159 సీట్లు ఉండగా, కాంగ్రెస్–మిత్రపక్షాలకు పది సీట్లు రాగా, కూటమిలో చేరే అవకాశం ఉండిన పార్టీలకు 17 సీట్లు వచ్చాయి. బీజేపీ కూటమికి 132 సీట్లు వచ్చేవి. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేకపక్షాలన్నింటితో కలిసి కాంగ్రెస్ పోటీచేసి ఉన్నట్లయితే ఈ కూటమికి అదనంగా 18 సీట్లు వచ్చేవి. అంటే బీజేపీకి కూటమికి 104, వ్యతిరేక కూటమికి 45 వచ్చి ఉండేవి. ఆయా పార్టీలకు వచ్చిన పోలింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకుంటేనే ఈ లెక్క తేలింది. పార్టీలు పొత్తు కుదుర్చుకున్నప్పుడు ఒక్క పార్టీకి వచ్చే ఓట్ల శాతం పూర్తిగా ఇతర పార్టీలకు రావు. ఆ లెక్కన ఈ 18 సీట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అస్సాంలో అఖిల భారత ఐక్య ప్రజాస్వామిక ఫ్రంట్ (ఏఐయుడిఎఫ్)తో పొత్తు పెట్టుకున్నట్లయితే కరీంగంజ్ నియోజకవర్గంలో గెలవడం ద్వారా కాంగ్రెస్ కూటమికి ఒక్క సీటు వచ్చేది. అక్కడ బీజేపీ అభ్యర్థి కృఫాల్నాథ్ మల్లా 44.62 శాతం ఓట్లతో విజయం సాధించారు. అక్కడ ఫ్రంట్ అభ్యర్థి రాధేశ్వామ్ బిశ్వాస్కన్నా బీజేపీ అభ్యర్థికి కేవలం 3.62 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి స్వరూప్ దాస్‌కు 11.36 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓటింగ్ శాతాన్ని కూడితే ఫ్రంట్ అభ్యర్థి గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ముస్లిం అంతా మైనారిటీ వర్గాలకు ప్రతినిధిగా భావిస్తోన్న ఫ్రంట్ అభ్యర్థికి ఓటు వేశారు. ఫ్రంట్, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకన్నట్లయితే కొత్త మంది ముస్లింలు ఓటింగ్‌కే వచ్చేవారు కాదు. ఢిల్లీలో ఢిల్లీలో చివరకు ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదురుతుందని ఇరువర్గాలు భావించాయి. ఆ రెండు కలిస్తే బీజేపీకి గట్టిపోటీ అవుతుందని రాజకీయ పరిశీలకులు భావించారు. కానీ అది జరిగి ఉండేది కాదు. ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల్లో 50 శాతానికిపైగా ఓట్ల తేడాతోనే బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. పైగా ఢిల్లీ ఓటర్లు కేంద్రంలో విజయం సాధించే అవకాశం ఉన్న పార్టీకే సహజంగా ఓటు వేస్తారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ హర్యానాలోని జన్నాయక్ జనతా పార్టీ లేదా బహుజన సమాజ్ పార్టీతోని పొత్తు పెట్టుకున్నట్లయితే ఒక్క రోహతక్ నియోజకవర్గం సీటు మాత్రమే కాంగ్రెస్ కూటమికి వచ్చేది. అక్కడ బీజేపీ అభ్యర్థి కేవలం 7,503 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, జన్నాయక్ జనతా పార్టీ అభ్యర్థికి 21,211, బీఎస్పీకి 38,364 ఓట్లు వచ్చాయి. ఇందులో ఏ ఒక్క పార్టీతోని పొత్తుపెట్టుకున్నా కాంగ్రెస్ కూటమికి ఈ సీటు వచ్చేది. మహారాష్ట్రలో మహారాష్ట్రలో అన్ని బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒక్కటై ఉన్నట్లయితే కాస్త మంచి ఫలితాలే వచ్చేవి. అంటే ప్రకాష్ అంబేద్కర్ నాయకత్వంలోని వంచిత్ బహుజన్ అఘాదితో కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి పొత్తు పెట్టుకున్నట్లయితే బుల్దానా, హాత్కనంగల్, పర్భణి, సోలాపూర్, నాందేడ్, సాంగ్లీ, గడ్చీరోలి చిమూర్...ఏడు సీట్లను గెలుచుకునేది. అంటే కాంగ్రెస్ కూటమికి ఐదు బదులు 12 సీట్లు వచ్చేవి. బీజేపీ–శివసేన కూటమికి 41కి బదులు 34 వచ్చేవి. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, తన మిత్రపక్షమైన జన అధికార్ పార్టీతో కలిసి ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమితో కలిసి పోటీ చేసినట్లయితే దౌరాష్ట్ర, మీరట్, బదౌన్, బారబంకి, బాండా, సుల్తాన్పూర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, ఛందౌలి...తొమ్మిది సీట్లు ఎక్కువ వచ్చేవి. అంటే రాష్ట్రంలోని 80 సీట్లకుగాను మహా కూటమికి 24 సీట్లు వచ్చేవి. బీజేపీ కూటమికి 64కు బదులు 56 సీట్లు వచ్చేవి. మొత్తంగా కాంగ్రెస్ కూటమికి 18 సీట్లు పెరిగేవి, బీజేపీ కూటమికి 18 సీట్లు తగ్గేవి. దీనివల్ల ఫలితం ఏమీ ఉండేది కాదు. -
చంద్రబాబు గేమ్ ప్లాన్‌కి మమత బ్రేక్
-
‘రాహుల్ వల్లే కూటమి నుంచి తప్పుకొన్నాను’
పట్నా : రాహుల్ గాంధీ వల్లే తాను మహాకూటమి నుంచి బయటకు వచ్చానని తెలిపారు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఈ విషయం గురించి నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ మీద వచ్చిన అవినీతి ఆరోపణల పట్ల రాహుల్ గాంధీ ఒక స్టాండ్ తీసుకోలేకపోయారు. అవినీతి, నేరాలు, మతోన్మాదం వంటి అంశాలను నేను ఎన్నటికి అంగీకరించను. ఆర్జేడీ విధానాలు ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవు. దాంతో వారితో కలిసి పనిచేయడం నాకు చాలా కష్టంగా మారింద’ని తెలిపారు. అంతేకాక ‘ప్రతి విషయంలో వాళ్లు నాకు అడ్డుపడేవారు. ఆ పార్టీ కార్యకర్తలు నా అనుమతి లేకుండానే ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసేవారు. ఇవన్ని నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాయి. అయితే వీటన్నింటి గురించి రాహుల్ గాంధీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో నేను కూటమి నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింద’ని తెలిపారు. -
మోదీ సర్వేలో విపక్ష కూటమిపై ప్రశ్న
న్యూఢిల్లీ: ‘బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏర్పాటు చేసుకున్న మహా కూటమి ప్రభావం మీ నియోజకవర్గంలో ఉంటుందా?’.. ఈ ప్రశ్న ప్రధాని నరేంద్ర మోదీకు సంబంధించిన నమో యాప్‌లో నిర్వహిస్తున్న ‘పీపుల్స్ పల్స్’ సర్వేలోనిది. దీంతో పాటు పలు ఇతర ప్రశ్నలకు కూడా ఈ సర్వేలో పాల్గొనేవారు సమాధానమివ్వాల్సి ఉంటుంది. ఈ సర్వేలో పాల్గొనాల్సిందిగా పౌరులను కోరుతూ ఓ చిన్న వీడియోను తన ట్విటర్ హ్యాండిల్లో సోమవారం ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. ‘నమో యాప్‌లో ఓ సర్వే ప్రారంభమైంది. అందులో పాల్గొని మీ అభిప్రాయాలు చెప్పాలని కోరుతున్నా. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో అవి మాకు తోడ్పడుతాయి’ అని అందులో మోదీ పేర్కొన్నారు. రాష్ట్రం, నియోజకవర్గం, అవినీతి రహిత పాలన, స్వచ్ఛభారత్, మౌలిక వసతులు, చవకగా ఆరోగ్యం, ఆర్థిక రంగం, జాతీయ భద్రత, ఉపాధి, గ్రామీణ విద్యుదీకరణ.. తదితరాలపై పలు ప్రశ్నలున్నాయి. -
బెడిసి కొట్టిన రాజకీయ క్రీడ
