Hyderabad Meteorological Centre
-
TS: పలు ప్రాంతాల్లో నేడు, రేపు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు కొనసాగుతున్న ద్రోణి గురువారం బలహీనపడిందని... దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత 24 గంటల్లో గద్వాల జిల్లా జూరాలలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా ఖిలా ఘన్‌పూర్‌లో 4, నల్లగొండ జిల్లా దేవరకొండలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు శుక్రవారం ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం, అదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం కొమురం భీం జిల్లా కుంచవెల్లిలో అత్యధికంగా 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
మరో రెండ్రోజులు ఉక్కపోతే..
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులపాటు రాష్ట్రంలో సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య, గ్రేటర్ హైదరాబాద్ సమీప జిల్లాల్లో మాత్రం 38 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు సూచించింది. కాగా, ఆదివారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నల్లగొండ జిల్లా నిడమనూరులో 46.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే...గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 42.4 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉపరితలద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు మరోవైపు విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితలద్రోణి ఏర్పడిందని ఇది సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు సూచించింది. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలు ప్రాంతం జిల్లా గరిష్ట ఉష్ణోగ్రత నిడమనూరు నల్లగొండ 46.1 దామెరచర్ల నల్లగొండ 45.6 బయ్యారం మహబుబాబాద్ 45.5 తంగుల కరీంనగర్ 45.5 కేతెపల్లి నల్లగొండ 45.3 రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌లో) కేంద్రం గరిష్టం కనిష్టం ఖమ్మం 42.4 30.0 భద్రాచలం 42.2 28.0 నల్లగొండ 42.2 24.8 ఆదిలాబాద్ 41.5 26.2 రామగుండం 41.4 25.0 హనుమకొండ 41.0 25.0 నిజామాబాద్ 40.9 29.5 మెదక్ 40.6 24.0 మహబూబ్‌నగర్ 40.5 28.5 హైదరాబాద్ 39.4 26.6 దుండిగల్ 38.5 24.9 హకీంపేట్ 37.5 23.9 -
తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలయ్యాయి. తెలంగాణవ్యాప్తంగా 40 డిగ్రీల సెల్సియస్‌పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా చాప్రాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుల్లో అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు గురై ముగ్గురు మృతిచెందారు. వారిలో మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, నిర్మల్ జిల్లాలో ఒక ఉపాధి కూలీ ఉన్నారు. ఎండల తీవ్రతకు వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎండ వేడి కారణంగా అనేక చోట్ల వరి కోతలు నిలిచిపోయాయి. కూలీలు దొరకని పరిస్థితి నెలకొంది. వరి కోత యంత్రాలు సైతం అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాలిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాబోయే రోజుల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని, మే నెలాఖరు వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు తెలిపింది. వేసవి ప్రణాళిక అమలులో నిర్లక్ష్యం... ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వేసవి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని విపత్తు నిర్వహణ శాఖ ఆదేశించినా సంబంధిత శాఖలు మాత్రం దీనిపై పెద్దగా దృష్టిపెట్టడంలేదన్న ఆరోపణలున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి, ఆశ వర్కర్లు, పారామెడికల్ సిబ్బందికి ఎండల తీవ్రత నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కల్పించడంతోపాటు వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇవేవీ పెద్దగా అమలు కావట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. వడదెబ్బ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్న విపత్తు నిర్వహణశాఖ సూచనలను పట్టించుకొనే పరిస్థితి కనిపించట్లేదు. అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్న నిర్ణయం దాదాపు ఎక్కడా అమలుకావడంలేదని ప్రజలు చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు పనిచేసే చోట షెల్టర్లు కట్టించాలన్న నిబంధన కాగితాలకే పరిమితమైంది. కార్మికులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆరుబయట పనిచేయకూడదన్న నిబంధనను అనేక కంపెనీలు ఉల్లంఘిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. ఎంత ఎండకు ఏ అలర్ట్? ► రెడ్ అలర్ట్ (సాధారణం కంటే 6 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పులు ఉంటే జారీ చేసేది) ► ఆరెంజ్ అలర్ట్ (సాధారణం కంటే 4–5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే) ► ఎల్లో అలర్ట్ (హీట్‌వేవ్ వార్నింగ్. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కాస్త ఎక్కువ నమోదైతే) ► వైట్ అలర్ట్ (సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే జారీ చేసేది) ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ► తరచూ నీళ్లు తాగాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీళ్ల సీసాను వెంట తీసుకెళ్లాలి. ► తెలుపు, లేతవర్ణంగల పలుచటి కాటన్ వస్త్రాలు ధరించాలి. ► తలకు వేడి తగలకుండా టోపీ లేదా రుమాలు చుట్టుకోవాలి. ► వడదెబ్బ తగిలిన వారిని నీడలో ఉంచాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు తడిగుడ్డతో తుడవాలి. ► ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. ► వడగాడ్పులు వీస్తుంటే భవన నిర్మాణ కార్మికులకు యాజమాన్యాలు నీడ కల్పించాలి. తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ► ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. నీటి వసతి కల్పించాలి. ► బస్టాండ్లలో, దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో తాగునీరు అందుబాటులో ఉంచాలి. -
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు
-
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు మరిన్ని వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. దక్షిణ ఝార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని వెల్లడించింది. దీనికి అనుబంధంగా 7.6 ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు చెప్పారు. ఈ రోజు అనేక చోట్ల మరియు రేపు చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా ఆగస్టు 19 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. (ఆఖరి నిమిషంలో ఆశలు ‘గల్లంతు’) హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద వర్షాలతో 513.64 మీటర్లకు చేరిన నీటిమట్టం 24 గంటల పాటు వరద పరిస్థితిని పరిశీలిస్తున్న అధికారులు నగరంలో నిరంతరం పనిచేస్తున్న మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ -
కొనసాగుతున్న రుతుపవనాల విస్తరణ
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాల విస్తరణ కొనసాగుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, డయ్యూలలోని మొత్తం ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లో మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్లలో మిగిలిన ప్రాంతాలు, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి సోమవారం నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో కొన్ని ప్రాంతాల్లోకి మరో 48 గంటల్లో రుతు పవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. దీంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. -
తెలంగాణలో ‘తొలకరి’ ఉత్సాహం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రైతాంగం వానాకాలం సాగు కోసం పొలం బాట పడుతోంది. రుతుపవనాల ప్రవేశానికి ముందే తొలకరి జల్లులతో ఈ ఏడాది వర్షాలు బాగానే కురుస్తాయనే ఆశలు రైతుల్లో చిగురిస్తున్నాయి. సాగుకు వీలుగా భూమిని చదును చేసుకుని వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగంలో ఈ తొలకరి జల్లులు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే ఏరువాకతో దుక్కి దున్ని, గొర్లు సిద్ధం చేసుకుని, నార్లు పోసుకునేందుకు సిద్ధంగా ఉన్న కర్షకుడు.. గత రెండ్రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలు మరో 3, 4 రోజులు కొనసాగితే ఇక పూర్తిస్థాయిలో పొలం బాట పట్టనున్నాడు. బుధ వారం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలు మరో రెండ్రోజులు కొనసాగుతాయని, గురువారం 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భువనగిరిలో అత్యధికం.. బుధవారం రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాజధాని హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ వర్షపాతం నమోదైందని వాతావరణ గణాంకాలు వెల్లడించాయి. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో అత్యధికంగా 16.