Jewelry
-
డ్రైఫ్రూట్స్ నగల ధగధగలు
ఫంక్షన్లో పదిమంది దృష్టి పడేలా ప్రత్యేకంగా కనిపించాలనుకోవడం సహజం. మేకప్ ఆర్టిస్ట్ వసుంధర మరింత ప్రత్యేకంగా కనిపించాలని డిసైడై ‘డ్రై ఫ్రూట్స్ జ్యూలరీ’ ధరించింది. యూనిక్ లుక్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో బజ్ క్రియేట్ చేసింది. మాంగ్ టిక్క, గాజులు, జూకాలు, వడ్డాణం... ఇలా అన్నీ డ్రైఫ్రూట్స్‌తో తయారు చేసినవే. ఫంక్షన్ తరువాత డ్రైఫ్రూట్స్‌ను రీయూజ్ చేస్తారా, పారేస్తారా అనేది మాత్రం తెలియదు. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వేలాది లైక్‌లతో వైరల్ అయింది. ‘భలే ఉన్నారు’ అనే ప్రశంసలతో పాటు ‘వేస్టేజ్ ఆఫ్ ఫుడ్’లాంటి కామెంట్స్ కనిపించాయి. -
శ్రీవారికి 2.12 కిలోల బంగారు కంఠాభరణం.. కానుకగా సమర్పించిన వైవీ సుబ్బారెడ్డి దంపతులు
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలత ఆదివారం శ్రీదేవి సమేత బంగారు కంఠాభరణాన్ని కానుకగా సమర్పించారు. ఈ ఆభరణాన్ని 2 కిలోల 12 గ్రాముల 500 మిల్లీ గ్రాములతో తయారు చేశారు. వైవీ సుబ్బారెడ్డి దంపతులు తొలుత శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌కు ఈ ఆభరణాన్ని అందించారు. విశ్వశాంతి కోసం తిరుమల ధర్మగిరి వేద విద్యాపీఠంలో ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం విజయవంతంగా ముగిసిన సందర్భంగా స్వామివారికి కానుకను సమర్పించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చదవండి: భద్రతకు గట్టి భరోసా -
ఆభరణమూ చరిత్ర చెబుతుంది
పొన్నియిన్ సెల్వన్... అది ఒక చరిత్ర పుస్తకం. అది ఒక సాహిత్య సుమం. అది ఒక సామాజిక దృశ్యకావ్యం. వీటన్నింటికీ దర్పణాలు ఈ ఆభరణాలు. ఆభరణం చరిత్రను చెబుతుంది. ఆభరణం కూడా కథను నడిపిస్తుంది. ఆ ఆభరణాలకు రూపమిచ్చిన డిజైనర్... ప్రతీక్ష ప్రశాంత్ పరిచయం ఇది. ప్రతీక్ష ప్రశాంత్... ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఆమె కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. తన క్రియేటివిటీతో తెరకు కళాత్మకతను పొదిగారామె. ఆ సినిమాలో నటీనటులు ధరించిన ఆభరణాలను రూపొందించిన ప్రతీక్ష ప్రశాంత్... సినిమా కోసం తనకు ఏ మాత్రం అవగాహన లేని చోళ రాజుల గురించి తెలుసుకున్నారు. వారి జీవన శైలి, వారికి ఇతర దేశాలతో ఉన్న వర్తక వాణిజ్యాలు, ఆచారవ్యవహారాలు, ధార్మికజీవనం... అన్నింటినీ ఔపోశన పట్టారు ప్రతీక్ష. ఆ అనుభవాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ‘‘మాకు సినిమా ప్రపంచంతో ఏ మాత్రం పరిచయం లేదు. మా ఇంట్లో వాళ్లు మహా బిడియస్థులు. మా పూర్వికులు నిజాం కుటుంబాలకు ఆభరణాలు తయారు చేశారు. హైదరాబాద్ లో ఆరు దశాబ్దాలుగా ఆభరణాల తయారీ, అమ్మకాల వ్యాపారంలో ఉన్నారు. కానీ వాళ్ల ఫొటోలు కూడా ఎక్కడా కనిపించవు. అలాంటిది ఒక్కసారిగా నేను సినిమా కోసం పని చేయడం ఊహించని మలుపు అనే చెప్పాలి. సినిమాకు ఆర్నమెంట్ డిజైనర్‌గా కంటే ముందు నా గురించి చెప్పాలంటే... మాది గుజరాతీ కుటుంబం. నేను పుట్టింది, పెరిగింది మాత్రం ముంబయిలో. మా నాన్నలాగే ఆర్కిటెక్చర్ చేశాను. పెళ్లితో కిషన్‌దాస్ ఆభరణాల తయారీ కుటుంబంలోకి వచ్చాను. నాకు ఉత్తరాది కల్చర్‌తోపాటు హైదరాబాద్ కల్చర్ తో మాత్రమే పరిచయం. అలాంటిది తమిళనాడుకు చెందిన ఒక పీరియాడికల్ మూవీకి పని చేయవలసిందిగా ఆహ్వానం అందడం నిజంగా ఆశ్చర్యమే. ఆ సినిమాకు డ్రెస్ డిజైనర్‌గా పనిచేసిన ‘ఏకా లఖానీ’కి నాకు కామన్ ఫ్రెండ్ సినీ నటి అదితి రావు హైదరీ. ఆమె ఆర్నమెంట్ డిజైనింగ్‌లో నా స్కిల్ గురించి ఏకా లఖానీకి చెప్పడంతో నాకు పిలుపు వచ్చింది. మణిరత్నం గారితో మాట్లాడిన తరవాత నేను చేయాల్సిన బాధ్యత ఎంత కీలకమైనదో అర్థమైంది. కొంచెం ఆందోళన కూడా కలిగింది. ఎందుకంటే నాకు చోళుల గురించి తెలియదు. ఆభరణాలు అర్థం కావడానికి కొన్ని పెయింటింగ్స్ చూపించారు. వాటిని చూసి యథాతథంగా చేయడం నాకు నచ్చలేదు. అందుకే చోళుల గురించి అధ్యయనం చేశాను. విదేశీ మణిమాణిక్యాలు చోళులు ధరించిన ఆభరణాల్లో ఉన్న మాణిక్యాలు మామూలు మాణిక్యాలు కాదు. అవి బర్మా రూబీలు. బర్మాతో చోళులకు ఉన్న వర్తక వాణిజ్యాల గురించి తెలిస్తేనే నేను ఆభరణంలో బర్మా రూబీ వాడగలుగుతాను. టాంజానియా, గోల్కొండతో కూడా మంచి సంబంధాలుండేవి. మరకతాలు, వజ్రాల్లో ఆ మేరకు జాగ్రత్త తీసుకున్నాం. అలాగే చోళులు శివభక్తులు, చేతికి నాగ వంకీలను ధరిస్తారు. తలకు పెద్ద కొప్పు పెట్టి, ఆ కొప్పుకు సూర్యవంక, చంద్రవంక, నాగరం వంటి ఆభరణాలను ధరిస్తారు. ఆభరణాల్లో కమలం వంటి రకరకాల పూలు– లతలు, నెమలి, రామచిలుక వంటి పక్షులు, దేవతల రూపాలు ఇమిడి ఉంటాయి. ముక్కు పుడక నుంచి చేతి వంకీ, ముంజేతి కంకణం, వడ్డాణం, తల ఆభరణాలు... వేటికవి తనవంతుగా కథను చెబుతాయి, కథకు ప్రాణం పోస్తాయి. రంగస్థలం అయితే తల వెనుక వైపు ఆభరణాల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండక పోవచ్చు. కానీ సినిమాలో ముఖ్యంగా మణిరత్నం మూవీలో కెమెరా పాత్ర చుట్టూ 360 డిగ్రీల్లో తిరుగుతుంది. కాబట్టి ఎక్కడా రాజీ పడడానికి వీల్లేదు. పైగా ఇప్పుడు ప్రేక్షకులు ఒకప్పటిలాగ సినిమా చూసి బాగుందనో, బాగోలేదనో ఒక అభిప్రాయంతో సరిపుచ్చడం లేదు. పాత్ర అలంకరణ నుంచి, సన్నివేశం నేపథ్యం వరకు ప్రతిదీ నిశితంగా గమనిస్తున్నారు, పొరపాటు జరిగితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఆటపట్టిస్తారు. అలాగే ఒకసారి ఐశ్వర్య ధరించిన ఆభరణాన్ని మరోసారి పారపాటున త్రిషకు అలంకరించామంటే ఇక అంతే. అప్పట్లో కోర్సుల్లేవు ఇక నా ఆర్నమెంట్ డిజైనర్ కెరీర్ విషయానికి వస్తే... నేను ఇందులో ఎటువంటి కోర్సూ చేయలేదు. ఇప్పటిలాగ పాతిక– ముప్పై ఏళ్ల కిందట కోర్సులు లేవు కూడా. మా మామగారికి సహాయంగా స్టోర్‌లోకి అడుగుపెట్టాను. నిపుణులైన మా కారిగర్స్ తమ అనుభవంతో పని నేర్పించారు. ప్రతి పనినీ ఆసక్తితో నేర్చుకున్నాను. ఇప్పటికీ రోజూ మధ్యాహ్నం వరకు నా ఆర్కిటెక్చర్ ఆఫీస్, మధ్యాహ్నం నుంచి ఆర్నమెంట్ స్టోర్ చూసుకుంటూ ఉంటాను. ఈ సినిమాకి పని చేయడం నా జీవితంలో ఒక విశిష్టమైన ఘట్టం’’ అన్నారామె. చారిత్రక దృశ్యమాలిక ఈ సినిమా కోసం మూడేళ్లు పనిచేశాను. నాలుగు వందల మంది డాన్సర్స్‌తో చిత్రీకరించిన విజయగీతం చాలా పెద్దది. సినిమా కోసం 450 ఆభరణాలు బంగారంతో చేశాం. ఐశ్వర్యారాయ్, త్రిష, విక్రమ్, జయం రవి, కార్తి, శోభిత... వంటి ముఖ్యపాత్రలతోపాటు మరికొన్ని ప్రధాన పాత్రలకు బంగారు ఆభరణాలు, చిన్న పాత్రలకు గిల్టు ఆభరణాలు చేశాం. దర్బార్ సన్నివేశాలు, యుద్ధఘట్టాలు, డాన్సులు... సన్నివేశాన్ని బట్టి ఆభరణం మారుతుంది. అలాగే ఒక్కో పాత్ర హెయిర్ స్టయిల్ ఒక్కో రకంగా ఉంటుంది. తలకు అలంకరించే ఆభరణాలు కూడా మారుతాయి. ప్రతి ఆభరణమూ చోళుల కాలాన్ని స్ఫురింపచేయాలి. చోళుల రాజ చిహ్నం పులి. రాజముద్రికల మీద పులి బొమ్మ ఉంటుంది. ఉంగరం మీద కొంత కథ నడుస్తుంది. కాబట్టి ఆ సీన్లో చిన్న డీటెయిల్ కూడా మిస్ కాకుండా పులితోపాటు పామ్ ట్రీ కూడా ఉండేటట్లు దంతంతో ఆభరణాన్ని రూపొందించాం. కల్కి కృష్ణమూర్తి రాసిన ప్రఖ్యాత తమిళ నవలకు, చారిత్రక ఘట్టాలకు దృశ్యరూపం ఇచ్చే ప్రయత్నంలో ఎక్కడా లోపం జరగకూడదనేది మణిరత్నం గారి సంకల్పం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను. – ప్రతీక్ష ప్రశాంత్, ఆర్నమెంట్ డిజైనర్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
ఇలియానాను నిత్యనూతనంగా చూపించే బ్రాండ్స్ ఇవే..!