సందర్భం ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో విలక్షత కన్పించింది ఒక్క తెలంగాణలోనే. తక్కిన 4 రాష్ట్రాలలో ఓటర్లు మార్పును ఆశించారు, ఆహ్వానించారు. తెలంగాణ ఓటరు మాత్రం తమకు ఆ అవసరం లేదని తేల్చిచెప్పారు. ప్రజా కూటమి పేరుతో సిద్ధాంతరాహిత్యంతో ఒక్కటై పోటీ చేసిన కాంగ్రెస్, తెలుగుదేశం, టీజెఎస్, సీపీఐలకు ఎదురైంది ఓటమి అనేకంటే ఘోరపరాభవం అనడం సముచితం. బలం లేకున్నా.. అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి 103 చోట్ల డిపాజిట్లు కోల్పోయి బీజేపీ తన పరువు తానే తీసుకొంది. కుల పార్టీలతో కలిసి ‘బహుజన లెఫ్ట్ పార్టీ’గా సీపీఎం జనం ముందుకెళ్లినా లభించింది సున్నాయే! సంక్షేమాన్ని నమ్ముకున్న టీఆర్ఎస్ : కేసీఆర్ పాలనలో ఎన్నదగినది ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేయడం. బడ్జెట్ నిధుల్లో 39% మేర సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతూ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలుస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మొక్కుబడిగా కాకుండా నిజాయితీగా, చిత్తశుద్ధితో తమ జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తెచ్చేందుకు కృషి చేయడాన్ని వేరొకరు కాకుండా ఆయా వర్గాలు గ్రహించగలిగాయి. విశిష్ట పథకాలుగా కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, కంటి పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ, పండుగలకు పేదలకు అభివృద్ధి కానుకల పంపిణీ, పేదలకు డబుల్ బెడ్రూవ్ు ఇళ్ల నిర్మాణం మొదలైన పథకాలు సామాన్యులను ప్రభావితం చేశాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మొదలైనవి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అన్నింటికన్నా మిన్నగా రైతు భీమా, వ్యవసాయ పెట్టుబడి రాయితీలు, సాగునీటి పథకాలు, హామీ మేరకు వ్యవసాయ రుణమాఫీ లాంటివి రైతాంగంలో ఎనలేని భరోసా కల్గించగలిగాయి. పైగా, గొర్రెల పంపిణీ, పాల పశువుల పంపిణీ, చేప పిల్లల పంపిణీ లాంటివి సామాన్యుని మనో ధైర్యాన్ని పెంచాయి. కనుకనే ఎవరెన్ని విధాలుగా ప్రచారం చేసినా, వాటిని చెవికెక్కించుకోకుండా ప్రజలు తమ కృతజ్ఞతను ఓట్ల రూపంలో చాటుకున్నారు. ప్రజా కూటమి విఫలం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌పార్టీ తొలి రోజు నుండి టీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న మాట నిజమే. అయితే, 2014లో ఎదురైన ఓటమి తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు, ఆధిపత్య ధోరణులు తగ్గలేదు. దానికితోడు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత, ఎక్కువ పెత్తనం అప్పజెప్పడం చాలామందికి మింగుడు పడలేదు. పీసీసీ అధ్య క్షుడ్ని, రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడ్ని తప్పించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. వ్యక్తులపరంగా అధికార పార్టీని విమర్శించడంలో కాంగ్రెస్ నేతలు ముందున్నప్పటికీ, ఐక్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధించలేకపోయారు.మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తన సహజలక్షణాలను విడిచిపెట్టలేదు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ బలపడలేదు. ఇక, ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీతో జతకట్టడం ఆ పార్టీకి ఆత్మహత్యాసదృశమైంది. నిర్మాణం గానీ, నాయకులు గానీ లేని కోదండరావ్ పార్టీని కలుపుకోవడం కాంగ్రెస్ చేసిన మరో తప్పిదం. సీపీఐను కలుపుకోవడం వల్ల ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొంతమేర లాభం చేకూరింది. మొత్తం మీద ‘ప్రజాకూటమి’ ఏర్పాటు అన్నది సహజ రాజకీయ ప్రక్రియగా జరగలేదు. తెలంగాణ ఉద్యమం ఆసాంతం నడిచింది ఆత్మగౌరవ నినాదాంతోనే. అటువంటిది ప్రజా కూటమి గెలిస్తే ప్రత్యేకంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు తిరిగి పెత్తనం సాగించ గలడన్న భయాందోళనలు తెలంగాణ ప్రజల్లో ప్రస్ఫుటంగా కన్పించాయి. చంద్రబాబు పదేళ్ల పాలనలో ‘పల్లెకన్నీరు’ పెట్టింది. రైతాంగం, చేనేతలు, కులవత్తులవారి ఆత్మహత్యలు, ఆకలి చావులతో తెలంగాణ పల్లెల్లో మత్యు ఘోష విన్పించింది. ఫలితంగానే, టీఆర్ఎస్కు ప్రజలు ఘన విజయాన్ని చేకూర్చి ప్రజాకూటమిని మట్టి కరిపించారు. కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు పొత్తుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ అనుభవాన్ని దష్టిలో పెట్టుకొని.. తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుండా వెళ్దామని కొందరు కాంగ్రెస్ నేతలు ప్రతిపాదిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే, తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొంటే.. దండిగా పార్టీకి ఆర్థిక వనరులు సమకూరుతాయన్న ఆశ కొందరిలో బలంగా ఉంది. డబ్బుతో కొన్ని సీట్లయినా గెలవచ్చునని కొందరు కాంగ్రెస్ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. ‘టీ’ అంటే తినడం; ‘డీ’ అంటే దోచుకో వడం; ‘పీ’ అంటే పంచుకోవడంగా టీడీపీ తయారైందని, చంద్రబాబు రాజ్యం ఇంటింటా దౌర్భాగ్యం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తమ కార్యకర్తలకు పాఠాలు బోధించింది. ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అన్నట్లు ఏ పార్టీనైతే నాలుగున్నరేళ్లుగా విమర్శిస్తూ వస్తున్నారో.. ఆ పార్టీతో జాతీయస్థాయిలో, తెలంగాణలో చెట్టాపట్టాలేసుకొని తిరగడం ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. చంద్రబాబుతో పొత్తును సమర్థించుకోవడానికి చూపగల హేతుబద్ధమైన కారణం ఏదీ రాష్ట్ర కాంగ్రెస్ వద్ద లేదు. మరోపక్క ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ధర్మ దీక్ష, జ్ఞానభేరి మొదలైన కార్యక్రమాలను ప్రజాధనంతో నిర్వహిస్తూ.. ఆ వేదికల నుండి తను ఎందుకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో చెప్పడానికి విఫలయత్నం చేస్తున్నారు. తమ కలయికకు నైతికత ఆపాదించుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. రాష్ట్ర విభజన సహేతుకంగా చేయని ‘పాపి’ కాంగ్రెస్ పార్టీ అని తిట్టిన చంద్రబాబునాయుడు ఆ ‘పాపి’ తోనే చేతులు కలపడాన్ని ఆంధ్ర ప్రజానీకం హర్షిస్తుందా? ఆశ్చర్యం ఏమిటంటే, తెలంగాణలో తెలుగుదేశం ఓటమికి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడమే కారణమని సొంత మీడియాలో కథనాలు రాయించుకొని పరువు నిలబెట్టుకోవడానికి తెలుగుదేశం తాపత్రయ పడుతున్నది. మరోపక్క తెలుగుదేశం వల్ల ఓటమి ఎదురైందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లోలో పల మధనపడుతున్నది కానీ, బాహాటంగా చెప్పడానికి ధైర్యం చేయలేకపోతోంది. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏను, ప్రధాని మోదీని గద్దె దించడం ప్రజాస్వామ్య అనివార్యతగా తెలుగుదేశం ప్రచారం చేస్తున్నది. అవినీతికి పాల్పడుతూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ దేశానికి ప్రమాదకారిగా చంద్రబాబునాయుడు అభివర్ణిస్తున్నారు. ఎన్నికల అంశంగా అవినీతిని, రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం కావడాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సివస్తే.. ఆ రెంటి విషయంలో మోదీ ప్రభుత్వం కంటే చంద్రబాబు సర్కార్ అందనంత ఎత్తులో ఉంది. ఈ లెక్కన చంద్రబాబు సర్కార్‌ను ఓడించడం ప్రజాస్వామ్యరీత్యానే కాదు.. రాజ్యాంగరీత్యా, ప్రజా ప్రయోజనాలరీత్యా అనివార్యం! తెలంగాణ ఎన్నికలో చంద్రబాబు సాగించిన రాజకీయ క్రీడ బెడిసికొట్టింది. ఇక మిగిలిందల్లా.. ఏపీ ఎన్నికలే. వ్యాసకర్త ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శాసన మండలి ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మాజీ మంత్రి -
రాహుల్ ‘మహా కూటమి’ కుదిరేనా?
