Mahabubnagar Crime News
-
కూలీ డబ్బులు అడిగిన దివ్యాంగుడిపై సర్పంచ్ దాడి
-
మిస్సింగ్ కాదు.. డబుల్ మర్డర్!
దేవరకద్ర రూరల్: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం పేరూర్లో భార్యాభర్తల మిస్సింగ్ వెనకున్న మిస్టరీని ఎనిమిదేళ్ల తర్వాత పోలీసులు ఛేదించారు. దంపతుల అదృశ్యాన్ని హత్యగా తేల్చారు. వివాహేతర సంబంధమే అందుకు కారణమని సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ రజితరెడ్డి, గ్రామస్తుల కథనం ప్రకారం దేవరకద్ర మండలంలోని ఇస్రంపల్లికి చెందిన బుర్రన్ పేరూర్లో తన బావమరుదులు నానేష్, మహమ్మద్ రఫీతో కలిసి బొగ్గు అమ్మేవాడు. ఈ క్రమంలో పేరూర్కే చెందిన దంపతులు బోయ శాంతమ్మ (32), బోయ ఆంజనేయులు (37)తో బుర్రన్కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో బుర్రన్ దగ్గర వారు రూ. 20వేలు అప్పుగా తీసుకున్నారు. అప్పు తీర్చాలంటూ బుర్రన్ తరచూ వారి ఇంటికి వెళ్లే క్రమంలో శాంతమ్మతో బుర్రన్ వివాహేతర సంబ«ం«ధం ఏర్పర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆంజనేయులు తన భార్యతో మాట్లాడితే చంపుతానని బుర్రన్ను హెచ్చరించాడు. అడ్డొస్తున్నాడని.. గొంతు నులిమి.. తన వద్ద తీసుకున్న డబ్బు ఇవ్వకపోవడంతోపాటు వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో ఆంజనేయులును హతమార్చాలని బుర్రన్ నిర్ణయించుకున్నాడు. 2014 ఏప్రిల్ 19న మాట్లాడుకుందామంటూ ఆంజనేయులను పెద్దమందడి మండలంలోని పెద్దమునగల్ చేడ్ గ్రామ శివారులోని ఓ పొలం వద్దకు తీసుకెళ్లి నానేష్, రఫీతో కలసి గొంతు నులిమి చంపాడు. అనంతరం ఈ విషయాన్ని శాంతమ్మకు చెప్పాడు. ఆమె ఈ హత్యోదంతాన్ని బయటకు చెబుతాననడంతో బావమరుదుల సాయంతో ఆమెను గ్రామ శివారులోని పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లి చీర కొంగును గొంతుకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపాడు. ఈ హత్యలు బయటపడకుండా ఉండేందుకు మృతదేహాలను పూడ్చి పెట్టారు. డీఎన్ఏ పరీక్షతో కేసు ఛేదన.. 2020 ఏప్రిల్ 17న మండలంలోని పేరూర్ శివారులో శ్మశానవాటిక నిర్మాణం కోసం గుంతలు తవ్వుతుండగా ఓ చీర, ఎముకలు బయటపడ్డాయి. ఈ సమాచారం అందుకొని రంగంలోకి దిగిన పోలీసులు... గత పదేళ్లలో తప్పిపోయిన మహిళల సమాచారాన్ని సేకరించే క్రమంలో శాంతమ్మ పేరు రావడంతో మృతురాలి కుమారుడు శ్రీకాంత్‌కు డీఎన్ఏ టెస్టు చేశారు. అది ఎముకలతో సరిపోలడంతో మృతి చెందింది శాంతమ్మగా నిర్ధారించి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులు సర్పంచ్‌ను కలిసి నిజం చెప్పారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. మరో నిందితుడు రఫీ ఏడాది క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. -
కన్న తండ్రి చేతిలో నవవధువు దారుణ హత్య
-
మరికొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే..
జడ్చర్ల టౌన్: మరికొన్ని గంటల్లో పెళ్లి పీట లెక్కాల్సిన ఆ వరుడు రోడ్డు ప్రమాదానికి గురై అనంతలోకాలకు చేరుకున్నాడు. గురువారం ఉదయం జడ్చర్ల–మహబూబ్‌నగర్ 167వ నం బరు జాతీయ రహదారిపై ఈ విషాదకర సం ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. మహబూబ్‌నగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన చైతన్యశామ్యూల్ (34)కు వన పర్తి పట్టణానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11.30 గంటలకు మహబూబ్‌నగర్ కల్వరీచర్చిలో వి వాహం కావాల్సి ఉంది. మధ్యాహ్నం అక్కడి సుదర్శన్ ఫంక్షన్హాల్లో విందుకు సైతం ఏ ర్పాట్లు చేశారు. అందులోనే వధువు తరఫు కు టుంబ సభ్యులు, బంధువులు విడిది చేశారు. పెళ్లింట విషాదం.. పెళ్లికొడుకు మరణ వార్తతో ఇంటి వద్ద విషాదంలో బంధువులు 15 నిమిషాల్లో వస్తానని చెప్పి.. గురువారం ఉదయం అందరూ పెళ్లికి సిద్ధమవుతుండగా 15 నిమిషాల్లో వస్తానంటూ వరుడు కారులో జడ్చర్లకు బయలుదేరాడు. ఏడు గంటలకు నక్కలబండ తండా సమీపంలోకి చేరుకోగానే రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టును కారు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. జడ్చర్ల సీఐ రమేష్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి కోసం తీసుకొచ్చిన దండలను.. పెళ్లి వేడుకల్లో ఆనందంగా ఉన్న కుటుంబ సభ్యులు వరుడు చైతన్య మరణ వార్త తెలియ డంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పెళ్లి కో సం తీసుకొచ్చిన పూల దండలను మృతదేహా నికి వేయాల్సి వస్తుందని అనుకోలేదని బంధు లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో మెడికో దుర్మరణం
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మెడికో.. ఎదురుగా వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో అక్కడిక్కడ మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనలీయర్ చదువుతున్న ఎం.సాయిభార్గవ్(23) శుక్రవారం మధ్యాహ్నం 11.50సమయంలో స్కూటీపై కళాశాల నుంచి శ్రీనివాస కాలనీకి బయల్దేరాడు. మార్గమధ్యలో అప్పన్నపల్లి బ్రిడ్జి సమీపంలో మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న టాటా ఏస్ వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టడంతో సాయిభార్గవ్ తలకు తీవ్రమైన గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు సాయి భార్గవ్ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో అద్దెకు ఉంటూ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనలీయర్ చదువుతున్నాడు. రోజు కళాశాలకు ద్విచక్ర వాహనంపై వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో శుక్రవారం కళాశాలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి తండ్రి ప్రభు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం.. ఇంటర్ విద్యార్థిని మృతి..!) కొవ్వొత్తుల ప్రదర్శన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాయి భార్గవ్ ఆత్మకు శాంతి కోసం జిల్లా జనరల్ ఆస్పత్రిలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, డాక్టర్ రామకిషన్ పాల్గొన్నారు. -
ఏటీఎంలో 15 లక్షల నగదు చోరీ
సాక్షి, జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ ఎస్బీఐ ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఏకంగా రూ. 15 లక్షల నగదును దుండగులు అపహరించారు. తెల్ల కారులో వచ్చిన ఇద్దరు దుండగులు ముఖాలకు మాస్కులు ధరించడంతోపాటు రుమాలును చుట్టుకుని ఏటీఎంలోకి ప్రవేశించారు. ఆ వెంటనే సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి, గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్‌ను కట్ చేశారు. ఏటీఎంలోని డబ్బును అపహరించి షట్టర్‌ను కిందికి దించి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం బ్యాంకు సిబ్బంది ఏటీఎం షట్టర్ మూసి ఉండటాన్ని గమనించి షట్టర్‌ను తెరవగా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే బ్యాంకు మేనేజర్ దీపిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. -
బాలికపై అత్యాచారం
ఆత్మకూర్: మైనర్బాలికను అత్యాచారం చేసిన యువకుడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాలను బుధవారం ఆత్మకూర్‌లో అడిషనల్ ఎస్పీ షాకీర్‌హుస్సేన్, సీఐ సీతయ్య సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన కిరాణషాపు యజమాని చందు(22) సోమవారం రాత్రి 8:0 గంటల ప్రాంతంలో బాలిక షాపులో కొనుగోలు కోసం వచ్చింది. ఇదే అదునుగా భావించిన యువకుడు బాలికను బలవంతంగా షాపులోకి తీసుకెళ్లి షెట్టర్‌వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని బాలిక మంగళవారం మధ్యాహ్నం తల్లితండ్రులకు తెలిపింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆత్మకూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి 376, ఫోక్సోచట్టం, ఎస్సీఎస్టీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. -
కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య
జడ్చర్ల: పట్టణానికి చెందిన కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు రాంచంద్రారెడ్డి(62) శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం షాద్‌నగర్‌లో కిడ్నాప్ చేశారని వార్త వెలువడిన గంటల వ్యవధిలోనే హత్యకు గురయ్యాడన్న సమాచారం అందటంతో పట్టణవాసులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల వద్ద హత్య చేశారు. రాంచంద్రారెడ్డి జడ్చర్ల కొత్తబస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి పక్కన పెట్రోల్‌బంక్ నిర్వహిస్తున్నారు. కుటుంబమంతా హైదరాబాద్‌లో ఉంటుండగా ఇతను మాత్రం జడ్చర్లలో ఉండటంతో పాటు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుండేవాడు. బాదేపల్లి సింగిల్‌విండో చైర్మన్‌గా పనిచేశారు. భూత్పూర్ జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. జడ్చర్ల శాసనసభ స్థానానికి కూడా అన్న టీడీపీ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడి ఓటమి పాలయ్యారు. అనంతరం సుమారు నాలుగైదు ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాంచంద్రారెడ్డి ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన సత్యనారాయణరెడ్డి సోదరుడి కుమారుడు. చివరి రోజుల్లో జడ్చర్లలోని రాంచంద్రారెడ్డి ఇంట్లోనే సత్యనారాయణరెడ్డి ఉన్నారు. అయితే సత్యనారాయణరెడ్డికి సంబంధించిన ఆస్థుల వ్యవహారంలో, దాయాదులతో భూతగాదాలు ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే హత్యకు గురయ్యాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షాద్‌నగర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో రాంచంద్రారెడ్డిని అతని వాహనంలోనే కిడ్నాప్ చేశారని డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్, హత్యకు సంబంధించి తమవద్ద ఎలాంటి సమాచారం లేదని జడ్చర్ల ఎస్ఐ శంషోద్దీన్ తెలిపారు. కాగా హత్యకు గురైన రాంచంద్రారెడ్డి సొంత గ్రామం షాద్‌నగర్ సమీపంలోని అన్నారం. భార్య వాణి, కుమార్తెలు అఖిల, నిఖిల, కుమారుడు రఘు ఉన్నారు. పార్టీకీ తీరని లోటు: మల్లురవి రాంచంద్రారెడ్డి మృతికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవి సంతాపం ప్రకటించారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. -
నిందితులను వదిలేది లేదు
జడ్చర్ల: హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న జడ్చర్ల తదితర ప్రాంతాలను అడ్డాలుగా ఎంచుకొని అక్కడి నుంచి వచ్చి దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలిపెట్టమని ఎస్పీ రెమారాజేశ్వరి హెచ్చరించారు. గురువారం జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 7న మండలంలోని తంగెళ్లపల్లి, గంగాపూర్, కోడ్గల్‌లో అలివేలమ్మ, అలివేలు, సుజాత మెడల్లోంచి పుస్తెల తాళ్లను దొంగలు బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్తారని బాధితులు జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం జాతీయ రహదారిపై వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా దొంగతానికి పాల్పడిన పండిత్ సూరజ్కుమార్పాండే, పత్తెప్పరప్ప శ్రీనివాస్, షేక్ అఫ్రిద్ దొరికారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలు తామే చేసినట్లు ఒప్పుకున్నారు. వీరిలో పండిత్ సూరజ్కుమార్పాండేపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో 18 కేసులు నమోదై ఉన్నాయని, పీడీయాక్టు నమోదు కాగా జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అంతేగాక షాద్‌నగర్ పీఎస్ పరిధిలో హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నాడని, ఇతడిపై మరోసారి పీడీ యాక్టు నమోదు చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఉప్పుగూడలో నివాసం ఉంటూ ఫంక్షన్‌హాల్స్‌లో డెకరేషన్ పనులు చేసుకుంటూనే ఇలాంటి నేరాలు చేస్తుంటారని తెలిపారు. ఇక పతెపరప్ప శ్రీనివాస్ ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ మండలం అన్నాసాగర్‌కు చెందినవాడని, ఇతను హైదరాబాద్ బాలాపూర్‌లో ఉంటున్నాడని తెలిపారు. ఇతడిపై జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో బాలికను కిడ్నాప్ చేసిన సంఘటనకు సంబందించి పొక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదై ఉందన్నారు. షేక్ అఫ్రిద్ బాలాపూర్‌లో ఉంటుండగా నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందినవాడని తెలిపారు. వీరంతా జైలులో పరిచయమయ్యారని.. బయటకు వచ్చిన అనంతరం తిరిగి నేరాలకు అలవాటు పడ్డారని, ఇతడిపై నాలుగు కేసులు బయట పడినట్లు వివరించారు. వీరి నుంచి మూడు పుస్తెల తాళ్లతో పాటు బైక్, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వారికి ఆశ్రయం కల్పించవద్దని ఎస్పీ సూచించారు. అనుమానం వస్తే వెంటనే 100కు డయల్ చేయాలని కోరారు. కేసులో పురోగతి సాధించిన జడ్చర్ల పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీధర్, సీఐ వీరస్వామి, ఎస్ఐలు శంషోద్దీన్, జయప్రసాద్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
లారీ భీభత్సం.. బడుగుల బ్రతుకులు ఛిద్రం
సాక్షి, జడ్చర్ల: పట్టణంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా.. ఇందులో ఇద్దరు వలస కూలీలు, మరొకరు దుర్మరణం చెందారు. రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి సర్వీస్ రోడ్డును అనసరించి ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ సమయంలో ఇటుగా వెళ్తున్న ముగ్గురు లారీ కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జడ్చర్ల సీఐ వీరస్వామి కథనం మేరకు వివరాలిలా.. కేరళ రాష్ట్రం పెరంబాకు నుంచి ఉత్తరప్రదేశ్‌కు పనసకాయల లోడ్‌తో లారీ వెళుతుంది. అయితే కావేరమ్మపేట వద్ద ఏఎస్ఆర్ గార్డెన్ ఎదుట అకస్మికంగా సరీ్వస్ రోడ్డుపై దారి మళ్లించాల్సి ఉండడంతో అతివేగంగా ఉన్న లారీ అదుపు తప్పి రోడ్డుకు ఎడమవైపుకు దూసుకెళ్లింది. ఎడమ వైపు సరీ్వస్ రోడ్డును అనసరించి ఉన్న ఇంటిని ఢీకొట్టి ఎడమవైపునకు బోల్తా పడింది. అదే సమయంలో లారీకి ఎడమవైపున అదే సర్వీస్ రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు, కాలినడకన వెళ్తున్న మరో వ్యక్తి లారీ కింద పడి మృతిచెందారు. మృతుల్లో కావేరమ్మపేట వాసి లారీ కింద పడి మృతిచెందిన వారిలో ఓ వ్యక్తిని కావేరమ్మపేటకు చెందిన రఫియొద్దీన్(50)గా గుర్తించారు. సరీ్వస్ రోడ్డు దగ్గర షాద్‌నగర్ వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తుండగా లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. మృతుడికి భార్య హబీబున్నీసాబేగం, కుమారుడు రియాజొద్దీన్, కూతురు అయేషా ఉన్నారు. మరో ఇద్దరు వలస కూలీలు మరో ఇద్దరు కూలీలు మల్లే‹Ù(30), బంగారయ్య (24) ఇద్దరు హైదరాబాద్‌లో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుంటారు. వీరిద్దరూ ఒకేచోట పని చేస్తున్నారు. బైక్‌పై వీరిద్దరూ అదే రూట్లో వెళ్తుండగా.. లారీ వీరి మీద పడింది. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మల్లే‹Ùది కోడేరు మండలం రాజాపూర్ గ్రామం కాగా, అతనికి భార్య మంజుల, కుమారుడు పవన్, కూతురు భవాని ఉంది. బంగారయ్యది గోపాల్పేట మండలం మన్ననూర్ గ్రామం. ఇతనికి ఆర్నెళ్ల కిందట వివాహం కాగా, ప్రస్తుతం ఇతని భార్య గర్భిణి. మృతదేహాలను బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరారీ ఇదిలాఉండగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు. లారీ బోల్తాపడడంతో వెంటనే క్యాబిన్ నుండి బయటపడిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. వారిని పోలీసులు పట్టుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని బావిస్తున్నారు. క్రేన్ల సహాయంతో మృతదేహాల వెలికితీత లారీ కింద పడి నలిగిపోయిన మృతదేహాలను భారీ క్రేన్ల సహాయంతో వెలికి తీశారు. లారీ టైర్ల కింద నుంచి ఇద్దరు వ్యక్తుల కాళ్లు కనిపించడంతో ఇద్దరు మృతిచెందినట్లు మొదట భావించారు. క్రేన్ల సహాయంతో లారీని పైకి ఎత్తి ఇద్దరి మృతదేహాలను బయటకు తీస్తున్న క్రమంలో మరో మృతదేహం కనిపించింది. దీంతో పనస కాయాలను పక్కకు తొలగించి ఆ మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. తరువాత లారీని అక్కడి నుంచి ఇతర ప్రాంతానికి క్రేన్ల సహాయంతో తరలించారు. డీఎస్పీ శ్రీధర్ పరిశీలన మహబూబ్‌నగర్ డీఎçస్పీ శ్రీధర్ ప్రమాద సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి సంబందించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరస్వామి తెలిపారు. కావేరమ్మపేట వద్ద రోడ్ అండర్‌బ్రిడ్జి పనులు కొనసాగుతుండడంతో ప్రధాన రహదారిని మూసివేసి సరీ్వస్రోడ్లపై రాకపోకలు కొనసాగించగా.. ప్రమాదం చోటుచేసుకుంది. తప్పిన మరో పెను ముప్పు లారీ ప్రమాదం అరగంట ముందు జరిగి ఉంటే ప్రాణ నష్టం ఎక్కువగా ఉండే పరిస్థితి ఉండేది. లారీ ఢీకొట్టిన ఇంటిలో మొత్తం పది మంది కుటుంబ సభ్యులు ఉంటారు. లారీ వీరి ఇల్లును ఢీకొట్టిన సమయంలో ఇంట్లో సాయమ్మ, భాగ్యలక్ష్మి మాత్రమే ఉన్నారు. వీరు స్వల్పంగా గాయపడ్డారు. అంతకు ముందే చంద్రకళ, శేఖర్, స్వప్న, కృష్ణయ్య హాస్టల్స్‌లో వంట పనులు చేసేందుకు వెళ్లారు. ఇక వీరి పిల్లలు నిహారిక, నమ్రత, అజయ్, పండు స్కూల్‌కు వెళ్లారు. వీరంతా ఇంటి నుంచి వెళ్లిన అరగంట తరువాత ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడినట్లయ్యింది. ఆర్యూబీ పనుల కారణంగానే..? జాతీయరహదారిపై ఆర్యూబీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు రెండేళ్లు కావస్తున్నా పనులు పూర్తిరావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జాతీయరహదారిని మూసివేసి సర్వీస్ రోడ్లపై రాకపోకలు కొనసాగిస్తుండడంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంటల తరబడి రాకపోకలు నిలచిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. -
