Telangana Liberation Day
-
నగరంపై పోలీసుల నజర్
సాక్షి, హైదరాబాద్: సాధారణ పరిస్థితుల్లోనే గణేశ్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక ఊరేగింపు, నిమజ్జనాలను సజావుగా పూర్తి చేయడం నగర పోలీసులకు పెద్ద సవాలు. అలాంటిది ఈసారి మంగళవారం ఒకేరోజు.. హుస్సేన్‌సాగర్‌తో పాటు పలు కీలక చెరువుల్లో నిమజ్జనాలు, తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం జరగనుండటంతో పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ స్థాయిలో అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ప్రతి ఏడాదీ సామూహిక ఊరేగింపు, నిమజ్జనం నేపథ్యంలో ఉత్తరాది సహా వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది ప్రముఖులు నగరానికి వస్తుంటారు. వీరిలో ఆర్ఎస్ఎస్ సహా వివిధ సంస్థలకు చెందిన వారు ఉంటారు. చార్మినార్, ఎంజే మార్కెట్ సహా మరికొన్ని ప్రాంతాల్లో వీరి ప్రసంగాలు ఉంటాయి. దీంతో పోలీసులు ఆయాచోట్ల అదనంగా జాగ్రత్తలు తీసుకుని బందోబస్తు ఏర్పాటు చేస్తారు. పాతబస్తీ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ప్రధాన రహదారి కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయి. దీనికి తోడు ఈసారి సెపె్టంబర్ 17 పురస్కరించుకుని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. దీనికి ముందు ఆయన అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించే అవకాశం ఉంది. ఈ రెండు కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్ చిక్కులు మరింత పెరుగుతాయని భావిస్తున్న పోలీసు అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఆయనతో పాటు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి కూడా హాజరుకానున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన బీజేపీ క్యాడర్ పరేడ్ గ్రౌండ్స్‌కు తరలిరానుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. సిబ్బందికి సెలవులు రద్దు చేసిన పోలీసు అధికారులు..ఆయా కార్యక్రమాల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. సోమవారం రాత్రి నుంచే పెద్ద సంఖ్యలో అధికారులు విధుల్లో ఉండనున్నారు. అవసరమైన స్థాయిలో అదనపు బలగాలను రంగంలోకి దింపి పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నారు. సీసీఎస్, సిట్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, టీజీఎస్ఎస్పీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లతో పాటు కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. వీరికి తోడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సివిల్, సాయుధ బలగాలను రంగంలోకి దింపుతున్నారు. సున్నిత, అనుమానిత ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులతో ప్రత్యేక గస్తీ, నిఘా ఏర్పాటు చేస్తున్నారు. పాతబస్తీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం అర్ధరాత్రి అనేక ప్రాంతాల్లో పర్యటించారు. నిమజ్జనం బుధవారం ఉదయం వరకు జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తుండగా, గురువారం నగరంలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉండటంతో దానికీ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టారు. -
ప్రగతి నిరోధక శక్తులకు.. పరాజయమే
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏనాడో స్థిరపడిన పెద్ద రాష్ట్రాలను తలదన్నేలా తెలంగాణ ప్రగతి రథచక్రాలు దూసుకుపోతున్నాయని.. దేశంలో ఎక్కడ, ఎవరినోట విన్నా తెలంగాణ మోడల్ మార్మోగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. తెలంగాణ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయని.. దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులు పరాజయం పాలుకాక తప్పదని పేర్కొన్నారు. మన సమైక్యతే మనకు బలమని.. జాతీయ సమైక్యతా దినోత్సవ వేళ బంగారు తెలంగాణ సాధనకు ఒక్కటిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్‌లో కలసిన ‘సెప్టెంబర్ 17’ సందర్భంగా ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహించింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ తొలుత అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు. హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న రాచరికం నుంచి పరిణామం పొంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టిందని.. ఈ చారిత్రాక సందర్భాన్ని తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ అనేక రంగాల్లో నంబర్ వన్‌గా నిలవడం మనందరికీ గర్వకారణం. అనతి కాలంలోనే విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించి, అన్ని రంగాలకు 24 గంటల పాటు, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. తలసరి విద్యుత్ వినియోగంలోనూ రాష్ట్రం నంబర్ వన్. రూ.3,12,398 తలసరి ఆదాయంతోనూ నంబర్ వన్‌గా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం సంపద పెంచాలి. పెరిగిన సంపదను అవసరమైన వర్గాల ప్రజలకు పంచాలన్న ధ్యేయంతో ముందడుగు వేస్తోంది. సకల జనులకు సంక్షేమ ఫలాలు అందిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో పేదరికం తగ్గి, తలసరి ఆదాయం పెరిగింది. కొత్త వైద్య కళాశాలలతో ఏటా పది వేల మంది డాక్టర్లను తయారు చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటోంది. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ఆగదు హైదరాబాద్‌లో పేదలకు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తున్నాం. ఎవరైనా అర్హులకు ఇళ్లు రాకపోయినా ఆందోళన చెందవద్దు. ఈ పథకం నిరంతరం కొనసాగుతుంది. సొంత జాగా ఉన్న పేదలు ఇళ్లు కట్టుకునేందుకు ‘గృహలక్ష్మి’ పథకాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో మొత్తంగా 44 లక్షలమందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నాం. ఇక అణగారిన దళితజాతి అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ పథకంకొత్త చరిత్రను సృష్టించింది. బలహీన వర్గాల్లోని వృత్తిపనుల వారికి, మైనారిటీ వర్గాలకు కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. మద్యం దుకాణాల్లో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్లు, ఈత, తాటిచెట్లపై పన్నురద్దు, 5 లక్షల వరకూ బీమా సౌకర్యం వంటి సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాం. రజకులు, నాయీ బ్రాహ్మణులకు విద్యుత్ రాయితీ, ఆర్థికసాయంతో అండగా నిలుస్తున్నాం. ఆదివాసీలు, గిరిజనుల పోడు భూములకు పట్టాలిచ్చాం. రాష్ట్రంలో ఐటీ దూకుడు తెలంగాణ ఏర్పడే నాటికి 3,23,390 మంది ఐటీ ఉద్యోగులుంటే.. ఇప్పుడు 9,05,715 మందికి పెరిగారు. ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్ల నుంచి రూ.2,41,275 కోట్లకు వృద్ధిచెందాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ టవర్లు నిర్మించుకున్నాం. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని నివారించి సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు రూ.67 వేల కోట్లతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పనులను పూర్తిచేస్తున్నాం. కొత్త సచివాలయం, అమరవీరుల స్థూపం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నగరానికి మరింత శోభ చేకూర్చాయి.’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మరో నాలుగేళ్లలో 1.25 కోట్ల మాగాణగా.. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి, 10 లక్షల ఎకరాలకు నీరందిస్తోంది. వీటితోపాటు కాళేశ్వరం, పాలమూరు, సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్ వంటి ప్రధాన ఎత్తిపోతల పథకాల ద్వారా 75లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇతర భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువుల ద్వారా మరో 50 లక్షల ఎకరాలు సాగవుతాయి. మొత్తంగా మరో నాలుగేళ్లలో కోటీ 25 లక్షల ఎకరాలకు నీరందించాలన్న లక్ష్యం నెరవేరుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే 24 గంటల ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువుల సరఫరా, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీతో వ్యవసాయం పండుగగా మారింది. -
చరిత్రను తప్పుగా చిత్రీకరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 399 రోజుల వరకు హైదరాబాద్ స్టేట్‌లో రజాకార్ల అరాచకం సాగింది. వీటి నుంచి విముక్తికి సర్దార్ పటేల్ 1948 ఆగస్టు 10న సంకల్పించి సెప్టెంబర్ 17 నాటికి మిషన్ పూర్తిచేశారు –అమిత్ షా సాక్షి, హైదరాబాద్: సంతుష్టీకరణ రాజకీయాల కోసం వాస్తవాలను మరుగున పడేస్తే చరిత్రే ఉండదని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. తెలంగాణ చరిత్రను తప్పుగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. హైదరాబాద్ స్టేట్‌కు స్వాతంత్య్రం రాకుండా స్వతంత్ర రాజ్యంగా ఉంటే.. భారతమాత కడుపులో కేన్సర్ ఉన్నట్లేనని గుర్తించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాంతానికి రజాకార్ల నుంచి విముక్తి కల్పించేందుకు ‘ఆపరేషన్ పోలో’కు నడుం బిగించారన్నారు. రక్తం చుక్క చిందకుండానే.. నిజాం మెడలు వంచి హైదరాబాద్ స్టేట్‌కు స్వాతంత్య్రం ఇప్పించారన్నారు. కేఎం మున్షీ నేతృత్వంలో, పటేల్ ఆదేశాలతో ఈ ఆపరేషన్ జరిగిందని చెబుతూ వారికి నివాళులు అర్పిస్తున్నామన్నారు. పటేల్ కృషి లేకపోతే భారత్‌లో హైదరాబాద్ స్టేట్‌తో సహా వందలాది సంస్థానాల విలీనం ఆలస్యమై ఉండేదన్నారు. ఈ సందర్భంగా తెలంగాణతోపాటు కల్యాణ కర్ణాటక, మరాఠా మహారాష్ట్ర ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రాజకీయాల కారణంగా విమోచన దినోత్సవా న్ని అధికారికంగా నిర్వహించకపోవడం సరికాదని చెప్పారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో 75వ హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని అమిత్‌షా జాతీయజెండాను ఎగురవేశారు. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ తదితర కేంద్ర బలగాల నుంచి పోలీసు వందనాన్ని స్వీకరించారు. రావి, ఎల్లారెడ్డి పేర్ల ప్రస్తావన హైదరాబాద్ స్టేట్ విమోచన కోసం పోరాడి, ఎన్నో త్యాగాలు చేసిన స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు, కేశవ్‌రావు కోరట్కర్, రావి నారాయణరెడ్డి, బద్ధం ఎల్లారెడ్డి, కాళోజి నారాయణరావు, మర్రి చెన్నారెడ్డి, పీవీ నర్సింహారావు వంటి వీరులకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నామని అమిత్ షా చెప్పారు. ఈ పోరాటంలో లక్షలాది మంది పాల్గొన్నారని, వేలాది మంది అసువులు బాసారన్నారు. ఈ ఉద్యమంలో ఆర్యసమాజ్, హిందూ మహాసభ వంటి ఎన్నో సంస్థలు పనిచేశాయని.. ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతర నినాదంతో నిజాం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని అమిత్ షా పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 399 రోజుల వరకు హైదరాబాద్ స్టేట్‌లో రజాకార్ల అరాచకం సాగిందన్నారు. జాతీయ జెండాను ఎగురవేసినందుకు పరకాలలో 1,500 మంది జలియన్ వాలాబాగ్ తరహాలో కాల్పులు జరిపారని, ఇందులో పలువురు అమరులవగా.. మరికొందరు గాయపడ్డారని అమిత్ షా గుర్తుచేశారు. ఇదే తరహాలో మహారాష్ట్రలోని పర్భణిలో, కర్ణాటకలోని బీదర్‌లోనూ సామాన్యులపై కాల్పులు జరిగాయన్నారు. వీటి నుంచి విముక్తి కల్పించేందుకు పటేల్ 1948 ఆగస్టు 10న సంకల్పించి సెప్టెంబర్ 17 నాటికి మిషన్ పూర్తిచేశారని వివరించారు. 75 ఏళ్ల వరకు దేశంలోని ఏ ప్రభుత్వం కూడా.. యువతకు తెలంగాణ స్వాతంత్య్ర పోరాటం గురించి చెప్పేందుకు ప్రయత్నించలేదన్నారు. హైదరాబాద్ విమోచన కోసం పోరాడిన అమరులకు శ్రద్ధాంజలి, యువత, విద్యార్థుల్లో దేశభక్తి పెంపు, రాష్ట్రానికి పునరంకితం కావాలనే మూడు ప్రధాన లక్ష్యాల సాధన కోసం ప్రధాని మోదీ చొరవతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. మన పూర్వీకులు కలలుగన్న తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా ప్రధాని మోదీ కృషిచేస్తున్నారని అమిత్ షా చెప్పారు. దీని ఫలితంగానే నేడు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరిందని, జీ20 ద్వారా భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి మరోసారి చాటామన్నారు. జీ 20ని జీ 21గా చేసిన ఘనత కూడా మోదీకే దక్కుతుందని వివరించారు. చంద్రయాన్–3 విజయవంతంతో ›ప్రపంచం దృష్టిని భారత్ ఆకర్షిస్తోందన్నారు. నేడు ప్రపంచమంతా భారత్ సాధిస్తున్న ప్రగతిని ప్రశంసిస్తోందని చెప్పారు. ఆదివారం మోదీ జన్మదినం సందర్భంగా సభావేదికపై నుంచి అమిత్‌షా శుభాకాంక్షలు తెలిపారు. -
సర్ధార్ వల్లభాయ్ పటేల్ పోరాటంతోనే తెలంగాణకు స్వాతంత్య్రం
-
13 నెలల ఆలస్యంగా తెలంగాణకు స్వాతంత్య్రం
-
అమిత్‌షాతో పీవీ సింధు భేటీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌కు చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, సీనియర్ నేతలు డీకే అరుణ, బండి సంజయ్, కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, విజయశాంతి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అమిత్‌షా సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆ ఫీసర్స్ మెస్‌కు చేరుకుని బస చేశారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హై దరాబాద్ విమోచన దినోత్సవాల్లో అమిత్‌షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. పీవీ సింధుకు అభినందన కేంద్ర మంత్రి అమిత్‌షాను ఒలింపిక్ పతక విజేత, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శనివారం రాత్రి తన తండ్రి, వాలీబాల్ మాజీ క్రీడాకారుడు పీవీ రమణ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలతో కలసి ఆమె సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీసర్స్ మెస్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడంతోపాటు యువతకు స్ఫూర్తిగా నిలిచావంటూ సింధును అమిత్‌షా అభినందించారు. దేశంలో క్రీడల అభివృద్ధి, అందించాల్సిన ప్రోత్సాహం, ఫిట్నెస్గా ఉండటంపై వారు మాట్లాడుకున్నట్టు తెలిసింది. ప్రముఖులపై బీజేపీ ఫోకస్లో.. ఇటీవల సినీ, సంగీత, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ప్రభావం చూపే ప్రముఖులను బీజేపీ జాతీయ నేతలు కలసి అభినందించడం తెలిసిందే. గతంలో రాష్ట్ర పర్యటనలకు వచ్చిన సందర్భంగా సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను, బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌లను అమిత్‌షా కలుసుకున్నారు. తాజాగా పీవీ సింధును కలిశారు. అలాగే సినీనటుడు నితిన్, మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, ఆర్థిక, రాజకీయరంగాల విశ్లేషకుడు కె.నాగేశ్వర్‌లను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కలిశారు. రాష్ట్ర నేతలతో కీలక భేటీ.. పరేడ్ గ్రౌండ్స్ కార్యక్రమం అనంతరం సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీసర్స్ మెస్‌లో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో అమిత్‌షా సమావేశం కానున్నారు. ఈ భేటీ కోసం జాతీయ కార్యవర్గ సభ్యులు, కీలక నేతలకు మాత్రమే పిలుపు అందినట్టు పారీ్టవర్గాలు చెప్తున్నాయి. అయితే ఆదివారం విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ బీసీలకోసం ఓ ప్రత్యేక పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభిస్తుండటంతో.. దీనికి సంబంధించి హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో కార్యక్రమం జరగనుంది. జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్ అందులో పాల్గొంటుండటంతో.. అమిత్‌షాతో భేటీకి హాజరయ్యే అవకాశాలు లేవని సమాచారం. ఆఫీసర్స్ మెస్‌లో భేటీ తర్వాత అమిత్‌షా ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు. నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. అమిత్‌షా, కిషన్‌రెడ్డి, ఇతర నేతలు ఉదయం తొమ్మిది గంటల సమయంలో అక్కడికి చేరుకుంటారు. తొలుత అమర సైనికుల స్తూపం వద్ద నివాళులు అరి్పస్తారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అరి్పస్తారు. పారామిలిటరీ దళాల కవాతు స్వీకరించి ప్రసంగిస్తారు. కార్యక్రమం ప్రాంగణంలో 21 వేల మంది సందర్శకులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. -
విమోచన కాదు విద్రోహం!
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కొన్ని రాజకీయ పక్షాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా చిత్రించుకుంటున్నాయి. కానీ అసలు చరిత్రలో జరిగింది వేరు. నైజాం నవాబు ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎట్టి హక్కులు లేకుండా, వెట్టి చాకిరీ చేస్తూ, దారుణ దోపిడీకి గురౌ తున్న సమయంలో ‘ఆంధ్ర మహాసభ’ ఏర్పడింది. క్రమంగా ‘ఆంధ్ర మహాసభ’ కమ్యూనిస్టుల నాయ కత్వంలోకి వచ్చింది. వెట్టి చాకిరీ రద్దు, కౌలు తగ్గింపు, ‘దున్నే వానికే భూమిపై హక్కు’ వంటి డిమాండ్లను ముందుకు తెచ్చి నిజాం పాలనపై ఉద్యమించింది. సంఘంలోకి ప్రజలు పెద్ద ఎత్తున చేరారు. భూమి కోసం పోరు ప్రారంభమైంది. ‘ఆంధ్ర మహాసభ’ ప్రతి గ్రామానికీ విస్తరించింది. తన భూమి, పంటల రక్షణ కోసం చాకలి ఐలమ్మ ప్రదర్శించిన తెగువ భూపోరాట ప్రాధాన్యాన్ని ముందుకు తెచ్చింది. జనగామ తాలూకా కలవెండి గ్రామంలో దేశ్ ముఖ్ విసునూరి రామచంద్రారెడ్డి గూండాలు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమురయ్య అమరత్వంతో పోరాటం కొత్త మలుపు తీసుకున్నది. దేశ్‌ముఖ్‌ల, జమీందార్ల దాడులను సాయుధంగా ప్రతిఘటన చేయాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. రైతాంగ ఉద్యమంపై నిజాం నవాబ్ ప్రభుత్వం తీవ్ర నిర్భందం ప్రయోగించింది. నిజాం రజాకార్లు ప్రజలపై పాశవిక దాడులు చేశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన ఈ దాడులను తిప్పికొట్టేందుకు గెరిల్లా దళాలు ఏర్పడ్డాయి. పోరాటం ద్వారా పది లక్షల ఎకరాల భూములు ప్రజలు స్వాధీనపర్చుకుని సాగు చేశారు. వేలాది గ్రామల్లో గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాశక్తికి భయపడి జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లు పట్టణాలకు పారి పోయారు. నిజాం నిరంకుశ ప్రభుత్వం నిర్బంధం పెంచి ప్రజలను తీవ్ర చిత్రహింసలకు గురిచేసింది. ప్రజలను ఒకేచోట మందవేసి పాశవికంగా హింసించారు. అయినా పోరాటం ఆగలేదు. పోరా టాన్ని అడ్డుకునే శక్తి నిజాం ప్రభుత్వం కోల్పోయింది. రైతాంగ సాయుధ పోరాటం నెహ్రూ ప్రభుత్వ వెన్నులో వణుకు పుట్టించింది. ఉద్యమం కొనసాగితే కమ్యూనిస్టుల ప్రాబ ల్యం పెరిగి ఇతర ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు ప్రారంభమౌతా యని నెహ్రూ ప్రభుత్వం భయపడింది. అందుకే 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానానికి సైన్యాలను పంపింది. నిజాం సైన్యాలు బూటకపు ప్రతిఘటన నాటకమాడాయి. రెండు రోజు ల్లోనే నైజాం రాజు లొంగిపోయినట్లు ప్రకటించి, నెహ్రూ సైన్యా లకు స్వాగతం పలికాడు. దీన్ని గమనిస్తే ముందుగానే సైనిక చర్య గురించి నెహ్రూ ప్రభుత్వానికి, నైజాం నవాబుకూ మధ్య ఒప్పందం జరిగిందనేది వెల్లడవుతుంది. నిజాం నవాబును గద్దె దింప టానికే సైన్యం వస్తే, మరి నవాబును (రాజుని) అరెస్టు చేసి నిర్బంధించాలి కదా! కానీ అలా జరగలేదు. ‘రాజ్య ప్రముఖ్’గా నిజాం రాజుని ప్రకటించి 1950 జనవరి 26 వరకు నైజాం ప్రాంతాన్ని అతని పాలనలోనే ఉంచి, నెహ్రూ ప్రభుత్వం 1950లో సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో విలీనం చేసింది. ఈ క్రమంలో గ్రామాలకు సైన్యాలను పంపి ప్రజలు సాగు చేసుకుంటున్న భూములను జమీందార్లకు, భూస్వాములకు అప్ప గించింది. దీన్ని గమనిస్తే నైజాం నవాబును, జమీందార్లను, జాగీర్దారులను, భూస్వాములను రక్షించటానికే రైతాంగ సాయుధ పోరాటంపైకి మిలిటరీ దాడి అన్నది స్పష్టమవుతున్నది. అందుకు అనుగుణంగానే పెద్ద ఎత్తున నిజాం రాజ్యంలో సైన్యాన్ని దింపి రైతాంగ పోరాటంపై విరుచుకుపడింది. కాన్సట్రేషన్ క్యాంపులు పెట్టి ప్రజలను తీవ్ర చిత్రహింసలకు గురిచేసింది. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించింది. నాయకులను, కార్యకర్తలను పట్టుకుని కాల్చి చంపింది. నెహ్రూ ప్రభుత్వం ఎంత నిర్బంధం ప్రయోగించినా రైతాంగ సాయుధ పోరాటం కొన సాగింది. పార్టీలో చోటు చేసుకున్న మితవాద, అతివాద ధోరణులు 1951 అక్టోబర్ 31న మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం విరమణకు కారణమయ్యాయి. మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించింది కమ్యూనిస్టు పార్టీ. అందుకు అనేక త్యాగాలు చేసింది కమ్యూనిస్టు పార్టీనే! అందువలన ఆ పోరాట వారసులు కమ్యూ నిస్టులే. ఇతరులు దాన్ని ఉచ్చరించటానికి కూడా హక్కు లేదు. అలాగే సెప్టెంబర్ 17న జరిగినది విమోచన కాదు, ప్రజలకు విద్రోహమని ప్రజలు గొంతు విప్పాలి. తెలంగాణ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని నినదించాలి. బొల్లిముంత సాంబశివరావు వ్యాసకర్త ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526 -
మునుగోడు కోసమే ‘విమోచన’
తెలంగాణలో సెప్టెంబర్ 17 అన్నది విలీనమా, విమోచనా, విద్రోహమా లేక విద్వేషమా అనే వాదనను పక్కన పెడితే, ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కనీస చారిత్రక అంశాలు కొన్ని ఉన్నాయి. అసఫ్ జాహీ వంశస్థులు మొఘల్ పాలన నుంచి విడిపోయి, నిజాం పాలకులుగా (1724–1948) పేరొందారు. నిజాంలు మత ప్రాతిపదికన ఏలినవారు కాదు, స్వతంత్రులూ కారు. ‘ట్రియటీ ఆఫ్ సబ్సిడియరీ అలయెన్స్’ పేరిట, 1800లో బ్రిటిష్ వారికి అధీనులుగా ఒప్పందం చేసుకొన్న అనేక మంది హిందూ రాజుల వంటివారే. తెలంగాణలో నిజాం వ్యతిరేక పోరాటం ఉద్ధృతంగా ఉన్న సమయంలో కూడా హిందూ ఫ్యూడల్స్ నిజాం మంత్రులుగా పనిచేశారు. వారిలో అత్యధికులు కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత కూడా పోలీసు చర్య జరిగే వరకూ కాంగ్రెస్ టోపీలు పెట్టు కోలేదు! విలీన చర్చల్లోనూ హిందూ సలహాదారులు నిజాం పక్షానే ఉన్నారు. ఆ చర్చల్లో కేంద్రం పక్షాన, నిజాం తరఫున ఇరు వైపులా బ్రిటిషువారే ఉన్నారు. పటేలుకు 1948 మార్చిలో గుండెపోటు రావడం వల్ల ఎక్కువగా మౌంటుబాటెనే కీలక సమావేశాల్లో పాల్గొ న్నారని విలీన వ్యవహారాల కార్యదర్శి, పటేలు కుడిభుజం అయిన వీపీ మీనన్ తన పుస్తకంలో రాశారు. నిజాం పాలన కానీ, విలీన వ్యతిరేకత కానీ, ఆ మాట కొస్తే నిజాం వ్యతిరేక ప్రతిఘటన కానీ ఏవీ మతం ఆధారంగా లేవు. రజాకార్లు కూడా నిజాం పాలన మొదటి నుంచీ లేరు. తర్వాతి దశలో 1938లో ఏర్పడిన ‘వాలంటీర్ల’ సంస్థకు చెందినవారు. ఆ సంస్థ 1947 తర్వాతే కిరాయి ప్రైవేటు సైన్యంలా దౌర్జన్యకర పాత్ర నిర్వహిం చింది. 1915లోనే ఏర్పడిన హిందూ మహాసభ గానీ, 1925లో ఆవిర్భవించిన ఆరెస్సెస్ గానీ నిర్వహించిన నిజాం వ్యతిరేక పాత్ర అక్షరాలా సున్నా. నిజాం నిరంకు శత్వం నుండి తెలంగాణను పటేల్ విముక్తి చేశారనీ, నెహ్రూ ముస్లిం పాలకుడి పట్ల మెతకగా ఉన్నారనీ అసత్య ప్రచారాలు మాత్రం జరిగాయి. నిజాంని 1947 ఆగస్టు తర్వాత కూడా ఏడాదిపాటు కొనసాగించటానికి యథా తథ స్థితి ఒప్పందం చేసుకొన్నది నెహ్రూ, పటేల్‌లతో కూడిన నాయకత్వమే. ఆ విషయంలో వారి మధ్య విభేదాల్లేవు. పటేలు మరణించిన 1950 చివర్లో, ఆ తర్వాత 1951 చివరి దాకా మిలిటరీ తెలంగాణలో స్వైర విహారం చేసింది. దానివల్ల నాలుగు వేల మంది రైతాంగ కార్యకర్తలు హతులయ్యారు. లక్షమంది జైళ్ల పాలయ్యారు. అలా చూస్తే ఇది రైతాంగ విప్లవం నుంచి ఫ్యూడల్ రాజు నిజాంకు లభించిన విమోచన తప్ప వేరేమీ కాదు. (క్లిక్ చేయండి: బీఆర్ఎస్ అంటే ఏంది?) ఈ ఏడాది సెప్టెంబర్ పదిహేడు... 75 ఏళ్ల చారిత్రక ఘట్టమే. మరి ఉత్సవాలను నిర్వహించాలని ముందే నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? మొన్నటి జూలైలో బీజేపీ అఖిలభారత సమావేశం హైదరాబాదులో జరిగినప్పుడు, ఆ తర్వాత ఆగస్టు 15న కానీ తీసుకోలేదు. సెప్టెంబరు 3న హడావుడిగా తీసుకున్నారు. ఆనాడు లేనిదీ, నేడున్నదీ మునుగోడు ఎన్నిక! ఇదంతా బీజేపీ దేశభక్తి కాదు, 2023 తెలంగాణ ఎన్నికల్లో ముక్తి కోసమే. దానికి మునుగోడు అసెంబ్లీ ఎన్నిక రిహార్సల్. ప్రజలు గమనించకుండా ఉంటారా! – సీహెచ్.ఎస్.ఎన్. మూర్తి ఎఫ్ఐటీయూ ప్రధాన కార్యదర్శి -
అవును... చరిత్ర వక్రీకరణ మహానేరం!
‘చరిత్ర వక్రీకరణ మహానేరం’ పేరిట సెప్టెంబర్ 22 నాటి మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసాన్ని చదివిన తరువాత వక్రీకరణ వాస్తవంగా ఎక్కడ, ఎలా మొదలౌతుందో అర్థమైంది. దేశ విభజనానంతరం సంస్థానాల విలీనం విషయంలో ఒక అబద్ధం ప్రచారమౌతోంది. సంస్థానాధీశులకు భారత్‌లో కలిసేందుకు, లేదా పాకిస్తాన్లో కలిసేందుకు, లేదా స్వతం త్రంగా ఉండేందుకు బ్రిటిషర్లు అధికారాన్ని కల్పించారనేది అబద్ధం. బ్రిటిష్ ప్రభుత్వం వారికి భారత్ లేదా పాకిస్తాన్లో విలీనమయ్యే అవకాశాన్ని మాత్రమే కల్పించింది. స్వతంత్రంగా ఉండేలా మూడో ఆప్షన్ లేదు. అలా ఉన్నట్టయితే దయతో తదనుగుణమైన బ్రిటిష్ ప్రభుత్వ డాక్యుమెంట్లను చూపించాలి (ఏ ఆధారమూ చూపని కొన్ని ఇంగ్లీషు పుస్తకాలను కోట్ చేస్తే సరిపోదని సవినయ మనవి). బ్రిటిషర్లు విలీనానికి మతంతో కూడా ముడిపెట్టలేదు. ప్రిన్సిపుల్ ఆఫ్ కంటిగ్యుటీ (సామీప్యతా సూత్రం) అంటే భారత్ సమీపంగా ఉంటే భారత్‌లో, పాకిస్తాన్ సమీపంలో ఉంటే పాకిస్తాన్లో ఉండేలా నిర్ణయం తీసుకోవచ్చు. దీని ప్రకారం హిందూ జనాభా అధికంగా ఉండి, హిందూ రాజు ఉన్న రాజస్థాన్‌లోని అమర్ కోట్ సంస్థానం పాకిస్తాన్లో చేరింది. కశ్మీర్ తప్ప మిగతా సంస్థానాధీశులు వారు కోరుకున్నా పాకిస్తాన్లో విలీనం కాలేరు. కాబట్టి భారతదేశం లోపల ఉండే హైదరాబాద్ స్వతంత్రంగా ఉండే ఆప్షన్ లేనే లేదన్నది స్పష్టం. మౌంట్ బాటన్ స్వయంగా ఈ విషయాన్ని నిజాంకి, ఆయన ప్రతినిధులైన వాల్టర్ మాంక్టన్, నవాబ్ ఆఫ్ ఛత్తారీలకు పలుసార్లు స్పష్టం చేశాడన్నది చారిత్రక వాస్తవం. నిజాం చేసుకున్న యథాతథస్థితి ఒప్పందం (స్టాండ్ స్టిల్ ఒప్పందం) కూడా స్వతంత్రంగా ఉండేందుకు కాదు. విలీనాన్ని ఒక సంవత్సరం జాప్యం చేసేందుకే. పాకిస్తాన్ అన్న ఆలోచనను బ్రిటిషర్ల సహకారంతో 1930వ దశకంలో సృష్టించిన చౌధురీ రహమత్ అలీ భారత్‌లో మూడు ముస్లిందేశాలు ఉండాలని ప్రతిపాదించాడన్నది మరిచిపోరాదు. మొదటిది పాకిస్తాన్. రెండవది నేటి బంగ్లాదేశ్. దానిని బంగిస్తాన్ అన్నాడు. మూడవది ఉస్మానిస్తాన్. అంటే హైదరాబాద్. ఉస్మానిస్తాన్ ఆలోచన వెనుక దాగున్న మతోన్మాద సూత్రాన్ని మరిచిపోరాదు. పాశ్చాత్య కూటమిలో చేరకూడదన్న భారత నేతల నిబద్ధతాపూర్వకమైన నిర్ణయం వల్లే బ్రిటిషర్లు భారత్‌ను దిగ్బంధనం చేసేందుకు పశ్చిమాన పాకిస్తాన్, తూర్పున తూర్పు పాకిస్తాన్ (తరువాత బంగ్లాదేశ్), ఉత్తరాన ముస్లిం జనాధిక్య జమ్మూ కశ్మీర్ సంస్థానం, దక్షిణాన ఉస్మానిస్తాన్ ఏర్పాటయ్యేలా ప్రయత్నించారు. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉండాలన్న నిజాం కుట్రలకు ఫ్రాన్స్, అమె రికా, కొలంబియా, కెనడా, సిరియా, బెల్జియం, అర్జెంటీనా వంటి పాశ్చాత్య కూటమి దేశాలు అందుకే సమర్థించాయి. రష్యా, చైనా, యుక్రేన్ వంటి కమ్యూనిస్టు దేశాలు భారత అలీన విధానాన్ని సమర్థించి, ఈ సామ్రాజ్యవాద యత్నానికి పురిట్లో సంధికొట్టాయి. లక్ష్మయ్య సర్వసాధారణ కమ్యూనిస్టులందరిలాగానే జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డిలను ప్రస్తావించారు. కానీ జటప్రోలు, రెంటచింతల, గద్వాల, కొల్లాపూర్, వనపర్తి, పాల్వంచ, సంస్థాన్ నారాయణపూర్ వంటి ఉప సంస్థానాల్లో విస్నూరు, మానుకోటల్లో లాగా ఎందుకు తిరుగుబాటు రాలేదో ప్రస్తావించలేదు. ఆదిలా బాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్ వంటి తెలంగాణ జిల్లాల్లో, ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగంగా ఉన్న మరాఠ్వాడా ప్రాంతాలైన బీడ్, పర్భనీ, నాందేడ్, లాతూర్, ఉస్మానాబాద్‌లలో, కళ్యాణ కర్ణాటక లోని బీదర్, రాయచూర్, గుల్బర్గాలలో సంస్థానాధీశులు లేరా? కొంత నల్గొండ, కొంత వరంగల్, కాసింత రంగారెడ్డి జిల్లాకి మాత్రమే ప్రధానంగా పరిమితమైన కమ్యూనిస్టుల పోరాటం ఈ మరాఠ్వాడా, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాల్లో ఎందుకు విస్తరించలేదు? మల్లె్లపల్లి లక్ష్మయ్య కన్వీనియంట్‌గా ప్రస్తావించని మరో విషయం ఉంది. ఘనత వహించిన నిజాం ప్రభువు 1943లో కమ్యూనిస్టులపై నిషేధాన్ని ఎందుకు ఎత్తివేశారు? దాశరథి రంగాచార్య తన ‘జీవన యానం’లో, వందేమాతరం రామచంద్రరావు తన ‘హైదరాబాద్‌పై పోలీసు చర్య’లో సెప్టెంబర్ 17 తరువాత రజాకార్ల ఆయుధాలన్నీ కమ్యూనిస్టుల చేతికి చేరాయని రాశారు. కమ్యూనిస్టులు దీనిని ఎందుకు ఖండించరు? సెప్టెంబర్ 17, 1948 తరువాత 1951 వరకూ కమ్యూనిస్టులు ఎవరిపై సాయుధ పోరాటం చేశారు? లేని నిజాంపైనా? ఉన్న భారత ప్రభుత్వం పైనా? భారత సేనలు అన్న పదానికి బదులు ‘యూనియన్ సేనలు’ అనే పదాన్ని ఉపయోగించి భారత వ్యతిరేక పోరాటానికి ఎందుకు రంగులద్దుతున్నారు? రావి నారాయణ రెడ్డి ఈ సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించారు. ప్రజలు భారత ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నా దానిపై పోరాటం చేయడం సరైనది కాదని చెప్పారు. సుందరయ్య–బసవపున్నయ్య–చండ్ర రాజేశ్వర త్రయం దానిని తోసిపుచ్చారు. ఈ మొత్తం ఉదంతాన్ని చాపకిందకి తోసి, సగం చరిత్ర చెప్పడానికి కారణమేమిటి? హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉండాలన్నది కమ్యూనిస్టుల లక్ష్యం. 1948–1951 వరకూ భారత్‌పై కమ్యూనిస్టులు పోరాడి, భారత ప్రభుత్వం పంపిన రాయబారి ద్వారకానాథ్ కాచ్రూను కలవడానికి నిరాకరించి, ఆ తరువాత 1952లో ఎలాంటి గ్యారంటీలూ పొందకుండానే, ఏమీ సాధించకుండానే మూడేళ్ల రక్తసిక్త పోరాటం ఆపి, ఎన్నికల్లో పాల్గొని తగుదునమ్మా అంటూ ఎంపీలు అయ్యారు. మరో అవాస్తవం సుందర్ లాల్ కమిటీ గురించి. దానిని భారత ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, నిజాం ప్రభువు కానీ నియమించలేదు. అది నెహ్రూ వ్యక్తిగతంగా పంపిన సుహృద్భావ ప్రతినిధి బృందం. పండిత్ సుందర్ లాల్, కాజీ మహ్మద్ అబ్దుల్ గఫార్లతో కూడిన ఈ బృందం ముస్లింలను కలిసి, భారత ప్రభుత్వం వారిని ఇబ్బంది పెట్టబోదని నమ్మకం కలిగించింది. (క్లిక్ చేయండి: పుస్తక ప్రచురణపైనా పెత్తనమేనా?) వాస్తవానికి హైదరాబాద్ సంస్థాన చరిత్రను మూడు వేర్వేరు ముక్కలుగా చదువుతున్నాం. కర్ణాటకలోని మూడు జిల్లాలు, మరాఠ్వాడాలోని జిల్లాల చరిత్రను తెలంగాణ చరిత్రతో కలిపి చదివితేనే సమగ్రత వస్తుంది. లేని పక్షంలో గుడ్డివాళ్లు ఏనుగుని వర్ణించినట్టు చదవడం జరుగుతుంది. అలా చేసినంత కాలమూ రెండు మూడు జిల్లాల చరిత్రనే మొత్తం 82 వేల చ.కి.మీ. వైశాల్యమున్న, కోటికి పైగా జనాభా ఉన్న, 17 జిల్లాలున్న సువిస్తృత సంస్థాన చరిత్రగా లక్ష్మయ్య గారు భ్రమించినట్టు భ్రమించడం జరుగుతుంది. (క్లిక్ చేయండి: చరిత్రను కాటేయ జూస్తున్నారు!) - కస్తూరి రాకా సుధాకర రావు సీనియర్ జర్నలిస్ట్ -
చల్నేదో బాల్ కిషన్
కతలు జెప్తున్నరు. చెవుల పూలు బెడ్తున్నరు. చెట్టు పేరు జెప్పి కాయలమ్ము కుంటున్నరు. కాయలను గాదు. ఏక్ దమ్ పండ్లనే అమ్ముకుంటున్నరు. ఎవలమ్ముకుంటున్నరు? ఎందు కమ్ముకుంటున్నరు? ఎవరంటె మన లీడర్లే. ఇంతకు గా చెట్టేంది? గది ఏందో గాదు. నిజాం చేత్లకెల్లి గుంజుకొన్న తెలంగాననే. బందూకులు బట్కోని రజాకార్ల తోని కొట్లాడినోల్ల గురించి మొన్నటిదాంక తప్పిజారి ఒక్క లీడర్ గుడ్క మాట్లాడలే. గియ్యాల గా లీడర్లే తీస్ మార్ కాన్ లెక్క ఫోజు గొడ్తున్నరు. గాల్లే నిజాం సర్కార్‌ను కూలగొట్టి తెలంగానకు సతంత్రం తెచ్చినట్లు మాట్లాడ్తున్నరు. గా దినం అయితారం. అంబటాల్లయింది. కడ్పులు ఎల్కలు చెంగడ బింగడ దుంకుతున్నయి. తలె ముంగట గూసున్న. కోడికూర తోని నా పెండ్లాం బువ్వ బెట్టింది. అంచుకు ఎల్లిగడ్డతొక్కు ఏసింది. సరింగ గప్పుడే మా తాత బోన్గిరి కెల్లి వొచ్చిండు. గాయిన పెండెం వాసుదేవ్, జైని మల్లయ్య గుప్త, గుండా కేశవులు, ముత్యం ప్రకాశ్, మాదాసు యాదగిరి అసువంటోల్లతోని గల్సి బందూకు బట్టి రజాకార్లతోని కొట్లాడినోడు. ‘‘తాతా! బువ్వ తిందురాయె’’ అన్న. గాయిన కాల్లు చేతులు గడుక్కోని నా పక్క పొంటి వొచ్చి గూసున్నడు. బువ్వ దినుకుంట ముచ్చట బెట్ట బట్టిండు. ‘‘ఇంతకుముందు టీఆర్ఎస్ మోటర్ బోయిన తొవ్వ మీదికెల్లే కడ్మ పార్టీలు బొయ్యేటియి. గని గిప్పుడు బీజేపీ ఏసిన తొవ్వ మీది కెల్లే టీఆర్ఎస్ మోటార్ బొయ్యే గతి బట్టింది’’ అని అన్నడు. ‘‘తాతా! నువ్వెప్పుడు రాజకీయాలే మాట్లాడ్తవేందే’’ ‘‘రాజకీయాలు గానిదేమన్న ఉన్నాదిర. బారతం రాజకీయమే. రామాయనం గూడ రాజకీయమే’’. ‘‘రామాయనం రాజకీయమెట్ల అయితదే?’’ ‘‘రాముని దిక్కు దుంకె బట్కె విబీషనుడు లంకకు రాజయిండు. నిజం జెప్పాలంటె పార్టీ ఫిరాయింపులు గాయినతోనే షురువైనయి’’ ‘‘బీజేపీ ఏసిన తొవ్వ మీదికెల్లే టీఆర్ఎస్ మోటర్ బోయిందంటివి. గదేందో జెర కుల్లకుల్ల జెప్పు తాతా’’ ‘‘మొన్న 17 తారీకు పరేడ్ మైదాన్ల సెంటర్ల ఉన్న బీజేపీ సర్కార్ తెలంగాన విమోచన దినం జేసింది. గా దాన్కి సెంటర్ హోం మంత్రి అమిత్ షా వొచ్చిండు. ‘మా సర్కారొస్తె సెప్టెంబర్ 17 తారీకు నాడు తెలంగాన విమోచన దినం జేస్తమన్నోల్లు గాల్ల సర్కారొచ్చినంక రజాకార్ల బయంతోని తెలంగాన విమోచన దినం జెయ్యలేదు. గియ్యాల మేము జేస్తుంటె అన్ని పార్టీలు జేస్తున్నయి’ అన్కుంట గాయిన స్పీచ్ గొట్టిండు’’. ‘‘ఇంతకుముందు కేసీఆర్ తెలంగాన విమోచన దినం ఎందుకు జెయ్యలేదు?’’ ‘‘విమోచన గాదు, మన్నుగాదు. గది జేస్తేంది, చెయ్యకుంటేంది. గదొక పెద్ద ఎజెండనా? గది జెయ్యకుంటె గీ దేసం ఏమన్న మున్గుతదా అని అసెంబ్లీల అన్న కేసీఆర్ ఇయ్యాల బీజేపీ సెట్ జేసిన ఎజెండలకే వొచ్చిండు. సమైక్యత వజ్రోత్సవం అన్కుంట కేసీఆర్ 17 తారీకు పబ్లిక్ గార్డెన్ల మూడు రంగుల జెండ ఎగిరేసిండు. ‘మత పిచ్చిగాల్లు దేసంను ఆగమాగం జేస్తున్నరు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తం. దలిత బందు తీర్గనే గిరిజన బందు బెట్టి ఒక్కో గిరిజన కుటుంబానికి పది లచ్చల రూపాయల వొంతున ఇస్తం’ అన్కుంట కేసీఆర్ స్పీచ్ గొట్టిండు’’ అని మా తాత జెప్పిండు. ‘‘హుజూరాబాద్ బై ఎలచ్చన్లు వొచ్చినప్పుడు దలిత బందు అన్నడు. మునుగోడు బై ఎలచ్చన్లు రాంగనే గియ్యాల గిరిజన బందు అంటున్నడు తాతా!’’ ‘‘అవ్ ఎలచ్చన్లు వొస్తేనే ముక్యమంత్రికి జెనం యాది కొస్తరురా’’ (క్లిక్: గటు దిక్కు బోవద్దు గన్పతీ!) ‘‘అమిత్ షాను బీజేపోల్లు అబినవ సర్దార్ పటేల్ అంటె, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కెసీఆర్‌ను అబినవ అంబేడ్కర్ అని అంటున్నడే’’ ‘‘వారీ! ఎల్క తోలును ఒక్క తీర్గ యాడాది ఉత్కితె యాడనన్న తెల్లగైతదా? అమిత్ షా సర్దార్ వల్లభాయ్ పటేలైతడా? కేసీఆర్ యాడనన్న అంబేడ్కర్ అయితడా?’’ అని మా తాత అడిగిండు. బువ్వ దిన్నంక గాయిన మంచం మీద ఒరిగిండు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) తోక: పొద్దు మీకింది. ఎప్పటి లెక్కనే చౌరస్తల ఉన్న పాన్ డబ్బకాడ్కి బోయిన. గాడ పాన్లు దినుకుంట మా దోస్తులు ముచ్చట బెడ్తున్నరు. ‘‘నమీబియాకెల్లి గాలిమోటర్ల ఎన్మిది చిర్తపులులను మనదేసం దెచ్చిండ్రు. గవ్విట్ల మూడు చిర్తపులులను కన్జరేషన్ బాక్సులకెల్లి కునో జాతీయ పార్క్‌లకు ప్రతాని మోదీ ఇడ్సి పెట్టిండు’’ అని యాద్గిరి అన్నడు. ‘‘నెలొద్దుల ముందుగాలనే గ్యాస్ బండ, పిట్రోలు అనేటి రెండు చిర్తపులులను ప్రతాని జెనం మీద్కి ఇడ్సిపెట్టిండు’’ అని మా సత్నారి అన్నడు. నివొద్దే గదా! - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
చరిత్ర వక్రీకరణ మహానేరం
చరిత్రను వక్రీకరించడం జనసంహారం చేసే ఆయుధాల కన్నా ప్రమాదకరం. అది ప్రజలను తరతరాలుగా తప్పుదోవ పట్టిస్తుంది. చరిత్ర ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, అది భావి తరాలకు మార్గదర్శి. తమ రాజకీయ, ఆర్థిక, సామాజిక అవసరాలకు చరిత్రను ఒక సాధనంగా చూడటమనేది స్వార్థ చింతన. చరిత్రకు మసిపూసి మారేడు కాయ చేయడమనేది ఒక రాజకీయ దృక్పథంగా మారిపోవడం విషాదం. ప్రస్తుతం తెలంగాణ సమాజం అదే విధమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. తెలంగాణ విమోచన, విలీనం, విద్రోహం, సమైక్యత అనే వాదాలు, వివాదాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది నిష్పాక్షిక దృష్టితో చూడాల్సిన బాధ్యత తెలంగాణ గడ్డపై ప్రతి ఒక్కరికీ ఉంది.తమ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరిస్తోన్న శక్తుల సంఖ్య గణ నీయంగా పెరిగిపోతున్నది. అందుకుగానూ అసత్యాలను, అర్ధ సత్యాలను తమ అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు. సమత, మమత, కరుణ, ప్రేమలకు ప్రతీకగా ఉన్న తెలంగాణ సమాజాన్ని విద్వేషపు విషంతో నింపాలని చూస్తున్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. హైదరాబాద్ రాష్ట్రం మూడు భాషాప్రాంతాల కలయిక. హిందూ, ముస్లిం, ఇతర సామాజిక వర్గాల సమ్మేళనంతో కలిసి నడిచిన గంగా–జమునా తెహెజీబ్. హైదరాబాద్ రాజ్యం కేవలం ముస్లింలు పాలించినది కాదు. రాజ్యానికి కేంద్రం నిజాం అయితే, గ్రామీణ ప్రాంతాలు హిందూ సామాజిక వర్గానికి చెందిన జమీం దారులు, జాగీర్దారుల కబంధ హస్తాల్లో ఉండేవి. నిజానికి పరోక్షంగా నిజాంలు సాగించిన దుర్మార్గాల కన్నా, ఎందరో జమీందారులు, జాగీర్దారులు సాగించిన అమానుషాలు ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ నిజాం పాలన అనగానే కేవలం నిజాం గుర్తుకు రావడమే సహజంగా జరుగుతోంది. ‘మానుకోట’(ఇప్పటి మహబూబాబాద్) జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డి లాంటి జమీందారులు జరిపిన దారుణాలు మనం చరిత్రలో మరెక్కడా చూడం. వీటన్నింటికీ రజాకార్ల దాడులు, దౌర్జన్యాలు తోడయ్యాయి. హిందూ జమీందార్లు, ముస్లిం రజాకార్లు ఒక కూటమిగా ఏర్పడ్డారు. రజాకార్ ఉద్యమం 1938లో ప్రారంభమైంది. కానీ 1947 నుంచి దౌర్జన్యాలకు వేదికగా తయారైంది. రజాకార్ అంటే స్వయం సేవకులు అని అర్థం. రజాకార్లలో కొందరు హిందువులు కూడా ఉండేవారు. ప్రభుత్వానికి అండగా ఉండడానికి రజాకార్లను వినియోగించాలన్న కొందరు ముస్లిం జమీదారుల ఒత్తిడికి తలొగ్గి వారికి ప్రత్యేకమైన అధికారాలను ప్రకటించారు. దీనితో రజాకార్లు కమ్యూనిస్టులపైనా, ఇతర ఉద్యమకారులపైనా దాడులు కొనసాగించారు. 1947 జూలై 30 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు రజాకార్లు విచ్చలవిడి దౌర్జన్యాలు చేసిన మాట నిజం. వాళ్ళను ప్రతిఘటించి ప్రజలకు రక్షణగా నిలి చింది కమ్యూనిస్టులే. జమీందారుల, భూస్వాముల దౌర్జన్యాలకు పరాకాష్ఠగా నిలిచిన దొడ్డి కొమరయ్య హత్యతో అంటే 1946 జూలై 4న కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం స్వతంత్రమైంది. ఆనాటికి 565 సంస్థానాలు ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించేనాటికి హైదరాబాద్ స్వతంత్ర పాలనా ప్రాంతంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసు కొన్నప్పకీ అన్ని విషయాల్లో స్వేచ్ఛగానే నిర్ణయాలు తీసుకునేది. బ్రిటిష్ ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి తన సైన్యాన్ని హైదరాబాద్‌లో ఉంచింది. అదే మనం ఇప్పుడు చూస్తోన్న హైదరా బాద్‌లోని కంటోన్మెంట్. 1947లో స్వాతంత్య్రం పొందిన భారతదేశం అన్ని సంస్థానాలను భారత యూనియన్‌లో కలపాలని అడిగింది. అందరూ ఒప్పుకున్నారు. కశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు తాము స్వతంత్రంగా ఉంటామని ప్రకటించుకున్నాయి. అందుకుగానూ భారత ప్రభుత్వం, హైదరాబాద్ రాజ్యం ఒక ఒడంబడికను కుదుర్చు కున్నాయి. దానినే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేటప్పుడు కొన్ని నిబంధ నలను పెట్టింది. అందులో ఒకటి, ఇప్పటివరకూ బ్రిటిష్ పాలనలో లేని సంస్థానం అటు పాకిస్తాన్‌లోగానీ, ఇటు భారతదేశంలో గానీ చేర వచ్చు. లేదా స్వతంత్రంగా ఉండవచ్చు. అయితే నిజాం స్వతంత్ర పాకి స్తాన్ ఆహ్వానాన్ని తిరస్కరించాడు. భారతదేశంతో మాత్రం స్నేహంగా ఉండడానికి అంగీకరించాడు. 1947లో ఉనికిలోకి వచ్చిన రజాకార్ల దాడులను ఆసరాగా తీసుకొని భారత ప్రభుత్వం నిజాం మీద ఆంక్షలను పెంచింది. ఆర్థికంగా దిగ్బంధనం చేసింది. భారత ప్రభుత్వం పెంచుతోన్న ఒత్తిడిని తట్టుకోలేక నిజాం ప్రభుత్వం 1948 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. భారత ప్రభుత్వం కొన సాగిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలనీ, తాము స్వతంత్రంగా కొనసాగే అవకాశం కల్పించాలనీ నివేదించింది. అది 1948 ఆగస్టు 21న చర్చలకు వచ్చింది. ఆ అభ్యర్థనను స్వీకరించాలా లేదా అనేది చర్చకు వచ్చినప్పుడు అందులో ఉన్న పది దేశాల్లో ఫ్రాన్స్, అమెరికా, కెనడా, కొలంబియా, సిరియా, బెల్జియం, అర్జెంటీనా అభ్యర్థనను స్వీకరించ డానికి తమ మద్దతును తెలియజేశాయి. రష్యా, చైనా, ఉక్రెయిన్ తటస్థంగా ఉన్నాయి. ఇది 1948 సెప్టెంబర్ 16న జరిగింది. అయితే దానిని ఒక రెండు రోజులు వాయిదా వేయాలని భారత ప్రభుత్వ ప్రతినిధులు తెరవెనుక కథ నడిపారు. అప్పటికే భారత సైన్యం హైదరాబాద్‌లో సైనిక చర్యలను ప్రారంభించింది. దాదాపు హైదరా బాద్ సంస్థానం పూర్తిగా ఆక్రమణకు గురైంది. తెల్లారితే సెప్టెంబర్ 17. ఆరోజు హైదరాబాద్‌ను హస్తగతం చేసుకున్నారు. సెప్టెంబర్ 17 మధ్యాహ్నంకల్లా నిజాం చేత భారత ప్రతినిధి కె.ఎం.మున్షీ ఒక ప్రకటన చేయించారు. హైదరాబాద్ ప్రభుత్వం తరఫున భద్రతా మండలిలో చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామనేది అందు లోని ప్రధానాంశం. సెప్టెంబర్ 12న మొదలుపెట్టిన సైనికదాడి మొదటి లక్ష్యం ఐక్యరాజ్య సమితి నుంచి ఫిర్యాదును వెనక్కి తీసుకునేటట్టు చేయడం. సైనిక చర్య జరిగిన సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు సైన్యం చేతిలో గానీ, అక్కడక్కడా జరిగిన ఘర్షణల్లోగానీ 25 వేల నుంచి 30 వేల మంది వరకు మరణించినట్టు నిజాం ప్రభుత్వం నియమించిన సుందర్‌లాల్ కమిటీ నివేదిక వెల్లడించింది. ఇది ఒక ఘట్టం. దీనినే మనం విమోచన అంటున్నాము. విమోచన అంటే శత్రువును పదవీ చ్యుతుడిని చేయాలి. కానీ అలా జరగలేదు. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరుమీదనే 1950 జనవరి 26 వరకు ప్రభుత్వం నడిచింది. ఆ తర్వాతనే హైదరాబాద్ భారత ప్రభుత్వంలో అధికారికంగా భాగమైంది. 1948 సెప్టెంబర్ 17న నిజాంను లొంగదీసుకున్న తరువాత భారత సైన్యం కమ్యూనిస్టులపై యుద్ధం ప్రకటించింది. అప్పటి వరకు ప్రజలను దోచుకున్న దొరలు, భూస్వాములు, జమీందారులు, జాగీర్దార్లు కమ్యూనిస్టుల పోరాటంతో ఊళ్ళొదిలి పెట్టారు. భారత సైన్యం రావడంతో, కాంగ్రెస్ టోపీలు పెట్టుకొని మళ్ళీ పల్లెలకు వచ్చారు. భారత సైన్యం, భూస్వాములు, గూండాలు కలిసి ఊరూరునీ వల్లకాడుగా మార్చేశారు. 1948 సెప్టెంబర్ 17 నుంచి 1951 అక్టోబర్ సాయుధ పోరాట విరమణ వరకూ దాదాపు 4 వేల మంది కమ్యూనిస్టులతో పాటు, వేలాది మంది సాధారణ ప్రజలు చనిపోయారు. మరి 1948 సెప్టెంబర్ 17న విమోచన అయితే, 1951 వరకు భారత సైన్యం తెలంగాణ పల్లెలపై ప్రకటించిన యుద్ధం ఎవరి విమోచనం కోసం జరిగింది? కాబట్టి సెప్టెంబర్ 17న జరిగింది నిజాం బలవంతపు లొంగుబాటుగానే చరిత్ర మనకు చెబుతున్నది. ఆ తర్వాత మూడేళ్ళ పాటు తెలంగాణ పల్లెల్లో నెత్తురు ప్రవహించింది. అందువల్ల మనం సెప్టెంబర్ 17న జరపాల్సింది సంబురాలు కాదు. మనల్ని మనం సింహావలోకనం చేసుకోవడమే. రజాకార్ల దౌర్జన్యా లనూ, అమానుషాలనూ ఎండగట్టాల్సిన సమయమిదే. కానీ భారత సైన్యం జరిపిన నరమేధాన్ని తక్కువ చేసి చూడటం ముమ్మాటికీ సరికాదు. తెలంగాణ ప్రజలు అటు నిజాం రాజు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్ల దోపిడీ, దౌర్జన్యాలకు బలైపోయారు. రజాకార్ల అమానుషాలను అనుభవించారు. అదేవిధంగా భారత సైన్యం చేసిన విధ్వంసాన్ని, వినాశనాన్ని కూడా చవిచూశారు. ఇదే వాస్తవం. ఇదే నగ్న సత్యం. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
జునాగఢ్ ఉత్సవాలు ఎందుకు నిర్వహించరు?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తోపాటు గుజరాత్‌లోని జునాగఢ్‌కు కూడా ఒకేసారి స్వాతంత్య్రం వచ్చిందని, మరి బీజేపీ నేతలు అక్కడ ఎందుకు వజ్రోత్సవాలు నిర్వహించడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజ నాల కోసం సెప్టెంబర్ 17ను ఓ ఆయుధంగా ఉపయోగించుకోవాలని బీజేపీ చిల్లర వేషా లు వేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా శనివారం ఇక్కడి గాంధీభవన్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ద్దేశించి ఆయన మాట్లాడుతూ గుజరాత్లో ఉత్సవా లు జరిపిన తర్వాతే హైదరాబాద్‌లో విమో చన ఉత్సవాలు జరపాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మతకల్లోలాలు సృష్టించి పెట్టుబడులను గుజరాత్‌కు తరలించుకు పోవాలనే కుట్రతోనే ఇక్కడ కొత్త వేషాలు కడుతున్నారని విమర్శించారు. రెచ్చగొట్టే కార్యక్రమాలు కాకుండా తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అమలు చేసే ప్రణాళికలేంటో వివరించాలని డిమాండ్ చేశారు. సర్దార్ పటేల్ మా వాడు... హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తమ వాడని, ఆయనది కాంగ్రెస్ కుటుంబమని, తమ నుంచి పటేల్‌ను ఎవరూ విడదీయలేరని రేవంత్ వ్యాఖ్యానించారు. పటేల్ తన హయాంలో ఆర్ఎస్ఎస్ను నిషేధించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ చరిత్రను దొంగిలించి తమ చరిత్రగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ చిచ్చుపెట్టే పరిస్థితులు టీఆర్ఎస్ వల్లే ఏర్పడ్డాయని విమర్శించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో బీజేపీ, టీఆర్ఎస్ల కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం సబ్బండ వర్గాలను ప్రతిబింబించే విధంగా కాంగ్రెస్ రూపొందించిన తెలంగాణతల్లి విగ్రహాన్ని రేవంత్ ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని రూపొందించిన శిల్పిని సన్మానించారు. కార్యక్రమంలో పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావెద్, అంజన్‌కుమార్ యాదవ్, మల్రెడ్డి రంగారెడ్డి, ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు, సిటీ కాంగ్రెస్ నాయకులు విజయారెడ్డి, రోహిణ్‌రెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం తెలంగాణ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ప్రముఖ కాంగ్రెస్ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు వేమవరపు మనోహర్ పంతులుతోపాటు పలువురిని రేవంత్ శాలువాలతో సన్మానించి, వారికి పాదాభివందనం చేశారు. ఆపై ఇందిరా భవన్లో జరిగిన టీపీసీసీ ఎక్స్ సర్వీస్‌మెన్ సెల్ చైర్మన్ పి.రాజేంద్రన్ పదవీబాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ మాజీ సైనికులకు నెలలో బెనిఫిట్స్ అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం ఇదీ చూడండి: మతోన్మాద శక్తులు వస్తున్నాయి.. జాగ్రత్త! -
తెలంగాణ నిజానిజాలు గమనిస్తోంది!
ఇప్పుడు తెలంగాణ ఎట్లుంది? తెలంగాణ తెగదెంపుల సంగ్రామంలో తెగించి స్థిర పడిన తెలంగాణ తనను తాను చూసుకుంటోంది. రేపటి భవిష్యత్తుపై గంపెడు ఆశలతో కలలు కంటోంది. మార్పును ప్రతినిత్యం కోరుకునే తెలంగాణ ఊహించని మార్పులతో ఊహకందనంత వేగంతో అభివృద్ధి చెందుతోంది. విషాదాల కొలిమి, విప్లవాల పొలి కేకలు, ఫెళఫెళ కూలిపడ్డ ఆధిపత్య అహంకారాలు... పాఠ్యాంశాలుగా మారిన తెలంగాణ ఇప్పుడు నిజానిజాల నిగ్గు తేల్చు కుంటోంది. ఎవరిది విద్రోహమో, ఏది విలీనమో, ఏది బల ప్రయోగమో, గాయాలు ఎక్కడ తగిలాయో, గేయాలై ఎక్కడ పలికాయో, సున్నితపు ఐకమత్యపు తెలంగాణ తీగలను ఎవరు తెంచ చూశారో... మళ్లీ అన్నింటినీ కలిపి జాతీయ ఐకమత్య మహానదిగా మన తెలంగాణను ఎవరు మారుస్తున్నారో... అంతా తెలంగాణ బిడ్డలకు తెలుసు. దయచేసి మళ్లీ ఇప్పుడు తెలంగాణ పాత గాయాల కట్లు విప్పి కారం చల్లే పనులు ఎవరూ చేయకండి. తరతరాల సామాజిక తాత్విక సహజత్వ జీవ జలపాతం తెలంగాణతనం. అబ్బురపరిచిన ఆశ్చర్యాల నుంచీ, నిప్పుల వర్షాల నుంచీ... సకల జనుల ప్రశాంత వెండి వెన్నెల సిరుల పందిరిగా మారిన తెలంగాణను సంరక్షించుకుందాం, పరిరక్షించుకుందాం. మానవీయ సంస్కృతికి పట్టుగొమ్మయిన తెలంగాణ అత్యున్నత మానవ సమాజ నిర్మాణం వైపు పయనించమంటోంది. ఈ కుళ్ళు కులసంకెళ్లను తెంచమంటోంది. కమ్ముకొస్తున్న మత మబ్బుల్ని చెదరగొట్టమంటోంది. ఒకనాడు భూమి, భుక్తి, విముక్తి అంటూ నినదించి ముందుకు సాగిన తెలంగాణ ఇప్పుడు ప్రతి మనిషినీ సంపదగా మార్చి ప్రపంచానికి ఒక నూతన సందేశం ఇవ్వమంటోంది. అన్నార్తులు, అనాథలు కానరాని సమాజ నిర్మాణం చేయమంటోంది. గంగా జమున తెహజీబ్ సంస్కృతిని విత్తనాలుగా చల్లి మహోన్నత మానవీయ పాఠంగా దేశాన్నే తీర్చిదిద్దుకుందాం అంటోంది. జాతీయ సమైక్యత దినోత్సవ మహాసందేశంగా జాతిగీతమై మోగ మంటుంది. తరతరాల వారసత్వ చరిత్రకు ఎవరు పేటెంట్ దారులు కాదని తెలంగాణ పదేపదే చెబుతోంది. ప్రపంచానికి పిడికెడు అన్నం పెడుతున్న రైతు భారతానికి పట్టాభిషేకం చేయమంటోంది తెలంగాణ. వ్యవసాయాన్ని పరిశ్రమలుగా మార్చి, పండించిన పంటలకు రైతు కూలీలనే అత్యా ధునిక వ్యవసాయ పరిశ్రమల యజమానులను చేయమంటోంది. సాటి మనుషుల్ని కుల మతాల పేరుతో వెంటాడుతున్న ఆటవిక సంస్కృతిని దరిదాపుల్లోకి రానీయకుండా మానవీయ మహా కోటను నిర్మించుకుంది తెలంగాణ. ఆధిపత్య కుల అహంకార పదఘట్టనల కింద పశువుగా ప్రవర్తించే దుర్మార్గ సంస్కృతిని దరిదాపులకు రాకుండా సరిహద్దు సైనికునిగా పహారా కాస్తోంది తెలంగాణ. ఆదివాసీ గిరిజన వికాసంలో భాగంగా ‘మా గూడెంలో మా రాజ్యం’, ‘మా తండాలో మా రాజ్యం’ అన్న కలలను నిజం చేస్తోంది తెలంగాణ. పేదలైన ముస్లింలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు దక్కాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మైనారిటీ పిల్లలకు ఒక్క తెలంగాణ లోనే 1160 గురుకులాలను పెట్టి కార్పొరేట్ స్థాయి చదువు అందిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ వేలాది గురుకులాలు రావాలని తలుస్తోంది తెలంగాణ. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును నూతన సచివాలయానికి పెట్టి ఎద ఎదలో రాజ్యాంగ రక్షణ స్ఫూర్తిని చాటింది. దేశ పార్ల మెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టమని నినదిస్తున్న ఆచరణవాది తెలంగాణ. సస్యశ్యామల దేశంలో క్షామాలు, నిరుద్యోగ రక్కసులు, రైతుల ఆత్మహత్యలు ఉండకూడదని నడుంబిగించింది తెలంగాణ. నెర్రెలు బాసిన కరువు భూముల్లోకి గంగమ్మను రప్పించేందుకు కాళేశ్వరాన్ని కట్టుకొని జలకళతో నిండింది తెలంగాణ. ఇంటింటికీ ‘మిషన్ భగీరథ’నిచ్చి గొంతు తడిపిన తెలంగాణ... దేశానికి ఆ పథకాన్ని ఎందుకు అందించలేమని పయనమవుతోంది. దేశంలో జరగాల్సింది జాతీయ సమైక్యతా ఉత్సవాలు కానీ విద్వేష ఉత్సవాలు కాదని గొంతెత్తి పిలుస్తోంది తెలంగాణ. పగలు సెగలులేని, పరమత ద్వేషాలు లేని దేశమే సకల సంపదలతో తులతూగుతుందని ఆచరణాత్మకంగా తెలంగాణ తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. దళితుల ఆత్మగౌరవ జెండాగా నిలిచిన ‘దళిత బంధు’ పథకాన్ని పెట్టి వాళ్లను ఉత్పత్తి శక్తులుగా తీర్చి దిద్దుతున్న తెలంగాణ దేశంలో దళితులంతా ఇట్లనే వర్ధిల్లాలని తలంచుతోంది. బహుజనులకు ఆత్మగౌరవ భవనాలనిచ్చి ఆయా కులాల సామాజిక ఎదుగుదలకు ఇంతగా కృషిచేసిన రాష్ట్రం దేశంలో మరోటి లేదంటోంది తెలంగాణ. ఇప్పుడు అన్ని రంగా లలో పురోభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణను చూస్తున్నాం. వర్ధిల్లు వీర తెలంగాణ ! వర్ధిల్లు సామరస్య తెలంగాణ! జూలూరీ గౌరిశంకర్ (ఛైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమి) -
విలీనం తర్వాత 12 మందికి ఉరిశిక్ష..చివరి క్షణాల్లో దిగొచ్చి..
సాక్షి, మిర్యాలగూడ, కోదాడ: నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అక్కినెపల్లి, షా అబ్దుల్లాపురం గ్రామాల్లో జరిగిన దొరల, రజాకార్ల హత్య కేసులో నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి (నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే), దోమల జనార్ధన్ రెడ్డి, గార్లపాటి రఘుపతిరెడ్డి, దూదిపాల చినసత్తిరెడ్డి, మేర హనుమంతు, మాగి వెంకులు, దాసరి నారాయణరెడ్డి, వడ్ల మల్లయ్య, ఎర్రబోతు రాంరెడ్డి, మిర్యాల లింగయ్య, కల్లూరి ఎల్లయ్య, గులాం దస్తగిరికి ప్రత్యేక ట్రిబ్యునల్ 1949 ఆగస్టు 13, 14న మరణశిక్ష వేసింది. ఉరిశిక్ష పడిన వెంకులు (14), ఎర్రబోతు రాంరెడ్డి(15), నంద్యాల శ్రీనివాసరెడ్డి (20) తోపాటు నల్లా నర్శింహులు (22) నల్లగొండ జైల్లో ఉండగా టైమ్ పత్రికకు చెందిన ఓ మహిళా జర్నలిస్టు వారిని కలిసి మైనర్ అయిన ఎర్రబోతు రామిరెడ్డి ఫొటోతో వ్యాసం రాసింది. అది పెను సంచలనంగా మారింది. లండన్ న్యాయవాది డీఎన్ ప్రిట్, బొంబాయ్ నుంచి డేనియల్ లతీఫ్, గణేష్ షాన్‌బాగ్ వంటి న్యాయవాదులు స్థానిక న్యాయవాది మనోహర్‌లాల్ సక్సేనాతో కలిసి మరణశిక్ష ఆపేందుకు ప్రయత్నించారు. అంతర్జాతీయంగా ఉరిశిక్ష లకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. జెకొస్లోవేకియాలో 10 వేల మందితో భారీ నిర్వహించారు. దీంతో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ క్షమాభిక్షతో మరణశిక్ష కాస్తా యావజ్జీవ శిక్షగా మారింది. 1956లో కొందరు, దీంతో 1958లో మరికొందరు విడుదలయ్యారు. నిజాంపై గర్జించిన కృష్ణా జిల్లా సాక్షి, అమరావతి: తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉధృతం చేయడంలో, రజాకార్లను ఎదుర్కోవడంలో కృష్ణా జిల్లాకు ఘనమైన చరిత్ర ఉంది. 1944లో మొదలైన తెలంగాణ సాయుధ పోరాటం దొడ్డి కొమరయ్యను రజాకార్లు కాల్చేయడంతో తీవ్రరూపం దాల్చింది. నల్లగొండ జిల్లాలో మొదలైన ఉద్యమం క్రమంగా విస్తరించింది. కృష్ణా జిల్లా నుంచి అనేక మంది నేతలు ఈ సాయుధ పోరుకు ఊతమిచ్చారు. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య విజయవాడ నుంచే ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు. సోవియట్ యూనియన్ తరహాలో విజయవాడలో ‘కమ్యూన్’ఏర్పాటు చేశారు. వడిసెలు, రాళ్లు, కత్తులు వంటి ఆయుధాల ప్రయోగం, తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇచ్చారు. పగలంతా కలిసికట్టుగా శ్రమ చేసి సంపాదించిన సొమ్ముతో ఒకే చోట వండుకుని భోజనాలు చేసేవారు. రాత్రి సమయాల్లో యుద్ధ విద్యల్లో శిక్షణ పొందేవారు. ఇక్కడ శిక్షణ పొంది వెళ్లి నల్గొండ జిల్లాలో దళాలు ఏర్పాటు చేశారు. దళాల నేతృత్వంలోనే సాయుధ దాడులు జరిగాయి. ఈ పోరాటాల్లో జిల్లాకు చెందిన 13 మంది ప్రాణత్యాగాలు చేశారు. ‘దారి’ చూపిన ‘మెతుకుసీమ’ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యంపై పోలీసు చర్య చేపట్టాలని నిర్ణయించిన రోజులవి. అప్పటి కేంద్రహోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవతో ఇండియన్ యూనియన్ సైన్యం హైదరాబాద్ రాజ్యాన్ని చుట్టుముట్టింది. ఉత్తరాన ఉన్న ఔరంగాబాద్ వైపు నుంచి సైనికచర్య మొదలైంది. ఉమ్మడి మెదక్ జిల్లా మీదుగానే హైదరాబాద్ రాజ్యంలోకి ప్రవేశించింది. అదెలా జరిగిందంటే.. నిజాం ప్రైవేట్ సైన్యం అయిన రజాకార్లు లాతూర్(మహారాష్ట్ర) నుంచి జహీరాబాద్ (సంగారెడ్డి జిల్లా)కు రైలులో బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా భారత సైన్యం బాంబుల మోత మోగించింది. దీంతో రజాకార్లు రైలు దిగి పరుగెత్తారు. ట్రక్కుల్లో పారిపోయారు. కొన్నిట్రక్కులు అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతల్లో కూరుకుపోయాయి. అప్పటికే దౌల్తాబాద్, హుమ్నాబాద్, జాల్న ప్రాంతాలు భారతసైన్యం వశమయ్యాయి. 1948 సెప్టెంబర్ 16 భారత సైన్యం జహీరాబాద్ వైపు రోడ్డుమార్గంలో వస్తుండగా రజాకార్లు ఎక్కెల్లి (ప్రస్తుతం కర్ణాటకలో ఉంది) వంతెనను కూల్చేశారు. అయితే భారత సైన్యం తాత్కాలిక వంతెన నిర్మించుకుని ముందుకు సాగడంతో నిజాంసేన చెల్లాచెదురైంది. ఇలా జహీరాబాద్‌ను భారత సేనలు వశపరుచుకున్నాయి. 1948 సెప్టెంబర్ 17 భారతసైన్యం జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా పటాన్చెరు ప్రాంతంలో రజాకార్లు రోడ్డుకు ఇరువైపులా పేలుడు పదార్థాలు ఉంచారు. అప్రమత్తమైన భారతసైన్యం రూట్ మార్చి బొల్లారం మీదుగా ముందుకు సాగాయి. 1948 సెప్టెంబర్ 18 (సాయంత్రం 4 గంటలు): భారత సైన్యం బొల్లారం చేరింది. నిజాం సైన్యాధ్యక్షుడైన ఎల్.ఎద్రూస్ తన ఆయుధాలను వీడి భారత సైన్యం మేజర్ జనరల్ జేఎన్ చౌదరి ఎదుట లొంగిపోయారు. దీంతో ప్రజలు జయజయ ధ్వానాలతో భారత సైనికులకు స్వాగతం పలికారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు పొందామని ఆనందోత్సవాలు చేసుకున్నారు. -
జాతీయాలతో జాతి భాష సంపన్నం
సెప్టెంబర్ 17, 2005. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటోన్న వేళ ఉదయం 10 గంటలకు వేముల పెరుమాళ్లు లేరన్న విషయం తెలిసింది. తెలంగాణ భాష కోసం, తెలంగాణ జాతీయాల కోసం, తెలంగాణ జానపదుల కోసం, తెలంగాణ సామెతల కోసం, తెలంగాణ పల్లె పదాల కోసం జీవితాంతం కృషి చేసిన వేముల పెరుమాళ్లు.. సరిగ్గా తెలంగాణ విమోచనం రోజే లోకాన్ని వీడడం యాధృచ్చికమే కావొచ్చు కానీ మరిచిపోలేని జ్ఞాపకంగా తన మరణాన్ని మార్చుకోవడం మాత్రం గొప్ప విషయం. తెలుగు సంస్కృతి అంతా ఒక్కటే! అయినా తెలంగాణ సంస్కృతిలో కొంత భిన్నత్వం ఉంది. భాషలో యాసలో ప్రత్యేకత ఉంది. అందుకు కారణం సుమారు ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా పరాయి పాలనలో తెలుగు చదవడం, రాయడం నిషేధింపబడ్డ రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలు వారి భాషను, యాసను పదిల పరుచుకున్నారు. వారి సామెతల్ని, జాతీయాల్ని , మౌఖిక సాహిత్యాన్ని, లిఖిత సాహిత్యాన్ని భద్ర పరుచుకున్నారు. నిజాం పాలకులు సృష్టించిన ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ఇక్కడి ప్రజలు వాటిని కాపాడుకోవడం ఒక సాహసవంతమైన చర్య. "సాలు పొంటి సాలు తీరు"గా వారి అవ్వ నుంచి మారుమూల గ్రామీణుల నుంచి వాళ్ల వాక్కును కల్తీ కాకుండా తన భాషగా చేసుకుని కాలగర్భంలో కలిసిపోగా మిగిలిన (పోయింది పొల్లు ఉన్నది గట్టి) జాతీయాల్ని ఏర్చికూర్చి "తెలంగాణ జాతీయాలు"గా గ్రంథస్తం చేశారు. ఉడుం పట్టు, దీక్ష కార్య శూరత్వం గల వారు ఎలాంటి మహాకార్యాన్నయినా అలవోక గా చేయగలరని తెలంగాణ జాతీయాలు పుస్తకం చూస్తే తెలుస్తుంది. వేముల పెరుమాళ్లు స్వస్థలం నాటి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల తాలుకా రాయికల్ గ్రామం. రాయికల్, కోరుట్ల, జగిత్యాలలో విద్యాభ్యాసం చేసిన పెరుమాళ్లు.. శ్రీకాళహస్తిలోని గ్రామసేవక్ శిక్షణా కేంద్రం నుంచి గ్రామీణాభివృద్ధిలో డిప్లమో చేశారు. 1963 నుంచి 18 ఏళ్ల పాటు గ్రామీణాభివృద్ధి అధికారిగా మల్యాల, జగిత్యాల పంచాయతీ సమితులలో ఉద్యోగం చేశారు. 1981లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి జగిత్యాల పంచాయతీ సమితి అధ్యక్ష ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాయికల్ మొదటి మండలాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉద్యోగం, రాజకీయం.. ఏ రంగంలో ఉన్నా.. సాహిత్యాన్ని మాత్రం మరవలేదు పెరుమాళ్లు. దశాబ్దకాలంగా కష్టనష్టాలకు ఓర్చి, పేర్చి కూర్చిన ఈ గ్రంథం తెలంగాణ జాతీయాలకు, సామెతలకు నిఘంటవుగా నేటికి ప్రతిబింబిస్తుంది. నోసుక పుట్టినట్టు వీరి మరణానంతరం తెలంగాణ జాతీయాల్ని ఇంటర్ ప్రథమ సంవత్సరం పాఠ్యాంశంగా స్వీకరించి వీరి శ్రమకు, తెలంగాణ భాషకు, యాసకు సముచిత గౌరవాన్ని కల్పించడం వీరికే కాదు తెలంగాణ జాతీయాలకు అగ్రాసనం వేసినట్టయింది. పెరుమాళ్లు తాత కైరం భూమదాసు గొప్ప వైష్ణవ భక్తుడు, కవి, గాయకుడు. కైరం భూమదాసు వ్రాతప్రతులను పరిష్కరించిన పెరుమాళ్లు 2002లో "వరకవి కైరం భూమదాసు కృతులు" గ్రంథాన్ని ప్రచురించారు. 1958 నుంచి 1968 మధ్య కాలంలో జరిగిన ఎన్నో జాతీయ పరిణామాలను వీరు పద్యాలుగా మలిచారు. వీరు రచించిన శ్రీ రాజరాజేశ్వర, శ్రీ ధరమపురి నృకేసరి శతకాలు సంబంధిత దేవాలయాలు ప్రచురించాయి. బాల సాహిత్యంలో వీరు చేసిన కృషి ఫలితంగా కిట్టూ శతకం (బాలనీతి), నిమ్ము శతకం (పర్యావరణ) వెలువడ్డాయి. మహాత్ముని మహానీయ సూక్తులను "గాంధీమార్గం" త్రిశతిగా రచించారు. "లోగుట్టు" వీరు రచించిన రాజనీతి చతుశ్శతి. ఎంతో కాలం వీరు సేకరించిన జాతీయాలు, సామెతలతో వెలువడిన గ్రంథం "తెలంగాణ జాతీయాలు". పెరుమాళ్లు మరణానంతరం వెలువడిన గ్రంథం మానవతా పరిమళాలు. 1983 నుంచి 2001 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి చేసిన "జ్యోతిపథం" లఘు ప్రసంగాల సంకలనం. జానపద సాహిత్యం కూరాడుకుండ లాంటిది. దానిని మైల పరచకుండా చూసే బాధ్యతని సాహితీప్రియులందరిపై వేశారు పెరుమాళ్లు. జానపదుడు రుషీసుంటోడు, ఆయన నోట వెలువడ్డ జాతీయం, సామెత గంగలో రాయిలాంటిది. ఎన్నో వందల సంవత్సరాలు అది ప్రజల నోళ్లలో నాని రగిడిల్లింది. తెలంగాణ జాతీయాలు తరతరాల మన సామాజిక చరిత్రకు సజీవ సాక్ష్యం. చిల్లి బొక్కతీరు లక్షల్లో వున్న తెలంగాణ జాతీయాల్ని వేలలో "పోయింది పొల్లు, ఉన్నది గట్టి తీరు"గా గ్రంథస్తం చేశారు పెరుమాళ్లు. ఇంకా ఎన్నో ప్రాంతాల్లో సజీవంగా జానపదుని నాలుకపై తచ్చాడుతున్న జాతీయాల్ని.. ఔత్సాహికులు మరింత శ్రమించి కొత్త సంపదను జాతికి ఇవ్వాలన్న వారి కోరిక తీర్చాల్సిన తరుణం మళ్లీ వచ్చింది. అదే తెలంగాణ సాహిత్యానికి తిరిగి చెల్లించాల్సిన రుణం. వి.ప్రభాకర్, తెలంగాణ కవి, రిటైర్డ్ రిజిస్ట్రార్, సహకారశాఖ -
గిరిజన రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఆదివాసీ, బంజారా భవన్లను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. గిరిజన బిడ్డల సమస్యల పరిష్కారం కోసం రెండు భవన్‌లూ వేదికలు కావాలని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం శాస్త్రీయంగా, సరైన పంథాలో చర్చలు జరగాలని ఆకాంక్షించారు. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం ఆదివాసీ-బంజారా ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆదివాసీ- బంజారా ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి వారం రోజుల్లో జీవో జారీ చేస్తామని వెల్లడించారు. దళిత బంధులాగే.. త్వరలోనే గిరిజన బంధు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. భూమి లేని గిరిజనులకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఇది టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫైట్ కాదు.. కేంద్రం తీరుపై కేటీఆర్ ఫైర్ ఇంకా మాట్లాడుతూ.. ‘సంపద పెంచడం, అవసరమైన పేదలకు పంచడమే మన సిద్ధాంతం. ఉమ్మడి ఏపీలో గిరిజనులకు 5 శాతం రిజర్వేషన్లే వర్తించాయి. రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఏడేళ్ల కిందట కేంద్రానికి పంపాం. ఆ బిల్లును ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నిస్తున్నా. విభజన రాజకీయం మొదలు పెట్టిన హోంమంత్రిని అడుగుతున్నా. గిరిజన రిజర్వేషన్లను మీరు ఎందుకు తొక్కిపెడుతున్నారు. మోదీ పుట్టిన రోజున చేతులు జోడించి అడుగుతున్నా. రిజర్వేషన్లను రాష్ట్రపతి ఆమోదం పొందేలా చూడండి రిజర్వేషన్లు వెంటనే పెంచాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తోంది. మా న్యాయమైన హక్కునే మేం అడుగుతున్నాం. పోడు రైతలకు ఇచ్చేందుకు భూములు గుర్తించాం. పోడు భూములు రైతులకు ఇచ్చి రైతు బంధు కూడా ఇస్తామని హామీ ఇస్తున్నా. గురుకులాల సంఖ్యను ఇంకా పెంచుతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణను కల్లోలానికి గురికానివొద్దు. మోదీ మా జీవోను గౌరవిస్తావా? లేక దాన్నే ఉరితాడు చేసుకుంటావా’ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. చదవండి: అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. తెలంగాణ కాంగ్రెస్ సీన్ నుంచి అవుట్.. -
ఇది టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫైట్ కాదు.. కేంద్రం తీరుపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ తీరుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఫెడరల్ వ్యవస్థను కేంద్రం ఏ మాత్రం గౌరవించడం లేదని విమర్శించారు. సెప్టెంబర్ 17 వేడుకలపై కేంద్రం రాష్ట్ర అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. తమకు పోటీగా కార్యక్రమాలు నిర్వహించారని దుయ్యబట్టారు. ఇది టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫైట్ కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా టీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకai నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు లంగాణలో సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. చదవండి: కిషన్‌రెడ్డి ప్రసంగానికి కేటీఆర్ కౌంటర్ -
Telangana Liberation Day 2022: మందు పాతరలు.. చివరి అస్త్రం
సాక్షి, హైదరాబాద్: భారత ప్రధాన సైన్య విభాగం బొల్లారం చేరకుండా చివరి ప్రయత్నంగా నిజాం సైన్యం మందుపాతర్లను ప్రయోగించింది. షోలాపూర్–హైదరాబాద్ రహదారి మీదుగా వస్తున్న మేజర్ జనరల్ చౌదురీ నేతృత్వంలోని సైనిక బృందాన్ని హతమార్చేందుకు నిజాం సైన్యం సికింద్రాబాద్‌కు 20 మైళ్ల దూరంలో పెద్ద సంఖ్యలో మందుపాతర్లను అమర్చింది. అదే సమయంలో భారత సైన్యానికి పట్టుబడ్డ కొందరు నిజాం సైనికులు ఈ విషయాన్ని వెల్లడించారు. వాటిని తొలగించాల్సిందిగా భారత సైన్యం ఆదేశించింది. కానీ, వాటిని జాగ్రత్తగా వెలికితీసే విధానంపై అవగాహన లేకపోవడంతో ఆ సైనికులు చేతులెత్తేశారు. దీంతో భారత సైన్యంలోని నిపుణులు ఐదు గంటలు కష్టపడి వాటిని గుర్తించి, నిర్వీర్యం చేశారు. ఈ మందుపాతర్ల వ్యవహారం వల్ల భారత సైన్యం ఐదు గంటలు ఆలస్యంగా బొల్లారం చేరుకుంది. సాయంత్రం నాలుగున్నరకు సికింద్రాబాద్ శివార్లలో నిజాం సైన్యాధ్యక్షుడు మేజర్ జనరల్ ఎడ్రూస్ ఎదురేగి చౌదురీ బృందానికి స్వాగతం పలికాడు. నిజాం సేనల లొంగుబాటు పత్రాన్ని సమర్పించాడు. ఇండియన్ ఆర్మీని తోడ్కొని భారత ప్రభుత్వ ప్రతినిధి మున్షీ భవనానికి తీసుకెళ్లాడు. 20 మంది భారత సైనికులు మృతి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు జరిగిన ఆపరేషన్‌లో భారత సైన్యం 20 మంది జవాన్లను కోల్పోయింది. అతి తక్కువ ప్రాణనష్టంతో గొప్ప విజయాన్ని సాధించినట్టయింది. 600 మంది నిజాం సైనికులు, 1,000 మందికిపైగా రజాకార్లు ఈ ఆపరేషన్ పోలోలో మరణించినట్లు అప్పట్లో లెక్కలు తేల్చారు. (క్లిక్ చేయండి: అణచివేతపై సాయుధ పోరాటం!) కృత్రిమ వరదలకు కుట్ర భారత సైన్యాన్ని అడ్డుకునే క్రమంలో మూసీ నదిలో రజాకార్లు కృత్రిమ వరదలు సృష్టించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌కు మంచినీరు సరఫరా చేసే హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల గేట్లను ధ్వంసం చేసి మూసీలోకి భారీగా వరద వచ్చేలా చేశారు. నదిలో వరద నిండుగా ఉంటే భారత సైన్యం ముందుకు రాలేదన్నది వారి ఆలోచన. కానీ, ఈ ప్రతిబంధకాలను విజయవంతంగా అధిగమించి భారత సైన్యం నగరంలోకి చొచ్చుకొచ్చింది. రజాకార్ల దుశ్చర్యతో హైదరాబాద్‌ను కొంతకాలం పాటు తాగునీటి కష్టాలు చుట్టుముట్టాయి. (క్లిక్: జిన్నా చనిపోయిన రోజే ముహూర్తం.. చకచకా పావులు కదిపిన సర్దార్ పటేల్) -
hyderabad: రెండు చోట్ల విమోచన వేడుకలు.. ఈ రూట్లలో జర్నీ వద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా విజయోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే.శనివారం మధ్య మండల పరిధిలో రెండు కీలక, భారీ కార్యక్రమాల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ విభాగం చీఫ్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ►శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఎన్టీఆర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యమంత్రి ప్రసంగించే బహిరంగ సభ జరుగనున్నాయి. దీనికి రాష్ట్రంలో ని వివిధ ప్రాంతాల నుంచి 2300 ప్రత్యేక బస్సు ల్లో లక్ష మంది హాజరుకానున్నారని అంచనా. ►ఇది ప్రారంభంకావడానికి ముందు పీపుల్స్ ప్లాజా నుంచి అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వరకు ఐదు వేల మంది కళాకారులు ర్యాలీ నిర్వహిస్తారు. ఈ రెండు కార్యక్రమాలకు వేదికలు నగర నడిబొడ్డున ఉన్నాయి. వీటి ప్రభావం ఎన్టీఆర్ స్టేడియం చుట్టూ మూడు కి.మీ. పరిధిలోని ప్రాంతాల్లోని ట్రాఫిక్‌పై ఉండనుంది. ►ఈ కార్యక్రమాల నేపథ్యంలో సాధారణ ప్రజలకు, వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నాయి. వీటిలో భాగంగా మధ్య మండలంలోని 11 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు వి«ధించారు. ఆయా సమయాల్లో నెక్లెస్ రోడ్‌ను పూర్తిగా మూసి ఉంచుతారు. ►ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేకంగా ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్, పబ్లిక్ గార్డెన్స్, నిజాం కాలేజీల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆçహూతులు అక్కడ నుంచి కాలినడకన రావాల్సి ఉండటంతో ప్రతి పార్కింగ్ ప్రాంతం నుంచి వేదికలు గరిష్టంగా 1.5 కి.మీ. మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. ►సాధారణ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులకూ ఈ మళ్లింపులు వర్తిస్తాయి. శనివారం సివిల్ సర్వీసెస్‌కు సంబంధించిన జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ మెయిన్స్ పరీక్ష ఉంది. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో జరిగే పరీక్షకు అభ్యర్థులు వీలైనంత త్వరగా బయలుదేరాలి. ట్రాఫిక్ మళ్లింపులు ఉండే ప్రాంతాల్లో: ►కవాడీగూడ, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, వీఎస్టీ, దోమలగూడ, లిబర్టీ, ట్యాంక్‌బండ్, ఐమ్యాక్స్. అస్సలు ప్రయాణించకూడని చౌరస్తాలు: అంబేడ్కర్ స్టాట్యూ, కవాడీగూడ, ఎన్టీఆర్ స్టేడియం, ట్యాంక్‌బండ్, లోయర్ ట్యాంక్‌బండ్, లిబర్టీ, నెక్లెస్‌రోడ్, అశోక్‌నగర్, ఇందిరాపార్క్ వీలుంటే జంక్షన్ల మీదుగానూ వద్దు: రవీంద్రభారతి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నారాయణగూడ, బషీర్‌బాగ్, రాణిగంజ్, ఖైరతాబాద్ జంక్షన్, పోలీసు కంట్రోల్ రూమ్, ఎల్బీ స్టేడియం, వీఎస్టీ, గాంధీనగర్, హిమాయత్‌నగర్, హైదర్‌గూడ, పబ్లిక్‌గార్డెన్స్, నిజాం కాలేజీ. -
జిన్నా చనిపోయిన రోజే ముహూర్తం.. చకచకా పావులు కదిపిన సర్దార్ పటేల్
సాక్షి, హైదరాబాద్: ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 13 నెలలు గడుస్తోంది. దక్షిణ భారతంలో కీలకమైన హైదరాబాద్ సంస్థానం మాత్రం ఇండియన్ యూనియన్‌లో విలీనమయ్యే ప్రసక్తే లేదని మొండికేస్తోంది. అంతేకాదు పాకిస్థాన్‌కు అనుకూలంగా మారుతోంది. విలీనం కోసం భారత్ ఒత్తిడి తెస్తే పాకిస్తాన్ జోక్యం చేసుకోవాలంటూ హైదరాబాద్ నుంచి రేడియో సందేశాలు వెళ్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ సంస్థానం రజాకార్లు, నిజాం సైన్యం అకృత్యాలతో అట్టుడుకుతోంది. ఇక కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందే’.. నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ మదిలో ఇదే ఆలోచన. అదును దొరికితే చాలని వేచి ఉన్నారు. దేశ విభజనకు కారణమైన పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా 1948 సెప్టెంబరు 11న మృతి చెందారు. ఇంకేం అదును దొరికింది. ఆ సమయంలో కాశ్మీర్లో ఉన్న సర్దార్ పటేల్.. తుపాకీ చూపి నిజాంను దారికి తెచ్చేందుకు ఆ చల్లని వాతావరణంలో వేడివేడి వ్యూహాలను సిద్ధం చేశారు. సైనిక చర్యకు దిగితే ఎలా ఉంటుందో నిజాంకు తెలిసేలా కబురు పంపారు. లొంగిపోవాలా.. ఎదిరించాలా? భారత ప్రభుత్వం తరఫున మేజర్ జనరల్‌గా ఉన్న మున్షీ హైదరాబాద్‌కు వచ్చి నిజాంతో మాట్లాడి, పరిస్థితిని వివరించారు. భారత్ సైనిక చర్యకు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో స్పష్టం చేశారు. దీంతో తాను భారత సైన్యాన్ని ఎదురించనని, విలీనానికి సహకరిస్తానని నిజాం సంకేతాలు ఇచ్చారు. ఈ విషయాన్ని రజాకార్లకు, నిజాం సైన్యానికి చెప్పలేదు. లొంగిపోయాక తనపై సైనిక విచారణ, శిక్ష లేకుండా చూసుకోవడం, రాజభరణం, ఇతర సదుపాయాలు అందుకోవడంపైనే దృష్టిపెట్టారు. హైదరాబాద్ సంస్థానం మంత్రి వర్గాన్ని అత్యవసరంగా సమావేశపర్చి.. అందరినీ రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు. అందరూ రాజీనామా చేసి, నిజాం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. నిజాం ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలిపి, సైన్యాన్ని ఎదురించబోనని మాటిచ్చారు. ప్రతిగా విలీనం తర్వాత తనకు ప్రాధాన్యమున్న హోదా ఇవ్వాలని, 200 కోట్ల నగదు ఇవ్వాలని, తన బిరుదులను కొనసాగించాలని, తన ఆస్తులు తనకే దక్కాలని కోరారు.ఇవి తెలియని రజాకార్ల బృందాలు, నిజాం సైన్యం.. భారత సైన్యం దాడి మొదలుపెట్టినప్పుడు ప్రతిఘటించాయి. కీసర సరిహద్దులో భీకర దాడితో.. నిజాం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో.. భారత సైన్యాలను ఎదుర్కొనే విషయంగా నిజాం సైన్యం దీటుగా వ్యవహరించలేకపోయింది. కొద్దిపాటి ప్రతిఘటనతోనే లొంగిపోవడమో, పారిపోవడమో జరుగుతూ వచ్చింది. ఆంధ్రా–తెలంగాణ సరిహద్దులో ఉన్న కీసర ప్రాంతంలో మాత్రం భీకర దాడి జరిగింది. కీసర వద్ద నిజాం ఔట్‌పోస్టు వద్దకు భారీగా రజాకార్ల దండు చేరుకుని.. భారత సైన్యంపై దాడికి దిగింది. చాలాసేపు పోరాడాక భారత సైన్యం యుద్ధ ట్యాంకుతో దాడి చేస్తే.. నిజాం ఔట్‌పోస్టు నామరూపాల్లేకుండా పోయింది. ఇలాగే ఖమ్మం వద్ద కూడా దాడి జరిగింది. వందల మంది చనిపోతుండటంతో నిజాం సైన్యం వెనకడుగు వేసింది. కాశీం రజ్వీ దీన్ని తట్టుకోలేక నిజాంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్‌పై దాడి చేసి తమకు సహకరించాలని పాకిస్తాన్‌ను కోరాడు. పాకిస్తాన్ స్పందించలేదు. నిజాం లొంగిపోగా హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. (క్లిక్ చేయండి: అణచివేతపై సాయుధ పోరాటం!) అక్రమంగా విమానం ద్వారా ఆయుధాలు ఆస్ట్రియా వ్యాపారి కాటన్ ద్వారా నిజాం రాజు అక్రమంగా ఆయుధా లు సమకూర్చుకున్నాడు. పాకిస్తాన్‌కు వెళ్తున్న విమానంగా చూపి, కారుణ్య సహాయం పేరుతో విమానాన్ని బీదర్ ఎయిర్‌పోర్టులో దింపేవారు. అక్కడి విమాన స్ట్రిప్‌లో ఆయుధాలను అన్లోడ్ చేసేవారు. ఇది బయటపడడంతో బీదర్ బదులు వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయానికి మకాం మార్చారు. లంకాస్టర్ అనే 4 ఇంజిన్లుండే ఈ విమానం ద్వారా 1948 మే నుంచి జూన్ 20 వరకు నిరాటంకంగా ఈ అక్రమ వ్యవహారం సాగింది. భారత ప్రభుత్వం వినతితో బ్రిటిష్ వారి జోక్యంతో తర్వాత ఆగిపోయింది. (క్లిక్ చేయండి: ‘కొరియర్’గా.. వారియర్‌గా!) -
Kandimalla Pratap Reddy: ‘కొరియర్’గా.. వారియర్‌గా!
హిమాయత్‌నగర్: పసి వయసు నుంచి కసిగా నిజాం వ్యతిరేక, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగస్వామి అయిన వ్యక్తి ఆయన. అప్పుడాయన వయసు 13 ఏళ్లే. ఆయనే తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి. స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జొన్నలగడ్డగూడెం. ‘సెప్టెంబర్ 17’నేపథ్యంలో అప్పటి పోరాటంలో పాల్గొన్న ప్రతాప్‌రెడ్డి అనుభవాలు ఆయన మాటల్లోనే.. ‘స్వాతంత్య్రం వచ్చేనాటికి నాటికి నాకు సుమారుగా 13 ఏళ్లు. మా తండ్రి రంగారెడ్డి నన్ను నల్లగొండ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతిలో చేర్పించారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానానికి రాలేదంటూ చెలరేగిన ఉద్యమానికి బడులన్నీ మూతపడ్డాయి. అనంతరం నేను ఓ వేపచెట్టు కింద విద్యార్థి నాయకులు, దళాలు చేపట్టిన సాయుధ పోరాట కార్యక్రమంలో తొలిసారిగా పాల్గొన్నాను. ఆ వేపచెట్టుపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాను. గ్రామాల్లోకి వచ్చిన దళాలను రహస్య ప్రాంతాల్లో దాచేవాడిని. నన్ను కమ్యూనిస్టు పార్టీ బాలసంఘం సెక్రెటరీగా నియమించారు. కొరియర్‌గా ఇటు ప్రజలకు, అటు దళాలు, విద్యార్థి నాయకులకు దగ్గరగా ఉండేవాడిని. వీరితో పాటు ప్రజలకు నేనే సమాచార వారధిగా ఉండేవాడిని. తుపాకీని ముట్టనిచ్చేవాళ్లు కాదు.. మా ఉద్యమాన్ని అణచివేసేందుకు రజాకార్లు గుర్రాలపై, జీపులపై గ్రామాల్లోకి చొరబడేవాళ్లు. రజాకార్లను ఎదుర్కొనేందుకు దళాలు కూడా ఊళ్లలోకి వచ్చేవి. తుపాకీని పట్టుకోవాలనే ఆశ నాకున్నప్పటికీ బాలుడిని కావడంతో దళసభ్యులు ముట్టనిచ్చేవాళ్లు కాదు. రజాకార్లను అడ్డుకునేందుకు తిప్పర్తి వంతెనను మూడు, నాలుగు గ్రామాలవాళ్లం కొంతవరకు కూల్చివేశాం. మేం కోదాడ, నల్లగొండ ప్రధాన రహదారులపై ఉన్న సమయంలో షోలాపూర్, కోదాడల మీదుగా పెద్దపెద్ద సైన్యాలు హైదరాబాద్ వైపు వెళ్లడాన్ని గమనించాం. ఈ సైన్యాలు వెళ్లిన మూడు రోజులకు, అంటే సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు నిజాం రాజు నుంచి వెలువడిన వార్త మా దాకా వచ్చింది. ఎంతో సంతోషంగా ఈ వార్తను ఒక కొరియర్లా తీసికెళ్లి పలు గ్రామాల్లో చెప్పాను. -
కిషన్‌రెడ్డి ప్రసంగానికి కేటీఆర్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. 74 ఏళ్ల క్రితం ఒక హోంమంత్రి ప్రజలను ఐక్యం చేసేందుకు.. తెలంగాణను భారత్‌లో కలిపేందుకు వచ్చారు. ఇవాళ ఒక కేంద్ర మంత్రి (అమిత్ షాను ఉద్దేశించి..) వచ్చి ప్రజలను విభజించేలా వ్యవహరించారు. దేశానికి నిర్ణయాత్మకమైన రాజకీయాలు కావాలి కానీ.. విభజన రాజకీయాలు ఉండకూదు అంటూ కేటీఆర్ తన ట్విటర్లో పేర్కొన్నారు. 74 years ago, A Union Home Minister came to UNITE & INTEGRATE The People of Telangana into Indian union Today A Union Home Minister has come to DIVIDE & BULLY The People of Telangana & their state Govt That's why I say, India needs DECISIVE POLICIES Not DIVISIVE POLITICS — KTR (@KTRTRS) September 17, 2022 ఇదిలా ఉంటే.. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి.. అమిత్ షాను అభినవ సర్దార్ పటేల్ అంటూ పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: తెలంగాణను మలినం చేసే కుట్ర జరుగుతోంది -
అణచివేతపై సాయుధ పోరాటం!
సాక్షి, హైదరాబాద్: నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దాష్టీకాలు ఓ వైపు.. జమీందార్ల దుర్మార్గాలు మరోవైపు.. దారుణమైన బతుకుల నుంచి బయటపడేందుకు పుట్టిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటం. 1946 సెప్టెంబర్ 11న మొదలై 1951 అక్టోబర్ 21 దాకా ఐదేళ్లకుపైగా సాయుధ ఉద్యమం కొనసాగింది. ప్రపంచ చరిత్రలోని గొప్ప పోరాటాల్లో ఒకటిగా నిలిచింది. 1946లో చాకలి ఐలమ్మ సాగుభూమి మీద జమీందారు విసునూరు రాంచంద్రారెడ్డి కన్ను పడింది. ఆ భూమిని, పంటను స్వాధీనం చేసుకునేందుకు గూండాలను పంపాడు. భీమిరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం యాదగిరిరావు, నల్ల ప్రతాపరెడ్డి తదితరుల సహకారంతో ఐలమ్మ తిరగబడింది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి వంటి వారిని పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. అయితే ఐలమ్మ భూమిని, ధాన్యాన్ని భూస్వాములు స్వాధీనం చేసుకోలేక పోయారు. దీంతో ఆవేశం పట్టలేక కడివెండి గ్రామ నాయకులను హత్య చేయాలని పథకం వేశారు. 1946 జూలై 4న దేశ్‌ముఖ్ మనుషులు గ్రామ నాయకుల ఇళ్ల మీద రాళ్లు వేయడంతో.. ప్రజలు లాఠీలు, వడిసెలు చేత బట్టుకుని ప్రదర్శనగా బయలు దేరారు. ఈ ఊరేగింపు జమీందారు ఇంటి దగ్గరికి రాగానే.. జమీందారు మనుషులు కాల్పులు జరపడంతో గ్రామ నాయకుడు దొడ్డి కొమరయ్య బలయ్యాడు. ఈ విషయం దావానలంలా వ్యాపించి.. ఊరూరా జనం తిరుగుబాటు మొదలు పెట్టారు. ఆ ప్రతిఘటనను అణచి వేసేందుకు జమీందార్ల మనుషులు, రజాకార్లు, నిజాం పోలీసులు దాడులకు దిగారు. అయినా ప్రజలు తిరుగుబాటు ఆపలేదు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టు పార్టీ 1946 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. పేదలకు 10 లక్షల ఎకరాలు పంపిణీ.. అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా మొదలైన సాయుధ ఉద్యమం భూపోరాటంగా మారి దున్నేవాడికే భూమి దక్కాలని నినదించింది. నిజాం రాచరికం, జమీందార్ల అరాచక పాలన మీద తిరుగుబాటుగా మారింది. భూమి కోసం, భుక్తి కోసమేగాక సామాజిక వివక్షపైనా పోరాటం జరిగింది. మూడు వేల గ్రామాలకు ఉద్యమం విస్తరించింది. భూస్వాములు, జమీందార్ల నుంచి పది లక్షల ఎకరాలకుపైగా భూమిని రైతులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తాకట్టులో ఉన్న భూములను విడి పించుకున్నారు. రుణపత్రాలను రద్దు చేసి.. పశువులను పంపిణీ చేశారు. ఈ పోరాటాల్లో ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి మహిళలూ ముందు నిలిచారు. 4 వేల మంది వీర మరణంతో.. రైతాంగ సాయుధ పోరాటం నడుస్తుండగానే 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఎన్నో సంస్థానాలు ఇండి యన్ యూనియన్‌లో విలీనమైనా.. నిజాం సంస్థానం మాత్రం ఒప్పుకోలేదు. దీనికి నాటి భారత ప్రభుత్వం అంగీకరించింది. నిజాం రాజుతో 1947 నవంబర్ 29న యథాతథ ఒప్పందంపై సంతకాలు చేసింది. కానీ తెలంగాణ ప్రజలు నిజాం పాలన అంతం కావాలని, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని పోరాటాలు చేశారు. అందులో భాగంగా సాయు ధ పోరాటం ఉధృతంగా కొనసాగింది. రజాకార్లు, నిజాం సైన్యాల దాడుల నుంచి రక్షణకోసం.. పదివేల మంది గ్రామదళ సభ్యులు, దాదాపు రెండు వేల గెరిల్లా దళ సభ్యులతో శక్తివంతమైన సాయుధ బలగాన్ని నిర్మించుకోగలిగారు. కానీ నిజాం పాలకులు, జమీందార్లు కలిసి.. నాలుగు వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు, రైతులను హతమార్చారు. మరెన్నో వేల మందిని నిర్బంధ శిబిరాల్లో, జైళ్లలో బందీలను చేశారు. అయినా సాయుధ పోరాటం ఉధృతంగా సాగింది. ఈ పోరాటం తమ గెరిల్లా పోరాటం కంటే గొప్పదని క్యూబా ఒక సందర్భంలో వ్యాఖ్యానించడం గమనార్హం. విమోచన కాదు.. అది విలీన ఒప్పందం: మొయిన్ గోల్కొండ: అప్పటి హైదరాబాద్ సంస్థానం విలీనం సందర్భంగా యూనియన్ ప్రభుత్వానికి, నిజాం చివరి పాలకుడికి మధ్య విలీన ఒప్పందం జరిగిందని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఎంకే మొయిన్ అన్నారు. దీనిని కొన్ని రాజకీయ పార్టీలు వక్రీకరించి విమోచన దినంగా చెబుతూ సంబరాలు జరుపుకోవడం సరికాదన్నారు. ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లకు హిందూ జమీందారులైన దేశ్‌ముఖ్‌లు అండగా ఉండి ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. అయితే ఈ సత్యాన్ని ఇప్పుడు కొందరు వక్రీకరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. భారతదేశంలో నిజాం సంస్థానం విలీనంపై అప్పటి ప్రధాని జవహర్లాల్ న్రెహూ ముద్ర స్పష్టంగా ఉందని, అయితే కొంతకాలంగా విలీన హీరోగా వల్లభాయ్ పటేల్‌ను చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థిగా 1944 సంవత్సరంలో దారుల్ షిఫా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడే తాను కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడినయ్యానని పేర్కొన్నారు. తెలంగాణ విలీన సమయంలోనూ అజ్ఞాతంలోనే ఉన్నానని చెప్పారు. అటువంటి తనను సన్మానిస్తామని విమోచనోత్సవం నిర్వహిస్తున్న బీజేపీ పిలవడం విడ్డూరంగా ఉందన్నారు. (క్లిక్ చేయండి: విముక్తి సమరంలో చరిత్రకెక్కిన పరకాల పోరు) -
1948 .. హైదరాబాద్‌పై ఆపరేషన్ పోలో (ఫొటోలు)
-
హైదరాబాద్ సంస్థాన విముక్తి సమరంలో చరిత్రకెక్కిన పరకాల పోరు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ స్వాతంత్య్ర పోరాటానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది పరకాల అమరధామం. అక్కడి మట్టి.. రజాకార్లు పారించిన రక్తపుటేర్లకు సాక్ష్యం.. నిరంకుశ నిజాం నుంచి స్వాతంత్య్రాన్ని కాంక్షించి అమరులైన యోధుల పోరాటానికి సాక్ష్యం. అదే.. మరో జలియన్ వాలాబాగ్ ఘటనగా చరిత్రలో నిలిచిపోయిన పరకాల ఊచకోత ఘటన. సరిగ్గా 73 ఏళ్ల క్రితం.. 1947, సెప్టెంబర్ 2న జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే కాంక్షతో చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేష సంఖ్యలో హాజరైన ప్రజలపై రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మారణహోమం మరో జలియన్ వాలాబాగ్‌గా మారింది. రజాకార్లపై పోరాడి ఎందరో అసువులుబాసి అమరవీరులుగా నిలిచారు. అలాంటి ఉద్యమంలో హనుమకొండ జిల్లా పరకాలది ప్రత్యేక స్థానం. సెప్టెంబర్ 2, 1947న పరకాల సమీపంలో ఉన్న పైడిపల్లి తాళ్ల నుంచి విమోచనోద్యమకారులు భారత జాతీయ జెండా ఎగురవేయడానికి పరకాలకు వచ్చారు. రజాకార్లు ఈ విషయం పసిగట్టి ఉద్యమకారులు జాతీయజెండాను ఎగురవేయనీకుండా అడ్డుకోమని నిజాంతో ఆదేశం జారీ చేయించారు. ఖాసింరజ్వీ నేతృత్వంలో పరకాల సర్కిల్ ఇన్స్పెక్టర్ జియాఉల్లా, మేజిస్ట్రేట్ విష్ణువేశ్వర్ రావులు మూడు లారీల బలగాలను రంగంలోకి దింపారు. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో ఉద్యమకారులపై తుపాకీగుళ్ల వర్షం కురింపిచారు. పరకాల చాపలబండ వద్ద గుమిగూడిన ఉద్యమకారులపై దాడిచేశారు. కత్తులు, బల్లాలు, బరిశెలతో మారణకాండ కొనసాగించగా 19 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురిని రంగాపూర్ గ్రామంలో చెట్టుకు కట్టేసి గొడ్డలి, బరిసెలు, తుపాకులతో కాల్చి చంపారు. ఈ మారణహోమంలో శ్రీశైలం, గజ్జి పర్వతాలు (కనిపర్తి), కుంట అయిలయ్య (నాగుర్లపల్లె), బత్తుల సమ్మయ్య, ఆముధాపురం వీరన్న, మేకల పోచయ్య,(రాయపల్లె), మంత్రి కేదారి, పోతుగంటి పెద్దులు (దమ్మన్నపేట), గుండారపు కొమరయ్య, దాతుపెల్లి రాజయ్య, కుమ్మరి రాములు (రేగొండ), గెల్లే కట్టమల్లు (దామరంచపల్లె), జాలిగపు ముసలయ్య, తొనగరు పూర్ణాసింగ్ (చల్లగరిగె), కలువాల అంకూస్ (గోవిందాపురం) తదితరులు అమరులయ్యారు. ఆకుతోట మల్లయ్య, రాజ్‌మహ్మద్, వర్దెల్లి వీరయ్యలను చెట్లకు కట్టేసి కాల్చి చంపారు. నిజాం పోలీసులు, రజాకార్లు వెంటాడి 200 మందికిపైగా ఉద్యమకారులను తీవ్రంగా గాయపర్చారు. సాయుధ పోరాటానికి కేరాఫ్... నిజాం రాక్షసకృత్యాలను వ్యతిరేకిస్తూ రహస్య జీవితం గడుపుతున్న ఉద్యమనేతలు ప్రతీకారం తీర్చుకోవడానికి మహరాష్ట్రలోని చాందా బోర్డర్ క్యాంప్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు సారథ్యంలో తొలివిడత వంద మంది సాయుధ శిక్షణ పొందారు. పిస్తోల్, రైఫిల్స్, మందు గుండు సామగ్రి సేకరించి చంద్రగిరి గుట్టలను కేంద్రంగా చేసుకొని సాయుధ పోరాటం జరిపారు. సాయధ దళాలు జమీందార్లు, జాగీర్దారులు, పెత్తందార్లు, మక్తెదారులకు చరమగీతం పాడాయి. ఈ దాడులను తట్టుకోలేక నిజాం పోలీసులు గ్రామాల్లో ప్రజలను విచక్షరహితంగా హింసించారు. చివరకు 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం ప్రభుత్వం లొంగిపోవటంతో ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువు పీల్చుకున్నారు. (క్లిక్ చేయండి: ‘కొరియర్’గా.. వారియర్‌గా!) రాత్రి వేళల్లో సమావేశాలు: చంద్రారెడ్డి అలియాస్ రంజిత్ నిజాం పాలనకు తిరుగుబాటుదారులైన ఎస్.మనోహర్‌రావు, కె.వి.నర్సింగరావు ఆదేశాలతో రాత్రివేళల్లో గ్రామాల్లో యువకులతో సమావేశాలు నిర్వహించేవాళ్లు. చాలామంది యువకులను మహారాష్ట్ర చందా ప్రాంతానికి పంపించి అక్కడ ఆజాద్ హింద్‌ఫౌజ్ నుంచి విరమణ పొందిన సైనికులతో ప్రత్యేక గెరిల్లా శిక్షణ ఇప్పించారు. జనవరిలో చందాకు వెళ్లిన వారిలో నేనూ ఉన్నా. 1948 మార్చి వరకు గెరిల్లా శిక్షణ పొందాను. అనంతరం మారుపేర్లతోనే స్వగ్రామాలకు చేరుకున్నాం. అదే సమయంలో ఉద్యమం తీవ్రంగా కొనసాగుతుండటంతో దామెర మండలంలోని చంద్రగిరి గుట్టలను షెల్టర్‌గా మార్చుకొని సాయుధపోరుకు శ్రీకారం చుట్టాం. చాపలబండ వద్ద రజాకార్ల తూటాల నుంచి తప్పించుకున్న నన్ను వారం రోజులకు పట్టుకున్నారు. చిత్రహింసలకు గురిచేసి.. చనిపోయాడనుకొని వెళ్లిపోయారు. కానీ కొన ఊపిరితో బయటపడ్డాను. (క్లిక్: మందు పాతరలు.. చివరి అస్త్రం)