సాక్షి, న్యూఢిల్లీ : నగరంలోని గురుద్వార్ రకబ్గంజ్ రోడ్డులోని తన నివాసంలో గత వారం జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు ఏర్పాటు చేసిన విందుకు దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. ప్రఫుల్ పటేల్ ప్రతి ఏడాది శీతాకాలంలో మీడియా ప్రతినిధుల కోసం విందును ఏర్పాటు చేస్తారు. ఈసారి అందుకు భిన్నంగా 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులకు విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్, సమాజ్‌వాది పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నుంచి సతీష్ మిశ్రా, టీఎంసీ నాయకుడు డెరెక్ ఓబ్రయిన్, సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి, డీఎంకే నాయకులు కనిమోళి, రాష్ట్రీయ జనతా దళ్ నుంచి మిసా భారతిలు హాజరయ్యారు. మాజీ రాజకీయ ప్రత్యర్థులైన యాదవ్, మిశ్రాలు ఒకే టేబుల్‌పై కూర్చోవడం విశేషం. రానున్న ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకి వ్యతిరేకంగా తామంతా ఒకే వేదికపైకి వస్తున్నామన్న సంకేతానికి చిహ్నంగా వాళ్లంతా విందుకు హాజరయ్యారు. అయితే ఇంతకుముందు భావించినట్లుగా కాంగ్రెస్ నాయకత్వాన మహా కూటమిని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపించడం లేదు. మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు పీ. చిదంబరం, అహ్మద్ పటేల్, గులామ్ నమీ ఆజాద్‌లు మొదటి నుంచి చెబుతున్నారు. అయితే రాష్ట్రాల వారీగా కూటమిలు ఏర్పాటు చేసుకొని విజయం సాధించిన అనంతరం జాతీయ స్థాయిలో ఒక్క కూటమిగా ఏర్పాటు కావాలని ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా భావిస్తున్నాయి. అందుకనే ఉత్తరప్రదేశ్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల కోసం అమేథి, రాయ్‌బరేలి నియోజక వర్గాలను వదిలేసి మిగతా అన్ని నియోజక వర్గాల్లో తాము కలసికట్టుగా పోటీ చేస్తున్నామని ఎస్పీ, బీఎస్పీ ప్రకటించాయి. యూపీలోని 80 సీట్లకుగాను ఎనిమిది సీట్లను కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని ఎస్పీ, బీఎస్పీలు ప్రతిపాదించాయని, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న 21 స్థానాలు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందని, అందుకని కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరలేనదని ఆ పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఎనిమిదయితే ఎనిమిదికే పొత్తు పెట్టుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా దిగి ఎక్కువ సీట్లలో పోటీ చేసినట్లయితే అది బీజేపీకి లాభిస్తుందని వారు వాదిస్తున్నారు. ఎన్నికల చివరి నిమిషం వరకు పొత్తుపై చర్చలు జరుగుతాయన్నది తెల్సిందే. అటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ తణమూల్ కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లకు ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ ప్రకటించారు. 2014లో జరిగిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగానే పోటీ చేయాలని బెంగాల్ ప్రదేశ్ కమిటీ కూడా పార్టీ అధిష్టానంను డిమాండ్ చేస్తోంది. పశ్చిమ బెంగల్‌లో 42 లోక్‌సభ స్థానాలున్న విషయం తెల్సిందే. ఈసారి కాంగ్రెస్, వామపక్షాలు వేర్వేరుగా పోటీ చేసినట్లయితే మమతా బెనర్జీ వ్యతిరేక ఓట్లు చీలిపోవడం వల్ల రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బీజేపీకి లాభం చేకూర్చినట్లు అవుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మమతా బెనర్జీ పిలుపు మేరకు జనవరి 19వ తేదీన కోల్‌కతాలో జరుగనున్న ర్యాలీకి రాహుల్ గాంధీ హాజరుకారదని కూడా బెంగాల్ కాంగ్రెస్ శాఖ విజ్ఞప్తి చేసింది. ఆ ర్యాలీకి రాహుల్‌తోపాటు అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలను మమతా బెనర్జీ ఆహ్వానించారు. ప్రతిపక్షాల ఐక్యతను చాటేందుకు నిర్వహిస్తున్న ర్యాలీకి రాహుల్ వెళ్లకపోతే ఎలా అన్నది పార్టీ అధిష్టానం వాదన. ఏది ఏమైనా జాతీయ స్థాయిలో మహా కూటమి ఏర్పాటయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. -
బీజేపీకి మరో ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా.. బీజేపీకి మరో షాక్ ఇచ్చారు. బిహార్‌లోని మహాకూటమితో చేతులు కలిపారు. కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, హిందూస్తాన్ అవామ్ మోర్చా భాగస్వాములుగా ఉన్న మహాకూటమిలో చేరుతున్నట్టు గురువారం ఏఐసీసీ కార్యాలయంలో కుష్వాహా ప్రకటించారు. ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్, కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మేము ఇప్పుడు యూపీఏలో భాగస్వాములం. ఎన్డీఏ కూటమిలో నన్ను తీవ్రంగా అనుమానించార’ని ఈ సందర్భంగా కుష్వాహా తెలిపారు. ఆర్ఎల్ఎస్పీ తమతో చేతులు కలపడాన్ని తేజశ్వి యాదవ్ స్వాగతించారు. ‘బిహార్ ప్రజలకు ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్నాం. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మేమంతా ఈగోలు వదిలిపెట్టాల్సిన అవసరముంది. జాతీయ స్థాయిలోనూ మహాకూటమి ఏర్పాటుకు పని మొదలుపెట్టాల’ని తేజశ్వి పేర్కొన్నారు. కుష్వాహా చేరికతో బిహార్‌లో మహాకూటమి బలం పెరిగింది. బీజేపీ, జనతాదళ్(యూ), లోక్ జనశక్తి భాగస్వాములుగా ఉన్న ఎన్డీఏ కూటమిని లోక్‌సభ ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొవాలని మహాకూటమి భావిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై బీజేపీతో విబేధాలు తలెత్తిన నేపథ్యంలో కుష్వాహా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, ఎన్డీఏ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. రెండు సీట్లకు మించి ఇచ్చేది లేదని బీజేపీ ప్రకటించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ, జేడీ(యూ) సమాన సీట్లలో పోటీ చేయనున్నాయి. కాగా, బీజేపీ, జేడీ(యూ) మధ్య సీట్ల పంపకాల విషయంలో లోక్ జనశక్తి(ఎల్జేపీ) కూడా అసంతృప్తితో ఉందని.. రాంవిలాస్ పాశ్వాన్ కూడా త్వరలోనే బయటకు వస్తారని కుష్వాహా ప్రకటించి కలకలం రేపారు. -
ఏ ‘మాయ’ చేస్తారో.. బిగ్ ఎనౌన్స్మెంట్ ఏంటీ?
లక్నో: బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) పోటీచేయాలని భావిస్తున్నాయి. ఈ మేరకు బీఎస్పీ అధినేత్రి మాయావతి పుట్టిన రోజు (జనవరి 15) సందర్భంగా బీఎస్పీ-ఎస్పీ కూటమిని ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై ఇప్పటికే మాయావతి, అఖిలేష్ యాదవ్‌లు పలు దఫాలుగా చర్చలు జరిపారని, కాంగ్రెస్ లేకుండా 50-50 సీట్ల ఒప్పందంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలని అవగహన కుదుర్చుకున్నట్లు తెలిసింది. వీటి మిత్రపక్షమైన ఆర్ఎల్డీని మూడు స్థానాల్లో పోటీలో నిలుపుతున్నట్లు సమాచారం. గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీలు కలిసి పోటీ చేసి బీజేపీ యుందు బొక్కబోర్ల పడ్డ విషయం తెలిసిందే. దీనికి భిన్నంగా గోరఖ్‌పూర్, పూల్పూర్ ఉపఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు కలిసి పోటీచేసి కమలం కంచుకోటను బద్దలుకొట్టాయి. ఉపఎన్నికల ఫలితాలను పునావృత్తం చేయాలనే ఆలోచనతో మాయా, అఖిలేష్‌లు మాత్రమే ఎన్నికలకు వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారని యూపీలో పెద్దచర్చే జరగుతోంది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు మాయా పుట్టినరోజున బిగ్ ఎనౌన్సమెంట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ సీఎంల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఈఇద్దరు యూపీ నేతలు డుమ్మాకోట్టారు. ఎన్నికల ముందు పొత్తులకు దూరంగా ఉంటామంటూ, మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ను బీఎస్పీ దూరంగా ఉంచింది. ఒకవేళ బీజేపీయేతర కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకునేందుకు మాయావతి, అఖిలేష్ సిద్ధంగా లేరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలకు గట్టి దెబ్బ తగిలినట్లే. -
‘ఎన్నికల తర్వాతే ప్రధాని ఎవరో తేలుతుంది’
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాతే విపక్ష కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ఖరారు అవుతుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన అజెండా ఆజ్ తక్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 2004లో వచ్చిన ఫలితాలే మరోసారి రానున్నాయని, వారి తల రాతలో ఓటమి రాసిపెట్టి ఉందని జోస్యం చెప్పారు. కేవలం ప్రధాని మోదీ వల్ల బీజేపీ ఓటమి చవిచూడబోదని.. ఆ పార్టీ అవలంబిస్తున్న విధానాలే ఎన్డీయేకు చెంపపెట్టులా మారతాయని వ్యాఖ్యానించారు. అదే రిపీట్ అవుతుంది... ‘మోదీకి పోటీ ఎవరు అని ఈరోజు బీజేపీ నేతలు సవాల్ చేస్తున్నారు. 2004లో కూడా వాజ్‌పేయికి పోటీ ఎవరు అంటూ అతి విశ్వాసం ప్రదర్శించారు. ఫలితం ఏమైందో మనందరికీ తెలిసిందే. 2019లో అదే పునరావృతం అవుతుంది ’అని సీతారాం వ్యాఖ్యానించారు. కాగా విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రతిపాదించిన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అని అడగగా...‘ స్టాలిన్ అభిప్రాయాలు ఆయనకు ఉంటాయి. కానీ మేము ఆయనతో ఏకీభవించలేం. ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థిని ఖరారు చేయాలనేది మా అభిమతం’ అని సీతారం పేర్కొన్నారు. ఇక బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌తో, సీపీఎం పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. -
కేసీఆర్‌కు రెండు ఓట్లు ఎలా ఉంటాయ్: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటి పేరును ముందు వెనుకాల మార్చి రెండు చోట్ల ఓట్లు పొందారని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సన్ ఆఫ్ రాఘవరావు అనే పేరు మీద ఒక ఓటు హక్కును నమోదు చేసుకొన్నారని, గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలో చంద్రశేఖర రావు సన్ ఆఫ్ రాఘవ రావు అనే పేరు మీద మరో ఓటు హక్కును నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇలా ఒకే వ్యక్తి రెండు పేర్ల మీద ఓటు హక్కును నమోదు చేసుకోవడం చట్టరీత్యా నేరమని, దీనిపై ఎన్నికల సంఘం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. కేసీఆర్ రెండు ఓట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారి స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, ఈ విషయాన్ని స్వయంగా ఎన్నికల అధికారే ఒప్పుకొని క్షమాపణ కోరారని తెలిపారు. అర్హులకు ఓటు హక్కు కల్పించకపోవడం వలన తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది అర్హుల ఓట్లను తొలిగించారన్నారు. కొడంగల్‌లో తాను ఓడిపోతానని కేసీఆర్, కేటీఆర్‌లు ప్రచారం చేస్తున్నారని, ఓడకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొడంగల్ నుంచి తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను గెలిస్తే కల్వకుంట్ల కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటుందా? అని రేవంత్ సవాల్ విసిరారు. మహాకూటమిలో కాంగ్రెస్ తొలి స్థానంలో, టీడీపీ రెండవ స్థానంలో, టీజేఎస్, సీపీఐలు తర్వాతి స్థానంలో ఉంటాయని జోస్యం చెప్పారు. -
మా నేతే గెలుస్తడు!
సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో రెండోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలకంగా మారాయి. మొత్తం 13 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఎక్కడెక్కడ ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడిపోతారు..? పెరిగిన పోలింగ్ శాతంతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..? అన్న చర్చ జోరందుకుంది. ఈనెల 11న ఫలితాలు వెల్లడి కానుండగా.. ఆ ఫలితాలు ఎవరికీ అనుకూలంగా వస్తాయనే దానిపై బెట్టింగ్‌లు కూడా ఊపందుకున్నాయి. ఎగ్జిట్‌పోల్, పోస్ట్‌పోల్ సర్వేలు గందరగోళం సృష్టిస్తుండగా.. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములపై చర్చ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ప్రధానంగా మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్, సిరిసిల్లతోపాటు జగిత్యాల, మంథనిలో ఫలితాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కరీంనగర్, పెద్దపల్లి, కోరుట్ల, రామగుండం, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు, హుస్నాబాద్ ఫలితాలపైనా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా.. మిగతా 12 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికలను ప్రజాకూటమి, టీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గెలిచేదెవరు..? ఓడేదెవరు..? గెలుపు ఓటములపై ఎవరి ప్రభావం ఎంత..? అన్న కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. పోరు ప్రతిష్టాత్మకం.. గెలుపుపై ప్రశ్నార్థకం.. లెక్కలు, విశ్లేషణల్లో ప్రధాన పార్టీలు.. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరికివారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తుండగా.. ప్రతిష్టాత్మకంగా సాగిన పోరులో విజయం ఎవరిని వరిస్తుందనే చర్చ జోరందుకుంది. విశ్లేషణలు, సర్వేలు అటూఇటుగా వస్తున్నా.. ఓట్ల లెక్కింపు వరకు గెలుపోటములు ప్రశ్నార్థకంగా మారాయి. 13 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి జరిగిన ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగానే సాగాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు తలపడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయం నల్లేరుపైనడకగా భావించిన స్థానాల్లో కూడా అభ్యర్థులు గట్టిపోటీని ఎదుర్కొన్నట్లు నిఘావర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల విశ్లేషణలే ఇందుకు కారణంగా చెప్తున్నారు. టీఆర్ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్లీన్‌స్వీప్ చేస్తుందని ఆ పార్టీ అగ్రనేతలు చెప్తుండగా.. బయట ప్రచారం మాత్రం అందుకు భిన్నంగా అన్నిస్థానాల్లోనూ గట్టి పోటీ ఎదుర్కొంటుందని చెబుతున్నారు. శుక్రవారం జరిగిన పోలింగ్ సరళి, ఇంటలిజెన్స్, ఎగ్జిట్‌పోల్ నివేదికలు ముందరేసుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కలు, విశ్లేషణలతో గెలుపోటముల అవకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. పోలింగ్ సరళిపై ఆరా తీస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో బూత్‌కమిటీ సభ్యులుగా వ్యవహరించిన పార్టీ కార్యకర్తలతో సమీక్ష చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా సాగిన పోరులో గెలుపుపై జోరుగా సమీక్షలు జరుపుతుండటం చర్చనీయాంశం అవుతోంది. జోరుగా సర్వేలు, విశ్లేషణలు.. అన్ని స్థానాల్లో బెట్టింగ్‌లు.. ఉమ్మడి కరీంనగర్‌లోని అన్నిస్థానాలపైనా సర్వేలు, విశ్లేషణలు జోరందుకున్నాయి. మరో రెండురోజుల్లో ఫలితాలు వెలువడనుండగా బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. హుజూరాబాద్, సిరిసిల్ల, మంథని, జగిత్యాల, కరీంనగర్ అసెంబ్లీ స్థానాల ఫలితాలపైన ఎక్కువ చర్చ జరుగుతోంది. ఆయా పార్టీల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు ఇక్కడ అభ్యర్థులుగా ఉండటమే ఇందుకు కారణం. ఈటల రాజేందర్ ఆరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండగా.. హుజూరాబాద్‌లో ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారన్న చర్చ రెండురోజులుగా జోరందుకుంది. సిరిసిల్లలో కేటీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే. మహేందర్ రెడ్డి కూడా అదేస్థాయిలో పోటీ ఇచ్చారన్న ప్రచారం ఆ రెండు పార్టీల కేడర్, అభిమానుల్లో బెట్టింగ్‌లకు కారణమవుతోంది. కరీంనగర్ నుంచి మూడోసారి బరిలోకి టీఆర్ఎస్ నుంచి దిగిన గంగుల కమలాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన బండి సంజయ్‌కుమార్ (బీజేపీ) మధ్య పోటీ రసవత్తరంగా సాగిందన్న చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. మంథని నుంచి మాజీ మంత్రి శ్రీధర్‌బాబు వర్సెస్ పుట్ట మధుకర్, జగిత్యాలలో కాంగ్రెస్ దిగ్గజం టి.జీవన్‌రెడ్డి వర్సెస్ సంజయ్‌కుమార్ మధ్య పోరు ప్రతిష్టాత్మకంగా సాగడంపై ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా ప్రభుత్వ విప్‌గా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ (టీఆర్ఎస్)కు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (కాంగ్రెస్) ధర్మపురిలో గట్టి పోటీ ఇచ్చారంటున్నారు. మానకొండూరులో రసమయి బాలకిషన్ (టీఆర్ఎస్), ఆరెపెల్లి మోహన్ (కాంగ్రెస్), చొప్పదండిలో మేడిపల్లి సత్యం (కాంగ్రెస్), సుంకె రవిశంకర్ (టీఆర్ఎస్), బొడిగ శోభ (బీజేపీ), వేములవాడలో చెన్నమనేని రమేశ్‌బాబు (టీఆర్ఎస్), ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్), కోరుట్లలో కె.విద్యాసాగర్‌రావు (టీఆర్ఎస్), జె.నర్సింగరావు (కాంగ్రెస్), పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డి (టీఆర్ఎస్), సీహెచ్.విజయరమణారావు (కాంగ్రెస్), రామగుండంలో సోమారపు సత్యనారాయణ (టీఆర్ఎస్), కోరుకంటి చందర్ (ఫార్వర్డ్ బ్లాక్), రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్ పోటాపోటీగా తలపడ్డారు. ఈ నేపథ్యంలో ఎవరిని విజయం వరిస్తుందన్న కోణంలో ఆయా పార్టీల అభ్యర్థుల అభిమానులు, కార్యకర్తలు బెట్టింగ్‌లకు దిగుతుండటంపై అందరూ చర్చించుకుంటున్నారు. -
100 ఖాయం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆ పార్టీ ముఖ్యనేత కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు పూర్తిగా సంతృప్తితో ఉన్నారని, పోలింగ్‌లో తమకే మద్దతు కనిపిస్తోందన్నారు. ఓటమి ఖాయమని అర్థం చేసుకున్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పటి నుంచే సాకులు వెతుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పి.మహేందర్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి తెలంగాణభవన్‌లో శనివారం విలేకరులతో కేటీఆర్ మాట్లాడారు. ‘మాకొచ్చిన సమాచారం ప్రకారం 73 శాతం పోలింగ్ జరిగింది. ఇది ప్రభుత్వ అనుకూల ఓటేనని మా నిశ్చిత అభిప్రాయం. మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రజల తీర్పు ఏకపక్షంగా రాబోతోంది. టీఆర్ఎస్ పాలనకు, సంక్షేమానికి మద్దతుగా ప్రజలు ఓటు వేశారు. జాతీయ చానళ్లు అన్ని టీఆర్ఎస్కు మెజారిటీ సీట్లు ఇచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే ఎక్కువ సీట్లు సాధిస్తాం. టీఆర్ఎస్కు దాదాపుగా వంద సీట్లు రానున్నాయి. మూడింట రెండొంతుల స్థానాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. అసెంబ్లీ రద్దు రోజు సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే పోలింగ్ వరకు అదే పరిస్థితి ఉంది. ప్రభుత్వంపై ప్రత్యర్థి పార్టీల వారు చేసిన విమర్శలను, వారి గారడీలను ప్రజలు పట్టించుకో ’అని ఆయన పేర్కొన్నారు. కుట్రలన్నీ విఫలమయ్యాయి ‘కాంగ్రెస్ హేమాహేమీలు ఓడిపోనున్నా రు. ఇది ఖాయం. ఆ పార్టీలో సీఎం అభ్యర్థులుగా చెప్పుకున్న వారు సొంత నియోజకవర్గాలు దాటలేదు. మేం ఫలితాల కోసం వేచి చూస్తున్నాం. 