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, వరంగల్ (అర్బన్, రూరల్), యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, జనగామ జిల్లాల్లో ఒకట్రెండుచోట్ల గురువారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం కూడా భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. యాదాద్రి జిల్లా భువనగిరిలో అత్యధికంగా కురిసిన వర్షపాతం - 16.9 సెం.మీ. నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే జిల్లాల సంఖ్య -12 రుతుపవనాల విస్తరణ తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, త్రిపుర మిజోరంలో కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు బుధవారం విస్తరించాయి. మధ్య అరేబియా సముద్రం, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలు, తెలంగాణ, కోస్తా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు, మధ్య, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య భారతదేశంలో మరికొన్ని ప్రాంతాల్లోకి వచ్చే 48 గంటల్లో విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాతి 48 గంటల్లో మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర, బంగాళాఖాతం, ఈశాన్య భారతదేశంలో మిగిలిన ప్రాంతాలు, సిక్కింలోని మొత్తం ప్రాంతాలు, ఒడిశా, పశ్చిమబెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది. కొనసాగుతున్న అల్పపీడనం తూర్పు, మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ ఎత్తు వరకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది 48 గంటల్లో పశ్చిమ వాయువ్యం దిశగా ప్రయాణించి బలపడే అవకాశం ఉందని, దీని కారణంగానే రాష్ట్రానికి వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం అత్యధిక వర్షపాతం (సెం.మీ.) నమోదైన ప్రాంతాలు జిల్లా గ్రామం/పట్టణం వర్షపాతం యాదాద్రి భువనగిరి 16.9 యాదాద్రి మర్యాల 13.7 ఆదిలాబాద్ పోచర 11.8 యాదాద్రి వెంకిర్యాల 10.5 ఖమ్మం మధిర 9.3 యాదాద్రి యాదగిరిగుట్ట 8.85 ఖమ్మం ఎర్రుపాలెం 8.85 వరంగల్ అర్బన్ కాశీబుగ్గ 8.75 (రంగారెడ్డి, వరంగల్ (అర్బన్/రూరల్ జిల్లాలు), సిద్దిపేట, యాదాద్రి, ఖమ్మం,నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 7 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది) -
రెండ్రోజుల్లో ‘నైరుతి’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి వచ్చే 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 48 గంటల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు రాయలసీమ, కోస్తా ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశముందని మంగళవారం వివరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి బలపడే అవకాశముందని తెలిపింది. ఇటు ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు రెండ్రోజుల పాటు కురిసే అవకాశముందని పేర్కొం ది. బుధవారం మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. గురువారం కూడా ఒకట్రెం డుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని కూడా వాతావరణ కేంద్రం వివరించింది. -
తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోకి రుతుపవనాల ప్రవేశం సమీపిస్తున్న వేళ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురుస్తాయని, అలాగే బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని సోమవారం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలోని ప్రాంతాల్లో మధ్యస్థ ట్రోపోస్పీయర్ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి మరో 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి బలపడే అవకాశం ఉందని వివరించింది. మధ్య అరేబియా సముద్రం, గోవా, కొంకణ్‌లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటక, రాయలసీమలో మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, కోస్తా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు, మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనికి నైరుతి రుతుపవనాలు రెండ్రోజుల్లో విస్తరించే అవకాశం ఉందని, తర్వాతి ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సోమవారం నాటి ఉష్ణోగ్రతలు: పట్టణం/ నగరం ఉష్ణోగ్రత ఆదిలాబాద్ 39.3 భద్రాచలం 39.2 హన్మకొండ 38.5 హైదరాబాద్ 37.5 ఖమ్మం 40.2 మహబూబ్‌నగర్ 35.4 మెదక్ 37.6 నల్లగొండ 39.5 నిజామాబాద్ 38.4 రామగుండం 39.6 -
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం
-
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఆదివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలుచోట్ల వాతావరణం చల్లబడి.. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్, హయత్‌నగర్, మలక్‌పేట్, సంతోష్‌నగర్, అబిడ్స్, కోఠి, బంజారాహిల్స్, ఉప్పల్, ఘట్కేసర్, మోహిదీపట్నం, జీడిమెట్ల, మాదాపూర్, పంజాగుట్టలలో వర్షం కురుస్తోంది. కాగా, గత కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరయిన జనాలు.. వర్షం పలకింపుతో వేసవితాపం నుంచి కాస్త ఉపశమనం పొందారు. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో.. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు రాగల 48 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపు లు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవ కాశం ఉందని తెలిపింది. ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీంతో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. తగ్గిన ఉష్ణోగ్రతలు... రాష్ట్రంపై భానుడి ప్రతాపం కాస్త తగ్గింది. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. శనివారం ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 40 డిగ్రీల సెంటీగ్రేడ్, హన్మకొండ, రామగుండంలో 35 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
తెలంగాణ: రాగల 3 రోజుల్లో వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. దక్షిణ జార్ఖండ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు, ఇంటీరియర్ ఒరిస్సా నుంచి దక్షిణ చత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కీమీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావారణ కేంద్రం తెలిపింది. దీంతో బుధ, గురువారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అంతేగాక శుక్రవారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. -
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, నిజాంపేట్, కేపీహెచ్‌బీ, సికింద్రాబాద్, కంటోన్మెంట్, కూకట్పల్లి, మూసాపేట్, ఈసీఐఎల్, అల్వాల్, బొల్లారం, పాతబస్తీ, రాజేంద్రనగర్, నాగారం, జవహార్ నగర్, కీసరలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్ దానిని అనకుని ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని హైదరాబాద్ వాతారవణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో అక్కడక్కడ 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి, ఖమ్మం, జనగామ, యాదాద్రి భువనగిరి, మెహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల్ వనపర్తి, మెహబూబాబాద్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంని పేర్కొంది. -
రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: కోమోరిన్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడటంతోపాటు ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో శనివా రం పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు పేర్కొన్నారు. తేమ గాలుల కారణంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. 24 గంటల్లో నిజామాబాద్‌లో 7.3 డిగ్రీలు అధికంగా 21.4 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 6.2 డిగ్రీలు అధికంగా 20.6 డిగ్రీలు, నల్లగొండలో 1.2 డిగ్రీలు తక్కువగా 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈశాన్యం నుంచి వచ్చే చలి గాలుల తీవ్రత భూమిని తాకే పరిస్థితి లేకపోవడంతో చలి అంతగా లేదని వివరించింది. -
రానున్న మూడ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరాలకు దగ్గర్లో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరోవైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుండి గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో రానున్న మూడురోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా గత 24 గంటల్లో రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 8 డిగ్రీలు అధికంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 7.6 డిగ్రీలు ఎక్కువగా 23 డిగ్రీలు, భద్రాచలంలో 7.5 డిగ్రీలు ఎక్కువగా 25 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండలో రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.1 డిగ్రీలు తక్కువగా 19 డిగ్రీలుగా రికార్డయింది. అక్కడ పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 2.1 డిగ్రీలు తక్కువగా 28.4 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 3 డిగ్రీలు తక్కువగా 27.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. -
నేడు, రేపు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ శ్రీలంక తీరం దగ్గరలోని హిందూ మహాసముద్రం నుంచి ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో ఉన్న నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. ప్రధానంగా ఈశాన్య దిశ నుంచి చలి గాలులు వీస్తాయని పేర్కొంది. -
పండుగపూట తడిసి ముద్దయిన నగరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు వీడటంలేదు. వరుస వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. దీంతో బతుకమ్మ ఉత్సవాలకు అనేకచోట్ల ఆటంకం కలిగింది. ఈ వర్షాల కారణంగా పలు పంటలపై వ్యతిరేక ప్రభా వం చూపే పరిస్థితి కనిపిస్తుంది. పత్తి కాయ పగిలే దశలో ఉన్నందున నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తా కర్ణాటక వరకు తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇంటీరియర్ ఒడిశ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో సోమవారం కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఒకట్రెండుచోట్ల భారీవర్షాలతోపాటు, చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. నగరంలో 10 సెంటీమీటర్ల వర్షం రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరం వరుస వర్షాలతో నిండా మునుగుతోంది. ఆదివారం క్యుములోనింబస్ మేఘాల కారణంగా నగరంలో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం మధ్యా హ్నం నుంచి హైదరాబాద్‌లోని కూకట్పల్లి మండ లం రాజీవ్‌గృహకల్ప, జగద్గిరిగుట్ట ప్రాంతా ల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుతు్బల్లాపూర్ మండలం గాజులరామారం, ఉషోదయపార్కు వద్ద 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక షాపూర్‌నగర్‌లో 8.5, సుభాష్‌నగర్, ఆలి్వ న్ కాలనీలలో 7, అంబర్‌పేట, రామంతాపూర్‌లలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లోని వందకుపైగా బస్తీలు నీటమునిగాయి. ప్రధాన రహదారులపై ఉన్న భారీ వృక్షాలు కుప్పకూలడంతో వాటి కింద పార్కింగ్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇళ్లలోకి చేరిన వరదనీటిని తోడేందుకు పలు బస్తీల వాసులు నానా అవస్థలు పడ్డారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టాయి. పలు నాలాలు ఉగ్రరూపం దాల్చడంతో వాటికి ఆనుకుని ఉన్న బస్తీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇంట్లోకి చేరిన నీటిలో మునిగి వ్యక్తి మృతి బొల్లారం: తిరుమలగిరిలో ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం ఓ వ్యక్తి ప్రాణాలను హరించింది. ఇక్కడి శాస్త్రీనగర్‌లోని నాలా ఉప్పొంగి దానికి ఆనుకొని ఉన్న ఇంట్లోకి ప్రవహించడంతో నిద్రలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల కథనం మేరకు శాస్త్రీనగర్‌కు చెందిన జగదీశ్(35), తల్లితో కలిసి గత రెండేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. తల్లి బాయమ్మ స్థానిక చర్చితో పాటు పలు చర్చిల వద్ద యాచిస్తూ జీవనం సాగిస్తోంది. కాగా ఆదివారం మధ్యాహ్నం జగదీశ్ ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఇదే సమయంలో భారీగా వర్షం కురవడంతో అతని ఇల్లు కూడా నాలా వెంట ఉండడంతో వరద నీళ్లు ఉప్పొంగి వారి ఇంట్లోకి ప్రవేశించాయి. గాఢ నిద్రలో ఉన్న జగదీశ్ ఈ విషయం తెల్సుకునేలోపే ఊపిరందనిస్థితికి చేరుకొని ప్రాణాలు కోల్పోయాడు. వర్షం తగ్గిన తరువాత ఇంట్లోని గడప వద్ద పడివున్న జగదీశ్ మృతదేహాన్ని స్థానికులు గమనించి తల్లికి విషయాన్ని చేరవేశారు.విగతజీవుడిగా ఉన్న కుమారుడిని చూసి తల్లి కుప్పకూలింది. కాగా అతనికి మూర్ఛవ్యాధి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బస్తీవాసులతో పాటు బోర్డు సభ్యురాలు భాగ్యశ్రీ, టీఆర్ఎస్ ఏడోవార్డు అధ్యక్షుడు కేబీశంకర్‌రావు ఆర్థిక సాయం చేయడంతో జగదీశ్‌కు అంత్యక్రియలు జరిపారు. -
రానున్న మూడ్రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆదివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం: వర్ని (నిజామాబాద్) 6 సెం.మీ., కోటగిరి (నిజామాబాద్) 5 సెం.మీ., బెజ్జూరు (కొమురం భీం) 4 సెం.మీ., గాంధారి (కామారెడ్డి) 4 సెం.మీ., జుక్కల్ (కామారెడ్డి) 3 సెం.మీ., లింగంపేట్(కామారెడ్డి) 3 సెం.మీ., మద్నూర్ (కామారెడ్డి) 3 సెం.మీ., నిజామాబాద్ 3 సెం.మీ, అశ్వారావుపేట్లలో (భద్రాద్రి కొత్తగూడెం) 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
నేడు, రేపు వానలు..
