Women entry in Sabarimala Temple
-
‘ధర్మ’ సందేహాలపై నిర్ణయం తీసుకుంటాం!
న్యూఢిల్లీ: ప్రార్థన స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించి న్యాయపరమైన ప్రశ్నలు సిద్ధం చేస్తామని, తొమ్మిది మంది సభ్యులున్న విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ ప్రశ్నలపై ఒక నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల వారిని అనుమతిస్తూ తీర్పు నేపథ్యంలో వేర్వేరు మతాల్లో మహిళలపై కొనసాగుతున్న వివక్షకు సంబంధించి కొన్ని పిటిషన్లు దాఖలు కాగా.. దానిపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం తెల్సిందే. ఈ అంశంపై చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. అయితే ఈ విస్తృత ధర్మాసనం ఏఏ అంశాలపై వాదనలు వినాలన్న అంశంపై కక్షిదారుల లాయర్లు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఆ ధర్మ సందేహాలను తామే సిద్ధం చేస్తామని ప్రకటించింది. శబరిమలపై తీసుకున్న నిర్ణయంపై సమీక్ష ఉండదని స్పష్టం చేసింది. ఈ నెల ఆరవ తేదీ మహిళా వివక్షకు సంబంధించి సిద్ధం చేసే ప్రశ్నలతోపాటు, కాలావధికి సంబంధించిన సమాచారాన్ని కక్షిదారులందరికీ అందజేస్తామని చెప్పింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం గత ఏడాది నవంబరులో ఇచ్చిన రిఫరెన్స్ ఆర్డర్ ఆధారంగా తాము మత స్వేచ్ఛ, మసీదులు, దర్గాల్లోకి మహిళల ప్రవేశం, పార్శీ మహిళలను పెళ్లి చేసుకున్న ఇతర మతస్తులకు పార్శీ ప్రార్థన స్థలాల్లో ప్రవేశంపై నిషేధం వంటి అంశాలపై ఒక న్యాయపరమైన విధానాన్ని అభివృద్ధి చేయనున్నామని బెంచ్ తెలిపింది. పదేళ్ల నుంచి యాభై ఏళ్ల మధ్యవయస్కులకూ శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు బెంచ్ 2018 సెప్టెంబర్ 28న 4:1 మెజార్టీ తీర్పు ఇవ్వడం తెల్సిందే. -
13 నుంచి శబరిమల కేసులో విచారణ
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 13 నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనం ఈ కేసులో వాదనలు విననుంది. శబరిమల అంశంతో పాటు ముస్లిం, పార్శీ మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై కూడా ధర్మాసనం విచారణ చేపట్టనుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ.. ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. మసీదులు, దర్గాల్లోకి ముస్లిం మహిళలను అనుమతించకపోవడం.. పార్శీ మహిళలు పార్శీయేతర కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే వారిని అగ్యారీ అనే పవిత్ర స్థలంలోకి ప్రవేశించనీయకుండా నిషేధాజ్ఞలు విధించడం వంటి ఆంక్షలు దేశంలో ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనికి సంబంధించి కూడా ధర్మాసనం విచారణ జరపనుంది. -
అతిక్రమిస్తే.. జైలుకు పంపుతాం
న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడానికి వీలుగా పోలీసులు రక్షణ కల్పించాలంటూ కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించడానికి సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ మేరకు ఇద్దరు మహిళా కార్యకర్తలు వేసిన పిటిషన్‌పై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీం శుక్రవారం స్పష్టంచేసింది. ‘‘ఈ అంశం చాలా సున్నితమైనది. దీన్ని మరింత వివాదాస్పదం చేయొద్దు. దీనిపై గతంలోనే ఏడుగురు జడ్జిలతో కూడిన బెంచ్ విచారణ జరిపింది కనక ఇప్పుడు ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేం’’ అని చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. ‘శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలని సెప్టెంబర్ 28, 2018లో జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టే లేదు. అయితే అదే అంతిమం కాదు’ అని ధర్మాసనం పేర్కొంది. ఏడుగురు జడ్జిలతో కూడిన బెంచ్ అంతిమ నిర్ణయం వెలువరించేవరకు తాము ఎలాంటి ఆదేశాలు జారీచేయలేమని, ఆలయంలోకి మహిళలను అనుమతిస్తే వెళ్లి పూజలు నిర్వహించవచ్చనని పేర్కొంది. గతేడాది ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టే లేదని పిటిషనర్ తరపు న్యాయవాది తెలుపగా.. ‘చట్టం మీకు అనుకూలంగానే ఉంది. దాన్ని ఎవరైనా అతిక్రమిస్తే అందుకు కారకులను జైలుకు పంపుతాం’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. -
శరణం అయ్యప్ప!
శబరిమల/తిరువనంతపురం: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు మళ్లీ తెరుచుకున్నాయి. గత ఏడాది సుప్రీంకోర్టు ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఇచ్చిన తీర్పుతో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న దృష్ట్యా ఈసారి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో దేవాలయ తంత్రి(ప్రధాన పూజారి) కందరారు మహేశ్ మోహనరు, మెల్షంటి(ముఖ్య పూజారి) సుధీర్ నంబూద్రి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి పడి పూజ చేశారు. అనంతరం భక్తులను లోపలికి అనుమతించారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి అప్పటికే వేలాదిగా తరలివచ్చిన భక్తుల అయ్యప్ప శరణు ఘోషతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 10–50 ఏళ్ల మధ్య వయస్సున్న 10 మంది యువతులను తిప్పి పంపినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించే దేవస్థానం బోర్డు భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. పశ్చిమ కనుమల్లోని పెరియార్ పులుల అభయారణ్యం ప్రాంతంలో ఉన్న ఈ ఆలయాన్ని ప్రతి మలయాళ నెలలోని మొదటి ఐదు రోజులతోపాటు మండలపూజ మకరవిళక్కు, విషు పండగల సమయాల్లో మాత్రమే భక్తుల సందర్శన కోసం తెరుస్తారు. మండల–మకరవిళక్కు సందర్భంగా రెండు నెలలపాటు ఆలయం తెరిచి ఉండనుంది. నిషేధాజ్ఞలు లేవు: కలెక్టర్ రుతుక్రమం వయస్సు మహిళలను కూడా ఆలయంలోకి పూజలకు అనుమతించవచ్చంటూ గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం కేరళతోపాటు దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు, వేలాదిగా పోలీసులను మోహరించినప్పటికీ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈసారి ఎలాంటి నిషేధాజ్ఞలు లేవని పత్తనంతిట్ట కలెక్టర్ ప్రకటించారు. శబరిమలకు వెళ్లే దారిలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో దాదాపు 10 వేల మంది పోలీసులను మోహరించారు. భక్తుల కోసం దేవస్వోమ్ బోర్డు పలు సౌకర్యాలు కల్పించింది. నీలాకల్, పంబ, సన్నిధానం ప్రాంతాల్లో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. సన్నిధానం