11న టీఆర్ఎస్ విజయోత్సవాలు జరుగుతాయి. ప్రజలు మావైపే ఉన్నారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు వందలకోట్ల రూపాయలు పంపిణీ చేశారు. అన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు పన్నారు. అవన్నీ విఫలమయ్యాయి. గెలుపు సాధ్యం కాదని కాంగ్రెస్ నేతలు ముందుగానే సాకులు వెతుక్కుంటున్నారు. అందుకే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈవీఎంలలో ఏదో జరుగుతుందని అంటున్నారు. కాంగ్రెస్ గెలిచినప్పుడు అలాగే అనుమానాలు వ్యక్తం చేశారా? ఈవీఎంలనీ.. ఇంకోటని మాకు పనికిమాలిన అనుమానాలు లేవు. కూటమిది అపవిత్ర, అవకాశవాద పొత్తు అని ప్రజలు గమనించారు. బాబు కూటమిలో చేరడం వల్ల ఓడిపోయామని ఫలితాల రోజు మాట్లాడేం దుకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ పనితీరుపై, ప్రజలపై మాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ నేతలు ముందే ఓటమికి సాకులు వెతుక్కుంటున్నారు. ఫలితాల రోజు చూడండి. చంద్రబాబుతో పొత్తు వల్లే ఓడిపోయామని కాంగ్రెస్ నేతలు అంటారు. మిగతా విషయాలు 11 తర్వాత మాట్లాడుకుందాం’అని కేటీఆర్ అన్నారు. ప్రజలకు ధన్యవాదాలు ఎన్నికలలో నిర్వహణపై అధికార యంత్రాంగానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. భారీగా ఓటిం గ్లో పాల్గొన్న ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ‘ఎన్నికల్లో పెద్దఎత్తున ఓటింగ్‌కు వచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు, అభినందనలు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ జరిగింది. ఎక్కడా ఒక్క అవాంఛనీయ ఘటన కూడా జరగకుండా, శాంతియుతంగా, ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల సంఘానికి, అధికారులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అభినందనలు. వినయపూర్వక ధన్యవాదాలు. ఎన్నికలలో మూడు నెలలుగా శ్రమించిన టీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు. టీఆర్ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలు మరో మూడురోజులు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటి ఈ స్ఫూర్తిని ఓట్ల లెక్కింపు వరకు కొనసాగించాలి. చివరి ఓటు లెక్కించే వరకు అప్రమత్తంగా ఉండాలి’అని మంత్రి సూచించారు. ఓట్ల గల్లంతు జరిగిన మాట వాస్తవమేనని.. పార్లమెంటు ఎన్నికల వరకైనా ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటే బాగుంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్‌కు 75 వేల మెజారిటీ గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ 75 వేలకు పైగా మెజారిటీ సాధిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, డీకే అరుణ ఓడిపోతారని జోస్యం చెప్పారు. ‘పెరిగిన ఓటింగ్ శాతం అంతా టీఆర్ఎస్కు అనుకూలంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు టీఆర్ఎస్కు ఓట్లు వేశారు. మాకు ఉన్న సమాచారం ప్రకారం వంద సీట్లలో గెలుస్తాం. సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో 75 వేలకుపైగా మెజారిటీతో గెలుస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 స్థానాల్లో టీఆర్ఎస్ 16 నుంచి 17 సీట్లు గెలుస్తుంది. ఉమ్మడి కరీంనగర్లో 12 స్థానాల్లో మాదే విజయం. ఖమ్మంలోనూ మెజారిటీ సీట్లు మాకే వస్తాయి. బీజేపీకి వంద స్థానాల్లో డిపాజిట్ దక్కదు. అంబర్‌పేట, ముషీరాబాద్‌లో మాత్రమే మాకు బీజేపీ పోటీ ఇస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు ఒక్కరూ గెలవరు. బెల్లంపల్లిలోనూ వినోద్ ఓడిపోతారు. అక్కడ టీఆర్ఎస్ గెలుస్తుంది. ప్రజ లు పనితీరును గమనించి తీర్పు ఇస్తారు. రాజకీయాల్లో ఒకటి, ఒకటి కలిస్తే రెండు కాదు’అన్నారు. లగడపాటి సర్వే సన్యాసం లగడపాటి రాజగోపాల్ ఇప్పటికే రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారని.. ఇప్పుడాయనకు సర్వే సన్యాసం కూడా తప్పదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రం రాదని లగడపాటి రాజగోపాల్ అన్నారు. తెలంగాణ వచ్చింది. ఉద్యమం దెబ్బకు లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ గెలవదని లగడపాటి అంటున్నారు. కానీ కచ్చితంగా మేం విజయం సాధిస్తాం. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో రాజగోపాల్ సర్వే సన్యాసం తప్పదు’అని మంత్రి పేర్కొన్నారు. -
ఇక.. ప్రలోభాల జాతర
నోళ్లకు తాళం పడింది. మైకుల మోత ఆగిపోయింది. మూడు నెలలుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి బుధవారం బ్రేక్ పడింది. మరో 24 గంటల్లో తుదిపోరు ప్రారంభం కానుంది. కీలకఘట్టం ముగియడంతో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. చివరి నిమిషంలో తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు ఓటర్లకు నగదు ఆశ జూపుతున్నారు. ఇప్పటికే మందు, విందులతో నిండిపోయిన పల్లెలు.. రాజకీయం క్లైమాక్స్ చేరడంతో మరింత హాట్‌హాట్‌గా మారాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 163 మంది బరిలో నిలిచారు. కేవలం ప్రధాన పార్టీలేగాకుండా తొలిసారి చిన్నా చితక పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతుండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా గెలుపే ధ్యేయంగా జట్టుకట్టిన టీడీపీ–కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ కూటమి ఒకవైపు.. మరోసారి విజయం సాధించాలని ముందస్తు సమరానికి సై అన్న టీఆర్ఎస్ మరోవైపు.. మెరుగైన ఫలితాలను సాధించి పరువు నిలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ ఇంకోవైపు.. పోటాపోటీగా సమరక్షేత్రంలోకి దిగాయి. మొదటి రోజే అభ్యర్థులను ప్రకటించి శంఖారావం పూరించిన గులాబీ దళపతి కేసీఆర్ జిల్లాలోని రాజేంద్రనగర్, మహేశ్వరం మినహా అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల ఆశీర్వాదాన్ని కోరారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సైతం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అలుపెరగకుండా.. శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అతిరథ మహారథులతో ప్రచారపర్వం కొనసాగించిన ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ మునుపెన్నడూలేని రీతిలో బహిరంగ సభలు, రోడ్‌షోల్లో పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. ముందస్తు సంకేతాలు రావడమే తరువాయి రాజేంద్రనగర్‌లో దాదాపు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్లో పర్యటించారు. అగ్రనేతలు గులాంనబీ అజాద్, అజారుద్దీన్, సినీ తారలు విజయశాంతి, నగ్మా, కుష్బూ ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. చంద్రబాబు సైతం.. ప్రజాకూటమి అభ్యర్థులకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సైతం రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్, మహేశ్వరంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సినీ నటుడు బాలకృష్ణ ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో పర్యటించారు. హోరెత్తించిన కమలదళం బీజేపీ అధినేత అమిత్‌షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, హాన్స్‌రాజ్, గంగ్వార్, స్మృతి ఇరానీ, పురందేశ్వరి, స్టార్ క్యాంపెయినర్ పరిపూర్ణానంద తదితరులు జిల్లాలో విస్తృతంగా పర్యటించి కమలం పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. ప్రధాన పార్టీలకు దీటుగా ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌లో బీఎస్పీ పార్టీ అభ్యర్థులు ప్రచారపర్వాన్ని కొనసాగించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ టికెట్లు దక్కకపోవడంతో ఏనుగెక్కిన మల్రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్లు ప్రజాకూటమి, కాంగ్రెస్ అభ్యర్థులకు తీసిపోని రీతిలో ప్రచారం హోరెత్తించారు. ఉరుకులు పరుగులకు తెర ఉరుకులు పరుగులకు తెరపడింది. ఇక ఉత్కంఠ మిగిలింది. ఎన్నికల క్రతువులో కీలక రోజుగా భావించే ఈ కొన్ని గంటల్లో ఫలితాన్ని తారు మారు చేసేందుకు అభ్యర్థులు తెర వెనుక రాయ‘బేరాలు’ కొనసాగిస్తున్నారు. ఓటరును బుట్టలో వేసుకునేందుకు ఎత్తులు.. చీకట్లో చిత్తులు చేసే కార్యక్రమం మొదలు కానుంది. వీరి భవితవ్యం 11న వెలువడే ఫలితాలతో తేలిపోనుంది. -
ప్రజాఫ్రంట్‌కి ఓటేసి.. అభివృద్ధి చేసుకుందాం: బిక్షమయ్యగౌడ్
సాక్షి. యాదగిరిగుట్ట : కాంగ్రెస్ సారథ్యంలో వస్తున్న ప్రజాఫ్రంట్‌కి ఓటేసి.. అభివృద్ధి చేసుకోవాలని కాంగ్రెస్ ఆలేరు అసెంబ్లీ అభ్యర్థి బూడిద బిక్షమయ్యగౌడ్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు ప్రజాఫ్రంట్తోనే నేరవేరుతాయని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, బీర్ల అయిలయ్య, కళ్లెం కృష్ణ, కలకుంట్ల బాల్‌నర్సయ్యగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా తుర్కపల్లి : తనను ఆశీర్వదిస్తే.. ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నా రు. బుధవారం మండల కేంద్రంలో ప్రజాకూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బండ్రు శోభారాణి, జెడ్పీటీసీ బోరెడ్డి జ్యోతిఅయోధ్యరెడ్డి, ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు గడ్డమీది సత్యనారాయణ పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