ఇలియానా... ఈ మధ్య సినిమాల్లో కన్నా ఈవెంట్లలో ఎక్కువగా కనిపిస్తోంది.. అదే గ్లామర్‌తో ఇలా! ఆమెను అలా నిత్యనూతనంగా చూపించే ఆ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. గోపి వేద్ చిన్ననాటి స్నేహితులిద్దరి భిన్న ఆలోచనల ఫ్యూజనే ‘గోపి వేద్’ లేబుల్. ఆ ఇద్దరిలోని ఒకరే గోపి వేద్. ఇంకో ఫ్రెండ్ అర్నాజ్ సూనావాలా. ముంబై వాసులు. గోపి వేద్ ‘లా’ చదివి.. బిజినెస్ మేనేజ్మెంట్ కూడా చేసింది. అర్నాజ్ ఈఎన్టీ (డాక్టర్) గోల్డ్ మెడలిస్ట్. చదువు ఈ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్‌ను దూరం చేసినా డ్రెస్ డిజైనింగ్ పట్ల ఉన్న కామన్ ఇంటరెస్ట్ ఇద్దరినీ కలిపింది మళ్లీ. అలా కలిసి ‘గోపి వేద్’ను ప్రారంభించారు. నిజానికి గోపి వేద్ కుటుంబ నేపథ్యం కూడా వస్త్ర ప్రపంచమే. గోపి వాళ్లమ్మ డ్రెస్ డిజైనర్. వాళ్లింటి కింది అంతస్తులో వర్క్ షాప్ ఉండేది. అది చూసీ చూసీ గోపి వేద్‌లో డ్రెస్ డిజైనింగ్ పట్ల ఆసక్తి మొదలైంది. అందుకే చదువయ్యాక ఈ రంగంలోకి వచ్చింది. ఆమెకు అండగా నిలిచింది అర్నాజ్. గోపి వేద్ డ్రెస్ డిజైన్, కలర్స్ చూస్తే.. అర్నాజ్.. ఫ్యాబ్రిక్ అండ్ బిజినెస్ చూసుకుంటుంది. అలా ఈ ఇద్దరి వైవిధ్యమైన ఆలోచనలు, ధోరణుల మిశ్రమ ఫలితంగా ‘గోపి వేద్’ అనే కళాత్మాకమైన లేబుల్ ఆవిష్కృతమైంది. బ్రైడల్ కలెక్షన్స్ వీరి బ్రాండ్ వాల్యూ. పూజా డైమండ్స్ 1989లో మొదలైంది ఈ బ్రాండ్ ప్రస్థానం. వ్యవస్థాపకులు.. ముఖేశ్ మెహతా, పప్పు భాయ్. అహ్మదాబాద్ వాసులు. తొలుత ఈ ఇద్దరూ డైమండ్ హోల్‌సేల్ వ్యాపారం చేసేవాళ్లు. నగల తయారీ పట్ల ఈ ఇద్దరికీ ఉన్న ఇష్టం, సృజనే వీళ్లు పూజా డైమండ్స్‌ను స్థాపించేలా చేసింది. అలా పూజా డైమండ్స్ ఫస్ట్ షోరూమ్‌ను 2001లో అహ్మదాబాద్‌లో ప్రారంభించారు. తమ బ్రాండ్‌కున్న డిమాండ్‌ను చూసి రెండో షోరూమ్‌ను 2016లో ముంబైలో స్టార్ట్ చేశారు. కొనుగోలుదారుల నమ్మకమే బ్రాండ్ వాల్యూగా వీళ్ల వ్యాపారం వృద్ధిచెందుతోంది. నా ఫిట్నెస్ రహస్యం వ్యాయామం. దిగులుగా ఉన్నా.. నిరుత్సాహంగా ఉన్నా వ్యాయామం మొదలుపెడతా. అంతే.. మనసు ఉత్సాహంతో ఉరకలేస్తుంది.. కొత్త శక్తి ఆవహిస్తుంది. – ఇలియానా జ్యూయెలరీ: డైమండ్ ఇయర్ రింగ్స్ బ్రాండ్: పూజా డైమండ్స్ ధర: నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. డ్రెస్ షరారా సెట్ బ్రాండ్: గోపి వేద్ ధర: 28,500 -
గోల్డ్ రష్
సాక్షి, అమరావతి బ్యూరో: పుత్తడి ధర అందనంతగా పరుగులు తీస్తోంది. బంగారం రోజురోజుకూ ప్రియమవుతోంది. పెళ్లిళ్ల సీజన్ ఆరంభమైన తరుణంలో పసిడి ధరలు ప్రియం కావడం శుభకార్యాలు నిర్వహించే కుటుంబాలకు భారంగా మారుతోంది. విజయవాడలో జనవరి రెండో వారంలో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.50 వేల లోపు, 22 క్యారెట్ల ధర రూ.46 వేల వరకు ఉంది. ప్రస్తుతం విజయవాడ, విశాఖలో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ.50,470 ఉంది. అంటే మూడు నెలల్లో 10 గ్రాములపై రూ.4,200 నుంచి 4,500కిపైగా పెరిగింది. బంగారం మరింత ఎగబాకే అవకాశం ఉందని చెబుతున్నారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఇంట్లో వివాహ వేడుకలకు కనీసం నాలుగైదు తులాల (45–55 గ్రాముల) బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. పెరుగుతున్న కొనుగోళ్లు.. పసిడి ధర అమాంతం పెరుగుతున్నప్పటికీ శుభకార్యాలు నిర్వహించే కుటుంబాలకు కొనుగోలు చేయక తప్పడం లేదు. పెళ్లిళ్ల సీజను మొదలు కావడం, బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న ప్రచారంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మూడు నాలుగు నెలల క్రితంతో పోల్చితే ప్రస్తుతం బంగారం అమ్మకాలు బాగున్నాయని విజయవాడ వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన జ్యుయలరీ షాపు యజమాని నరేంద్ర ‘సాక్షి’కి తెలిపారు. కారణాలివీ.. ఆభరణాల కోసమే కాకుండా ఎలక్ట్రానిక్ డివైస్ల తయారీలోనూ బంగారాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఉత్పత్తి రంగాలు పుంజుకుంటున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్ డివైస్ల తయారీ కూడా ఊపందుకుంటోంది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు గణనీయంగా పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం, బంగారంపై పెట్టుబడులు సురక్షితమనే ఉద్దేశం, బ్యాంకుల వడ్డీ రేట్లు క్షీణించడం, షేర్ మార్కెట్లలో అనిశ్చితి.. వెరసి పసిడి ధరల పెరుగుదలకు ప్రత్యక్ష, పరోక్షంగా దోహదం చేస్తున్నాయని బులియన్ మార్కెట్ వర్తకులు విశ్లేషిస్తున్నారు. -
ఆ గోల్డ్.. మహా బోల్డ్
నరసాపురం (పశ్చిమ గోదావరి): వజ్రాలు, రత్నాల్లాంటి రాళ్లు పొదిగిన నెక్లెస్.. రూపాయి కాసంత కట్ ఉంగరం.. స్వర్ణ కంకణం సైజులో గాజులు.. నగిషీలతో తీర్చిదిద్దిన జూకాలు.. విభిన్న ఆకృతుల్లో వడ్డాణాలు.. అందాలు చిందే అర వంకీలు.. తలపై మెరిసే పాపట బొట్టు.. మెడలో హారం.. నడుముకు వడ్డాణం.. కాళ్లకు పట్టీలు.. వీటిలోనూ వందల రకాలు. బంగారు ఆభరణాల తళుకు బెళుకులకు ఏమాత్రం తీసిపోనివిధంగా అధునాతన డిజైన్లలో రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ ఆభరణాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. గీటు పెడితేనే గాని అవి గోల్డో, రోల్డ్ గోల్డో కనుక్కోలేని విధంగా వీటిని తయారు చేస్తున్నారు. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా వీటిదే హవా. పేద, ధనిక భేదం లేకుండా మహిళలంతా వీటినే ధరిస్తున్నారు. బంగారాన్ని తలదన్నేలా.. బంగారాన్ని తలదన్నే రీతిలో రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ గోల్డ్ నగల వ్యాపారం పైపైకి ఎగబాకుతోంది. బంగారం ధర బరువెక్కిన పరిస్థితుల్లో అది ధనికులకు పెట్టుబడి వ్యవహారంగా మారిపోయింది. ఇంకోవైపు నగలు ఇంట్లో పెట్టుకున్నా.. ధరించి వీధిలో తిరిగినా దొంగల భయం. దీంతో మహిళలు ఇటీవల కాలంలో ఫంక్షన్లలో సైతం రోల్డ్ గోల్డ్ ఆభరణాలనే ధరిస్తున్నారు. తక్కువ ఖర్చుతో.. కోరుకున్న డిజైన్లలో ఈ నగలు లభిస్తుండడంతో మహిళలు వీటిని ధరించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో సంపన్న వర్గాలకు చెందిన మహిళలు సైతం ఫంక్షన్లలో రోల్డ్ గోల్డ్ వస్తువులు ధరించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. యువతులను సైతం ఇమిటేషన్ జ్యూవెలరీ విశేషంగా ఆకర్షిస్తోంది. వారి అభిరుచులకు తగ్గట్టుగా వందలాది డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానంగా రాగిని ఉపయోగించి వివిధ లోహాల మిశ్రమంతో వీటిని తయారు చేస్తున్నారు. పైన బంగారం పూత పూయడంతో ఈ నగలకు పసిడి వన్నెలు వస్తున్నాయి. ఇలా తయారుచేసిన ఆభరణాలకు క్వాలిటీని బట్టి ఏడాది నుంచి ఐదేళ్ల వరకూ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు. మెరుపు తగ్గినప్పుడు పూతవేస్తే తిరిగి అవి కొత్త వాటిలా తళతళలాడుతున్నాయి. అందుబాటులో ధరలు రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు మార్కెట్లో వివిధ క్వాలిటీలలో లభిస్తున్నాయి. సాధారణంగా ధరించే చెవి పోగులు, బుట్ట దుద్దులు, తాళ్లు లాంటివి రూ.50 నుంచి రూ.300 వరకు ధర పలుకుతున్నాయి. చెయిన్లు, గాజులు, రాళ్ల గాజులు రూ.300 నుంచి రూ.1,500 వరకు ఉన్నాయి. వడ్డాణాలు, ముత్యాల నెక్లెస్‌లు, ముత్యాల హారాలు లాంటివి నాణ్యతను బట్టి రూ.10 వేల వరకు ధరలు ఉన్నాయి. రంగంలోకి బడా కంపెనీలు కొంతకాలం క్రితం వరకు కృష్ణా జిల్లా చిలకలపూడిలో తయారయ్యే రోల్డ్ గోల్డ్ వస్తువులు మార్కెట్‌కు విరివిగా వచ్చేవి. రోల్డ్ గోల్డ్ కొత్త ట్రెండ్ సంతరించుకోవడంతో బడా కంపెనీలు రోల్డ్ గోల్డ్ వస్తువులను తయారు చేయడం ప్రారంభించాయి. ప్రస్తుతం రోల్డ్ గోల్డ్ నగలకు పెరిగిన డిమాండ్ దృష్ట్యా ముంబై, సూరత్, అమృత్సర్, ఆగ్రా, చెన్నై ప్రాంతాల్లో యంత్రాలపై తయారుచేసిన ఆభరణాలు ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. డిమాండ్ అంతా.. ఇంతా కాదు బంగారు ఆభరణమైతే అవసరానికి సొమ్ము చేసుకోవచ్చు. కానీ రోల్డ్ గోల్డ్ వస్తువులపై పెట్టిన సొమ్ము వృథా. అయినా ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. చిన్న మొత్తమే కాబట్టి వృథా అయినా ఫర్వాలేదన్న ఉద్దేశంతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. బంగారు ఆభరణాలకు మించి రోల్డ్ గోల్డ్ ఆభరణాల అమ్మకాలు సాగుతుండటం విశేషం. కొత్తగా ఏర్పడిన పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఇమిటేషన్ జ్యూవెలరీ విక్రయించే దుకాణాలు 700 వరకు ఉన్నాయి. ఇళ్లల్లో సైతం చిన్నపాటి షాపులు నిర్వహిస్తూ మహిళలు వీటి అమ్మకాల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో సీజన్లో అయితే రోజుకు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు బంగారు ఆభరణాల అమ్మకాలు సాగుతున్నాయి. ఇమిటేషన్ జ్యూవెలరీ అమ్మకాలు రోజుకు రూ.40 లక్షల వరకు సాగుతున్నట్టు అంచనా. ఒకప్పుడు పట్టణానికి ఒకటి, రెండు రోల్డ్ గోల్డ్ షాపులు ఉండేవి. ప్రస్తుతం ప్రతి పట్టణంలో 20 నుంచి 30 వరకు షాపులు ఉన్నాయి. గ్రామాలకే వెళ్లి వన్ గ్రాము వస్తువులు తీసుకెళ్లి విక్రయించేవారు సైతం పెరిగారు. రోల్డ్ గోల్డ్ ఆభరణాలే బెటర్ అరకాసు బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాలి. మాకు నచ్చిన డిజైన్లలో రోల్డ్ గోల్డ్ వస్తువులు దొరుకుతున్నాయి. బంగారం కంటే ఎక్కువ డిజైన్లు వీటిలో లభిస్తున్నాయి. వాటిని ధరిస్తే రోల్డ్ గోల్డ్ అన్న ఆలోచనే రాదు. ప్రస్తుత తరుణంలో రోల్డ్ గోల్డ్ ఆభరణాలే బెటర్. – అద్దేపల్లి రాధిక, గృహిణి బంగారు కంటే మిన్నగా.. ఇదివరకు రోల్డ్ గోల్డ్ వస్తువులు వేసుకుంటే అవి బంగారం కాదని చాలా ఈజీగా తెలిసిపోయేది. పెద్దగా నాణ్యత ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. రోల్డ్ గోల్డ్ వస్తువులు బంగారం వస్తువుల కంటే బాగుంటున్నాయి. రూ.5 వేలు పెట్టి రోల్డ్ గోల్డ్ వస్తువు కొని పెట్టుకుంటే మంచి అందంగా ఉంటుంది. అదే వస్తువు బంగారంతో చేయించాలంటే రూ.5 లక్షలకు పైనే పెట్టాలి. ఇదే బెటర్ కదా. – కె.సత్యవాణి, గృహిణి అమ్మకాలు బాగా పెరిగాయి రోల్డ్ గోల్డ్ వస్తువుల అమ్మకాలు బాగా పెరిగాయి. మా షాపులకు మధ్య తరగతివారే కాకుండా సంపన్న వర్గాలు వారు కూడా వస్తున్నారు. ప్రస్తుతం మంచి మంచి డిజైన్లలో వస్తువులు దొరుకుతున్నాయి. చెన్నై, ముంబై ప్రాంతాల నుంచి హోల్‌సేల్‌గా కొనుగోలు చేసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతాం. – శిరం చంటి, రోల్డ్ గోల్డ్ షాపు యజమాని, నరసాపురం -
కోడలి నగలు భద్రపరచడం క్రూరత్వం కాదు
న్యూఢిల్లీ: కోడలి నగలను అత్తింటి వారు భద్రపరిస్తే భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 498–ఏ సెక్షన్ ప్రకారం అది క్రూరత్వం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్తింటి వారు తన నగలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా తనను వేధిస్తున్నారన్న ఆరోపణలపై భర్త, అత్త, బావపై పంజాబ్‌కు చెందిన ఒక మహిళ కేసు పెట్టింది. ఇలా నగలు తీసుకోవడం అత్తింటివారు కోడలిపై క్రూరత్వాన్ని ప్రదర్శించడమేనంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త తిరిగి వెళ్లడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో ఆ భర్త వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరిల ధర్మాసనం విచారించింది. ఎన్ని నగలు తీసుకున్నారో, వాటి విలువ ఎంత అనే వివరాలేవీ పిటిషనర్ వెల్లడించలేదని, తన జీవితం ఏ విధంగా నాశనం చేశారనే విషయాలనూ చెప్పలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అయినా ఈ కేసులో నగలు తీసుకోవడం సెక్షన్ 498ఏ కింద క్రూరత్వం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు పంజాబ్ , హరియాణా హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఫోన్ సంభాషణను రికార్డు చేయడం గోప్యతకు భంగం కలిస్తుందా? భార్యకు తెలియకుండా ఆమె ఫోన్ సంభాషణను రికార్డు చేయడం గోప్యతకు భంగం కలిస్తుందా? అనే అంశాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. 12 డిసెంబర్ 2021న పంజాబ్–హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2009లో వివాహం చేసుకున్న వ్యక్తి 2017లో తనకు విడాకులు కావాలంటూ బటిండా ఫ్యామిలీ కోర్టులో కేసు వేశాడు. అందుకు కారణంగా భార్య ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాడు. 2020లో బటిండా ఫ్యామిలీ కోర్టు ఆ రికార్డులను అంగీకరించింది. సంభాషణల రికార్డును పరిగణనలోకి తీసుకోవడం తన గోప్యతకు భంగం కలిగించడమేనని ఆ మహిళ పంజాబ్,హరియాణా హైకోర్టులో అప్పీలు చేసింది. ఆమె వాదనలతో హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఏకీభవించింది. -
ఆత్మ గౌరవం.. జీవన వనాన విరిసే ఆమని
ఆత్మగౌరవం మనిషికి నిజమైన ఆభరణంలా భాసిస్తుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకుని, నమ్మిన సిద్ధాంతం కోసం, విలువలకోసం రాజీ పడకుండా ముందుకు సాగే లక్షణానికి మనం చెప్పుకునే అందమైన పదభూషణం ‘ఆత్మ గౌరవం’. సమపాళ్ళలో కలిగి ఉండే ఈ లక్షణం సమాజంలో అగణ్యత, అగ్రగణ్యత సంపాదిస్తుందో లేదో తెలియదు కానీ, జీవన గమనానికి ఖచ్చితంగా నిజమైన నాణ్యతను సంతరిస్తుంది. ‘‘ఆయనకు చాలా ఆత్మగౌరవం ఎక్కువండీ.. ఎక్కడా రాజీ పడకుండా జీవిస్తాడు’’ అనే మాటను మనం కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి, మిగిలినవాళ్ళు మాట్లాడుకోవడం వింటూ ఉంటాం. అహంకారం ఉన్నవారు తమకోసం కాక, ఎదుటివాళ్ల దృష్టిలో తాము గొప్పగా వున్నట్లుగా భావన చేసుకుని జీవికను సాగిస్తారు. ఎవరైనా తన గురించి తక్కువ, ఎక్కువల తేడా చూపిస్తే చాలు, అవమానంతో రగిలిపోతారు. అహంకారంతో ఉండేవాళ్ళు, విలువలకోసం ప్రయత్నించక, పక్కవారి ముందు ఉన్నతులుగా గుర్తింపబడాలని కోరుకుంటారు. వీరిలో చెలరేగే అహంకారం వారిలో ఉన్న మంచిని కూడా ఎదుటివారిని చూడనీయకుండా చేస్తుంది. సంఘంలో మనకు ఎక్కువగా ఈ తరహా వ్యక్తులే తారసపడుతూ ఉంటారు. స్వల్పమాత్రపు భేదాన్ని మాత్రం మనం ఇక్కడ తప్పనిసరిగా గ్రహించాలి. అహంకారంతో వర్తించడం ఎటువంటి నేరమో, ఆత్మగౌరవాన్ని చంపుకోవడం అంతకుమించిన దోషం..!! మనం నమ్ముకున్న సూత్రాల విషయంలో అవలంబించే రాజీ ధోరణి తాత్కాలికంగా సుఖమయమనిపించినా, దీర్ఘకాలంలో తప్పనిసరిగా మనకు మానసిక క్లేశాన్ని కలిగిస్తుందని ఎన్నో ఉదాహరణలు తెలియజేస్తాయి. ఆత్మగౌరవం అనే భావన ఒక వ్యక్తి తన గురించి కలిగి ఉన్న విలువ, అవగాహనకు సంబంధించిన భావన.దీని ఆధారంగా, ఒక వ్యక్తి తోటివారితో సాగే గమనంలో విభిన్న విషయాల్లో తనకు ఎటువంటి స్థానం ఉందో కనుగొంటాడు. ఆత్మగౌరవానికి నిర్వచనాన్ని చెప్పవలసి వస్తే, దాదాపుగా స్వీయ–ప్రేమకు, ఈ పదాన్ని సమానంగా చెప్పవచ్చు. తన గౌరవాన్ని గురించి ఎవరైనా, ఏ సందర్భంలోనైనా ప్రకటించ వలసి వస్తే,ఆత్మగౌరవం అనే పదం వ్యక్తికి గల స్వీయ గౌరవం అనే పదానికి ప్రత్యక్ష అర్థంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తనని తాను ప్రేమించడం స్వార్థం లేదా అనారోగ్యం కాదు; ఇది ఒక ప్రాథమిక భావన. తనని తాను ప్రేమించుకోవడం అనేది ప్రతి వ్యక్తీ చేసే పనే. తనకు మంచి జరగాలని కోరుకోవడమూ సహజమే.. అయితే, తనకే మంచి జరగాలని కోరుకోవడాన్ని స్వార్ధభావనగా మనం పేర్కొంటూ ఉంటాం. ప్రతికూల ఆలోచనలను అంతం చేయడం, జ్ఞానాన్ని పెంచే లేదా వ్యక్తికి మంచి అనుభూతిని కలిగించే కార్యకలాపాలు చేయడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, చేసిన తప్పులను తెలుసుకోవడం మొదలైనవి మనలో మరింత ఆత్మగౌరవాన్ని పెంచుతాయి. ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు గుర్తొచ్చే మరో పదం ‘అహంకారం’. పరిణతి చెందిన వ్యక్తులు సైతం తమ వైఖరిని వ్యక్తపరిచే సందర్భంలో, ఆ విధంగా మాట్లాడితే అహంకారులుగా తమను ఎదుటివారు భావిస్తారేమో అని సందేహించే సందర్భాలూ ఉంటాయి. అయితే, ఆత్మగౌరవానికీ, అహంకారానికీ మధ్య తేడా బాగానే ఉంది. సమాజం తీరును మనం నిశితంగా పరికిస్తే, అత్యాశలకు లోనైనప్పుడే, మనిషి జీవనశైలిలో ఉన్న సమతౌల్యం దెబ్బ తింటుంది. అనవసరమైన కోరికలనే గుర్రాలవెంట పరుగెడుతూ, వాటిని ఏ విధంగానైనా తీర్చుకోవాలనే తపన ప్రబలినప్పుడే, మనిషి తాను పాటించే విలువల విషయంలో, ఆత్మను వంచన చేసుకునేలా రాజీపడి, ఎదుటివాడి ముందు తలను వంచుతాడు. ఒకరకంగా దీన్నే నైతిక పతనానికి నాంది అని చెప్పవచ్చు. ఎందుకు ఈ అనవసరపు వెంపర్లాట..!! ఎవరికీ తలవంచకుండా, అధికమైన ఆశలతో ఎవరెవరినో ఆశించకుండా, దృఢమైన చిత్తంతో సాగుతూ, నిండుగా నిలుపుకునే ఆత్మగౌరవమే గుండెకు ఆనందరవం..!! జీవన వనాన విరిసే ఆమనిలో అదే మధురంగా కిలకిలమనే కోకిలారావం..!! ఆత్మగౌరవం అన్నది మనిషి ఉత్తమ ప్రవృత్తిని తెలియపరుస్తుంది. ఒక మంచి ప్రవర్తనకు జగతి లో అందే విలువను పరోక్షంగా ఆత్మగౌరవానికి నమూనాగా ప్రకటించవచ్చు. సంస్కారాలు, విలువలు, నియమాలతో కూడిన జీవన ఆచరణ కలిగినవారు ఒకరి ముందు తలవంచరు. దీనికి ధనంతో ఏమాత్రం పనిలేదు. సంస్కారాలకు ఉన్న మహత్తరమైన విలువ అలాంటిది. వీరు ఆదర్శ జీవనాన్ని జీవిస్తూ, ఉన్నంత లో ఎదుటివాళ్లచేత గుర్తింపును, గౌరవాన్ని పొందేవారుగా తమను తాము మలుచుకంటారు. అలాంటి వారు తమకు తాము కొన్ని హద్దులు పెట్టుకొని వాటిని దాటకుండా ఒక్కరిపైన ఆధారపడకుండా ఆత్మగౌరవంతో నిరంతరం జీవిస్తారు. – ‘‘వ్యాఖ్యాన విశారద’’ వెంకట్ గరికపాటి -
రిలయన్స్ ఆభరణాలపై తగ్గింపులు
ముంబై: రిలయన్స్ జుయల్స్ 14వ వార్షికోత్సవం సందర్భంగా ఇప్పటికే కొనసాగుతున్న ‘ఆభర్’ జుయలరీ కలెక్షన్ విక్రయాల పండుగను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. చేతితో రూపొందించిన వినూత్నమైన బంగారం, వజ్రాల చెవి ఆభరణాలు ఇందులో ప్రత్యేకమని సంస్థ తెలిపింది. నూతన శ్రేణి చెవి రింగులను ఆవిష్కరించడంతోపాటు.. ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 1 వరకు చేసే కొనుగోళ్లపై ఆభరణాల తయారీ చార్జీల్లో 20 శాతం తగ్గింపునిస్తున్నట్టు సంస్థ తెలిపింది. -
మత్తు ఇచ్చి నగలు దోపిడీ
‘మేడమ్.. నాకు ప్రమోషన్ వచ్చింది.. స్వీట్ తీసుకోండి’ అంటూ ఇంటి యజమానితో మాట కలిపాడు. ఆమె తిరస్కరించడంతో.. కనీసం ఈ కూల్ డ్రింక్ అయినా తాగండి అంటూ ఆఫర్ చేశాడు. మత్తు మందు కలిపిన ఆ కూల్‌డ్రింక్ తాగిన వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇంకేముంది.. మన వాడు చేతి వాటం చూపించి ఆమె మెడలో ఉన్న ఐదు కాసుల బంగారు గొలుసు తెంపుకుని చక్కాపోయాడు. నూజివీడు: కొత్త ప్రదేశాలకు వెళ్లడం, అద్దె ఇంట్లో దిగటం, ఆ ఇంటి యజమానులతో పరిచయం పెంచుకోవడం, సమయం చూసి వారికి మత్తు మందు ఇచ్చి నగలు దోచుకెళ్లడం. కొన్నేళ్లుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను నూజివీడు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ కె.వెంకటనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరానికి చెందిన పబ్బరాజు యుగంధర్ (33) కృష్ణా జిల్లా నూజివీడు మండలం యనమదలలోని గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, ఝాన్సీరాణి దంపతులకు చెందిన ఇంట్లో జూలై నెలలో అద్దెకు దిగాడు. జూలై 18న తనకు ప్రమోషన్ వచ్చిందని, స్వీటు తినమంటూ అందులో మత్తు మందు కలిపి ఇచ్చాడు. వెంకటేశ్వరరావు తినగా, ఝాన్సీలక్ష్మీ తనకు డయాబెటిస్ ఉండటంతో తిరస్కరించింది. దీంతో ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. దీంతో దంపతులిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆ తర్వాత యుగంధర్ ఆమె మెడలో ఉన్న ఐదు కాసుల నానుతాడును దోచుకొని వెళ్లిపోయాడు. దీనిపై సచివాలయానికి చెందిన మహిళా సంరక్షణ కార్యదర్శి స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో సీసీఎస్, రూరల్ స్టేషన్ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుడు యుగంధర్‌ను వెతికి పట్టుకుని మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 8 కాసుల రెండు నానుతాడులను స్వాధీనం చేసుకున్నారు. 2006 నుంచే దొంగతనాలు యుగంధర్‌ను విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇతను గుంటూరు జిల్లా తెనాలి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, విజయవాడ, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం, అన్నవరం, కృష్ణా జిల్లాలోని తిరువూరు ప్రాంతాల్లో ఇలాంటి దోపీడీలే చేసినట్లు తేలింది. 2006 నుంచి దొంగతనాలకు అలవాటైన యుగంధర్‌పై దాదాపు 15 కేసులు ఉన్నాయి. గతంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో వృద్ధ దంపతులకు మత్తు మందు ఇవ్వగా డోసు ఎక్కువై వృద్ధుడు చనిపోయాడు. యుగంధర్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. -
పెళ్లైన మరుసటి రోజే షాకిచ్చిన వధువు..
పెద్దపప్పూరు(అనంతపురం జిల్లా): పెళ్లైన మరుసటిరోజే భర్త ఇంటి నుంచి నగదు, నగలు తీసుకుని నవ వధువు ఉడాయించిన ఘటన కమ్మవారిపల్లిలో సంచలనం రేకెత్తించింది. పోలీసుల సమాచారం మేరకు.. పెద్దపప్పూరు మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన పయ్యావుల కేశవమురళి భార్య ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఇతనికి ఇద్దరు సంతానం. పిల్లల సంరక్షణ కోసమంటూ గత నెల 28న నల్లమాడ మండలం శ్రీరెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళను పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. మరుసటి రోజు భర్త ఇంటికి కాపురానికి వచ్చిన ఆమె.. ఇంటిలో ఉన్న మూడు తులాల బంగారు నగలు, రూ.80వేలు తీసుకుని పారిపోయింది. ప్రియుడితో కలిసి భార్య ఒడిశాలో ఉన్నట్లు తెలుసుకుని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి, వివాహిత కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: తెల్లారితే ముహూర్తం.. వరుడికి వధువు షాక్..! ప్రేమనాటకం.. పెళ్లనగానే ప్రేయసి పరార్ -
అతిథిలా వచ్చిన నగల దొంగ దొరికాడు
సాక్షి, విశాఖపట్నం: పెళ్లికి వచ్చిన అతిథిలా రిసార్ట్స్‌లోకి ప్రవేశించాడు. అంతా కలయతిరిగాడు. విందు భోజనం ఆరగించాడు. ఆపై పెళ్లి కుమార్తె నగలతో చాలా దర్జాగా ఓలా క్యాబ్‌లో ఉడాయించాడు. 53 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసిన పాత నేరస్తుడు పోకతోట గంగాధర్‌రావు(29)ను నగరపోలీసులు పట్టుకున్నారు. అతనినుంచి రూ. 26.5 లక్షల విలువైన 53 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సాయిప్రియ రిసార్ట్స్‌లో గత నెల 24న ఓ వివాహ వేడుకలో జరిగిన చోరీ కేసును ఛేదించారు. ఆ వివరాలను నగర పోలీస్ కమిషనర్ కాన్ఫరెన్స్ హాల్లో సీపీ మనీష్‌కుమార్ సిన్హా బుధవారం మీడియాకు వెల్లడించారు. చదవండి: స్వామీజీల మాయాజాలం.. లబోదిబోమంటున్న రైతులు తెల్లారితే పెళ్లి.. ఓ తహసీల్దార్ కుమారునికి, మునగపాక మండలం సినసపల్లి తోటాడకు చెందిన టీచర్ కుమార్తెకు గత నెల 24న ఉదయం 11 గంటలకు వివాహ ముహూర్తం నిశ్చయించారు. తెల్లారితే పెళ్లి జరగాల్సిన సమయంలో వధువు గదిలో ఉంచిన 53 తులాల బంగారు ఆభరణాల బ్యాగు చోరీకి గురైంది. వధువు తల్లిదండ్రులు 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌స్క్యాడ్‌తో తనిఖీలు చేసినా లాభం లేకపోయింది. దొంగిలించిన అభరణాలు ఆభరణాలు తాకట్టు పెట్టి జల్సాలు విజయవాడకు చెందిన పాత నేరస్తుడు పోకతోట గంగాధర్‌రావు చిన్నప్పటి నుంచి బెంజ్ సర్కిల్లోని అనాథ ఆశ్రమంలో పెరిగాడు. గతంలో విజయవాడ సమీపంలో 7 కేసుల్లో నిందితుడు. విజయవాడ నుంచి విశాఖకు వచ్చి సిరిపురంలోని ఓ హోటల్లో వెయిటర్‌గా పని చేశాడు. అది మానేసి విశాఖలో చోరీలు చేయడం మొదలుపెట్టాడు. 10 కేసుల్లో నిందితుడు. మూడేళ్ల పాటు జైలులో కూడా ఉన్నాడు. జైలు నుంచి ఇటీవల విడుదలైన గంగాధర్ గత నెల 24న రాత్రి సాయిప్రియ రిసార్ట్స్‌లో జరిగిన వివాహ వేడుకలో భోజనం చేశాడు. వధువు ఆభరణాలపై కన్నేశాడు. ఆమెకు కేటాయించిన 301 గదికి వెనక వైపు తక్కువ ఎత్తులో కిటీకీలుండడం, ఆ గదికి వెనుక వైపున వెలుతురు అంతగా లేకపోవడంతో.. చోరీకి స్కెచ్ వేశాడు. అక్కడి నుంచి బ్యాగ్ పట్టుకుని రోడ్డుపైకి వచ్చి ఓలా క్యాబ్ బుక్ చేసుకుని శ్రీకాకుళం వెళ్లిపోయాడు. సోంపేటలోని మనప్పురం గోల్డ్ ఫైనాన్స్‌లో 6 తులాలు తాకట్టు పెట్టాడు. ఆ డబ్బులతో తిరిగి విశాఖకు వచ్చి జల్సాలు చేస్తున్నాడు. సీసీ కెమెరాలతో దొరికిన దొంగ జాడ రిసార్ట్స్‌లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దొంగ జాడను పోలీసులు కనిపెట్టారు. నగరంలో జల్సాలు చేస్తున్న గంగాధర్‌ను మంగళవారం మధ్యాహ్నం పూర్ణామార్కెట్‌లో అరెస్ట్ చేశారు. తాకట్టు పెట్టిన ఆరు తులాలతో సహా మొత్తం 53 తులాల బంగారు ఆభరణాలను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి ఈ సందర్భంగా సీపీ మనీష్‌కుమార్ సిన్హా మాట్లాడుతూ నగరంలోని రిసార్ట్స్, ఫంక్షన్ హాల్స్, హోటల్స్, రెస్టారెంట్లలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పారు. మరో పదిహేను రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. లేకపోతే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటికే నగరంలో రాత్రి గస్తీ పెంచామన్నారు. 333 మంది పోలీసులతో వార్డు రక్షక దళాలను నియమించినట్టు చెప్పారు. అనంతరం కేసును ఛేదించిన పోలీసులకు సీపీ ప్రశంసా పత్రాలు అందజేశారు. డీసీపీ క్రైం సురేష్‌బాబు, ఏడీసీపీ క్రైం వేణుగోపాలనాయడు, ఏసీపీ (క్రైం)శ్రావణ్‌కుమార్, సీఐలు అవతార్, రామచంద్రరావు, సీహెచ్.సూరినాయడు, ఎస్ఐలు జి.అప్పారావు, పి.శివ, కె.మధుసూదనరావు, సోమేశ్వరరావు, ఏఎస్ఐలు శ్రీనివాసరాజు, రాజు, శేఖర్, పి.చిన్నరాజు, సిబ్బంది లక్ష్మణ్, ఎం.శేకర్, కె.వి శ్రీధర్, ఎ.దిలీప్, సోమశేఖర్‌లను అభినందించారు. చోరీ సొత్తును రికవరీ చేసిన పోలీసులకు వధువు, ఆమె తండ్రి రామ కోటేశ్వరారవు ధన్యవాదాలు తెలిపారు. నగలు పోయినప్పటి నుంచి మాకు కంటి నిండా నిద్ర కరవైందని వారు తెలిపారు. 28 రోజుల్లో దొంగను పట్టుకుని ఆభరణాలు అప్పగించిన సీపీ మనీష్‌కుమార్ సిన్హా, డీసీపీ(క్రైం) సురేష్‌బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. -
‘బాధితురాలు ఇచ్చింది రూ.38 లక్షలు మాత్రమే’
సాక్షి, విశాఖపట్నం : సింహాద్రి అప్పన్న ఆభరణాలు వేలం పాట పేరిట ఇప్పిస్తామని మోసగించిన కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోపాలపట్నం ప్రాంతానికి చెందిన హైమావతి తనకున్న పరిచయాన్ని ఆసరాగా తీసుకుని ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. గత పదేళ్లుగా అప్పన్న ఆలయానికి వచ్చే నెల్లూరుకు చెందిన శ్రావణికి వేలం పాట ద్వారా స్వామి ఆభరణాలు ఇప్పిస్తామంటూ హైమవతి ఫోన్ చేయగా ఆమె విడత వారీగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేసింది. దీనికి రసీదుగా సింహాచలం అప్పటి ఈవో భ్రమరాంబ సంతకాలు చేసినట్లు రెండు రసీదులు కూడా పంపించారు. (విజయవాడకు మరో వరం ప్రకటించిన సీఎం) రోజుల తరబడి ఆభరణాలు రాకపోవడంతో అనుమానం వచ్చిన శ్రావణి భర్త నేరుగా ఫోన్ చేయడంతో మోసం బయటపడింది. కాకా హైమావతికి ఈ రసీదులు తయారు చేయడంలో శ్రీకాకుళం జిల్లా చిన్న బరాటం వీధికి చెందిన మధు..విశాఖకు చెందిన శేఖర్ సహకరించినట్లు విచారణలో తేలింది. వీళ్లిద్దరు ఎన్ఏడి జంక్షన్ లో రసీదు ద్వారకా నగర్లో సింహాచలం దేవస్థానం స్టాంపు తయారు చేయించినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. కాగా ఈ వ్యవహారంలో కోటి 40 లక్షల రూపాయలు ఇచ్చినట్లు శ్రావణి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా విచారణ మాత్రం ఆమె 38 లక్షలు మాత్రమే ఇచ్చినట్టు గుర్తించారు. (వుడాకి పూర్వ వైభవం తీసుకువస్తాం..) -
ఏడు వారాల నగలతో దుర్గమ్మ దర్శనం
సాక్షి, విజయవాడ: ఈ నెల 12 నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఏడు వారాల నగలతో దర్శనమివ్వనున్నారు. శనివారం దుర్గగుడి ఈవో ఎంవి.సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. సోమవారం-ముత్యాల అలంకారం, మంగళవారం-పగడాలు అలంకారం, బుధవారం-పచ్చల అలంకారం, గురువారం- కనక పుష్య రాగాల అలంకారం, శుక్రవారం-వజ్రాల అలంకారం, శనివారం-నీలాల అలంకారం, ఆదివారం- కెంపుల అలంకారంలో దర్శనమివ్వనున్నారని ఈవో వెల్లడించారు. అమ్మవారికి దేవస్థానంలో రెండు కిరీటాలు ఉన్నాయని.. వజ్ర కిరీటం చేయించాలనే యోచనలో ఉన్నామని తెలిపారు. దాతల నుంచి విరాళాలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ప్రసాదం పోటు, అన్నదానం, కేశ ఖండన శాల నిర్మాణాలకు ఈ నెలాఖరుకు ప్లాన్ పూర్తవుతుందన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి పూర్తి చేస్తామని తెలిపారు. కేశ ఖండనశాల వేలానికి ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా నిర్వహించామన్నారు. కేశ ఖండనశాల తలనీలాల కాంట్రాక్ట్‌ను రద్దు చేశామని.. మరలా టెండర్లను ఆహ్వానిస్తామని ఈవో సురేష్‌బాబు పేర్కొన్నారు. -
కట్టు మారిన పట్టు
పట్టు చీరలు వేడుకల సందర్భంలోనే కొనుగోలు చేస్తారు. అలాగే వాటిని సంప్రదాయ వేడుకలకే ధరిస్తారు. సంప్రదాయ వేడుకలతో పాటు గెట్ టు గెదర్, రిసెప్షన్ వంటి ఇండోవెస్ట్రన్ పార్టీలకు కూడా ఇలా రెడీ అవచ్చు. ఇప్పుడు చలికాలం కూడా కాబట్టి సీజన్‌కి తగ్గట్టు చీరకట్టులో మార్పులు చేసుకోవచ్చు. ►బ్లూ బెనారస్ పట్టు చీరకి సిల్వర్ జరీతో ఉండే స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను జత చేశారు. బ్లౌజ్, మెడలో సిల్వర్ హారం, హెయిర్ స్టైల్.. ఈ చీర కట్టు లుక్‌ని పూర్తిగా మార్చేసింది. ►ఆకుపచ్చ అంచు ఉన్న గులాబీ రంగు కంచి పట్టుచీరకు పూర్తి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎంపిక చేసుకోవాలి. అది కూడా పెప్లమ్ బ్లౌజ్ అయితే మరింత స్టైలిష్‌గా కనిపిస్తారు. ఈ చీరకు వంగపండు రంగు పెప్లమ్ బ్లౌజ్‌ను వాడారు. లైట్ మేకప్, హెయిర్‌ను వదిలేస్తే చాలు స్టైలిష్‌గా కనిపిస్తారు. ఇతరత్రా ఆభరణాలు ధరించనవసరం లేదు. ఈ స్టైల్ ఏ పార్టీకైనా, వేడుకకైనా బాగుంటుంది. ►ఇది బ్లాక్ కలర్ బెనారస్ పట్టు చీర. దీనికి సెల్ఫ్కలర్ హా‹ఫ్ షోల్డర్ బ్లౌజ్‌ని వాడారు. అలాగే కాంట్రాస్ట్ టైని మెడకు అలంకరించారు. దీంతో పట్టు చీర లుక్ పూర్తి స్టైలిష్‌గా మారింది. ►ఆరెంజ్ కలర్ పట్టుచీరకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వాడుకోవచ్చు. వెస్ట్రన్ స్కర్ట్మీదకు వాడే టాప్ వేసుకుంటే ప్రెట్టీగా కనిపిస్తారు. దీని మీదకు పిస్తా షేడ్ గ్రీన్ జాకెట్‌ను వేసుకుంటే లుక్ పూర్తిగా స్టైలిష్‌గా మారిపోతుంది. కాక్టెయిల్ పార్టీస్‌కు కూడా నప్పే డ్రెస్ అవుతుంది. ►ప్లెయిన్ పట్టు చీరకి పూర్తి కాంట్రాస్ట్ కలర్లో సైడ్ కట్స్ ఉన్న ఎల్లో లాంగ్ జాకెట్‌ను వాడారు. దీనికి నడుము భాగంలో బెల్ట్‌ను ఉపయోగించారు. ఫిష్ టెయిల్, సైడ్ జడ వేసుకుంటే చాలు మేకోవర్ పూర్తయినట్టే. ►ఇది బ్రైట్ రెడ్ శారీ. సహజంగా పెళ్లి కూతురు డ్రెస్‌గా వాడుతారు. దీనిని ఇండోవెస్ట్రన్ పార్టీలకూ ధరించాలంటే ఇలా జరీ కలర్లో జాకెట్‌ని ధరించాలి. పల్లూని ముందువైపుగా తీసుకొని, కుచ్చిళ్ల పార్ట్‌ని లెహంగా స్టైల్లో అమర్చుకోవాలి. ఈ లెహంగా శారీ విత్ జాకెట్ స్టైల్ డ్రేప్ ఏ వేడుకలోనైనా హైలైట్‌గా నిలుస్తుంది. -
ట్రెండ్‌కు తగినట్టు ఉంటేనే ఎవరైనా చూసేది
అక్కా! నువ్వు చేయించుకున్నావ్ కదా! నాక్కూడా చేయించవే!! ఏమండీ!నా తోటికోడలు చేయించుకుందిగా!! అత్తా! మీ అమ్మాయికి చేయించారుగా!! వదినా! మా అన్నయ్య నీకు చేయించాడుగా!! పండగ చేసుకునే సమయంలో ఈ చేయించడమేంటీ?! ఇవాళ ధనత్రయోదశి.. ఎల్లుండి పండగ! మరి కన్నుల పండుగ చేయించాలి కదా! ఆభరణాల కొనుగోలులోనే కాదు కాలానుగుణంగా వచ్చే మార్పులకు తగ్గట్టుగా ఎప్పుడూ అవి కొత్తదనంతో ఆకట్టుకుంటూ ఉండాలి. ఒకసారి నగ కొన్నాక అదెప్పుడూ ట్రెండ్‌లో ఉండాలి. అలాంటి ఆభరణాలు ఎన్నో మెడల్స్‌లో వచ్చాయి. అతివల మనసు దోచేస్తున్నాయి. ఎప్పటికీ ఎవర్గ్రీన్ అనిపించే డిజైన్స్‌ను ధరించిన మన ‘తారా’మణులు ఆభరణాలకు కొత్త సింగారాలను అద్దుతున్నారు. వీటిలో ఖరీదైనవే కాదు అచ్చూ అలాగే ఉండే ఇమిటేషన్ జువెల్రీ కొంగొత్తగా ఆకట్టుకుంటుంది. ఏ వేడుకకు ఏ ఆభరణమో ఎంపికలోనే ఉంటుంది అసలు అందం. ♦ వరుసలుగా కూర్చిన పేటల హారాలు, జంతువులు, పక్షుల డిజైన్లతో రూపొందించిన హారాలు అన్నింటి ఔరా! అనిపిస్తూనే ఉన్నాయి. ♦ పోల్కీ కుందన్స్ సెట్ సంప్రదాయ వస్త్రాలంకరణ లోనే కాదు వెస్ట్రన్ డ్రెస్సులకు ఓ ప్రత్యేక అందాన్ని, ఆకర్షణను తెచ్చిపెడతాయి. అందుకే తారల అలంకరణలో తప్పనిసరి ఆభరణం అయ్యింది. ♦ మామిడి పిందెల హారాలు ఏ సందర్భాన్నైనా కాంతివంతంగా మార్చేస్తాయి. కాలాలు మారినా మారని ఈ డిజైన్ అతివలకు ఎప్పుడూ ఆకర్షణీయమే! ♦ మిగతా ఆభరణాలేవీ అవసరం లేకుండా పెద్ద పెద్ద చెవి బుట్టాలు ఏ వేడుకనైనా ప్రత్యేకతను నిలిపేలా చేస్తున్నాయి. ♦ పెద్ద పెద్ద పోల్కీచోకర్ సెట్స్ వేడుకకు ఒక రాణివాసపు లుక్‌ను తీసుకువస్తున్నాయి. అందుకే మన సంప్రదాయ వేడుకలో తప్పనిసరి గ్రాండ్ ఆభరణమైంది. ♦ దేవతా మూర్తుల రూపాలతో డిజైన్ చేసిన ఆభరణాలు (టెంపుల్ జువెల్రీ) సంప్రదాయ వేడుకలో హైలైట్‌గా నిలుస్తున్నాయి. ♦ ముత్యాల సొగసు ఎప్పుడూ కొత్త సింగారాలను మోసుకొస్తూనే ఉంటుంది. అందుకే ప్రతి వేడుకను ముత్యాల ఆభరణాలు ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ♦ వజ్రాభరణాలు ఏ వయసు వారికైనా తీరైనా ఖరీదైన అందాన్ని తీసుకువస్తాయి. మగువల మనసు దోచే ఆభరణాలలో ఒక్కటైనా వజ్రాభరణం ఉండాల్సిందే! -
డిస్నీ బ్యూటీ
మిక్కీమౌజ్, డోరెమాన్,టామ్ అండ్ జెర్రీ..డిస్నీ వరల్డ్ అంటేపిల్లలకు చెప్పలేనంత ఇష్టం.ఆ బొమ్మలున్న డ్రెస్సులు కూడాఅంతే ప్రత్యేకతను చూపుతున్నాయి.టీవీ కార్టూన్ షోలలో కనిపించే ఈ బొమ్మలకు ఓఅరుదైన గుర్తింపు కలిపిస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.కామిక్ బొమ్మల ప్రింట్లున్న చీరలుఅమ్మలే కాదు అమ్మాయిలూఇష్టపడి ఎంచుకుంటున్నారు.పార్టీలో ప్రత్యేకతనుచాటుతున్నారు. పువ్వుల రింగులు వేడుక ఏదైనా డ్రెస్ సెలక్షన్ తర్వాత ఆభరణాలు సింగారం మీదనే దృష్టి పెడతారు అతివలు. గ్రాండ్‌గా కనులకువిందు చేసే ఆభరణాల కోసం ఎంతమొత్తమైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే, ప్రస్తుత కాలం వేరు. పార్టీకి తగ్గట్టు డ్రెస్ ఉండాలి. ఆ డ్రెస్ మరింత అందంగా కనిపించడానికి తగిన ఆభరణాలు ఉండాలి. అందుకు ఈ పువ్వుల డిజైన్లు ఉన్న రింగులు ప్రత్యేక సింగారాన్ని తీసుకువస్తున్నాయి. సింపుల్‌గానూ, గ్రేస్‌గా ఉండే ఈ పువ్వుల డిజైన్ రింగులు సిల్వర్, స్టీల్ మెటల్‌తో తయరుచేసినవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వందరూపాయల నుంచి లభించే ఈ డిజైనర్ రింగ్స్‌తో వేడుకలో మరింత ఆహ్లాదంగా, బ్యూటిఫుల్‌గా వెలిగిపోవచ్చు. ఇండియన్ డిజైనర్ సత్యపౌల్ సిల్క్ పై చేసే ప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. సిల్క్, షిఫాన్, క్రేప్ చీరల మీద కామిక్ డిజైన్స్‌ను ప్రింట్లుగా వేసి ఓ ప్రత్యేకతను తీసుకువచ్చారు. ఆ డిజైన్స్‌ను పోలిన కామిక్ వరల్డ్ ప్రింటెడ్ శారీస్ గెట్ టు గెదర్ పార్టీలో ప్రత్యేకతను చాటుతున్నాయి. -
నేటి అక్షయ తృతీయకు ఆభరణ సంస్థల ఆఫర్ల ఆహ్వానం
జోయాలుక్కాస్ ‘గోల్డ్ ఫార్ట్యూన్’! వరల్డ్ ఫేవరేట్ జ్యూయలర్ జోయాలుక్కాస్... పవిత్ర పసిడి కొనుగోళ్ల పర్వదినాన్ని పురస్కరించుకుని గోల్డ్‌ఫార్ట్యూన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా బంగారం, డైమెండ్ జ్యూయలరీ కొనుగోలు దారులకు ఉచితంగా బంగారు నాణేలు బహూకరిస్తారు. సరికొత్త అక్షయ తృతీయ 2019 కలక్షన్‌ను ఆరంభించామని, కస్టమర్లకు సంపదతో సేవ చేయడానికి ఈ పండుగ తమకు అవకాశం కల్పిస్తోందని సంస్థ ఎండీ, చైర్మన్ జాయ్ అలూక్కాస్ పేర్కొన్నారు. ఒర్రా భారీ రాయితీలు... దేశంతో వేగంగా విస్తరిస్తున్న రిటైల్‌చైన్స్‌లో ఒకటైన ఒర్రా, అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లకు భారీ ఆఫర్లను ప్రకటించింది. డైమెండ్ జ్యూయలరీ కొనుగోలుపై 25 శాతం తగ్గింపు సదుపాయాన్ని కల్పిస్తోంది. పసిడి ఆభరణాల మేకింగ్ చార్జీలపై కూడా 25 శాతం రాయితీ ప్రకటించింది. గోల్డ్ నాణేలు, కడ్డీలపై అసలు మేకింగ్ చార్జీలు ఉండవు. డైమెండ్ జ్యూయలరీ కొనుగోలుకు సంబంధించి వడ్డీ రహిత ఇన్స్టాల్మెంట్ చెల్లింపు సౌలభ్యతను కల్పిస్తున్నట్లు ఒక ప్రకటన పేర్కొంది. మలబార్ గ్రూప్ ప్రత్యేక ఏర్పాట్లు... అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రముఖ ఆభరణాల సంస్థ– మలబార్ గ్రూప్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 7 గంటల నుంచే షోరూమ్‌లను ప్రారంభిస్తున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లు ఈ పండుగ సందర్భంగా అందుబాటులో ఉండనున్నాయి. పండుగను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా దాదాపు 2000 కేజీల పసిడి విక్రయం అవుతుందని, భావిస్తున్నట్లు మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ పేర్కొన్నారు. -
గార్డెన్ కుర్తీ
నిజానికి వీటి పేరు లాన్ కుర్తీస్‌ఎంత ఎండ ఉన్నా అందమైన గడ్డిపువ్వుల్లామెరిసిపోతుంటాయి.జీన్స్, పలాజో, లెగ్గింగ్, జెగ్గింగ్‌స్లిమ్ ఫిట్, టైట్ ఫిట్..బాటమ్‌గా ఏది ఎంచుకున్నాపైన ఈ టాప్ వేసుకుంటే చాలు గార్డెన్ అంత ముచ్చటగా ఉంటుంది. ►ఈ లాన్ కుర్తీలు ఎవరికైనా నప్పుతాయి. వయసు తేడాలు అవసరం లేదు. చూడటానికి ఫ్రాక్లా ముచ్చటగా ఉంటాయి. వేసుకుంటే మాత్రం స్టైలిష్‌గా కనిపిస్తాయి. కంఫర్ట్‌లో ప్రత్యేకం అనిపిస్తాయి. గాఢమైన రంగులు, ప్రింట్లు పెద్దగా హంగామా లేనివి ఎంచుకోవాలి. వీటికి లైట్ ట్రౌజర్, ధోతీ ప్యాంట్ బాటమ్‌గా ధరించాలి. క్యాజువల్‌గా బయటకు వెళ్లినా, ఈవెనింగ్ పార్టీ అయినా లాన్ డ్రెస్సింగ్ సమ్మర్‌కి సరైన ఎంపిక అవుతుంది. ►ఆభరణాల హంగులు అవసరం అని భావిస్తే ఫ్యాషన్ జ్యువెల్రీలో భాగంగా సిల్వర్, ఉడెన్.. ఆభరణాలను ఎంచుకోవాలి. అవి కూడా చాలా డ్రెస్‌ను హైలైట్ చేసేలా ఉండేలి. ►డ్రెస్ ఎంపికలోనే ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది కాబట్టి వీటికి జ్యువెలరీ హంగులు అవసరం లేదు. సాదా సీదా హెయిర్ స్టైల్, ఫుట్‌వేర్ ఎంపికలు ఈ గార్డెన్ కుర్తీలకు బెస్ట్ ఎంపిక. . -
గోల్డ్ స్కీమ్స్‌తో జాగ్రత్త!
బంగారు వర్తకులు ఆఫర్ చేసే బంగారం పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా...? ఏడాది పాటు పొదుపు చేయడం వల్ల ఒక నెల మొత్తం బోనస్‌గా లభించడం, ఎటువంటి తరుగు లేకుండా నగలు కొనుగోలుకు అవకాశం కల్పించే ఆఫర్లు ఆకర్షిస్తున్నాయా..? కానీ, జ్యుయలర్స్ ఆఫర్ చేసే సేవింగ్స్ పథకాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలన్నది నిపుణుల సూచన. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుమతి లేని డిపాజిట్ పథకాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. వాస్తవానికి అనుమతి లేని అన్ని పథకాలకు ఇది వర్తిస్తుందని భావించారు. జ్యుయలరీ సంస్థల పథకాలకు కూడా బ్రేక్ పడుతుందనుకున్నప్పటికీ... అవి మాత్రం ఇంతకుముందు మాదిరే నిధులను సమీకరిస్తూనే ఉన్నాయి. కాకపోతే చట్టంలో ఉన్న చిన్న వెసులుబాటును అనుకూలంగా మలచుకుని జ్యూయలరీ సంస్థలు తమ పొదుపు పథకాలను కేవలం పదకొండు నెలల కాలానికే పరిమితం చేస్తున్నాయి. చట్టానికి అతీతంగా జ్యుయలరీ సంస్థలు వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. కంపెనీల చట్టం 2014... బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మినహా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించే ఇతర సంస్థలకు షరతులు విధించింది. 365 రోజులకు మించిన కాలానికి డిపాజిట్లు తీసుకునే రిజిస్టర్డ్ సంస్థలు అన్నీ కూడా కచ్చితంగా తిరిగి చెల్లించే సామర్థ్యంపై రేటింగ్ తీసుకోవడంతోపాటు, డిపాజిట్ ఇన్సూరెన్స్‌ను కూడా తీసుకోవాలి. పైగా డిపాజిట్‌పై వడ్డీని ఎన్‌బీఎఫ్‌సీల కంటే ఎక్కువ ఆఫర్ చేయరాదు. కానీ, జ్యుయలరీ సంస్థలు మాత్రం గతంలో 12, 24, 36 నెలల పథకాలను నిర్వహించగా, చట్టంలోని నిబంధనలు కఠినతరం కావడంతో తమ పథకాల కాల వ్యవధిని 11 నెలలకు కుదించుకున్నాయి. సంస్థ బిచాణా ఎత్తేస్తే? ఆభరణాల సంస్థలు వినియోగదారులను మోసం చేసిన ఘటనలు కూడా లేకపోలేదు. ఇందుకు నిదర్శనం తమిళనాడుకు చెందిన నాదెళ్ల సంపత్ జ్యుయలరీ సంస్థ వ్యవహారమే. తమిళనాడులో బంగారు ఆభరణాల మార్కెట్లో మంచి పేరున్న సంస్థ. 75 ఏళ్లకు పైగా కార్యకలాపాల్లో ఉన్న సంస్థ. కానీ 2017 అక్టోబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఆభరణాల దుకాణాలను ఆర్థిక సమస్యల కారణంగా ఈ సంస్థ మూసేసింది. ఖాతాల్లో అవకతవకలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం వెలుగు చూశాయి. నాదెళ్ల బంగారు పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు ఉసూరుమనక తప్పలేదు. కంపెనీ 2018 మే నెలలో దివాలా పిటిషన్ వేసింది. ఈ తరహా పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఈ సంఘటన ఓ హెచ్చరిక వంటిది. బంగారు ఆభరణాల సంస్థ దివాలా పిటిషన్ దాఖలు చేస్తే, ఆస్తులను విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి ఖర్చులు పోను, ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లిస్తారు. మిగిలి ఉంటే సెక్యూర్డ్ రుణదాతలకు చెల్లింపులు చేస్తారు. ఆ తర్వాత అన్సెక్యూర్డ్ రుణదాతల వంతు వస్తుంది. బంగారం పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారు అన్సెక్యూర్డ్ ఆపరేషనల్ క్రెడిటర్ల కిందకు వస్తారని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కనుక కస్టమర్ల వంతు ఆఖరు అవుతుంది. లొసుగులు.. అనుమతి లేని డిపాజిట్ పథకాల నిషేధ ఆర్డినెన్స్... డిపాజిట్‌కు నిర్వచనం ఇచ్చింది. అడ్వాన్స్ రూపంలో తీసుకోవడం లేదా రుణం, తిరిగి నగదు లేదా సేవ రూపంలో ఇస్తానన్న హామీతో తీసుకునే మొత్తాన్ని డిపాజిట్‌గా పేర్కొంది. ఎవరు డిపాజిట్ తీసుకున్నారన్నది ఇక్కడ అంశం కాదు. వ్యక్తి లేదా యాజమాన్య సంస్థ, భాగస్వామ్య సంస్థ, కోపరేటివ్ సొసైటీ లేదా ట్రస్ట్ అయినా కావచ్చు. కనుక జ్యుయలర్స్ నిర్వహించే పథకాలు ఈ చట్టం పరిధిలోకే వస్తాయంటున్నారు కొందరు. అయితే, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. బంధువుల నుంచి రుణాల రూపంలో తీసుకోవడం, వ్యాపార సరుకుల సరఫరా కోసం అడ్వాన్స్ రూపంలో తీసుకోవడానికి డిపాజిట్ నిర్వచనం నుంచి మినహాయింపు ఉంది. భవిష్యత్తులో ఆభరణాల కొనుగోలు సాధనాలుగా తాము బంగారం పొదుపు పథకాలను విక్రయిస్తున్నట్టు జ్యుయలరీ వర్తకులు సమర్థించుకుంటున్నారు. కనుక దీన్ని ముందస్తు వాణిజ్యంగా చూడాలని పేర్కొంటున్నాయి. డిపాజిట్లు కాదు... ‘‘జ్యుయలర్ల పొదుపు పథకాలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురాలేదు. జ్యుయలర్స్ సమీకరించే నిధులు కేవలం ముందస్తు వాణిజ్య రూపంలోనే. దీన్ని డిపాజిట్‌గా చూడరాదు. ఈ పథకాల కింద కస్టమర్లకు తగ్గింపులు, బహుమానాలు ఆఫర్ చేయవచ్చా, స్పష్టం చేయాలని కోరుతూ కేంద్ర వాణిజ్య శాఖకు లేఖ రాశాం’’ అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ తెలిపారు. నిపుణుల అభిప్రాయాలు వేరు అయితే, బంగారం డిపాజిట్ పథకాలు అనుమతి లేని డిపాజిట్ పథకాల నిషేధ ఆర్డినెన్స్ పరిధిలోకి వస్తాయా అన్న దానిపై అస్పష్టత నెలకొందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ముందస్తు వాణిజ్యం పేరుతో తప్పించుకోవడం కుదరదని మరో నిపుణుడు పేర్కొన్నారు. ‘‘ఓ కస్టమర్ కొన్ని నెలల పాటు నగదు ఉంచి, చివర్లో ఏది కొనుగోలు చేయాలన్నది నిర్ణయించుకోవచ్చు. లేదా ఆ డబ్బులను వెనక్కి తీసుకోవచ్చు. అన్ని నెలల పాటు అతడు చెల్లించినది డిపాజిట్‌కు భిన్నమేమీ కాదు. వస్తువులకు ముందస్తుగా చెల్లించడం అంటే... మా అభిప్రాయం ప్రకారం ఆ సరుకులు ఏంటన్నది ముందే గుర్తించాల్సి ఉంటుంది. ఏదన్నది గుర్తించకుండా ముందుగానే అడ్వాన్స్‌గా ఎవరూ చెల్లించరు. కనుక ఈ తరహా పథకాలను నిషేధించాలి’’ అని వినోద్ కొతారి అండ్ కంపెనీ సీనియర్ అసోసియేట్ సీఎస్ శిఖా బన్సాల్ అభిప్రాయపడ్డారు. ఎవరి నియంత్రణ? బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ లేదా కంపెనీల చట్టం కింద నమోదైన ఓ కంపెనీ, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో డిపాజిట్ చేసి చేతులు కాల్చుకుంటే... సంబంధిత నియంత్రణ సంస్థలు ఆర్బీఐ, కార్పొరేట్ శాఖ, సెబీ ఫిర్యాదుల పరిష్కార బాధ్యత చూస్తాయి. బంగారం పొదుపు పథకాల విషయానికొస్తే వీటిని నియంత్రించే సంస్థ లేదు. చాలా వరకు ఈ జ్యుయలరీ సంస్థలు కంపెనీలుగా రిజిస్టర్డ్ అయినవి కావు. కనుక కార్పొరేట్ వ్యవహారాల శాఖ జోక్యం చేసుకోదు. ఈ తరహా అనియంత్రిత డిపాజిట్ పథకాలకు సంబంధించి సమస్య ఎదురైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్ప పరిష్కారం లేదు. కనుక పరిష్కారానికి సమయం తీసుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
మువ్వల నగలు
మువ్వలు సవ్వడి కాలికే అనేది నిన్నటి మాట. నేడు.. మెడలో హారంలా, చెవులకు జాకాల్లా, చేతికి గాజుల్లా.. నవ్వులతో పోటీ పడుతూ చేసే మువ్వల సందడి ఇంతంత కాదు. ఇది వివాహ వేడుకల సమయం. మెడ నిండుగా కళ్లకు పండగలా మువ్వల హారాలు సందడి చేస్తున్నాయి. -
కాచిగూడ –యశ్వంత్‌పుర్ రైల్లో దోపిడీ
హైదరాబాద్: బెంగళూరు నుంచి కాచిగూడకు వస్తున్న యశ్వంత్‌పుర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడీ జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ప్రయాణీకుల వద్ద నుంచి 28.4 తులాల బంగారు ఆభరణాలు, రూ.10వేల నగదు, సెల్ఫోన్లను గుర్తుతెలియని దుండగులు దోచుకెళ్లారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్పి జి.అశోక్‌కుమార్ కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దివిటిపల్లి వద్ద కొంతమంది దుండగులు రైల్వే సిగ్నల్స్‌ను ట్యాంపరింగ్ చేసి ప్రయాణీకుల వద్దనుంచి బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లను దొంగలించారని తెలిపారు. బెంగళూరుకు చెందిన నిమ్మి గీత (27) మెడలోంచి 8.5 తులాల బంగారు ఆభరణాలు, బ్యాగులో ఉన్న 3 సెల్ఫోన్లు, రూ.10వేల నగదు, మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన కె.జయశ్రీ (57) వద్ద నుంచి 9తులాల బంగారు ఆభరణాలు, శ్రీకాకుళం, రాజం ప్రాంతానికి చెందిన బలివాడ లక్ష్మి (65) నుంచి 2.4 గ్రాముల బంగారు ఆభరణాలు, కర్నాటకలోని బాగేపల్లి ప్రాంతానికి చెందిన లాల్యం లలిత (40) నుంచి 8.5 తులాల బంగారు ఆభరణాలు, హైదరాబాద్ బోడుప్పల్ ప్రాంతానికి చెందిన హుస్సేన్ ఫీరా (54) నుంచి ఒక సెల్‌ఫోన్‌ను దొంగిలించారు. ఉదయం 4గంటల సమయంలో రైల్లో కిటికీలు తెరిచి ఉంచిన ప్రయాణీకుల వద్ద ఈ ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లను దొంగిలించారు. ప్రయాణీకుల ఫిర్యాదు మేరకు కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఎం.రమేశ్ కేసు నమోదు చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం మహబూబ్‌నగర్ రైల్వే పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. -
మీ లుక్ ఇలా మార్చుకోండి
ఎత్తు తక్కువ ఉన్నవారు పొడవుగా కనిపించాలన్నా, సన్నగా ఉన్నవారు కొంచెం బొద్దుగా కనిపించాలన్నా ఈ చిన్న చిన్న కిటుకులు పాటించాలి... ఎత్తు తక్కువ ఉన్నవారు చిన్న అంచు(బార్డర్) లేదా అసలుఅంచు లేని చీరలు కట్టుకుంటే పొడువుగా కనిపిస్తారు.చర్మరంగుకు దగ్గరగా ఉండే రంగు దుస్తులను ధరిస్తే మీ రూపం పొడువుగా కనిపిస్తుంది. సన్నగా ఉన్నవారు అలంకరణలు ఎక్కువ ఉన్న అంటే గ్రాండ్‌గా ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులు, చీరలు కట్టుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు.నలుపు, ఎరుపు, నీలం.. వంటి బాగా ముదురు రంగు దుస్తుల మీదకు బంగారు ఆభరణాలు ధరిస్తే అందం రెట్టింపు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బొద్దుగా ఉన్నవారు చర్మం రంగు దుస్తులు ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు.బొద్దుగా, ఎత్తు తక్కువ ఉన్నవారు చారల దుస్తులు, చీరలు ధరించాలంటే.. నిలువు చారలున్నవి ఎంచుకోవాలి. -
అహనా పెళ్లంట అలనాటి స్టైలంట
ఫ్యాషన్‌లో రెట్రో స్టైల్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఇప్పుడీ స్టైల్ పెళ్లిలోనూ కళకళలాడుతోంది. కట్టులో పాత కళకు పడతులు పట్టం కడుతున్నారు. ఆభరణాల అలంకరణలోనూ పాత సొబగులకే వోటేస్తున్నారు. అలనాటి కళ.. నేడు కళ కళ పెళ్లి కుదరగానే ముందు పట్టు దుస్తుల మీదకు వెళతాయి ఇంట్లో వారి ఆలోచనలు. ముందుగానే కేటాయించిన బడ్జెట్లో కంచిపట్టు ప్రధానంగా ఉంటుంది. వీటితో పాటు బెనారస్ మనవైన చేనేతలు గద్వాల, నారాయణపేట, ఇక్కత్, ఉప్పాడ వంటివి ఉంటున్నాయి. వీటిలోనూ ముదురు రంగులు, పాతగా అనిపించే జరీ జిలుగులు, చెక్స్ వంటి డిజైన్లకే ఓటేస్తున్నారు వధువులు. వీటి రూపురేఖలు అమ్మమ్మల కాలం నాటివేమో అనిపించేలా ఉంటున్నాయి. అమ్మ, అమ్మమ్మల స్టైల్ బహుబాగు అంటున్నారు. కుట్టులోనూ ఓల్డే! అమ్మమ్మల కాలంనాటి చీరనా అని పెదవి విరిచే అమ్మాయిలు ఇప్పుడు ఇలాంటి డిజైన్స్‌నే అపురూపంగా ఎంచుకుంటున్నారు. వీటితో పాటు బ్లౌజ్ డిజైనింగ్‌లో ‘పాత కళ’నే ఇష్టపడుతున్నారు. కొన్నాళ్లు బోట్‌నెక్ బాగా ట్రెండ్‌లో ఉండేది. ఇప్పుడు మెడను పట్టేసినట్టుగా ఉండే క్లోజ్డ్ రౌండ్నెక్కి ఓటేస్తున్నారు. ఇవి దక్షిణాది కళనే కాదు ఉత్తరాది అమ్మాయిలనూ బాగా ఆకట్టుకుంటుంది. మోచేతుల వరకు ఉండే జాకెట్టు స్లీవ్స్ మరో ఆకర్షణ అవుతున్నాయి. బ్లౌజ్‌కు రకరకాలుగా గ్రాండ్‌గా ఎంబ్రాయిడరీ చేయించుకోవడం పాత జాబితాలో చేరిపోయింది. కాంట్రాస్ట్ రంగులు లేదంటే చీరలోనే వచ్చే పీస్తో డిజైన్ చేసిన బ్లౌజ్‌లు ఇప్పుడు మళ్లీ ముందుకు వచ్చాయి. ఆభరణాలూ ‘పాత’వే! మామిడిపిందెలు, చంద్రహారాలు, కాసుల పేర్లు, మెడను పట్టి ఉంచే చోకర్స్ .. ఆభరణాలలోనూ పాత డిజైన్లవైపు మక్కువ చూపుతు న్నారు. దీంతో అలాంటి ఆభరణాలు పెళ్లింట కళకళలాడుతున్నాయి. ్జ్టకొప్పు ఎవర్గ్రీన్ ఎన్ని హెయిర్‌స్టైల్స్ వచ్చినా ఇప్పటికీ అమ్మమ్మల కాలం నాటి కొప్పులే పెళ్లికి కరెక్ట్ హెయిర్ స్టైల్. కొప్పు వేసి, ఆ కొప్పు చుట్టూ పువ్వులను చుడితే వచ్చే కళ మరే హెయిర్‌స్టైల్‌కి రాదన్నది స్టైలిస్టులమాట. – నిర్వహణ: ఎన్.ఆర్ -
పదములే చాలవు... భామా!
ఇండోవెస్ట్రన్ అయినాఇంటింటి వేడుకైనా తల నుండి పాదం వరకు ఒకే కాంబినేషఒకే థీమ్ ఆభరణాలు అలంకరణలో చేరితే ఆ రూపాన్ని వర్ణించడానికి పదములే చాలవు సాయంకాలం షికారుకు వెళ్లాలన్నా, సంప్రదాయ వేడుకైనా ఆభరణాలు ధరించే దుస్తులకు సరిపోయేలా ఉన్నాయో లేవో సరి చూసుకోవడం అనేది తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆభరణాలతో పాటు ఇతర అలంకరణ వస్తువులన్నీ ఒకే థీమ్‌తో ఉండేలా జాగ్రత్త తీసుకునే టైమ్ వచ్చేసింది. అదే ఇప్పుడు ట్రెండ్ అయ్యింది. పాపిట బిళ్ల నుంచి పాదం వరకు ముత్యాలు, రత్నాలు, కుందన్స్, పూసలు.. ఆభరణమేదైనా పాపిట్లో అలంకరించిన నగమాదిరే పాదరక్షల డిజైన్ కూడా ఉండాలి. అదెలా?! అనే వారికి ఇప్పుడీ డిజైన్లు అందుబాటులోకి వచ్చేశాయి. చెవి జూకాలు – చెప్పుల డిజైన్ ఒకేలా ఉంటే అదీ ఓ స్టైల్. కాలి పట్టీల రాళ్ల డిజైన్‌తో పోటీ పడే షూ ఉంటే ఆ కాలి అందం ఎన్నింతలు పెరుగునో అని మగువలు మురిసిపోవచ్చు. చేతి గాజులు – కాలి చెప్పుల డిజైన్‌తో జత కలిస్తే ధరించే దుస్తుల అందం రెట్టింపు అవకుండా ఉంటుందా! అనుకున్నారేమో అందమైన కాంబినేషన్‌గా జత కట్టేశారు. మెడలో హారం రంగు కాలి చెప్పుల రంగు ఒకేలా కాంతులీనుతుంటే! ఆ చెప్పుల మీదుగా పారాడే చీర అంచు డిజైన్ వాటితో పోటీపడుతుంటే నిలువెత్తు అందం నడిచివచ్చినట్టే! ముక్కుబేసరి పెట్టుకుంటేనే ముఖకాంతి పండువెన్నెల పోటీపడుతుంది. ఇక బేసరితో పోటీ పడేలా చెప్పుల జత కూడా తోడైతే మేలి ముసుగులో వధువు మెరిసిపోకుండా ఉండగలదా అనేది డిజైనర్స్ చెబుతున్న మాట. ఇన్ని డిజైనర్ అలంకరణతో పాటు వీటితో జత కలిసే హ్యాండ్ బ్యాగ్ లేదా క్లచ్ మరో అదనపు ఆకర్షణను నింపుతుంది. అలంకరణ వస్తువులన్నీ మ్యాచ్ చేయాలంటే అందుకే సమయం పడుతుంది. పైగా అన్నీ ఒకేలా దొరుకుతాయన్న గ్యారంటీ ఉండదు. ఇలా అన్నీ ఒకే థీమ్‌తో లభించే ఆభరణాలు, అలంకరణ వస్తువుల డిజైన్, నాణ్యతలను బట్టి ధరలు ఉన్నాయి.వెస్ట్రన్స్టైల్ నుంచి మన సంప్రదాయ దుస్తులకూ ఈ ట్రెండ్ అనుకరణ వచ్చింది. డ్రెస్‌లో ఒక ముఖ్యమైన డిజైన్ ప్యాటర్న్ తీసుకొని దానికి తగ్గట్టుగా చెప్పులు, బ్యాగ్, బ్యాంగిల్.. ఇలా అన్నీ ఒక సెట్‌లా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఈ మోడల్ సెట్స్ యువతరాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మ్యాచింగ్ కోసం ఎక్కువ పాట్లు అవసరం లేని ఈ కొనుగోళ్లు ఆన్లైన్ మార్కెట్లోనూ అందుబాటులోకి వచ్చాయి.