staff nurse
-
Hyderabad: రోడ్డు ప్రమాదంలో నర్సు మృతి
మూసాపేట: ఆసుపత్రికి స్కూటీపై వెళుతున్న స్టాఫ్ నర్స్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. జగద్గిరిగుట్టకు చెందిన ప్రశాంతి (37) భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేపీహెచ్‌బీ కాలనీలోని రవి హాస్పిటల్స్‌లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. శనివారం జగద్గిరిగుట్టలోని ఇంటి నుంచి ఆసుపత్రికి సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ నుండి వెళుతోంది. నెక్సాస్ షోరూమ్ వద్ద మలుపు వద్ద కూకట్పల్లి వైపు వేగంగా వెళుతున్న వెనుకనుంచి వచి్చన డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
మరో 1,890 స్టాఫ్ నర్స్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుతీరాక మొదటిసారిగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. మరో 1,890 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం శనివారం అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో 5,204 స్టాఫ్ నర్స్ ఖాళీల భర్తీకి గతేడాది డిసెంబర్లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టుల కోసం రాత పరీక్ష కూడా పూర్తయింది. 40 వేల మందికి పైగా పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో 1,890 స్టాఫ్ నర్స్ ఖాళీలను కూడా ప్రభుత్వం కలిపింది. దీంతో ఈ పరీక్ష ద్వారా మొత్తం 7,094 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్య సేవల నియామక బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి తెలిపారు. త్వరలో ఫలితాలు వెలువడతాయని ఆయన పేర్కొన్నారు. -
స్టాఫ్ నర్స్ పరీక్షకు కఠిన నిబంధనలు.. చెప్పులు మాత్రమే వేసుకోవాలి!
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల రెండో తేదీన నిర్వహిస్తోన్న స్టాఫ్ నర్స్ పోస్టుల పరీక్షకు కఠిన నిబంధనలు విధించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 40,936 మందికి 40 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో 24, ఖమ్మంలో 6, నిజామాబాద్‌లో 2, వరంగల్‌లో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కంప్యూటర్ ఆధారిత టెస్ట్ కాబట్టి ఆన్లైన్ సెంటర్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే రోజు మూడు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం సెషన్ పరీక్ష 9 గంటలకు ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు 7.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 8.45 గంటలకు గేట్ మూసేస్తారు. రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 11 గంటలకే చేరుకోవాలి. 12.15 గంటలకు గేట్ మూసేస్తారు. ఇక మూడో సెషన్ పరీక్ష సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుంది. దీనికి హాజరయ్యే అభ్యర్థులు మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్రానికి చేరుకోవాలి. 3.45 గంటలకు గేట్ మూసేస్తారు. అభ్యర్థుల సమాచారాన్ని బయోమెట్రిక్ పద్ధతిలో సేకరిస్తారు. కాబట్టి ముందస్తుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులకు సూచనలు అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌ను ఏ–4 సైజు పేపర్‌పై ప్రింటవుట్ తీసుకోవాలి. అభ్యర్థి ఫొటో, సంతకం స్పష్టంగా ఉంటేనే హాల్ టికెట్ చెల్లుబాటు అవుతుంది. హాల్ టికెట్, ఫొటో లేకుండా లేదా సంతకం లేకుండా ఉంటే అభ్యర్థి 3 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను తప్పనిసరిగా గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన ఒక హామీతో పాటు తీసుకురావాలి. పరీక్ష హాల్లోని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. లేని పక్షంలో అభ్యర్థిని పరీక్షకు అనుమతించరు. అభ్యర్థులు పాస్‌పోర్ట్/పాన్ కార్డ్/ఓటర్ ఐడీ/ఆధార్ కార్డ్/ ప్రభుత్వ ఉద్యోగి ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదో ఒక చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలి. రిజిస్ట్రేషన్ వద్ద అభ్యర్థుల బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరిస్తారు. కాబట్టి అభ్యర్థులు తమ చేతులపై మెహందీ, ఇంక్, టాటూలు వంటివి వేయించుకోవద్దు. గేట్ మూసివేసే సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు. అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రం, సెషన్లో మాత్రమే పరీక్ష రాయాలి. పరీక్షా కేంద్రం, సెషన్ మార్పు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. అభ్యర్థి పరీక్షా కేంద్రం లోపలకు హాల్ టికెట్, నలుపు/నీలం బాల్ పాయింట్ పెన్, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు మాత్రమే తీసుకెళ్లాలి. పారదర్శకమైన వాటర్ బాటిల్ తీసుకురావచ్చు. పరీక్ష హాలులో రఫ్ షీట్లను ఇన్విజిలేటర్ అందజేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే పోలీస్ కేసు అభ్యర్థులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యతిరేకిస్తే, అనర్హత వేటు వేయడమే కాకుండా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తారు. అభ్యర్థులు కాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు, టాబ్స్, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్, లాగ్ టేబుల్స్, వాలెట్, హ్యాండ్ బ్యాగ్‌లు, రైటింగ్ ప్యాడ్లు, నోట్స్, చార్ట్‌లు, లూజ్ షీట్లు లేదా మరే ఇతర గాడ్జెట్లను తీసుకురావడానికి అనుమతి లేదు. అలాగే ఇతర రికార్డింగ్ సాధనాలను అనుమతించరు. అభ్యర్థి చెప్పులు మాత్రమే ధరించి పరీక్షా కేంద్రానికి రావాలి. బూట్లు ధరించకూడదు. నిరీ్ణత సమయానికి ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రం నుంచి బయటకు పంపడానికి అనుమతించరు. ఖమ్మంలో ఓ పరీక్ష కేంద్రం మార్పు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మం పట్టణంలో ఒక్క పరీక్షా కేంద్రాన్ని మార్పు చేశారు. ప్రియదర్శిని మహిళా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరీక్ష నిర్వహించే స్థితిలో లేదు. కాబట్టి దానికి బదులుగా స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఖమ్మం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లలో పరీక్షలు జరుగుతాయి. హాల్ టికెట్ నంబర్లు అలాగే ఉంటాయి. పరీక్షా కేంద్రం మార్పును సూచించే సవరించిన హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలి. -
స్టాఫ్ నర్స్.. ఇక నర్సింగ్ ఆఫీసర్
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్సు హోదాను నర్సింగ్ ఆఫీసర్‌గా కేంద్ర ప్రభుత్వం మార్పు చేసింది. అలాగే అనేక నర్సింగ్ పోస్టుల హోదాలను మార్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎయిమ్స్, ఈఎస్ఐ, రైల్వే ఆసుపత్రులు సహా ఇతర ఆసుపత్రుల్లో కొత్త హోదాను అమలు చేస్తోంది. దీన్ని కొన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి. ఆ ప్రకారం తెలంగాణలోనూ నర్సింగ్ పోస్టుల్లో ఉన్న వారికి కొత్త హోదాలు ఇవ్వాలని నర్సులు కోరుతున్నారు. హోదాను మార్చడం వల్ల సమాజంలో గౌరవం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో కేంద్రం వీటిని తె చ్చింది. హోదాను మార్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికపరమైన భారం ఏమీ ఉండదంటున్నారు. బీఎస్సీ నాలుగేళ్లు, ఎంఎస్సీ రెండేళ్లు, పీహెచ్డీ ఏళ్లు చదివినా కూడా ప్రాథమికంగా స్టాఫ్ నర్సు పోస్టే ఉంటుంది. దీనివల్ల ఉన్నతస్థాయిలోని నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారు సరైన గౌరవం పొందలేకపోతున్నారని చెబుతున్నారు. ఆసుపత్రుల్లో అనేక విధానపరమైన నిర్ణయాల్లో డాక్టర్లు భాగస్వాములుగా ఉంటున్నారని, అధిపతులుగా కూడా వారే ఉంటున్నారన్న విమర్శలున్నాయి. ఇలా నర్సులపై వివక్ష కొనసాగుతోందన్న ఆందోళన ఉంది. పైగా నర్సింగ్ డైరెక్టరేట్ లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు నర్సులు చెబుతున్నారు. -
స్టాఫ్‌నర్స్ పోస్టులకూ ఆన్లైన్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్య శాఖలో వివిధ విభాగాల్లోని స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఆన్లైన్ విధానం(సీబీటీ)లో నిర్వహించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. పరీక్ష కోసం హైదరాబాద్‌తోపాటు, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌ల్లో సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకే రోజు రెండు సెషన్లలో.. ఉదయం సగం మందికి, సాయంత్రం సగం మందికి పరీక్ష నిర్వహిస్తారు. వైద్య, ఆరోగ్యశాఖ పరీక్ష పేపర్‌ను తయారు చేయగా, హైదరాబాద్ జేఎన్టీయూ పరీక్షలు నిర్వహిస్తుంది. ఒకట్రెండు నెలల్లో పరీక్ష జరిగే అవకాశం ఉందని సమాచారం. పేస్కేల్ పెరగడంతో భారీ డిమాండ్.. కాగా, స్టాఫ్‌నర్స్ పోస్టులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. 5,204 పోస్టులకు గాను ఇప్పటివరకు 40,936 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో స్టాఫ్‌నర్స్ పోస్టుకు ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ఈ పోస్టులకు పేస్కేల్ రూ. 36,750 – రూ. 1,06,990 మధ్య ఉండటంతో డిమాండ్ పెరిగింది. ఇప్పటికే వేలాది మంది అభ్యర్థులు కోచింగ్ తీసుకుంటున్నారు. రాత పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. అనాటమీ, ఫిజియాలజీల్లో 14 అంశాలు, మైక్రోబయాలజీలో ఆరు అంశాలు పరీక్ష సిలబస్‌లో ఉంటాయి. ఈ మేరకు అభ్యర్థులు తయారు కావాలని నిపుణులు సూచిస్తున్నారు. స్టాఫ్‌నర్సు రాత పరీక్ష సిలబస్ ఇదీ.. ఫస్ట్ ఎయిడ్, సైకాలజీ, సోషియాలజీ; ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్; కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్;ఎన్విరాన్మెంటల్ హైజీన్; హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్;న్యూట్రిషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్; మెంటల్ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్; మిడ్ వైఫరీ గైనకాలజికల్ నర్సింగ్; గైనకాలజియల్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్; నర్సింగ్ ఎడ్యుకేషన్;ఇంట్రడక్షన్ టు రీసెర్చ్; ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్; నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్ -
స్టాఫ్ నర్సు పోస్టుల ఫైనల్ మెరిట్ జాబితా విడుదల
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీలో భాగంగా ఫైనల్ మెరిట్ జాబితాను జోన్– 2, 3, 4లలో విడుదల చేశారు. జోన్–1లో ఫైనల్ మెరిట్ జాబితా విడుదల కావాల్సి ఉంది. 957 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి గత నెల మొదటి వారంలో వైద్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు జోన్లలో 40 వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా జోన్–2లో 12,295 మంది ఉన్నారు. ఫైనల్ మెరిట్ జాబితా వెలువడిన నేపథ్యంలో ఈ వారంలో ఎంపికైన అభ్యర్థుల జాబితాలను విడుదల చేసి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది. -
తెలంగాణ: ఐదువేల స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగ నియామకాల్లో భాగంగా.. మరో భారీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఐదు వేల స్టాఫ్ నర్స్ పోస్టులకు శుక్రవారం నోటిఫికేషన్‌కు జారీ చేసింది తెలంగాణ సర్కార్. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేపట్టనుంది. మొత్తం 5,204 స్టాఫ్ నర్సు పోస్టులకు తెలంగాణలో నోటిఫికేషన్ జారీ అయ్యింది. జనవరి 25వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. -
సేవలు చేయించుకుని రోడ్డుపై పడేస్తారా?
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టకాలంలో ఏడాది పాటు సేవలు చేయించుకుని ఇప్పుడు 1,640 మంది ఔట్సోర్సింగ్ స్టాఫ్‌నర్సులను నడిరోడ్డుపై పడేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి జె. గీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు దేవుళ్లతో సమానం అన్న కేసీఆర్‌కు నర్సులు దేవతల్లా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వెంటనే స్టాఫ్‌నర్సులను పునఃనియమించాలని, లేదంటే వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. తమను విధుల్లోకి తీసుకోవాలని స్టాఫ్‌నర్సులు శుక్రవారం గాంధీభవన్‌లో చేపట్టిన దీక్షను గీతారెడ్డి విరమింపజేశారు. ఈ సందర్భంగా గీతా రెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి, మానవత్వం ఉంటే ఈ ఆడబిడ్డలకు న్యాయం చేయాలని కోరారు. స్టాఫ్‌నర్సులను ప్రభుత్వం 10 రోజుల్లోగా విధుల్లోకి తీసుకోకుంటే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని, అధికార పార్టీ నేతలను అడ్డుకుంటామని యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి హెచ్చరించారు. కాగా, దీక్ష విరమణ సందర్భంగా గీతారెడ్డితో మాట్లాడుతూ స్టాఫ్‌నర్సులు కంటతడి పెట్టుకున్నారు. -
శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ).. శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 22 ► పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్సు–20, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్–2 ► స్టాఫ్ నర్సు: అర్హత: బీఎస్సీ(నర్సింగ్)/ జీఎన్ఎం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవంతోపాటు నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. వేతనం: నెలకు రూ.34,000 చెల్లిస్తారు. ► ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్: అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవంతోపాటు నర్సింగ్ హోం నుంచి రెండేళ్ల ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. వేతనం నెలకు రూ.14,250 చెల్లిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్, జీజీహెచ్, శ్రీకాకుళం చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 11.06.2021 ► వెబ్సైట్: https://srikakulam.ap.gov.in/notice_category/recruitment/ మరిన్ని నోటిఫికేషన్లు: సదరన్ రైల్వేలో అప్రెంటిస్ ఖాళీలు బెల్లో ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు ఎన్ఎఫ్సీ, హైదరాబాద్‌లో ఐటీఐ అప్రెంటిస్‌లు -
కరోనా వ్యాక్సిన్: స్టాఫ్ నర్సుకు తీవ్ర అస్వస్థత
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు)/అంబాజీపేట: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న స్టాఫ్ నర్సు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. మచిలీపట్నం ఆంధ్రా ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న పద్మజ శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో అదే ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. మధ్యాహ్నం 1.30 సమయంలో ఫిట్స్‌లా వచ్చి కళ్లు తిరిగి కింద పడిపోయింది. శ్వాస తీసుకోవడంలో ఆమెకు ఇబ్బంది ఏర్పడింది. తీవ్ర అస్వస్థత పాలైన ఆమెను వెంటనే అదే ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందజేస్తున్నారు. ఆమెకు ఎటువంటి ప్రాణాపాయం లేదని, మెరుగైన చికిత్స అందజేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ ఎం.సుహాసిని తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆళ్ల నాని ఆరా.. కరోనా వ్యాక్సిన్‌తో అస్వస్థతకు గురైన స్టాప్ నర్సు, జి.కొండూరు అంగన్వాడీ వర్కర్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం ఆరా తీశారు. స్టాఫ్ నర్సు పద్మజ ఆరోగ్య పరిస్థితిని కృష్ణా జిల్లా డీఎంహెచ్‌ఎంవో డాక్టర్ సహాసినిని ఫోన్లో అడిగి తెలుసుకున్నారు.ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని డీఎంహెచ్‌ఎంవో తెలిపారు. అంగన్వాడీ ఆయాకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అదేశించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారానికి ల్యాబ్ టెక్నీషియన్ మృతి ఇదిలా ఉండగా, వ్యాక్సిన్ తీసుకున్న ఓ ల్యాబ్ టెక్నీషియన్ వారం తరువాత మరణించిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. అంబాజీపేట మండలంలోని మాచవరం అగ్రహారం శివారు అంబేడ్కర్ నగర్‌కు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ సరెళ్ల శ్రీనివాస్(45) ఈ నెల 22న అమలాపురం ఏరియా ఆస్పత్రిలో కోవిడ్–19 వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఉన్నట్టుండీ శుక్రవారం అతను కన్నుమూశాడు. వ్యాక్సిన్ వికటించడం వల్లే చనిపోయాడని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. 24వ తేదీ నుంచి జ్వరంతోపాటు ఒంటిపై దద్దుర్లు వచ్చాయని చెప్పారు. దీనిపై అమలాపురం అడిషనల్ డీఎంహెచ్‌వో పుష్కరరావు, వైద్యాధికారి డీవీ సత్యంలు మృతుడి ఇంటికెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే వ్యాక్సిన్ వల్ల చనిపోయాడా లేదా అనే విషయం తెలుస్తుందని వారు చెప్పారు. -
ఏంటి డాక్టర్ ఇదీ..
కాకినాడ క్రైం: డబ్బులు తీసుకొని కరోనా పరీక్షలు చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న సీనియర్ స్టాఫ్ నర్సుకు కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు అండదండలు అందించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అరెస్టు వరకు వెళ్లిన కిట్ల వ్యవహారంలో, నేరుగా పోలీసులే ఆ స్టాఫ్ నర్సు పేరును ప్రస్తావించారు. అదీ కాక, నర్సుల డిప్యుటేషన్లలో ఆమె ఒక్కో నర్సు నుంచి రూ.పది వేల వరకు వసూలు చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. దానిపై నర్సులందరూ కలసి ఆమెపై నేరుగా సూపరింటెండెంట్‌కే ఫిర్యాదు చేశారు. ఇన్ని వివాదాల మధ్య ఆమె పేరును పంద్రాగస్టు వేడుకల్లో ఇచ్చే ప్రశంసాపత్రానికి జీజీహెచ్ సూపరింటెండెంట్ సిఫారసు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. కరోనా పరీక్షల కోసం ఆ స్టాఫ్ నర్సుతో పాటు అవుట్సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై సూపరింటెండెంట్ స్తబ్దుగా ఉన్నారు. ఎటువంటి విచారణకు ఆదేశించలేదు. మరే చర్యలూ లేవు. కిట్ల దుర్వినియోగంపై ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉన్నా చేయలేదు. విచారించే అవకాశం పోలీసులకూ ఇవ్వలేదు. ఫిర్యాదు అంశాన్ని ఒకటో పట్టణ సీఐ రామ్మోహనరెడ్డి వద్ద ప్రస్తావిస్తే తమకు ర్యాపిడ్ కిట్ల దుర్వినియోగంపై సూపరింటెండెంట్ నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. ఇన్ని వివాదాల మధ్య తాఖీదులు ఇవ్వవలసిన స్టాఫ్ నర్సుకి ప్రశంసాపత్రం ఇవ్వాలని సిఫారసు చేయడం పలు అనుమానాలకు తావివ్వడమే కాకుండా, తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. -
యశోద ఆస్పత్రి స్టాఫ్ నర్సు ఆత్మహత్య
రాంగోపాల్‌పేట్: యశోద ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మార్కెట్ పోలీసుల సమాచారం మేరకు... నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం కమ్మగడ్డకు చెందిన రామన్న కుమార్తె సౌందర్య(26). నాలుగు సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఆమె స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ ఇక్కడే ఉండే హాస్టల్లో నివసిస్తుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆమె విధులు ముగించుకుని ఆస్పత్రి వెనుకవైపు ఉన్న హాస్టల్ గదికి వచ్చింది. రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్‌కు వచ్చిన మిగతా నర్సులు ఆమె నుంచి ఎలాంటి స్పందనను గమనించలేదు. ఆమెను పరిశీలించగా పక్కనే మత్తు ఇచ్చే ఇంజక్షన్ పడివుండటంతో పాటు చనిపోయి ఉంది. దీంతో వారు ఆస్పత్రి సిబ్బందికి అక్కడికి చేరుకుని మార్కెట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నర్సు ఆత్మహత్యకు కారణాలు వెల్లడి కాలేదని పోలీసులు తెలిపారు. ఆమె ఉపయోగించిన ఫోన్‌కు లాక్ ఉండటంతో దాన్ని తెరవడం సాధ్యం కాలేదు. సాయంత్రం 7 గంటల సమయంలో ఆత్మహత్య చేసికుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఉస్మానియాలో 3వ రోజు కొనసాగుతున్న నర్సుల ధర్నా
సాక్షి, హైదరాబాద్ : జీతాలు ఇవ్వడం లేదంటూ ఉస్మానియా ఆసుపత్రిలో నర్సులు చేపట్టిన దర్నా మూడో రోజుకు చేరుకుంది. నాలుగు నెలలుగా జీతం ఇవ్వడం లేదంటూ 87 మంది స్టాఫ్ నర్సులు విధులు బహిష్కరించారు. దీంతో గత మూడు రోజులుగా 12 ముఖ్య విభాగాల్లో సేవలు కుంటుపడ్డాయి. అవుట్సోర్సింగ్ కింద నాలుగు నెలల క్రితమే ఉద్యోగంలో చేరినా ఇప్పటివరకు దీనికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తక్షణమే అవుట్సోర్సింగ్ లెటర్‌తో పాటు, ఐడీ కార్డు, రెండు నెలల జీతం ఇస్తేనే విదులకు హాజరవుతామని డిమాండ్ చేస్తున్నారు. నర్సుల ఆందోళనలతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీ, ఎమర్జెన్సీ, ఐసోలేషన్ వార్డులు, పోస్టు ఆపరేటివ్ వార్డుల్లో రోగులు తీద్ర ఇబ్బందులు పడుతున్నారు. -
గాంధీ ఆస్పత్రి నర్సింగ్ సిబ్బంది సమ్మె
సాక్షి, సికింద్రాబాద్: కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో బుధవారం నుంచి విధులను బహిష్కరించనున్నట్లు అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులు మంగళవారం సమ్మె నోటీస్ ఇచ్చారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, రెగ్యులరైజ్ చేయాలని లేదా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 13 ఏళ్లుగా 200 స్టాఫ్‌నర్సులు అవుట్ సోర్సింగ్ పద్ధతిని విధులు నిర్వహిస్తున్నారు. ప్రతినెల వేతనాలు కూడా సక్రమంగా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రాణాలకు తెగించి కోవిడ్ విధులు నిర్వహిస్తున్న తమ సేవలను ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు గుర్తించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రూ.17,500 మాత్రమే వేతనం చెల్లిస్తున్నారని తెలిపారు. పారిశుధ్య కార్మికులకు రూ.7,500 ఇన్సెంటివ్ ప్రకటించిన ప్రభుత్వం తమకు కంటితుడుపు చర్యగా కేవలం 10 శాతం ఇన్సెంటివ్ ప్రకటించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్ సోర్సింగ్ స్టాఫ్‌నర్సులకు రూ.23,000 ఇవ్వాల్సి ఉన్నా నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న కొందరికి మాత్రమే అది వర్తింపజేస్తున్నారని చెప్పారు. తక్షణమే తమను రెగ్యులరైజ్ చేయాలని లేదా కాంట్రాక్టు పద్దతిలో విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం గాంధీ ఆస్పత్రి ఇన్‌వార్డులో సమ్మె నోటీస్ అందించినట్లు అవుట్ సోర్సింగ్ స్టాఫ్‌నర్సుల యూనియన్ ప్రతిని ధులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్‌లో 200, రెగ్యులర్ స్టాఫ్‌నర్సులు 150 మంది విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది విధులు బహిష్కరిస్తే కోవి డ్ విధులకు తీవ్ర ఆటంకం కలగవచ్చని ఆస్పత్రికి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ఇది చదవండి: ఉస్మానియా ఆస్పత్రిలో కలకలం -
స్టాఫ్‌నర్స్‌కు కరోనా అవాస్తవం
సాక్షి, అనంతపురం: జిల్లాలో కొత్తగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ఇందులో ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ మేరకు ఆదివారం కలెక్టర్ గంధం చంద్రుడు అధికారికంగా తెలిపారు. కాగా ఆదివారం నమోదైన మూడు పాజిటివ్ కేసులు సైతం హిందూపురానికి చెందినవే కావడం గమనార్హం. దీంతో కలెక్టర్ హిందూపురంలోని టిప్పు ఖాన్ స్ట్రీట్, హెచ్‌బీ కాలనీ, హస్నాబాద్, ముక్కిడిపేటతో పాటు లేపాక్షిని కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ ఐదు ప్రాంతాల్లోని ప్రజలు కొన్ని రోజుల పాటు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. (దేదీప్యమానంగా..) 48 మందికి పరీక్షలు.. వైద్య కళాశాలలోని వీఆర్డీఎల్లో 48 మందికి ఆదివారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందులో కర్నూలు జిల్లాకు చెందిన వారు 33 ఉండగా.. అనంతపురం జిల్లాకు చెందిన వారు 15 మంది ఉన్నారు. మరోవైపు ఆదివారం సర్వజనాస్పత్రిలో కరోనా అనుమానిత లక్షణాలతో 15 మంది అడ్మిట్‌కాగా, ఆస్పత్రిలోని ఐసోలేషన్, క్వారన్టైన్ తదితర వార్డుల్లో 48 మంది ఉన్నారు. కరోనా అనుమానిత, పాజిటివ్ వ్యక్తుల కాంటాక్ట్, కోవిడ్ ప్రాంతాల నుంచి వచ్చిన 56 మందిని జిల్లాలోని వివిధ క్వారన్టైన్ కేంద్రాలకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.(కరోనా భయం వీడండి ) జిల్లాను నాలుగు జోన్లుగా ఏర్పాటు చేయాలి అనంతపురం అర్బన్: జిల్లాను నాలుగు జోన్లుగా విభజించి ప్రొటోకాల్ ప్రకారం కరోనా బాధితులకు చికిత్సలు అందించేలా చూడాలని కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన కలెక్టరేట్లోని ఎన్ఐసీ నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోని అన్ని ప్రాంతాలను గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ జోన్లుగా ఏర్పాటు చేయాలన్నారు. కరోనా పాజిటివ్ కేసులు ఉండే ప్రాంతం రెడ్ జోన్ పరిధిలోకి వస్తుందని, ఈ జోన్లో లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలన్నారు. వైద్యులకు షిఫ్ట్ వారీగా డ్యూటీ వేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ లక్షణాలున్నట్లు అనిపిస్తే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ నిర్ధారణ కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రి, హిందూపురం ప్రభుత్వాస్పత్రి, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆ వివరాలను 8500292992, 08554–220009 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అంతకుముందు కలెక్టర్, ఎస్పీలు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. స్టాఫ్‌నర్స్‌కు కరోనా అవాస్తవం.. అనంతపురం సర్వజనాస్పత్రిలో పనిచేస్తున్న స్టాఫ్‌నర్స్‌కు కరోనా సోకినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను కలెక్టర్ గంధం చంద్రుడు ఖండించారు. ఆమెకు కరోనా లేదని తేలి్చచెప్పారు. ఇలాంటి అవాస్తవాలను ప్రజలను నమ్మవద్దన్నారు. -
స్టాఫ్ నర్సులను వేధిస్తున్న డాక్టర్
-
స్టాఫ్ నర్సు ఆత్మహత్యాయత్నం
అమలాపురం టౌన్: స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో స్టాఫ్ నర్సు నాగలక్ష్మి శుక్రవారం సాయంత్రం ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో గురువారం ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇదే ఆస్పత్రిలోని డేటా ఎంట్రీ ఆపరేటర్ తనపట్ల దురుసుగా ప్రవర్తించాడని, అతడితో క్షమాపణ చెప్పించాలని ఆమె గురువారం డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆమెను కొంచెం మందలించారు. ఇప్పటికే తనను సూపరింటెండెంట్ వేధిస్తున్నారని ఆరోపిస్తున్న నాగలక్ష్మి ఈ సంఘటనతో అదే ఆరోపణలతో స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమెతో ఫిర్యాదును ఉపసంహరింపజేసేందుకు రాజీ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరకు తనకు న్యాయం జరగలేదన్న మనస్తాపంతో శుక్రవారం సాయంత్రం అదే ఆస్పత్రిలో స్టాఫ్ నర్సు నాగలక్ష్మి కాల్షియం, గ్యాస్‌కు సంబంధించిన మందు బిళ్లలను అధిక మోతాదులో మింగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడింది. తక్షణమే ఆమెకు అదే ఆస్పత్రి వైద్యులు అత్యవరస వైద్యం అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సూపరింటెండెంట్ వేధిస్తున్నారంటూ స్టాప్ నర్సు నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్సై వి.శ్రీనివాసరావు, సీఐ జి.సురేష్‌బాబు తెలిపారు. -
ఏ కష్టమొచ్చిందో...
పాలకొండ రూరల్: అప్పటి వరకు రోగులకు సేవలు చేస్తూనే ఉంది.. విధి నిర్వహణలో భాగంగా వైద్యులకు సహాయమందించింది.. అంతలో ఏమైందో.. ఏ కష్టం ఆమెను కుంగదీసిందో గానీ ఆస్పత్రి డ్యూటీ రూమ్‌లోనే స్పాఫ్‌నర్స్ బలవన్మరణానికి పాల్పడింది.. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులతోపాటు సహచర ఉధ్యోగులు కన్నీటిపర్యంతమయ్యారు. పాలకొండ వంద పడకల ఏరియా ఆస్పత్రిలో కాకర్ల హేమలత (32) 2016 నుంచి స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్నారు. స్వగ్రామమైన రాజాం నుంచి నిత్యం విధి నిర్వహణలో భాగంగా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఎప్పటిలాగే బీ–షిఫ్ట్ విధులకు మధ్యాహ్నం రెండు గంటలకు ఆస్పత్రికి చేరుకున్న ఆమె సాయంత్రం వరకు యధావిధిగా విధులు నిర్వహించారు. తమతో మామూలుగానే వ్యవహరించిందని సహచర నర్సులు, డ్యూటీ డాక్టర్లు చెబుతున్నారు. సాయంత్రం 4.30 గంటలకు తన డ్యూటీ రూమ్‌కు వెళ్లిన ఆమె గంట వరకు బయటకు రాలేదు. ఈ క్రమంలో మృతురాలి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఎప్పటికీ స్పందించకపోవటంతో కుటుంబీకులు సహచర సిబ్బందికి ఫోన్ చేశారు. ఆస్పత్రి సిబ్బంది డ్యూటీలో ఉన్న వైద్యాధికారి డి.వి.శ్రీనివాస్‌కు ఈ విషయం తెలియజేశారు. తక్షణమే స్పందించిన వైద్యాధికారి ఆమె ఉన్న గది వద్దకు వెళ్లి తలుపును తట్టారు. ఎంతకూ తలు పు తీయకపోవటంతో కిటికి నుంచి చూడగా హేమలత ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే గది తలుపులు తెరచి ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. శోక సముద్రంగా మారిన ఆస్పత్రి... అప్పటి వరకు తమతో మామూలుగా విధులు చేపట్టిన హేమలత ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకున్న సహోద్యోగులు శోక సముద్రంలోకి మునిగిపోయారు. ఈ హఠాత్ పరిణామంతో ఖిన్నులైపోయారు. ఏం కష్టం వచ్చిందోనని రోదించారు. విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ జె.రవీంద్రకుమార్, స్త్రీవైద్య నిపుణురాలు భారతి ఆస్పత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. గుండెలు బాదుకున్న కుటుంబ సభ్యులు రాజాం నగర పంచాయితీ లచ్చయ్య పేటలో నివాసముంటున్న సూరయ్య, సరస్వతి దంపతులకు ఆరుగురు కుమార్తెలు. వీరిలో ఆఖరి కుమార్తె హేమలత. కుటుంబానికి ఎంతో ఆసరాగా మెలిగేదని, ఎందుకిలా చేసిందో తెలీడం లేదని మృతురాలి పెద్దక్క పుణ్యవతి గుండెలు బాదుకుని రోదించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై సనపల బాలరాజు సిబ్బందితో సహా ఘటనా స్థలానికి చేరకుని మృతదేహం ఉన్న తీరును పరిశీలించారు. అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించిందని, అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని, బతకాలని లేదని రాసి ఉన్నట్లు వార్తలు వినిపించాయి. దీనిని పోలీసులు ధ్రువీకరించలేదు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై స్పష్టం చేశారు. లచ్చయ్యపేటలో విషాదఛాయలు రాజాం సిటీ: రాజాం నగర పంచాయతీ పరిధి లచ్చయ్యపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. లచ్చయ్యపేటకు చెందిన కాకర్ల హేమలత (33) పాలకొండ ఏరియా ఆస్పత్రిలో గురువారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు పాలకొండ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమె మృతితో లచ్చయ్యపేటవాసులు విచారంలో మునిగిపోయారు. -
ప్రభుత్వాస్పత్రిలో స్టాఫ్‌నర్స్ ఆత్మహత్య
పాలకొండ రూరల్: శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ వంద పడకల ఏరియా ఆసుపత్రిలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్న కాకర్ల హేమలత (32) గురువారం ఆసుపత్రిలోని డ్యూటీ రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం 4:30 గంటలకు తన డ్యూటీ రూమ్‌కు వెళ్లిన ఆమె గంట వరకు బయటకు రాలేదు. ఈ క్రమంలో హేమలత కుటుంబసభ్యులు ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు. దీంతో వారు సహచర సిబ్బందికి ఫోన్ చేశారు. సహచరులు డ్యూటీ రూమ్ కిటికీ నుంచి చూడగా హేమలత ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించిందని, అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉన్నట్లు తెలిసింది. అయితే దీన్ని పోలీసులు ధృవీకరించలేదు. -
వైద్యశాఖకు అవినీతి జబ్బు
సాక్షి, నెల్లూరు: అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రక్షాళన చేస్తున్నా ఆశించిన ఫలితాలు కానరావడంలేదు. వైద్యశాఖ అధికారులు, ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఇటీవల ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో స్పందించిన కలెక్టర్ శేషగిరిబాబు బాధ్యులైన ఉన్నతాధికారిపై వేటేశారు. డీఎంహెచ్ఓ వరసుందరాన్ని డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేశారు. ఓ వైపు ప్రక్షాళన చేస్తున్నా వైద్యశాఖ కార్యాలయంలో మార్పు రావడం లేదు. పనిచేసే వారికి పనిష్మెంట్లు ఇస్తూ, చేయని వారిని అందలమెక్కిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజీనామా చేసిన మహిళకే పోస్ట్ ఇచ్చేందుకు యత్నం ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తూ రాజీనామా చేసిన మహిళకే మరోసారి పోస్టింగ్ ఇచ్చేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాధికారులు యత్నాలు చేస్తున్నారు. 2010లో ఎన్ఆర్హెచ్ఎం (జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్) ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసేందుకు స్టాఫ్‌నర్స్‌ల పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టారు. ఇందులో భాగంగా ముత్తుకూరు పీహెచ్సీలో స్టాఫ్‌నర్స్ పోస్ట్ కోసం ముగ్గురు మహిళలు దరఖాస్తు చేసుకోగా, అందులో అర్హత ఉన్న ఒకర్ని నియమించారు. అయితే సదరు మహిళ ఆర్నెల్ల పాటు సక్రమంగా విధులు నిర్వర్తించి ఆపై తరచూ విధులకు గైర్హాజరయ్యేవారు. ఇలా నాలుగేళ్ల పాటు కొనసాగింది. చివరికి సదరు మహిళ 2014లో రాజీనామా చేశారు. దీంతో అక్కడి పీహెచ్సీలో స్టాఫ్‌నర్స్ లేక ఇబ్బందులు నెలకొన్నాయి. విషయాన్ని గుర్తించిన అక్కడి పీహెచ్సీ వైద్యాధికారి, హెచ్‌డీఎస్ చైర్మన్ ముత్తుకూరు పీహెచ్సీలో స్టాఫ్‌నర్స్‌ను వెంటనే నియమించాలని జిల్లా అధికారులను కోరినా ఫలితం లేకుండాపోయింది. ఇదే పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న ముగ్గురు మహిళల్లో అర్హత కలిగిన కామాక్షమ్మ ఖాళీ అయిన స్టాఫ్‌నర్స్ పోస్ట్‌ను తనకు ఇవ్వాలంటూ అధికారులకు విన్నవించుకున్నారు. వాస్తవానికి రోస్టర్ ప్రకారం కామాక్షమ్మనే నియమించాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కామాక్షమ్మకు పోస్ట్ ఇవ్వమని తెగేసిచెప్పారు. రాజీనామా చేసిన స్టాఫ్ నర్స్ తిరిగి పోస్ట్ కోసం వైద్య ఆరోగ్య కార్యాలయంలో రూ.ఐదు లక్షల వరకు ముట్టజెప్పారని సమాచారం. ఈ క్రమంలోనే డీఎంహెచ్ఓ కార్యాలయాధికారులు ముత్తుకూరు పీహెచ్సీ వైద్యాధికారిని రాజీనామా చేసిన స్టాఫ్‌నర్స్‌కు ఆరోగ్యం బాగొలేని కారణంగా సెలవు పెట్టిందని లెటర్ రాసివ్వాలని కోరగా, అందుకు ఆ వైద్యాధికారి ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల క్రితం పోస్ట్ ఇచ్చేందుకు డీఎంహెచ్ఓ కార్యాలయం వారు జేసీకి ఫైల్ పెట్టగా తిరస్కరించారు. పనిచేసే వారికే శిక్ష పనిచేసే వారికేమో పనిష్మెంట్లు.. చేయని వారినేమో అందలమెక్కించడం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాధికారుల తీరుగా మారింది. గండిపాళెం పీహెచ్సీలో రెండో ఏఎన్ఎంగా విధులు నిర్వరిస్తున్న జమ్మాయమ్మపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా అనవసరంగా అదే పీహెచ్‌సీకి సంబంధించిన ఎస్వీ చింతాల సబ్సెంటర్కు ఇటీవల బదిలీ చేశారు. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై అధికారులు దృష్టి సారిస్తే మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఆ శాఖలోని ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. పోస్టింగ్‌లు, డిప్యుటేషన్లు, ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్లు, తదితర అంశాలకు సంబంధించిన ఫైళ్లను లోతుగా పరిశీలిస్తే అవినీతిపరుల భరతం పట్టే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. డిప్యుటేషన్ల రద్దు ఒట్టి మాటే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి సంబంధించి అడ్డగోలుగా జరిగిన డిప్యుటేషన్లను రద్దు చేస్తున్నట్లు గత డీఎంహెచ్ఓ వరసుందరం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ముడుపులివ్వని కొందరి డిప్యుటేషన్లను మాత్రమే రద్దు చేశారు. ముడుపులిచ్చిన దాదాపు 25 మంది వారు కోరుకున్న స్థానాల్లో డిప్యుటేషన్‌పై ఇప్పటికీ కొనసాగుతున్నారు. వీరిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో దాదాపు 10 మందికిపైగా, బయట పీహెచ్‌సీల్లో 15 మంది వరకు కొనసాగుతున్నట్లు సమాచారం. ఉదయగిరిలో ఒకే పోస్ట్‌లో ఇద్దరు ఉద్యోగులను నియమించి పనిచేయిస్తున్నారు. -
సేవ చేస్తే దాడులా..?
అనంతపురం న్యూసిటీ: సిబ్బంది కొరతతో పనిభారం అధికంగా ఉన్నా ఓర్చుకుని సేవలందిస్తున్న తమపైనే దాడి చేస్తారా అంటూ స్టాఫ్‌నర్సులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాఫ్‌నర్స్ విజయనిర్మలపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ శుక్రవారం సర్వజనాస్పత్రి ఓపీ బ్లాక్‌ను మూసేసి ధర్నా చేశారు. ఈ నెల ఆరో తేదీ రాత్రి ఆస్పత్రిలోని ఎంఎస్ 3 వార్డులో స్టాఫ్‌నర్సు విజయనిర్మలపై పేషెంట్ కుటుంబసభ్యులు దాడి చేసిన విషయం విదితమే. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ డౌన్ డౌన్, దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి అంటూ నినాదాలు చేశారు. స్టాఫ్‌నర్సు అసోసియేషన్ అధ్యక్షురాలు ఆర్బీ పద్మ మాట్లాడుతూ ఆస్పత్రిలో సిబ్బంది బండెడు చాకిరీ మీద వేసుకుని చేస్తున్నా రోగులు, వారి సహాయకులు తమపై దాడులకు పాల్పడడం తగదన్నారు. వందమంది రోగులకు ఒకే స్టాఫ్‌నర్సు సేవలందించాల్సిన దయనీయ పరిస్థితి ఉందన్నారు. స్టాఫ్‌నర్స్‌లకు రక్షణ కరువు సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని అసోసియేషన్ అధ్యక్షురాలు ఆర్బీ పద్మ ధ్వజమెత్తారు. చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయిందన్నారు. ఆస్పత్రిలో సెక్యూరిటీ విభాగం విఫలమైందని, స్టాఫ్‌నర్సులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ నాయకురాళ్లు రజిని, మంజుల, భాగ్యరాణి, కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్సు అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ స్టాఫ్‌నర్సులపై కత్తులతో దాడి చేసినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. సెక్యురిటీ గార్డులు ప్రేక్షకపాత్ర వహించడం మినహా చేసేదేమీ లేదన్నారు. గతంలో తక్కువ సంఖ్యలో హోంగార్డులున్నా ఎటువంటి సమస్యా తలెత్తలేదన్నారు. విజయనిర్మలపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ నిర్మల, స్టాఫ్‌నర్సు అసోసియేషన్ నాయకురాళ్లు లత, త్రివేణి, నారాయణస్వామి, స్టాఫ్‌నర్సులు మేరీ సుజాత, శోభ, అనిత, సుజిత, ప్రవీణ, హెడ్‌నర్సులు తదితరులు పాల్గొన్నారు. అమానుష చర్య స్టాఫ్‌నర్సుపై దాడి చేయడం అమానుష చర్య అని ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆస్పత్రి చరిత్రలో ఎన్నడూ ఇటువంటి సంఘటన చోటు చేసుకోలేదన్నారు. స్టాఫ్‌నర్స్‌పై దాడి చాలా బాధకరమన్నారు. దీనిపై ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు సర్వజనాస్పత్రి స్టాఫ్‌నర్స్ విజయనిర్మలపై దాడి చేసిన రామాంజనేయులుపై చర్యలు తీసుకోవాలని స్టాఫ్‌నర్సు అసోసియేషన్ నాయకురాళ్లు అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం డీపీఓ కార్యాలయంలో ఆమెకి వినతిపత్రం అందజేశారు. ఆస్పత్రిలో సెక్యూరిటీ పెంచాలని కోరారు. ఇందుకు ఏఎస్పీ స్పందిస్తూ రాత్రి వేళల్లో మరో కానిస్టేబుల్‌ను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో మరింత భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్టాఫ్‌నర్సు అసోసియేషన్ అధ్యక్ష, కోశాధికారులు ఆర్బీ పద్మ, రజిని, నాయకులు నారాయణస్వామి, మంజుల, లత, స్టాఫ్‌నర్స్ విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు. -
స్వీపర్లే.. స్టాఫ్‌నర్సులు
కోవెలకుంట్ల: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న స్వీపర్లు స్టాఫ్‌నర్సుల అవతారమెత్తారు. క్షతగాత్రులు, వివిధ సంఘటనల్లో గాయపడిన వ్యక్తుల చేయి కూడా ఇక్కడ పనిచేస్తున్న కొందరు స్టాఫ్ నర్సులు పట్టుకోకపోవడంతో అత్యవసర సేవలకు స్వీపర్లే దిక్కయ్యారు. కోవెలకుంట్ల సీహెచ్‌సీ ద్వారా మండలంతోపాటు సంజామల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాలకు చెందిన రోగులకు ఓపీ, అత్యవసర వైద్య సేవలందాల్సి ఉంది. కోవెలకుంట్ల నుంచి నంద్యాల, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు, కర్నూలు, అవుకు, తదితర ప్రధాన రహదారులు ఉండటంతో ఈ మార్గాల్లో తరుచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సీహెచ్‌సీకి తరలిస్తుంటారు. విలువైన ప్రాణాలతో చెలగాటం: రెండు రోజుల క్రితం సంజామలకు చెందిన ఓ వ్యక్తికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సీహెచ్‌సీలో అత్యవసర చికిత్స విభాగానికి తరలించారు. ఇక్కడ పని చేస్తున్న నిర్మల జ్యోతి అనే స్టాఫ్‌నర్స్ నైట్ డ్యూటీ నిర్వహిస్తోంది. తలకు గాయమైన వ్యక్తికి స్టాఫ్‌నర్స్ వైద్య సేవలు అందించాల్సి ఉండగా గాయాన్ని పరిశీలించడంతోపాటు కట్టుకట్టే వరకు వైద్య చికిత్సలన్నీ అక్కడే ఉన్న స్వీపర్‌తో చేయించింది. గదిలో కూర్చున్న స్టాఫ్ నర్స్ చివరకు వచ్చి రెండు ఇంజక్షన్లు వేసి వెళ్లిపోయింది. అత్యవసర వైద్య చికిత్స విభాగం డాక్టర్‌తోపాటు స్టాఫ్‌నర్స్ వైద్యసేవలందించాల్సి ఉంది. కాని డాక్టర్ అందుబాటులో లేకపోగా ఉన్న స్టాఫ్‌నర్సు వైద్యసేవలందించకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఈ ఒక్క బాధితుడికే కాదు ప్రతి రోజు ఆసుపత్రికి వచ్చే బాధితులకు ఇలాగే జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. శరీర అవయవాలకు గాయాలై ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులకు సకాలంలో వైద్య సేవలందించి ప్రాణభిక్ష పెట్టాల్సిన వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తుండటంతో వచ్చిరాని వైద్యంతో స్వీపర్లు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై సీహెచ్‌సీ ఇన్చార్జ్ డాక్టర్ జఫురుల్లాను వివరణ కోరగా స్వీపర్లు వైద్య సేవలందిస్తున్న సంఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
అమానవీయం..!
ఉద్యోగం అంటే టైమ్ టు టైమ్ జాబ్. అయితే రెవెన్యూ లాంటి కొన్ని శాఖల్లో అలా సమయపాలన కుదరదు. పని ఉంటే అహోరాత్రులూ పనిచేయాల్సి రావచ్చు. ముఖ్యంగా వైద్య శాఖలో గర్భిణి ప్రసవం కోసం వస్తే నా టైం అయిపోయిందని చేతులు దులుపుకొని వెళ్లిపోవడం మానవత్వం ఉన్న మనిషి చేసే పనికాదు. పెదనందిపాడు పీహెచ్సీలో ఇటువంటిదే ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరు, ప్రత్తిపాడు: పెదనందిపాడు పీహెచ్సీ స్టాఫ్ నర్సులు గర్భవతులతో బంతాట ఆడుతున్నారు. స్టాఫ్ నర్సుల నిర్వాకానికి తోడు స్థానిక ఆరోగ్య సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో నిండు గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. అందుకు నిదర్శనమే ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన. వివరాల్లోకి వెళితే ఈనెల 25వ తేదీ సాయంత్రం సుమారు ఆరుగంటల సమయంలో మండల కేంద్రమైన పెదనందిపాడుకు చెందిన నిండు గర్భిణి ఫాతిమాకు నొప్పులు రావడంతో బంధువులు ఆమెను తీసుకుని అదే గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న స్టాఫ్‌నర్సు నా డ్యూటీ టైం అయిపోయిందని (సాయంత్రం ఆరుగంటలకే), తరువాత డ్యూటీకి వచ్చే స్టాఫ్‌నర్సుతో చేయించుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. ఫాతిమా బాధ చూడలేని ఆమె బంధువులు అలా అంటే ఎలాగమ్మా.. నీ తరువాత ఆమె ఎప్పుడు డ్యూటీకొస్తుందో.. ఎంత టైం అవుతుందో తెలియదు కదా, అప్పటిదాకా ఉంటే బిడ్డకు ఏమైనా అవుతుందేమో.. మీరు కాస్త జాలి చూపి కాన్పు చేయాలని బతిమాలారు. అయినా చలించని స్టాఫ్‌నర్సు నేను ఇప్పుడు చెయ్యను.. కావాలంటే మీరు ప్రత్తిపాడుకు పోండంటూ తేల్చిచెప్పింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో స్థానిక ఆశ కార్యకర్తను తీసుకుని వారు గర్భిణి ఫాతిమాను ఆటోలో ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. వాస్తవానికి స్టాఫ్‌నర్సులు రాత్రి ఎనిమిది గంటల సమయంలో డ్యూటీ రిలీవ్ అయి నైట్ డ్యూటీ వారికి చార్జ్ అప్పగిస్తారు. కానీ ఆరు గంటలకే నా డ్యూటీ టైం అయిపోయిందంటూ కాన్పు చేయకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం విమర్శలకు దారితీస్తోంది. ఏఎన్ఎంకు ఫోన్ చేసినా... ప్రత్తిపాడు సీహెచ్‌సీలో విధుల్లో ఉన్న స్టాఫ్ నర్సు గర్భవతి పరిస్థితిని చూసి వివరాలు తెలుసుకునేందుకు సంబంధిత గ్రామ ఏఎన్ఎంకు ఫోన్ చేశారు. వివరాలను అడిగి తెలుసుకున్న తరువాత ఫాతిమాకు మూడవ కాన్పు కావడంతో ప్రత్తిపాడు సీహెచ్‌సీకి వచ్చి కాన్పుకు సాయం అందించాలని స్టాఫ్ నర్సు ఏఎన్ఎంను కోరారు. అందుకు ఏఎన్ఎం విముఖత వ్యక్తం చేయడంతో స్టాఫ్ నర్సు విషయాన్ని సీహెచ్‌సీ గైనకాలజిస్ట్ ఇంద్రాణికి సమాచారం అందించారు. వెంటనే ఆమె ఆస్పత్రికి చేరుకుని కాన్పు చేశారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డా సురక్షితంగానే ఉన్నారని డాక్టర్ ఇంద్రాణి తెలిపారు. -
ఎంత ఘోరం!
కొయ్యూరు (పాడేరు): రక్తహీనత ఆఖరికి వైద్య రంగంలో పనిచేస్తున్న మహిళనూ బలిగొంది. ఏడాది కిందట ప్రేమ వివాహం చేసుకున్న ఆమెకు రాజేంద్రపాలెం పీహెచ్సీలో స్టాఫ్ నర్స్ ఉద్యోగం వచ్చింది. గర్భవతి కావడంతో తల్లిదండ్రుల స్వగ్రామం కొమ్మిక వచ్చింది. ఆదివారం మగబిడ్డకు జన్మనిచ్చింది. రక్తహీనత, హైబీపీ రూపంలో కొన్ని గంటలకే మృతి చెందింది. రాజేంద్రపాలెం పీహెచ్సీలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న నేతల సీతాదేవి కావడంతో తల్లిదండ్రుల స్వగ్రా మం కొమ్మిక వెళ్లింది. ప్రసవ తేదీ (ఈడీడీ) దగ్గర కావడంతో అక్కడే ఉంది. ఆదివారం ఉదయం కొమ్మికకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కంఠారం ఆరోగ్యకేంద్రంలో ప్రసవం జరిగి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన కొద్దిసేపటికి ఆమె పరిస్థితి విషమించడంతో వెంటనే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.అక్కడ కొద్దిసేపు వైద్యం చేసిన తరువాత వైద్యులు ఇక్కడ సాధ్యం కాదని వెంటనే కేజీహెచ్‌కు తరలించాలని సూచించారు అప్పటికే ఆమెకు రక్తహీనతకు తోడుగా హైబీపీ వెంటాడుతుంది. నర్సీపట్నంలో ప్రముఖ గైనకాలజిస్టు సుధాశారదను కూడా సంప్రదించారు. తానేమి చేయలేనని కేజీహెచ్‌కు తరలించాలని చెప్పారు. వెంటనే ఆదివారం రాత్రి కేజీహెచ్‌కు తరలించారు. ఆమెను ఆపరేషన్ «థియేటర్‌కు తీసుకెళ్తుండగానే ఊపిరి ఆగిపోయింది. ఈమె మృతితో కొమ్మక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
స్టాఫ్ నర్సు అనుమానాస్పద మృతి
పెదవాల్తేరు(విశాఖతూర్పు): నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న ట్రైనీ స్టాఫ్‌నర్సు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. చనిపోయిన యువతి తల్లిదండ్రులు, బంధువులు మాత్రం ఆ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని ఆరోపిస్తున్నారు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట మండలం నామవరం గ్రామానికి చెందిన నింపు అప్పారావు కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని కుమార్తె నాగమణి (28) నాలుగు నెలల క్రితం రామ్‌నగర్‌లో గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ట్రైనీ స్టాఫ్‌నర్సుగా విధుల్లో చేరింది. ఆమె ఆస్పత్రిలో పనిచేస్తూ, రామ్‌నగర్‌లో గల బాలాజీ లేడీస్ హాస్టల్లో ఉంటోంది. ఆ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఒక ఎమర్జెన్సీ కేసు ఉందని ఆస్పత్రి నుంచి ఫోన్ రావడంతో నాగమణి వెళ్లింది. తిరిగి ఆమె ఉదయం 11 గంటల సమయంలో హాస్టల్‌కి చేరుకుంది. అనంతరం బాత్రూమ్కు వెళ్లి మళ్లీ రాలేదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సహచర యువతులు బాత్రూమ్కు వెళ్లి తలుపు తీయగా లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో తెరుచుకోలేదు. ఒక యువతి వెనుక గల మరో బాత్రూమ్లో నుంచి మొబైల్ ఫోన్ కెమెరాతో చూడగా నాగమణి విగతజీవిగా పడిపోయి ఉంది. వెంటనే తలుపులు విరగ్గొట్టి హుటాహుటిన ఆ యువతి పనిచేస్తున్న ఆస్పత్రికి అంబులెన్సులో తరలించారు. అయితే అప్పటికే చనిపోయి ఉందని వైద్యులు తేల్చారు. ఈ విషయాన్ని ఆదివారం రాత్రి బాగా పొద్దుపోయాక ఆస్పత్రి యాజమాన్యం యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు బంధువులతో కలిసి నగరానికి చేరుకున్నారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే నాగమణి చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు మూడో పట్టణ పోలీసులకు సోమవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. యువతి తండ్రి అప్పారావు ఫిర్యాదు మేరకు మూడో పట్టణ సీఐ ఇమ్మానియేల్‌రాజు పర్యవేక్షణలో ఎస్ఐ బి.రమణయ్య సెక్షన్ – 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో ఏం జరిగింది...? నాగమణి ఎమర్జన్సీ కేసు నిమిత్తం ఆదివారం ఆస్పత్రికి వెళ్లినపుడు అక్కడ సిబ్బంది లేదా వైద్యులెవరైనా ఆమెని వేధింపులకు గురి చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగమణికి ఇంట్లో సమస్యలు లేవని, ఎవరితోనూ ప్రేమ వ్యవహారాలూ లేవని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. హాస్టల్‌కి ఉదయం 11 గంటలకు వచ్చిన నాగమణి బాత్రూమ్ నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాకపోయినా తోటి యువతులు, హాస్టల్ సిబ్బది పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. నాగమణి బాత్రూమ్లో విషం తాగి చనిపోయిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం బాలాజీ లేడీస్ హాస్టల్‌తోపాటు, యువతి పనిచేసిన ఆస్పత్రిలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నాగమణి మృతదేహాన్ని సోమవారం సాయంత్రం కేజీహెచ్‌కి తరలించారు.