ప్రజాకూటమిదే విజయం... జీవన్‌రెడ్డి
ప్రతిపక్ష శాసనసభ్యుడిగా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కష్టపడ్డ. నా కృషితో ఈ నాలుగేళ్లలో ఏం అభివృద్ధి జరిగినా టీఆర్ఎస్ నాయకులు దాన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. సీఎం కేసీఆర్ తొలిసారిగా కరీంనగర్‌కు వచ్చినప్పుడు నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన బోర్నపల్లి బ్రిడ్జి పనుల అంచనాలు రూపొందించుకుని నిర్మాణం చేపట్టాలని విన్నవించిన. ఆవశ్యకతను గుర్తించిన కేసీఆర్ వెంటనే మంజూరు చేసిండు. ఇప్పుడు ఆ బ్రిడ్జి నిర్మాణం క్రెడిట్ అంతా మాదేనని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. నేను ప్రతిపాదించిన ఇలాంటివి మరెన్నో పనులనూ టీఆర్ఎస్ నేతలు తామే చేశామని ప్రచారం చేయడం ఆవేదన కలిగిస్తోంది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నేనునందునే సీఎం కేసీఆర్ తన వద్ద ఉంచుకున్న రూ.2వేల కోట్ల వరకు రాష్ట్ర అభివృద్ధి నిధుల నుంచి నయాపైసా జగిత్యాలకు ఇవ్వలేదు. అదే మానకొండూరు, వేములవాడ ఇతర నియోజకవర్గాలకు నిధులిచ్చారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. జనమే నా బలం.. బలగం. వాళ్ల ఆశీర్వాదంతో నేను మళ్లీ గెలవబోతున్న. ఓడినా వారి వెన్నంటే ఉంటా. రాష్ట్రంలోనూ ప్రజాకూటమిదే విజయం..’ అన్నారు కాంగ్రెస్ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డి. ఎన్నికల ప్రచారతీరు.. గెలుపు అవకాశాలు.. నాలుగేళ్ల పాలన విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. సాక్షి, జగిత్యాల : నేను ప్రజల మనిషిని. నిత్యం అందుబాటులో ఉంటున్న.. రాజకీయాలకతీతంగా నా వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను వింటా. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్న. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రాజకీయాలకతీతంగా వ్యవహరిస్తున్న. నేను ప్రతిపక్షంలో ఉన్నా నా నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్న. నిరుపేదల సంక్షేమాన్ని కాంక్షించేలా ప్రజాకూటమి రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోపై అన్నివర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అన్నింటికంటే మించి నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతే నన్ను గెలిపిస్తుంది. సాధారణంగా ఎన్నికల్లో ఓడిన వ్యక్తికే ప్రజల్లో సానుభూతి ఉంటుంది. కానీ.. ఇక్కడ దీనికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో నేను గెలిచినా ఎంపీ కవిత, ఇతర ప్రజాప్రతినిధులు ప్రస్తుత నా ప్రత్యర్థి సంజయ్కుమార్నే ఎమ్మెల్యేగా పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా బహిరంగ సభల్లోనూ పదే పదే చెప్పడం నన్ను బాధించింది. నేను ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి నన్ను గెలిపించుకుంటామని చెబుతున్నరు. ఆ ఫైలును తొక్కిపెట్టారు..! ఈ ఎన్నికల్లో యావర్‌రోడ్డు సమస్య అన్ని పార్టీలకు ప్రధాన ఎజెండా మారింది. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా గతంలో 60ఫీట్లకు ఆమోదం పొందిన యావర్‌రోడ్డు విస్తరణ.. 40ఫీట్లకు పరిమితమైంది. జగిత్యాల ఇప్పుడు జిల్లాకేంద్రం అయింది. ఆ రోడ్డు వంద ఫీట్లకు విస్తరించబడాలి. దీనికి సంబంధించి తీర్మానం చేసిన జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ గతేడాది జూన్ 31న ఈ ప్రతిపాదనను హైదరాబాద్‌లోని ‘డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లాన్’కు పంపింది. అక్కడ ఆ ఫైలును తొక్కిపెట్టారు. దీనికి సంబంధించిన లేఖ ఇప్పటికీ మా దగ్గర ఉంది. యావర్‌రోడ్డు విస్తరణకు కాంగ్రెస్ పార్టీ, జగిత్యాల కౌన్సిల్ కట్టుబడి ఉంది. 2009లో మేం (కాంగ్రెస్) అధికారంలో ఉన్నప్పుడు నూకపల్లిలో 4వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూసేకరణ చేసి.. ఒక్కో ఇంటికి రూ.లక్షతో పనులు మొదలుపెట్టినం. ప్రభుత్వం మారడంతో వాటి నిర్మాణ పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. మరో రూ.లక్ష కేటాయిస్తే వాటి నిర్మాణాలు పూర్తయ్యేవి. అవి పూర్తి చేస్తే నాకు పేరొస్తుందనే టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పక్కనబెట్టింది. అదే ప్రాంతంలో కొత్తగా 4వేల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. దీనికి టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలి. నాలుగేళ్ల పాలనలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చని టీఆర్ఎన్ పార్టీని అన్నివర్గాలు.. పార్టీలు చీదరించుకుంటున్నాయి. నీళ్లు.. నిధులు.. నియామకాల విషయంలో జరిగిన అవినీతి, అన్యాయాన్ని ప్రశ్నించేందుకు.. రాష్ట్రంలో కొనసాగుతున్న నిరంకుశ, నియంతృత్వ పాలనను తుది ముట్టించేందుకు.. నాడు ఉద్యమంలో పాల్గొన్న పార్టీలు, ముఖ్యులందరూ ప్రజాకూటమిగా ఏర్పడ్డారు. ఇది నేను చేసింది కాదా..? 30 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక పనులు చేపట్టిన. అవి టీఆర్ఎస్ నేతలకు కనిపించినా.. చూడనట్లు మాట్లాడుతున్నరు. నేను మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేసిన.. అది భవిష్యత్తులో యూనివర్సిటీగా రూపుదిద్దుకోబోతుంది. పొలాసలోని వ్యవసాయ డిగ్రీ కాలేజీ, నిరుద్యోగ యువతకు సంబంధించిన నాక్ శిక్షణ కేంద్రం, పీజీ కాలేజీలు తెచ్చింది నేను కాదా..? జగిత్యాల జిల్లాగా రూపుదిద్దుకున్న క్రమంలో ఇక్కడ ఓ మెడికల్ కాలేజీ అవసరమైంది. ఇప్పుడు నా దృష్టి మెడికల్ కాలేజీ ఏర్పాటుపై ఉంది. చల్గల్లో మామిడి మార్కెట్ ఏర్పాటు చేసుకుని జగిత్యాలలో కోర్టు భవనం నిర్మించుకున్నం. గోదావరి నదిపై రూ.40 కోట్లతో కమ్మునూరు – కలమడుగుపై వంతెన మంజూరు చేయించిన. వాటి పనులు పూర్తయ్యాయి. నా నియోజకవర్గంలో బీటీ రోడ్డు లేని గ్రామాలు లేనేలేవు. పట్టణ విషయానికి వస్తే అంతర్గత, బహిర్గత బైపాస్ రోడ్ల నిర్మాణాలు చేపట్టిన. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి.. నాలుగేళ్లలో టీఆర్ఎస్ అభివృద్ధి ఆ పార్టీ నేతలు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రేడ్ 1 ఉన్న జగిత్యాల మున్సిపాలిటీకి రూ.50కోట్లు కేటాయించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు గ్రేడ్–2, గ్రేడ్ –3 మున్సిపాలిటీలు అయిన కోరుట్ల, మెట్పల్లిలకూ అవే నిధులు కేటాయించారు. ఇందులో జగిత్యాల పట్టణానికి ప్రత్యేకంగా చేసిందేమిటో వారికే తెలియాలి. వీటిని ఎందుకు పరిష్కరించలేకపోయారు..? గత విద్యాసంవత్సరం రాయికల్‌లో డిగ్రీ కాలేజీ ప్రకటించారు. ఈ విద్యాసంవత్సరం మంజూరైంది. కానీ బోధన, బోధనేతర సిబ్బంది నియామకం లేక ప్రారంభంకాలేదు. సీఎం పర్యటన నేపథ్యంలో రాయికల్ మండలం బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ మధ్య వంతెన ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ కవిత ప్రకటించారు. ఇంతవరకు దాని నిర్మాణ పనులకు పరిపాలన అనుమతి రాలేదు. రాయికల్‌లో మ్యాంగో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు హామీ ఇచ్చి నెరవేర్చలేదు. సారంగాపూర్‌లో 0.25నీటి సామర్థ్యం ఉన్న రోళ్లవాగు ప్రాజెక్టును టీఎంసీకి చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఆధునీకరణ పనులు నత్తకునడక నేర్పుతున్నాయి. రాయికల్ మండలం మూటపల్లి–భూపతిపూర్‌లో పంచాయతీ రాజ్ శాఖకు చెందిన రోడ్డు ధ్వంసమై నాలుగేళ్లవుతున్నా.. రెన్యువల్ చేయలేదు. బీటి రోడ్డు కూడా వేయించలేకపోయారు. ఇప్పుడు టెండర్, అగ్రిమెంట్, అంచనాలు లేకుండా ఎన్నికల కోడ్ అని కూడా చూడకుండా బినామీతో పనులు ప్రారంభించాలని చూస్తే కోర్టు పనులు ఆపేసింది. ఐదు నెలల క్రితం జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌లో రూ.8 కోట్లతో విత్తనశుద్ధి కేంద్రం ఏర్పాటు పనులకు భూమిపూజ చేసిండ్రు.. ఆ పనులకు సంబంధించి ఇప్పటికీ టెండర్ ప్రక్రియ పూర్తి చేయలేదు. -
షాద్‌నగర్ బాద్షా ఎవరో..!