సాక్షి, హైదరాబాద్: రాగల మూడురోజులు రాష్ట్రంలో అనేకచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలలో నేడు, రేపు ఒకటిరెండుచోట్ల, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాగల 24 గంటలలో ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ ప్రాంతాలలో నమోదైన వర్షపాతం: సుల్తానాబాద్ (పెద్దపల్లి) 8 సెం.మీ, జోగిపేట్ (సంగారెడ్డి) 7 సెం.మీ, దుమ్ముగూడెం(భద్రాద్రి కొత్తగూడెం), పరకాల (వరంగల్ రూరల్), ఎంకూరు (ఖమ్మం), కరీంనగర్, దండెపల్లి (మంచిర్యాల), ఆర్మూర్ (నిజామాబాద్)లో 6 సెం.మీ, కొండాపూర్ (సంగారెడ్డి), నేరేడ్చర్ల (సూర్యాపేట్), నర్మెట్ట (జనగాం), కాళేశ్వరం (జయశంకర్ భూపాలపల్లి), పెద్దేముల్ (వికారాబాద్), నందిపేట్ (నిజామాబాద్)లలో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: తూర్పు ఉత్తరప్రదేశ్, దాన్ని ఆనుకుని ఉన్న బిహార్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ.. ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉంది. ఈ అల్పపీడనం మధ్య ప్రాంతం నుంచి కోస్తాంధ్ర వరకు ఒడిశా మీదుగా ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఇక తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో తాజాగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో వచ్చే రెండు రోజులు చాలాచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గురువారం ఒకట్రెండు చోట్ల భారీవర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా బుధవారం సాయంత్రం రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం మాచర్లలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. జగిత్యాల, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, జనగాం, కామారెడ్డి, మంచిర్యాల, నారాయణపేట, నిర్మల్, వరంగల్ రూరల్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. జోరుగా వరినాట్లు రాష్ట్రంలో వరి నాట్లు జోరుగా పడుతున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. ఈ ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.83 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 19.47 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. గత వారంతో చూస్తే దాదాపు 5 లక్షల ఎకరాల వరినాట్లు అధికంగా పడినట్లు వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడించింది. రానున్న వారం పది రోజుల్లో వంద శాతం అంచనాలు దాటి వరినాట్లు పడతాయని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
వచ్చేస్తోంది జల‘సాగరం’
సాక్షి, హైదరాబాద్: పదిహేను రోజులుగా ఎగువన కురుస్తున్న కుంభవృష్టితో కృష్ణానదికి భారీ వరదలొస్తున్నాయి. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో 3, 4 రోజులుగా రోజుకు సగటున 25 సెంటీమీటర్లకు పైగా వర్షం కురుస్తుండడంతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో మరో రెండు, మూడ్రోజుల్లో శ్రీశైలం నిండనుంది. ఆ తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు (ఎన్నెస్పీ)కు నీటిని విడుదల చేస్తారు. సాగర్‌కు నీరు త్వరలోనే వస్తోందనే వార్తతో పరీవాహక ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. సకాలంలో కురవని వర్షాలు, సాగర్‌లో అడుగంటిన నీటి మట్టాలతో జూన్, జూలైలో ఖరీఫ్ డీలాపడగా.. ఇకపై పుంజు కోనుంది. ఇప్పటికే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా 82వేల క్యూసెక్కుల నీటిని వినియోగి స్తుండగా.. సాగర్‌కు 74వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌లో 312 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 135 టీఎంసీల నీరుంది. శ్రీశైలంకు