వద్ద 6,500 మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఏపీ మహిళల బృందం వెనక్కి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చిన 30 మంది మహిళల బృందాన్ని పోలీసులు పంబలో అడ్డుకున్నారు. వారి గుర్తింపు పత్రాలు పరిశీలించిన మీదట అందులోని నిషేధిత 10–50 మధ్య వయస్సున్న 10 మందిని తిప్పిపంపి వేశామని పోలీసులు తెలిపారు. పంబ నుంచి శబరిమల ఆలయం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాగా, కేరళ ప్రభుత్వ వైఖరిని పునరుజ్జీవన రక్షణ కమిటీ ఖండించింది. ప్రభుత్వ విధానం కారణంగా ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న వైఖరి క్రమంగా పలుచన కానుందని ఆ కమిటీ జనరల్ సెక్రటరీ పున్నల శ్రీకుమార్ తెలిపారు. శబరిమల రావాలనుకునే మహిళలు తమతో పాటు కోర్టు ఆర్డర్‌ను తెచ్చుకోవాల్సి ఉంటుందన్న కేరళ దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ ప్రకటనపై ఆయన స్పందిస్తూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి ప్రకటన ఎలా చేస్తారు? ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. ఈ విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాలి’అని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వ వైఖరిపై హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ స్పందించారు. ఆ ప్రభుత్వం ఎవరికీ రక్షణ కల్పించడంలేదని వ్యాఖ్యానించారు. కేరళ సర్కారు తనకు భద్రత కల్పించినా కల్పించకున్నా ఈ నెల 20వ తేదీ తర్వాత శబరిమల ఆలయ సందర్శనకు వెళ్తానని ఆమె ప్రకటించారు. గత ఏడాది ఉద్రిక్త పరిస్థితుల మధ్య తృప్తి దేశాయ్ ఆలయ సందర్శనకు ప్రయత్నించగా భారీ స్థాయిలో ఆందోళనలు తలెత్తిన విషయం తెలిసిందే. చిన్నారి భక్తురాలిని గుడిలోకి పంపిస్తున్న దృశ్యం -
నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం నేడు తెరుచుకోనుంది. దేవాలయ ప్రధాన పూజారి కందరారు మహేశ్ మోహనరు, ముఖ్య పూజారి సుధీర్ నంబూద్రి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించే విషయంలో కేరళ ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. ఆలయాన్ని సందర్శించాలనుకునే మహిళలు సంబంధిత కోర్టు ఆర్డరుతో రావాలని స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు అనుమతిస్తూ 2018లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..శబరిమల సహా మహిళలకు సంబంధించిన ఇతర మతాల్లోని అన్ని వివాదాస్పద అంశాలను విచారించేందుకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, 2018 నాటి∙తీర్పుపై స్టే ఇవ్వలేదు. శబరిమలలోని కీలక ప్రాంతాల్లో 10 వేల మంది పోలీసులను మోహరించనున్నారు. అయితే, నిషేధాజ్ఞలు విధించబోమని పత్తనతిట్ట కలెక్టర్ మీడియాకు తెలిపారు. మా ఆదేశాలను పాటించాల్సిందే! శబరి’ తీర్పుపై జస్టిస్ నారిమన్ న్యూఢిల్లీ: శబరిమలలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడానికి సంబంధించి గురువారం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై.. తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ తీర్పును వ్యతిరేకిస్తూ తాను, జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇచ్చిన తీర్పులోని ‘అత్యంత ముఖ్యమైన’ ఆదేశాలను ప్రభుత్వం క్షుణ్ణంగా చదవడమే కాకుండా, కచ్చితంగా అమలు చేయాలని జస్టిస్ నారిమన్ స్పష్టం చేశారు. జస్టిస్ నారిమన్ శుక్రవారం మరో కేసు విచారణ సందర్భంగా మా ఆదేశాల ఉల్లంఘనను సహించబోం. తప్పనిసరిగా అమలు చేయాల్సిందే’ అని జస్టిస్ నారిమన్ తెలిపారు. -
మళ్లీ మొదటికి!
-
విస్తృత ధర్మాసనానికి ‘శబరిమల’
శబరిమల అంశం మతపరమైన ఆచారాలు, విశ్వాసాలకు సంబం ధించి అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడం అంటే, సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అర్థం. మతపరమైన ప్రార్థన స్థలాల్లోకి మహిళలను నిరాకరించే విషయం శబరిమల ఆలయానికి మాత్రమే పరిమితం కాదు. అది ఇతర మతాల అంశాలకూ వర్తిస్తుంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశం అంశాన్ని.. సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేరళలోని ఈ ఆలయంలోకి రుతుక్రమ వయసు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం గతేడాది తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును పునఃపరిశీలించాలని దాఖలైన రివ్యూ పిటిషన్లను సమీక్షించిన సుప్రీంకోర్టు.. ఈ అంశాన్ని విస్తృత స్థాయి ధర్మాసనానికి అప్పగించింది. శబరిమల వంటి అంశం హిందూ మతానికి మాత్రమే పరిమితం కాదన్న కోర్టు.. ముస్లిం, పార్శీ మహిళలపై ఆయా మతాల్లో కొనసాగుతున్న వివక్షనూ పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు, అమ్మాయిల ప్రవేశం అంశాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం ఏడుగురు సభ్యుల విస్తృతస్థాయి ధర్మాసనానికి అప్పగించింది. దశాబ్దాలుగా అయ్యప్ప ఆలయంలోకి రుతుక్రమ వయసు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పునిచ్చింది. ఈ తీర్పుని పునః పరిశీలించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సమీక్షించిన కోర్టు ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల విస్తృతస్థాయి ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ సందర్భంగా శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తే అది ఒక్క హిందూ మహిళలకే పరిమితంకాదని, ముస్లిం, పార్శీ మహిళలపై ఆయా మతాల్లో జరుగుతున్న వివక్షనూ పరిశీలిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ముస్లిం మహిళలను మసీదు, దర్గాలోకి అనుమతించకపోవడం, పార్శీ మహిళలు.. పార్శీయేతర పురుషులను పెళ్లాడటంపై నిషేధం, బొహ్రా వర్గాల్లో జరుగుతున్న జనన అవయవాల కత్తిరింపుల్లాంటి అంశాలను విస్తృతధర్మాసనం చర్చిస్తుందని కోర్టు పేర్కొంది. సంపూర్ణ న్యాయం అందించేందుకు కోర్టు ఈ అంశాలపై న్యాయవిధానాలను రూపొందించాల్సిన సమయం ఇదేనని తన తొమ్మిదిపేజీల తీర్పుని వెలువరిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గత తీర్పుపై స్టే ఇవ్వాలన్న అంశంపై స్పందిస్తూ విస్తృత ధర్మాసనానికి ఈ అంశాన్ని బదిలీ చేయడం అంటే సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అర్థమని సీజేఐ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ నారీమన్, జస్టిస్ ఖన్వీల్కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాల ధర్మాసనం శబరిమల వివాదాన్ని పునఃపరిశీలించే అంశాన్ని 3:2 మెజార్టీ తీర్పుతో విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పు అమలుకాకుండా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే అంశాన్ని ఐదుగురు సభ్యుల బెంచ్ ఆమోదించినా, అన్ని వయస్సుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పుని సమీక్షించాలని కోరడాన్ని జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు విభేదించారు. సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్ తీర్పు అనంతరం దాఖలైన 65 పిటిషన్లు, 56 రివ్యూ పిటిషన్లు, కొత్తగా దాఖలైన నాలుగు రిట్ పిటిషన్లు, ఐదు అప్పీళ్ళను డిస్మిస్ చేయడాన్ని ఈ ఇద్దరు న్యాయమూర్తులు వ్యతిరేకించారు. శబరిమల ఒక్కటే కాదు.. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తన తరఫున, జస్టిస్ ఎఎం. ఖన్వీల్కర్, ఇందు మల్హోత్రాల తరఫున తీర్పుని చదివి వినిపిస్తూ ఈ అంశం మతపరమైన ఆచారాలూ, విశ్వాసాలకు సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తిందన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం శబరిమలలాంటి మతపరమైన ప్రార్థనా స్థలాలపై ఒకే రకమైన విధానాలను రూపొందించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ‘మతపరమైన ప్రార్థనాస్థలాల్లోనికి మహిళలను నిరాకరించే విషయం కేవలం శబరిమల ఆలయానికి మాత్రమే పరిమితం కాదనీ. ఇది ఇతర మతాల అంశాలకు వర్తిస్తుంది’ అని కోర్టు వ్యాఖ్యానించింది. 2018 సెప్టెంబర్ తీర్పు ఏం చెప్పింది? శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ధర్మాసనం 4ః1 సభ్యుల ఆమోదంతో తీర్పునిచ్చింది. రుతుక్రమం వయస్సులో ఉండే మహిళలు, అమ్మాయి లను శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని సమానత్వ భావనకు భిన్నమైనదని వ్యాఖ్యానించింది. ఈ యేడాది ఫిబ్రవరిలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ శబరిమల తీర్పుని రిజర్వ్‌లో ఉంచడం తెల్సిందే. తీర్పుకి వ్యతిరేకంగా నాడు వెల్లువెత్తిన నిరసనలు కేరళలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ సుప్రీంతీర్పు(2018)కి వ్యతిరేకంగా నాడు హిందూత్వవాదులు, సంఘ్‌పరివార్ లాంటి సంస్థలు పెద్దఎత్తున నిరసన తెలిపాయి. 10 నుంచి 50 ఏళ్ళలోపు వయస్సు మహిళలు అనేక మంది శబరిమల ఆలయప్రవేశానికి ప్రయత్నించారు. కొందరు సఫలమయ్యారు. మరికొందరు వెనుతిరగాల్సి వచ్చింది. అయ్యప్ప భక్తుల కోసం ఈనెల 17న దేవాలయాన్ని తెరవనున్నారు. దేవాలయం తెరుచుకోవడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ తీర్పు రావడంతో ఆలయంలోకి ప్రవేశంపై సందిగ్ధత నెలకొంది. -
శబరిమల, రాఫెల్‌పై తీర్పు నేడే
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా నెలకొన్న అయో«ధ్య వివాదంపై ఇటీవల తుది తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు మరో మూడు కీలక అంశాలపై తీర్పు ఇవ్వనుంది. శబరిమలలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశం, రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంలో అక్రమాలు, రాఫెల్ తీర్పుపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకుగాను దాఖలైన ధిక్కరణ పిటిషన్లపై గురువారం తీర్పునివ్వనుంది. శబరిమల వివాదం.. శబరిమలలో ఉన్న ప్రముఖ అయ్యప్పస్వామి ఆలయంలోకి రుతుక్రమం (10 నుంచి 50 మధ్య వయస్సు)లోని స్త్రీల ప్రవేశంపై నిషేధం ఉంది. ఆలయంలోకి అన్ని వయస్సుల స్త్రీలను అనుమతిస్తూ 2018, సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ అనేక రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ధర్మాసనం వీటిపై విచారణ జరిపి ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వులో ఉంచింది. రఫేల్ వివాదం రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు ఏమీ లేవని కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇస్తూ 2018 డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఈ కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలతో, ఈ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి, యశ్వంత్‌సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై తీర్పుని మే 10న ధర్మాసనం రిజర్వ్‌లో పెట్టింది. అలాగే రాఫెల్‌పై సుప్రీంకోర్టును తప్పుగా అన్వయిస్తూ ‘కాపలాదారు దొంగ’అని ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకుగాను దాఖలైన ధిక్కరణపై పిటిషన్‌పై కూడా ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. -
‘నువ్వు బతికి ఉండొద్దు... చావుపో’
తిరువనంతపురం : బిందు.. ఈ ఏడాది జనవరి మాసంలో దేశవ్యాప్తంగా మార్మోగిన పేరు. కారణం శబరిమలలోకి ప్రవేశించిన మొదటి మహిళ కావడం. శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయ్యప్ప ఆలయంలోకి కేరళకు చెందిన కనకదుర్గ(44), బిందు(42) ప్రవేశించిన చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆలయ ప్రవేశం అనంతరం బిందు ఎన్నో వేధింపులకు గురయ్యారు. అత్తింటి వారితోపాటు.. ఇరుగుపొరుగు వారి విమర్శలు, బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తల దాడులు.. ఇలా ఎన్నో అవమానాలు, వేధింపులకు గురిచేసినా ఆమె నిర్భయంగా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. స్కూల్ టీచర్‌గా తన విధులు నిర్వహిస్తూ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే అయ్యప్ప ఆలయ ప్రవేశ వివాదం సద్దుమనిగిందని అనుకుంటున్న సమయంలో మళ్లీ ఆమెకు వేధింపులు మొదలైయ్యాయి. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఆమెను కొంతమంది బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు వేధించారు. ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగారు. నువ్వు బతికి ఉండొద్దు చావుపో అంటూ మెరుపు దాడి చేశారు. తనపై జరిగిన దాడిని సోషల్ మీడియా వేదికగా ఖండించారు బిందు. తనపై దాడికి దిగిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు. చదవండి : శబరిమలలో కొత్త చరిత్ర ఎన్నికల విధుల్లో భాగంగా బిందు రిజర్వ్ అధికారిగా పట్టంబి నియోజకవర్గానికి వెళ్లారు. అక్కడి ఓ కళాశాలలో ఎన్నికల సామాగ్రిని ఉంచారు. ఆమె విధుల్లో భాగంగా మంగళవారం అక్కడి వెళ్లారు. అక్కడ కొంత మంది వ్యక్తులు తనను గుర్తించి దాడికి యత్నించారని బిందు పేర్కొన్నారు. తన విధులు ముగించుకొని క్యాంపస్‌కు తిరిగి వస్తున్న సమయంలో కొంతమంది దాడి చేశారన్నారు. ’ సాయంత్ర సమయంలో క్యాంపస్ నుంచి బయటకు వెళ్లాను. అక్కడ నా కోసం ఓ గ్రూప్ కాపు కాస్తూ ఉంది. నా దగ్గరకు వచ్చి శబరిమల ఆలయంలోకి వెళ్లింది నువ్వేనా అని ఒకరు అడగ్గా.. నేను సమాధానం చెప్పేలోపే నాపై దాడికి దిగారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ దూషించడం మొదలు పెట్టారు. ’ నువ్వు బతికి ఉండొద్దు.. వెళ్లి చావు’ అంటూ మెరుపు దాడికి యత్నించారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల అధికారిపై దాడి జరగడం దారుణం. ఇది రాజ్యాంగ, ప్రజాస్వామ్యానికే సవాల్‌గా మారుతోంది. నాపై దాడికి ప్రయత్నించిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా. నా పోరాటాన్ని కొనసాగిస్తా’ అని బిందు పేర్కొన్నారు. బిందు చిన్నప్పటి నుంచీ రెబల్. కాలేజీరోజుల్లో కేరళ విద్యార్థి సంఘటన (వామపక్ష విద్యార్థి సంఘం)నాయకురాలిగా పనిచేశారు. కేరళ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. కమిట్మెంట్కు మరోపేరు ఆమె. జెండర్ ఈక్వాలిటీ, సాంఘిక న్యాయ పోరాటాల్లో ముందున్నారు. ఆ విషయాల మీద ఆమె ఇచ్చే ఉపన్యాసాలు వినడం కోసం కేరళలో స్టూడెంట్స్ చెవి కోసుకుంటారు. బిందు వ్యక్తిగత విషయానికి వస్తే ప్రముఖ పొలిటికల్ యాక్టివిస్ట్ హరిరన్ ఆమె భర్త. వాళ్లకు పదకొండేళ్ల కూతురు ఓల్గా. కోజీకోడ్ జిల్లాలోని పోక్కాడ్ ఆమె నివాసం. -
‘51 కాదు 17 మంది మాత్రమే’
తిరువనంతపురం : సుప్రీం కోర్టు తీర్పుకనుగుణంగా దాదాపు 51 మంది 50 ఏళ్ల లోపు వయసున్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించారంటూ కేరళ ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నివేదికలో మగవారి పేర్లు రావడం, 50 ఏళ్ల పైబడిన మహిళలర్లు కూడా ఉండటంతో విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కొత్త నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది. 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు కేవలం 17 మంది మాత్రమే శబరిమల ఆలయంలోకి ప్రవేశించారని ఈ నివేదికలో తెలిపింది. ఈ విషయం గురించి అధికారులు మాట్లాడుతూ.. ‘ఇంతకు ముందు సమర్పించిన నివేదికలో నలుగురు పురుషులు ఉన్నట్లు గుర్తించాము. వారితో పాటు 30 మంది మహిళలు 50 ఏళ్ల వయసు పైబడిన వారిగా గుర్తించి ఆ పేర్లను నివేదిక నుంచి తొలగించినట్లు’ తెలిపారు. ఈ క్రమంలో చివరకూ 50 ఏళ్ల లోపు వయసున్న మహిళలు కేవలం 17 మంది మాత్రమే ఆయంలోకి ప్రవేశించినట్లు కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు గతేడాది తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 2న బిందు, కనక దుర్గ అనే ఇద్దరు 50 ఏళ్లలోపు మహిళలు ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో కేరళలోని హిందూ నిరసనకారులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు. -
51 మంది మహిళలు దర్శించుకున్నారు
న్యూఢిల్లీ/తిరువనంతపురం: రుతుస్రావ వయసులో ఉన్న 51 మంది మహిళలు ఇప్పటివరకూ శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకున్నట్లు కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేరళ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టు ధర్మాసనానికి అఫిడవిట్‌ను సమర్పించింది. కేరళ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హన్సరియా వాదిస్తూ.. స్వామివారి దర్శనం కోసం రుతుస్రావ వయసులో ఉన్న 7,564 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా, 51 మంది దర్శనం చేసుకున్నారన్నారు. తప్పులతడకగా అఫిడవిట్.. కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్లో అయ్యప్పను దర్శించుకున్న మహిళల ఆధార్, టెలిఫోన్ నంబర్లను బహిర్గతం చేయడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. తమిళనాడుకు చెందిన పరంజ్యోతి(47) అనే పురుషుడి పేరును కేరళ ప్రభుత్వం అఫిడవిట్లో చేర్చినట్లు బయపడింది. అలాగే అఫిడవిట్లో పేర్కొన్న కళావతి మనోహర్ వయస్సు 52 సంవత్సరాలనీ, 43 ఏళ్లు కాదని ఆమె కొడుకు చెప్పారు. ఆ మహిళలకు రక్షణ కల్పించండి.. అయ్యప్పస్వామిని దర్శించుకున్న బిందు(42), కనకదుర్గ(44)లకు భద్రత కల్పించాలని కేరళ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. బిందు, కనకదుర్గల భద్రత మినహా ఈ రిట్ పిటిషన్లో తాము ఇతర అంశాల జోలికి వెళ్లడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో కేరళ ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ బిందు ఇంటివద్ద నలుగురు అధికారులు, అత్తచేతిలో దాడికి గురై ఆసుపత్రిలో ఉన్న కనకదుర్గకు 19 మందితో రక్షణ కల్పిస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బిందు కోజికోడ్‌లోని ఓ కళాశాలలో లెక్చరర్‌గా, కనకదుర్గ పౌరసరఫరాల విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
‘వారికి 24/7 రక్షణ కల్పించండి’
న్యూఢిల్లీ : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు బిందు, కనకదుర్గలకు 24 / 7 రక్షణ కల్పించాలంటూ శుక్రవారం సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలయంలోకి ప్రవేశించినందుకు తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ.. ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించాలని కోరుతూ ఈ ఇద్దరు మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు బిందు, కనకదుర్గలకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి శబరిమల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసింది. ఆడవారిని ఆలయంలోకి ప్రవేశించకుండా ఆందోళనకారులు అడ్డుగిస్తున్నారు. ఈ క్రమంలో బిందు, కనకదుర్గలు ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. కానీ ఆలయంలోకి వెళ్లి వచ్చినప్పటి నుంచి వారికి బెదిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో జనవరి 15న కనకదుర్గ మీద ఆమె అత్త, బంధువలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాంతో బిందు, కనకదుర్గలు తమకు ప్రాణ హాని ఉందని గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే ఆలయంలోకి వెళ్లాలనుకునే మహిళలకు పోలీసు రక్షణ కల్పించేలా కోర్టు ఆదేశించాలని కోరారు. వీరి పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టాలని వీరి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌ను కోరారు. -
మగవారిలా వేషం మార్చి..
తిరువనంతపురం : శబరిమల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికి ఆందోళనకారులు మాత్రం దీన్ని ఖాతరు చేయటం లేదు. మహిళలను ఆలయ ప్రాంగణంలోకి కూడా రానివ్వడంలేదు. అయితే ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా కొందరు మహిళలు ఎలాగోలా ఆలయంలోకి ప్రవేశించి ఇప్పటికే అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరు మహిళలు, మగవారిలా వేషం ధరించి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆందోళనకారులు వారిని అడ్డుకున్నారు. తొమ్మిది మంది అయ్యప్ప భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తుండగా అనుమానం వచ్చిన ఆందోళనకారులు వారిని అడ్డుకున్నారు. ఈ అయ్యప్ప భక్తుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని తెలింది. దాంతో ఆందోళనకారులు సదరు మహిళల్ని ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో వారు వెనుతిరగాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఈ నెల 2న అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన కనకదుర్గ అనే మహిళపై ఆమె అత్త, బంధువులు మంగళవారం దాడి చేశారు. -
అయ్యప్ప ఆలయంలోకి వెళ్లిన మహిళపై అత్త దాడి
సాక్షి, తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించిన మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయి. బిందుతో కలిసి ఆయలంలోకి ప్రవేశించిన కనకదుర్గ అనే మహిళను సొంతింటి వాళ్లే చిత్రహింసలు పెట్టారు. అయ్యప్ప దర్శనం అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన కనకదుర్గ నేడు సొంతింటి చేరుకున్నారు.మొదటిసారిగి ఇంటికి వచ్చిన కనకదుర్గపై అత్తింటివారు దాడికి దిగారు.(శబరిమలలో కొత్త చరిత్ర) ఆలయంలోకి ఎందుకు వెళ్లావంటూ కనకదుర్గ అత్త కర్రతో ఆమెను చితకబాదారు. సంస్కృతి, సంప్రదాయాలను మరచి ఎంత చెప్తున్నా వినకుండా అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లి ఆచారాలను మంటగలిపిందంటూ ఆమెపై చేయిచేసుకున్నారు. దీంతో కనకదుర్గ తలకు బలంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కనకదుర్గ ఇంటికి చేరుకున్నారు. తీవ్రగాయాలపాలైన కనకదుర్గను ఆస్పత్రికి తరలించారు. దాడికి దిగిన కనకదుర్గ అత్తపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇది చదవండి : ఆ ఇద్దరూ శబరిమలకు ఎలా వెళ్లారు? -
‘తలకు రంగేసుకుని ఆలయంలోకి వెళ్లాను’
తిరువనంతపురం : అన్ని వయసుల మహిళల్ని అయ్యప్ప ఆలయంలోనికి అనుమతించాలంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు నేలకొన్న సంగతి తెలిసిందే. అనేక ఆందోళనల నడుమ ఇప్పటికే ఎనిమిది మంది మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. వీరేకాక కేరళకు చెందిన మంజు అనే 36 ఏళ్ల మహిళ కూడా ఆలయంలోకి ప్రవేశించానని తెలిపారు. తలకు తెల్లరంగు వేసుకుని అయ్యప్ప దర్శనం చేసుకున్నాని తెలిపారు మంజు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దాంతోపాటు ఎలా తాను అయ్యప్ప సన్నిధిలోకి వెళ్లిందనే వివరాలను కూడా షేర్ చేశారు మంజు. మంజు చెప్పిన వివరాలు.. ‘త్రిస్సూర్ నుంచి జనవరి 8న నా శబరిమల యాత్ర ప్రారంభించాను. అయితే ఆందోళనకారుల నుంచి వ్యతిరేకత ఎదురవకుండా ఉండాలనే ఉద్దేశంతో తలకు తెల్లరంగు వేసుకున్నాను. దాంతో నేను పెద్దవయసు స్త్రీలా కనిపించాను. ఈ ప్రయత్నం నాకు మంచే చేసింది. నన్ను చూసిన ఆందోళనకారులు పెద్దవయసు స్త్రీగా భావించి.. ఆలయంలోకి వెళ్లేందుకు అడ్డు చెప్పలేదు. దాంతో పోలీసుల సాయం లేకుండానే నేను అయ్యప్పను దర్శించుకున్నాను. ఆలయంలోకి ప్రవేశించిన నేను దాదాపు 2 గంటలపాటు సన్నిధానంలో గడిపానం’టూ చెప్పుకొచ్చారు మంజు. ఈ సమయంలో అఖిల భారత అయ్యప్ప సంఘం సభ్యులు తనకు చాలా సాయం చేశారన్నారు మంజు. అయితే గత ఏడాది అక్టోబరులోనే తాను అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి.. విఫలమయ్యానని చెప్పారు మంజు. కానీ ఈ సారి మాత్రం దర్శనం చేసుకోగలిగానని సంతోషం వ్యక్తం చేశారు. -
అట్టుడుకుతున్న కన్నూర్
కన్నూర్/తిరువనంతపురం/న్యూఢిల్లీ: కేరళలో రాజకీయంగా అత్యంత సున్నితమైన కన్నూర్‌తోపాటు పతనంథిట్ట, కోజికోడ్ జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ, సీపీఎం నేతల ఇళ్లు, ఆస్తులపై బాంబు దాడులు జరిగాయి. శబరిమల ఆలయంలోకి 2వ తేదీన 50 ఏళ్లలోపు ఇద్దరు మహిళల ప్రవేశం అనంతరం రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. ఆలయ సంప్రదాయాలకు భంగం కలిగించడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని సీఎం విజయన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. పలుచోట్ల బాంబు దాడులు సీపీఎం ఎమ్మెల్యే ఏఎన్ షంషీర్‌కు చెందిన మడపీడికయిల్‌లోని ఇంటిపై, వడియిల్ పీడికియలోని బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు వి. మురళీధరన్ పూర్వీకుల నివాసం, తలస్సేరిలోని సీపీఎం నేత పి.శశి ఇంటిపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పొరుగునే ఉన్న కోజికోడ్ జిల్లా పెరంబ్రాతోపాటు శబరిమల ఆలయం ఉన్న పతనంథిట్ట జిల్లా మలప్పురం, ఆదూర్‌లలో శుక్రవారం అర్థరాత్రి, శనివారం వేకువజామున బీజేపీ, సీపీఎం కార్యకర్తలు పరస్పరం దాడులు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అల్లర్లకు సంబంధించి 1,700 మందిని, కన్నూర్ జిల్లాలో హింసాత్మక ఘటనలకు సంబంధించి 260 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శబరిమల అంశాన్ని సున్నితంగా పరిష్కరించడానికి బదులు సీపీఎం ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అన్ని వర్గాల వారు చట్టాన్ని గౌరవించాలన్నదే తమ అభిమతమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ప్రతినిధి ఫర్హాన్ హక్ అన్నారు. శబరిమల వివాదం కారణంగా కేరళలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుం టున్నందున అప్రమత్తంగా ఉండాలని బ్రిటన్ ప్రభుత్వం తమ పౌరులను హెచ్చరించింది. -
‘అతడు బ్రాహ్మణుడు కాదు.. రాక్షసుడు’
శబరిమల : అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రం రణరంగంగా మారింది. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కనక దుర్గ, బిందు అనే ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలో ప్రవేశించి.. అయ్యప్ప దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే. మహిళలు ఆలయంలో ప్రవేశించడంతో.. పూజారి కందరు రాజీవేరు ఆలాయాన్ని మూసి వేసి శుద్ధి కార్యక్రమాలు జరిపారు. ఇవి కాస్తా వివాదాస్పందగా మారాయి. దీని గురించి కేరళ మంత్రి జీ సుధాకరన్ మాట్లాడుతూ.. ‘ఎవరైనా తమ సోదరిని అపవిత్రురాలిగా భావిస్తారా’ అంటూ ప్రశ్నించారు. శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన బ్రాహ్మణున్ని రాక్షసుడంటూ విమర్శించారు. ఈ పూజలు నిర్వహించిన వ్యక్తి అసలైన బ్రాహ్మణుడు కాదు. అతనికి అయ్యప్ప పట్ల ఎటువంటి భక్తి, మర్యాద లేవు. ఇతను బ్రాహ్మణుడు కాదు.. బ్రాహ్మణ రాక్షసుడు. ఇలాంటి వాడు తీవ్రవాదిగా కూడా మారతాడన్నారు. -
‘శబరిమల ఆలయంలోకి 8 మంది మహిళలు’
తిరువనంతపురం: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పటివరకు 8 మంది మహిళలు (రుతుక్రమ వయసులో ఉన్నవారు) శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని కేరళ పోలీసులు వెల్లడించారు. అయితే ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన విషయం మాత్రమే అందరికి తెలిసింది. 42 ఏళ్ల బిందు అమ్మిని, 41 ఏళ్ల కనకదుర్గ.. బుధవారం (రెండో తారీఖు) తెల్లవారుజామున అయ్యప్పను దర్శించుకోవడం పెను వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై కేరళలో ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు ప్రవేశించరాదని ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు 2018, సెప్టెంబర్‌లో కొట్టివేసిన సంగతి తెలిసిందే. (ఎమ్మెల్యే, ఎంపీ ఇళ్లపై బాంబు దాడులు) సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎనిమిది మంది మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారన్న పోలీసుల వాదనను శబరిమల కర్మ సమితి తోసిపుచ్చింది. ఎక్కువ మంది మహిళలు శబరిమలకు తరలిరావాలన్న కుట్రలో భాగంగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించింది. అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు శ్రీలంక మహిళ శశికళ చేసిన ప్రయత్నాన్ని ప్రహసనంగా వర్ణించింది. ఎందుకు శుద్ధి చేశారు? ఆలయాన్ని సంప్రోక్షణ చేసిన ప్రధాన పూజారి రాజీవరు కందరావ్ను ట్రావెన్కోర్ దేవస్థానం పాలకమండలి వివరణ కోరింది. బిందు, కనకదుర్గ అనే మహిళలు ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ప్రధాన పూజారి భక్తులందరినీ బయటికి పంపించి, తలుపులు మూసి సుమారు గంట సేపు గర్భగుడిలో సంప్రోక్షణ నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆయనను పాలక మండలి వివరణ అడిగింది. (వారు చివరి మెట్టును చేరగలిగారు) -
ఎమ్మెల్యే, ఎంపీ ఇళ్లపై బాంబు దాడులు
కన్నూర్: శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశంతో కేరళలో రాజుకున్న అలజడి ఇంకా చల్లారలేదు. ఆందోళనలు, దాడులతో కేరళ అట్టుడుకుతోంది. కన్నూర్ జిల్లాలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. తలాసరీ ప్రాంత ఎమ్మెల్యే, సీపీఎం నాయకుడు ఏఎన్ షమీర్, బీజేపీ ఎంపీ వి మురళీధరన్ నివాసాలతో పాటు పలుచోట్ల శుక్రవారం రాత్రి బాంబు దాడులు జరిగాయి. షమీర్ ఇంటిపైకి దుండగులు నాటు బాంబులు విసిరారు. ఇరిట్టి ప్రాంతంలో సీపీఎం కార్యకర్త కత్తిపోట్లకు గురయ్యాడు. రాష్ట్రంలో దాడులకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కుట్రలు చేస్తోందని షమీర్ ఆరోపించారు. కల్లోల పరిస్ధితులను సృష్టించి హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తన ఇంటిపై దాడి వెనుక సీపీఎం హస్తం ఉందని మురళీధరన్ ఆరోపించారు. ఆందోళనకారుల దాడుల్లో 99 ఆర్టీసీ బస్సులకు నష్టం వాటిల్లింది. ధ్వంసమైన బస్సులతో ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కన్నూరు జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని భద్రతా బలగాలను తరలించారు. హింసాత్మక ఘటనలు కొనసాగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధాని మోదీ ర్యాలీ వాయిదా కేరళలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ‘జనవరి 6న పతాన్‌మత్తిట్టాలో జరగాల్సిన ప్రధాని మోదీ పర్యటన ఇతర కార్యక్రమాల కారణంగా వాయిదా పడింది. కేరళలో ప్రస్తుత పరిస్థితులకు, ప్రధాని పర్యటన వాయిదా పడటానికి సంబంధం లేద’ని బీజేపీ ప్రకటించింది. ఈ ఏడాది దక్షిణాదిలో ప్రధాని మోదీ పాల్గొనబోయే మొదటి రాజకీయ ర్యాలీ ఇదే. -
సన్నిధానంలో శ్రీలంక మహిళ
శబరిమల: శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశంతో కేరళలో రాజుకున్న ఉద్రిక్తత శుక్రవారం కూడా కొనసాగింది. దేవస్థానం బోర్డు సభ్యుడి ఇంటితో పాటు మరికొన్నిచోట్ల ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరి అలజడి సృష్టించారు. ఈ సందర్భంగా శబరిమల అయ్యప్పస్వామిని శ్రీలంకకు చెందిన శశికళ(47) అనే మహిళ దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా విడుదల చేశారు. గురువారం అర్ధరాత్రి శశికళ గుడిలోకి చేరుకుని పూజలు నిర్వహించినట్లు కేరళ సీఎం కార్యాలయం తెలిపింది. భర్త శరవణ్, కుమారుడు దర్శన్‌తో కలిసి ఆమె ఆలయానికి వచ్చారని వెల్లడించింది. మరోవైపు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారన్న వాదనల్ని శశికళ ఖండించారు. తాను స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు యత్నించినప్పటికీ పోలీసులు అనుమతించలేదని అన్నారు. ఆలయానికి రాకముందు తాను 41 రోజుల వ్రతం పాటించానని వెల్లడించారు. స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు భక్తుల నుంచి ఎలాంటి నిరసనలు ఎదురుకాలేదని పేర్కొన్నారు. ‘పోలీస్ అధికారులు నన్ను ఎందుకు అనుమతించలేదు? మీరంతా(మీడియా) నా చుట్టూ ఎందుకు నిలబడ్డారు? నేను ఎవరికీ భయపడను’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కుమారుడితో కలిసి తాను మాత్రమే అయ్యప్పస్వామిని దర్శించుకున్నానని శశికళ భర్త శరవణ్ స్పష్టం చేశారు. మరోవైపు భద్రతా కారణాలతోనే శశికళ అలా చెప్పి ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. అయ్యప్పస్వామి దర్శనానికి శుక్రవారం శబరిమల వచ్చిన కయాల్ అనే ట్రాన్స్‌జెండర్‌ను భక్తుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు వెనక్కి పంపారు. బిందు, కనకదుర్గ అనే మహిళలు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి నిరసనగా కొందరు దుండగులు శుక్రవారం తెల్లవారుజామున మలబార్ దేవస్థానం బోర్డు సభ్యులు కె.శశికుమార్ ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరి పరారయ్యారు. అలాగే పతనంతిట్ట ప్రాంతంలోని ఓ మొబైల్ షాపుపై పెట్రోల్‌బాంబు దాడి జరిగింది. 200 మంది అరెస్ట్! సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య హింస తీవ్రంగా చెలరేగుతున్న కన్నూర్‌లో 200 మంది ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అల్లర్లు, గొడవల నేపథ్యంలో 801 కేసులు నమోదుచేసిన పోలీసులు.. 1,369 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. పాలక్కడ్‌తో పాటు కసర్గోడ్ జిల్లా మంజేశ్వరమ్‌లో నిషేధాజ్ఞలు విధించారు. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు ప్రవేశించరాదని ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు 2018, సెప్టెంబర్‌లో కొట్టివేసిన సంగతి తెలిసిందే. -
శబరిమలలో శ్రీలంక మహిళకు నో ఎంట్రీ
శబరిమల/తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం విషయంలో మరో వివాదం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు శబరిమల చేరుకున్న శ్రీలంకకు చెందిన శశికళ అనే మహిళను ఆలయ అధికారులు అడ్డుకున్నారు. ఆమెకు ఆలయంలోకి ప్రవేశం నిరాకరించారు. బిందు, కనకదుర్గ అనే మహిళలు బుధవారం అయ్యప్ప సన్నిధికి చేరుకున్న సంగతి తెలిసిందే. నిబంధలనకు విరుద్దంగా స్వామి దీక్ష ముసుగులో నల్లని దుస్తులు ధరించి వారు దర్శనం చేసుకున్నారని అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంతో కేరళ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాగా, మండలదీక్ష ఆచరిస్తున్న శశికళను లోనికి వెళ్లకుండా అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. మెడికల్ సర్టిఫికెట్తో పాటు దర్శనానికి వచ్చినా అనుమతి నిరాకరించటంపై శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. శశికళను అడ్డుకోవడం పట్ల రాష్ట ప్రభుత్వంపై మహిళా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. శబరిమలలో కొత్త చరిత్ర వారు చివరి మెట్టును చేరగలిగారు -
రణరంగంగా కేరళ
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశం కేరళను రణరంగంగా మార్చింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగిన హిందూ సంస్థల కార్యకర్తలు రోడ్లకు అడ్డంగా కాలిపోతున్న టైర్లు, గ్రానైట్ పలకలు ఉంచి నిరసనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శబరిమల కర్మ సమితి ఇచ్చిన 12 గంటల హర్తాళ్ పిలుపు మేరకు వందలాది మంది హిందూ అనుకూల సంస్థల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టించారు. అధికార సీపీఎం కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులకు కూడా నిరసనల సెగ తాకింది. ఆందోళనకారుల దాడిలో పలువురు పాత్రికేయులు గాయాలపాలయ్యారు. పోలీసులు, సీపీఎం కార్యకర్తలతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగడంతో చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల వ్యవధిలో 266 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 334 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించాలని గవర్నర్ పి. సదాశివం ముఖ్యమంత్రి విజయన్ను ఆదేశించారు. తాజా హింసకు బీజేపీ, ఆరెస్సెస్‌లే కారణమని విజయన్ ఆరోపించారు. మరోవైపు, శబరిమల ఆలయాన్ని ఇద్దరు మహిళలు దర్శించుకున్న తరువాత గర్భగుడిని శుద్ధిచేయడంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బీజేపీ కార్యకర్తలకు కత్తిపోట్లు.. త్రిసూర్‌లో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) కార్యకర్తలతో జరిగిన ఘర్షణలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కత్తిపోట్లకు గురయ్యారు. కోజికోడ్, కన్నూర్, మలప్పురం, పాలక్కడ్, తిరువనంతపురం తదితర పట్టణాల్లోనూ బీజేపీ, శబరిమల కర్మ సమితి కార్యకర్తల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్స్ ప్రయోగించి, లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. పాలక్కడ్‌లో సీపీఎం కార్యాలయంపై దాడికి పాల్పడిన నిరసనకారులు, దాని ముందు నిలిపిన వాహనాల్ని ధ్వంసం చేశారు. కన్నూర్ జిల్లాలోని తాలసెరిలో సీపీఎం నిర్వహణలో ఉన్న బీడీ తయారీ కేంద్రంపై నాటుబాంబు విసిరారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న 10 మందిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. మీడియాపై దాడికి నిరసనగా తిరువనంతపురంలో పాత్రికేయులు ఆందోళనకు దిగారు. బీజేపీ, శబరిమల కర్మ సమితి కార్యక్రమాలను బహిష్కరించాలని కేరళ మీడియా వర్కింగ్ యూనియన్ నిర్ణయించింది. హర్తాళ్ వల్ల దుకాణాలు, ఇతర వాణిజ్య సముదాయాలు మూతపడటంతో జనజీవనం స్తంభించింది. గురువారం కాంగ్రెస్ ‘బ్లాక్ డే’గా పాటించింది. పాతనంతిట్టా జిల్లాలోని పాండలమ్లో సీపీఎం కార్యకర్తలు తమ కార్యాలయ భవనం పైనుంచి రాళ్లు రువ్వడంతో తీవ్రంగా గాయపడిన 55 ఏళ్ల ఉన్నితాన్ చనిపోయారు. బుధవారం సాయంత్రం శబరిమల కర్మ సమితి చేపట్టిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ దాడిలో పాల్గొన్న 9 మందిని గుర్తించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఉన్నితాన్ గుండెపోటుతో మరణించాడని ముఖ్యమంత్రి విజయన్ వెల్లడించారు. చెన్నైలో కేరళ సీఎం దిష్టిబొమ్మ దహనం సాక్షి, చెన్నై: శబరిమల ఆందోళనలు చెన్నైకీ విస్తరించాయి. పల్లవరంలో బీజేపీ కార్యకర్తలు కేరళ సీఎం విజయన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్‌ని అయ్యప్ప ఆలయంలోకి అనుమతించని కేరళ ప్రభుత్వం ఇద్దరు మహిళల్ని మాత్రం బందోబస్తుతో పంపిందని తమిళనాడు బీజేపీ చీఫ్ సౌందరరాజన్ విమర్శించారు. హింస వెనక బీజేపీ, ఆరెస్సెస్: విజయన్ హర్తాళ్ మద్దతుదారులు హింసకు పాల్పడటం వెనక పక్కా ప్రణాళిక ఉందని సీఎం విజయన్ పేర్కొన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ హింసను ప్రేరేపించాయని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. శబరిమలకు వెళ్లిన ఇద్దరిని ప్రభుత్వం తీసుకెళ్లలేదని, వారు సాధారణ భక్తులలాగే ఆలయ సందర్శనకు వెళ్లారని చెప్పారు. వారిని హెలికాప్టర్లో తరలించారన్న వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ హర్తాళ్ చేయడమంటే సుప్రీంకోర్టు తీర్పును శంకించడమేనని పేర్కొన్నారు. మహిళల దర్శనం తరువాత ఆలయాన్ని శుద్ధిచేసిన పూజారుల తీరును కూడా విజయన్ తప్పుబట్టారు. ఢిల్లీలో కేరళ సీఎం విజయన్ దిష్టిబొమ్మను దగ్ధంచేస్తున్న అయ్యప్ప ధర్మ సంరక్షక సమితి సభ్యులు -
ఆ ఇద్దరూ శబరిమలకు ఎలా వెళ్లారు?
దేవుడి సన్నిధే ఒక అలౌకిక అనుభూతి. దాన్ని ఆస్వాదించడానికే ఆలయానికి వెళ్తాం! రుతుచక్ర వయసులో ఉన్న మహిళల శారీరక శుభ్రత ఆధారంగానే అయ్యప్ప దర్శనం ఆడవాళ్లకు ఇవ్వలేదు. రుతుస్రావం ప్రకృతి ఇచ్చిన ప్రత్యుత్పత్తి ప్రక్రియ. అదే లేకపోతే సృష్టే లేదు అనే తర్కంతో దేవుడి దర్శనం కోసం స్త్రీలు ఉద్యమించారు. సాధించారు. నలభై రెండేళ్ల బిందు అమ్మిని, నలభై ఒక్క ఏళ్ల కనకదుర్గ... చట్టం కల్పించిన హక్కును వినియోగించుకున్నారు. ప్యూబర్టీ రాని, మెనోపాజ్ వచ్చిన ఆడవాళ్లే శబరిమల అయ్యప్పను దర్శించుకోవాలనే నియమాన్ని సవరించారు. శబరిమల అయ్యప్పను దర్శించుకున్న మొదటి మహిళలు (రుతుక్రమ వయసులో ఉన్న)గా చరిత్ర సృష్టించారు. మొన్న మంగళవారం రాత్రి (ఒకటవ తారీఖు) ఎర్నాకులం నుంచి బయలుదేరి బుధవారం తెల్లవారు జామున శబరిమల ప్రారంభ ప్రాంతమైన పంపానది దగ్గరకు చేరుకున్నారు. అక్కడ పోలీసుల రక్షణతో శబరిమలకు వెళ్లారు. బుధవారం (రెండో తారీఖు) ఉదయం 3 గంటల 45 నిమిషాలకల్లా ఆలయంలోకి అడుగుపెట్టారు. ఆ ఇద్దరి నేపథ్యం బిందు... ఒక యాక్టివిస్ట్. దళిత్ యాక్టివిస్ట్. కన్నూర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లీగల్ స్టడీస్‌లో ప్రొఫెసర్. చిన్నప్పటి నుంచీ బిందు రెబల్. కాలేజీరోజుల్లో కేరళ విద్యార్థి సంఘటన (వామపక్ష విద్యార్థి సంఘం)నాయకురాలిగా పనిచేశారు. కేరళ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. కమిట్మెంట్కు మరోపేరు ఆమె. జెండర్ ఈక్వాలిటీ, సాంఘిక న్యాయ పోరాటాల్లో ముందున్నారు. ఆ విషయాల మీద ఆమె ఇచ్చే ఉపన్యాసాలు వినడం కోసం కేరళలో స్టూడెంట్స్ చెవి కోసుకుంటారు. బిందు వ్యక్తిగత విషయానికి వస్తే ప్రముఖ పొలిటికల్ యాక్టివిస్ట్ హరిరన్ ఆమె భర్త. వాళ్లకు పదకొండేళ్ల కూతురు ఓల్గా. కోజీకోడ్ జిల్లాలోని పోక్కాడ్ ఆమె నివాసం. కనకదుర్గ.. ఓ భక్తురాలు ... కనకదుర్గ నాయర్ కేరళ రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఉద్యోగి. భర్త ఉన్ని కృష్ణన్. ఇంజనీర్. వాళ్లకు ఇద్దరు పిల్లలు. మలప్పరంలో ఉంటారు. ఓ భక్తురాలిగా శబరిమల దర్శనానికి వెళ్లాలనుకున్నారు. బిందు, కనకదుర్గ ఎలా కలిశారు? సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ స్త్రీల ఆలయ ప్రవేశానికి ఇతరత్రా తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే సరికి రహస్యంగా ప్రణాళికలు వేసుకోవాల్సి వచ్చింది. ఆసక్తి ఉన్న మహిళలు కొంత మంది ‘నవోథన కేరళం శబరిమలయిలెక్కు’ అనే ఒక ఫేస్బుక్ పేజ్ స్టార్ట్ చేశారు. అలా బిందు, కనకదుర్గ ఒకరికొకరు పరిచయం అయ్యారు. డిసెంబర్ 24న మొదటి ప్రయత్నం చేశారు. ఆలయంలో ఆడవాళ్లకు ప్రవేశం లేదు అని గట్టిగా నమ్మే వారి నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఆ దాడి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులు సహా పోలీసులు, మీడియా కంట కూడా పడకుండా ఓ వారం రోజుల పాటు రహస్యంగా ఉండి ఈ నెల ఒకటవ తారీఖున మళ్లీ ప్రయత్నించారు. అలా దైవ దర్శనం సాధించారు. ‘‘దర్శనం అయ్యేదాకా కదిలేది లేదని చాలా మొండిగా ఉన్నాం. దాంతో పోలీసులకు సెక్యూరిటీ కల్పించక తప్పలేదు’’ అని చెప్పారు బిందు. ప్రవేశం కోసం ఇప్పటివరకు ప్రయత్నించిన మహిళలు గుడి తలుపులు తెరిచినప్పటి నుంచి కనీసం పదమూడు మంది మహిళలు దర్శనం కోసం శబరిమల బాట పట్టారు. నీలక్కల్ బేస్‌క్యాంప్ దాకా రాగలిగారు. తర్వాత హేళనకు, హెచ్చరికలకు, దాడులకు గురయ్యి బలవంతంగా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అలా విఫలయత్నం చేసిన మహిళల్లో మొదటి వ్యక్తి సీఎస్ లిబి. అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నాను అని ఫేస్బుక్లో పోస్ట్‌చేసి మరీ బయలుదేరిన లిబిని గుడికి 65 కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకున్నారు వ్యతిరేకులు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలభై ఏళ్ల మాధవిని పంబ నుంచి వెనక్కి పంపించేశారు భక్తులు. ఢిల్లీకి చెందిన సుహాసినీ రాజ్‌కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. హైదరాబాద్ రిపోర్టర్ కవితా జక్కల్ ‘వాలియ నడప్పాంధాల్’ క్యూకాంప్లెక్స్ వరకూ వెళ్లగలిగింది. కవితాతో కలిసి వెళ్లిన మరో యాక్టివిస్ట్ రెహానా ఫాతిమా. ఇతర భక్తులు, ఆడవాళ్ల ఎంట్రీని వ్యతిరేకిస్తున్న వాళ్లు గనుక అడ్డుకోకపోయి ఉంటే రెహాన ఫాతిమా చరిత్ర సృష్టించి ఉండేది. రెహానా మీద ఆగ్రహం ఆమెను వెనక్కి పంపించేంత వరకే ఆగలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిని ధ్వంసం చేసేదాకా సాగింది. అంతేకాదు మతసంబంధమైన నమ్మకాలను కించపరిచిందని రెహానా మీద కేసూ నమోదు చేశారు. ఆ తర్వాత మేరీ స్వీటీ అనే తిరువనంతపురం వాసి యత్నమూ ఫలించలేదు. అనంతరం వచ్చిన ఆరుగురు మహిళలనూ అడ్డగించారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన 47 ఏళ్ల బాలమ్మ అనే మహిళ వెళ్లింది. నడప్పాంధాల్లో ఆమెనూ అడ్డుకున్నారు భక్తులు. -
మహిళల ఆలయ ప్రవేశంపై భగ్గుమన్న కేరళ
-
మహిళల ఆలయ ప్రవేశం.. కేరళలో తీవ్ర ఉద్రిక్తత
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేరళలో ఉద్రిక్తత రాజేసింది. ఆలయ నిబంధనలు, ఆచారాలు మంటకలిశాయని, కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వమే దీనికి కారణమంటూ ఆందోళనలు పెల్లుబిగిస్తున్నాయి. కేరళ బంద్‌కు పిలుపునిచ్చిన యూడిఎఫ్ పక్షాలకు బీజేపీ, అన్ని వర్గాల అయ్యప్ప సంఘాలు మద్దతు పలికాయి. బంద్ ప్రభావంతో కేరళ స్తంభించింది. (శబరిమలలో కొత్త చరిత్ర) ఆందోళన బాట పట్టిన బీజేపీ, హిందూ సంస్థల కార్యకర్తలు వీరంగం సృష్టిస్తున్నారు. కోయంబత్తూరు- పాలక్కాడు, నాగర్ కోయిల్- ట్రివేండ్రం సరిహద్దులు మూసివేయటంతో ఇరువైపుల రవాణా బంద్ స్తంభించింది. ఇరువైపుల బారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. కేరళ వైపు వెళ్లే బస్సులను కోయంబత్తూరు, నాగర్ కోయిల్ లొనే నిలిపివేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేరళలో బంద్ ప్రబావం తీవ్రంగా ఉండటంతో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనన్న ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి.