Thunderstorms
-
Uttar Pradesh: పిడుగుపాటుకు 38 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పిడుగులు పడిన ఘటనలు పలువురి ప్రాణాలు బలిగొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుకు గురై కనీసం 38 మంది మరణించారని అధికారులు గురువారం ప్రకటించారు. ప్రతాప్‌గఢ్‌లో అత్యధికంగా 11 మంది మృతి చెందారు. సుల్తాన్‌పూర్‌లో ఏడుగురు, చందౌలీలో ఆరుగురు, మెయిన్‌పురిలో ఐదుగురు, ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు, ఔరయ్యా, డియోరియా, హత్రాస్, వారణాసి, సిద్ధార్థనగర్లలో ఒక్కొక్కరు మరణించారు. అనేక మందికి కాలిన గాయాలయ్యాయి. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ ఘటనలో 13, 15 ఏళ్లున్న ఇద్దరుతో సహా చాలా మంది బాధితులు పొలంలో పనిచేస్తున్నారు. అప్పుడే చేపలు పట్టేటప్పుడు పిడుగుపాటుకు గురయ్యారు. సుల్తాన్‌పూర్‌లో ముగ్గురు చిన్నారులుసహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కొందరు వరి నాట్లు వేస్తుండగా, ఒకరు మామిడి కాయలు కోసేందుకు వెళ్లి, మరొకరు తాగునీరు తెచ్చేందుకు వెళ్లి పిడుగుపాటుకు గురయ్యారు. బుధవారం భారీ వర్షం కురుస్తుండగా చెట్టు కింద తలదాచుకుంటున్న ఓ మహిళ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. వర్షం కురుస్తుండటంతో మామిడి చెట్టు కింద తలదాచుకుంటున్న 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. డియోరియాలో పొలంలో ఉన్న కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్తుండగా పిడుగుపడి 5 ఏళ్ల బాలిక మరణించింది. వారణాసిలో ఇద్దరు సోదరులు పిడుగుపాటుకు గురయ్యారు. ఒకరు కాలిన గాయాలతో మృతి చెందగా, మరొకరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రాబోయే ఐదు రోజుల్లో ఉత్తరప్రదేశ్. దాని పరిసర రాష్ట్రాలు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. -
గుజరాత్లో అకాల వర్షాలు..
అహ్మదాబాద్: గుజరాత్ వ్యాప్తంగా ఆదివారం అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో 20 మంది వరకు చనిపోయినట్లు రాష్ట్ర అత్యవసర విభాగం తెలిపింది. దహోడ్ జిల్లాలో నలుగురు, భరూచ్‌లో ముగ్గురు, అహ్మదాబాద్, అమ్రేలీ, బనస్కాంత, బోటడ్, ఖేడా, మెహ్సానా, పంచ్‌మహల్, సబర్కాంత, సూరత్, సురేంద్రనగర్, దేవ్‌భూమి ద్వారకల్లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారని ఒక అధికారి చెప్పారు. రాష్ట్రంలోని 252 తాలుకాలను గాను 234 చోట్ల ఆదివారం వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని, సౌరాష్ట్ర ప్రాంతంలోని సెరామిక్ పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రానికి మరింత వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. -
పంటనష్టంలో తెలంగాణది మూడోస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. వరదలు, పిడుగుపాట్లు వంటి కారణాలతో 2,044 మంది మరణించినట్లు తెలిపింది. వరదలతో అత్యధికంగా హరియాణాలో 5,40,975 ఎకరాల్లో పంటనష్టం జరగ్గా, హిమాచల్‌ప్రదేశ్‌లో 1,89,400 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదించింది. అత్యధికంగా పంటనష్టం జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉందని, మొత్తం 1,51,970 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది. తెలంగాణలో 18 మంది మరణించారని, ఇతరత్రా కారణాలతో మరొకరు మృతి చెందారని నివేదికలో వెల్లడించింది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రెండు విపత్తు నిర్వహణ బృందాలను రాష్ట్రంలో సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది. ఏపీలో 22,537 ఎకరాల్లో పంట నష్టం ఏపీలోని ఐదు జిల్లాల పరిధిలో భారీవర్షాలు, వరదల ప్రభావం ఉందని, వాటి కారణంగా మొత్తంగా 39 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ విభాగం నివేదించింది. మొత్తం 22,537 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు తెలిపింది. విపత్తు నిర్వహణ కోసం రెండు బృందాలను ఏపీలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. -
ప్రకృతి వైపరీత్యాలతో 2,038 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రుతుపవనాల కారణంగా సంభవించిన వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 2,038 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా బిహార్‌లో 518 మంది, ఆ తర్వాతి స్థానంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో 330 మంది చనిపోయారని వివరించింది. ఏప్రిల్ 1–ఆగస్ట్ 17వ తేదీ మధ్య కాలంలో వర్షాలు, వరదలకు సంబంధించిన ఘటనల్లో 101 మంది జాడ తెలియకుండా పోగా 1,584 మంది గాయపడినట్లు పేర్కొంది. వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాటు ఘటనలతో 335 జిల్లాలు ప్రభావితమైనట్టు తెలిపింది. -
వర్షాలపై కీలక అప్డేట్.. రెండు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు
-
అమెరికాలో భీకర వర్షాలు.. పిడుగులు
వాషింగ్టన్: అమెరికాలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పిడుగులు పడుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. కనెక్టికట్, మసాచుసెట్స్, న్యూహ్యాంప్‌షైర్, న్యూయార్క్, రోడ్ఐలాండ్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వం వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భీకర వర్షాలకుతోడు పిడుగుల ముప్పు కారణంగా అమెరికాలో తాజాగా 2,600కుపైగా విమానాల రాకపోకలను రద్దుచేశారు. మరో 8,000 విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. ప్రధానంగా ఈశాన్య అమెరికాలో వాతావరణం ప్రతికూలంగా మారింది. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, పెన్సిల్వేన్వియా, మసాచుసెట్స్, వెర్మాంట్‌లో వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇదిలా ఉండగా, పశి్చమ, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిని తట్టుకోలేక జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. కాలిఫోరి్నయా రాష్ట్రంలోని డెత్ వ్యాలీలో ఏకంగా 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. -
2,600లకు పైగా విమానాలు రద్దు.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ విజ్ఞప్తులు
అమెరికాలో భారీ వర్షాలు, పిడుగుల కారణంగా ఆదివారం(జులై 16) 2,600లకు పైగా విమానాలు రద్దయ్యాయి. సుమారు 8 వేల విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఈ మేరకు ఏబీసీ న్యూస్ వార్తా సంస్థ పేర్కొంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ప్రకారం అత్యధికంగా ఈశాన్య ప్రాంతంలోనే రద్దయ్యాయి. ఒక్క న్యూజెర్సీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే 350 కిపైగా విమానాలు రద్దయినట్లు ఎన్బీసీ న్యూస్ నివేదించింది. తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్పోర్ట్, లా గార్డియన్ విమానాశ్రయాలు కూడా స్తంభించినట్లు పేర్కొంది. ఇదీ చదవండి ➤ ఆకాశంలో ఉండగా.. ఎయిరిండియా విమానంలో కలకలం ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ముందే ఫ్లయిట్ టైమింగ్, వాతావరణ పరిస్థితులను సరిచూసుకోవాలని ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయాణికులకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తులు చేశాయి. కాగా ఆ దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, పెన్సిల్వేనియా, మసాచుసెట్స్, వెర్మాంట్ ప్రాంతాల్లో వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రాణాంతక వరదలు సైతం నమోదైనట్లు నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది. ఇది ఇలా ఉంటే, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల కారణంగా ఆ దేశంలోని కొన్ని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో వడ గాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి, పశ్చిమ గల్ఫ్ కోస్ట్, దక్షిణ ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాలలో తీవ్ర ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. రాబోయే వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్‌డబ్ల్యూఎస్ హెచ్చరించింది. -
రానున్న ఐదు రోజులు వడగాల్పులే.. యెల్లో అలర్డ్ జారీ..
హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 42°C నుంచి 44°C వరకు స్థిరంగా నమోదవుతాయని పేర్కొంది. హైదరాబాద్‌తో సహా చుట్టుపక్కల జిల్లాల్లో 39°C నుంచి 41°C వరకు నమోదవుతాయని స్పష్టం చేసింది. వడగాలల నేపథ్యంలో పలు జిల్లాలకి వాతావరణశాఖ యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు.. రేపు ఖమ్మం ,నల్గొండ,సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. వడగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. రాగల మూడు రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులతో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ చత్తీస్‌గఢ్ మీదుగా అవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. ఉత్తర చత్తీస్‌గఢ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి విస్తరించిందని పేర్కొంది. ఇదీ చదవండి:విషాదం: ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు చిన్నారులు మృతి.. -
మహాకాల్ లోక్‌లో గాలివాన బీభత్సం.. పిడుగుపడి ముగ్గురి దుర్మరణం
-
Vande Bharat: వడగళ్లు, పిడుగుపడి దెబ్బతిన్న వందేభారత్
భువనేశ్వర్: దేశంలో అత్యంత వేగంగా పేరున్న సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్. అయితే ఈ రైలు నాణ్యత విషయంలోనే పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలు అందుకు కారణం. తాజాగా.. వడగండ్ల వానకు, పిడుగుపడి ఓ వందేభారత్ రైలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఒడిషాలో ఈమధ్యే ప్రారంభమైన పూరీ-హౌరా వందేభారత్ ఎక్స్‌ప్రెస్(22896) ఆదివారం మధ్యాహ్నం ముందు భాగం దెబ్బతింది. భద్రాక్ రైల్వే స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో.. పిడుగుపడి డ్రైవర్ క్యాబిన్ విండ్‌స్క్రీన్, సైడ్ విండోలు పగుళ్లు వచ్చాయి. అయితే ఎవరికీ ఏం కాలేదు. అలాగే వడగండ్ల వాన కురిసి.. పలు కోచ్‌ల సైడ్ విండోలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇదేకాదు.. ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ వైర్ తెగిపోవడంతో వైతరణి రోడ్డు రైల్వే బ్రిడ్జి వద్ద రెండు గంటలపాటు రైలు ఆగిపోయింది. రైలులో పవర్ సప్లై నిలిచిపోవడంతో చాలామంది ప్రయాణికులు.. సామాజిక మాధ్యమాల్లో ఆ ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక.. ఓ డీజిల్ ఇంజిన్‌ను పంపించి రైలును అక్కడి నుంచి తరలించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మరమ్మత్తుల నేపథ్యంలో.. ఇవాళ(సోమవారం) రైలును రద్దు చేశారు. ఒడిషా పూరీ నుంచి పశ్చిమ బెంగాల్ హౌరాను కనెక్ట్ చేస్తూ ఈ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా గత గురువారం ప్రారంభించారు. వచ్చే నెల ముగింపు లోపు దేశంలోని అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ వందేభారత్ రైళ్లను ప్రారంభించే యోచనలో ఉంది భారత రైల్వేస్. Odisha | Puri-Howrah Vande Bharat Express halted between Dulakhapatna-Manjuri Road Station after the overhead wire was damaged due to thunderstorms and lightning. Purna Chandra Shahu, Station Manager, Bhadrak said, "Front glass and side windows of the driver cabin were damaged… pic.twitter.com/bhuAIGQFiI — ANI (@ANI) May 21, 2023 -
తిరుమలలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం
-
మెరుపులనే దారి మళ్లించారు!
పారిస్: మెరుపంటేనే వేగానికి పెట్టింది పేరు. వేగానికి అత్యుత్తమ ఉపమానం కూడా. మెరుపు వేగం గంటకు ఏకంగా 4.3 లక్షల కిలోమీటర్ల దాకా ఉంటుంది. మెరుపుల ఫలితంగా విను వీధిలో మన కంటికి కనిపించే కాంతులైతే నిజంగా కాంతి వేగంతోనే (సెకను 3 లక్షల కిలోమీటర్లు) దూసుకెళ్తాయి. అలాంటి మెరుపులను దారి మళ్లించగలిగితే? ఫ్రెంచి పరిశోధకులు తాజాగా అలాంటి ఘనతే సాధించారు!! అతి శక్తిమంతమైన లేజర్ కిరణాల ద్వారా వాటి దారిని విజయవంతంగా మార్చగలిగారు. పిడుగుపాటు బారినుంచి రక్షించే వ్యవస్థల్లో ఇది విప్లవాత్మక మార్పులు తేగలదని భావిస్తున్నారు. మెరుపును అనుసరిస్తూ వచ్చి పడే పిడుగుల వల్ల భవనాలు, సమాచార వ్యవస్థ, విద్యుత్ ఉపకరణాలు, సరఫరా లైన్లు దెబ్బ తిని ఏటా వందలాది కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లడమే గాక వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండటం తెలిసిందే. ఈ టెక్నాలజీని మరింతగా అభివృద్ధి చేయగలిగితే దీని సాయంతో విమానాశ్రయాలు, భారీ విద్యుత్కేంద్రాలు, ఉపగ్రహాల లాంచింగ్ ప్యాడ్ల వంటి భారీ నిర్మాణాలకు పిడుగుపాట్ల నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పించవచ్చని చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని ఎకోల్ పాలిటెక్నిక్స్ లేబొరేటరీ ఆఫ్ అప్లైడ్ ఆప్టిక్స్కు చెందిన పరిశోధకులు అత్యంత శక్తిమంతమైన లేజర్ పరికరాల సాయంతో ఈ ప్రయోగానికి పూనుకున్నారు. ఇందుకోసం ఏకంగా మూడు టన్నుల బరువు, కారు పరిమాణమున్న లేజర్ పరికరాన్ని ఈశాన్య స్విట్జర్లాండ్‌లోని శాంటిస్ పర్వత శిఖరంపై 2,500 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేశారు. దానిద్వారా సెకనుకు ఏకంగా 1,000కి పైగా అతి శక్తిమంతమైన కిరణాలను ఆకాశంలో మెరుపులకేసి పంపించారు. తొలి ప్రయత్నంలోనే వాటి దారిని 160 అడుగుల దాకా మళ్లించగలిగారు. రెండు హైస్పీడ్ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ద్వారా దీన్ని గుర్తించారు. ‘‘అతి శక్తిమంతమైన లేజర్ కిరణాలను ఆకాశంలోకి పంపినప్పుడు శక్తిమంతమైన కాంతితో కూడిన ఫిలమెంట్లు ఏర్పడతాయి. అవి గాలిలోని నైట్రోజన్, ఆక్సిజన్ అణువులను అయానీకరిస్తాయి. ఈ చర్య ఫలితంగా స్వేచ్ఛగా కదలాగే ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. ప్లాస్మాగా పిలిచే ఈ అయానీకరణ చెందిన గాలి ఎలక్ట్రాన్ల వాహకంగా పని చేస్తుంది’’ అంటూ ఈ టెక్నాలజీ పని చేసే తీరును డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ జీన్ పియరీ వూల్ఫ్ వివరించారు. నిజానికి ఈ కాన్సెప్టును తొలుత 1970ల్లోనే ప్రతిపాదించినా ఇప్పటిదాకా ల్యాబుల్లోనే ప్రయోగించి చూశారు. బయటి వాతావరణంలో ప్రయోగం జరపడం ఇదే తొలిసారి. ఈ పరిశోధన ఫలితాలు జర్నల్ నేచర్ ఫోటానిక్స్‌లో పబ్లిషయ్యాయి. వీటి సాయంతో పిడుగుపాటు నుంచి కాపాడే వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తేగల హై పవర్ లేజర్ టెక్నాలజీని అభివృద్ధి చేసే పనిలో సైంటిస్టులు బిజీగా ఉన్నారు! -
వామ్మో.. ఇదేం పిడుగుల వాన!
సాక్షి, హైదరాబాద్: సిటీని జడివాన కష్టాలు వీడడం లేదు. బుధవారం కూడా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన ఏకధాటి వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. బంజారాహిల్స్, అమీర్‌పేట, మాసాబ్‌ట్యాంక్, నాంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, హైటెక్ సిటీ, షేక్‌పేట్, ఆర్.సి పురం, కూకట్పల్లి, మెహిదీపట్నం, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. రాత్రి 11 గంటల వరకు బాలానగర్‌లో అత్యధికంగా 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే రెండు రోజుల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో వర్షం మళ్లీ దంచికొట్టింది. బుధవారం రాత్రి ఉరుములు మెరుపులతో నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా కుండపోత కురిసింది. మునుపెన్నడూ లేనంత పిడుగుల మోతతో నగరం హోరెత్తి పోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, ఖైరతాబాద్, మాసాబ్‌ట్యాంక్, రాజేంద్రనగర్, బండ్లగూడ, మణికొండ, గండిపేట, తదితర ప్రాంతాల్లో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రసూల్‌పురాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళలోకి వరద నీరు చేరింది. బోరబండ సహా అనేకచోట్ల ద్విచక్ర వాహనాలు, ఆటోలు కొట్టుకుపోయాయి. ఎర్రగడ్డ మెట్రో కింద భారీగా నీరు చేరింది. మరో రెండ్రోజుల పాటు మోస్తరు వర్షాలు పడొచ్చంటూ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. బుధవారం రాత్రి 11 గంటల సమయానికి.. బాలానగర్‌లో అత్యధికంగా 10 సెంటీమీటర్లు, ఫిరోజ్‌గూడలో 9, కుత్బుల్లాపూర్‌లో 8.7, భగత్‌సింగ్‌నగర్‌లో 8.5, ఆర్సీపురంలో 8.3, తిరుమలగిరిలో 7.9, నేరెడ్‌మెట్‌లో 7.7, కూకట్‌పల్లిలో 7.4, సికింద్రాబాద్‌లో 6.6, బొల్లారంలో 5.7, బేగంపేటలో 5.3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. పాలమూరు అతలాకుతలం మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రం మహబూబ్‌నగర్‌ను భారీ వర్షం ముంచెత్తింది. లోతట్టుప్రాంతాల్లోని కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు పోటెత్తింది. కొన్ని కాలనీల్లో మోకాళ్లలోతు వరకు నీరు రావడంతో జనం సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మహేశ్వరకాలనీ, శివశక్తినగర్, కుర్విహిణిశెట్టి కాలనీ, మధురానగర్, ప్రేమ్‌నగర్, బాయమ్మతోట, అరబ్‌గల్లీ, భవిత కళాశాల ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరుకుంది. న్యూటౌన్, తెలంగాణచౌరస్తా, రాయచూర్ రోడ్లపై నీరు పారడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. భూత్పూర్ రోడ్డులో విద్యుత్ తీగలు తెగిపడడంతో ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు గంటసేపు వర్షం కురవగా.. 7.9సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. -
పిడుగులు పడితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?
మొన్నటి సోమవారం.. వేకువజాము నుంచే ఉరుములు.. మెరుపులు.. ఈదురుగాలులతో భారీ వర్షం. మధ్యలో భారీ శబ్దాలు.. అకస్మాత్తుగా ఇళ్ల మధ్యలో ఉన్న ఓ చెట్టు నుంచి మంటలు.. ఆ రోజు మనమంతా చాలా భయాందోళనకు గురయ్యాం కదా.. వర్షాకాలంలో పిడుగు పాటుకు గురై మనుషులు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోతుంటాయి. చెట్లు కాలిపోతుంటాయి. మరి.. పిడుగులు పడితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు.? అసలు.. ఈ పిడుగులేమిటి? వాటి కథేంటి? ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): పిడుగును అర్థం చేసుకోవాలంటే ముందుగా ఉరుము.. మెరుపు గురించి తెలుసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు నీటి ఆవిరిపైపైకి ప్రయాణించి.. మేఘాలుగా మారతాయని మనకు తెలుసు. ఇవి కొన్ని వేల అడుగుల ఎత్తు వరకూ వివిధ స్థాయిల్లో ఉంటాయి. సూర్యకిరణాల వల్ల మేఘాల పైభాగంలో కొన్ని ధనావేశిత కణాలు ఏర్పడుతుంటాయి. ఇతర కణాల కంటే తేలికగా ఉండటం వల్ల ఇవి మేఘాల పైభాగంలో పోగుబడితే.. బరువైన రుణావేశిత కణాలు దిగువకు వస్తుంటాయి. మామూలుగానైతే.. వ్యతిరేక ఆవేశాలు ఉన్న కణాలు పరస్పరం ఆకర్షితమై ఒక దగ్గరకు చేరాలి కానీ.. మేఘాల దిగువన గాలి కదిలే వేగానికి లేదా ఇతర కారణాల వల్ల రెండింటి మధ్య అంతరం కొనసాగుతుంటుంది. ఈ క్రమంలోనే మేఘాల దిగువన ఉన్న రుణాత్మక కణాలు(ఎలక్ట్రాన్లు) దగ్గరలో ఉన్న వస్తువు వైపు ప్రయాణిస్తాయి. మరోవైపు భూమి ఉపరితలంపై ఉండే పొడవాటి నిర్మాణాల (విద్యుత్ స్తంభాలు, ఎత్తైన భవనాలు వంటివి) నుంచి ధనావేశిత కణాలు పైపైకి వెళుతుంటాయి. వేడిగా ఉండే ఈ కణాలు రుణావేశిత కణాలను కలిసినప్పుడు అప్పటి వరకు మేఘాల్లో గుమికూడిన ఎలక్ట్రాన్లు మొత్తం ఒక్కసారిగా విడుదలవుతాయి. ఈ విద్యుత్తే పిడుగు పాటు. ఈ సమయంలో ఉత్పత్తి అయ్యే వేడి కారణంగా చుట్టూ ఉన్న గాలి స్వల్ప సమయంలో వేడెక్కుతుంది. వ్యాకోచిస్తుంది. అంతలోనే చల్లగా మారిపోతుంది కూడా. అకస్మాత్తుగా జరిగే ఈ మార్పులే శబ్దంగా అంటే ఉరుముగా మనకు వినిపిస్తుంది. మేఘాల నుంచి పడే పిడుగుల్లో కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది. ఇవి చెట్లను, జీవులను కాల్చిబూడిద చేసేటంత శక్తిని కలిగి ఉంటాయి. సముద్రం కంటే నేలపైనే అధికంగా పిడుగులు పడుతుంటాయి. పిడుగులు మూడు రకాలుగా ఉంటాయి. మెదటిది హీట్ లైట్నింగ్, రెండోది డ్రై లైట్నింగ్. వీటి కారణంగా అడవుల్లో మంటలు చెలరేగుతాయి. మూడోది బాల్ లైట్నింగ్‌గా వ్యవహరిస్తారు. ఫొటోగ్రఫీతో పిడుగు ఏ రకానికి చెందినది అనేది గుర్తించడం సాధ్యపడుతుంది. తొలిసారిగా 1847లో థామస్ మోరిస్ ఈస్టర్లీ అనే వ్యక్తి వీటిని గుర్తించాడు. (క్లిక్: మాములుగా లేదు మరి.. షిప్ లోపల ఓ లుక్కేయండి..) జాగ్రత్తలు తప్పనిసరి ► ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో భవనాలు, ఇంట్లో ఉండటం ఎంతో మంచిది. మూడు.. అంతకంటే ఎక్కువ చక్రాలు ఉన్న వాహనాల్లో ప్రయాణిస్తే వాటిలోనే ఉండిపోవాలి. ► పొలాల్లో పనిచేసే రైతులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ► నేల పొడిగా ఉన్న ప్రాంతంలో ఆశ్రయం పాందాలి. ► చెట్ల కిందకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదు. చెట్లు పిడుగును ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటాయి. ► ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీ వంటివి ఆపేయాలి. లేని పక్షంలో పిడుగు పడినప్పుడు అధిక విద్యుత్ ప్రసరించి అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ► నీళ్లలో ఉంటే వెంటనే బయటపడాలి. నీరు మంచి విద్యుత్ వాహకమన్నది తెలిసిన విషయమే. ► ఉరుములతో కూడిన వర్షం పడుతుందనే సమాచారం ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే మంచిది. ► స్మార్ట్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడరాదు. ► ప్రతి మెరుపుకూ పిడుగు పడదు కానీ.. సురక్షిత ప్రాంతంలో ఉంటే అక్కడి నుంచి వెంటనే మరో చోటుకు వెళ్లొద్దు. ► గుంపులుగా ఉండటం కంటే..విడిపోయి దూర దూరంగా ఉండటం మంచిది. ► పిడుగులు పడుతున్న సందర్భంలో నీటి కుళాయిల వినియోగం, స్నానం చేయడం, గిన్నెలు కడగడం వంటివి నిలిపివేయాలి. పైపులు, పాత్రల నుంచి అధిక విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంది. ► పిడుగు బారిన పడిన వారిని ముట్టుకోవడం వలన ఎటువంటి నష్టం జరగదు. వారికి వెంటనే ప్రథమ చికిత్స అందించాలి. క్యుములోనింబస్ మేఘాలు ప్రమాదం క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడిన ప్రదేశంలో పిడుగులు పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. సాధారణ మేఘాలకు వర్టికల్ వేగం సెకనుకు సెంటీమీటరుగా ఉంటే, క్యుములోనింబస్ మేఘాలకు వర్టికల్ స్పీడ్ సెకను మీటర్లుగా ఉంటుంది. (క్లిక్: మామిడి తాండ్ర.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..) ఉష్ణమండల ప్రాంతాల్లో అధికం ఉష్ణ మండల ప్రాంతాల్లో అధికంగా పిడుగులు పడే అవకాశం ఉంటుంది. డాప్లర్ రాడార్ సహాయంతో పిడుగులను ముందస్తుగా గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేయడం సాధ్యపడుతుంది. ప్రాణనష్టాన్ని నివారించే సాంకేతికత నేడు అందుబాటులో ఉంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. – ఆచార్య ఓ.ఎస్.ఆర్.యు భానుకుమార్, వాతావరణశాస్త్ర విభాగం, ఏయూ -
తుఫాను దాటికి ఈడెన్ గార్డెన్స్ కుదేలు.. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లేమో అక్కడే!
కోల్‌కతా నగరాన్ని తుఫాన్ ముంచెత్తింది. శనివారం రాత్రి ఈదురుగాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ కుదేలైంది. 90 కిమీ వేగంతో వీసిన ఈదురుగాలుల దాటికి స్టేడియంలోకి ప్రెస్‌బాక్స్ అద్దాలు, పలు హోర్డింగ్స్, మైదానంలో కప్పి ఉంచిన టార్ఫులిన్ కవర్ ధ్వంసమయ్యాయి. పరిస్థితిని పర్యవేక్షించిన స్టేడియం అధికారులు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాగా కోల్‌కతా వేదికగానే ఐపీఎలో రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. మంగళవారం(మే 24న) గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ తొలి క్వాలిఫయర్.. మే 25న(బుధవారం) ఆర్సీబీ, లక్నో సూపర్‌జెయింట్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనున్నాయి. కాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధికారులతో కలిసి ఈడెన్ గార్డెన్‌ను పరిశీలించారు. ''మ్యాచ్‌లకు మరో రెండురోజులు సమయం ఉంది. అప్పటివరకు స్టేడియాన్ని రెడీ చేస్తాం. ప్రెస్ బాక్స్‌లో పగిలిన అద్దాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం వర్షం లేదు.. మాములుగానే ఉంది. మైదానంలోని టార్ఫులిన్ కవర్‌ను తొలగించి డ్రెయిన్ సిస్టం ఆన్‌చేశాం. పరిస్థితి పూర్తిగా కంట్రోల్లో ఉంది'' అని క్యాబ్ అధికారులు తెలిపారు. కాగా వర్షం కారణంగా గుజరాత్ టైటాన్స్ విమానం కాస్త ఆలస్యంగా కోల్‌కతాకు చేరుకుంది. వాస్తవానికి శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో కోల్‌కతాకు రావాల్సిన విమానం.. భారీ వర్షం కారణంగా ఆటగాళ్లు ప్రయాణించిన విమానం బంగ్లాదేశ్ ఎయిర్‌స్పేస్‌లో ల్యాండ్ అయింది. వర్షం ఆగిపోయాకా రెండు గంటల ఆలస్యంగా.. అంటే రాత్రి ఏడు గంటల ప్రాంతంలో కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు చచేరుకుంది. ఆటగాళ్లను బస్‌లో సురక్షితంగా హోటల్ రూంకు తరలించారు. ఇక క్వాలిఫయర్ -2 సహా ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. చదవండి: Jasprit Bumrah: ఐపీఎల్లో తొలి భారత బౌలర్‌గా బుమ్రా అరుదైన ఫీట్ Eden Gardens damaged after a thunderstorm #Kolkata #Edengardens pic.twitter.com/I2cXOXsCbS — Akash Kharade (@cricaakash) May 22, 2022 -
గుడ్‌న్యూస్: నైరుతి ఆగమనం
సాక్షి,అమరావతి/చిత్తూరు అగ్రికల్చర్: అనుకున్నట్లుగానే నైరుతి రుతుపవనాలు ముందస్తుగా దేశంలోకి ప్రవేశించాయి. దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్, నికోబార్ దీవుల్లో ఎక్కువ భాగాలు, అండమాన్ సముద్ర ప్రాంతాన్ని సోమవారం రుతుపవనాలు తాకాయి. సాధారణంగా ఈ నెల 22న రుతుపవనాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించాల్సి ఉంది. కానీ అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా వారం ముందే ప్రవేశించాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవులతోపాటు తూర్పు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరించేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నట్లు వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపాయి. వీటి ప్రభావంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గాయి. భూవాతావరణంలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలోనూ 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాకపోతే ఉక్కపోత ఉండడంతో కోస్తా ప్రాంతంలో వాతావరణం వేడిగా ఉంది. రాయలసీమలో భారీ వర్షాలు మరోవైపు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా బిహార్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉత్తర – దక్షిణ ద్రోణి మరింతగా విస్తరించి ఉంది. ఇది ఉత్తర తమిళనాడు, కర్ణాటక మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించింది. దీనికితోడు నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరప్రాంతాల్లో ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో జోరు వానలు కురిశాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, రేణిగుంట, పుత్తూరు, తిరుపతి, మదనపల్లి, పలమనేరు, చిత్తూరు, తిరుమల, చంద్రగిరి, కుప్పం, ఐరాల, జీడీ నెల్లూరు, వెదురుకుప్పం, కురబలకోట, గుర్రంకొండ, వాల్మీకిపురం, సుండుపల్లి, వీరబల్లి, ఆదోని, పత్తికొండ, బద్వేలు, దువ్వూరు, పోరుమామిళ్ల, సిద్ధవఠం, మైదుకూరు, రాయచోటి, సంబేపల్లె తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్ల కొమ్మలు, ఫ్లెక్సీలు నేలకూలాయి. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం అరుదూరులోని శివాలయంలో ధ్వజస్తంభం కూలిపోయింది. ఇద్దరు గొర్రెల కాపర్లు మృత్యువాత వైఎస్సార్ జిల్లాలో సోమవారం భారీ వర్షం కురిసింది. దువ్వూరు మండలంలో పిడుగుపాటుకు గొర్రెల కాపర్లు.. నల్లబోతుల హనుమంతు (56), శెట్టిపల్లె మునిరావు (32) మృతి చెందారు. గొర్రెలు మేపుకునేందుకు గుట్టకు వెళ్లిన వీరు వాన ప్రారంభం కావడంతో సమీపంలోని మర్రిచెట్టు వద్దకు వెళ్లారు. అంతలోనే పెద్ద శబ్దంతో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. బద్వేలులోని సురేంద్రనగర్‌లో ఓ ఇంటిపై పిడుగు పడటంతో గృహోపకరణాలు కాలిపోయాయి. వల్లూరు మండలం తప్పెట్ల బస్టాప్ వద్ద భారీ చెట్టు వర్షానికి కూలిపోయింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని అనిబిసెంట్ వీధిలో ఓ మొబైల్ దుకాణంలోకి వర్షపునీరు చేరడంతో రూ.లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్స్ పరికరాలు నీటమునిగాయి. కోస్తాలో మోస్తరు వానలకు ఆస్కారం కాగా, వచ్చే రెండు రోజులు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనేక చోట్ల పిడుగులు పడతాయని పేర్కొంది. కోస్తా ప్రాంతంలోనూ పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. -
అదిగో.. పిడుగు!
సాక్షి, అమరావతి: నడి వేసవిలో పిడుగులు హడలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై పిడుగులు పడుతున్నాయి. మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఆవరించిన ఉపరితల ద్రోణి, దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు, పిడుగులు పడుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. గత మూడు రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల పిడుగులు పడగా మంగళవారం ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో గత మార్చి నుంచి ఇప్పటి వరకు పది మంది పిడుగుపాటుతో మరణించినట్లు విపత్తు నిర్వహణ శాఖ నిర్థారించింది. అన్నమయ్య, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులు పడుతున్నాయి. ఈ మూడు నెలల్లోనే.. ఏప్రిల్, మే, జూన్ నెలలు పిడుగుల సీజన్. సంవత్సరం మొత్తం మీద 10 నుంచి 15 లక్షల పిడుగులు పడితే ఈ మూడు నెలల్లోనే 5 నుంచి 7 లక్షల పిడుగులు పడతాయి. శాటిలైట్ సమాచారం, ఇతర మార్గాల ద్వారా క్యుములోనింబస్ మేఘాలను బట్టి పిడుగుల సంఖ్యను లెక్కిస్తారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో 2018లో అత్యధికంగా 137 మంది పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఎలా ఏర్పడతాయి? ఉత్తర భారత దేశం నుంచి వీచే పొడి గాలులు, సముద్రం నుంచి వచ్చే తడి గాలులు కలసి మేఘాలుగా ఏర్పడతాయి. నిటారుగా ఉండే వీటిని క్యుములోనింబస్ మేఘాలుగా పిలుస్తారు. అవి ఏర్పడినప్పుడు కచ్చితంగా పిడుగులు పడతాయి. ఈ మేఘాల కిందభాగంలో తడి, పైభాగంలో పొడి గాలులు ఉంటాయి. ఒక మేఘంపైన మరో మేఘం ఆవరించి ఢీ కొన్నప్పుడు తడి, పొడి గాలుల ప్రతిస్పందనకు పిడుగులు పడతాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండాలి. సముద్రం, కొలనులు, సరస్సులు, చెరువులకు దూరంగా వెళ్లాలి. రేకు, లోహంతో చేసిన నిర్మాణాల వద్ద ఉండకూడదు. ఉరుముల శబ్దం వినగానే పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు, బహిరంగ ప్రదేశాల్లో పని చేసేవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. కారు, బస్సులో ఉంటే అన్ని డోర్లు మూసివేయాలి. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నప్పుడు మెడ వెనుక జుత్తు నిక్కబొడవడం లేదా చర్మం జలదరింపు ఉంటే పిడుగుపాటుకు సంకేతంగా భావించి అప్రమత్తం కావాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉంటే రబ్బరు చెప్పులు ధరించి చెవులు మూసుకుని తల నేలకు తగలకుండా మోకాలిపై కూర్చోవాలి. ఇంట్లో ఉంటే కిటికీలు, తలుపులు మూసివేయాలి. పిడుగుపాటు సమయంలో విద్యుత్, ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించకూడదు. స్నానం, చేతులు కడగడం, నీటిలో గడపడం చేయకూడదు. మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వేలాడుతున్న విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలు, ఇనుప వస్తువులకు దూరంగా ఉండాలి. వాహనంలో ఉంటే లోహపు భాగాలను తాకరాదు. పిడుగును గుర్తించే సెన్సార్లు ఏ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉందో హెచ్చరిస్తూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు ప్రజలను ముందే అప్రమత్తం చేస్తోంది. అమెరికాకు చెందిన ఎర్త్ నెట్వర్క్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రంలో పిడుగుల సమాచారాన్ని తెలుసుకునేందుకు 11 సెన్సార్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
వేసవిలో వర్షాలు ప్రమాదకరం.. ఈ పనులు మాత్రం చేయకండి
సాక్షి, పార్వతీపురం జిల్లా: గత నెల 17న కురుపాం మండలంలోని చాపరాయిగూడ గిరిజన గ్రామంలో పిడుగుపడి చెట్టు ఓ కొబ్బరిచెట్టు కాలిపోయింది. తాజాగా ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో ఆకాశం గర్జించింది. ఎక్కడ పిడుగులు పడుతున్నాయోనని జనం తీవ్రభయాందోళనకు గురయ్యారు. వేసవి కాలంలో కురిసే వర్షాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఈ కాలంలో వర్షం వచ్చే సమయంలో ఎక్కువగా ఉరుములతో పాటు పిడుగులు పడుతుంటాయి. పిడుగుపాటు బారిన పడి గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో తిరుగాడే పశువుల కాపర్లు, రైతులు, ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్కోసారి చెట్లు, మూగజీవాలు పిడుగుపాటుకు గురై చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పిడుగులు పడే ప్రాంతాల సమాచారాన్ని వాతావరణశాఖ ముందస్తుగానే తెలియజేస్తోంది. ఆకాశం గర్జించే సమయంలో ఆపద నుంచి గట్టెక్కాలంటే అప్రమత్తంగా ఉండడమే శ్రీరామరక్ష అని, పిడుగు ఎలా పడుతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను నిపుణులు సాక్షికి వివరించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ఏం చేయకూడదంటే.. ►ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేట ప్పుడు చెట్ల కింద నిలబడడం, రైతులు పొలాల్లో ఉండడం చేయకూడదు. ►మెరుపు కనిపించిన తర్వాత 30 సెకన్లలో లేదా అంత కన్నా తక్కువ సమయంలో ఉరుము వినిపిస్తే మనకు 10 కిలోమీటర్ల దూరం లోపు పిడుగు పడే అవకాశం ఉంది. ►మెరుపు కనబడిన తర్వాత 30 నిమిషాల పాటు బయటకు వెళ్లే ప్రయత్నం చేయరాదు. ►గొడుగులపై లోహపు బోల్టులు, చేతుల్లో సెల్ఫోన్లు లేకుండా చూసుకోవాలి. సెల్‌ఫోన్ ఉంటే స్విచ్ఆఫ్ చేయాలి. ►వర్షం పడే సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో ఉండకూడదు. ఆ సమయంలో చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదు. అత్యధిక విద్యుత్ ప్రవాహమే పిడుగు మెరుపుల ద్వారా ఏర్పడే అత్యధిక విద్యుత్ ప్రవాహమే పిడుగు. విద్యుదావేశం పేరుకుపోయిన మేఘాలకు సమీపంలో వ్యతిరేక విద్యుదావేశం కలిగిన మేఘాలు ఉన్నప్పుడు స్థిరంగా విద్యుత్ భూమి వైపు ప్రవహిస్తుంది. అప్పుడు ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత మీటరుకు 2లక్షల ఓల్టులతో సమానం. పిడుగు పడినప్పుడు వస్తువులను బట్టి నష్ట తీవ్రత ఉంటుంది. పొట్నూరు రాజీవ్, ఇస్త్రో శాస్త్రవేత ప్రథమ చికిత్స చేయాలి పిడుగుపాటుకు గురైన వ్యక్తిని వెంటనే పొడి ప్రదేశంలో తిన్నగా పడుకోబెట్టి తడి బట్టలు తీసివేయాలి. తలను ఒక పక్కకు తిప్పి రెండు కాళ్లు ఒక అడుగు పైకి ఎత్తి గాలి తగిలే ప్రదేశంలో ఉంచి, అవసరమైతే నోటి ద్వారా గాలి ఊది ప్రథమ చికిత్స చేయాలి. వెంటనే దగ్గరలో ఉన్న పీహెచ్‌సీకి తరలించి వైద్యసేవలు అందజేయాలి. జె.రవీంద్రకుమార్, సూపరింటెండెంట్,ఏరియా ఆస్పత్రి, పాలకొండ -
పిడుగులు పడితే రక్షించుకోవడం ఎలా? ఏం చేయాలి?
వానాకాలంలో అప్పుడప్పుడూ పలుకరించే పిడుగులతో... ఒకటి అర ప్రాణాలు పోవడం అసహజమేమీ కాదుకానీ.. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో పిడుగుల బారిన పడి పదుల సంఖ్యలో మృతి వేర్వేరు ఘటనల్లోనైనా.. ఒకేరోజు ఇంత మంది చనిపోవడం అసాధారణమే. మరి.. పిడుగులు పడితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఏం చేయాలి? చేయకూడనివి ఏమిటి? అసలు... ఈ పిడుగులేమిటి? వాటి కథేమిటి? పిడుగేమిటన్నది అర్థం చేసుకోవాలంటే ముందుగా మెరుపు గురించి తెలుసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు నీటి ఆవిరిపైపైకి ప్రయాణించి మేఘాలుగా మారతాయని మనకు తెలుసు. ఇవి కొన్ని వేల అడుగుల ఎత్తు వరకూ వివిధ స్థాయిల్లో ఉంటాయి. సూర్యకిరణాల వల్ల మేఘాల పైభాగంలో కొన్ని ధనావేశిత కణాలు ఏర్పడుతూంటాయి. ఇతర కణాల కంటే తేలికగా ఉండటం వల్ల ఇవి మేఘాల పైభాగంలో పోగుబడితే.. బరువైన రుణావేశిత కణాలు దిగువకు వస్తూంటాయి. మామూలుగానైతే.. వ్యతిరేక ఆవేశాలు ఉన్న కణాలు పరస్పరం ఆకర్షితమై ఒక దగ్గరకు చేరాలి కానీ.. మేఘాల దిగువన గాలి కదిలే వేగానికి లేదా కొన్ని ఇతర కారణాల వల్ల రెండింటి మధ్య అంతరం కొనసాగుతూంటుంది. ఈ క్రమంలోనే మేఘాల దిగువన ఉన్న రుణాత్మక కణాలు (ఎలక్ట్రాన్లు) భూమివైపు ప్రయాణిస్తాయి. (ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే విద్యుత్తు అంటాం) మరోవైపు భూమి ఉపరితలంపై ఉండే పొడవాటి నిర్మాణా (విద్యుత్తు స్తంభాలు, ఎత్తైన భవనాలు వంటివి)ల నుంచి ధనావేశిత కణాలు పైపైకి వెళుతూంటాయి. వేడిగా ఉండే ఈ కణాలు రుణావేశిత కణాలను కలిసినప్పుడు అప్పటివరకూ మేఘాల్లో గుమికూడిన ఎలక్ట్రాన్లు మొత్తం ఒక్కసారిగా విడుదలవుతాయి. ఈ విద్యుత్తే పిడుగుపాటు. ఈ సమయంలో ఉత్పత్తి అయ్యే వేడి కారణంగా చుట్టూ ఉన్న గాలి స్వల్ప సమయంలో వేడెక్కుతుంది. వ్యాకోచిస్తుంది. ఇంతలోపే చల్లగా మారిపోతుంది కూడా. అకస్మాత్తుగా జరిగే ఈ మార్పులే శబ్దంగా అంటే ఉరుముగా మనకు వినిపిస్తుంది. నేలపైకి దూసుకొచ్చేవే ఎక్కువ నేలపై, నదులు, సముద్రాలపై కూడా పిడుగులు పడవచ్చు కానీ.. సాధారణంగా భూమ్మీదకు చేరేవే ఎక్కువ. సముద్రతీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ సంఖ్యలో పిడుగులు పడే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు కోటీ అరవై లక్షల పిడుగుపాట్లు నమోదవుతూంటాయని అంచనా. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం భారతదేశంలో ఒక్క 2019లోనే దాదాపు 2,900 మంది పిడుగుపాటుకు మరణించారు. ముందుగా గుర్తించలేమా? పిడుగులను ముందుగా గుర్తించేందుకు ఇప్పటికే ఒక టెక్నాలజీ అందుబాటులో ఉంది. నాలుగేళ్ల క్రితం కుప్పం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కలిసి దీన్ని అభివృద్ధి చేశారు. వజ్రపథ్ పేరుతో రూపొందించిన స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను వాడితే మన పరిసరాల్లో పిడుగులు పడే అవకాశాన్ని ముందుగానే తెలిపి హెచ్చరిస్తుంది. ఈ టెక్నాలజీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సెన్సర్లు కూడా ఏర్పాటు చేశారు. వాటి ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఏ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉందో కనీసం నలభై నిమిషాల ముందే తెలుసుకోవచ్చు. జాగ్రత్తలు ► బహిరంగ ప్రదేశంలో ఉంటే నిటారుగా నిలుచొని ఉండటం కూడదు ► చెట్లు, చెమ్మ, నీరు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ► గుంపులుగా ఉండటం కంటే.. విడిపోయి దూర దూరంగా ఉండటం మంచిది. ► ప్రతి మెరుపుకూ పిడుగు పడదు కానీ.. సురక్షిత ప్రాంతంలో ఉంటే అక్కడి నుంచి వెంటనే మరో చోటుకు వెళ్లకండి. ► పొడవాటి చెట్ల కింద, విద్యుత్ స్తంభాలకు దగ్గరలో నుంచోరాదు. ► స్మార్ట్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడరాదు. ► నీళ్లలో ఉంటే వెంటనే బయటపడాలి. నీరు మంచి విద్యుత్ వాహకమన్నది తెలిసిన విషయమే. మీకు తెలుసా? ► ఒక్కో మెరుపులో ఉండే విద్యుత్తు.. దాదాపు పది కోట్ల వోల్టులు! ► లేక్ మారాసియాబో: ప్రపంచం మొత్తమ్మీద అత్యధిక సంఖ్యలో మెరుపులు మెరిసే ప్రాంతం. వెనిజులాలో ఉంది ఇది. ఇక్కడ ఏటా 160 రోజులపాటు తుపాను గాలులు వీస్తూంటాయి. ఆయా రోజుల్లో సగటున నిమిషానికి 28 మెరుపులు.. వరుసగా 10 గంటలపాటు కనిపిస్తాయి. మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒకే రాత్రి దాదాపు 36 వేల మెరుపులు, వాటితో పిడుగులూ పడినట్లు వార్తలు ఉన్నాయి. ► మెరుపును కృత్రిమ పద్ధతుల్లో తొలిసారి సృష్టించింది.. నికోలా టెస్లా. ఈ కృత్రిమ మెరుపు తరువాత పుట్టిన ఉరుము శబ్ధం 15 మైళ్ల దూరం వరకూ వినిపించిందట. ► మెరుపు లేదా పిడుగు కారణంగా గాల్లో ని నైట్రోజన్.. మొక్కలు శోషించేందుకు అనువైన రూపంలోకి మారిపోతుంది. –నేషనల్ డెస్క్, సాక్షి -
బెంగాల్లో పిడుగులు పడి 20 మంది మృతి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో సోమవారం పిడుగులు పడటంతో మూడు జిల్లాల్లో 20 మంది మరణించారని రాష్ట్ర విపత్తు నిర్వహణాధికారులు వెల్లడించారు. ముర్షిదాబాద్, హుగ్లీ జిల్లాల్లో 9 మంది చొప్పున మరణించగా, పూర్వ మేడినిపూర్ జిల్లాలో ఇద్దరు మరణించారు. ముర్షిదాబాద్ జిల్లాలో మరో ముగ్గురు గాయపడ్డారని, జంగిపూర్ ఆస్పత్రిలో వీరు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. గాయపడిన వారికి రూ. 50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో రుతుపవనాలు బెంగాల్‌ను తాకనున్న నేపథ్యంలో ఈ మెరుపులు రావడం గమనార్హం. -
Thunderstorm: పిడుగులు పడతాయ్.. జాగ్రత్త!
సాక్షి, అమరావతి: వచ్చే వారం రోజులు రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే పదిరోజులుగా పిడుగుల ప్రభావం చాలాచోట్ల కనిపిస్తోంది. అది ఇంకా పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరిస్తోంది. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మీదుగా మహారాష్ట్ర వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. నిట్టనిలువుగా ఉండే ఈ మేఘాల వల్ల పిడుగులు పడుతున్నాయి. ప్రధానంగా విశాఖ మన్యం, నల్లమల అటవీ ప్రాంతాలు, ఈ సమీప గ్రామాల్లో పిడుగులు ఎక్కువగా పడుతున్నట్లు గుర్తించారు. అక్కడి భౌగోళిక పరిస్థితుల వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో శ్రీకాకుళం, విశాఖ, ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పిడుగులు ఎక్కువగా పడుతున్నాయి. సాధారణంగా ఏటా ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రంలో ఈ వాతావరణం ఉండి ఇలా జరుగుతోంది. క్యుములోనింబస్ మేఘాల వల్ల ఒకచోట వేడిగాలులు, మరోచోట చల్లటి గాలులు వీచి వర్షాలతో పిడుగులు పడుతున్నాయి. ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఇప్పటివరకు 10 మందికిపైగా పిడుగుపాటుకు గురయ్యారు. చెట్ల కిందకు వెళ్లొద్దు పిడుగుల ప్రభావం 90 శాతం రైతులు, కూలీలు, పశువుల కాపరులపై ఉంటోంది. పొలాలు, ఆరుబయట పచ్చిక బయళ్లలో ఉండే వీళ్లు ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కిందకు వెళుతున్నారు. అలా వెళ్లినప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల చెట్లపై పిడుగులు పడి వాటి కింద ఉన్న వారు మృత్యువాతపడుతున్నారు. మూడురోజుల కిందట శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు చనిపోయిన ముగ్గురు వ్యక్తులు చెట్లకింద ఉన్నవారేనని గుర్తించారు. పిడుగు ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే చెట్ల కిందకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరిస్తోంది. ఉన్నచోటే కింద కూర్చుని చెవులు మూసుకోవాలని సూచిస్తోంది. లేకపోతే దగ్గర్లో ఉన్న భవనాలు, రేకుల షెడ్లు వంటి వాటిల్లోకి వెళితే పిడుగుల ప్రభావం ఉండదని చెబుతోంది. విపత్తుల నిర్వహణశాఖ పిడుగుల సమాచారాన్ని నాలుగు నిమిషాల ముందే ఆయా ప్రాంతాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు, తహశీల్దార్లు, వీఆర్వోలకు పంపుతోంది. ఇందుకోసం అమెరికాలోని ఎర్త్‌నెట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అక్కడినుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి పిడుగుల హెచ్చరికలు జారీచేస్తోంది. అయినా దీనిపై రైతులు, కూలీలు, గొర్రెల కాపరులకు అవగాహన లేకపోవడం వల్ల మృత్యువాతపడుతున్నారు. వర్షాలు, ఉరుములు, మెరుపుల సమయంలో అప్రమత్తంగా సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని విపత్తుల నిర్వహణశాఖ సూచిస్తోంది. -
ఈదురుగాలులు, వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడి ఐదుగురు మృతిచెందారు. ఈ గాలులు, వర్షాలు రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. పలుచోట్ల చెట్లు విరిగి పడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. పిడుగులు పడి శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు. కర్నూలు జిల్లాలో మృతిచెందిన వ్యక్తి వైఎస్సార్ జిల్లాకు చెందినవారు. గాలులు, వర్షాల కారణంగా కర్నూలు జిల్లాలోని మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. గుంటూరు జిల్లాలో కళ్లాల్లో మిర్చి, ధాన్యం తడిసిపోయాయి. నెల్లూరు జిల్లాలో పసుపు పంట దెబ్బతింది. గుంటూరు జిల్లాలో గురువారం రాత్రి పలుచోట్ల వర్షం కురిసింది. చింతలచెర్వు గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయ ధ్వజస్తంభం పీఠ భాగం పిడుగుపాటుకు దెబ్బతింది. తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రెండుగంటల పాటు వర్షం కురిసింది. పిడుగుల శబ్దాలతో కొండలు ప్రతిధ్వనించాయి. శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న భక్తులు వర్షం కారణంగా గదులకు చేరుకునేందుకు ఇబ్బందిపడ్డారు. శ్రీవారి ఆలయం ఎదుట, మాడ వీధులు, బయట రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. రెండురోజుల పాటు వర్షాలు దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం, అమరావతిల్లోని వాతావరణ కేంద్రాలు తెలిపాయి. రానున్న 48 గంటల పాటు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శుక్రవారం అనంతపురం జిల్లా తనకల్లులో 5 సెంటీమీటర్లు, ఉరవకొండలో 4, కదిరిలో 2, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో 3, గుంటూరు జిల్లా జంగమేశ్వరపురం, ప్రకాశం జిల్లా దర్శి, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, తాడేపల్లిగూడెంలలో ఒక సెంటిమీటరు వంతున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురంలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో పలుచోట్ల శనివారం పిడుగులతో పాటు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
అకాల వర్షాలతో రైతులు లబోదిబో
(విశాఖ దక్షిణ)/పీలేరు /గంగవరం(చిత్తూరు జిల్లా)/పెదదోర్నాల/హిందూపురం: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లాలో పిడుగు పాటుకు ఒకరు మరణించగా, ఓ ఆవు మృతి చెందింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. కల్లాల్లో మిర్చి తడిసిపోయింది. శ్రీకాకుళం జిల్లా రాజాం, పాలకొండ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అనంతపురం జిల్లా హిందూపురంలో గాలివాన హోరెత్తింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లేపాక్షి మండలంలోని కల్లూరు ఎస్సీ కాలనీలో కొబ్బరి చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు ఆందోళన చెందారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన రైతు పి.వెంకటరమణ (50) పిడుగుపాటుకు గురై మరణించగా.. గొర్రెలు మేపుకునేందుకు వెళ్లిన నాగరాజ, హరిబాబు, చంద్రకళ తీవ్రంగా గాయపడ్డారు. వారిని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గంగవరం మండలం మామడుగు గ్రామానికి చెందిన త్యాగరాజులు పొలం వద్ద నుంచి పాడి పశువును ఇంటికి తోలుకొస్తుండగా పిడుగు పడింది. ఈ క్రమంలో ఆవును వదిలేసి త్యాగరాజులు పరుగులు తీశాడు. అయితే ఆవు మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది. రానున్న 48 గంటల్లో మోస్తరు వర్షాలు కొమరిన్ ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, పశ్చిమ బెంగాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రానున్న 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు, కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు 30–40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు.. చిత్తూరు జిల్లా ముడివేడులో 58 మి.మీ, శ్రీకాకుళం జిల్లా భామనిలో 52, అనంతపురం జిల్లా హిందూపురం ఆర్టీవో ఆఫీసు ప్రాంతంలో 50, ప్రకాశం జిల్లా బి.చెర్లపల్లిలో 45, మార్కాపురం ప్రాంతంలో 44, అనంతపురం జిల్లా హిందూపూర్ ప్రాంతంలో 44, విజయనగరంలో 41 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు. పాడేరులో రెండు సెంటీ మీటర్లు, చింతపల్లిలో సెంటీ మీటర్ వర్షపాతం నమోదైంది. -
గోదావరి, కృష్ణా జిల్లాలకు అతి భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు దగ్గరలో వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాల్లో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో శుక్రవారం పలు చోట్ల భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ⇔కోస్తా, రాయలసీమల్లో నేడు, రేపు చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. 15, 16 తేదీల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. ⇔ ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరించారు. ⇔ కోస్తా తీరం వెంబడి గంటకు 45 కి.మీ. నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలుం డటంతో.. రానున్న 24 గంటల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. విస్తరంగా వర్షాలు ⇔ రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసాయి. విశాఖ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు గురువారం దారాలమ్మ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడటంతో అంతర్రాష్ట్ర సరిహద్దు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ⇔ చింతూరు మండలంలో కుయి గూరు వాగు పొంగి జాతీయ రహదారి పైనుంచి ప్రవహిస్తుండటంతో 16 గ్రామాలతో పాటు ఆంధ్రా, ఒడిశా నడుమ రాకపోకలు స్తంభించాయి. ⇔ గోదావరి వరదనీరు తొయ్యేరు వద్ద రహదారి పైకి చేరడంతో దేవీపట్నంతో సహా పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ముంపు భయంతో నిర్వాసితులు గ్రామాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ⇔ కృష్ణా జిల్లాలోని మున్నేరు నది లింగాల వద్ద కాజ్‌వేకు ఆనుకుని 10 అడుగుల మేర వరదనీరు వస్తోంది. దీంతో కాజ్‌వేకు ఇరువైపులా కాపలా ఏర్పాటు చేశారు. చందమామపేటకు చెందిన పశువుల కాపరి శ్రీను మున్నేటి లంకలో ఇరుక్కున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు గజ ఈతగాళ్ల సహాయంతో కాపాడారు. -
పిడుగుపాటుకు గురై 22 మంది మృతి
పాట్నా : బిహార్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు గత 24 గంటల వ్యవధిలో పిడుగుపాటుకు గురై 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటన విడుదల చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో వీరు మృతి చెందినట్లు పేర్కొంది. రానున్న మూడు రోజుల్లో అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఆర్కె జెనమని అన్నారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. (పెరిగిన అసోం వరదల మృతులు ) Over the next 3 days, heavy to very heavy rainfall warning has been given to Assam, Meghalaya, Arunachal Pradesh, Bihar, Sub-Himalayan West Bengal and Sikkim. There are also chances of flooding so we have informed State and the central govt: RK Jenamani, Senior Scientist, IMD pic.twitter.com/dP2BGAzUbI — ANI (@ANI) June 25, 2020