డబుల్ వరద కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి భారీగా వరద కిందకు వదులుతున్నారు. దీనికితోడు మహారాష్ట్ర లో భీమానదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టు సైతం పూర్తిస్థాయిలో నిండి అక్కడి నుంచి 1.25లక్షల క్యూసెక్కులకు పైగా భారీ ప్రవాహాలు దిగువకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దిక్కుల నుంచి ఉధృతంగా వస్తున్న వరదలతో శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకోనుంది. గురువా రం నుంచి 5లక్షల క్యూసెక్కుల మేర వరద ఈ ప్రాజెక్టులోకి చేరే అవకాశముంది. 2 రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోనుంది. మరో 59 టీఎంసీలు నిండితే.. ఎగువన వర్షాలతో మరింత వరద వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో ప్రాజెక్టులో నీటి నిల్వలను ఖాళీ చేయాలని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. ఆల్మట్టిలో 90టీఎంసీల మేర మాత్రమే ఉంచి 4లక్షల క్యూసెక్కులు, నారాయణ పూర్లో 22 టీఎంసీలు మాత్రమే ఉంచి 4.64 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులు తున్నారు. ఈ నీరంతా జూరాలకు వస్తోంది. ప్రస్తుతం జూరాలకు 3.25లక్షల క్యూసెక్కుల వరద నమోదవుతుండగా, 3.47లక్షల క్యూసె క్కుల నీటి ని శ్రీశైలానికి వదులుతున్నారు. దీంతో శ్రీశైలానికి బుధవారం ఏకంగా 2.81 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. దీంతో ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 215.8టీఎంసీలకుగానూ 156 టీఎంసీల నీరు చేరింది. శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయానికల్లా ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతుందని నీటిపారుదల అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురంలో అత్యధికంగా 17 సెం.మీ. కుండపోత వర్షం కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాష్ట్రంలోని జయశంకర్ భూపాల్పల్లి, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. తాగునీటికి పక్కనపెట్టి.. మిగతాది సాగుకు ఏఎమ్మార్పీ కింద, హైదరాబాద్ జంట నగరాలకు, మిషన్ భగీరథ, నల్లగొండ జిల్లా తాగు అవసరాలకై సాగర్ కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన కనిష్టంగా 30 టీఎంసీల మేర నీటిని పక్కన పెట్టాకే సాగు అవసరాలకు విడుదలయ్యే అవకాశం ఉంది. రేపు కృష్ణా బోర్డు సమావేశం శ్రీశైలం, సాగర్‌లో ఉన్న లభ్యత జలాలు, వాటి పంపకంపై చర్చించేందుకు ఈ నెల9న కృష్ణా బోర్డు భేటీ కానుంది. దీనికి రెండు తెలుగు రాష్ట్రాల ఇంజనీర్లు హాజరుకానున్నారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాలు తమ తమ అవసరాలపై చర్చించనున్నాయి. ఇందులోనే సాగర్ కింది తాగు, సాగు అవసరాలపై చర్చ జరగనుంది. -
రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు, పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు శుక్రవారం పశ్చిమ రాజస్తాన్‌లోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించడంతో మొత్తం భారతదేశం అంతా విస్తరించాయని పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం: దేవరకొండ (నల్లగొండ) 7 సెం.మీ., కొత్తగూడ (మహబూబాబాద్) 6 సెం.మీ., లక్ష్మణ్‌చాంద (నిర్మల్) 5 సెం.మీ., మద్దూర్ (మహబూబ్‌నగర్) 5 సెం.మీ., అల్లాదుర్గ్ (మెదక్) 4 సెం.మీ., శాయంపేట (వరంగల్ రూరల్) 4 సెం.మీ., తాండూర్ (వికారాబాద్) 4 సెం.మీ., మగనూర్ (మహబూబ్‌నగర్) 3 సెం.మీ., నిడమనూర్ (నల్లగొండ) 3 సెం.మీ., ఆత్మకూర్ (వరంగల్ రూరల్) 3 సెం.మీ., కెరిమెరి (కొమురం భీం) 3 సెం.మీ., మునిపల్లి (సంగారెడ్డి) 3 సెం.మీ., పోచంపల్లి 3 సెం.మీ., బూర్గంపాడు 3 సెం.మీ., భద్రాచలంలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది తీవ్రంగా మారి రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే దక్షిణ ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావాలతో సోమవారం ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అనేక చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మంగళవారం కొన్నిచోట్ల భారీ వర్షాలతోపాటు ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. గత 24 గంటల్లో దుండిగల్‌లో 6 సెంటీమీటర్లు, గజ్వేల్, బజర్హతనూర్, తూప్రాన్లలో 5 సెంటీమీటర్ల చొప్పున, ధర్మసాగర్, నర్మెట్ట, వర్నిలలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. హైదరాబాద్‌లో 11 శాతం అధిక వర్షపాతం జూన్‌లో హైదరాబాద్‌లో 11 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ నెల రోజుల్లో 105.6 మిల్లీమీటర్ల (ఎంఎం) వర్షం కురవాల్సి ఉండగా 116.9 ఎంఎం కురిసింది. కరీంనగర్ జిల్లాలో ఆరు శాతం అధిక వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ నెల రోజుల్లో రాష్ట్రంలో సరాసరి 132 ఎంఎం వర్షం కురవాల్సి ఉండగా 86.2 ఎంఎం కురిసింది. ఖమ్మం జిల్లాలో మాత్రం ఏకంగా 73 శాతం లోటు వర్షపాతం నమోదవడం గమనార్హం. జిల్లాలో గత నెల రోజుల్లో సాధారణంగా 130.5 ఎంఎం మేర వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 35.2 ఎం.ఎం. మాత్రమే నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో 3.1 కి.మీ. నుంచి 3.6 కి.మీ. మధ్య ఉపరితల ఆవర్తనం కోనసాగుతోందని పేర్కొంది. రాష్ట్రంలో నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, కొమురం భీం, సంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో నమోదైన వర్షపాతం మక్లూర్ (నిజామాబాద్) 11 సెం.మీ., దిలావర్పూర్ (నిర్మల్) 10 సెం.మీ., పిట్లం (కామారెడ్డి) 8 సెం.మీ., జైనూర్ (కొముం భీం) 7 సెం.మీ., కోహిర్ (సంగారెడ్డి) 7 సెం.మీ., సిర్పూర్(కొమురం భీం) 7 సెం.మీ., లింగంపేట్ (కామారెడ్డి) 6 సెం.మీ., నేకల్ (సంగారెడ్డి) 6 సెం.మీ., ఆర్మూర్ (నిజామాబాద్) 6 సెం.మీ., ఎడపల్లి (నిజామాబాద్) 6 సెం.మీ., జక్రాన్‌పల్లి (నిజామాబాద్) 5 సెం.మీ., నిజామాబాద్ 5 సెం.మీ., నిర్మల్ 5 సెం.మీ., కెరిమెరి (కొమురం భీం) 5 సెం.మీ., దండెపల్లి (మంచిర్యాల) 4 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
చురుగ్గా రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాజస్తాన్ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా తూర్పు పశ్చిమ బంగాళాఖాతం వరకు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి వ్యాపించిందని వివరించింది. అలాగే ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. రుతుపవనాలు, ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో వచ్చే 3 రోజులు చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశముందని వివరించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూలు, మహబూబాబాద్‌లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డు అయింది. కాగజ్‌నగర్, సిర్పూరు, పాలకుర్తిలో 4 సెంటీమీటర్లు.. ఆలంపూర్, నర్సంపేట్, జైనూర్, ఉట్నూరు, పినపాక, జఫర్‌గఢ్, వంకిడిలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు. రుతుపవనాలు ప్రవేశించడం, వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. అనేకచోట్ల సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. మెదక్‌లో సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా 28 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, హకీంపేట, హన్మకొండల్లో సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.