షాద్‌నగర్ నియోజకవర్గం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి విడిపోయి రంగారెడ్డి జిల్లాలో కలిసిన అనంతరం మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గం రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్కు పట్టం కట్టింది. ప్రస్తుత ఎన్నికల్లో దాదాపు 17 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, ముఖ్యంగా నలుగురి మధ్యే గట్టి పోటీ నెలకొంది. టీఆర్ఎస్, మహాకూటమి(కాంగ్రెస్), బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల నడుమ హోరాహోరీ పోటీ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అంజయ్యయాదవ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే అస్త్రంగా ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కూటమి భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ అండతో కాంగ్రెస్ అభ్యర్థి చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వీర్లపల్లి శంకర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి అనంతరం బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. ఏనుగు గుర్తుతో బరిలో నిలిచి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి బరిలో దిగిన శ్రీవర్ధన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూ గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య: 17 ప్రధాన అభ్యర్థులు నలుగురు ఎల్గనమోని అంజయ్యయాదవ్ (టీఆర్ఎస్) చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి (కాంగ్రెస్) నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి (బీజేపీ) వీర్లపల్లి శంకర్ (బీఎస్పీ) సాక్షి, షాద్‌నగర్: తాజామాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న ఎల్గనమోని అంజయ్య యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తెలియచేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నా రు. సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీ గెలుపునకు కృషి చేస్తాయని అంజయ్య యాదవ్ చెబుతున్నారు. నియోజకవర్గంలో వరుసగా ఒక్క శంకర్రావు తప్పా ఇతరులెవరు వరుసగా విజయం సాధించసాధించలేదు. ఈసారి ఆ రికార్డును తాను సమం చేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాకూటమి (కాంగ్రెస్) అభ్యర్థి చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అన్నివర్గాల ప్రజల ఆశలను ప్రతిబింబిస్తోందని, అధికారంలోకి వస్తే హమీలన్నీ నెరవేరుస్తామని తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. రోడ్‌షోలు, ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరుతున్నారు. కేంద్ర సాయంతో అభివృద్ధి చేస్తాం.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ నుంచి బరిలో దిగిన నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఈమేరకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ సాయంతో కనీవిని ఎరగని రీతితో షాద్‌నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ప్రజలకు శాశ్వత తాగు, సాగు నీరు అందించడానికి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును పూర్తిచేస్తామని శ్రీవర్ధన్‌రెడ్డి చెబుతున్నారు. గత ఎన్నికల్లో తృతీయ స్థానంలో నిలిచిన బీజేపీ ఈసారి గట్టి పోటీ ఇస్తూ గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పరిపూర్ణనందస్వామి పర్యటనలతో కేడర్‌లో జోష్ పెరిగింది. చాపకింది నీరులా బీఎస్పీ.. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన వీర్లపల్లి శంకర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి బీఎస్పీ నుంచి బీఫామ్ దక్కించుకున్నారు. నియోజకవర్గంలోని బడుగు, బలహీనవర్గాలను కలుపుపోతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. శంకర్ టీఆర్ఎస్లో ఉండగానే తనకంటూ ఓ కేడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. చివరకు పార్టీ టికెట్ నిరాకరించడంతో బీఎస్పీ నుంచి బరిలో దిగారు. ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తుండడంతో అధికార పార్టీకి చెందిన ఓట్లు చీలిపోయే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
కోరుట్ల 'రెవెన్యూ' డివిజన్
సాక్షి, కోరుట్ల: ‘జిల్లాలోనే పెద్ద పట్టణం కోరుట్ల.. దీనిని పక్కాగా రెవెన్యూ డివిజన్ చేస్తామని సీఎం కేసీఆర్ మాటగా ప్రకటిస్తున్నా..’ అని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కోరుట్ల డివిజన్ ఏర్పాటు విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని, మెట్పల్లి ప్రజలు ఆగం కావద్దని, మెట్పల్లి డివిజన్ అలాగే ఉంటుందని తెలిపారు. ఒకే సెగ్మెంట్లో రెండు డివిజన్లు ఉంటాయని హామీ ఇచ్చారు. ‘కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తెచ్చిండు.. ఇగో అట్లనే మీ కేటీఆర్ కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లో రెండు రెవెన్యూ డివిజన్లు సాధించి చరిత్ర సృష్టిస్తున్నారు..అని పేర్కొన్నారు. ఈ విషయం చెప్పడానికే ప్రత్యేకంగా కోరుట్లకు వచ్చానని కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలోనే వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడి రైల్వేస్టేషన్లో ముంబయి రైలు ఆగేలా అనుమతి సాధిస్తామన్నారు. ఈ మూడు హామీలు నేరవేర్చే బాధ్యత తనదేనన్నారు. విద్యాసాగర్‌రావు అందరికీ అందుబాటులో ఉంటాడు.. మూడుసార్లు అభిమానాన్ని చాటి గెలిపించారు.. మరోసారి గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి..అని కేటీఆర్ కోరారు. మహాకూటమి ముసుగులో కాంగ్రెస్‌కు ఓటేయాలని వస్తున్నారు.. వారిని నమ్మద్దు. ఎన్నికలు అయిపోగానే తట్టాబుట్టా సర్దుకుని ఎక్కడికో పోతారు.. ఈ విషయం మీకు కూడా తెలుసు..అందుకే ఎప్పుడూ అందుబాటులో ఉండే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు ఓటేసి ఆశీర్వదించండి..’ అని కోరారు. 24గంటల ఉ చిత కరెంట్, రైతుబంధు, రుణమాఫీతో రైతులకు అండగా నిలిచిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. పేద ప్రజల కష్టాలు గుర్తించి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్, బీడి, నేత, గీత కార్మికులకు పించన్లు అందించారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరా పించన్లను రూ.2016 చేస్తామన్నారు. పింఛన్ అందించే వయసును 57కు కుదిస్తామన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కేసీఆర్ సర్కార్ కట్టుబడి ఉంటుందన్నారు. సోనియాను తిట్టిపోసిన చంద్రబాబు ఇప్పుడు మాటమార్చి కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆశీర్వదించండి: విద్యాసాగర్‌రావు కోరుట్ల సెగ్మెంట్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశానని, మరోసారి ఆశీర్వదించాలని టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కోరారు. పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతిరోజూ అందుబాటులో ఉన్నానన్నారు. మిషన్ భగీరథతో మంచినీరు, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాల్టీలకు రూ.50కోట్ల చొప్పున నిధులు తెచ్చామన్నారు. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చాంబర్లో ధర్నా చేసి కోరుట్లలో వెటర్నరీ కళాశాలకు రూ.300 కోట్లు మంజూరు చేయించానని గుర్తు చేశారు. సభలో గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు కటారి చంద్రశేఖర్‌రావు, జిల్లా రైతు సమన్వయ సమితి అ«ధ్యక్షులు చీటి వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్లు ఉమారాణి, శీలం వేణు, కోరుట్ల పట్టణ, మండల టీఆర్ఎస్ అ ద్యక్షులు అన్నం అనిల్, దారిశెట్టి రాజేశం, జడ్పీటిసిలు, ఎంపీటిసిలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరు : బూడిద భిక్షమయ్య
సాక్షి, బొమ్మలరామారం : కాంగ్రెస్ గెలుపును ఏ శక్తీ అ డ్డుకోలేదని ఆలేరు అసెంబ్లీ మహాకూటమి అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. మండలంలోని పిల్లిగుండ్ల తండా, మర్యాల, చౌదర్పల్లి, కాండ్లకుంట తండా, గోవింద్ తండా, లక్క తండా, సీత తండా, చీకటిమామిడి, సోలిపేట్, ప్యారారం, తి మ్మాపూర్, బోయిన్పల్లి గ్రామాల్లో సోమవారం ని ర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఆలేరు అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోవాలంటే కాంగ్రెస్æ పార్టీకే పట్టం కట్టాలన్నారు. మరోసారి తనను ఆదరించి ఆలేరు అభివృద్ధికి దో హదం చేయాలని భిక్షమయ్యగౌడ్ ఓటర్లను కో రారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అభయహస్తం పింఛన్ వెయ్యి రూపాయలకు పెంచుతామన్నారు. ఆడ పిల్లలకు వరంలాంటి బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. ఆరు లక్షలతో ఎస్సీ, ఎస్టీలకు, ఐదు లక్షల వ్యయంతో బీసీ ఓసీ లకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. బంగారు తెలంగాణ అంటూ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుం బమే బంగారుమయం చేసుకున్నాడన్నారు. కేసీ ఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊభిలోకితోసి రెండు లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. పీఏ సీఎస్ చైర్మన్ మోకు మధుసూదన్ రెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు సింగిర్తి మల్లేష్, బొల్లంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పడమటి పావని, తిరుమల కృష్ణగౌడ్, అన్నెమైన వెంకటేష్, కట్టా శ్రీకాంత్‌గౌడ్, మర్రి ఆగం రెడ్డి, రామిడి జంగారెడ్డి, ఎనగండ్ల వీరేశం, మాందాల రామస్వామి, చీర సత్యనారాయణ, బండ వెంకటేష్, మోటే గట్టయ్య, మ హదేవుని రాజు, మోటే వెంకటేష్, గుర్రం శ్రీని వాస్‌రెడ్డి, రాజు నాయక్, గుర్రాల సత్తిరెడ్డి, బో యిన్‌పల్లి రమేష్, శ్రీరాములు నాయక్, చంద్రశేఖర్, మోహన్‌నాయక్, రవికుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరిక.. మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో సోమవా రం గొల్లకురుమ సామాజిక వర్గానికి చెందిన 30 మంది నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.ఆలేరు మ హాకూటమి అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్ కాం గ్రెస్ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సైనికుడిలా పనిచేయాలని కోరారు. రామిడి జంగారెడ్డి, బోగ వెంకటేష్, క్రిష్ణ, రామిడి బాల్‌రెడ్డి, ఇప్పల పల్లి స్వామి, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. రాజాపేటలో.. రాజాపేట : మండలంలోని పాముకుంట గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ రంగ కిష్టయ్య గౌడ్, రంగ బాలస్వామి గౌడ్‌లతోపాటు 50 మంది యువకులు సోమవారం డీసీసీ ప్రెసిడెంట్ బూడిద భిక్షమయ్య గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలుచేసే సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ గెలపుకోసం కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు బత్తిని పాండు, కార్యదర్శి రంగ నరేష్‌గౌడ్, ఉపాధ్యక్షుడు రంగ పాండుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి మాటలు నమ్మొద్దు
సాక్షి, రామగిరి/మంథని : మాయమాటలు చెబుతూ మభ్యపెట్టేందుకు వస్తున్న మహాకూటమి నాయకులను నిమ్మితే మనల్ని నట్టేట ముంచుతారని టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు పేర్కొన్నారు. చందనాపూర్, ఎస్సీకాలనీ, పెద్దంపేట, పస్నూరు గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. మండల అధ్యక్షుడు పూదరి సత్యనారాయణగౌడ్, అధికార ప్రతినిధి కొంరయ్యగౌడ్, ఎంపీటీసీ ఎలువాక ఓదెలు, నాయకులు దాసరి రాయలింగు, బేతి కుమార్, ఇజ్జగిరి రాజు, గద్దల శంకర్, మేదరవేన కుమార్, రొడ్డ శ్రీనివాస్, పొన్నం సదానందం, శ్యాం(లడ్డా), వేగోళపు మల్లయ్య, ఆసం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో నాల్గున్నర సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశామని, మరోసారి అవకాశం కల్పిస్తే రాష్ట్రంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు అన్నారు. మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం వాకర్స్‌ను కలిశారు. పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలో అర్హత సాధించిన యువత ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. వారితో మాట్లాడారు. యోగా సాధన చేస్తున్నవారిని కలిసి ఓటు అభ్యర్థించారు, ఏగోళపు శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వాగ్దాన శూరుడు కేసీఆర్
హుస్నాబాద్ : ఎన్నికల్లో మోసపూరిత వాగ్ధానాలు చేసి గెలిచాక నెరవేర్చకపోవడంలో కేసీఆర్‌ను మించిన వారు మరొకరు ఉండరని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలో ప్రజాకూటమి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ జీఎస్టీతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కేసీఆర్ మద్దతు పలుకుతున్నాడని, కేసీఆర్‌కు ఓటేస్తే అది బీజేపీకి ముట్టినట్టవుతుందని అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ఎక్కువగా నష్టపోయారని అన్నారు. ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా నీళ్లు ఇవ్వనిదే ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్.. నీళ్లు ఇవ్వకుండా ప్రజాక్షేత్రంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం తప్ప ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద దొర, నియోజకవర్గంలో చిన్న దొర ఉన్నాడని.., దొరల రాజ్యం పోవాలంటే పేదల రాజ్యం రావాలని అందుకు ప్రజలు ఆలోచించాలని కోరారు. కొండగట్టులో బస్సు ప్రమాదంలో పదుల సంఖ్యలో చనిపోతే వారిని పరామర్శించలేదని అన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.25వేల ఆర్థిక సాయం చేశామని అన్నారు. కేసీఆర్ అక్రమాలపై ఒక్కొక్కటి బయటకు తీస్తున్నామని జీవితాంతం జైలులో పెడతామని హెచ్చరించారు. ప్రజాకూటమిలో భాగంగా తాను జగిత్యాల సీటును త్యాగం చేశానని, ప్రజా కూటమి అధికారంలోకి రాబోతుందని, నావంతు సాయంగా ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించి హుస్నాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రజాకూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలే నాలుగు రోజులు నిద్రాహారాలు మాని, కూటమిగా ఏర్పడ్డ నాలుగు జెండాలను హుస్నాబాద్‌లో ఎగురవేయాలని రమణ పిలుపునిచ్చాడు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో దొరల అహంకారం పెరిగిందని, దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అని విమర్శించాడు. అందరి త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చిందని.. చారిత్రాత్మక భద్రతగా గుర్తించి చాడ వెంకట్‌రెడ్డిని గెలిపించాలని అన్నారు. హుస్నాబాద్ సీపీఐ అభ్యర్థి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాకూటమి కేసీఆర్‌ను ఇంటికి పంపే కూటమిగా మారాలని అన్నారు. 2007లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. రీ డిజైన్ల పేరుతో టీఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నారని, తాను గెలిస్తే సంవత్సరంలోపు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయించి నీరందిస్తానని అన్నారు. ప్రజాకూటమిలో ఉన్న కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర ఇన్చార్జి కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల సీపీఐ కార్యదర్శులు మంద పవన్, రాంగోపాల్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొయ్యడ సృజన్‌కుమార్, గడిపె మల్లేష్, శోభారాణి, డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, సింగిల్ విండో అధ్యక్షుడు శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, టీడీపీ నాయకులు ప్రవీణ్‌కుమార్, బత్తుల శ్రీనివాస్, వరయోగుల శ్రీనివాస్, దొమ్మాటి మల్లేశం, తెలంగాణ జనసమితి నాయకులు కొంరెల్లి, చింతల రామచంద్రం, జీవన్‌రెడ్డి తదితరులున్నారు. ఆకట్టుకున్న వందేమాతరం శ్రీనివాస్ పాటలు హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన ప్రజాకూటమి బహిరంగ సభకు వందేమాతరం శ్రీనివాస్ పాటలు హైలెట్‌గా నిలిచాయి. రాములమ్మ ఓ రాములమ్మ, ఎర్రజెండ.. ఎర్రజెండ ఎనియలో.. వంటి పాటలకు కళాకారులతో పాటు సభకు వచ్చిన జనం కోరస్ పాడుతూ ఉత్సాహంగా కనిపించారు. సభకు నియోజకవర్గం నుంచి జనం పెద్దఎత్తున తరలివచ్చారు. హుస్నాబాద్ బహిరంగ సభలో పాటలు పాడుతున్న సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ .