net profits
-
సౌత్ ఇండియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 325 కోట్లను తాకింది. ట్రెజరీ, ఫారెక్స్ ఆర్జన రెట్టింపై రూ. 106 కోట్లకు చేరుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 275 కోట్ల లాభం సాధించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,485 కోట్ల నుంచి రూ. 2,804 కోట్లకు బలపడింది. వడ్డీ ఆదాయం రూ.2,129 కోట్ల నుంచి రూ. 2,355 కోట్లకు మెరుగుపడింది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం వృద్ధితో రూ. 882 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 3.24 శాతంగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.96 శాతం నుంచి 4.4 శాతానికి, నికర ఎన్పీఏలు 1.7 శాతం నుంచి 1.31 శాతానికి దిగివచ్చాయి. ప్రొవిజన్లు రెట్టింపై రూ. 116 కోట్లను తాకాయి. కనీస మూలధన నిష్పత్తి 18.04 శాతాన్ని తాకింది. ఫలితాల నేపథ్యంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 6.5 శాతం జంప్‌చేసి రూ. 25.5 వద్ద ముగిసింది. -
జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
న్యూఢిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) నాలుగో త్రైమాసిక నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 13.35 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ4లో రూ. 196 కోట్ల నష్టం నమోదైంది. సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం రూ. 2,126 కోట్ల నుంచి రూ. 2,185 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ. 2,083 కోట్ల నుంచి రూ. 2,044 కోట్లకు తగ్గాయి. షేరు ఒక్కింటికి రూ. 1 చొప్పున కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. మరోవైపు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం రూ. 48 కోట్ల నుంచి రూ. 141 కోట్లకు పెరగ్గా, ఆదాయం రూ. 8,168 కోట్ల నుంచి రూ. 8,766 కోట్లకు చేరింది. సబ్ర్స్కిప్షన్ ఆదాయం, ఇతరత్రా సేల్స్, సర్వీస్‌ల ద్వారా ఆదాయం వృద్ధి చెందినట్లు జీల్ వెల్లడించింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వన్–టైమ్ ప్రాతిపదికన కొన్ని కేటాయింపులు జరపాల్సి రావచ్చని, దీంతో మార్జిన్లపై కొంత ప్రభావం పడొచ్చని పేర్కొంది. అయితే, రెండో త్రైమాసికం నుంచి మార్జిన్ క్రమంగా మెరుగుపడగలదని వివరించింది. -
Q4 results: బజాజ్ ఆటో లాభం హైజంప్
న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో స్టాండెలోన్ నికర లాభం 35 శాతం జంప్‌చేసింది. రూ. 1,936 కోట్లను తాకింది. 2022–23 ఇదే కాలంలో రూ. 1,433 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదా యం సైతం 29% వృద్ధితో రూ. 11,485 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 33 శాతం ఎగసి రూ. 7,479 కోట్లయ్యింది. 2022–23లో కేవలం రూ. 5,628 కోట్లు ఆర్జించింది. మొత్తం టర్నోవర్ రూ. 36,248 కోట్ల నుంచి రూ. 44,685 కోట్లకు వృద్ధి చెందింది. వాటాదారులకు షేరుకి రూ. 80 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. వాహన విక్రయాలు జూమ్ క్యూ4లో బజాజ్ ఆటో మొత్తం వాహన విక్రయాలు 24 శాతం పెరిగి 10,68,576 యూనిట్లకు చేరాయి. వీటిలో ద్విచక్ర వాహనాలు 26 శాతం పుంజుకుని 9,16,817ను తాకగా.. 13 శాతం అధికంగా 1,51,759 వాణిజ్య వాహనాలు విక్రయించింది. బజాజ్ ఆటో షేరు బీఎస్ఈలో 1.1 శాతం లాభంతో రూ. 9,018 వద్ద ముగిసింది. -
వచ్చే ఏడాది 25.7 బిలియన్ డాలర్ల లాభాలు
న్యూఢిల్లీ: ప్రయాణికులు, కార్గో విభాగాల వృద్ధి మళ్లీ సాధారణ స్థాయికి తిరిగొస్తున్న నేపథ్యంలో 2024లో అంతర్జాతీయంగా విమానయాన పరిశ్రమ నికర లాభాలు 25.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగలవని ఎయిర్‌లైన్స్ సమాఖ్య ఐఏటీఏ తెలిపింది. 2023లో ఇది 23.3 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో అంచనా వేసిన 9.8 బిలియన్ డాలర్ల కన్నా ఇది గణనీయంగా ఎక్కువగా ఉండనున్నట్లు వివరించింది. ‘2024లో రికార్డు స్థాయిలో 470 కోట్ల మంది ప్రయాణాలు చేయొచ్చని అంచనా. 2019లో కరోనాకు పూర్వం నమోదైన రికార్డు స్థాయి 450 కోట్ల మందికన్నా ఇది అధికం‘ అని ఐఏటీఏ తెలిపింది. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ తిరిగి 2019 స్థాయికి చేరుతుండటంతో ఎయిర్‌లైన్స్ ఆర్థికంగా కోలుకునేందుకు తోడ్పాటు లభిస్తోందని 2023 సమీక్ష, 2024 అంచనాల నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఐఏటీఏ డైరెక్టర్ (పాలసీ, ఎకనామిక్స్) ఆండ్రూ మ్యాటర్స్ చెప్పారు. మరోవైపు, ప్రస్తుత ఏడాది కార్గో పరిమాణం 58 మిలియన్ టన్నులుగా ఉండగా వచ్చే ఏడాది 61 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2.7 శాతం మార్జిన్.. ‘అవుట్‌లుక్ ప్రకారం 2024 నుంచి ప్యాసింజర్, కార్గో విభాగాల వృద్ధి మళ్లీ సాధారణ స్థాయికి తిరి గి వచ్చే అవకాశం ఉంది. రికవరీ ఆకట్టుకునే విధంగానే ఉన్నా నికర లాభాల మార్జిన్ 2.7 శాతానికే పరిమితం కావచ్చు. ఇలాంటి మార్జిన్లు ఏ రంగంలోనూ ఇన్వెస్టర్లకు ఆమోదయోగ్యం కావు‘ అని ఐఏ టీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్‡్ష చెప్పారు. విమానయాన సంస్థలు కస్టమర్ల కోసం ఒకదానితో మరొ కటి తీవ్రంగా పోటీపడటమనేది ఎప్పుడూ ఉంటుందని.. కాకపోతే నియంత్రణలు, మౌలిక సదుపాయాల వ్యయాలు, సరఫరా వ్యవస్థల్లో కొందరి గు త్తాధిపత్యం వంటివి పరిశ్రమకు భారంగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత మార్కెట్ ఎంతో ఆసక్తికరంగా ఉందని, తాను అత్యంత ఆశావహంగా ఉన్నానని వాల్‡్ష తెలిపారు. ఐఏటీఏలో 300 పైచిలుకు ఎయిర్‌లైన్స్‌కు సభ్యత్వం ఉంది. ఐఏటీఏ నివేదికలో మరిన్ని విశేషాలు.. ► 2023లో ఎయిర్‌లైన్స్ పరిశ్రమ నిర్వహణ లాభం 40.7 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చు. వచ్చే ఏడాది ఇది 49.3 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. 2024లో పరిశ్రమ మొత్తం ఆదాయం 2023తో పోలిస్తే 7.6 శాతం వృద్ధి చెంది 964 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. ►ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కరోనా ప్రభావాల నుంచి భారత్, చైనా, ఆ్రస్టేలియా దేశాల్లో అంతర్గత మార్కెట్లు వేగంగా కోలుకున్నాయి. అయితే, 2023 మధ్య నాటికి గానీ అంతర్జాతీయ ప్రయాణాలపై చైనాలో ఆంక్షలు పూర్తిగా సడలకపోవడంతో ఆసియా పసిఫిక్ మార్కెట్లో ఇంటర్నేషనల్ ప్రయాణికుల రాకపోకలు అంతంతమాత్రంగానే నమోదయ్యాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతం 2023లో 0.1 బిలియన్ డాలర్ల నికర నష్టం ప్రకటించవచ్చని, 2024లో మాత్రం 1.1 బిలియన్ డాలర్ల నికర లాభం నమోదు చేయొచ్చని అంచనా. ►అంతర్జాతీయంగా ఆర్థిక పరిణామాలు, యుద్ధం, సరఫరా వ్యవస్థలు, నియంత్రణలపరమైన రిసు్కలు మొదలైనవి ఎయిర్‌లైన్స్ పరిశ్రమ లాభదాయకతపై సానుకూలంగా గానీ లేదా ప్రతికూలంగా గానీ ప్రభావం చూపే అవకాశం ఉంది. -
ఎస్బీఐ లాభం అప్
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 9 శాతం పుంజుకుని రూ. 16,100 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 8 శాత వృద్ధితో రూ. 14,330 కోట్లను తాకింది. వేతనాలు, పెన్షన్లు సవరించేందుకు కొంత మొత్తాన్ని కేటాయించడంతో లాభాల్లో వృద్ధి పరిమితమైంది. కాగా.. నికర వడ్డీ ఆదాయం 12 శాతంపైగా ఎగసి రూ. 39,500 కోట్లకు చేరింది. అయితే డిపాజిట్ వ్యయాల కారణంగా నికర వడ్డీ మార్జిన్లు 0.12 శాతం నీరసించి 3.43 శాతానికి చేరాయి. వేతనాలు, పెన్షన్లకు ప్రొవిజన్లు రూ. 5,900 కోట్లమేర పెరగడంతో నిర్వహణ లాభం 8 శాతం క్షీణించి రూ. 19,417 కోట్లకు పరిమితమైనట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా వెల్లడించారు. కాగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) గత దశాబ్ద కాలంలోనే అతితక్కువగా 2.55 శాతాన్ని తాకాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికల్లా 600 బ్రాంచీలను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు ఖారా తెలియజేశారు. ఎస్బీఐ ప్రస్తుతం 22,400 బ్రాంచీలను కలిగి ఉంది. కనీస మూలధన నిష్పత్తి 14.28 శాతంగా నమోదైంది. -
మారుతీ లాభం హైస్పీడ్
న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 2,525 కోట్లను తాకింది. పెద్ద కార్ల అమ్మకాలు ఊపందుకోవడం, మెరుగైన ధరలు, వ్యయ నియంత్రణలు, అధిక నిర్వహణేతర ఆదాయం ఇందుకు సహకరించాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 1,036 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 26,512 కోట్ల నుంచి రూ. 32,338 కోట్లకు జంప్‌చేసింది. కాగా.. మాతృ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్(ఎస్ఎంసీ) నుంచి గుజరాత్‌లోని తయారీ ప్లాంటును సొంతం చేసుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. తద్వారా క్లిష్టతను తగ్గిస్తూ ఒకే గొడుగుకిందకు తయారీ కార్యకలాపాలను తీసుకురానున్నట్లు తెలిపింది. కాంట్రాక్ట్ తయారీకి టాటా సుజుకీ మోటార్ గుజరాత్(ఎస్ఎంజీ)తో కాంట్రాక్ట్ తయారీ ఒప్పందం రద్దుకు బోర్డు అనుమతించినట్లు మారుతీ వెల్లడించింది. అంతేకాకుండా ఎస్ఎంసీ నుంచి ఎస్ఎంజీ షేర్లను సొంతం చేసుకోనున్నట్లు తెలిపింది. ఎస్ఎంసీకి పూర్తి అనుబంధ సంస్థ అయిన ఎస్ఎంజీ వార్షికంగా 7.5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఉత్పత్తులను పూర్తిగా ఎంఎస్‌ఐకు సరఫరా చేస్తోంది. 2024 మార్చి31కల్లా లావాదేవీ పూర్తికాగలదని అంచనా వేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. 2030–31కల్లా 40 లక్షల వాహన తయారీ సామర్థ్యంవైపు కంపెనీ సాగుతున్నట్లు ఎంఎస్ఐ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. వచ్చే ఏడాది తొలి బ్యాటరీ వాహనాన్ని విడుదల చేయడంతో సహా.. వివిధ ప్రత్యామ్నాయ టెక్నాలజీలవైపు చూస్తున్నట్లు చెప్పారు. 6 శాతం అప్ క్యూ1లో మారుతీ అమ్మకాలు 6%పైగా పుంజుకుని 4,98,030 వాహనాలకు చేరాయి. వీటిలో దేశీయంగా 9 శాతం వృద్ధితో 4,34,812 యూనిట్లను తాకగా.. ఎగుమతులు మాత్రం 69,437 యూనిట్ల నుంచి తగ్గి 63,218 వాహనాలకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు బీఎస్ఈలో 1.6 శాతం బలపడి రూ. 9,820 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్యూ1 భేష్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 29 శాతం జంప్‌చేసి రూ. 12,370 కోట్లను అధిగమించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 9,579 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే గతేడాది (2022–23) క్యూ4(జనవరి–మార్చి)లో ఆర్జించిన రూ. 12,594 కోట్లతో పోలిస్తే తాజా లాభం స్వల్పంగా తగ్గింది. ఇక మొత్తం ఆదాయం రూ. 44,202 కోట్ల నుంచి రూ. 61,021 కోట్లకు దూసుకెళ్లింది. నిర్వహణ వ్యయాలు 34 శాతం పెరిగి రూ. 15,177 కోట్లకు చేరాయి. ఈ జూలై 1 నుంచి బ్యాంక్ మాతృ సంస్థ, మారి్టగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌ను విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వడ్డీ ఆదాయం అప్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.12 శాతం నుంచి 1.17 శాతానికి నామమాత్రంగా పెరిగాయి. గతేడాది క్యూ4లో నమోదైన 1.28 శాతం నుంచి చూస్తే నీరసించాయి. ప్రస్తుత సమీక్షా కాలంలో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం సైతం 30 శాతం ఎగసి రూ. 11,952 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 21 శాతం బలపడి రూ. 23,599 కోట్లకు చేరింది. ఇందుకు అడ్వాన్సుల(రుణాలు)లో నమోదైన 15.8 శాతం వృద్ధి, 4.1 శాతానికి బలపడిన నికర వడ్డీ మార్జిన్లు దోహదం చేశాయి. ఈ కాలంలో రూ. 9,230 కోట్ల ఇతర ఆదాయం ఆర్జించింది. ఇందుకు రూ. 552 కోట్లమేర ట్రేడింగ్ లాభాలు సహకరించాయి. గతేడాది క్యూ1లో ఈ పద్దుకింద రూ. 1,077 కోట్ల నష్టం ప్రకటించింది. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 3,122 కోట్ల నుంచి రూ. 2,860 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.9 శాతాన్ని తాకింది. ఇతర విశేషాలు... ► జూన్‌కల్లా బ్యాంకు మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,81,725కు చేరింది. ► అనుబంధ సంస్థ హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ నికర లాభం రూ. 441 కోట్ల నుంచి రూ. 567 కోట్లకు జంప్ చేసింది. ► హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లాభం దాదాపు యథాతథంగా రూ. 189 కోట్లుగా నమోదైంది. ► బ్యాంక్ మొత్తం బ్రాంచీల సంఖ్య 7,860కు చేరింది. వీటిలో 52 శాతం సెమీఅర్బన్, గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నాయి. ► గతేడాది 1,400 బ్రాంచీలను ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది సైతం ఈ బాటలో సాగనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. మార్కెట్ క్యాప్ రికార్డ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 1,679 వద్ద ముగిసింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 12.65 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి మార్కెట్ విలువరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్(రూ. 18.91 లక్షల కోట్లు), టీసీఎస్(రూ. 12.77 లక్షల కోట్లు) తర్వాత మూడో ర్యాంకులో నిలిచింది. అంతేకాకుండా డాలర్ల మార్కెట్ విలువలో 154 బిలియన్లకు చేరడం ద్వారా ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాలు మోర్గాన్ స్టాన్లీ(144 బిలి యన్ డాలర్లు), బ్యాంక్ ఆఫ్ చైనా(138 బి.డా.), గోల్డ్‌మన్ శాక్స్(108 బి.డా.)లను దాటేసింది. ప్రపంచ బ్యాంకింగ్‌లో 7వ ర్యాంక్ ర్యాంక్ బ్యాంక్ పేరు మార్కెట్ క్యాప్ 1. జేపీ మోర్గాన్ 438 2. బ్యాంక్ ఆఫ్ అమెరికా 232 3. ఐసీబీసీ(చైనా) 224 4. అగ్రికల్చరల్ బ్యాంక్(చైనా) 171 5. వెల్స్ ఫార్గో 163 6. హెచ్ఎస్బీసీ 160 7. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 154 (విలువ బిలియన్ డాలర్లలో– విదేశీ బ్యాంకులు శుక్రవారం(14న) ధరల్లో) -
ఎయిర్‌లైన్స్‌కు లాభాల పంట
ఇస్తాంబుల్: విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు స్థానిక ఎకానమీలు కోలుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్ పరిశ్రమ ఈ ఏడాది మంచి లాభాలు ఆర్జించనుంది. దాదాపు 9.8 బిలియన్ డాలర్ల మేర నికర లాభాలు నమోదు చేసే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేస్తోంది. ఐఏటీఏ వార్షిక సమావేశంలో సంస్థ డైరెక్టర్ జనరల్ విలీ వాల్‡్ష ఈ విషయాలు తెలిపారు. ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ ప్రజలు వివిధ అవసరాల రీత్యా విమాన ప్రయాణాలు చేయడం పెరుగుతోందని, 2019 నాటి (కోవిడ్ పూర్వం) స్థాయితో పోలిస్తే ప్యాసింజర్ ట్రాఫిక్ 90 శాతానికి చేరిందని ఆయన పేర్కొన్నారు. ‘విమానాశ్రయాలు రద్దీగా ఉంటున్నాయి. హోటళ్లలో ఆక్యుపెన్సీ పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నాయి. ఎయిర్‌లైన్స్ పరిశ్రమ లాభాల్లోకి మళ్లుతోంది. దీంతో పరిశ్రమ ఈ ఏడాది 803 బిలియన్ డాలర్ల ఆదాయంపై 9.8 బిలియన్ డాలర్ల లాభాలు నమోదు చేసే అవకాశం ఉంది‘ అని వాల్‡్ష చెప్పారు. ఐఏటీఏలో పలు భారతీయ ఎయిర్‌లైన్స్‌తో పాటు 300 పైచిలుకు విమానయాన సంస్థలకు సభ్యత్వం ఉంది. సవాళ్లు ఉన్నాయి.. ఏవియేషన్ పరిశ్రమ కోవిడ్ మహమ్మారి తర్వాత కోలుకుంటున్నప్పటికీ.. వ్యయాలపరమైన ఒత్తిళ్లు, సరఫరా వ్యవస్థపరమైన సవాళ్లు వెన్నాడుతున్నాయని వాల్‡్ష చెప్పారు. సరఫరాపరమైన సమస్యలను పరిష్కరించడంలో పరికరాలు, విమానాల తయారీ సంస్థలు వేగంగా స్పందించకపోతుండటం వల్ల ఎయిర్‌లైన్స్‌కు వ్యయాలు పెరిగిపోతున్నాయని, విమానాలను వినియోగంలోకి తేలేకపోతున్నాయని చెప్పారు. దీనికి తగిన పరిష్కార మార్గం కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా పర్యావరణ అనుకూల ఏవియేషన్ ఇంధనం (ఎస్ఏఎఫ్) ఉత్పత్తిని పెంచాల్సి ఉందని వాల్‡్ష చెప్పారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా ఒక విధానాన్ని పాటిస్తే ప్రయోజనం ఉండగలదని ఆయన పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలను తటస్థ స్థాయికి (నెట్ జీరో) తగ్గించుకోవడానికి అవసరమైన దానితో పోలిస్తే ఎస్ఏఎఫ్ ఉత్పత్తి 0.1 శాతం కూడా లేదని వాల్‡్ష చెప్పారు. అయితే, ట్రెండ్ మాత్రం సానుకూలంగా ఉందని.. ప్రతి బొట్టు ఎస్ఏఎఫ్ను పరిశ్రమ కొని, వినియోగిస్తోందన్నారు. 2022లో ఎస్ఏఎఫ్ ఉత్పత్తి మూడు రెట్లు పెరిగి 300 మిలియన్ లీటర్లకు చేరింది. ఎయిర్‌లైన్స్ 350 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. సానుకూల విధానాలతో 2030 నాటికి 30 బిలియన్ లీటర్ల ఉత్పత్తి లక్ష్యాన్ని కాస్త కష్టమే అయినా సాధించవచ్చని వాల్‡్ష చెప్పారు. 2050 నాటికి 450 బిలియన్ లీటర్ల ఎస్ఏఎఫ్ అవసరమవుతుందన్నారు. రేట్లు సముచితంగా ఉండేలా చూడండి ఎయిర్‌లైన్స్‌కి కేంద్ర మంత్రి సింధియా సూచన గో ఫస్ట్ స్వచ్ఛంద దివాలా ప్రకటనతో పలు రూట్లలో విమాన టికెట్ల రేట్లు భారీగా పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఎయిర్‌లైన్స్ అడ్వైజరీ గ్రూప్‌తో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భేటీ అయ్యారు. టికెట్ చార్జీల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. గో ఫస్ట్ గతంలో సర్వీసులు నడిపిన రూట్లలో చార్జీలు సముచిత స్థాయిలో ఉండేలా చూసేందుకు తగు విధానాన్ని రూపొందించుకోవాలని ఎయిర్‌లైన్స్‌కు మంత్రి సూచించారు. టికెట్ రేట్లు గణనీయంగా పెరిగిన రూట్లలో చార్జీలను స్వయంగా సమీక్షించుకోవాలని పేర్కొన్నారు. దీన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా పరిశీలిస్తూ ఉంటుందని తెలిపారు. ఒడిషాలో రైలు ప్రమాద విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని మృతుల కుటుంబాలకు కార్గో సేవలను ఉచితంగా అందించాలని విమానయాన సంస్థలకు మంత్రి సూచించారు. ప్రస్తుతం విమాన టికెట్ల చార్జీలపై కేంద్రం నియంత్రణ తొలగించింది. విమానయాన సంస్థలు సీట్ల లభ్యతను బట్టి వివిధ స్థాయుల్లో చార్జీలను నిర్ణయిస్తుంటాయి. సీజన్, డిమాండ్, ఇతరత్రా మార్కెట్ పరిస్థితులు బట్టి రేట్లు మారుతుంటాయి. విమానయాన సంస్థ గో ఫస్ట్ గత నెల మేలో సర్వీసులు నిలిపివేసినప్పటి నుంచి అది ఫ్లయిట్లు నడిపిన పలు రూట్లలో చార్జీలు భారీగా పెరిగాయి. -
లాభాల్లో పీఎస్‌యూ బ్యాంకుల జోరు
న్యూఢిల్లీ: కొంతకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభదాయకత భారీగా మెరుగుపడింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో మొత్తం పీఎస్‌యూ బ్యాంకుల నికర లాభాలు రూ. లక్ష కోట్ల మార్క్‌ను తాకాయి. దీనిలో ఒక్క ఎస్బీఐ వాటానే రూ. 50,000 కోట్లు కావడం గమనార్హం! 2017–18లో పీఎస్‌యూ బ్యాంకులు ఉమ్మడిగా రూ. 85,390 కోట్ల నికర నష్టాలు ప్రకటించాక టర్న్అరౌండ్ బాట పట్టాయి. దీనిలో భాగంగా గతేడాదికల్లా రూ. 1,04,649 కోట్ల లాభాలు సాధించాయి. 2021–22తో పోలిస్తే మొత్తం 12 పీఎస్‌బీల నికర లాభం 57 శాతం వృద్ధి చూపింది. రూ. 66,540 కోట్లకు చేరింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధికంగా 126 శాతం పురోగతి సాధించి రూ. 2,602 కోట్లు ఆర్జించింది. ఈ బాటలో యుకో బ్యాంక్ లాభం రెట్టింపై రూ. 1,862 కోట్లను తాకింది. బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) 94 శాతం వృద్ధితో రూ. 14,110 కోట్లు సాధించగా.. నంబర్ వన్ దిగ్గజం ఎస్బీఐ 59 శాతం అధికంగా రూ. 50,232 కోట్లు ఆర్జించింది. కెనరా బ్యాంకు రూ. 10,604 కోట్లు అందుకుంది. కాగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) మినహా ఇతర పీఎస్‌బీలు ఆకర్షణీయ స్థాయిలో లాభాలు ప్రకటించాయి. పీఎన్బీ నికర లాభం 27 శాతం క్షీణించి రూ. 2,507 కోట్లకు పరిమితమైంది. -
ఫెడరల్ బ్యాంక్ లాభం హైజంప్
ముంబై: ప్రైవేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 954 కోట్ల నికర లాభం ఆర్జించింది. 62 శాతం ఎగసింది. ఇది ఒక త్రైమాసికానికి బ్యాంక్ చరిత్రలోనే అత్యధికం కాగా.. ఇందుకు పెట్టుబడుల విక్రయ లాభాలు దోహదపడినట్లు బ్యాంక్ పేర్కొంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 61 శాతం ఎగసి రూ. 3,165 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) రూ. 1,970 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 25 శాతం పుంజుకుని రూ. 1,909 కోట్లను అధిగమించింది. ఇతర ఆదాయం 58 శాతం ఎగసి రూ. 734 కోట్లను తాకింది. దీంతో రికార్డ్ లాభం ఆర్జించినట్లు బ్యాంక్ వెల్లడించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.78 శాతం నుంచి 2.35 శాతానికి తగ్గాయి. -
జియో లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ, డిజిటల్ సర్వీసుల దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్స్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 16 శాతం బలపడి రూ. 4,984 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 4,313 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 14 శాతం పుంజుకుని రూ. 25,465 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 22,261 కోట్ల ఆదాయం నమోదైంది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 6.7 శాతం మెరుగై రూ. 178.8కు చేరింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 23 శాతం జంప్‌చేసి రూ. 19,124 కోట్లయ్యింది. 2021–22లో రూ. 15,487 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 20 శాతం ఎగసి రూ. 1,15,099 కోట్లకు చేరింది. క్యూ4లో 2.9 కోట్లమంది జత కలవడంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 7 శాతం పెరిగి 43.93 కోట్లను తాకింది. -
ఇన్ఫోసిస్.. ఓకే
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో అంచనాలకంటే దిగువన ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం వార్షికంగా 8 శాతం ఎగసింది. రూ. 6,128 కోట్లను తాకింది. త్రైమాసికవారీ(క్యూ3)గా చూస్తే ఇది 7 శాతం తక్కువకాగా.. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 5,686 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 16 శాతం వృద్ధితో రూ. 37,441 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఆదాయం 4–7 శాతం స్థాయిలో పుంజుకోగలదని తాజా అంచనాలు(గైడెన్స్) ప్రకటించింది. వెరసి ఐటీ సేవలకు నంబర్ టూ ర్యాంకులో ఉన్న కంపెనీ 2019 తదుపరి మళ్లీ నెమ్మదించిన గైడెన్స్‌ను వెలువరించింది. ఈ ఏడాది 20–22 శాతం స్థాయిలో నిర్వహణ లాభ మార్జిన్లు సాధించే వీలున్నట్లు పేర్కొంది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన గతేడాదికి ఇన్ఫోసిస్ నికర లాభం 9 శాతం బలపడి రూ. 24,095 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 21 శాతం జంప్‌చేసి రూ. 1,46,767 కోట్లకు చేరింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ గతేడాది ఆదాయంలో 16–16.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. వెరసి అంతక్రితం ప్రకటించిన 15–16 శాతం గైడెన్స్‌ను మెరుగుపరచింది. క్యూ4లో ఉత్తర అమెరికా నుంచి 61 శాతం ఆదాయం లభించగా.. యూరోపియన్ ప్రాంతం నుంచి 27 శాతం సమకూరింది. కాగా.. క్యూ4లో ఆర్జించిన పటిష్ట ఫ్రీక్యాష్ ఫ్లో నేపథ్యంలో తుది డివిడెండును ప్రకటించినట్లు సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ వెల్లడించారు. పూర్తి ఏడాదికి అంతక్రితం డివిడెండుతో పోలిస్తే 10 శాతం అధికంగా చెల్లించినట్లు పేర్కొన్నారు. మూలధన కేటాయింపుల పాలసీకి అనుగుణంగా మరోసారి షేర్ల బైబ్యాక్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలియజేశారు. ఫలితాల్లో హైలైట్స్... ► వాటాదారులకు షేరుకి రూ. 17.50 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. దీంతో గతేడాదికి మొత్తం రూ. 34 డివిడెండ్ చెల్లించినట్లయ్యింది. ► క్యూ4లో 2.1 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. క్యూ3లో 3.3 బిలియన్ డాలర్లు, క్యూ2లో 2.7 బిలియన్ డాలర్ల చొప్పున పొందింది. ► గతేడాది మొత్తం 9.8 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు సంపాదించింది. ► ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు క్యూ3తో పో లిస్తే 24.3% నుంచి 20.9 శాతానికి దిగివచ్చింది. ► మొత్తం సిబ్బంది సంఖ్య 3,43,234కు చేరింది. గత త్రైమాసికంతో పోలిస్తే నికరంగా 3,611 మంది ఉద్యోగులు తగ్గారు. క్లయింట్ల ఆసక్తి... ‘డిజిటల్, క్లౌడ్, ఆటోమేషన్ సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టితో 2022–23లో పటిష్ట పనితీరును చూపాం. పరిస్థితులు మారినప్పటికీ కంపెనీ సామర్థ్యం, చౌక వ్యయాలు, సమీకృత అవకాశాలు వంటివి క్లయింట్లను ఆకట్టు కుంటున్నాయి. ఇది భారీ డీల్స్‌కు దారి చూపుతోంది’ అని ఇన్ఫోసిస్ సీఈఓ ఎండీ సలీల్ పరేఖ్ వ్యాఖ్యానించారు. ఫలితాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతంపైగా క్షీణించి రూ. 1,389 వద్ద ముగిసింది. అక్షతకు రూ. 68 కోట్లు ఇన్ఫోసిస్ తాజాగా షేరుకి రూ. 17.5 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. దీంతో కంపెనీలో 3.89 కోట్ల షేర్లుగల బ్రిటిష్ ప్రధాని రిషీ సునక్ భార్య అక్షత రూ. 68.17 కోట్లు అందుకోనున్నారు. ఇందుకు జూన్ 2 రికార్డ్ డేట్. కంపెనీ ఇప్పటికే రూ. 16.5 మధ్యంతర డివిడెండ్ చెల్లించింది. దీంతో అక్షత మొత్తం రూ. 132 కోట్లకుపైగా డివిడెండ్ అందుకోనున్నారు. గురువారం షేరు ధర రూ. 1,389(బీఎస్ఈ)తో చూస్తే ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతకు గల వాటా విలువ రూ. 5,400 కోట్లు. కాగా.. 2021–22 ఏడాదిలోనూ డివిడెండ్ రూపేణా అక్షత ఇన్ఫోసిస్ నుంచి దాదాపు రూ. 121 కోట్లు అందుకోవడం గమనార్హం! -
సౌదీ అరామ్కో లాభం రికార్డ్
దుబాయ్: గ్లోబల్ చమురు దిగ్గజం సౌదీ అరామ్కో గతేడాది(2022) కొత్త చరిత్రను లిఖిస్తూ 161 బిలియన్ డాలర్ల(రూ. 13 లక్షల కోట్లకుపైగా) నికర లాభం ఆర్జించింది. వెరసి ఏడాది కాలంలో ఆర్జించిన లాభాలరీత్యా లిస్టెడ్ కంపెనీలలో సరికొత్త రికార్డును సాధించింది. సౌదీ అరామ్కోగా పిలిచే సౌదీ అరేబియన్ ఆయిల్ కో కొద్ది నెలలుగా చమురు ధరలు జోరందుకోవడంతో తాజా ఫీట్‌ను సాధించింది. ప్రధానంగా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడం ఇందుకు సహకరించింది. రష్యా చమురు, నేచురల్ గ్యాస్ అమ్మకాలపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడం ప్రభావం చూపింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. 2021లో సాధించిన 110 బిలియన్ డాలర్లతో పోలిస్తే నికర లాభం 46 శాతంపైగా ఎగసింది. కాగా.. కోవిడ్–19 సంక్షోభం తదుపరి ఇటీవల చైనా ఆంక్షలు సడలించడంతో చమురుకు డిమాండ్ మరింత ఊపందుకోనున్నట్లు సౌదీ అరామ్కో భావిస్తోంది. వెరసి ఉత్పత్తిని పెంచే యోచనలో ఉంది. అయితే మరోపక్క వాతావరణ మార్పులకు కారణమవుతున్న శిలాజ ఇంధనాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. శిలాజ ఇంధనాల విక్రయం ద్వారా ఒక కంపెనీ 161 బిలియన్ డాలర్లు ఆర్జించడం షాక్‌కు గురిచేసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఏన్స్ కాలమార్డ్ వ్యాఖ్యానించారు. -
హెచ్‌పీసీఎల్ లాభం క్షీణత
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం భారీగా క్షీణించి రూ. 172 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 869 కోట్లు ఆర్జించింది. అయితే అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించకపోవడంతో వరుసగా రెండు త్రైమాసికాలలో నష్టాలు నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. చమురు ధరలు క్షీణించడంతో తిరిగి మూడో క్వార్టర్లో నష్టాలను పూడ్చుకునేందుకు వీలు చిక్కినట్లు తెలియజేసింది. ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ. 1.03 లక్షల కోట్ల నుంచి రూ. 1.15 లక్షల కోట్లకు ఎగసింది. ఈ కాలంలో ఒక క్వార్టర్‌కు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4.83 మిలియన్ టన్నుల(ఎంటీ) ముడిచమురును ప్రాసెస్ చేసింది. గత క్యూ3లో ఇది 4.24 ఎంటీగా నమోదైంది. అమ్మకాల పరిమాణం 7 శాతం పుంజుకుని 11.25 ఎంటీకి చేరింది. ఒక్కో బ్యారల్ చమురుపై స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 11.4 డాలర్లకు ఎగశాయి. గత క్యూ3లో ఇవి 4.5 డాలర్లు మాత్రమే. విశాఖ రిఫైనరీ నవీకరణ ప్రాజెక్టు చివరి దశకు చేరుకున్నట్లు కంపెనీ పేర్కొంది. దీనిలో భాగంగా 8.3 ఎంటీ రిఫైనింగ్ సామర్థ్యాన్ని 15 ఎంటీకి విస్తరిస్తున్న విషయం విదితమే. 5 ఎంటీ ఎల్ఎన్జీ టెర్మినల్ సైతం పూర్తికావస్తున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌పీసీఎల్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 232 వద్ద ముగిసింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 1,247 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం రూ. 1,247 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ. 706 కోట్లతో పోలిస్తే ఇది 77 శాతం అధికం. విదేశీ మారకంపరంగా సానుకూలతలు, కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయని సంస్థ సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ వెల్లడించారు. సమీక్షాకాలంలో ఆదాయం 27 శాతం పెరిగి రూ. 5,320 కోట్ల నుంచి రూ. 6,770 కోట్లకు పెరిగినట్లు వివరించారు. గతేడాది సెప్టెంబర్‌లో అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టిన రెవ్లిమిడ్ ఔషధం .. కంపెనీ ఆదాయాలకు అర్ధవంతమైన రీతిలో తోడ్పడుతోందని ఆయన పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో అయిదు కొత్త ఔషధాలను ప్రవేశపెట్టామని, పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఉత్తర అమెరికా మార్కెట్లో 25 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని వివరించారు. ధరలపరమైన తగ్గుదల ధోరణులు దాదాపుగా గత రెండు త్రైమాసికాల్లో చూసిన విధంగానే ఉన్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ పేర్కొన్నారు. అమెరికా, రష్యా మార్కెట్లలో వృద్ధి తోడ్పాటుతో పటిష్టమైన ఆర్థిక పనితీరు కనపర్చగలిగామని డీఆర్ఎల్ కో–చైర్మన్ జి.వి. ప్రసాద్ తెలిపారు. ఫలితాల్లో ఇతర ముఖ్య విశేషాలు.. ► కొత్త ఔషధాల ఆవిష్కరణ, ఉత్పత్తుల రేట్ల పెంపుతో భారత్ మార్కెట్లో ఆదాయం 10 శాతం పెరిగి రూ. 1,130 కోట్లకు చేరింది. ► కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం 64 శాతం వృద్ధి చెంది రూ. 3,060 కోట్లుగా నమోదైంది. వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 14 శాతం, యూరప్‌లో అమ్మకాలు ఆరు శాతం పెరిగాయి. ► క్యూ3లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై రూ. 480 కోట్లు వెచ్చించారు. పెట్టుబడి వ్యయాలపై కంపెనీ రూ. 1,500 కోట్లు వెచ్చించనుంది. -
యస్ బ్యాంక్‌కు మొండి బాకీల భారం
ముంబై: గత మొండిపద్దులకు భారీగా కేటాయింపులు జరపాల్సి రావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ నికర లాభం 79 శాతం క్షీణించింది. రూ. 55 కోట్లకు పరిమితమైంది. ప్రొవిజనింగ్ రూ. 375 కోట్ల నుంచి రూ. 845 కోట్లకు ఎగిసింది. భవిష్యత్తులోనూ పాత మొండి బాకీలకు సంబంధించి మరింతగా ప్రొవిజనింగ్ చేయాల్సి రావచ్చని బ్యాంక్ సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. రుణ వృద్ధి ఊతంతో సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం సుమారు 12 శాతం పెరిగి రూ. 1,971 కోట్లకు చేరింది. సింహ భాగం మొండి బాకీలను జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి బదలాయించడంతో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి అంతక్రితం త్రైమాసికంలోని 13 శాతంతో పోలిస్తే 2 శాతానికి తగ్గింది. బ్యాంకు ఇప్పటివరకు రూ. 4,300 కోట్ల రుణాలు రాబట్టగా, చివరి క్వార్టర్లో మరో రూ. 1,000 కోట్ల రికవరీకి అవకాశం ఉందని కుమార్ వివరించారు. రూ. 8,400 కోట్ల ఏటీ–1 బాండ్ల రద్దు చెల్లదంటూ బాంబే హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సవాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
ఫెడరల్ బ్యాంక్ లాభం 52% అప్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ నికర లాభం 52 శాతం (స్టాండెలోన్ ప్రాతిపదికన) పెరిగింది. వడ్డీ రాబడి, ఇతర ఆదాయాలు మెరుగుపడటంతో రూ.704 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 460 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 3,871 కోట్ల నుంచి రూ. 4,630 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన లాభం 50 శాతం పెరిగి రూ. 733 కోట్లకు చేరింది. లాభాలపరంగా చూస్తే బ్యాంకు చరిత్రలోనే ఇది అత్యుత్తమ త్రైమాసికమని సంస్థ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ తెలిపారు. ప్రొవిజన్ కవరేజీ నిష్పత్తి (పీసీఆర్)కి సంబంధించి కేటాయింపులు భారీగా పెంచినప్పటికీ మెరుగైన ఫలితాలు సాధించగలిగామని ఆయన పేర్కొన్నారు. సమీక్షాకాలంలో మొత్తం కేటాయింపులు 12.6 శాతం పెరిగి రూ. 506 కోట్లకు చేరాయి. నికర వడ్డీ ఆదాయం 19.1 శాతం పెరిగి రూ. 1,762 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 0.10 శాతం పెరిగి 3.30 శాతానికి చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిమ్ 3.27–3.35 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు శ్రీనివాసన్ తెలిపారు. రుణ వృద్ధిని బట్టి 2023లో అదనపు మూలధనాన్ని సమీకరించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక ఇతర ఆదాయం రూ. 492 కోట్ల నుంచి రూ. 610 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 3.24 శాతం నుంచి 2.46 శాతానికి దిగి వచ్చింది. -
నిలకడగా ఇన్ఫోసిస్ వృద్ధి
న్యూఢిల్లీ: ఎల్లప్పుడూ పటిష్టంగా నిలవడంతోపాటు.. నిలకడగా కొనసాగే కంపెనీగా ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌ను సంస్థ సీఈవో సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం కంపెనీ వ్యవస్థాపకులు, యాజమాన్యం మధ్య వివాదాలు తలెత్తిన సమయంలో సలీల్ కంపెనీ పగ్గాలు అందుకున్నారు. 2018 జనవరిలో అప్పటి సీఈవో విశాల్ సిక్కా నుంచి ఇన్ఫోసిస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాక కంపెనీ కార్యకలాపాలలో నిలకడను తీసుకురావడమేకాకుండా వృద్ధి బాటను కొనసాగించారు. ఈ కాలంలో కంపెనీకి ఎదురైన సవాళ్లను సమర్థవంతంగా అధిగమించడంతోపాటు.. కార్యకలాపాలను వేగవంతం చేశారు. ఇన్ఫోసిస్‌ను వ్యవస్థాపకులు అద్భుతమైన సంస్థగా తీర్చిదిద్దినట్లు ఒక ఇంటర్వ్యూలో పరేఖ్ ప్రశంసించారు. దీంతో కంపెనీ ఎల్లప్పుడూ పటిష్టంగా నిలుస్తూనే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇకపైన కూడా ఇదే బాటలో కొనసాగనున్నట్లు తెలియజేశారు. 2022–23లో 16 శాతం వరకు వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఆదాయంలో కంపెనీ 14–16 శాతం వృద్ధిని సాధించే వీలున్నట్లు అంచనా వేశారు. ఇందుకు పటిష్ట డీల్ పైప్‌లైన్ దోహదపడనున్నట్లు తెలియజేశారు. గత ఐదేళ్లలో ఇన్ఫోసిస్ ఆదాయం రూ. 73,715 కోట్ల నుంచి రూ. 1,23,936 కోట్లకు ఎగసింది. 2018 నుంచి 2022 మార్చి మధ్య కన్సాలిడేటెడ్ నికర లాభాలు సైతం రూ. 16,029 కోట్ల నుంచి రూ. 22,110 కోట్లకు జంప్ చేశాయి. -
మెప్పించని విప్రో
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల కంపెనీ విప్రో లాభాలకు గండి పడింది. కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 21 శాతం పతనమై జూన్ త్రైమాసికంలో రూ.2,564 కోట్లకు పరిమితమైంది. ఆదాయం 18 శాతం వృద్ధితో రూ.18,252 కోట్ల నుంచి రూ.21,529 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.3,243 కోట్లుగా ఉంది. డాలర్లలో చూస్తే ఆదాయం 17 శాతానికి పైగా పెరిగి 2,735 డాలర్లుగా ఉంది. క్వార్టర్ వారీగా చూస్తే ఆపరేటింగ్ మార్జిన్ 2 శాతం తగ్గి 15 శాతానికి పరిమితమైంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయం 2,817–2872 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని, సీక్వెన్షియల్‌గా (జూన్ త్రైమాసికంతో పోలిస్తే) 3–5 శాతం మధ్య వృద్ధి నమోదు కావచ్చని కంపెనీ పేర్కొంది. ‘‘విప్రో వృద్ధి అవకాశాల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాం. వీటి ఫలితాల పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. ఆర్డర్ల పుస్తకం వార్షికంగా చూస్తే కాంట్రాక్టు విలువ పరంగా 32 శాతం పెరిగింది. పెద్ద డీల్స్ సొంతం చేసుకున్నాం. నేడు ఆర్డర్ల పైపులైన్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో ఉంది. మా వ్యాపార వృద్ధికి వీలున్న చోట పెట్టుబడులు కొనసాగిస్తాం. మా క్లయింట్లకు మరింత మెరుగ్గా సేవలు అందించడంపై దృష్ట సారిస్తాం’’అని విప్రో ఎండీ, సీఈవో థియరీ డెలాపోర్టే తెలిపారు. ఆపరేటింగ్ మార్జిన్లు 15 శాతంగా ఉన్నాయంటే కనిష్ట స్థాయికి చేరుకున్నట్టేనని కంపెనీ సీఎఫ్‌వో జతిన్ దలాల్ పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల సంఖ్య 15,446 పెరిగి 2.58 లక్షలకు చేరింది. -
మణప్పురం లాభం పతనం
న్యూఢిల్లీ: మణప్పురం ఫైనాన్స్ మార్చి త్రైమాసికం పనితీరు విషయంలో ఇన్వెస్టర్లను ఉసూరుమనిపించింది. నికర లాభం 44 శాతం తరిగి రూ.261 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.468 కోట్లుగా ఉంది. అధిక ఈల్డ్ బంగారం రుణాలను, తక్కువ ఈల్డ్లోకి మార్చడం వల్ల లాభాలపై ప్రభావం పడినట్టు సంస్థ తెలిపింది. నిర్వహణ వ్యయాలను తగ్గించుకున్నట్టు పేర్కొంది. సూక్ష్మ రుణాల విభాగంలో నాణ్యమైన వృద్ధిపై, రుణ వసూళ్లపై, బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో బలోపేతంపై తాము దృష్టి సారిస్తామని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం సైతం 10 శాతం తగ్గిపోయి రూ.986 కోట్లకు పరిమితమైంది. కానీ, డిసెంబర్ త్రైమాసికంలో ఉన్న రూ.953 కోట్లతో పోలిస్తే 3 శాతానికి పైగా పెరిగింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం 9 శాతం తగ్గి రూ.1,481 కోట్లుగా ఉంది. ప్రస్తుతం బంగారం రుణాల్లో రూ.2లక్షలకు పైన టికెట్ సైజువి 33 శాతంగా ఉంటాయని సంస్థ తెలిపింది. 2021–22 సంవత్సరానికి సంస్థ నికర లాభం 23 శాతం తగ్గి రూ.1,320 కోట్లుగా ఉంది. ఆదాయం 5 శాతం క్షీణించి రూ.6,061 కోట్లుగా నమోదైంది. -