అజాగ్రత్త; కారు కిందపడి చిన్నారి మృతి
సాక్షి, అయిజ (మహబూబ్‌నగర్) : అజాగ్రత్తగా కారు నడపడంతో ఓ చిన్నారి కారు కిందపడి మృతిచెందింది. ఈ సంఘటన అయిజలో చోటుచేసుకుంది. ఎస్ఐ జగదీశ్వర్ కథనం ప్రకారం.. అయిజలోని బ్రాహ్మణవీధిలో రాజగోపాల్ అనే వ్యక్తి కారు వేగంగా నడుపుకొంటూ రాగా.. అకస్మాత్తుగా అడ్డువచ్చిన చిన్నారి ఇర్ఫాన్ (20 నెలలు)ను ఢీకొట్టాడు. దీంతో కారు ముందుభాగంలో టైరు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఖాజాబీ, కబీర్‌లకు ఒక కూతురు ఒక కుమారుడు ఉండగా కుమారుడు మృతిచెందాడు. దీంతో వారు దుఃఖసాగరంలో మునిగిపోయారు.చిన్నారి మృతదేహానికి గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కారు డ్రైవర్ రాజగోపాల్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎలా జరిగిందో తెలియదు.. కానీ చెల్లా చెదురయ్యాం
జడ్చర్ల: పెళ్లి వేడకకు హాజరై తిరిగి ఆటోలో వస్తుండగా.. ముందున్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందగా, మరో 11మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రం వద్ద సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు..తిమ్మాజీపేట మండలం బాజీపూర్ గ్రామ సమీపంలోని తువ్వబండతండ, తుమ్మలకుంట తండాలకు చెందిన వారు ఆదివారం తిమ్మాజీపేటలో జరిగిన తమ బంధువుల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. పెళ్లి తంతు ముగించుకుని సోమవారం ఆటోలో జడ్చర్లకు బయలుదేరారు. ఆటోలో దాదాపు 15మంది దాక ఉన్నట్లు తెలుస్తుంది. తండాకు చెందిన వారంతా హైద్రాబాద్‌లో ఉపాధి నిమిత్తం నివాసం ఉంటుండడంతో హైద్రాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తమను ఆటోలో జడ్చర్లలో విడిచి రావాలని ఆటో డ్రైవర్ సురేష్‌ను కోరడంతో వారిని ఎక్కించుకుని జడ్చర్లకు బయలు దేరారు. 10 నిమిషాల తరువాత తిమ్మాజీపేట పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుకగా ఆటో వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. చికిత్స పొందుతూ ఇద్దరి మృతి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ లలిత(18), లక్ష్మణ్ (28) అనంతరం మృతిచెందారు. లలిత మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా.. లక్ష్మణ్ హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అంతకుముందు ప్రమాదంలో ఆటో డ్రైవర్ సురేష్‌తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న తావుర్యా, బుజ్జి, లక్ష్మి, అనిత, బుజ్జాలి, వైష్ణవి, చరణ్,చింటూ, జాంప, ఆకాష్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108అంబులెన్స్‌లో బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక వైద్య చికిత్సలు నిర్వహించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న అనిత, వైష్ణవి, తావుర్యా, సురేష్‌ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పేర్కొంటున్నారు. అంతా తువ్వబండతండాకు చెందిన వారేనని, ఆటో డ్రైవర్ సురేష్ మాత్రం తుమ్మలకుంట తండాకు చెందిన వాడని బంధువులు తెలిపారు. చెల్లాచెదురయ్యాం ఆటో ఒక్కసారిగా లారీని ఢీకొట్టడంతో పెద్ద శబ్దం వచ్చిందని, తామంతా చెల్లాచెదరై రోడ్డుపై పడిపోయామని క్షతగాత్రులు ఈసందర్భంగా తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందో, అసలేం జరిగిందో తెలియదని, తామంతా తీవ్ర గాయాలకు గురయ్యామని వారు కన్నీరు మున్నీరయ్యారు. లలిత మృతిచెందడంతో తల్లిదండ్రులు జంబ్రు, పాత్లావత్ తార్యా కన్నీరు మున్నీరయ్యారు, -
దారుణం: పెళ్లింట విషాదం
సాక్షి, మహబూబ్‌నగర్ : పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం వివాహం జరుగగా అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా.. మద్దూర్ మండలం దోరేపల్లికి చెందిన రాధికతో వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం గౌరారం గ్రామానికి చెందిన నరేష్‌తో ఈ నెల 22న వివాహం జరిగింది. ఆదివారం సాయంత్రం పెళ్లి పందిరి తీసేందుకు నూతన దంపతులతోపాటు ఇరు కుటుంబాల వారు అబ్బాయి స్వగ్రామం గౌరారానికి బొలేరో వాహనంలో బయల్దేరారు. గండిహనుమాన్ తండా శివారులోకి రాగానే వాహనం జాయింట్ రాడ్ విరిగిపోయింది. దీంతో వాహనం పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఈ సంఘటనలో నూతన దంపతులతోపాటు మరో ఆరుగురి గాయాలు అయ్యాయి. ఇద్దరు పిల్లల కాళ్ళు విరిగిపోయి తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారందరిని 108లో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పెళ్లికుమారుడు తల్లి భీమమ్మ, పెళ్లికూతురు తల్లి లక్ష్మమ్మల పరిస్థితి విషమంగా ఉంది. శివకుమార్ అనే ఏడేళ్ల బాలుడి కాళ్ళు నుజ్జునుజ్జయ్యాయి. వీరితోపాటు శ్రీకాంత్, లక్ష్మీ, అశోక్, రాధిక, నరేష్‌లకు సైతం గాయాలయ్యాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో గాయపడ్డ చిన్నారులు -
కారు అతి వేగం.. తుఫాన్ డ్రైవర్ మృతి
సాక్షి, అడ్డాకుల (దేవరకద్ర): అతివేగంగా వచ్చిన ఓ కారు డివైడర్‌ను దాటుకుని పక్క రోడ్డుపై వెళ్తున్న తుఫాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తుఫాన్ ముందు భాగంలో కూర్చున్న వారంతా అందులోనే ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించారు. దాదాపు 30నిమిషాలపాటు పోలీసులు, స్థానికులు శ్రమించి వారిని బయటికి తీయగలిగారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా.. తీవ్రగాయాలైన డ్రైవర్ మృతిచెందాడు. మరో 13మందికి గాయాలుకాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన అడ్డాకుల శివారులోని జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్తుంటే ప్రమాదం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన వెంకటయ్య కుటుంబ సభ్యులు శుభకార్యం నిమిత్తం తుఫాన్ వాహనంలో కొత్తకోటకు బయలు దేరారు. కర్నూల్‌కు చెందిన లక్ష్మిదేవి కారులో హైదరాబాద్‌కు వెళ్తోంది. అడ్డాకుల శివారులోకి వచ్చే సరికి కారు అదుపు తప్పి డివైడర్ మీదుగా దూసుకెళ్లి పక్క రోడ్డులో వెళ్తున్న తుఫాన్‌పై పడింది. దీంతో తుఫాన్ డ్రైవర్‌తో పాటు ముందు సీటులో కూర్చున్న వారు అందులో ఇరుక్కు పోయారు. వీరిని అడ్డాకుల ఎస్ నరేష్‌తో పాటు స్థానికులు అరగంట పాటు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. తుఫాన్ డ్రైవర్ శ్రీనివాసులు(23) తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ముందు సీట్లో కూర్చున్న శంకరయ్య, యుగేందర్ తీవ్రంగా గాయపడ్డారు. అదే వాహనంలో ఉన్న లలితకు తీవ్ర గాయాలయ్యాయి. సరోజ, నారాయణ, నాగప్ప, జ్యోతి, నర్సిములు, రాజు, వెంకటయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారులో ఉన్న లక్ష్మిదేవి, కుమారుడు అనువంశ్, ఆమె తల్లి రుక్మినమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మూడు అంబులెన్స్‌లలో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతుడు శ్రీనివాసులు భూత్పూర్ మండలం హస్నాపూర్ వాసి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. కారు వేగం వందకుపైనే.. ప్రమాద సమయంలో కారు వందకు పైగా వేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అతివేగంగా వెళ్తూ అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టిన తర్వాత పక్క రోడ్డుపైకి దూసుకెళ్లింది. తుఫాన్‌ను కారు నేరుగా ఢీకొట్టకుండా గాలిలోకి ఎగిరి దానిపై పడినట్లు ప్రత్యక్ష సాక్షి శివనారాయణ తెలిపారు. కారు ఎగిరి తుఫాన్‌పై పడగానే ముందు సీట్లో ఉన్న వారు అందులో ఇరుక్కోవడంతో తీవ్రగాయాలై డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదానికి గురైన రెండు వాహనాలు డివైడర్ పైనే పడ్డాయి. -
వైద్యుల నిర్వాకానికి బలైన నిండు ప్రాణాలు..
సాక్షి, మహబూబ్‌నగర్ : వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతో రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలో కొందరు ప్రైవేట్ వైద్యుల నిర్వాకంతో బాలింతతో పాటు నవజాత శిశువు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని గొల్లబండతండాకు చెందిన రాజేశ్వరి ప్రసవం కోసం గురువారం పట్టణంలోని వన్‌టౌన్ సమీపంలోని శ్రీలతరెడ్డి ఆస్పత్రికి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రిలో పని చేసే వైద్యులు రాజేశ్వరికి ఆపరేషన్ చేయడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అధిక రక్తస్రావం, ఇతర కారణాల వల్ల మొదట బాలింత మృతి చెందగా.. కొద్ది నిమిషాల్లోనే నవజాత శిశువు కూడా మృతి చెందింది. బాలింత రాజేశ్వరి మృతదేహం ఆస్పత్రి అద్దాలు ధ్వంసం బాలింత రాజేశ్వరి, శిశువు మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ధర్నా చేశారు. ఆస్పత్రికి సంబంధించిన కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. సంఘటన స్థలానికి వన్‌టౌన్ పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ విషయంపై సంబంధిత వైద్యురాలు ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అందరూ అర్హత కల్గిన వైద్యులే పని చేస్తున్నారని, అధిక రక్తస్రావం వల్లే బాలింత మృతి చెందిందని, దీంట్లో వైద్యుల తప్పులేదని చెప్పారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులతో సంబంధిత ఆస్పత్రి నిర్వాహకులు భేరసారాలు జరిపినట్లు తెలుస్తోంది. -
ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్
సాక్షి, మక్తల్(మహబూబ్‌నగర్): లంచం తీసుకుంటూ మక్తల్ సబ్‌రిజిస్ట్రార్ హబీబొద్దిన్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ రైతు తాను కొనుగోలు చేసిన భూమిని తమ పేర రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరగా.. రూ.75వేలు డిమాండ్ చేశాడు. ఈమేరకు సదరు రైతు ఏసీబీ అధికారులకు విషయం చెప్పాడు. చివరికి ఓ మధ్యవర్తి ద్వారా లంచం డబ్బులను తీసుకోగా.. సదరు సబ్‌రిజిస్ట్రార్‌ను, మధ్యవర్తిని గురువారం ఏసీబీ అధికారులు కార్యాలయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు దాడులు చేశారన్న విషయం తెలియడంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. 18 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ విషయమై.. హైద్రాబాద్‌లోని ఎల్బీనగర్కు చెందిన రైతు వెంకట్‌రెడ్డి మక్తల్ మండలం సంగంబండకి చెం దిన రైతుల దగ్గర సర్వే నంబర్ 200లో 18 ఎకరాల భూమిని ఇటీవల కొనుగోలు చేశాడు. ఈ భూమిని తాను, తన సోదరుడి పేర్లపై రిజిస్ట్రేష న్ చేసుకునేందుకు రెండు సార్లు కార్యాలయాని కి వెళ్లి విన్నవించాడు. ఎంతకూ సదరు సబ్రి జిస్ట్రార్ హబీబొద్దీన్ లెక్కచేయలేదు. అసలు వి షయం కనుక్కునేందుకు కొందరిని సంప్రదిం చాడు. దీంతో ఓ మధ్యవర్తి లంచం డిమాండ్ చేశాడు. ఎన్నో భేరసారాల తర్వాత చివరికి రూ.75వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని సదరు అధికారి పేర్కొన్నాడని తెలిపారు. దీంతో చేసేది లేక మొదట పని పూర్తి చేయాలని, తర్వాత డబ్బు ఇస్తానని రైతు పేర్కొన్నాడు. గతంలో ఇద్దరు అధికారులు గత 15ఏళ్ల క్రితం మక్తల్‌కు చెందిన రైతు భూమి రిజిస్టేషన్ విషయంలో లంచం డిమాండ్ చేయడంతో ఇదే కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌ను ఏసీబీ అధికారులకు పట్టించారు. అలాగే, మూడేళ్ల క్రితం మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓను ఏసీబీ చేతికి పట్టించారు. ఇప్పుడు సబ్‌రిజిస్ట్రార్ హబీబోద్దీన్ను పట్టుకోవడంతో ఏసీబీ దాడులు నిర్వహించడం పట్టణంలో మూడోసారి అవుతుంది. వల పన్ని పట్టుకున్నారిలా.. ఈమేరకు 18ఎకరాల భూమిని రైతు వెంకట్‌రెడ్డి, అతని సోదరుడి పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారి హబీబోద్దీన్తో ఈ నెల 6వ తేదీన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం మేరకు ఈ నెల 14వ తేదీన భూమి రిజిస్ట్రేషన్ చేయించారు. పని పూర్తయ్యిందని, ఒప్పందం ప్రకారం లంచం డబ్బులు ఇవ్వాల్సిందిగా రైతును కోరారు. వెంటనే రైతు జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులకు 1064 నంబర్‌కు ఫోన్ చేసి అక్కడికి వెళ్లిన వారిని ఆశ్రయించారు. వారి పథకం ప్రకారం.. గురువారం మక్తల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో తమ భూమికి సంబందించిన పత్రాలను తీసుకునేందుకు రైతు వచ్చాడు. ఈమేరకు సబ్ రిజిస్ట్రార్ హబీబొద్దిన్ దగ్గర ఉండే మక్తల్‌కు చెందిన ఓ ప్రైవేట్ వ్యక్తి అరీస్కు రైతు వెంకట్‌రెడ్డి రూ.75వేలు అందజేశాడు. అనంతరం డబ్బులను అరిస్ సబ్ రిజిస్ట్రార్‌కు ఇచ్చాడు. ఏసీబీ అధికారులు వేసిన పథకం ప్రకారమే రైతు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ ప్రతాప్, సీఐలు ప్రవీణ్‌కుమార్, లింగంస్వామి సబ్‌రిజిస్ట్రార్‌ను తన కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారి చేతులు కడిగించి ఎరుపు రంగు రావడంతో సబ్‌రిజిస్ట్రార్ హబీబోద్దిన్, అతనికి సహకరించిన అరిస్.. ఇద్దరిని పట్టుకున్నారు. సాయంత్రం 6.30 వరకు కార్యాలయంలోనే విచారణ జరిపి అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ ప్రతాప్ విలేకర్లకు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్‌కు సంప్రదించాలని ఆయన సూచించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొ దర్యాప్తు జరుపుతామని తెలిపారు. కార్యాలయంలో.. అంతా ఇష్టారాజ్యం మక్తల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి అసలు సమయ పాలనే లేదు. సబ్ రిజిస్ట్రార్ ఎప్పుడు వస్తే అప్పుడే రిజిస్టేషన్ చేయాలి. చాలామటుకు లావాదేవీలన్నీ ఫోన్లు, మరికొందరు దళారులు, కార్యాలయం వద్ద ఉన్న కొందరు డాక్యుమెంట్ షాపులకు చెందిన వారి ద్వారానే జరిగేవని పేర్కొంటున్నారు. ఇక్కడికి ఏ అధికారి వచ్చినా డబ్బులు ఇస్తేనే పనులు చేయండని.. గతంలో అధికారులు ఇలాగే ఉండేవారని, మీరు కూడా అదే బాటలో నడవాలని కొందరు దళారులు మాయమాటలు చెప్పి నడిపించేవారని కింది స్థాయి అధికారులు కొందరు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో డబ్బులిస్తేనే పని అవుతుందని, చేయి తడపకపోతే వారికి కంప్యూటర్ పని చేయడంలేదు, సర్వర్ పనిచేయడంలేదంటూ ముప్పతిప్పలు పెట్టేవారని ప్రజలు వివరిస్తున్నారు. -
క్షణికావేశంతో ఛిద్రమవుతున్న జీవితాలెన్నో..
క్షణికావేశం నిండు జీవితాన్ని బలితీసుకుంటోంది. ఓ చోట ఎన్నోఆశలతో పెంచిన కొడుకు, మరోచోట కడవరకు తోడుంటానంటూ ఏడడుగులు వేసి ప్రమాణం చేసిన భర్త, ఇంకోచోట అన్నీతానై కుటుంబాన్ని పోషిస్తున్న ఇంటిపెద్ద... ఆత్మహత్యే తమ సమస్యకు పరిష్కారంగా భావించి తనువు చాలిస్తున్నారు. కుటుంబసభ్యులకు తీరని మనోవేదన మిగుల్చుతున్నారు. సాక్షి, వనపర్తి: చిన్నచిన్న కారణాలతో క్షణికావేశానికి లోనవుతూ...ఆత్మహత్య చేసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు. కారణం ఏదైనా దాన్ని పరిష్కరించుకోలేక నిండు జీవితాన్ని అర్ధంతరంగా ముగిస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు వచ్చినా..ప్రేమ విఫలమైనా కుటుంబంలో కలహాలు, పరీక్షల్లో తప్పడం.. వంటి సమస్యలతో మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో వారు తీసుకుంటున్న నిర్ణయం...ఆ వ్యక్తి కుటుంబంలో పుట్టెడు దుఃఖాన్ని మిగులుస్తోంది. చనిపోతున్న వారిలో మహిళలు, పురుషులే కాకుండా యువకులే ఎక్కువగా ఉన్నారు. కష్టనష్టాలు, అపజయాలు, కుటుంబకలహలు తదితర సమస్యలు ఎదురైనప్పుడు మనోవేదనకు గురై చావే శరణ్యమనుకుంటున్నారు. మూడేళ్ల కాలంలో 251మంది ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఇవీ లక్షణాలు... ఆత్మహత్యకు పాల్పడేవారు దేనిపై శ్రద్ధచూపరు. మానసికంగా బాధపడుతూ ఏదో పోగొట్టుకొని జీవితంపై విరక్తి కలిగినట్లుగా కనిపిస్తారు. ఆందోళన, నిద్రలేకుండా ఉండటం, కంగారు పడటం, మానసిక ఒత్తిడి తదితర సమస్యలతో బాధపడుతుంటారు. చిన్నచిన్న కారణాల చేత బలవన్మరణాలకు పాల్పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తండ్రి బైక్ కొనివ్వలేదని కొడుకు.. ఉద్యోగం రాలేని నిరుద్యోగి... పరీక్షా తప్పానని వి ద్యార్థి... భర్త తిట్టాడని భార్య.. భార్య కాపురానికి రాలేదని భర్త... చేయని నేరానికి నిందమోపారని ఒకరు...ఆరోగ్యం బాగోలేదని మరోకరు ఇలా క్షణికావేశంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 18నుంచి 35 ఏళ్లలోపు వారే.. ఆత్మహత్యకు పాల్పడుతున్నవారిలో 18 నుంచి 35ఏళ్ల లోపువారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారమార్గం అంటూ ఏదో ఉంటుంది. అది తెలియక ఎందరో వ్యక్తులు తొందరపాటుకు గురవుతూ జీవితాన్ని ముగిస్తున్నారు. కుటుంబకలహాలు, ఆర్థిక సమస్యలు, వివాహేతర సంబంధాలు, చిన్న చిన్నగొడవలు, భూసమస్యలు, ఆస్తి తగాదాలు, ఇలా కారణం ఏదైనా ఆత్మహత్యే పరిష్కారంగా భావిస్తున్నారు. 2017లో 82మంది క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోగా..అందులో 23మంది మహిళలు, 59మంది పురుషులు ఉన్నారు. అలాగే 2018లో 107 ఆత్మహత్య చే సుకోగా ..అందులో 33మంది మహిళ లు, 74మంది పురుషులు ఉండగా... 2019లో ఇప్పటివరకు 62మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 18మంది మహిళలు, 46మంది పురుషులు ఉన్నారు. మూడేళ్ల కాలంలో 251మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 74మంది మహిళలు, 173మంది పురుషులు ఉన్నారు. ఇందులో యువకులే అధికంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వివిధ కారణాలతో ఆత్మహత్యలు.. 2019 నవంబర్ 3న వనపర్తి మండలం చందాపూర్ గ్రామంలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన బాలరాజు(28) గత కొన్నిరోజులుగా తీవ్ర మనస్థాపానికి గురై మిషన్ భగీరథ ట్యాంకు దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 8న మదనాపురం మండలం సాంఘిక సంక్షేమ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీకాంత్(17) ల్యాబ్‌రూం ప్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవంబర్ 9 ఘనపురం మండలం అప్పారెడ్డిపల్లిలో బాష(24) అనే వ్యక్తి కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్టోబర్ 18న ఘనపురం మండలం సల్కెలాపురంతండాలో పవన్(15) విద్యార్థి పురుగల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రితోపాటు ఊరు తీసుకెళ్లలేదనే మనస్థాపంతో విద్యార్థి పవన్ పురుగులమందు తాగాడని గ్రామస్తులు తెలిపారు. గమనించిన తండావాసులు చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సెప్టెబంర్ 18న గోపాల్పేట మండలం పొలికెపాడు గ్రామానికి చెందిన పద్మమ్మ (76) తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆమె భర్త కూడా చనిపోవడంతో తీవ్రవనస్థాపానికి గురైన పద్మమ్మ ఒంటిపై కిరోసిన్ నిప్పంటించుకుంది. కుటుంబసభ్యులు గమనించి వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో మృతిచెందింది. సెప్టెంబర్ 17న వనపర్తి మండలం కిష్టగిరి గ్రామానికి చెందిన వెంకటయ్య (40) తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించేలోపు మృతిచెందాడు. అప్పులబాధ ఎక్కువై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సెప్టెంబర్ 10న వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామానికి తిరుపతమ్మ కుటుంబసమస్యల కారణంగా పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించడంతో ఆమె కోలుకుంది. సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి ప్రతి చిన్న సమస్యకు చావే శరణ్యమని భావిస్తే ఎట్లా, అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు స్నేహపూర్వక వాతావరణంలో మెలగాలి. వారి అభిరుచులు తెలుసుకొని.. వాటి పరిష్కారం కోసం శ్రద్ధచూపాలి. సరైన సంబంధాలు ఏర్పాటు చేసుకోకపోవడంతో ఒంటరిగా ఫీలవుతారు. దీంతో సమాజంలో మెలిగే స్వభావాన్ని కోల్పోయి తన సమస్యను ఎవరికి చెప్పుకోలేక క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతి ఒక్కరూ క్షణికావేశానికి గురికాకుండా జీవితంలో ఎలా ఎదగాలో ఆలోచించాలి. – కిరణ్‌కుమార్, డీఎస్పీ, వనపర్తి -
ఇద్దరిని బలి తీసుకున్న అతివేగం
సాక్షి, దేవరకద్ర(మహబూబ్‌నగర్): తక్కువ సమయంలో గమ్యం చేరుకోవాలని.. అతివేగంతో వాహనం నడుపుతూ వచ్చాడు డ్రైవర్. స్పీడ్ పెరుగుతున్న కొద్దీ వాహనం అదుపు చేయలేకపోయాడు.. ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు మరో మహిళ మృతిచెందగా.. 10మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం దాదాపు 100పైగా స్పీడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ట్యాక్సీతుఫాన్ వాహనం సోమవారం మధ్యాహ్నం ప్రయాణికులను ఎక్కించుకొని హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు బయల్దేరింది. ఈ క్రమంలో భూత్పూర్ మండలం అన్నాసాగర్ దగ్గరకు రావడంతో వేగంగా ఉన్న వాహనం అదుపు తప్పి రోడ్డుకు దాదాపు 20 మీటర్ల దూరం పల్టీలు కొడుతూ చివరకు చెట్టును ఢీకొని బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న 12మందికి గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఇరువురి మృతి విషయం తెలుసుకున్న పోలీసులు, ఎల్అండ్టీ సిబ్బంది వెంటనే క్షతగాత్రులను 108వాహనంలో జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆస్పత్రికి తీసుకువచ్చిన అనంతరం తీవ్రంగా గాయపడిన హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్ శేఖర్(27) మృతిచెందాడు. అలాగే, కోమాలోకి వెళ్లిన కర్నూల్ జిల్లా డోన్‌కు చెందిన మరో ప్రయాణికురాలు జయంతి(35)రాత్రి 7గంటల ప్రాంతంలో మృతి చెందారు. గాయపడ్డ వారి వివరాలు.. వాహనం బోల్తా పడిన ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిలో మానవపాడు మండలానికి చెందిన భార్య భర్తలు సంధ్య, మునిస్వామి, రాజస్థాన్‌కు చెందిన గజేందర్, గోవర్ధన్ ఉన్నారు. వీరితోపాటు కర్నూల్ జిల్లా కల్లూర్‌కు చెందిన భార్యభర్తలు సఫియా, బడేసాహెబ్, బిహార్‌కు చెందిన అల్లావుద్దీన్, కర్నూల్ జిల్లా బుద్వేల్‌కు చెందిన పద్మావతి, నర్దానా, కర్నూల్‌కు చెందిన వినయ్‌కుమార్‌తో మరో మహిళకు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
ముందు లిఫ్టు అడిగి.. వెనకాలే ఆటోలో వచ్చి..!
సాక్షి, జడ్చర్ల: రహదారులపై వెళ్తున్న ద్విచక్రవాహనాలను లిఫ్టు అడిగి కొంతదూరం వెళ్లాక ఆపి చోరీకి పాల్పడే దారి దోపిడీ దొంగల ముఠాను పట్టుకుని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వీరస్వామి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. అఖిల్ కృష్ణ, అంకం భాస్కర్, పాస్టం కల్యాణ్, రాపల్లె చంద్రుడు, వడిత్యావత్ శివ, శివగళ్ల రాజ్‌కుమార్, నాయిడు దుర్గరాజ్‌కుమార్‌లు ఓ ముఠాగా ఏర్పడి ఆటోలో ప్రయాణిస్తూ దారిపై ఒంటరిగా వస్తున్న మోటార్‌బైక్‌లను ఆపుతారు. బైక్ ఆపితే వారిలో ఒకరు దానిపై ఎక్కి కొద్ది దూరం వెళ్లాక బైక్‌ను ఆపడం ఆ వెంటనే వెనకగా ఆటోలో వచ్చిన మిగతా దొంగలు అందరూ కలిసి లిఫ్టు ఇచ్చిన వ్యక్తి దగ్గర ఉన్న బైక్, నగదు, మొబైల్ ఫోన్ తదితర సొత్తును దోచుకుని పరారవుతారు. ఈ క్రమంలో ఈ నెల 10న బూర్గుపల్లికి చెందిన కుమ్మరి రాములు బైక్‌పై వస్తుండగా లిఫ్టు అడిగి నాగసాల గ్రామ శివారులో ఆపి అతని దగ్గర రూ.1,800 నగదు, సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యారు. ఈ విషయమై బాధితుడు జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెళ్లడించారు. ఈ క్రమంలో మంగళవారం వాహనాలను స్థానిక నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం బయటపడిందన్నారు. అంతకు ముందు తిమ్మాజిపేట మండలంలో కూడా ఇదే విధంగా లిఫ్టు ఆపడం, కొద్ది దూరం వెళ్లాక బైక్ ఆపడం వెనువెంటనే వెనుకగా ఆటోలో వచ్చి బెదిరించి బైక్, సొమ్ము తదితర సొత్తును దోచుకెళ్లినట్లు చెప్పారు. నిందితుల నుంచి మూడు బైక్‌లు, ఆటో, మొబైల్ ఫోన్, రూ.1,200 నగదు రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. ఉపాధి నిమిత్తం జడ్చర్లకు వచ్చి టిఫిన్ సెంటర్ తదితర ఉపాధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. వీరికి బాదేపల్లికి చెందిన యువకులు కూడా సహకరించి చోరీలకు పాల్పడినట్లుగా గుర్తించారు. కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుళ్లు మహేందర్, మహమూద్, కానిస్టేబుళ్లు బేగ్, శంకర్, రఘునాథ్‌రెడ్డి, బాబియా తదితరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులు కొడతారేమోనని.. యువతి ఆత్మహత్య
జడ్చర్ల: కళాశాలకు వెళ్లకపోవడంతో తన తల్లి స్నేహితురాలిని మందలించిందని, తమ తల్లిదండ్రులు కూడా తనను కొడ తారేమోనని భయపడిన ఓ ఇంటర్ వి ద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. జడ్చర్లలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం .. శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటు న్న అశోక్, ఉమాదేవి కూతురు శ్రేయ (16) మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశా లలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే శనివారం అదే కాలనీలో ఉంటున్న తన స్నేహితురాలితో కలిసి బయలుదేరారు. కళాశాలకు చెందిన బస్సు ముందుగానే వెళ్లిపోవడంతో వారు ఆటోలో కళాశాలకు వెళ్లారు. కళాశాలకు ఆలస్యంగా వచ్చారని, అధ్యాపకులు వారిని తరగతి గదిలోకి అనుమతించలేదు. దీంతో వారు వెనుతిరిగి ఇం టికి వచ్చారు. ఇంటికి చేరుకున్న శ్రేయ, స్నేహితురాలిని ఆమె తల్లి అడగగా.. ఆలస్యంగా వెళ్లడంతో తిప్పిపంపారని చెప్పింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రేయ ముందే స్నేహితురాలి మీద ఆమె తల్లి చేయి చేసుకుంది. దీంతో తన తల్లిదం డ్రులు కూడా కొడతారేమోనని భయపడిన శ్రేయ ఇంటికి వచ్చి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తర్వా త ఇంటికి వచ్చిన తండ్రి అశోక్ తలుపు తట్టగా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆయన ఇంటి వెంటిలేటర్ గుండా లోపలికి చూడగా.. బెడ్రూ ంలో శ్రేయ ఆత్మహత్యకు పాల్ప డిందని గుర్తించి.. వెంటిలేటర్ ఇనుప చువ్వలను తొలగించి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందింది. శ్రేయ తండ్రి అశోక్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా.. తల్లి ఉమాదేవి నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం లో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది. వీరికి శ్రేయతోపాటు ఒక కుమారుడు ఉన్నారు. అకారణంగా తమ కూతురు మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. -
విద్యార్థుల అదృశ్యం..కల్వకుర్తిలో ప్రత్యక్షం
సాక్షి, కల్వకుర్తి(మహబూబ్‌నగర్) : స్థానిక గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినుల అదృశ్యం కథ సుఖాంతమైంది. బాలికలు అమ్రాబాద్‌లో క్షేమంగా పట్టుబడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆయా ఘటనలకు సంబంధించి వివరాలిలా.. కల్వకుర్తిలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినులు రాజేశ్వరి, పావని, సుజాత, నాగేశ్వరి ఈ నెల 26న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తమ సామగ్రిని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు. అదేరోజు అర్ధరాత్రి కల్వకుర్తి బస్టాండ్‌లో సంచరిస్తున్నట్టు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు నమోదైంది. అయితే పాఠశాలలోని సీసీ కెమెరాల్లో మాత్రం ఈ దృశ్యాలు నమోదు కాలేదు. ఈ నెల 27న దీపావళి పండుగ కావడంతో వారిని ఎవరూ గుర్తించలేదు. చివరికి మధ్యాహ్నం సమయంలో ఆ నలుగురు విద్యార్థినులు పాఠశాలలో లేరని సిబ్బంది తెలుసుకుని పాఠశాల ప్రిన్సిపాల్ విజయరాంరెడ్డికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన అక్కడికి చేరుకుని తల్లిదండ్రులకు తెలియజేశారు. అదే రోజు రాత్రి 11 గంటలకు కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ సావిత్రమ్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గురుకులాల కార్యదర్శి ఆరా ఈ ఘటనపై రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరా తీశా రు. ఆయన ఆదేశాల మేరకు సోమవారం ఐటీడీఏ పీఓ వెంకటయ్య, గిరిజన పాఠశాలల ఆర్సీఓ కల్యాణిని పాఠశాలకు వెళ్లి అక్కడి సిబ్బంది, తోటి వి ద్యార్థినులతో వివరాలు సేకరించారు. ఇక గిరిజన గురుకుల పాఠశాలలో ఏ ర్పాటు చేసిన సీసీ కెమెరాలు సరిగా ప నిచేయడం లేదు. ఈ ఘటనపై దృశ్యా లు ఏవీ అందులో రికార్డు కాలేదు. ఈ పాఠశాల నుంచి తప్పిపోయిన విద్యార్థిని సుజాతకు సోమవారం హాజరుపట్టికలో ఉపాధ్యాయులు హాజరు వేయడం గమనార్హం. ఈ ఘటన జరిగి రెండు రోజులైనా పాఠశాల సిబ్బంది బయటకు పొక్కనీయలేదు. చివరకు పోలీసులతోపాటు తల్లిదండ్రులకు సైతం విషయాన్ని ఆలస్యంగా తెలియజేశారు. ఈ నలుగురు విద్యార్థినులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. వారి ట్రంకు పెట్టెల్లో దొరికిన కొన్ని పత్రాలు, నోట్‌బుక్స్‌లో ఫోన్ నంబర్లు, ఉత్తరాల ఆధారంగా అలవాట్లను పాఠశాల సిబ్బంది వివరించారు. -
ధర్నా చేస్తే క్రిమినల్ కేసులు