ఐడీఎఫ్సీ బ్యాంక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ ఐడీఎఫ్సీ బ్యాంక్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 168 శాతం జంప్‌చేసి రూ. 343 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 128 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 4,811 కోట్ల నుంచి రూ. 5,385 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం 36 శాతం ఎగసి రూ. 2,669 కోట్లకు చేరింది. ఫీజు, ఇతర ఆదాయం 40 శాతం వృద్ధితో రూ. 841 కోట్లను తాకింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మాత్రం ఐడీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 68 శాతం క్షీణించి రూ. 145 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 452 కోట్లు ఆర్జించింది. కోవిడ్–19 రెండో దశ ప్రభావం లాభాలను దెబ్బతీసినట్లు బ్యాంక్ పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 18,179 కోట్ల నుంచి రూ. 20,395 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం సైతం 32 శాతం ఎగసి రూ. 9,706 కోట్లకు చేరింది. కాగా.. రిటైల్ విభాగంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.01 శాతం నుంచి 2.63 శాతానికి దిగివచ్చినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ వెల్లడించారు. ఈ బాటలో నికర ఎన్పీఏలు సైతం 1.9 శాతం నుంచి 1.15 శాతానికి తగ్గినట్లు పేర్కొన్నారు. -
నిరాశపరిచిన ఎల్అండ్టీ
న్యూఢిల్లీ: నిర్మాణం, ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో (ఎల్అండ్టీ) కన్సాలిడేటెడ్ (అనుబంధ కంపెనీలు కలిసిన) నికర లాభం సెప్టెంబర్ క్వార్టర్లో ఏకంగా 67 శాతం పడిపోయి రూ.1,819 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.5,520 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.31,594 కోట్ల నుంచి రూ.35,305 కోట్లకు వృద్ధి చెందింది. ‘‘క్రితం ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో ఎలక్ట్రిక్ వ్యాపారాన్ని ష్నీడర్‌కు విక్రయించడంతో పెద్ద ఎత్తున లాభం సమకూరింది. అలాగే, విదేశీ ఆస్తులకు సంబంధించి ఇంపెయిర్మెంట్ (పెట్టుబడుల విలువ క్షీణత) కూడా చేయాల్సి వచ్చింది’’ అని ఎల్అండ్టీ హోల్‌టైమ్ డైరెక్టర్, సీఎఫ్‌వో ఆర్ శంకర్రామన్ తెలిపారు. అటువంటివి సమీక్షా త్రైమాసికంలో లేవని చెప్పారు. నిర్వహణ లాభం 56 శాతం వృద్ధి చెందినట్టు చెప్పారు. నికర లాభంలో ఉత్తరాఖండ్‌లోని హైడల్ ప్లాంట్‌లో వాటాల విక్రయం రూపంలో వచ్చిన రూ.144 కోట్లు కూడా ఉన్నట్టు ఎల్అండ్టీ తెలిపింది. ఇక ఏప్రిల్–సెప్టెంబర్ ఆరు నెలల కాలంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.2,994 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 49 శాతం తగ్గింది. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.42,140 కోట్ల కొత్త ఆర్డర్లను కంపెనీ సంపాదించుకుంది. కంపెనీ చేతిలో మొత్తం రూ.3,30,541 కోట్ల ఆర్డర్లున్నాయి. -
టెక్ మహీంద్రా లాభం హైజంప్
ముంబై: ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 35 శాతం ఎగసి రూ. 1,081 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 804 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం స్వల్పం గా 2.5 శాతం పుంజుకుని రూ. 9,730 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తిఏడాదికి నికర లాభం 10 శాతం పురోగమించి రూ. 4,428 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 2.7 శాతం వృద్ధితో రూ. 37,855 కోట్లయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం రెండంకెల స్థాయిలో పుంజుకునే వీలున్నట్లు కంపెనీ తాజాగా అంచనా వేసింది. ఆగస్ట్ 11న డివిడెండ్... టెక్ మహీంద్రా బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 30 చొప్పున తుది డివిడెండును సిఫారసు చేసింది. దీనిలో రూ. 15 ప్రత్యేక డివిడెండు కలసి ఉంది. ఆగస్ట్ 11కల్లా డివిడెండును చెల్లించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో కలిపి గతేడాదికి కంపెనీ మొత్తం రూ. 45 డివిడెండును చెల్లించినట్లవుతుంది. క్యూ4లో 847 మంది ఉద్యోగులు వైదొలగడంతో 2021 మార్చికల్లా కంపెనీ సిబ్బంది సంఖ్య 1,21,054కు పరిమితమైంది. ఈ ఏప్రిల్ నుంచీ ఉద్యోగులకు వేతన పెంపును చేపడుతున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో మిలింద్ కులకర్ణి వెల్లడించారు. గతేడాది మార్జిన్లు 2.6 శాతం బలపడి 18.1 శాతానికి చేరటంతోపాటు.. క్యాష్‌ఫ్లో మెరుగుపడినట్లు పేర్కొన్నారు. ఒక ఆసుపత్రితో ఒప్పందం ద్వారా నోయిడాలోని క్యాంపస్‌లో 50 పడకల కోవిడ్ కేర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈవో గుర్నానీ వెల్లడించారు. బీపీఎస్‌లో పట్టు కన్సల్టింగ్, టెక్నాలజీ సర్వీసులందించే యూఎస్ కంపెనీ ఎవెంటస్ సొల్యూషన్స్ గ్రూప్‌ను సొంతం చేసుకున్నట్లు టెక్ మహీంద్రా పేర్కొంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. ఈ కొనుగోలుతో కస్టమర్ ఎక్స్పీరియన్స్, కస్టమర్ మేనేజ్మెంట్ విభాగాల్లో కంపెనీ మరింత పట్టుసాధించనున్నట్లు తెలియజేసింది. బిజినెస్ ప్రాసెస్ సర్వీస్(బీపీఎస్) విభాగంలో మరింత సమర్థవంత సేవలందించనున్నట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు ఎన్ఎస్ఈలో 2% ఎగసి రూ. 970 వద్ద ముగిసింది. అత్యున్నత సాంకేతికతలపై ప్రత్యేక దృష్టితో క్లయింట్లను ఆకట్టుకుంటున్నాం. దీంతో క్యూ4లో భారీ డీల్స్ దక్కాయి. ఇవి రెట్టింపునకు ఎగసి 100 కోట్ల డాలర్లకు చేరాయి. ఇకపై వృద్ధి బాటలో సాగనున్నాం. ఐటీ సేవలకు పటిష్ట డిమాండ్ కనిపిస్తోంది. వచ్చే రెండు త్రైమాసికాలలో 8–10% మేర ఉద్యోగ కల్పన చేపట్టనున్నాం. 5జీ, క్లౌడ్ తదితర విభాగాలలో అధిక వృద్ధికి వీలుంది. – సీపీ గుర్నానీ, టెక్ మహీంద్రా సీఈవో -
ఇన్ఫీ లాభం రూ. 5,076 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ గతేడాది చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 17.5 శాతం పెరిగి రూ. 5,076 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 4,321 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 13 శాతంపైగా ఎగసి రూ. 26,311 కోట్లకు చేరింది. గత క్యూ4లో రూ. 23,267 కోట్ల టర్నోవర్ సాధించింది. డాలర్ల రూపేణా ఆదాయం 13 శాతం వృద్ధితో 361.3 కోట్ల డాలర్లుగా నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 15 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాది(2020–21)లో ఇన్ఫోసిస్ నికర లాభం 16.6 శాతం పురోగమించి రూ. 19,351 కోట్లకు చేరింది. ఇక మొత్తం ఆదాయం దాదాపు 11 శాతం పుంజుకుని రూ. 1,00,472 కోట్లను తాకింది. కాగా.. ఇప్పటికే చెల్లించిన రూ. 12తో కలిపి గతేడాదికి 54 శాతం అధికంగా రూ. 27 డివిడెండ్‌ను చెల్లించినట్లయ్యింది. బైబ్యాక్‌కు రెడీ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలుకి ఇన్ఫోసిస్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో షేరుకీ రూ. 1,750 ధర మించకుండా 5.25 కోట్లకుపైగా షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు వెల్లడించింది. 1.23 శాతం వాటాకు సమానమైన వీటి కొనుగోలుకి రూ. 9,200 కోట్ల వరకూ వెచ్చించనుంది. ఫలితాలపై అంచనాల నేపథ్యంలో మంగళవారం ఇన్ఫోసిస్ షేరు ఎన్ఎస్ఈలో 1.6% క్షీణించి రూ. 1,403 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే బైబ్యాక్‌కు 25 శాతం ప్రీమియంను ప్రకటించడం గమనార్హం! ఇన్ఫీ అంతక్రితం 2019 ఆగస్ట్‌లో 11.05 కోట్ల ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ. 8,260 కోట్లు వెచ్చించింది. 2017 డిసెంబర్లో తొలిసారి షేరుకి రూ. 1,150 ధరలో బైబ్యాక్‌ను చేపట్టింది. తద్వారా 11.3 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. గైడెన్స్ భేష్..: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం 12–14 శాతం స్థాయిలో బలపడే వీలున్నట్లు ఇన్ఫోసిస్ తాజాగా అంచనా వేసింది. ఇది స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఇచ్చిన గైడెన్స్‌కాగా.. డివిడెండ్(రూ. 6,400 కోట్లు), బైబ్యాక్‌తో కలిపి వాటాదారులకు రూ. 15,600 కోట్లను తిరిగి చెల్లించనున్నట్లు తెలియజేసింది. తద్వారా వాటాదారులకు క్యాష్‌ఫ్లోలలో 85 శాతం వరకూ చెల్లించే విధానాలను పాటిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ వివరించారు. ఆర్డర్ బుక్ రికార్డు 2020–21లో భారీ డీల్స్ ఆర్డర్ల విలువ 57 శాతం జంప్‌చేసి 14.1 బిలియన్ డాలర్లను తాకినట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. వీటిలో 66 శాతం డీల్స్‌ను కొత్తగా కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డిసెంబర్లో కొత్త రికార్డును నెలకొల్పుతూ దైమ్లర్ ఏజీ నుంచి 3.2 బిలియన్ డాలర్ల(అంచనా) ఆర్డర్‌ను పొందింది. గతేడాది ఆగస్ట్‌లో వ్యాన్‌గార్డ్ నుంచి సంపాదించిన 1.5 బిలియన్ డాలర్ల కాంట్రాక్టుతో పోలిస్తే ఇది రెట్టింపు విలువకావడం విశేషం! క్యూ4లో సైతం 2.1 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులు కుదుర్చుకుంది. 25,000 మంది ఫ్రెషర్స్‌కు చాన్స్ గతేడాదిలో 36,500 మందిని ఇన్ఫోసిస్ కొత్తగా నియమించు కుంది. వీరిలో క్యాంపస్ నియామకాల ద్వారా 21,000 మందికి ఉపాధి కల్పించినట్లు సీవోవో యూబీ ప్రవీణ్ రావు పేర్కొన్నారు. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25,000 మంది ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు తెలియజేశారు. వీరిలో 1,000 మందిని విదేశీ క్యాంపస్‌ల ద్వారా నియమించుకోనున్నట్లు వివరించారు. క్యూ3లో 10.1 శాతంగా నమోదైన ఉద్యోగ వలస రేటు క్యూ4లో 15.2 శాతానికి ఎగసింది. మార్చికల్లా కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 2,59,619కు చేరింది. రూ. లక్ష కోట్లకు.. గతేడాది ఆదాయంలో రూ. లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాం. క్లయింట్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. కోబాల్ట్ టీఎం తదితర నైపుణ్యాల ద్వారా డిజిటల్ పోర్ట్‌ఫోలియోను పెంచుకుంటున్నాం. ఉద్యోగులకు అధికారాలు ఇవ్వడం ద్వారా గ్లోబల్ స్థాయిలో క్లయింట్లను ఆకట్టుకుంటున్నాం. భాగస్వామి ఎంపికలో క్లయింట్ల నుంచి ప్రాధాన్యతను సాధిస్తున్నాం. – ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ -
మారుతీ లాభం రూ.1,419 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) రూ.1,420 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,391 కోట్లతో పోలిస్తే 2 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం 10.34 శాతం వృద్ధి చెంది రూ. రూ.16,998 కోట్ల నుంచి రూ.18,756 కోట్లకు చేరింది. క్యూ2లో కొంత డిమాండ్ పుంజుకోవడం, సరఫరా పరిస్థితుల్లో క్రమంగా మెరుగుదల కారణంగా పనితీరు గాడిలో పడిందని కంపెనీ పేర్కొంది. స్టాండెలోన్‌గా చూస్తేక్యూ2లో కంపెనీ నికర లాభం స్వల్పంగా రూ.1,359 కోట్ల నుంచి రూ.1,372 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం 9.7 శాతం వృద్ధి చెంది రూ.17,689 కోట్లుగా నమోదైంది. అమ్మకాలు 16 శాతం అప్...: క్యూ2లో మారుతీ మొత్తం అమ్మకాలు 16.2 శాతం వృద్ధితో 3,93,130 యూనిట్లుగా నమోదయ్యాయి. దేశీ వాహన విక్రయాలు 18.6 శాతం పెరిగి 3,70,619 యూనిట్లకు ఎగబాకాయి. క్యూ2లో మొత్తం 22,511 వాహనాలను కంపెనీ ఎగుమతి చేసింది. 12.7 శాతం వృద్ధి సాధించింది. ‘తొలి త్రైమాసికంలో రెండు నెలల పాటు ఉత్పత్తి సున్నా స్థాయికి పడిపోయిన నేపథ్యంలో, దీంతో పోలిస్తే క్యూ2లో మెరుగైన పరిస్థితులు నెలకొన్నాయి. కోవిడ్–19 ప్రతికూలతలు నెమ్మదిగా సద్దుమణుగుతున్నాయి. మా ప్లాంట్లలో ఉత్పత్తి సాధారణ స్థాయికి చేరింది. గ్రామీణ ప్రాంతాల నుంచి రానున్న కాలంలో పటిష్టమైన వృద్ధిని ఆశిస్తున్నాం. వచ్చే కొద్ది నెలల్లో డిమాండ్ మెరుగైన స్థాయిలో నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో తక్షణం ప్రయాణికుల వాహనాలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను తగ్గించాల్సిన అవసరం లేదు’ అని కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు గురువారం బీఎస్ఈలో 1 శాతం క్షీణించి రూ.7,114 వద్ద స్థిరపడింది.