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు చేపట్టిందని, ప్రజలకు అసౌకర్యం కల్పించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు చట్టానికి లోబడి నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. సమ్మె చేసే ఆర్టీసీ కార్మికులను ఇక ముందు డిపో వద్దకు గానీ, బస్టాండ్ గేట్ల వద్దకు గాని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని పేర్కొన్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను బెదిరించడం, విధులకు ఆటంకం కలిగించడం, బస్సుల రాకపోకలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు హెచ్చరించారు. సమ్మె సందర్భంగా చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. వారిపై నమోదైన కేసు వివరాలను సంబంధిత అధికారులకు పంపుతామని వెల్లడించారు. ఇలాంటి కేసులు నమోదు కావడం వల్ల ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రత్యేక బలగాల మోహరింపు మహబూబ్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఇప్పటికే కొన్ని సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయని, మంగళవారం మరో 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ వివరించారు. గొడవ లు సృష్టించి ప్రయాణికులకు ఆటంకం కలిగిం చే వారి వివరాలు నిఘా కెమెరాల ద్వారా ప్రత్యే క సాక్ష్యాలుగా స్వీకరిస్తామన్నారు. సమ్మె చేస్తు న్న ఆర్టీసీ కార్మికులను బస్టాండ్, బస్ డిపో పరి సరాల్లోకి అనుమతించమన్నారు. జిల్లాలోని అ న్ని రహదారులపై ప్రత్యేక బలగాల పెట్రోలింగ్ ఏర్పాటు చేశామన్నారు. 24 గంటల పాటు గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆదేశా ల మేరకు శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు చేపడుతామని, పోలీ సు బందోబస్తుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డీఎస్పీలు భాస్కర్, సాయిమనోహర్ పాల్గొన్నారు. -
అత్యాశే కొంపముంచింది
సాక్షి, వనపర్తి: అత్యాశ పతనానికి దారితీస్తుందన్న విషయం మరోసారి నిరూపితమైంది. రూ.వేలల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారులు అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు అధికారులు పేద, ధనిక అనే తేడా లేకుండా లంచం కోసం వేధించటం ఈ రోజుల్లో పరిపాటిగా మారింది. ఓ చిన్న పనికోసం ఇదివరకే రూ.ఒక లక్ష లంచం తీసుకున్న వనపర్తి మైన్స్‌శాఖ ఏడీ జాకబ్ మరో రూ.20 వేల కోసం అత్యాశపడి చివరికి ఏసీబీ వలకు శుక్రవారం చిక్కిన సంఘటన వనపర్తిలో సంచలనం రేకెత్తిస్తోంది. ఏసీబీ డీఎస్పీలు ఫయాజ్, శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన దిలీపాచారికి వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారంలో మినరల్స్ క్వారీ ఉంది. దానిని మరో కంపెనీకి విక్రయించిన దిలీపాచారి మైన్స్‌క్వారీని శ్రీ సాయి మినరల్స్ అండ్ మైన్స్ నుంచి మరో సంస్థ పేరున మార్చాలని కోరుతూ దరఖాస్తు చేశాడు. తనిఖీ.. ఐదురెట్లు అదనంగా ఫైన్ ఇదిలాఉండగా, క్వారీని తనిఖీ చేసిన మైన్స్ ఏడీ జాకబ్ చెల్లించాల్సిన రాయల్టీకి ఐదురెట్లు అదనంగా ఫైన్ వేస్తూ షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఫై న్ వేసేందుకు కారణమేంటి నేను ప్రభుత్వ నిబంధనల మేరకే క్వారీ నిర్వహణ చేస్తున్నానని బాధితుడు అధికారిని అభ్యర్థించగా రూ.ఒక లక్ష లంచం ఇవ్వమని ఏడీ కోరాడు. దీంతో సె ప్టెంబర్ 27వ తేదీన స్థానికంగా ఉన్న మైన్స్ ఏడీ జాకబ్ దిలీపాచారిని తన ఇంటికి పిలిపించుకుని రూ.ఒక లక్ష లంచం తీసుకున్నాడు. అయినా కూడా పనిచేయకుండా ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చాడు. శుక్రవారం ఆర్ఐకి ఇవ్వాలంటూ మరో రూ.20వేలు తీసుకురమ్మని ఏడీ కోరాడు. దీంతో బాధితుడు దిలీపాచారి తమను ఆశ్రయించాడని ఏసీబీ అధికారులు తెలిపారు. పథకం ప్రకారం పట్టుకున్నారు.. ఇదివరకే రూ.ఒక లక్ష లంచం తీసుకుని పనిచేయకుండా రోజూ ప్రదక్షణలు చేయిస్తూ ఇంకా లంచం కావాలని వేధించటంతో బాధితుడు దిలాపాచారి ఏబీసీ అధికారులను ఆశ్రయించారు. వారు పౌడర్ చల్లిన నోట్లను బాధితుడికి ఇచ్చారు. మైన్స్‌ఏడీ జాకబ్ ఆ నోట్లని తెలియక లంచంగా తీసుకుని రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. బాధితుడితో లంచం తీసుకున్న వెంటనే వనపర్తిలోని కార్యాలయం సమీపంలో కాచుకుని ఉన్న సుమారు 20 మంది ఏసీబీ అధికారులు సిబ్బంది ఒక్కసారిగా.. దాడి చేసి జాకబ్‌ను పట్టుకున్నారు. జాకబ్‌తో పాటు లంచంలో భాగస్వామ్యం ఉన్న సాయిరాంను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న సెల్ఫోన్లను లాక్కున్నారు. ఇల్లు, కార్యాలయంలో సోదాలు మైన్స్ ఏడీ లంచావతారంపై ఫిర్యాదు రాగానే ఏసీబీ అధికారులు ఆఫీస్‌తో పాటు అతని ఇంట్లోను సోదాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ లంచం తీసుకుంటూ పట్టుబడగానే హైదరాబాద్‌లోని తన నివాసంలోనూ సోదాలు ప్రా రంభించినట్లు ఏబీసీ అధికారులు తెలిపారు. -
మాటలు కలిపి.. మాయ చేస్తారు!
సాక్షి, బోధన్: ఆర్టీసీ బస్టాండ్లలో దుండగులు రెచ్చిపోతున్నారు. అమాయక ప్రయాణికులను గమనించి ప్రణాళిక ప్రకారం నగదు, ఆభరణాలను దోచుకుంటున్నారు. నవీపేట, నిజామాబాద్‌లలో ఇటీవల జరిగిన రెండు వరుస సంఘటనలతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణానికి జంకుతున్నారు. నవీపేటలోని బస్టాండ్‌లో పది మంది మహిళా ముఠా సభ్యులు పథకం ప్రకారం చోరీలు చేస్తున్నారు. గల్లీల్లో పూసలు(మహిళల అలకంరణ కోసం) అమ్ముకుంటామని ఇంటికి తిరిగి వెళ్తున్నామని, బస్సు కోసం చూస్తున్నామని తోటి ప్రయాణికులను నమ్మించారు. బస్సెక్కే సమయంలో ఓ ప్రయాణికురాలి చేతిలో ఉన్న బ్యాగును కొట్టేసేందుకు ప్రయత్నించగా సదరు మహిళ ప్రతిఘటించింది. ఆ బ్యాగులో రూ.3 లక్షల నగదు ఉండడంతో ఊపిరి పీల్చుకున్న సదరు ప్రయాణికురాలు హడావుడిగా నిజామాబాద్‌కు వెళ్లిపోయింది. తమ పని కాలేదని భావించిన మహిళా దుండగులు ముఠా సభ్యులు మరో ప్రయాణికుడి కోసం గాలం వేశారు. బట్టల దుకాణంలో మునీమ్‌గా పని చేసే నారాయణ అనే వ్యక్తి రూ.48 వేల నగదుతో బస్టాండ్‌కు వచ్చాడు. అతడితో మాటలు కలిపిన మహిళలు నగదుతో ఉన్న బ్యాగును ఎత్తుకుని ఆటోలో పారిపోయారు. ఈ ముఠాలోని కొందరు సభ్యులను స్థానికులు పట్టుకున్నారు. ఎనిమిది మంది మహిళా ముఠా సభ్యులను పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు చోరీలపై విచారిస్తున్నారు. ఈ ఘటన మరువక ముందే జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వచ్చిన ప్రభుత్వ టీచర్ స్రవంతి దగ్గర 13 తులాల బంగారు ఆభరణాలను కొట్టేశారు. బస్సు దిగే సమయంలో ఒకరినొకరు తోపుకుంటూ ఆత్రుతగా దిగే ప్రయత్నంలో దొంగలు సునాయసంగా బ్యాగులో ఉన్న బంగారాన్ని అపహరించారు. రాకపోకలను గమనించి మాటేస్తారు.. బస్టాండ్లలో చోరీలకు ఈజీగా ఉంటుందని కొందరు మహిళా ముఠా సభ్యులు బస్టాండ్లను అనువుగా ఎంచుకున్నారు. గ్రామాల్లోని గల్లీలో తిరుగుతూ వ్యాపారాలు చేసే మహిళలు పనిలో పనిగా మహిళల రాకపోకలను గమనిస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? అని మాటలు కలుపుతున్నారు. నవీపేటకు చెందిన మహిళ చీటీ డబ్బులను తీసుకుని వెళ్తుండగా గమనించిన ముఠా మహిళలే పథకం ప్రకారం చోరీకి యత్నించి విఫలమయ్యారు. గ్రామాల్లో ఇలాంటి వ్యాపారాలు చేసే మహిళల రాకపోకలు ఎక్కువవుతున్నాయి. అల్యూమీనియం వంట పాత్రల విక్రయాలు, జిప్పుల మరమ్మతులు, పిల్లలు ఆడుకునే బుగ్గలను అమ్మే మహిళల్లో కొందరు ఇలాంటి ఆగడాలకు పాల్పడుతున్నారు. బస్సు ఎక్కి, దిగే సమయంలోనే.. ముఠా సభ్యులు ప్రయాణికులు రద్దీగా ఉండే సమయంలోనే చోరీలు చేస్తున్నారు. బస్సు కోసం వేచి ఉండే ప్రయాణికులు ఒక్కసారిగా బస్సెక్కే సమయంలో తమ వద్ద ఉన్న వస్తువులపై తాత్కాలిక నియంత్రణ కోల్పోతారు. ఆత్రుతలో ఏం జరుగుతుందో గమనించలేకపోతున్నారు. ఒకరినొకరు నెట్టుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారే గానీ చోరీ తంతులపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ లోపాలను ఆసరాగా చేసుకున్న దుండగులు అవలీలగా చోరీలు చేస్తున్నారు. నవీపేట, నిజామాబాద్ బస్టాండ్లలో చోరీలు ఇలాగే జరిగాయి. విచారిస్తున్న పోలీసులు నవీపేటలో ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళా నిందితులు(ఫైల్) నవీపేట బస్టాండ్‌లో చోరీకి పాల్పడి హల్చల్ చేసిన పది మంది మహిళా ముఠాలోంచి ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీపుకున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గతంలో ఎక్కడెక్కడా చోరీలు పాల్పడ్డారు, ఎంత మంది ముఠాలో ఉన్నారనే విషయమై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఎనిమిది మందిలోంచి ఆటోలో పారిపోయిన మరో ఇద్దరి వివరాలు కోసం పోలీసులు విచారిస్తున్నారు. బస్టాండ్‌లోనే చోరీలు జరగడంతో పోలీసులు ఆ దిశగా విచారిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ఆర్టీసీ బస్టాండ్లలోనే తరచూ చోరీలు చోటు చేసుకుంటున్నాయి. బస్టాండ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సూచించాం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు తోటివారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బస్సు ఎక్కే, దిగే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. –శ్రీనాథ్‌రెడ్డి, అర్బన్ టౌన్ సీఐ, నిజామాబాద్ -
రూ.7లక్షలకే కేజీ బిస్కెట్ బంగారం అంటూ టోకరా
సాక్షి, గద్వాల: ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్.. 24కార్యెట్స్ బంగారు బిస్కెట్ కేజీ రూ.7లక్షలకే అది కూడా మీకు కాబట్టి ఈ ధరకు ఇస్తాం.. వేరే వాళ్లకైతే అస్సలు ఇవ్వదల్చుకోలేదంటారు. బయటి మార్కెట్లో మెలిమి బంగారం కేజీ ధర రూ.37లక్షల 64 వేలు.. కావాలంటే తెలుసుకో.. ఈ సదవకాశం మళ్లీ దొరకదు అంటూనే ఫోన్ కట్. ఇవతల హాల్లో.. హాల్లో అంటూ అయోమయంలో సదరు వ్యక్తి తిరిగి అదే నంబర్‌కు ఫోన్ చేయడంతోనే అసలు సిసలు ట్విస్టులతో మోదలై.. చివరికి మాయగాళ్ల ఉచ్చులో పడి నిండా మోసపోతున్నారు. నడిగడ్డలో ఇటీవల ఓ వ్యక్తి ఫిర్యాదుతో మాయగాళ్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. వలపన్ని దోచేస్తున్నారు.. నడిగడ్డ జిల్లా ప్రజలను టార్గెట్ చేసుకుని కర్ణాటకకు చెందిన ముఠా సభ్యులు మోసాలకు పాల్పడుతున్నారు. ధరూర్ మండలం గుడ్డెందొడ్డికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల పోలీసులను ఆశ్రయించడంతో మరోసారి ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ ఆశ చూపి, మేం చెప్పిన స్థలానికి రావాలని చెప్పి నమ్మించి మోసగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాల్లో ఇప్పటికే చాలా చోటుచేసుకున్నాయి. అయితే, కర్ణాటక రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాలు జిల్లాను ఆనుకొని ఉండడంతో మాయగాళ్లు ఇలా మోసగించి అలా రాష్ట్రం దాటిపోతున్నారు. దీంతో మోసం జరిగిన ప్రాంతం ఇక్కడి రాçష్ట్రంలో కాదు కేసును ఎలా ముందుకు తీసుకువెళ్తామంటూ పోలీసులు సంశయిస్తున్నారు. ఇదే అదునుగా మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. వరుస ఘటనలతో బెంబేలు 2019 సెప్టెంబర్ నెలలో ధరూర్ మండలం గుడ్డెందొడ్డికి చెందిన ఓ వ్యక్తికి కర్నాటకు చెందిన ముఠా సభ్యులు కేజీ బంగారం తక్కువ ధరకే ఇస్తమని చేప్పడంతో ఇది నిజమని నమ్మి రూ.15 లక్షలు మోసపోయాడు. 2019 మార్చి నెలలో గద్వాల పట్టణానికి చెందిన ఓ ఐస్‌క్రీమ్ పార్లర్ నడుపుతున్న వ్యాపారికి కర్ణాటకకు చెందిన ముఠా సభ్యులు కేజీ బంగారం రూ.7లక్షలకే ఇస్తానని చెప్పారు. ఇది నిజమని నమ్మి కర్ణాటకకు రూ. 7లక్షల నగదుతో వెళ్లి మోసపోయాడు. చివరికి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. 2018 ఫిబ్రవరిలో ఏపికి చెందిన కొంత మంది ముఠా సభ్యులు గద్వాలకు చెందిన ఓ బంగారు వ్యాపారితో తక్కువ ధరకే బంగారం అమ్ముతామని చెప్పి సదరు వ్యక్తితో రూ.7లక్షలు తీసుకుని ఉడాయించారు. దంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోల్డ్ బిస్కెట్లే అస్త్రంగా.. కొందరి అత్యాశను తమ అస్త్రంగా మార్చుకుంటున్నారు ముఠాసభ్యులు. బంగారం తక్కువ ధరకు ఇస్తామంటే ప్రజలు ఈజీగా నమ్ముతారని ముఠా సభ్యుల ప్రణళికలు వేసి ఆమేరకు పక్కా ప్రణాళిక రూపొందించుకొని ఆ మేరకు మొదట నమ్మకం కలిగేలా ఒక బిస్కెట్‌ను అసలు బంగారు బిస్కెట్‌ను అందిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా డబ్బులు తీసుకుని బంగారం కొనేందుకు వచ్చిన వ్యక్తిని వెన్నుపోటు పొడవడం ముఠా సభ్యులకు వెన్నతో పెట్టిన విద్యగా ఉంది. ముఠాను నడిపించేది ఎవరు? గత కొన్నెళ్లుగా నడిగడ్డలో ప్రజలు పలు మోసాలకు గురవుతున్నారు. అయితే మోసానికి పాల్పడే ముందే ఇక్కడి ప్రజల తీరు తెన్నులు, ఆర్ధిక అంశాలు, ఒకవేళ ఆ వ్యక్తితో ప్రస్తావిస్తే బయటికి చెబుతుడా అనే తదితర అంశాలను పూర్తిగా నమ్మిన తర్వాతే ఇక్కడి కేటుగాళ్ల అక్కడి ముఠా సభ్యులకు చెరవేస్తారని తెలుస్తుంది. దీనికితోడు కేసు నమోదు చేసుకోవాల్సిన పరిస్ధితి ఉన్నా, నేరం జరిగిన ప్రాంతామే ప్రామాణికం కావడంతో పోలీసులకు కేసు ఛేదనలో అనేక అటుపోట్లు ఉంటాయనేది బాధితుని మనోవేదన. చర్యలు తీసుకుంటాం మోసం జరిగితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. అలాగే, తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పడం బాధితులు గ్రహించాలి. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన ఆవసరం లేదు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని బాధితులకు న్యాయం చేస్తాం. ఏ రాష్ట్రంలో ఉన్నా నిందితులను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అక్కడి ముఠా సభ్యులకు ఇక్కడి వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు తెలిసిన వారిపై కూడా కేసు నమోదు చేస్తాం. ఇలాంటి వ్యవహరంలో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదు. – షాకీర్ హుస్సేన్, డీఎస్పీ, గద్వాల